“అసింట” డా.కె.గీత కవిత్వం పై సమీక్ష

   -అనురాధ నాదెళ్ల

అసింట – ఒక అభిప్రాయం

          స్పందించే హృదయానికి ఒక సన్నివేశమో, ఒక సందర్భమో, ఒక అనుభవమో ఏది ఎదురైనా ఉన్నపాటున తనను తాను వ్యక్తీకరించుకోకుండా నిలవలేదు. ఆనందమో, విషాదమో, మరే భావోద్వేగమైనా సరే అభివ్యక్తికి తనకు తెలిసిన భాషను వెతుక్కో వలసిందే. ఈ అవసరం కవికి తప్పనిసరవుతుంది. తీవ్రమైన భావావేశంతో కవి వర్షాకాలపు మేఘమై, జడివానై కురవాల్సిందే.

          అయితే దీనికంతకూ కావలసింది ముందుగా ఒక స్పందన. ఒక అనుభూతి. ఒక ఆస్వాదన. ఒక చెమర్చే గుండె. తనదే ఐన జీవితం, అనుభవాలుఅనే స్వార్థపు కంచెను దాటి ప్రపంచాన్ని స్వంతం చేసుకోగలిగితే అక్కడ కనిపించే మంచి చెడులు, ఆనంద విషాదాలు, సుఖ దుఃఖాలు…అన్నింటి పట్లా సహానుభూతితో కదిలిపోతాడు కవి. లోటు లేనిదైనా తన జీవితాన్ని అలవోకగా, నిశ్చింతగా ఆస్వాదించెయ్యలేడు. సుఖంగా బతి కెయ్యలేడు. తనచుట్టూ శాంతి సౌఖ్యాల్ని ఆకాంక్షిస్తాడు. కవిత్వానికి మనిషి భావాలను అక్షరీకరించటంలో ఒక సాధికారత ఉంటుంది. ఒక చిక్కదనం ఉంటుంది. దీనికి ఎలాటి హంగులూ అక్కర్లేదు. ఎలాటి అలంకారాలు అక్కర్లేదు. అర్థం చేసుకునే మనసుంటే ఏ భావమైనా కవిత్వపు రూపు తొడుక్కుంటుంది. ఈ ఉపోద్ఘాతానికి కారణం మనం మాట్లాడు కోబోయే పుస్తకం.

          డా. కె.గీత ఇటీవల ప్రచురించిన “అసింట.” ఈ పుస్తకంలో 31 కవితలు, 13 పాటలు ఉన్నాయి. ఒకటిరెండు మినహాయిస్తే మిగిలినవన్నీ గతరెండు, మూడేళ్ల కాలంలో రాసిన కొత్త కవితలే.

          ఇందులో రక్తసంబంధీకుల పట్ల ప్రేమానురాగాలు, వారు సమస్యల్లో చిక్కుకో కూడదన్నఆత్రుత, కుటుంబంలోని ఆత్మీయులు దూరమైన వేళ జ్ఞాపకాల ఊతంతో దుఃఖాన్ని అధిగమించే ప్రయత్నం కవితల రూపంలో కనిపిస్తాయి. స్వంత అనుభూతులను అలవోకగా కవిత్వీకరిస్తూనే ప్రపంచంలోని అన్యాయాల పట్లకూడా అంతే తీవ్రంగా, వేగంగా స్పందించటం చూస్తాం.

          నిన్నమొన్న ప్రపంచాన్ని భయం గుప్పెట్లో పెట్టి, మానవ జాతికి తీరని దుఃఖాన్ని, వెలితిని మిగిల్చిన కరోనా వైరస్ మనుష్యుల మధ్య దూరాల్ని సృష్టించింది. అయితే యుగాల క్రితమే మనుష్యుల మధ్య మనుష్యులే సృష్టించిన అగాధాన్ని, దాన్ని దాటాలన్న ఆశని చూస్తాం “క్రిమి” సంహారం” కవితలో…

          “ఇప్పుడు ఆరడుగుల దూరవంటన్నారు

          ఊరూరూ తిరిగే మాకు…ఊరు ఎప్పుడూ ఆరుకోసుల దూరవే

          ముక్కుకి గుడ్డలంటన్నారు కానీ వొంటినిండా గుడ్డలేయి?’ అని ప్రశ్నిస్తూనే మడిసిని మడిసిగా సూడని “క్రిమి” ని సమ్మారం చేద్దామంటారు. ఈ మాటలు సూటిగా వ్యవస్థని నిలబెట్టట్లేదూ?

          ఎంతదారుణమైన అనుభవాలు! ఎంత వేదన! మనిషిని మనిషిగా చూడలేని సమాజానికి ఎలాటి క్రిమి సంహారకం అవసరమవుతుందో?! అసలు అలాటిదొకటి ఉందోలేదో అన్నది ప్రశ్నే.

          “అసింట” కవితాశీర్షిక పుస్తకానికి పెట్టిన శీర్షిక. ప్రత్యేకమైనది. “అసింట” పదం వర్ణవ్యవస్థలోని అమానవీయ కోణాన్ని చెపుతూ, సభ్యసమాజం తలవంచుకునేలా చేస్తుంది. వ్యవస్థ ఎలాటి ఆదిమ అవస్థలో ఉందో చెపుతుంది. మనుషుల్ని దూరం దూరం అంటూ నిలవరిస్తున్న కరోనా వైరస్తో “అసింట” అంటూ అగ్రవర్ణాలు దూరం పెట్టిన బలహీనుల దీనస్థితిని పోలుస్తున్నారు.

          “ఇప్పుడు మూతులకి కట్టుకుంటున్న గుడ్డలు తమ గాలి తగిలి కాదంటున్నారు.”

          పైగా, “ఎవరింట్లో వాళ్లే పనోళ్లైతే మా సంగతేంటి” అని సూటిగా ప్రశ్నిస్తూ,

          “మీ అసింట మీకాడెట్టుకుని, మా పన్లు మాకిచ్చెయ్యండి,

          ముట్టుకుంటే సావొచ్చేలోగా మాడే కడుపుల సావొద్దు మాకు” బలహీనుల జీవితాల్లో అసహాయతని కళ్లకు కట్టే ఈ వాక్యాలు మనిషితనానికి అవమానం.

          లాక్డౌన్ లో ఇంటిల్లిపాదినీ వేయిచేతులతో కాచుకున్న ఇల్లాలు “బంగారమంటి పెళ్లాం” అన్న ఒక్క మాటతో “అతని” బరువునీ తన భుజానికేసుకుంటుంది. స్త్రీల బలాన్ని, బలహీనతను మరోసారి ఈ కవిత చెపుతుంది.

          సహచరుడు ఇంటలేని వియోగాన్ని, విరహాన్ని చెప్పిన కవితలున్నాయి.

          “నీ వస్తువులన్నీ ఎన్నాళ్ల నుంచో నిద్రలేనట్టూ

          ఎక్కడివక్కడే పడి గుర్రుపెడుతున్నాయి”

          ఆత్మీయ మిత్రులు పుట్ల హేమలత గారిని కోల్పోయిన బాధను చెపుతూ నిశ్శబ్దంగా అందరూ ఒక్కొక్కరుగా రాలిపోవలసిందే కాబోలన్న తాత్త్వికతను ఒప్పేసుకుంటారు. పిన్ని మరణానికి దుఃఖిస్తూ, ఆమె వెనుకవెనుకే గడిచిన తన బాల్యాన్ని కమ్మగా తలుచు కుంటూ ఒక్కసారి ఎప్పటిలా పండక్కి వచ్చి గొడవ పడమని జాలిగా వేడుకొంటారు శాశ్వతనిద్ర పోయిన ఆ ఆత్మీయురాలిని.

          యౌవనవతి అయిన కూతురి బాల్యపు జాడల్ని వెతుక్కుంటూ తన క్రమశిక్షణా పర్వంలో అలిగి తననే దూరం పెట్టడం తలుచుకుంటారు. తన గతాన్ని కూతురి మెడలో ఆభరణంగా వేస్తూ, అందులో అక్కడక్కడా గుచ్చుకునే రాళ్ళున్నాయంటూనే తను గతించిపోయాక కూడా అవి వజ్రాలై ఆదుకుంటాయంటారు. అమ్మ ప్రేమ బిడ్డల పట్ల అంతులేని సముద్రమే అని మళ్లీ మళ్లీ నిరూపిస్తూనే ఉంటాయి ఇలాటి కవితలు. అలాగే మరో కవితలో చుట్టూ ప్రపంచంతో పాటు ఇల్లూ, ఇంటి చుట్టూ పరిసరాలు కూడా భద్రమైనవి కావని ఆడబిడ్డలను హెచ్చరిస్తూ ప్రజ్వరిల్లే అగ్నిజ్వాలై తమను తాము కాపాడుకోవాలంటారు.

          అబ్బాయి తనదైన ఇంటికి రమ్మని పిలిచినపుడు అక్కడెవరో వాడి మనశ్శరీరాల్ని పంచుకుంటున్నవారున్నా వాడెప్పుడూ తన శరీరంలో భాగమే సుమా అని చెప్పు కుంటారు. ఆ ఇంట్లో మూలగదిలో మంచమ్మీద విశ్రాంతి తీసుకుంటుంటే మొదటిసారి వార్ధక్యం వచ్చినట్టయిందంటారు. ఎదిగిన బిడ్డల ముందు వయసు మీదపడిన భావం ఎవరికైనా తప్పదేమో!

ఆడపిల్ల పుట్టుక, మతం, సంప్రదాయం ఆమెను అన్నిరకాల సంకెళ్లలో బంధిస్తోందంటూ, వాటిని బద్దలు కొట్టవలసిందేనని చెప్తూ, ఆమె ఆహార్యం ఆమెదైన హక్కు అంటారు. అలాగే అబార్షన్ హక్కులు కేవలం ఆడవారివే అంటూ అమెరికాలో జరుగుతున్నఅబార్షన్ హక్కుల ఉద్యమానికి మద్దతు చెప్తారు.

          వ్యక్తిగా, ఒక స్త్రీగా తనవైన అనుభూతులను, హక్కులను చెప్పుకోవటంతో ఆగి పోలేదు కవయిత్రి.

          బతుకు ఎంత యాంత్రికమై పోతోందో చెప్తూ మనుషులకు కాళ్లు, చేతులే కాదు,ఆకలి దప్పులూ, నిద్రా, స్పర్శా, అనుభూతులూ కూడా ఇంకిపోయిన దిగుడు బావులయ్యా యంటారు.

          ఇటీవల దిల్లీ రోడ్లమీద జరిగిన రైతుల ఆందోళన గురించిన కవితలో,

          “రైతు సట్టం రైతునడిగి సెయ్యాలని తెలవందేం పెజాసోమ్యవండీ” అంటూనే

          “మా సట్టం సింపిసేతుల్లో ఎట్టీదాకా ఇంటికెల్ల” మని ఘంటాపదంగా నిబ్బరంగా చెప్పిన రైతులు కనిపిస్తారు. దోపిడీని ఎదుర్కొందుకు సమైక్యంగా గొంతులు కలిపిన రైతన్నల బలం ఆ సమిష్టితనంలోంచి వచ్చిందే.

          ఏ ప్రభుత్వాలొచ్చినా సామాన్యుడికి తనుపడే బాధలు పడక తప్పదని తెలుసు. అందుకే వానంటేనూ, వరదంటేనూ భయమే లేదంటాడు, పైగా రోజుల తరబడి వాననీళ్లల్లో, వరదల్లో బతికెయ్యగలమంటాడు మరో కవితలో.

          తననూ, తను పుట్టిన దేశాన్ని వేధించే సమస్యలే కాదు, ప్రపంచాన్ని ఆవరించిన యుధ్ధమేఘాల్ని నిరశించటం కూడా మరచిపోలేదు కవయిత్రి. అలాగే ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్కు ఒక దేశ ప్రజలు కారణమంటూ వారిని వివక్షకు గురి చేయటాన్ని ఖండించారామె. ప్రపంచమంతా జరుగుతున్న రకరకాల దౌర్జన్యం, హింసలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉన్నాయి.

          “జార్జ్ ఫ్లాయిడ్ నీ చివరి శ్వాస ఎవరికీ ఊపిరాడనివ్వటం లేదు”

          ప్రపంచం యావత్తూ జాత్యహంకారాన్ని ఈసడిస్తూ తోసుకొచ్చిన ప్రభంజనం గురించి “ఊపిరాడనివ్వటం లేదు” కవిత చెపుతుంది.

          వైయక్తికమైనవనిపించే భావనలను చెపుతూనే, మరోవైపు లోకంలోని దుఃఖాన్నీ చెప్తారు గీత. తన జీవితం చుట్టూ అల్లుకున్నవారిని, వారితో తనకున్న  ఆత్మీయాను బంధాల్ని తరచి తరచి చెప్పుకుంటూనే, ప్రపంచాన్నంతటినీ తనదిగా చేసుకుంది కవయిత్రి. మానవత్వానికి కళంకం కలిగించే ఏ ప్రపంచానుభవాన్నీ కూడా పరాయిదంటూ దూరం పెట్టలేదు. కవికి ఉండవలసిన ఆర్ద్ర హృదయం ఈ కవితా వస్తువులన్నిటిలోనూ కనిపిస్తుంది.

          కవితలే కాకుండా కొన్ని పాటలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. అందులో “ఊరి గేపకం” పాటలో చెపుతారిలా…

“ముల్ల తుప్పల రేగిపండు

రాలిపడ్డ పిందె మామిడి

జేబు దాసిన ఉప్పుకారం

సేతిపొంటి యేలు సీకిన

ఊరి గేపకమేదో

ఉలికి ఉలికి కుదుపుతాది”

          ఈ “ఊరిగేపకం” ఎవరికైనా నాస్టాల్జిక్ గా ఉండి సలుపుతుంది. మనసుని ఉన్నపళాన ఊరికి తరుముతుంది. చదువులు, ఉద్యోగాలు, ప్రపంచ పౌరసత్వాలు ఊరిని ఇంత అపురూపమైనదిగా, అందరానిదిగా చేస్తోందంటే కళ్లు చెమరుస్తాయి మరి!

          డా. గీత ఈ సంపుటి కంటే ముందు నాలుగు కవితా సంపుటాలను ముద్రించారు. అనేక అవార్డులను అందుకున్నారు. పుస్తకంలోని కవితలన్నీ మనిషిలోని భిన్న పార్శ్వాలను చూపిస్తాయి. కవితల నిడివి పెద్దదిగా ఉందనిపించింది. నిడివికి కొలత అవసరం లేకపోయినా ఇవే కవితలను కొంత క్లుప్తతతో చెప్పినప్పుడు చిక్కదనం ఉంటుందన్నది తోచింది. వ్యక్తిగతంగా ఇదొక్కటే ఈ పుస్తకంలో లోటు అనిపించింది. గీత ముందుముందు రాయబోయే కవితల్లో ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుని మనకు మరింత చక్కని కవిత్వాన్ని అందిస్తారనుకుంటాను.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.