కొమర్రాజు అచ్చమాంబ

-ఎన్.ఇన్నయ్య

          తెలుగు స్త్రీలలో పేరొందిన బండారు అచ్చమాంబ తొలుత వుండగా – ఉత్తరోత్తరా పదిమందికి తెలిసిన కొమర్రాజు అచ్చమాంబ పేరొందిన కొమర్రాజు లక్ష్మణరావు కుమార్తె. స్వాతంత్రోద్యమంలో పాల్గొని అనుభవం పొందిన అచ్చమాంబ క్రమేణా కమ్యూనిస్టుగా మారింది. తెలుగు ప్రాంతంలో మొదట హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ పార్లమెంట్ సభ్యుడుగా తెలుగు ప్రాంతం నుండి ఎన్నిక కాగా, ఆయన తరువాత అచ్చమాంబ ఆ స్థానానికి వచ్చింది.

          అచ్చమాంబ డాక్టరు వృత్తి చేసుకుంటూ, బెజవాడలో (విజయవాడగా మారకముందు) ప్రసూది వైద్యశాల నడిపింది. అది సుప్రసిద్ధమైనది. పగలు ప్రసూతి కేంద్రంగా వుండగా, అదే చోట రాత్రిళ్ళు కమ్యూనిస్టు శిక్షణా కేంద్రంగా అనేక యువతులను తర్ఫీదు చేసింది. దానికి సారధ్యం వహించిన అచ్చమాంబ  సుశిక్షితురాలుగా అనేక మంది మహిళలకు రంగ ప్రవేశం చేయించింది.

          అచ్చమాంబ వద్ద శిక్షణ పొందిన వీరమాచనేని సరోజిని స్వయంగా నాతో అనుభవాలను ఏకరువు పెట్టింది. ఆమె వీరమాచనేని మధుసూదనరావు భార్య. అచ్చమాంబ పేరు తలచుకొని పులకరించి పోయేది.

          బెజవాడలో అచ్చమాంబ తయారు చేసిన యువతులు బుర్రకథలు చెప్పేవారు. పురుషులలో నాడు నాజర్ బుర్రకథలంటే ఎంతపేరో, అలాగే స్త్రీ దళం కూడా అల్లూరి సీతారామరాజు కథ చెప్పి వూపేసేవారు. కమ్యూనిస్టు పార్టీ గెలవడంలో యీ స్త్రీల పాత్ర చాలా వుంది. అందుకు మూలం అచ్చమాంబ. 1940 నుండీ స్వాతంత్య్రం వచ్చేవరకూ కమ్యూనిస్టు తీవ్రవాదిగా ఉన్న అచ్చమాంబ, స్వాతంత్య్రం వచ్చేనాటికి మారిపోయింది. కాంగ్రెస్ లో చేరి, ఆ పార్టీ తరఫున మళ్ళీ పార్లమెంట్ సభ్యురాలైంది.

          అచ్చమాంబ రాసిన ప్రసూతి అనే పుస్తకం చాలా ఉపయోగకరంగా నాడు వుండేది. అచ్చమాంబ పెళ్ళి చేసుకుని, ఒక అమ్మాయిని కన్నప్పటికీ, ఆమె కొమర్రాజు గానే నిలిచింది. లోక్ సభలో ఆమె ప్రసంగాలు, పాత్ర గురించి పరిశోధన జరగాల్సి వుంది. కమ్యూనిస్టులు తొలుత హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయను లోక్ సభకు ఆంధ్ర నుండి గెలిపించగా, ఆ వారసత్వం భ్రమరాంబకు దక్కింది. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.