ప్రమద

సింధుతాయ్ సప్కాల్

-నీలిమ వంకాయల

రైళ్లలో బిచ్చమెత్తిన ఆమె.. అభాగ్యులకు అమ్మయింది!

         సింధుతాయ్ సప్కాల్ 1948 నవంబరు 14న మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో జన్మించారు. ఆమె నాలుగో తరగతి చదివారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాలేకపోవడంతో సింధుతాయిని పదో ఏటే స్కూలు మాన్పించేసి, పెళ్లి చేసి పంపించేశాడు ఆమె తండ్రి. తన కన్నా ఇరవై ఏళ్లు పెద్దవాడైన భర్త ఆమెకు నరకం చూపించాడు. రోజూ గొడ్డును బాదినట్లు బాదేవాడు. తన బాధ చెప్పుకోవడానికి కూడా వాళ్లు ఉన్న అటవీ ప్రాంతంలో చుట్టూ ఎవరూ ఉండేవాళ్లు కాదు.  ఇరవయ్యో ఏట తొమ్మిది నెలల గర్భిణిగా ఉన్న సమయంలో ఆమెకు ఆ ఊరి సర్పంచ్ తో అక్రమ సంబంధం ఉన్నదని అనుమానించి  సింధుతాయిని ఇంట్లో నించి బయటికి వెళ్లగొట్టాడు భర్త. కడుపులో బిడ్డ ఉందన్న కనికరం కూడా చూపించలేదు.

         పశువుల పాకలో అమ్మాయిని ప్రసవించిన సింధుకు, బిడ్డ బొడ్డుతాడును ఓ మొన తేలిన రాయితో కోసుకోవలసిన దుస్థితి తలెత్తింది. అలాంటి పరిస్థితుల్లో బిడ్డను తీసుకుని పది కిలోమీటర్లు నడుచుకుంటూ పుట్టింటికి వెళ్లింది. కానీ వాళ్లు ఆమెకు ఆశ్రయమివ్వ లేదు. దీంతో తనకిక చావే శరణ్యమనుకుంది. కానీ పండంటి బిడ్డను చూసి మనసు మార్చుకుంది.

         పుణెకు చేరుకుని రైల్వేస్టేషన్లలో, బస్టాండ్లలో యాచన చేసి బిడ్డను పోషించింది సింధుతాయి. రోడ్డుమీద ఆలనా పాలనా లేని పసిబిడ్డల్ని చూసినప్పుడల్లా, ఆమె గుండె తరుక్కుపోయేది. వాళ్ల కోసం ఏదైనా చేయాలనుకుంది. అప్పటి నుంచి ఆమె అనాథలు, తల్లిదండ్రులు విడిచిపెట్టిన పిల్లలను దత్తత తీసుకోవడం ప్రారంభించారు. పిల్లల్ని చేరదీసి వాళ్ల కోసం తాను భిక్షం ఎత్తి, అందరినీ పోషించడం మొదలుపెట్టింది.

         కొన్నాళ్ల తర్వాత ఈ పిల్లల్ని తీసుకుని వివిధ సేవాసంస్థల్ని కలవడం మొదలు పెట్టింది. సింధు నిజాయితీని, ఆమె సేవాదృక్పథాన్ని గుర్తించి, ఆమెకు సాయం చేయడానికి కొన్ని సంస్థలు ముందుకొచ్చాయి. వాటి సహకారంతో అనాథ పిల్లల కోసం ఓ ఇల్లు కట్టించింది. రోడ్డుమీద కనిపించే అనాథ పిల్లలు మరింత మందిని చేరదీసింది. పోనుపోను పూణె నగరంలో సింధుతాయి ఫలానా అని అందరికీ తెలిసొచ్చింది. ఆర్థిక సహకారం మరింతగా పెరిగింది. సన్మతి బాలనికేతన్ సంస్థ పేరుతో ఓ అనాథాశ్రమాన్ని పుణేలోని హడప్సర్ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. వెయ్యి మందికి పైగా బాలలను ఆమె దత్తత తీసుకున్నారు. ఇప్పుడు పూణెలో ఎక్కడ అనాథ పిల్లాడు కనిపించినా, సింధు తాయి దగ్గరికి చేర్చడం ఓ అలవాటుగా మారిపోయింది. తన జీవితం మొత్తం వెనుకబడిన వర్గాల వారి కోసం ఎంతో సేవ చేశారు.

         విశేషం ఏమిటంటే సింధుతాయి అండ కోసం వచ్చిన అనాథల్లో ఆమె భర్త కూడా
ఉన్నాడు! అతణ్ని కూడా మన్నించి తన అనాథ శరణాలయంలోనే చోటిచ్చింది. తాను
చేరదీసిన పిల్లల్లో కొందరు డాక్టర్లయ్యారు. ఇంజనీర్లయ్యారు. మరికొందరు వేరే ఉన్నత చదువులు చదివారు.

         మొత్తంగా సింధుతాయి ఆధ్వర్యంలో ఆరు ట్రస్టులు నడుస్తున్నాయి. రోజూ వివిధ కంపెనీలకు, కార్యాలయాలకు వెళ్లడం, సభలు, సమావేశాల్లో పాల్గొనడం, అనాథల కోసం విరాళాలు సేకరించడం, వారి కడుపు నింపడం, విద్యాబుద్ధులు చెప్పించడం… ఇదీ సింధుతాయి దినచర్య. తన జీవితం మొత్తం వెనుకబడిన వర్గాల వారి కోసం ఎంతో సేవ చేశారు.

         ఆమె చేసిన సామాజిక సేవకు గుర్తింపుగా ఆమెకు దాదాపు 750కి పైగా పురస్కారాలు
లభించాయి. ఆమెను భారత ప్రభుత్వం 2021లో ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించింది. మహారాష్ట్ర ప్రభుత్వం 2020లో ఆమెను అహల్యాబాయ్ హోల్కర్ పురస్కారంతో సత్కరించింది. అవార్డు తీసుకున్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సుసంపన్నమైన మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ అవసరమున్న ప్రతివ్యక్తికి సాయపడుతూ తమ దేశ భక్తిని చాటాలని పిలుపునిచ్చారు. నేను ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా నని గుర్తు చేసుకున్నారు. సింధు మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అహల్యాబాయి హల్కర్‌ అవార్డుతో పాటు ఎన్నో అవార్డులు అందుకున్నారు.

         సింధుతాయి సప్కాల్‌ను మీకెందరు పిల్లలు అని అడిగితే 1,500 మంది పైనే అని
చెబుతుంది. మీ కుటుంబం గురించి చెప్పమంటే… 207 మంది అల్లుళ్లు, 36 మంది
కోడళ్లు, 1000 మంది మనవళ్లు, మనవరాళ్లు అని అంటుంది. ఆమెకు, వాళ్లకు రక్త సంబంధం లేదు కానీ, వాళ్లకు అన్నీ ఆమే. రోడ్డుమీద అనాథ కనిపించినా, ఎక్కడైనా అనాథ చిన్నారులున్నారన్నా తీసుకొచ్చి తన ఆధ్వర్యంలో నడుస్తున్న అనాథాశ్రమాల్లో చేర్పించి, వాళ్ల ఆలనా పాలనా చూస్తారు సింధుతాయి.

        సింధుతాయ్ కు చివరికి రాష్ట్రపతి అవార్డు కూడా వరించింది. భవిష్యత్తులో
మరిన్ని భవనాలు నిర్మించి, మరింత మంది పిల్లల్ని చేరదీయాలని ఆమె ఆలోచన చేసేది. సింధు సొంత కూతురు కూడా ఓ అనాథ శరణాలయాన్ని నిర్వహిస్తుండటం విశేషం.

అనాథల అమ్మగా పేరొందిన సింధు జీవితం పై మరాఠీలో ‘మీ సింధుతాయి సప్కాల్’ పేరుతో

ఓ సినిమా కూడా తీశారు. దానికి జాతీయ అవార్డు వచ్చింది. ఇంత మంది అనాథల్ని ఆదుకునే శక్తిని తనకు ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు చెబుతుంది సింధు.

         చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడి సింధుతాయి 4 జనవరి 2022 న తుది శ్వాస
విడిచారు. సింధుతాయి మృతి పట్ల ప్రధాని మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆమె
సమాజానికి విశిష్ట సేవలు అందించారని, ఆమెను ఎల్లప్పుడూ అందరూ గుర్తుంచు కుంటారని పేర్కొన్నారు. ఆమె కృషి వల్ల అనేక మంది బాలలు మెరుగైన జీవితాన్ని గడపగలుగుతున్నారని పేర్కొన్నారు.

*****

Please follow and like us:

One thought on “ప్రమద – సింధుతాయి సప్కాల్”

  1. సింధు తాయి గురించి నేను ఇంతకు ముందే చదివాను కళ్ళు చెమిర్చాయి.. ఎంత గొప్ప హృదయం అని పదే పదే అనుకున్నాను. ఇప్పుడు నీలిమ గారు రాసింది చదివాక ఇటువంటి మహా మనీషిని గురించి రాసి నలుగురికీ ఆమె సేవా సుగుణం తెలిసేలా అందరికీ పరిచయం చేయడం మంచి పని అనిపించింది .ఆమెకు రాష్ట్రపతి అవార్డు వచ్చింది . అది ఆమె కృషికి దక్కిన గౌరవం . సింధు తాయి జీవితం పాఠ్యపుస్తకాలలో చేర్చాలి . పిల్లలలో ఆపద లో ఉన్నవారిని ఆదుకునే గుణం అలవరుచుకోవాలి అని తెలియజేయడానికి సింధుతాయి జీవితాన్ని పిల్లలమనసుల్లో ముద్ర వేసుకునేలా ఈ రచన ఉందని భావిస్తూ నీలిమ గారికి అభినందనలు

Leave a Reply

Your email address will not be published.