జ్ఞాపకాల సందడి-38

-డి.కామేశ్వరి 

 కావమ్మ  కబుర్లు -9

మా తాతగారు 

          మా తాతగారు చల్ల కామేశ్వరరావు గారు. ఆ రోజుల్లో పెద్ద లాయరు .పెద్దాపురం లో పుట్టి కాకినాడలో ఇంటరు, మద్రాస్ లో లా చదివి, కాకినాడలో లాయరుగా ప్రాక్టీస్ పేట్టి, ఆయన ఆ రోజుల్లో బాగా ఆర్జించారు. మా తాతగారు ఆరడుగుల పొడుగుతో చక్కగా ఉండేవారు. మా అమ్మమ్మయితే ఏంతో అందగత్తె కిందేలెక్క. పచ్చటిచ్చాయ.  కళ కళలాడే మొహం. మా  తాతగారి బుజాల దగ్గరకొచ్చేది  అమ్మమ్మ. తాతగారి పొడుగు. అమ్మమ్మ రంగుతో పిల్లలందరూ అందమైన వాళ్ళకింద లెక్కగ ఉండేవారు. అందులో అమ్మ పెద్దమామయ్య నాలుగో మామయ్య పచ్చగా కోటారేసిన  ముక్కులు ఒత్తయిన జుట్టుతో ఏంతో అందంగా ఉండేవారు. తాతగారు ఆ రోజుల్లో లా పుస్తకాలు రాయడం నాకింకా గుర్తు వుంది. కానీ ఇప్పటి వాళ్ళలా తెలివి  తేటలు లేక రాయల్టీ లు తీసుకో లేదుట ప్రింట్ చేయడానికి ఎవరు ముందుకు రాక పోవడంతో. వప్పుకున్నవారికి హక్కులు ఇచ్చేసి పుస్తకాలూ వేయించుకున్నారుట. ఆయన రాసిన ‘c kameswaraoస్ treatise on  law  అఫ్ damages and  compensation, law  of  negligence’, ఇంకో పుస్తకం పేరు గుర్తు లేదు ఈ నాటికీ లా 8పుస్తకాలూ  అందరు ఫాలో అవుతారు ఎన్నో ఎడిషన్స్ ప్రింట్ అయి. ఇంగ్లాండ్ లోకూడా ఫాలో అవుతారట అంత ఫేమస్ అయినా అన్ని  సార్లు ఎడిషన్స్ వచ్చిన తాతగారికి ఒక్క రూపాయి ఇవ్వలేదుట వాళ్ళు . మానధనులైన తాతగారు రైటు   ఇచ్చాక అడిగే హక్కు నాకు లేదు అన్నారు. పుస్తకాల కాపీ రైట్ ఏ ఆయన దగ్గర ఉంటే ఆ రోజుల్లో లక్షలు గడించేవారు. ఈ పుస్తకాల రాతలతో అయన ప్రాక్టీస్ నిర్లక్ష్యం చేయడం. ఎదిగిన కొడుకులు చాల రోజులు ఉద్యోగాలు చేయక పోవడం ఇంట్లో జనాభా పెరిగి ఖర్చులు పెరగడం ఆడ పిల్లల పెళ్లిళ్లు ఫురూళ్లు  రెండు సార్లు పెద్ద ఎత్తున ఇంటి నౌకార్లే బంగారం దోచుకు పోవడం కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలన్నట్టు. అయన రాబడి తగ్గిపోయి ఖర్చులు పెరగడం సంసారాలు క్రమంగా చితికి పోవడం అంటే చిన్నపుడు తెలియదు కానీ, ఇప్పుడు అర్ధమౌతుంది. అంతేమరి దారిద్రమని కాదు ఆభోగా భాగ్యాలు ఎలా అంతరించాయో. అమ్మ పెళ్ళికి  ముఫై తులాల బంగారం పెట్టి ఐదురోజుల పెళ్లి ఎంత వైభగంతో చేసారో అమ్మ చేప్పేది. అలాటి స్థితిలో కూడా ఇంటి నిండా పిల్లలని చదువుకోవడానికి అదీ భార్య తరుపు బంధువులని అంటి నాటి బంధు ప్రీతి చుట్టరికాలు మొహమాటాలు ఈతరం అర్ధం చేసుకుంటే వారి గొప్ప మనసులు అర్ధమవుతాయి. డబ్బుపెట్టలేక తాతగారు చాకిరీ చెయ్యలేక అమ్మమ్మ ఏనాడూ విసుక్కోకుండా. ఎంత మందికి విద్యాదానం చేసారో !

          తాతగారి జీన్స్ అంటే అయన రచయిత. జీన్స్ అయన ఆఖరి కొడుక్కి ( ఐఏఎస్ ) మనవాలల్లో నాకు, మా అన్నయ కొడుకు, పిన్ని కొడుకు పంచి ఇచ్చారేమో. రచయితలుగా నిలబడ్డాం మిగతా వాళ్ళంతా ఇంగ్లీష్ లో నేను తెలుగులో రాస్తాం.

***

కావమ్మ  కబుర్లు -10

          అంత మందికి విద్యాదాన ఫలితం  ఊరికే పోదు అన్నట్టు వారికీ ముసలి వయసులో  ఆఖరి కొడుకు ఐఏఎస్ అవడం, పెద్ద హోదాలో ఉన్నత పదవి అలంకరించి సంతోష పడడం జరిగింది.

          ఇచ్చిందేదీ  ఊరికే పోదన్నది ఎంత నిజం! ఈ రోజుల్లో ఒకరిద్దరిని కనీ పెంచడానికే ప్లానింగులు ఆపసోపాలు పడిపోతున్నారు. పిల్లలు ఏక్లాస్  చదువుతున్నారో కూడా మర్చిపోయి, ‘ఏరా ఏ క్లాస్ చదువుతున్నావ్?’  అని ఎవరన్నా అడిగితే అడిగి చెప్పేవారు. స్కూల్లో మాస్టర్లు చెప్పింది విని ఇంట్లో శ్రద్ధగా చదువుకుని పైకి వచ్చారు అందరూ. పరాయి పిల్లలని ఇంట్లో పెట్టుకోవడమే కాదు, అందరికి ఓలాగే పెట్టడం, పెరుగు వేసినా, మజ్జిగ వేసినా ఒకేలాగా అన్న సంగతి ఆలోచించగలమా ఈనాడు? ఆయన సంపాదన తగ్గడంతో ఇంటి ఖర్చులకి లెక్కలు పెట్టి ఇచ్చేవారు. .ఈవిడ గోలపెట్టేది ధాన్యం అయితే వస్తాయి పొలం నుంచి, మిగతా ఎన్ని ఖర్చులు?   పాలు, కూరలు, దినుసులు ఆయన గీసిగీసి ఇవ్వడం ఈవిడ గోలపెట్టడం!  పాలు రెండు  శేరులు కొని ఇంకో సేరు నీళ్ళు కలిపేది. అయినా ఎంత చిక్కగా ఉండేవో. గేదెనింటికి తీసుకొచ్చి పిండేవారు. రోజుకో పిల్ల కాపలావాడు పిండుతున్నప్పుడు. ఆ పాలగిన్నె కుంపటి మీద కాగుతుంటే ఎవరి కాఫీ వారు కలుపుకుని తాగేవారు మామయ్యలు, మిగతావాళ్ళు. అలా నీళ్ళు కలిపినా కాఫీ ఎంత ఘుమఘుమలాడేదో. ఆ రుచి ఈనాటికి నాలిక మీదుంది. కాఫీ అనే కాదు అన్నీ కల్తీ లేని వస్తువులే. కూరలు, పులుసులు, పప్పులు ఆ రుచులే వేరు. పప్పు కలుపుకు నెయ్యి వేసుకుంటే ఆ రుచి ఏది ఇప్పుడు?  జమిందారులా బతికిన తాతగారు 92 ఏళ్ళు  బతికారు. 90 ఏళ్ల  వరకు కూరలు ఆయనే తెచ్చారు. సాయంత్రాలు నడుచుకుంటూ క్లబ్ కెళ్ళి రెండు ఇడ్డెనులు తెచ్చుకునేవారు ఫలహారానికి. అంత ఆరోగ్యంగా వుండే మనిషి  ఆఖరు రెండు సంవత్సరాలు నరకం చూసారు. కిందపడి, తుంటి ఎముక విరిగి మంచాన పడ్డారు.  ఆ రోజుల్లో ఇంత  వైద్య సదుపాయం లేక, విరిగిన ఎముక సరిగ్గా అతుక్కోక మంచంలో దుర్భర జీవితం ఆఖరి రెండేళ్లు గడిపి 74లో పోయారు. దిగ్గజం లాంటి మనిషిని రోగం ఏ స్థితికి తెచ్చింది అనిపించేది చూసేవారికి. ఆయనతో ఇంటి వైభవం అంతరించింది. అమ్మమ్మ ఎనభయి నాలుగేళ్లు బతికింది. పదిమంది సంతానం, అబార్షనులు, చాకిరీతో పోయేనాటికి నడుం పూర్తిగా వంగిపోయి నాలుగు కాళ్ళ  జంతువైపోయి నడిచేది. ఎలా ఉన్నా తాతగారి మలమూత్రాలు అలాగే ఎత్తి  పోసేది. ఆ రోజుల్లో నర్సులని పెట్టుకునే రోజులా? డబ్బిస్తే రాత్రి పగలు డ్యూటీలు చేసే పనివారు. డబ్బిచ్చి పెట్టుకోడానికి డబ్బేది? మా ఆఖరి మామయ్య అసిస్టెంట్ కలెక్టర్ గా ఉండేవాడు కానీ ఆ రోజుల్లో జీతాలెంత? 250 – 300.  కాస్త అదుండుకి వెళ్ళినప్పుడల్లా ఏదో సాయం చేసేవాడు. పెద్దనాన్న, చిన్నక్క, దొడ్డమ్మ అంటూ ఆప్యాయతలు నిండిన పిలుపులు. అభిమానాలు వున్నా పొలంలో కాసిన పప్పులో, నేతులు, పళ్ళు, కూరలు చూడ్డానికి వచ్చినపుడు ఇచ్చిపోవడం తప్ప డబ్బులెవరి దగ్గరుండేవి?  తాతగారు లేకపోయినా ఆయన పుస్తకాలు ఈనాటికీ చిరంజీవిగా మిగిలి ఉండడం సంతోషం. అంతకంటే మనిషికి ఏంకావాలి?

          ఇపుడు నా వయసు ఆఖరి మామయ్య  మా ఆఖరి పిన్ని ఉన్నారు వాళ్ళగుర్తుగా.

*****

( సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.