తల్చుకుంటే

(నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)

-మంజీత కుమార్

          “అబ్బా ఈ బస్సు ఎప్పుడూ లేటే?” తిట్టుకుంటూ బస్టాప్‌లో ఎదురుచూస్తోంది స్థిర. హైదరాబాద్‌లోని కొత్తపేటలో తల్లీదండ్రి పరమేశం, సావిత్రమ్మ, ఇద్దరు చెల్లెళ్లు … స్థిత, స్థిద్నతో కలసి ఉంటోంది స్థిర. చదువుకుంటూనే రేడియో జాకీగా ఉద్యోగం చేస్తూ .. తన పాకెట్ మనీని తనే సంపాదించుకుంటోంది. విపరీతమైన రద్దీ వల్ల సగం వంగిన బస్సు బస్టాపులో కాకుండా కాస్త దూరంలో ఆపడంతో .. స్థిర పరుగులు తీస్తూ బస్సును  అందుకుని ఫుట్‌బోర్డు పైన వేలాడుతూ నిలబడింది. ఇంటికి చేరాలంటే కనీసం మూడు బస్సులను మార్చాలి, ఖాళీ బస్సు కోసం ఎదురుచూస్తూ కూర్చుంటే టైము వృధా అవుతుందని .. ఏ బస్సు దొరికితే అందులో తనను తాను దూర్చడం అలవాటు చేసుకుంది. అరగంట బస్సులో వేలాడాక .. బస్సు కాస్త ఖాళీ అయ్యింది. లోపలికి వెళ్లి నిలబడగానే .. ఓ పోకిరి పక్కనే వచ్చి నిలబడ్డాడు. కావాలని స్థిరను తాకుతూ … వెకిలి వేషాలు వేయసాగాడు. ఈ తతంగాన్ని అందరూ చూస్తున్నా … తమకెందుకులే అనుకున్నవారే. స్థిర కూడా ఏంటీ అన్నట్టు కోపంగా చూడడంతో .. బ్రేకులు పడితే తన తప్పా అన్నట్టు సైగ చేశాడు. అదృష్టవశాత్తు సీటు దొరకడంతో హమ్మయ్య అంటూ కూర్చుంది. తన స్టాపు రాగానే దిగిపోయి ఇంటికి చేరింది.

          “ఏంటమ్మా ఇంత లేటు .. బస్సు దొరకలేదా” రోజూ తల్లి అడిగే ప్రశ్నే … “ఊ” అంటూ లోపలికి వెళ్లడం స్థిరకు దినచర్యే. కాసేపు టీవి చూసి ..అందరూ కలసి భోజనాలు చేసి పడుకున్నారు.

          తెల్లారింది. అందరూ తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇంతలో పరమేశం “పెళ్లి చూపులకు వాళ్లు ఈ ఆదివారమే వస్తామంటున్నారు. ఏమంటావ్”అని భార్యను అడిగాడు.

          “నేను అనడానికి ఏముంది. పెద్ద పిల్లది త్వరగా చేస్తేనేగా .. మిగిలిన ఇద్దరి పెళ్లిళ్లు చేయగలం” సావిత్రమ్మ సమాధానం విన్న స్థిర …

          “ఏంటీ అప్పుడే నాకు పెళ్లా … ఈ మధ్య అందరూ సెటిల్ అయ్యాక పెళ్లి చేసు కుంటున్నారు. నా చదువు పూర్తే కాలేదు. నేనిప్పుడే పెళ్లి చేసుకోను” అంది.

          “చూడమ్మా .. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. పైగా నీ తర్వాత చెల్లెళ్లు ఉన్నారుగా” నచ్చజెప్పినట్టు అంది తల్లి.

          “అమ్మా .. నేను మీకో విషయం చెప్పాలి. నేను .. నేను … “అంటూ మాటలు తడబడింది.

          “ఏంటే నసుగుతున్నావు. కొంపదీసి ప్రేమా గీమా” పరమేశం ఊగిపోయాడు.

          “మీరలా మండిపడితే ఎలా నాన్న. అవును నేనో అబ్బాయిని ప్రేమించాను.పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను” కాస్త ధైర్యంగానే చెప్పింది స్థిర.

          “ఈ ప్రేమా దోమా మనింటా వంటా లేవు. అందుకే ఉద్యోగం గట్రా వద్దు అని మొత్తు కున్నాను. ఆడపిల్లలు ఎవరి కాళ్లపై వారు నిలబడాలి చెత్తా చెదారం అనుకుంటూ నన్ను మాట్లాడనివ్వ లేదు. ఇప్పుడు చూడు ఏం చేసి తగలడిందో” పరమేశం తిడుతుంటే సావిత్రమ్మ ఏడుస్తూ కూర్చుండి పోయింది. స్థిరకు ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా లోపలికి వెళ్లిపోయింది.

***

          మరుసటి రోజు … స్థిర బస్టాపుకు చేరుకోగానే .. వెకిలి నవ్వులు నవ్వుతూ పోకిరి వెధవ .. బస్సు ఎక్కగానే మరో కామాంధుడు .. ఇక కోపాన్ని ఆపుకోలేక పోయింది .. వెంటనే అందరి ముందు వాడి చెంప చెళ్లుమనిపించింది. భయంతో వాడు రన్నింగ్ బస్సు దిగి పారిపోయాడు. ఎప్పటిలాగే అందరూ చూశారే తప్ప ఏమీ మాట్లాడలేదు … బస్సు తన పని తాను చేసుకుపోయింది. కాలేజీ వద్దకు చేరుకోగానే .. గేటు వద్ద ప్రణవ్ కారులో తన కోసం ఎదురుచూస్తున్నాడు.

          “ప్రణవ్ .. మా ఇంట్లో మన విషయం చెప్పేశాను. పెద్ద గొడవ జరిగింది. మనం పెళ్లి చేసుకుందాం” అంటూ కారులో ఎక్కగానే చెప్పడం మొదలుపెట్టింది.

          “ష్ ..“ అంటూ ప్రణవ్ ఆమెను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టబోయాడు.

          “నేను మాట్లాడుతున్నదేంటీ .. నువ్వు చేస్తున్న పనేంటీ” అంటూ ప్రణవ్‌ను దూరంగా జరిపేసింది.

          “ఏయ్ … పెళ్లేగా … చేసుకుందాం. ఈ సాయంత్రం మా గెస్ట్‌హౌస్ లో గ్రాండ్ పార్టీ ఉందని చెప్పానా .. అక్కడికి వెళదాం … నేనొచ్చి పిక్ అప్ చేసుకుంటాను. ఓకేనా. అన్నట్టు ఇదిగో ఈ పిచ్చి చుడీదార్లు చీరలుగట్రా వద్దు. మంచి సెక్సీ డ్రెస్సు వేసుకో .. చూడగానే పిచ్చెక్కిపోవాలి” అంటూ ప్రణవ్ మాట్లాడుతుంటే స్థిరకు ఏదో కొత్తగా అనిపించింది. కారు దిగిపోయింది.

          “ప్రణవ్ మంచోడేనా .. తనను ప్రేమిస్తున్నాడా లేక ప్రేమ పేరుతో మోసం చేయబోతున్నాడా. ఈ మధ్య వార్తల్లో ఇలాంటివి ఎన్ని చూడట్లేదు, చదవట్లేదు.. కానీ తన ప్రణవ్ అలాంటి వాడు కాదు .. ప్రేమ గుడ్డిదంటారు .. కానీ తాను అందరిలా ప్రేమలో మోసపోకూడదు. ప్రేమ పేరుతో తన శీలాన్ని వదులుకో కూడదు. ప్రణవ్‌ నిజ స్వరూపమేంటో తెలుసుకోవాలి అంటే తాను గెస్ట్‌ హౌస్కు వెళ్లాలి. కానీ పకడ్భందీ ఏర్పాట్లతో” స్థిర నిశ్చయించుకుంది.

          సాయంత్రం చిన్నగా వర్షం మొదలయ్యింది. ప్రణవ్ కారులో వచ్చాడు, అతని కారు వెనక సీట్లో మరో ఇద్దరు … అడిగితే మిత్రులని చెప్పాడు, అప్పటికే వాళ్లు మద్యంమత్తులో తూగుతున్నారు. స్థిర ముందు సీట్లో కూర్చోగానే .. ప్రణవ్ తెల్లటి పౌడరేదో తీసుకుని ఆస్వాదిస్తున్నాడు. అది డ్రగ్స్ అని అర్థమవ్వగానే .. తాను అక్కడి నుంచి తప్పించు కోవాలని అనుకుంది. వెంటనే హ్యాండ్‌ బ్యాగును బయట పారేసి .. పొరపాటున బ్యాగు పడిపోయిందని, తీసుకుంటానని చెప్పింది, కానీ ప్రణవ్ కారును ఆపలేదు. వెంటనే స్థిర తన చేతిలో ఉన్న పెప్పర్ స్ప్రేను వారిపై స్ప్రే చేసి కారు రన్నింగ్‌లోనే దిగిపోయింది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరిగెత్తింది .. అసలు ఇంటికి ఎలా చేరిందో … ఎప్పుడు చేరిందో తెలియదు. .. ఒళ్లంతా చెమట, చర్మం చీల్చుకుపోయి రక్తం .. భయంతో జ్వరమొచ్చేసింది.

          “ఏమైంది .. ఏమైంది” అమ్మ అడుగుతూనే ఉంది …“బస్సు నుంచి కింద పడ్డాను” అంటూ బాత్రూమ్లోకి పరిగెత్తిన స్థిర గుండె పగిలేలా ఏడ్చింది. కన్నీటితో నీళ్ల శబ్ధం పోటీ పడుతుండగా … రేపటి రోజు ప్రణవ్ మళ్లీ వస్తే అన్న అనుమానం భయపెట్టింది.బస్సులో పొద్దున తాను లాగిపెట్టి కొట్టిన వ్యక్తి రేపు మరికొందరు దుండగులతో కలసి వస్తే ఏం చేయాలి అన్న ఆలోచన గుబులు పుట్టించింది. ప్రేమాగీమా అన్నావ్ ఏమైంది అంటూ ఇంట్లో అడిగితే ఏం చెప్పాలి అన్న తలపు .. వెన్నులో దడ రెట్టింపు చేసింది. ఇక్కడే ఈ క్షణమే చనిపోతే బాగుండనిపించింది … ఈ సమస్యల నుంచి పారిపోతేచాలనిపించింది. కానీ ఎలా … “ఆత్మహత్య చేసుకుంటే” ఈ ఆలోచన రాగానే ఆ తర్వాత ఇంట్లో పరిస్థితులు గుర్తొచ్చి, పెళ్లి కావాల్సిన చెల్లెళ్లను దృష్టిలో పెట్టుకుని ..తన వల్ల ఎవ్వరూ బాధపడ కూడదని నిర్ణయించుకుంది. ఏదో కృత నిశ్చయంతో కన్నీళ్లను తుడుచుకుని బయటకు వచ్చింది.

***

          మర్నాడు … బస్టాపులో పోకిరీ జాడలేదు .. కాలేజీ ఎదుట ప్రణవ్ కారు లేదు … హమ్మయ్య అనుకుంటూ లోపలికి వెళ్లింది. కానీ సాయంత్రం రేడియో స్టేషన్‌లో ప్రణవ్ కలిశాడు. తనను బలవంతంగా కారులో ఎక్కించబోయాడు .. తాను కేకలు వేయడం .. సెక్యూరిటీ వచ్చి మందలించడం .. ప్రణవ్ వార్నింగ్ ఇస్తూ వెళ్లిపోవడం చకచకా జరిగిపోయాయి. ఏదైనా చేయాలి .. ఇలా ఎవరో వచ్చి తనను ప్రతీసారి కాపాడలేరు కదా అనుకుంది. షీ టీమ్స్‌కు ప్రణవ్ గురించి, బస్టాపులో పోకిరీల గురించి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఇంటికి వెళుతూ ఉండగా .. తన పెద్ద చెల్లి ఎవరిదో బైకు పై వెళుతూ కనిపించింది. మనసు కళుక్కుమంది. “ఎవరై ఉంటారు .. స్నేహితుడా .. తనకు చెబు తుందే .. అంటే తాను చేసిన పొరబాటే చెల్లి కూడా చేయబోతోందా .. భయం వేసింది” ఇంటికి వచ్చేసింది. అందరూ భోజనాలు చేశాక .. చెల్లిని పిలిచి “రేపు ఆదివారమేగా .. గుడికి వెళదాం” అంది.

        స్థిర, స్థిత కలసి గుడికి బయల్దేరారు. మార్గమధ్యలో స్థిర “ఎవరా అబ్బాయి” అంది.

          “అక్కా .. అదీ . అదీ .. నా ఫ్రెండ్ అన్నయ్య” అంది స్థిత.

          “నేను చేసిన తప్పు నువ్వు కూడా చేయకు” అంటూ ప్రణవ్ గురించి చెప్పింది. “చూడు చెల్లి. ప్రేమించడం నేరం కాదు, కానీ సరైన మనిషిని ప్రేమించాలి, లేకపోతే నాలాగా జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ప్రణవ్ మంచోడని నమ్మి .. ఇంట్లో మా విషయం చెప్పాను. ఇప్పుడేం చేయాలో తెలియట్లేదు. నువ్వు జాగ్రత్త. యుక్త వయసులో ఉన్నప్పుడు యువతులకు ప్రేమ ఓ మధురమైన అనుభూతి … కాదనను. కానీ ప్రేమే జీవితం కాదమ్మా. ముందు నువ్వు నీ కాళ్లపై నువ్వు నిలబడు. ఆ అబ్బాయి గురించి వివరాలు ఇవ్వు. వాకబు చేస్తాను” అంటూ చెప్పింది.

          “అక్కా .. అతను ఎవరో కాదు .. మన మేనబావ సుజయ్‌. చిన్నప్పటి నుంచి మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం. అయితే ఐదేళ్ల క్రితం మన రెండు కుటుంబాలకు జరిగిన గొడవల వల్ల మా పెళ్లిని చేసేందుకు ఎవ్వరూ ముందుకు రారని నాకు తెలుసు. అందుకే ఇలా రహస్యంగా కలుసుకుంటున్నాము” అని తలదించుకుని చెప్పింది.

          “అవునా .. పెద్దల మనస్పర్థల వల్ల పిల్లల జీవితాలు నాశనం అవ్వకూడదు. నేను అమ్మానాన్నలను ఒప్పించే ప్రయత్నం చేస్తాను” అంది స్థిర. ఇంతలో సుజయ్‌ బైకు వచ్చి వారి ముందు ఆగింది.

          “హాయ్ ఎలా ఉన్నారు” సుజయ్ మాటలకు స్థిర వెనక్కి తిరిగి చూసి

          “సుజయ్ .. మేము బాగున్నాం. ఇప్పుడే మీ గురించి చెబుతోంది. ఇంతకీ ఇప్పుడేం చేస్తున్నారు” అని అడిగింది.

          “నేను SI గా వచ్చేవారం జాబ్‌లో జాయిన్ కాబోతున్నాను. ఇక్కడే పోస్టింగ్” అని చెప్పాడు.

          స్థిర సంతోషానికి అవధులు లేవు … సుజయ్ వంటి అబ్బాయితో తన చెల్లికి పెళ్లి అంటే ఆనందంగా అనిపించింది. ముగ్గురూ కాఫీలు తాగి ఇళ్లకు బయల్దేరారు.

          “ఏంటీ మొన్న నచ్చిన అబ్బాయి ఇప్పుడు నచ్చట్లేదా .. ఏంటే ఇంత బరి తెగించావు” తండ్రి తిడుతూ ఉన్నా ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియలేదు స్థిరకు. ఇంతలో స్థిత బయటకు వచ్చి “నాన్న .. వాడో ఫ్రాడ్ .. డ్రగ్స్ తీసుకుంటాడట .. అలాంటి వాడిని పెళ్లి చేసుకునే బదులు .. ముందుగానే వదిలించుకోవడం మంచిది” ధైర్యంగా చెప్పింది.

          “ఓ అక్కాచెల్లెళ్లకు అన్నీ ముందే తెలుసా .. మేమే బయటి వాళ్లమన్నమాట .. నువ్వు చెప్పు తల్లీ నీవేమన్నా కథలు ఉంటే .. గుండె దిటవు చేసుకుంటాము” పరమేశం మాటలకు స్థిత “నాన్న .. నేను బావ ప్రేమించుకున్నాం .. మీరు సరేనంటే పెళ్లి చేసుకుంటాం” అని చెప్పింది.

          “ఈ కొంపలో ఏం చేసి చస్తున్నావే నువ్వు. ఆడపిల్లలను కని, రోడ్ల మీద ప్రేమించుకోమని వదిలేశావా. ఏదీ ఆ మూడోది .. దానికీ  ఎవరన్నా లవర్ ఉన్నాడేమో కనుక్కో  .. ముగ్గురిని గాలికి వదిలేసి .. ఉరేసుకుని చద్దాం” భార్యను తిడుతూ పరమేశం ఆవేశంతో ఊగిపోతున్నాడు.

          “ఏవండీ ఆవేశపడకండి. వాళ్లు మన ఆడపిల్లలండీ .. వాళ్లు తప్పు చేయరు. సమస్యలొస్తే వాళ్లే ధైర్యంగా ఎదుర్కొంటారు. ఒకవేళ ఏదన్నా పొరపాటు చేస్తే ఒప్పుకుంటారు .. మన ముందు ధైర్యంగా విషయం చెప్పారు. సంతోషించండి. ఎంత మంది వాళ్ల తల్లిదండ్రుల కళ్లుగప్పి .. ఇంట్లోంచి పారిపోవట్లేదు. జీవితాలు నాశనం చేసుకోవట్లేదు. స్థిర నువ్వు చేసిన పని మంచిదేనమ్మా. ఊబిలోకి దిగక ముందే గుర్తించావు. ధైర్యంగా సమస్యకు పరిష్కారం చూపించుకోగలిగావు” అంటూ గుండె పట్టుకుని కూలబడి పోయింది.

          “అమ్మా అమ్మా” అంటూ ముగ్గురు ఆడపిల్లలు తల్లిని పిలుస్తుండగానే ..“మీరంతా జాగ్రత్త. మీ భవిష్యత్తుకు మీరే సారథులు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని అనుకోవద్దు. మీ జీవితాలు మీరే చూసుకోవాలి .. మీ సమస్యలను మీరే పరిష్కరించుకోవాలి. ఆడపిల్లలు ఏమీ చేయలేము అనుకోకండి .. యువతులు తల్చుకుంటే ఏమన్నా చేయగలరు … ఏ కష్టాన్నైనా ఎదుర్కోగలరు” ధైర్యం చెబుతూ సావిత్రమ్మ కన్నుమూసింది.

***

          ముగ్గురు ఆడపిల్లలను ఎంతో మనోధైర్యంతో పెంచిన సావిత్రమ్మ చనిపోయి అప్పటికే నెలరోజులు గడచిపోయాయి. పరమేశం మందుకు బానిసై పోయాడు. ఇల్లు గడవడం కష్టమైపోయింది. స్థిర చదువు మానేసింది. తన ఇద్దరు చెల్లెళ్లను పోషించడం, చదివించడం తన బాధ్యతగా భావించింది. రేడియోజాకీ ఉద్యోగంతో పాటు ట్యూషన్లు చెప్పడం ప్రారంభించింది. ఓ రోజు రేడియోలో ప్రేమ గురించి ఒక కొత్త కార్యక్రమం ప్రారంభించాలని నిర్ణయించారు. అందరూ మీటింగ్‌లో తమ తమ అభిప్రాయాలు చెబుతున్నారు. ఇంతలో స్థిర “సర్ .. ప్రేమ గురించి కాదు, ప్రేమలో మోసపోయినవారు ఎలా మనోనిబ్బరంతో ముందుకు సాగాలో .. ఆత్మహత్య చేసుకోవడం, నాలుగు గోడల మధ్య మిగిలిపోవడం లాంటివి కాకుండా .. సమాజంలో తల ఎత్తుకుని బతికేలా ఏం చేయాలో .. ఆలోచించేలా సందేశాత్మక కార్యక్రమం చేస్తే .. ఎంతో మంది యువతులకు ఉపయోగపడుతుంది. ఆలోచించండి” అంది. ఈ ఐడియా నచ్చిన రేడియో వాళ్లు స్థిరకు ఆ ప్రోగ్రామ్ హెడ్‌గా అవకాశమిచ్చారు. దానికి స్ఫూర్తి అన్న పేరు పెట్టారు. తొలిరోజు స్ఫూర్తిప్రోగ్రామ్‌కు ఎవ్వరూ ఫోన్ చేయలేదు. అలా రెండుమూడు రోజులు స్థిర ప్రోగ్రామ్‌ డల్‌గా సాగింది. ఇలా లాభం లేదనుకున్న స్థిర తన కథనే చెప్పాలనుకుంది.

          “నేను ప్రేమలో మోసపోయాను. తెలిసీ తెలియని వయసులో ప్రేమలో పడ్డాను. చదువును, కెరీర్‌ను అశ్రద్ద చేశాను. జీవితాన్ని నాశనం చేసుకోబోతూ తృటిలో తప్పించు కున్నాను. కానీ నాలాగా మరే యువతి ప్రేమ పేరుతో మోసపోకూడదని ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. మీలో ఎందరో నాలాగా ఉండి ఉండొచ్చు. మీ సమస్యను మాతో పంచుకొండి. మీకు చేతనైన సాయాన్ని చేస్తాం. నేను షీ టీమ్స్‌ సాయంతో కామాంధుల చేతి నుంచి బయటపడ్డాను. నాకు తెలుసు ప్రేమలో మోసపోతే ఇంట్లో వారి చూపులు, సమాజపు చులకన మాటలు ఎలా ఉంటాయో .. “ అంటూ ఇక మాట్లాడలేక మౌనంగా ఉండి పోయింది. అంతే వరుసగా ఫోన్లు రావడం మొదలయ్యాయి. ఎంతో మంది ప్రేమ బాధితులు ఫోన్లు చేయసాగారు. తాము ఎలా మోసపోయింది .. బలవంతంగా తమతో అబార్షన్లు చేయించింది .. ఇలా చెప్పసాగారు.

          ఇంతలో సుజయ్‌ అక్కడికి రావడం స్థిర గమనించింది.

          “ఈ కార్యక్రమం ద్వారా మేము కూడా అలాంటి దొంగ ప్రేమికుల భరతం పట్టాలను కుంటున్నాం” అని సుజయ్ అనగానే స్థిర సంతోషపడింది. అక్కడే ఒక లేడీ కానిస్టేబుల్‌ ను పెట్టి ఆ బాధితులు చెబుతున్న వివరాలు తీసుకొమ్మని పురమాయించి సుజయ్ వెళ్లి పోయాడు. అలా తక్కువ కాలంలోనే స్ఫూర్తి ప్రోగ్రామ్ సూపర్ హిట్ అయ్యింది. షీ టీమ్స్ కూడా బాధితులకు సాయం చేస్తుండడంతో .. రోడ్డు సైడు పోకిరీలు, బస్సులు, మెట్రోళ్లో కామపిశాచుల సంఖ్య తగ్గింది. సుజయ్ తన టీమ్‌తో బాధితులు చెప్పిన గెస్ట్ హౌస్లు, ఫామ్‌ హౌస్ ల్లో ఆకస్మిక దాడులు చేయడంతో .. ఎంతో మంది కామాంధులు, మోసగాళ్లు జైలు కెళ్లారు. స్థిర మనసు స్థిమితపడింది.

          పరమేశంకి కూడా సుజయ్‌ తనదైన స్టైల్లో కోటింగ్ ఇవ్వడంతో … తాగుడు మానేసి.. ఇంటిపట్టున ఉంటూ … వంట, ఇంటి పని చేయడంలో కూతుళ్లకు సాయంగా ఉండసాగాడు. ఓ రోజు స్థిర తండ్రితో కలసి సుజయ్ ఇంటికి వెళ్లి వాళ్లను క్షమించమని అడిగి పెళ్లి సంబంధం కుదుర్చుకుని వచ్చింది. కానీ స్థిర పెళ్లి కాకుండా తాము పెళ్లి చేసుకునేది లేదని స్థిత, సుజయ్ తేల్చిచెప్పేశారు.

          స్థిర మాత్రం తన జీవితాన్ని యువతుల కోసం వారి సమస్యలు పరిష్కరించడం కోసమే కేటాయించాలనుకుంది. ‘నెచ్చలి’ పేరుతో ఒక ఆర్గనైజేషన్‌ను ప్రారంభించింది. అక్కడ ప్రేమ పేరుతో మోసపోయిన యువతులు, ఇంట్లోంచి గెంటివేయబడ్డ యువతులను అక్కున చేర్చుకుని … వారికి మానసిక స్థైర్యాన్ని ఇవ్వడంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడం చేయసాగింది. బాధితుల పేర్లు బయటకు రాకుండా .. మోసగాళ్ల భరతం పడుతుండడంతో స్థిరతో NGOలు చేతులు కలిపాయి. తక్కువ కాలంలోనే స్థిర తాను అనుకున్న గమ్యాన్ని చేరుకుంది. తల్లి నేర్పిన మనోధైర్యాన్ని అందరికీ పంచుతూ …  తల్చుకుంటే సాధించలేనిది ఏదీ లేదని రుజువు చేసింది. ఆత్మహత్యలు, యాసిడ్ దాడులు దాదాపుగా తగ్గిపోయాయి. ఎలాగోలా ఒప్పించి స్థితకు, సుజయ్‌కు ఓ శుభ ముహూర్తాన పెళ్లి జరిపించింది. చిన్న చెల్లెలిని పై చదువులకోసం విదేశాలకు పంపింది.

          ‘ప్రభావిత మహిళగా’ అవార్డు అందుకోబోతూ కారులో వెళుతున్న స్థిరకు ఇలా తన గతమంతా కళ్లముందు మెదిలింది. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కారు ఆగడం .. అప్పుడే తన కారు విండోను ఎవరో కొడుతున్నట్టు వినిపించింది. ఎవరా అని చూస్తే .. ప్రణవ్ … మాసిన గడ్డంతో .. చినిగిన చొక్కాతో అడుక్కుంటున్నాడు. వెంటనే సిగ్నల్స్ పడడం .. స్థిర కారు ముందుకు దూసుకెళ్లడం చకచకా జరిగిపోయాయి.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.