జ్ఞాపకాల సందడి-39

-డి.కామేశ్వరి 

 కావమ్మ  కబుర్లు -11

మా అమ్మ

          అమ్మ అంటే వేళవేళకి కమ్మగా వండి పెట్టేదన్న అర్ధమే మాకు తెల్సిన అర్ధం ఆనాడు. ఎందుకంటే ఎప్పుడు చూసిన వంటింట్లోనే ఉండేది అమ్మ. మా అమ్మమ్మ గారి ఇల్లులా  ధర్మసత్రంలా కాకపోయినా ఆరుగురు పిల్లలున్నాయిల్లు. ఆవిడా వంటలు చేస్తూ, టిఫిన్లు చేస్తూ.,పప్పులుఉప్పులూ బాగుచేస్తూనో, మజ్జిగ చేస్తూనో, చదన్నలు పెడుతూనో., వంటిల్లు తన సామ్రాజ్యం అన్నట్టుండేది . మా నాన్నగారు గోవెర్నెమెంట్ ఉద్యోగం . ఉద్యోగం చేసేది అసిస్టెంట్ ఇంజనీర్ అయినా ఆరోజుల్లో అది గొప్ప ఉద్యోగం కింద లెక్క. రోడ్లు భావనాలశేఖ. ఇంట్లో ఎప్పుడు ముగ్గురు బంట్రోతులుండేవారు డ్యూటీ ల ప్రకారం పనికి వచ్చేవారు. మిగతా ఇద్దరు మైలు కూలీలు. అంటే రోడ్లు రిపేర్  లు చేయడానికి కొన్ని మైళ్ళకి ఒకడ్ని అపాయింట్ చేసేవారు, వాళ్లలో సగం మంది సూపర్వైజర్, అసిస్టెంట్ ఇంజనీర్, డివిజనల్ ఇంజనీర్ ఇళ్లలో పనిచేసేవారు . అలాచేయకూడదు, తప్పని ఇప్పుడు తెలుస్తుంది, వాళ్ళపని అది కాదని ఇళ్లలో చేయ కూడదని మాకు తెలియదు. ఒక్క ప్యూన్ మాత్రం ఆఫీసర్ కి ఇస్తారని అదికూడా కేవలం అయన బూట్లు అవి తుడిచి, జీప్లోకి ఆయన ఫైళ్లు అవిపెట్టి ఆయనతో పిలిస్తే పలికెట్టు ఉండాలి. వీళ్ళంతా ఆఫీసర్ ఇంట్లో చాకిరికి కాదని మాకు తెలియని రోజులు. ఇంట్లో రకరకాల పనులు, పక్కలు వేయడం తీయడం, లాంతర్లు తుడవడం బజారు పనులు మొక్కలకు నీళ్లు పోయడం. పిల్లలని ఆడించడం పనులు చేసేవారు. వీళ్లు కాక అంట్లకి బట్టలకి పనిమనిషి ఉండేది. మేమెంత సుఖంగా దర్జాగా బతికామో తెలుసా ఇటుపుల్ల అటుపెట్టి ఎరగం. లేచేసరికి మండువా అరుగు మీద నాలుగు పీటలు వేసివుండేవి పీట  దగ్గర ఒక కచ్చిక తాటాకు నాళిక గీసుకోడానికి చలికాలం అయితే వేడి నీళ్లతో ఇత్తడి చెంబు ఉండేవి. కచ్ఛిక అంటే ఇప్పటి వారికీ తెలియదు. పిడకలు కాల్చిన ముక్క. పిడక అంటే అని అడగొద్దు. పిడక  అంటే ఆవుపేడతో చేసినది ఇప్పుడంటే టూత్ పేస్టులు  ఆవివచ్చాయి కొందరు పందుమ్ పుల్లతో తోముకునేవారు ఏ రోజుది ఆరోజు వేప చెట్టునించి ఓ కొమ్మ  విరిచి ఆ పుల్లతో తోముకుని తాటాకుతో నాలిక గీసుకుని పారేయడం. నిజంగా ఇప్పుడు అనిపిస్తుంది ఇంత మంచి అలవాట్లు చేత్తో ఆ బూడిద  తో తోముకోడం మూలల్లోకి వెళ్ళి పళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉండేవి కంపులేకుండా. ఇప్పుడు రెండు మూడు నెలలు ఒకే టూత్ బ్రష్ వాడటం. ఇంగ్లీష్ వాళ్ళ ధర్మమని. వాళ్ళ చెత్త అలవాట్లు మాత్రం వంటబట్టాయి. మనకు. సరే పళ్ళు తోముకుని వచ్చేసరికి డేగిసాలో మరిగే నీళ్లు తీసి బాల్చిలో బాత్ రూములో పెట్టేవారు. ఇప్పట్లా బెడ్ రూమ్  పక్కన బాత్ రూంలా!, దూరంగా వేరే ఉండేవి. టాయ్లెట్ అయితే పెరట్లో దూరంగా ఉండేవి. అటు నించి వచ్చాక కాళ్ళు చేతులు కడుక్కోకుండా లోపలి కి రాకూడదు . అన్ని మంచి అలవాట్లు ఉండేవి పాత రోజుల్లో. ఇప్పుడయితే టాయిలెట్ వెళ్లిన చెప్పులతోటే వంటింట్లోకి వెడుతున్నారు . చెప్పులు బయట  విడవడం అన్నది కొందరు పాటించడం ముదావహం. ఇంట్లో చెప్పులు వేరే పెట్టుకోడం పాటించాలి అందరు. ఎదో చెపుతూ ఏటో వెళ్లపోతాను. అంత మంది ఇంట్లో పనివాళ్ళు వున్న అమ్మ ఎప్పుడు వంటింట్లోనే ఉండేది. ఎంత మందివున్నా వాళ్ళంతా బయట పనులకే. వంటింటి పని మాత్రం ఆడవారిదే.  మా నాన్న మంచి భోజన ప్రియులు విస్తరి చుట్టూ పది రకాలుండాలి పప్పు కూర పులుసు పచ్చడి. ఓ పెరుగు పచ్చడి. ఓ ఊరగాయ. అబ్బె ఆయన ఇంత అన్నం తినేవారనుకోవద్దు. తలో ముద్దా కలిపేవారు  అన్ని రకాలు. క్వాలిటీతో పాటు క్వాన్టిటీ కూడా, రెండూ కావాలేమో!. దేనికి సర్ధుకు పోవడం అన్నది లేదు. మా అమ్మ ఎంత రుచిగా వండేదో నాన్న సంగతి తెలిసి ఇంకా శ్రద్ధగా  వండేదేమో ఆ రుచి చూడాలి . ఇప్పటికి మా అబ్బాయి తెలుగు వంట అంటే అమ్మమ్మ వంట అంటాడు. మా నాన్న అలవాట్లు టైంలు  చెపితే  అమ్మ ఎలా వేగిందో ఆయనతో అనిపిస్తుంది. ఆ రోజుల్లో భర్త అంటే ఎదురు జవాబు చెప్పే ధైర్యం లేని భార్యలు ఎలా సహించేవారో , ఇప్పుడు కాదులెండి మా పెళ్ళిళ్ళై కాపురాలకి వెళ్ళాక అర్ధం అయింది. ఆయన ఒక్క రోజు  రొటీన్. చెపితే మీకే అర్ధం అవుతుంది. ఆ ఇల్లాలు ఎంత సహనం తో కాపురం చేసిందో.

కావమ్మ కబుర్లు – 12

రెండవ భాగం

          నా పెళ్ళైన కొత్తలో నేను ఇడియట్ లాగా మా ఆయన్ని అడిగా… ‘మీరు గవర్నమెంట్ ఆఫీసర్… అసిస్టెంట్ ఇంజనీర్  గదా, మీకేమిటి ఒక్క ఫైల్ ఇంటికి రాదు? మా నాన్నకి బస్తాడు ఫైల్స్ వచ్చేవి రోజూ…’ అన్నా గొప్పగా. ఆయన నవ్వి, ‘మీ నాన్న ఎప్పుడైనా ఆఫీస్ టైంకి వెళ్లి పనిచేస్తేగా? మరి ఆఫీస్ లో చూడాల్సిన వన్నీ ఇంట్లో చూసి కంప్లీట్ చెయ్యాలిగా వర్క్!’ అని నవ్వారు. చిన్నపిల్లలపుడు మాకు ఇవన్నీ ఏం తెలుస్తాయి?

          సరే, ఆరున్నరకు ఇంటికి వచ్చి చిరుతిళ్ళు – కజ్జికాయలు, జంతికలు,  లడ్డూలు, మినపసున్ని ఉండలు,  పకోడీలు లాంటివి… డబ్బాలు డబ్బాలు మధ్యాహ్నం పూట కూర్చుని చేసేది అమ్మ.  అవి లాగించి, ఏ ఏడున్నరకో క్లబ్  కెళ్ళి రమ్మీ ఆడుకుని రాత్రి పన్నెండు గంటలకి వచ్చేవారు. మా అమ్మ ఎంత ఉత్తమ గృహిణి  అయినా ఈయన టైములతో మధ్యాహ్నం అదీ  టిఫిన్ తినకున్నా మూడు గంటలకి రాత్రి పన్నెండింటి  వరకూ తినకుండా ఉండగలదా?  అందుకని ఈయన వరస చూసి, ఆయన భోజనం ఆ రోజుల్లోనే మా ఇంట్లో ఒక హాట్ కేేరియర్ ఉండేది దానిలో సర్దేసి,  పీట వేసి అనుకోడానికి ఒక్క పీట ఉండేది – కంచం, మరచెంబుతో నీళ్లు పెట్టి, పక్కన ఆయనకి  టూర్ వెళ్ళేటపుడు  ఒక ఊరగాయ బుట్ట ఉండి చిన్న చిన్న సీసాలలో, జాడీలలో అన్ని ఊరగాయలు, కందిపొడి, గోంగూర పచ్చడి మొదలైనవి సర్దిపెట్టి ఉండేవి… ఆ బుట్ట పెట్టి, పక్కన లాంతరు తగ్గించి పెట్టి దాని మీద నేయి పేరుకు పోకుండా నేతి గిన్నె పెట్టేది.

          మధ్యాహ్నాలు తాను భోజనం చేసినా, ఆయన వచ్చాక దగ్గరుండి వడ్డించేది. ఎప్పుడో ఉదయం ఐదు గంటలకి లేచిన ఆవిడ రోజూ రాత్రి పన్నెండు వరకూ కళ్లు కూరుకు పోతుంటే ఎంతకని మేల్కొని కూర్చుంటుంది? ఇవన్నీ సర్ది పడుకునేది. మళ్ళీ తలుపెలాగూ తీయాలి.

          అర్ధరాత్రి ఇంటికొచ్చిన ఆయనకి అప్పుడు పిల్లల మీద ప్రేమకారిపోయి,  లాంతరు పట్టుకుని ఒక్కొక్కరి పక్కల దగ్గరకెళ్ళి,  ప్రేమగా బుగ్గలు పుణికి, జుట్టు సవరించి, దుప్పట్లు కప్పేవారు. మెళకువ వచ్చినా కదలకుండా పడుకునే వాళ్ళం. అపుడు కూర్చుని గంటసేపు భోజనం చేసేవారు ఆలోచిస్తూ. ఏమాలోచించేవారో… ఉన్న  పదార్థాలు  సరిపోవన్నట్టు, మధ్యలో ‘ఏదీ, ఒక అప్పడం కాల్చి పట్రా…’ అంటూ అమ్మని కేక వేసేవారు. అర్ధరాత్రి అప్పడం తక్కువ.  ఇప్పటిలా గ్యాస్ పొయ్యిలా? చచ్చినట్టు కుంపటి వెలిగించి కాల్చేది. ఈ మొగుడి సంగతి తెల్సిన ఆవిడ కనక రాత్రే కుంపట్లో బొగ్గులు వేసి, కొబ్బరి పీచు వేసి, రెడీగా పెట్టుకునేది. ఇప్పుడైతే ఏ భార్యన్నా  ఆలా చేస్తుందా? ఏ మొగుడైనా అలా అడిగే సాహసం చేస్తాడా? ‘అర్ధరాత్రి అప్పడమేమిటి, మతిగాని పోయిందా?’ అని ఒక్క కసురు కసురుతుంది. మేము మొగుళ్ళంతా ఇలాగే ఉంటారనుకునేవాళ్ళం. పెళ్ళాలంతా  అలాగే చేయాలి కాబోలనుకునే అమాయకపు రోజులు. కనుక మా నాన్న ప్రవర్తన వింతగా ఏముండేది కాదు. మా పెళ్లిళ్లయ్యాక తల్చుకుంటే, ‘అమ్మో… ఎలా చేసేదో పాపం!’ అనిపించేది. మా నాన్న వింతలు ఇంకా ఉన్నాయండి. వచ్చే నెలలో చెపుతా……

*****

( సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.