వెనుతిరగని వెన్నెల(భాగం-40)

డా||కె.గీత

(*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.) 

***

జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి” కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్లి లో కలుసుకున్న తన్మయి, శేఖర్ లకు పెద్దవాళ్ల అనుమతితో పెళ్లి జరుగుతుంది. పెళ్లయిన మరుక్షణం నించే శేఖర్ అసలు స్వరూపం బయట పడుతుంది. మొదటి సంవత్సరంలోనే అబ్బాయి పుడతాడు. కష్టమ్మీద తన్మయి యూనివర్శిటీ లో ఎమ్మే పాసవుతుంది. తన్మయి ఆశయాల్ని భరించలేని శేఖర్ గొడవ చేసి ఇంట్లో నుంచి వెళ్లిపోయి విడాకుల నోటీసు పంపుతాడు. తన్మయి కష్టపడి జే.ఆర్.ఎఫ్ సాధిస్తుంది. ఎన్నో రోజులు పోరాడి, చివరికి శేఖర్ కు తనే విడాకులు ఇస్తుంది.

 ***

          తెల్లారగట్ల రైలులో విశాఖ పట్నానికి తిరిగొచ్చింది తన్మయి. భానుమూర్తి ని కనిపెట్టుకుని ఉన్న నరసమ్మ చెల్లెలికి ఒంట్లో బాగోకపోవడంతో జ్యోతి రాజమండ్రి స్టేషనులో దిగి ఇంటికి వెళ్లిపోయింది

          రైలు స్టేషనులో ఆగగానే తమ తమ వారి కోసం  వచ్చిన వాళ్ల పలకరింతలతో చుట్టూ హడావిడి చుట్టుముట్టింది

          తన కోసం ఎవరు రారని, ఎవరు లేరని తెలిసినా తన్మయి మనసు బాధనలుము కుంది

          ఈ నగరం తన కలల్ని నిలబెట్టినా, తన జీవితాన్ని ఛిద్రం చేసింది.

          ఆటోలో బాబుని పొదువుకుని కూచుంది తన్మయి

          తెల తెలవారుతున్న చలిగాలి ఆలోచనల్ని చల్లబరుస్తూ అత్యంత ఆహ్లాదంగా వీచసాగింది.

          చల్లగాలి మేను తాకగానే సముద్ర తీరం చుట్టి రావాలని అనిపించింది తన్మయికి

          అనుకున్నదే తడవుగా స్కాలర్స్ హాస్టలు దగ్గర దిగడం మానేసి, ఆటోవాలాని రామకృష్ణా బీచ్ కు పోనివ్వమని చెప్పింది.

          కాస్త ఆశ్చర్యంగా చూస్తున్న అతనితో, “మళ్లీ ఇక్కడికే రావాలి చినవాల్తేరు మీదుగాఅంది.  

          పొద్దుటే మబ్బు ముసురుకుని కెరటాలు ఉవ్వెత్తున ఎగిసి పడ్తున్నాయి.   

          రాత్రి చేపల వేటకి వెళ్ళిన పడవలు తిరిగి తిరిగి అలిసిపోయి ఒడ్డున ఇసుకలో ఒగురుస్తూ చతికిలబడినట్లు నీళ్లోడుతున్నాయి. వలల్ని విడదీస్తూ, దులుపుతూ జాలర్లు బతుకుని భుజాలకెత్తు కుంటున్నారు

          సముద్ర తీరాన పొడవుకీ కట్టి ఉన్న చప్టా మీద  నడుస్తున్న  ఒకటీ అరా మనుషుల్ని దాటుకుంటూ ఆటో రయ్యిన దూసుకుపోసాగింది

          “కాస్త నెమ్మదిగా వెళ్దాంఅంది తన్మయి నిద్రపోతున్న బాబుని సర్దుకుంటూ.

          స్వేచ్ఛా విహంగంలా తనకి ఎప్పుడు ఏం చెయ్యాలనిపిస్తే అది చెయ్య గలిగే జీవితం! ఆలోచన రాగానే తన్మయికి మనస్సంతా హాయి నిండింది.

          ఒకప్పుడు అన్నిటికీ ఆంక్షలు, అదుపాజ్ఞలు

          తల్లి దండ్రులు సంరక్షణ పేరుతో  ఆడపిల్లగా పుట్టడమే ఒక శిక్ష అన్నట్టు  పెంచే వారు.    

          ఇక భర్త సరేసరి. తనని అన్ని విధాలా అణచి వేసేడు. అంతకు ముందు అంతో ఇంతో ఆహ్లాదమైన జీవితం పెళ్లి అనే కూపంలో ఇరుక్కుని ఊపిరి సలపనట్టయ్యింది.  

          దారిలో విరిగి పడి ఉన్న అప్పూఘర్ శకలాల్లో  ఒకప్పటి తనలాగే తుప్పు పట్టిన మేరీ గో రౌండ్ ని చూసి తల తిప్పుకుంది తన్మయి.    

          ఇప్పుడు తనొక స్వేచ్ఛా విహంగం

          తన్మయికి మనసంతా కట్లు తెంచుకున్న పావురాయిలా  తేలికై, గాలి వాటున సీతాకోక చిలుకలా పైకి లేచిగూడ బాతులా వాలి సముద్రపు నురుగు పూసుకుని అలల కెరటాల మీద గిరికీలు కొట్టింది

***

          హాస్టలుకి రాగానే మేరీ ఆప్యాయంగా కాఫీ తీసుకు వచ్చింది. “ప్రయాణం బాగా జరిగిందా?” అంటూ

          “ ప్రయాణం లో చుట్టాలంటూ ఎవరింటికో వెళ్లి ఉండడం తప్ప అన్నీ బాగానే జరిగినట్టే” 

          అదే చెప్పింది మేరీతో.

          “నిజమే, తన్మయీ. జీవితంలో అన్నీ బాగానే జరుగుతున్నపుడు మన చుట్టూ ఉన్న మనుష్యులతో సమస్యలూ ఎదురవ్వవుమనకే తెలీకుండా మన జీవితాలు అల్లకల్లోల మైనా సమాజం సానుభూతి చూపించదు. సమూహంలో మనలాగా ఒంటరి స్త్రీల కి జరిగే అవమానాలు ఇంతా అంతా కాదు. అందుకే నేను ఎప్పుడూ చుట్టాలు, బంధువు లంటూ ఎవరింటికీ వెళ్లకూడదని ఎప్పుడో నిర్ణయించుకున్నాను. అప్పటి నించీ మనశ్శాంతిగా ఉన్నాను. అవన్నీ సరే గానీ త్వరగా రెడీ అవ్వు. నువ్వు ఇంటర్వ్యూ బాగా చేసినందుకు గాను, ఇవేళ బయటెక్కడైనా టిఫిన్ చేయడానికి వెళ్దాంఅంది

          బదులుగాగవర్నమెంట్ లెక్చరర్ పోస్టుకి రిజల్స్టు ఎప్పుడు వస్తాయో ఎవరికీ తెలియదు. ముందు అర్జంటు గా హాస్టలు ఖాళీ చేసి అద్దె గదికి మారాలి మేరీఅంది తన్మయి.

          “అలాగే. నువ్వు ఏదైనా సమస్యని పరిష్కరించే వరకూ విశ్రమించవు కదా. అట్నించి అటే దివాకర్ వాళ్లింటికి వెళ్లి, రేపే ఇంట్లో చేరుతావని చెప్దాం.” అంది మేరీ నవ్వుతూ.

          దివాకర్ తల్లి సాదరంగా ఆహ్వానించింది తన్మయిని

          “యూనివర్శిటీ లో పీ. ఎచ్. డీ లో జాయినయ్యిన కొద్ది రోజుల్లోనే లెక్చరర్ పోస్టుకి కూడా ఇంటర్వ్యూ చేసొచ్చావంటే నీకు తప్పకుండా గవర్నమెంటు ఉద్యోగం వచ్చేస్తుందమ్మా”  అంది మన:స్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ  అందావిడ.

          “మీ ఆశీస్సుల వల్ల అదే జరిగితే మా తన్మయి అంత అదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు.” అంది మేరీ.

          బాబు పరిచయంగా ఆడడం మొదలు పెట్టేడు.

          ఆవిడ దివాకర్ తండ్రి ని పిలుస్తూ, “ఏవండోయ్, మీకు మనవడొచ్చాడుఅంది.

          సాయంత్రం సామాన్లతో వస్తానని చెప్పి సెలవు తీసుకుంది తన్మయి.

          ఆటోలో తిరిగి వస్తున్నపుడు, “నీ మంచితనమే నిన్ను కాపాడుతూంది తన్మయీ. నీ పరిస్థితిని అర్థం చేసుకోవడమే కాకుండా, వాళ్లింట్లో అంతా నిన్ను వాళ్ల అమ్మాయిలా ఆదరిస్తున్నారు. ఎక్కడికక్కడ రాబందుల్లా పీక్కు తినే పాడు ప్రపంచంలో అరుదుగా ఉండే వీళ్ల లాంటి మంచి వాళ్లు కొందరు నీకు దన్నుగా నిలబడడం నీ అదృష్టంఅంది మేరీ సంతోషంగా

          బదులుగా మేరీ చేతిని తన చేతిలోకి తీసుకుని, “నాకు నువ్వు దొరికినట్టుఅంది తన్మయి.

***

          అంతా అంటున్నట్టుగానే గవర్నమెంటు ఉద్యోగాల ఎంపికల విషయంలో అవక తవకలు జరుగుతున్నాయని కొందరు కోర్టుని ఆశ్రయించారని, కేసులు తేలేంత వరకూ సెలక్షను లిస్టు తెమలదని పేపరులో మర్నాడు వార్త వచ్చింది.

          ఇక ఉద్యోగం విషయం మరిచి పోవల్సిందేనని తోచింది తన్మయికి.

          బాబుని దగ్గర్లోని స్కూలులో చేర్పించింది

          పొద్దుటే బాబుని దించడానికీ, సాయంత్రం తీసుకొచ్చుకోవడానికీ మధ్య ఉన్న సమయం రీసెర్చికి  చక్కగా సరిపోతుంది.

          ఆదివారాలు రోజల్లా బాబుతో ఆడుకోవడానికే కేటాయించసాగింది.

          ఒడుదుడుకులన్నీ చక్కబడి కాస్త జీవితం కుదుటన పడింది తన్మయికి.

          ఆ రోజు బాబుని స్కూలు నించి తీసుకుని ఇంటికి వస్తూనే గేటు తెరిచే సరికి అరుగు మీద కుర్చీలో తమ కోసం ఎదురు చూస్తూ శేఖర్  తల్లి కనబడింది.

          తన్మయికి ఆశ్చర్యం వేసింది. ఇంత తొందరగా వీళ్లకు తన అడ్రసు తెల్సి పోయిందంటే ఎవరో తనను ఎప్పుడూ గమనిస్తున్నారన్నమాట.

          వీళ్లు ఇలా తనని వెంబడిస్తూ  తన మానాన బతక నివ్వకుండా  చేస్తున్నారు

          ఒక్కసారిగా నిస్సత్తువ ముంచుకు వచ్చింది తన్మయికి.

          అప్పటికే దివాకర్ తల్లి కాఫీ ఇచ్చినట్టుంది ఆవిడకి.

          తమని చూస్తూనేవచ్చేరామ్మాఅని ముఖం నిండా నవ్వు పులుము కుంటూ ముందుకు వచ్చింది దేవి.

          తన్మయి ముభావంగా చూసింది ఆవిడ వైపు

          బాబుని చెయ్యి చాచి పిలుస్తూ ఒళ్లో కూచో బెట్టుకుంది.

          తన్మయి తాళం తీయగానే లోపలికి వచ్చి, “ఏవిటీ, ఒక్క దానివే ఉంటున్నావా?” అంది.

          తన్మయి చురుగ్గా చూసేసరికి, “అదే మీ అమ్మా, నాన్నా నీతో ఉన్నారనుకున్నాంఅంది.

          తన అమ్మా, నాన్నా ఊళ్లో ఉంటారన్న సంగతి తెలిసే ఆవిడ కావాలని అడిగిందన్న సంగతి తనకు తెలీదా

          “ఏవిటో రాత, మా పెద్ద మనవడు వీడు. అందరం వీడి మీద ప్రాణాలు పెట్టు కున్నాం. చివరికి ఇలా అయ్యిందిఅని నిట్టూర్చింది.

          ఆవిడ ఏం మాట్లాడినా, తన్మయి విననట్టే ఊరుకుంది. అసలు ఆవిడ ఉనికే తనకి దుర్భరంగా ఉంది

          కోర్టు తండ్రికి ఎప్పుడయినా చూడగలిగే అవకాశం ఇచ్చింది. అదే అదనుగా తీసుకుని అతని వాళ్లంతా ఇలా వచ్చేటట్టు ఉన్నారు

          ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు తన్మయికి

          రెండు గదులలో వెనక గదిలోకి వెళ్ళిపోయి తలుపు వేసుకుంది

          ముందు గదిలో ఆవిడ బాబుతో గంట సేపు ఏవేవో మాట్లాడివెళ్లొస్తానమ్మాఅని కేకేసింది

          పక్క గదిలో తన్మయికి వినబడుతూనే ఉన్నాయి.

          “మీ నాన్న నీకోసం బెంగట్టిపోతన్నాడురా బాబూ

          “మీ అమ్మ స్థిరమైనదైతే మనకీ పాట్లొచ్చేవి కావు

          “ఎవరైనా వొస్తన్నారా మీ ఇంటికి?”

          తన్మయికి రక్తం ఉడికిపోతూ ఉంది మాటలకి

          “చిన్న పిల్లాడితో మాట్లాడుతున్నానన్న ఇంగిత జ్ఞానం ఉందా ఆవిడకి?”

          ఆవిడ తమ్ముడు స్కూటర్ మీద వచ్చి గేటు బయట హారను మోగించేడు

          తన్మయికి మహా చికాకు వేసింది.

          దివాకర్ తల్లితో, ఏదో పెద్ద ప్రేమ ఒలికి పోతున్నట్టుకాస్త చూస్తూండండీఅని రాగం తీసి బయలుదేరిందావిడ

          వీళ్లు కనబడుతున్న ప్రతీసారీ శేఖర్ తనకి చేసిన అన్యాయాలన్నీ వరసగా గుర్తుకు వస్తున్నాయి.

          ఈ పరిస్థితుల్నించి తప్పించుకోవడానికి ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు.

          దు:ఖం తన్నుకొచ్చింది తన్మయికి. మంచానికి అడ్డం పడి కుమిలి కుమిలి ఏడవసాగింది.

          బాబు ఏదో అర్థమైన వాడిలా వచ్చి తల్లి తల నిమిరేడు.

***

          ఎప్పటికి పరిష్కారమవుతుందో అనుకుంటున్న సర్వీసు కమీషను కేసు రెండు నెలల్లోనే తేలిపోయింది.

          ఆ సాయంత్రం జ్యోతి ఫోను చేసింది.

          దివాకర్ పరుగున వచ్చి చెప్పేడు.

          ఎప్పుడూ తన్మయే ఎస్ టీ డీ బూత్ నించి చేస్తుంది

          తనంతట తానుగా తల్లి హఠాత్తుగా ఎందుకు ఫోను చేసిందో అర్థం కాక, భయంగా పరుగెత్తింది తన్మయి.

          అట్నించి జ్యోతి సంతోషంతో ఒగురుస్తూనీకు ఉద్యోగం వచ్చిందని ఉత్తరం వచ్చిందమ్మాఅంది.

          తన్మయికి వింటున్నది నిజమో, కాదో అర్థం కాలేదు.

          “నిజమా అమ్మా, నిజమా అమ్మాఅని అంటూండగానే బుగ్గల మీదికి వెచ్చని కన్నీరు ఉబికింది తన్మయికి.

          “రేపు ఆదివారం ఇంటికి వస్తానుండుఅని మాత్రం అనగలిగింది.

          తనకి జే.ఆర్ ఎఫ్ వచ్చినా తల్లికి అంత ఆనందం కలగలేదు ఎందుకో మరి! చాలా నిర్లిప్తంగాఓహోఅంది అప్పుడు. విజయం అర్థం కాకో, పరిశోధన తర్వాత ఏం చేస్తుందనే ప్రశ్నకి సమాధానం లేకపోవడం వల్లనో.

          ఇప్పుడు మాత్రం తల్లి గొంతులో అత్యంత సంతోషం తాండవించడాన్ని గమనించింది. గవర్నమెంటు ఉద్యోగం అంటే సహజమైన గొప్ప విలువ వలన కావచ్చు.

          ముందుగా మాస్టారి ఇంటికి పరుగెత్తుకెళ్లింది తన్మయి.

          కాళ్లకి సంతోషంతో నమస్కరించింది.

          “నా ప్రమేయం ఏవుందమ్మా, అంతా నీ ప్రతిభ, నీ కొడుకు చేసుకున్న అదృష్టం, శుభం భూయాత్అని ఆశీర్వదించారు మాస్టారు.

          ఆయన శ్రీమతి గుప్పెడు పంచదార తెచ్చి నోట్లో పోసింది.

          సంతోషంతో బాటూ, పరిశోధన ఏమవుతుందోననే బెంగ కలిగింది తన్మయికి.

          అదే అడిగింది మాస్టారిని.

          “నీ పరిశోధన ఏవీ ఆపనవసరం లేదు. కాకపోతే కష్టపడి సాధించుకున్న జే ఆర్ ఎఫ్ స్కాలర్ షిప్పు పొందే అవకాశం ఉండదు నీకు. గవర్నమెంటు ఉద్యోగం స్టేట్ గవర్నమెంటు, జే ఆర్ ఎఫ్ స్కాలర్ షిప్పు సెంట్రల్ గవర్నమెంటు ద్వారా అయినప్పటికీ నీకు ఏదో ఒకటే పొందే అవకాశం ఉంది. ఇక పీ ఎచ్.డీ ని పార్ట్ టైముగా మార్చడానికి అప్లికేషను పెట్టి, గవర్నమెంటు ఉద్యోగంలో ముందు జాయినయ్యిపో. వాళ్ళు ఎక్కువ సమయం ఇవ్వరు. ఒకసారి అక్కడ కుదురుకున్నాక ఇక్కడి విషయాలు తీరికగా ఆలోచిద్దువుగాని.” అన్నారు.

          మాస్టారి  భార్య చీర, జాకెట్టు బొట్టు పెట్టి  ఇచ్చి ఆప్యాయంగాఎప్పుడొచ్చినా తిన్నగా ఇక్కడికే వచ్చేసెయ్యి”  అన్నారు.

          వారి దగ్గర సెలవు తీసుకుని మేరీకి శుభవార్త చెప్పడానికి బయలుదేరుతూండగా గేటు తీసుకుని వస్తూ కరుణ కనిపించాడు.

          తనని చూసి, వెంటనే చిరు కోపంగా చూపు తిప్పుకున్నాడు.

          “..రావోయ్, తన్మయికి గవర్నమెంటు లెక్చరర్ ఉద్యోగం వచ్చింది. తెలుసా? “అన్నారు మాస్టారు వాకిట్లోనే.

          తన్మయిని దాటి వెళ్తున్న అతను కనీసం మర్యాదకయినా ఆగి  కంగ్రాట్స్ చెప్పకుండా ముభావంగా ముందుకు వెళ్ళిపోయేడు.

          తన విజయాల్ని సహించలేని అసహనం అతని ముఖంలో తాండవించడం మళ్లీ స్పష్టంగా చూసింది

          అతను తన జీవితంలోకి ప్రవేశించకుండా జాగ్రత్త తీసుకున్నందుకు తనను తను అభినందించుకుంది.

          లేకపోతే తను జీవితంలో మళ్లీ ఘోరమైన తప్పటడుగు వేసేది

          కాకపోతే కొన్నాళ్ల పాటయినా అతన్ని స్నేహితుడని నమ్మినందుకు మనస్సు కాస్త చివుక్కు మని వెంటనే సర్దుకుంది.

          “ముళ్ల తీగెల మధ్య లాఘవంగా దాటుకుంటూ వెళ్లడమే జీవితం!” అని తనకి తను చెప్పుకుంది

***

          ఆ వారాంతం ఎప్పుడవుతుందా అనిపించింది తన్మయికి.

          ఇంటికి వెళ్లగానే టైపు చేసి ఉన్న అపాయింటు మెంటు లెటర్ని పది సార్లయినా చూసుకుంది.

          చాలా విచిత్రంగా తన్మయి కోరుకున్నట్టుగానే హైదరాబాదు శివార్లలో ఉన్న ఊళ్లో ఉద్యోగం వచ్చింది.

          అలా పూర్తిగా జోను మార్చి మరో జోనులో ఇచ్చేద్యోగానికి నేషనల్ ఇంటిగ్రేషను అపాయింటుమెంటు అంటారని అప్పుడే మొదటిసారి తెలుసుకుంది.

          అంతే కాక, ఒక జోనులో ప్రతిభావంతులకి అవకాశాలు లేనప్పుడు ఇలా మరో జోనులో ఖాళీలలో వేస్తారట.

          ఎలాగైతేనేం, తనకి నచ్చిన చోట ఉద్యోగం రావడం తన్మయికి చాలా సంతోషంగా అనిపించింది.

          బాబుని యథావిధిగా తల్లి దగ్గిర వొదిలి పెట్టి ఉద్యోగంలో జాయినయ్యేందుకు హైదరాబాదుకి ఒంటరిగా ప్రయాణమయ్యింది తన్మయి.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.