యాత్రాగీతం

బహామాస్ 

-డా||కె.గీత

భాగం-7

బహామాస్ క్రూజ్ (రోజు -2)

          మర్నాడు ఉదయం మేం లేచేసరికి మా ఓడ బహమాస్ టూరులోని మొదటి దీవికి సమీపంలో సముద్రంలో లంగరు వేసి ఆగి ఉంది.  అక్కణ్ణించి మేం చిన్న బోట్ల ద్వారా అతిచిన్న ప్రైవేట్ ఐలాండ్ కి చేరుకోవాలి. రోజల్లా అక్కడే ఉండాలి కాబట్టి అవసరమైన సామాన్లు పట్టుకుని వెళ్ళాలి. ముఖ్యంగా స్విమ్మింగు, స్నోర్కలింగు వంటివి చేసే ప్రదేశం కాబట్టి మార్చుకుందుకు దుస్తులు, పిలల్ల కోసం ప్రత్యేక సామగ్రి వంటివి పట్టుకుని వెళ్ళాలి. సముద్ర తీరంలో కూర్చునేందుకు కుర్చీలు, గొడుగులు అక్కడే ఉంటాయి.  స్నోర్కలింగు సామాగ్రి అద్దెకి ఇస్తారు. ఇక భోజనాదులు మా టికెట్ లోనే భాగం కాబట్టి అక్కడే ఎంత కావాలన్నా తినొచ్చు. మా ఓడ నుంచి పదినిముషాల పడవ ప్రయాణంలో తెల్లగా మెరిసిపోతున్న ఇసుకతో ఉన్న ఆ చిన్న ఐలాండ్ పేరు కోకో కే (Coco Cay). దీని అసలు పేరు లిటిల్ స్టిర్ అప్ కే (Little Stirrup Cay). “కే” అంటే అతి తక్కువ లోతు ఉండే సముద్రతీరం అన్నమాట. సాధారణంగా ఇటువంటివి కోరల్ రీఫ్స్ (Coral Reef)కి ప్రసిద్ధి. ఈ ద్వీపాన్ని మేం ప్రయాణం చేస్తున్న రాయల్ కరేబియన్ క్రూజ్ సంస్థ కొనేసు కుందట. ఇక్కడ వారి ఓడలు తప్ప మరేమీ ఆగడానికి వీల్లేదన్నమాట. 

          కేవలం కిలోమీటరున్నర వెడల్పు, అరమైలు పొడవు ఉండే ఈ దీవిని 250 మిలియన్లని వెచ్చించి తమ  పర్యాటకుల కోసం అతి సుందరంగా తయారు చేసింది ఈ కంపెనీ. 

          తూర్పున సముద్ర తీర ప్రాంత పర్యాటక ఆకర్షణలైన  స్నోర్కలింగ్ మొ.న వి ఉంటాయి. మొత్తం ద్వీపమంతా చుడుతూ చక్కని నడకదారులుంటాయి. అలాగే ఉత్తర అమెరికాలోనే పెద్దదైన డేర్ డెవిల్స్ పీక్ (Daredevil’s Peak) అనబడే ఎత్తైన వాటర్ స్లైడ్ ఇక్కడి వాటర్ పార్కులో ఉంది. 

          మేం చకచకా తయారయ్యి ఉదయం తొమ్మిది గంటల కల్లా మా ఓడనానుకుని సిద్ధంగా ఉన్న చిన్న పడవల్లో ఒకదాంట్లో  ఎక్కేము. ఎండాకాలమేమో తళతళా మెరిసిపోతున్న నీలం రంగు నీళ్ళని కోసుకుంటూ వేగంగా వెళ్తున్న మరపడవ, నీలి రంగులో సముద్రంతో పోటీ పడ్తున్న ఆకాశం, ప్రకాశవంతంగా మెరిసిపోతున్న సూరీడు. పదినిమిషాల సేపు ప్రయాణమైనా భలే ఆహ్లాదంగా ఉంది. 

          మా సిరి చిన్నపడవని చూసి ఎక్కనని పేచీ పెట్టింది ముందు. తీరా ఎక్కేక హుషారుగా చుట్టూ చూడసాగింది. 

          ఎక్కడ చూసినా కొబ్బరిచెట్లతో నిండి ఉన్న ఆ చిన్న ద్వీపంలో అడుగుపెట్టేసరికే ఘుఘుమలాడుతూ ఏవో వంటలు తయారు అవుతున్న వాసనలు చుట్టుముట్టేయి. గందరగోళంగా మ్యూజిక్ అదరగొడుతూ ఉన్నారు. రకరకాల స్టాల్స్ లో రకరకాల విశేషాలు ఉన్నాయి. ఎక్కడ చూసినా స్మిమ్మింగ్ దుస్తుల్లో అటూ ఇటూ తిరుగుతున్న జనం. ఎండ తీవ్రంగా ఉన్నా చుర్రుమని కాలే ఇసక లేదు విచిత్రంగా. 

          ఇక తాగడానికి కూల్ డ్రింకులు, జ్యూసులు వంటివి సిద్ధంగా ఉన్నాయి. నచ్చినన్ని తీసుకోవచ్చు. 

          పిల్లలు పేచీ పెట్టడంతో మేం తిన్నగా బీచ్ లోనే స్థిరపడ్డాం. తెల్లని ఇసుక, వెచ్చని నీళ్లు, తక్కువ కెరటాలతో  పేద్ద మడుగులాంటి ప్రశాంతమైన  సముద్రం.  ఇంతకంటే ఏం కావాలి? 

          ఇక మధ్యాహ్న భోజనం విందు భోజనమే. రకరకాల పళ్ళు, కేకులు, మాంస విశేషాలు.. ఒక్కటేవిటి తిన్నవారికి తిన్నంత. ఇది కాకుండా ఏ సమయమైనా వడ్డించే డెలీ స్టైలు భోజనాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇక జనం కాసేపు నీట్లో మునగడం ఏదోటి తెచ్చుకుని తినడమే పనిగా పెట్టుకున్నట్టు కనిపించారు. 

          సిరి ఏదో నామమాత్రంగా నీటిలో మునిగొచ్చి ఇసుకలో ఆట మొదలెట్టింది. వరు మాత్రం నీటిని వదలకుండా ఈతకొడుతూనే ఉంది. ఇక భోజనాలు కానిచ్చి నీటిలో మనుషులు తేలే  పట్టాల్లాంటివి అద్దెకు ఇస్తుండడంతో రెండు తెచ్చుకుని నీటిలో పవళింపు కార్యక్రమాలు మొదలెట్టాం. అయితే తేలుతూ దూరానికి వెళ్లే ప్రతిసారీ భయంతో నీటిలోకి దుమికి వెనక్కు తెచ్చుకోవడం మళ్ళీ ఒడ్డున ఎక్కడం చేసేం. ఇక కొంతసేపు ఆ పట్టాలనే నెత్తిన ఎండా తగలకుండా వేసుకుని ద్వీపమంతా నడక దారిన చుట్టి వచ్చేము. 

          రోజల్లా తడుస్తున్నా అయిదు నిమిషాల్లో ఆరిపోయే ఎండ వల్ల హాయిగా ఉంది. 

          ఇక మూణ్ణాలుగు గంటల వేళ నీళ్లలోంచి బయటికొచ్చేసి నీడన కుర్చీల్లో కూల్ డ్రింకులు, జ్యూస్ లు తాగుతూ సేదతీరుతూ కూర్చున్నాం. అక్కణ్ణించి మా ఓడ దూరంగా అందంగా నీటిలో రాజహంసలాగా తేలియాడుతూ కనిపించింది.  మరికాస్సేపట్లోనే తిరుగుప్రయాణమయ్యి ఓడ చేరుకుని తలస్నానాలు చేసి ఓడలో సాయంత్రపు ప్రోగ్రాములకి సిద్ధమయ్యేం. ఇలావిహారనౌకా  ప్రయాణాల్లో రాత్రిపూట ఎన్నో వినోద కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కొందరు బార్ల దగ్గర చేరి అక్కడే ఏర్పాటు చేసిన మ్యూజిక్ కార్యక్రమాలలో చిందులేస్తూ ఉంటారు. మరి కొందరు కాసినోలోకి వెళ్లి  మిషన్ల ముందు కూచుని, టేబుళ్ల ముందు కూచుని జూదం ఆడుతూ ఉంటారు. కొన్ని కుటుంబ సమేతంగా ఆనందించగలిగిన షోలు, డిన్నర్ కార్యక్రమాలు కూడా ఉంటాయి. మేం ఎప్పుడూ పిల్లల్ని కూడా తీసుకు వెళ్లగలిగిన ప్రదేశంలోనే గడుపుతాం. అయితే పొద్దుట్నించి అలిసిపోవడం వల్ల స్నానాలు కాగానే డిన్నర్ కి మాత్రమే వెళ్లి కాస్త ఏదొకటి తిన్నామనిపించి పెందరాళే నిద్రకి ఉపక్రమించేం.

*****

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.