ఒక్కొక్క పువ్వేసి-16

మహిళా సాధికారాన్ని ఆకాంక్షించిన జాషువా కవిత్వము

-జూపాక సుభద్ర

          ప్రపంచంలో ఏ దేశంలో లేని కులవ్యవస్థ, మహిళల మీద అమానుషమైన దురాచారాలు, నిషేధాలున్నవి. స్వాతంత్రోద్యమ కాలంలో  ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న దుర్మార్గమైన దురాచారాలున్నవి. కొన్ని సమసి పోయినా యింకా చాలా దురాచాలు మహిళల పట్ల కొనసాగు తానే  వున్నయి. భర్త చనిపోతే అతనితో పాటే చనిపోవాలనే శాసనాలు, బాల్య వివాహాలు విపరీతంగా జరుగుతుండేవి. వితంతు, పునర్వివాహాల మీద నిషేధాలు, విద్యపట్ల నిషేధాలుండేవి. వీటన్నింటి నివారణకు మహిళోద్ధరణ కోసం దేశం నలు మూలల నుంచి అనేక సంస్థలు, వ్యక్తులుగా ఉద్యమించినారు. కానీ మనకు చరిత్ర లో కనిపించేది ఆధిపత్య కులాల వాళ్లే. సావిత్రిబాయి పూలే జ్యోతీరావు పూలే, ఫాతిమాషేక్, అంబేద్కర్, జాషువా వంటి అనేక మంది సంఘ సంస్కర్తలు పోరాడినా, చరిత్రలో మహిళోద్ధారకులు, రచయితలు ఎవరంటే… రాజారామ్మో హన్ రాయ్, తెలుగులో కందుకూరి వీరేశలింగం, గురజాడ, చలం నే చూపిస్తాయి సామాజిక, సాహిత్య చరిత్రలు. చరిత్రల్లో, సాహిత్య చరిత్రల్లో కులం దాని విశ్వరూపాలు అన్ని వ్యవస్థల్లో ఎట్లా పనిచేస్తున్నాయో వీటిని ప్రజాస్వామ్య బద్దంగా మార్చుకోవల్సిన అవశ్యకత వుంది. సమాజం కోసం ఎవరు ఉద్యమించినా వారి సేవలు, త్యాగాలు కేవలం కులం కారణం గా విస్మరించడం జరిగింది. రాజారామ్మోహన్ రాయ్, గురజాడ, కందుకూరి, చలమ్  లు ఆధిపత్య హిందూ కులాలకు చెందిన వాల్లు కావడము మూలంగానే వారి సేవలు కొనియాడబడ్తున్నాయి. కానీ సావిత్రిబాయి పూలె, జ్యోతిరావ్  పూలే, డా॥ బి. ఆర్ అంబేద్కర్, జాషువా సాహిత్యకృషి వాల్లు బహుజన కులాలు, అంటరాని కులాల వాల్లయినందు వల్లనే వారి సామాజిక సేవల్ని, అంకిత భావాల్ని త్యాగాల్ని విస్మరించడం చాలా అన్యాయము. సామాజిక పరంగా రాజ్యాంగ రక్షణలొచ్చినా అవి ఆచరణలో అమలు కాని దుస్థితి.

          ఈ మధ్య జాషువా జయంతి సందర్భంగా మరో సారి జాషువాను చదవాలి. జాషువా మహిళాభ్యుదయాన్ని  తన సాహిత్యం ద్వారా సమాజానికి అందించిన సేవ ఎట్లాంటి దనేది కొంచెం సీరియస్ గానే అధ్యయనం చేయడం జరిగింది.

          జాహువా తెలంగాణలో కంటే. ఆంధ్రలో బాగా జనాకర్షణ వున్న గొప్ప ఆర్ధ్రకవి. జాషువా కవిత్వాన్ని  కులం, పేదరికం వరకే చూశారు. కానీ జాషువా తన సాహిత్యంలో మహిళా ప్రస్తావనలు లేని, మహిళోద్దరణలేని రచనలు కనబడవు. కుక్కపిల్ల, సబ్బుబిల్లా కాదేది కవితకనర్హము ‘ అన్న కవులు కూడా తన చుట్టుపక్కలున్న పర్యావరణాన్నంతా కవిత్వీకరించ  లేక పోయారు గానీ జాషునా తన పరిసరాలన్నీ, తన చుట్టూర వున్న ప్రతీదీ కవితాత్మను చేసిన గొప్ప కవి విశారదుడు జాషువా! జాషువా తనను విశ్వనరుడిగా ప్రకటించుకున్నందు వల్లనే – తెలంగాణ ఉద్యమంలో సాగర తీరమ్ లో జరిగిన ఆంధ్ర విగ్రహాల్ని పగలగొట్టిన సందర్భంలో కూడా జాషువా విగ్రహము చెక్కు చెదరలేదు – జాషువా అంటరాని తనాల్ని, అమానుషాల్ని కాశీలో వున్న శివుడికి వినిపించమని గబ్బిలమ్ ద్వారా సందేశము పంపిన కావ్యమే గబ్బిలము. జాషువా గబ్బిలానికి ఒక రూట్ మాప్ చూపిస్తాడు. గోదావరి జిల్లాలు, విశాఖ నుంచి ఒరిస్సా, బెంగాల్, బీహార్ నుంచి వెళ్లమని చెప్తాడు గానీ హైదరాబాద్ నిజామ్ స్టేట్ ను  ప్రస్తావించడు. జాషువా గబ్బిలాన్ని కాశీకి సందేశమివ్వడానికి  తోలి నప్పుడు నిజామ్ హైద్రాబాద్ స్టేట్ వేరే దేశంగా వుండింది. వేరే దేశంగా పరిగణించడము వల్ల హైద్రాబాద్ స్టేట్ ని  జాషువా ప్రస్తావించి  వుండక పోవచ్చు.

          జాషువా – మహిళోద్దారకత్వము (1930) అతని మొదటి రచనల నుండే మొదలైంది. హంగ్రీ ధర్టీస్ లో  దళిత మహిళలు ఎన్నికష్టాలు పడినారో, ఎంత ఆకలిని, పేదరికాన్ని అనుభవించారో  చెప్పిన రచనే ‘అనాధ ‘. తెలుగు సాహిత్య చరిత్రలు చూస్తే.. కులీన మహిళల ఆత్మలు వదిలి  వారి అంగాంగ వర్ణనలు, అష్టవిధనాయికలు, శృంగారం చుట్టూ తిరిగిన సాహిత్య విలువల్ని పక్కకు దొబ్బి  ఒక దళిత మహిళను తన సాహిత్యానికి కథానాయిక చేయడం సాహిత్య చరిత్రకు తలమానికంగా జాషువాని చెప్పుకోవాలి. జాషువా గబ్బిలము, ఫిరదౌసీ, ముంతాజ్ మహలు, కొత్త లోకము వంటివి తర్వాత వచ్చిన రచనలు. కానీ జాషువా దళిత మహిళలు కులవ్యవస్థలో ఎట్లాంటి దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారనేది 1930 లోనే ‘అనాధ’ గాచెప్పడము ‘జాషువాకే సాధ్యమైంది. దళిత మహిళ పేదరికం, ఆకలి, అవిద్య, బాల్యవివాహా లు, జోగినీ, వంటి దుర్మార్గాలు ప్రస్థావించిన సాహితీ వేత్తలు లేరు.  కానీ జాషువా  సాహిత్యం ఆ పని చేసింది. జాషునా తన రచనలన్నీ మహిళలకే అంకితమిచ్చాడు. తల్లి, భార్య, కుమార్తెలకే కాకుండా తెల్సిన  మహిళలకు తన కావ్యాలను అంకితం చేసిన మహాకవి జాషువా! జాషువా మహిళలు ఆత్మ గౌరవంతో వున్న మహిళలు. అతని రచనల్లోని మహిళలు గొప్పఆత్మాభిమానమున్న మహిళలు.

          ‘ పిరదౌసి ‘ కావ్యంలో ఒక్కో కవితకి   ఒక్కో బంగారు నానెం యిస్తానని మోసం చేసిన నవాబు తిరిగి పశ్చాత్తాప పడి  బంగారు నాణేలు పంపించే సమయానికి ఫిరాదౌసి చనిపోతాడు. ఫిరదౌసి కూతురు ఆ బంగారు నాణేలు తీసుకోరు. మా తండ్రిని మోసం చేసిన ఆ నాణేలు వద్దని నిరాకరిస్తుంది కటిక పేదరికంలో వుండి కూడా.

          జాషువా ఖండకావ్యాల్లో సతిదురాచారల మీద, పునర్వివాహాల మీద, వితంతు వివాహాల మాద అనేకమైన మహిళాభ్యుదయ రచనలు చేసిండు. జాషువా! మహిళా సంస్కరణోద్యమం ఉదృతంగా జరుగుతున్నపుడు ఆ ఉద్యమంతో తన సాహిత్యంతో కల్సి ఉద్యమించాడు జాషువా ! ఆదిపత్య కులాల మహిళలను గృహాలకే పరిమితం కాకుండా ‘ గృహమే మీకు పుట్టు ఖైదు” బైటకు  రండి, బైటి  ప్రపంచం చూడండి అనీ, స్త్రీ స్వేచ్ఛ కోసం పాటు పడినాడు. వ్రతాలు, నోములు, పూజలు, గుడుల చుట్టూర తిరిగే మూఢత్వాన్ని విడనాడండి అని ఆధిపత్య కులాల మహిళామూఢత్వాల్ని వదులు కోవాలంటాడు. హిందూ పితృస్వామ్య ఉక్కు పాదాల కింద నలగకుండా చైతన్యం పొందాలని ఉద్బోధించినాడు. ‘హిందూకోడ్’ బిల్లు మహిళా రక్షిత చట్టాలతో పొందు పర్చబడిన బిల్లు. ఈ బిల్లు అంబేద్కర్ పదేండ్లు మహిళల కోసం అధ్యయనం చేసి వారి పోరాటాల్లో పాల్గొని, వారితో భుజం భుజంగా కల్సి పనిచేసి ‘హిందూకోడ్ / బిల్లు అంబేద్కర్ రూపొందించాడు. ఈ విషయాలు మన తెలుగు మహిళా ఉద్యమ చరిత్రలు అక్కడక్కడ రికార్డు చేసినయి.

          అయితే విషాదమేంటంటే ‘మహిళా బిల్లు’ను సరోజనీనాయుడు లాంటి మహిళా నాయకులే వ్యతిరేకించడం, ధర్నాలు హర్తాల్లు చేయడమ్. మగ నాయకులైన పటేల్, బాబూ రాజేంద్రప్రసాద్, నెహ్రూ వంటి వాల్లకు వత్తాసు గా మహిళా నాయకులు కూడా నిలబడడము మహిళలు కూడా  పితృస్వామ్య భావజాలంలో పెత్తనంలో భాగంకావడం వెనక ఆధిపత్యకుల హిందూ భావజాలముండడము. ఆధిపత్య ఆడ, మగ కల్సి హిందూ కోడ్ బిల్లును వీగి పొయేట్లు చేశారు. హిందూకోడ్ పోయినప్పుడు భారతదేశంలో ఏ సాహిత్యకారులు స్పందించి రాసినారో తెలవదు గానీ. తెలుగునేల మీద ‘హిందూకోడ్’ బిల్లును సమర్థిస్తూ, అది వీగి పోయినప్పుడు జరిగిన రాజకీయాల్ని  ఎండగట్టింది జాషువానే, ‘పరదాలో నిను దాచి పెట్టిన వాల్లే నీ కొరకు  ఉపన్యాసాలు సాగించుటక్కరులే హైందవీకోడు బిల్లులకు పక్కా ద్వేషులై నిల్చు చుందురు, విద్యానయనంబులేని అలివేణుల్ కానరీ మర్మంబుల్’ అని జాలిపడ్డాడు. కానీ బిల్లు వీగిపోడానిక్కారణము విద్యానయనంబు  లేని ఆడవాల్లు, బహుజన కులాల నాయకులు, మహిళలు కారు. విద్యావంతులైన ఆధిపత్య కులాల ఆడ, మగవాల్లు.

          1893 నుంచే తెలుగు జననీ హిందూ సుందరి, గృహలక్ష్మి వంటి మహిళా పత్రికలు అనేకం వచ్చినయి. యీ పత్రికలు ఆధిపత్య మగవారే ఏర్పాటు చేసిన వర్ణ మహిళల దురాచారాలు మీద పని చేసినా గృహం  వరకే పరిమితం కావలనే హిత బోధలు చేసినయి. కానీ మెజారిటీ శ్రమ కులాల,బహుజన మహిళల  బాల్యవివాహాలు, అవిద్య, శ్రమదోపిడీ, లైంగికదోపిడీ ,కులం, పేదరికం జోగినీ దురాచారాలను ఈ నాటి వరకు ప్రస్తావించడం  జరగలేదు. శ్రమకు బైట మన్నమహిళా సంస్కరణ వుద్యమాలు  శ్రమలో వున్న మహిళలదాకాయీ నాటికి చేరక పోవడం విషాదం. ఈ పీడనలు పోవాలంటే శ్రమకులాల మహిళలు మానవహక్కులతో బతకాలంటే… యింకా ఎంతమంది సావిత్రి బాయి పూలేలు, జ్యోతిరావు పులేలు, అంబేద్కర్లు, జాషువాలు  రావాల్సి వుందో?

          జాషువా మహిళోద్దరణ కోసం, మహిళాభ్యుదయం కోసం చేసిన రచనలు ఆధునికమైన జెండర్ చైతన్యాలు యిప్పటికీ ఆదర్శనీయాలే. ఉద్యమ చరిత్రలు, విప్లవ సాహిత్య చరిత్రలు, కమ్యూనిస్టులు, మహిళా సంగాలు, ఫెమినిష్ట సంగాలు కూడా ఆధిపత్య కుల భావజాలాన్ని  వీడి జాషువా చేసిన సామాజిక సేవను, అతను కనబర్చిన జెండర్ చైతన్య దృక్పధాల్ని, ఆకాంక్షించిన స్త్రీ  పురుష సమానత్వాన్ని ప్రస్తుతించాల్సిన అవసరముంది. సాహిత్య ప్రజాస్వామికాల్ని కాపాడాల్సిన బాధ్యత కూడా వుంది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.