ఎగిరే పావురమా

(నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)

– మధుపత్ర శైలజ ఉప్పలూరి

         “మేడం! నాకు చాలా భయంగా ఉంది. మా అమ్మావాళ్ళ దగ్గరకు పంపె య్యరూ! మా ఊరెళ్ళాక ఏవో చిన్నచిన్న పనులను చేసుకుంటూ బ్రతికేస్తాను. అమ్మో ఇన్నిసమస్యలు, బాధలు చుట్టుముడతాయని తెలిసుంటే అస్సలు చదువుకునేదాన్నే కాదు.

         “మన గిరిజన కుటుంబాలలో తిని తినక, పొరుగూరి హాస్టళ్ళలో ఉండి డిగ్రీదాకా కష్టపడి చదివావు. ఇక మంచి కొలువులో చేరి తల్లిదండ్రులకు ఆసరాగా ఉండమ్మా” అని పెద్దలంతా దీవించారు.

         నమ్మించి మోసంచేసాడా దొంగవెధవ” అని వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తూ తనని ఇలా వదిలేసి పారిపోయిన మోసగాణ్ణి తిడుతూ, మాలాసిన్హాకు జరిగిన సంఘటనను కాస్త ఇంగ్లీషు, హింది కలగలసిన తెలుగులో చెపుతోంది కస్తూరి. 

         “ప్లీజ్! ఇంకాఏడుపు ఆపు. ఏమయ్యిందిప్పుడు?నీవు ధైర్యంగా ఉండాల్సిన సమయ మిది. అదృష్టవశాత్తు నా కంటపడ్డావు. నాతోడ బుట్టిన దానిలా చూసు కుంటాను. నీ కలలు, నీ పెద్దల ఆలోచనలు సఫలీకృతం అయ్యేలా నేను ప్రయత్నిస్తాను. లోకంలో అంతా ఆ సుందర్‌లా మాయగాళ్ళు, మోసగాళ్ళే ఉండరు. నీవు మాత్రం నేను చెప్పినట్లుగా చెయ్యాలి తెలిసిందా! అప్పుడే ఈ “మాలా” లాంటి మంచి అక్కయ్యలుంటారని నీవు తెలుసుకో గలుగుతావు. ముందు భోజనం చెయ్యి” అంటూ కస్తూరిని ఓదార్స్తూ అన్నం వడ్డించింది మాలాసిన్హా.

         అన్నంతిని మేనువాల్చిన కస్తూరికి, ఉదయం ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన సంఘటన గుర్తుకొచ్చి ఒక్కసారిగా ఒళ్ళు జలదరించింది. ఆ సమయానికి మాలాసిన్హా కాపాడక పోయుంటే నా పరిస్థితి ఏమయ్యుండేదో?

         సుందర్అనే ఏజెంట్ తన తల్లిదండ్రులను, ఊరిపెద్దలను కలసి, దుబాయిలో పెద్ద ఉద్యోగం కుదిర్చానని వారిని నమ్మించి, తనను బొంబాయికి తీసుకొచ్చాడు.

         గిరిజన కుటుంబం నుండి వచ్చిన కస్తూరి డిగ్రీ పాసయ్యింది గానీ ఇంకా లోకజ్ఞాన మబ్బలేదు. డిగ్రీ అవ్వగానే ప్రభుత్వ ఉద్యోగం వచ్చేస్తుందని అను కుంటూ తనకు తెలిసిన ప్రభుత్వ ఉద్యోగులనందరిని జాబ్ కొరకు అడిగింది.

         “పెద్ద పెద్దవారి సిఫార్సులైనా ఉండాలి లేదా పెద్ద మొత్తంలో లంచాల నైనా ఇవ్వాలి. ఆ రెండూలేని పి.జి. చేసిన వారికే ఉద్యోగాలురాక ఆటోలను నడిపే దేశంలో ఉన్నా మమ్మా! కేవలం నీవు చదివిన డిగ్రీతో జాబెలా వస్తుంది అనుకుంటున్నావు?.

         మీ కులం వాళ్ళలాగా చేతి పనులను నేర్చుకుని ఏదోపని పాటను చేసు కుంటూ కొద్దోగొప్పో సంపాదించుకోక నువ్వెందుకమ్మా ప్రభుత్వ ఉద్యోగాలకై వెంపర్లాడటం?రిజర్వేషన్కోటాలో ఉద్యోగం రావాలంటే, నీ వయస్సు కూడా చాలా తక్కువ. నీ ముందు న్న వారికే అతీగతీ లేదు. ఇక నీకు వచ్చిన మార్కు లంటావా?, నాలిక గీసుకోవటానికికూడా ఆ కాగితం పనికిరాదు” అంటూ తన ఉత్సాహం పై నీళ్ళు జల్లారు.

         అలాంటి నిరాశలో సుందర్ పరిచయమై, “దుబాయిలో కేర్‌టేకర్లుగా పనిచేస్తే పెద్ద మొత్తాలలో జీతాలనిస్తారు” అని నమ్మబలికాడు. “మీ అమ్మాయి తెలివైనదని, డిగ్రీ కూడా చదివింది కాబట్టి, అక్కడి పరిస్థితులకు త్వరగా అలవాటు పడి మంచి పొజీషన్‌లోకి వస్తుంది” అని అమ్మానాన్నలకు ఆశలను రేకెత్తించాడు. దాంతో తన తండ్రి ఎంతో కష్టపడి అప్పుచేసి మరీ సుందర్ అడిగిన సొమ్ము చెల్లించి తనను సుందర్‌ తో పంపించాడు.

         నిన్న సుందర్‌తో వచ్చేటప్పుడు సూట్‌కేస్‌లో తన బట్టలతో పాటుగా సర్టిఫికెట్స్, ఆధార్కార్డ్, కొంత డబ్బు సర్దుకొని, “తాను నేర్చుకున్న విద్య తనకు ఉపాధిని చూపించ లేక పోయినందుకు అందుకు బాధ్యులైన ప్రభుత్వాలను తిట్టుకుంటూ, ఆడ పిల్లలకు అన్నింటా ప్రత్యేకావకాశాలని చెపుతూ ఆశలను కల్పించినవారు నాకు మొండిచెయ్యి చూపించారు. నా మాదిరిగా ఉపాధి కొరకై విదేశాలకు వెడుతున్న వారెందరో”అనుకుంటూ బాధపడుతూ బొంబాయి జేరింది కస్తూరి..

         హోటల్ గదికి వచ్చిన తరువాత నీకు జతగా ఇంకో ఇద్దరమ్మాయిలు వస్తారని, ముగ్గురూ కలసి దుబాయ్‌కు వెళ్ళవచ్చని నమ్మకంగా చెప్పాడు సుందర్. విధిలేని స్థితిలో అతనితో బయలుదేరిన తనకు, అతని మాటలను నమ్మక తప్పని పరిస్థితి అది.

         తెల్లవారుఝామునే, “తొందరగా మంచి బట్టలు వేసుకుని తయారుగా ఉండు. నేను వెళ్ళి మిగిలిన ఏర్పాట్లను చేసుకుని వస్తాను”అంటూ హడావిడిగా వెళ్ళాడు సుందర్.

         ఓ గంటలో అతనితో కలసి ఎయిర్‌పోర్ట్‌కు వచ్చింది. “నువ్విక్కడే ఉండు, నేను నా స్నేహితునితో మాట్లాడి వస్తాను” అని పక్కకు వెళ్ళాడు సుందర్.

         అతను చెప్పిన మిగిలిన ఇద్దరు అమ్మాయిలు కనిపించక పోవటం,అతని లోని కంగారు చూసిన తనకు అనుమానమొచ్చింది.

         తాను వెళ్ళేసరికి, అటు తిరిగి మాట్లాడుతున్న సుందర్, “నేను పంపే అమ్మాయి పేరు కస్తూరి. అందంగా ఉంటుంది. ఎవరి దిక్కూలేని అమ్మాయి. ఆమె, అమ్మా వాళ్ళు మంచి ఉద్యోగంలో ఉందనుకుంటారు. దుబాయిలో ఉద్యోగానికని చెప్పి విమానం ఎక్కిస్తు న్నాను. నా బ్యాంక్ఎకౌంట్నెంబర్ మెసేజ్ పెడతాను. మనం అనుకున్న మిగిలిన 10 లక్ష లను ఆ ఎకౌంట్‌లో వెయ్యండి. మీరు పంపిన డబ్బు అందగానే నేను మరో ఊరు వెళ్ళి పోతాను. వాళ్ళ వారికెవరికి కనిపించను. ఎవరికి అనుమానం రాదు. ఈమె అక్కడకు చేరగానే వీసా, పాస్‌ పోర్టు మీరు తీసేసుకుంటే, పిట్ట ఎక్కడికి పోలేదు” అంటూ నవ్వుతూ చెపుతున్నాడు.

         అతని నవ్వు వెనుకనున్న విషపుటాలోచన విన్నతాను, వేటగాడిఉచ్చులో పడిన జింకపిల్లలా వణికి పోయింది.  అక్కడే నాలోని అంతరాత్మ సరయిన నిర్ణయాన్ని సూచించింది. ముందు అతని ఉచ్చులో నుండి బయటపడాలని నలువైపులా చూసాను. ముందు సుందర్ కంటిలో పడకుండా ఎక్కడైనా దాక్కో వాలని, సూట్‌కేస్తీసుకుని గబగబా వాష్‌రూంలోకి కనురెప్ప పాటులో జేరి పోయాను.

         ఒక్కసారిగా నా పరిస్థితికి నాకే దుఃఖం పొంగుకొచ్చింది. బయటకేడిస్తే ఎవరికైనా అనుమానమొస్తుందని మనసులోనే అణచి పెట్టుకున్నాను. కళ్ళు, ముఖం ఎర్రబడ్డాయి. ఒక రెండు గంటలపాటు అలా ఆ బాత్‌రూంలో ఉండి పోయాను.

         అప్పుడొచ్చిన ఈ ‘మాలాసిన్హా’, “ఎవరు మీరు?ఎందుకు సూట్‌కేస్‌తోపాటు ఇక్కడున్నారు? మీ ముఖంలో దిగులు, బాధా కనిపిస్తున్నాయి, నేనేమయినా సహాయ పడగలనా?” అని హిందీలో ప్రశ్నించింది.

         “ఆపదలో ఉన్న వారికి ఆ దేవదేవుడు ఏదో విధంగా సాయమందిస్తాడు” అన్నసూక్తి నాపట్ల నిజమయ్యిందనిపించింది కస్తూరికి, ఆమె మాటలను వినగానే.

         తాను ఉద్యోగంలో చేరేటప్పుడు పొందిన శిక్షణలో, “విమానాలలో ప్రయాణించే వారికి సాయపడటమే కాదు, అమాయకులకు, అసహాయులకు, వికలాంగులకు ఎయిర్‌ పోర్ట్‌ లాంజ్‌లో కూడా అండగా ఉండాలన్నది ఎయిర్‌ హోస్టెస్‌ల ప్రాధమికమైన బాధ్యతగా చెప్పారు. ఇప్పటివరకు చాలా సందర్భా లలో విమానంలో తనతోపాటుగా ప్రయాణించిన పాసెంజర్‌లకు తనకు చేత నైన సాయమందించిన మాలాసిన్హాకు కస్తూరి పరిస్థితి కాస్త చిత్రంగా అని పించింది.

         తనకు వచ్చిన నాలుగు ఇంగ్లీష్, హిందీ మాటలలో పరిస్థితిని వివరించ గానే మాలాసిన్హా, “కంగారుపడకు. ముందు ఇక్కడ నుండి బయటపడే దారి వెదుకుదాం. నాకు నీలాంటి ఆడపిల్లలు దుబాయి నుండి వచ్చే విమానాలలో కనిపిస్తారు. ఎవరి వల్లనో మోసపోయి జీవశ్చవాల మాదిరి తిరిగి వస్తూంటారు. కానీ నీ పరిస్థితి వేరు. నిన్నుఈ రూపంలో అయితే ఆ దుర్మార్గుడు వెంటనే గుర్తిస్తాడు. అందుకే నా డ్రస్ వేసుకో” అంటూ ఓ అరగంటలో నన్ను ఓ ఎయిర్‌ హోస్టెస్‌గా తీర్చిదిద్దింది. సూట్‌కేస్‌లోని ముఖ్యమైన కాగితాలను తనబ్యాగు లో భద్రపరచి, నా సూట్‌కేస్‌ను అక్కడే ఉన్న ఓ స్వీపర్‌కు ఇచ్చి తన గదికి తీసుకురమ్మని చెప్పింది.

         కళ్ళకు నల్లని గాగుల్స్ పెట్టుకుని, మాలాసిన్హా దుస్తులలో, కాళ్ళకు ఆమె బూట్స్ వేసుకుని ఉన్న కస్తూరి, తనను తాను అద్దంలో చూసుకుని ఒక్కింత ఆశ్చర్యానికి లోనయ్యింది. ఇప్పుడు తనను పుట్టించిన ఆ బ్రహ్మదేముడుకూడా గుర్తించాలంటే ఇబ్బంది పడతాడు అనిపించింది కస్తూరికి. మాలాసిన్హా తన ప్లాన్‌ను కస్తూరికి వివరించింది.

         ఇద్దరు కలసి బయటకు వచ్చారు. చలువ కళ్ళద్దాల నుండి సుందర్ తన కోసం వెతుకుతున్నాడా?అని పరికించి చూసింది కస్తూరి. మాలాసిన్హాతో కలసి ధైర్యంగా నడుస్తోంది. మాలాసిన్హా నెమ్మదిగా “కనిపించాడా?” అని అడిగింది.

         “అదిగో కుడివైపు నిల్చున్నవాడే సుందర్” అని చెప్పింది కస్తూరి.

         వెంటనే మాలాసిన్హా ఫోనులో “అంబులెన్స్రెడీగా ఉందా?స్ట్రెచ్చర్ త్వరగా పంపించండి. ఇక్కడ ఓ అమ్మాయి పోయిజన్తీసు కుంది. పరిస్థితి విషమంగా ఉంది” అంటూ సుందర్‌కు వినిపించేలా గట్టిగా అంది మాలాసిన్హా.

         కస్తూరి కోసం వెతికివేసారిన సుందర్ ఆమె మాటలను వింటూనే మాలాసిన్హా దగ్గరకు వచ్చి “ఎవరా అమ్మాయి? ఎక్కడుంది? పేరేమైనా చెప్పిందా?” అంటూ వివరాలను అడిగాడు.

         “ఆమెపేరు కస్తూరట. దుబాయికు తీసుకెడుతున్నానని చెప్పిన ఏజెంట్ ఎవరో, ఆమెను ఎవరికో అమ్మేసినట్లుగా పసిగట్టి నా కళ్ళ ముందే విషం మింగే సింది. లేడీస్ బాత్‌రూంలో పడుంది. అతి కష్టం పై ఈ సమాచారం మాత్రం ఇచ్చి స్పృహ కోల్పోయింది. ఆమె మీకు తెలుసునా?” అని అడిగింది మాలా సిన్హా సుందర్‌ను.

         “నో మేడం, జస్ట్ ఫార్మల్‌గా అడిగానంతే” అంటూ, ఇంకా అక్కడే ఉంటే పోలీసులతో ఇబ్బందని తలచిన సుందర్ తోకముడిచి ఎవరో తరుముకొస్తున్న ట్లుగా వెళ్ళి పోయాడు.

         బయటకొచ్చి టాక్సీలో మాలాసిన్హా ఇంటికి చేరారిద్దరు. వచ్చిన దగ్గర నుండి“ చదువు నన్ను అథఃపాతాళానికి తోసేసింది” అంటూ ఏడుస్తూనే ఉంది కస్తూరి.

         “నేను బొంబాయిలో ఒక్కదాన్నే ఉంటున్నాను. నాకు చెల్లెలు లేని లోటును తీర్చు. నిన్ను నా అంత దానిని చేస్తాను. నీవేమి భయపడకు. నీవు ఆత్మవిశ్వాసం, ధైర్యం అనే రెండు రెక్కలను పెట్టుకుంటే, నేను నిన్ను నీలి గగనాన ఎగిరే తెల్లని విహంగలా మారుస్తాను” అంటూ ధైర్యం చెప్పి ఓదార్చింది మాలాసిన్హా.

         “నేనూ మీలాగా ఎయిర్‌ హోస్టెస్ అవ్వగలనా?” అంటూ ఆశ్చర్యపడుతూ అడిగింది కస్తూరి.

         “ఔనమ్మా! తప్పే ముంది ఇందులో. మంచి జీతమొచ్చే ఉద్యోగమే కాక, పదిమందికి మనం సహాయం చేయ గలుగుతాం. నీకు చక్కని వర్చస్సు, అందం ఉంది. ఇక్కడ ఇనిస్టిట్యూట్‌లో చేరి కమ్యూనికేషన్స్కిల్స్, ఇంగ్లీష్ భాషమీద పట్టు, మంచి ఉచ్చారణ నేర్చుకుందువుగాని. తొందరలో నోటిఫి కేషన్ పడుతుంది. నా సలహాలతో దానికి ప్రిపేరవ్వుదువు గాని. పరీక్షలో ఉత్తీర్ణతను సాధిస్తే ట్రైనింగ్ ఇస్తారు. ఆ తరువాత ప్రభుత్వ, ప్రయివేట్ విమాన యాన సంస్థలలో ఎక్కడైనా నీకు ఉద్యోగం దొరుకుతుంది. నీ తెలివి, సహనం, ఓర్పు, పట్టుదలల పైనే నీ భవిష్యత్ ఆధారపడి వుంది. నీకున్న ఈ సమస్యలు దూది పింజల వలే ఎగిరిపోతాయి” అంటూ కస్తూరిని ఒప్పించింది.

         తాను తెచ్చుకున్న డబ్బు అయిపోయేలోగా ఓ చిన్న ఉద్యోగంలో జేరింది కస్తూరి. మాలాసిన్హా ప్రోత్సాహంతో ఒక సంవత్సరం గడిచేటప్పటికి ‘ఇండిగో’ సంస్థలో ఎయిర్‌హోస్టెస్‌గా ఉద్యోగం సంపాదించి “ప్రయాణీకులందరికి స్వాగతం” పలుకుతూ ఎంతో ఉత్సాహంగా కొత్త జీవితాన్ని ప్రారంభించింది కస్తూరి.

         తొలి రోజు అనుభవాన్ని గుర్తుగా డైరీలో రాసుకుంది. మొదటి నెల జీతం తెచ్చి మాలాసిన్హా చేతిలో పెడుతూ “అక్కా! ఇది ఈ చెల్లి నీకిచ్చే గురుదక్షిణ” అంటూ కాళ్ళకు నమస్కారం చేయబోయింది కస్తూరి.

         మధ్యలోనే కస్తూరిని ఆపుతూ, కౌగిలిలోకి తీసుకుని ఆ దేముడిచ్చిన ఈ చెల్లి నాకు గురుదక్షిణ ఇవ్వట మేమిటి? నువ్వు సాధించిన ఉద్యోగానికి మించిన బహుమతి నాకు ఏమి ఉంటుంది” అంటూ ఆమె బుగ్గ పై ముద్దు పెట్టుకుంది మాలాసిన్హా. కాలచక్రం పరిగెడుతూనే వుంది.

         “అక్కా!నీకో విషయం చెప్పాలని ఎంతో తహ తహలాడు తున్నాను. నీవిప్పుడు ఖాళీగానే ఉన్నావా? చెప్తాను” అంది కస్తూరి ఓ శెలవురోజు ఉదయమే.

         “మంచి హుషారుగా ఉన్నావు. ఏమిటి కథ? లవ్‌లో గానీ పడ్డావా?” అంటూ కళ్ళెగరేస్తూ అడిగింది మాలాసిన్హా.

         “ఛ! పోఅక్కా! లవ్లేదు గివ్లేదు. నా ఉద్యోగ నిర్వహణలో నేను పొందిన మధురమైన అనుభూతి అది” అంటూ “నెలరోజుల క్రిందట నేను శ్రీనగర్డ్యూటీ పై వెళ్ళాను కదా!ఆ రోజు విమానంలో ఉన్న ఓ పెద్దాయనకు హఠాత్తుగా గుండె ల్లో నెప్పి వచ్చి విలవిల లాడిపోయాడు. శ్రీనగర్‌లో ప్లైట్ ‘లాండ్’ అవ్వటానికి ఇంకా  20నిముషాల పైనే పట్టేలా ఉంది.

         నాకు మన శిక్షణలో నేర్పిన, ఎవరైనా ప్రయాణీకునికి ఇలాంటి అత్యవసరమైన స్థితి ఏర్పడితే చేయాల్సిన ప్రధమ చికిత్స గుర్తుకొచ్చింది. వెంటనే కాబిన్క్రూలో పైలెట్‌కు విషయం చెప్పి, ఆ ప్రయాణీకునికి ‘సార్బిట్రేట్’ టాబ్లెట్ నాలుక కింద పెట్టుకోమని ఇచ్చి ప్రధమ చికిత్సనందిం చాను. ఇవన్నీ ఎంత వేగంగా చేసానంటే నాతో ఏ దేముడో చేయించాడని పించింది. శ్రీనగర్  చేరేటప్పటికి అంబులెన్స్ సిద్ధంగా ఉంది.  ఓ వ్యక్తిని ప్రాణాపాయం నుండి రక్షించాననే తృప్తి నాకు కలిగింది. ఆ విషయం నేన ప్పుడే మర్చిపోయాను.

         నిన్నఆ వ్యక్తి వచ్చి శ్రీనగర్‌లో నన్ను కలసి అభినందించి, నన్ను తన దత్తపుత్రికగా భావిస్తున్నట్లుగా చెప్పారు. నాకైతే ఎంత సంతోషమని పించిందో, వెంటనే నువ్వు గుర్తు కొచ్చావు. ఆ రోజు ఆపద అంచున నిలబడిన, ముఖ పరిచయమే లేని నన్ను చేరదీసి ఇంత దానిని చేసుండక పోతే నా కథ ఆ నాటి తోనే ముగిసి పోయేదేమో?

         చిన్నప్పుడు మా గూడెంలో చెట్లచాటు నుండి, కొండల మాటు నుండి ఆకాశంలో చిన్న పక్షిలా మిణుకుమిణుకు మంటూ కాంతిని వెదజల్లుతూ ఎగిరే విమానాలను చూడటానికి రాళ్ళను, ముళ్ళను లెక్క చేయకుండా తోటి పిల్లలతో పరిగెడుతూ విమానాన్ని చూసి, ఆ ఆనందాన్ని అమ్మకు చెప్పటానికి జింక పిల్లలా ఉరికిన ఆ రోజులు నాకింకా గుర్తున్నాయి.

         అలాంటి నేను, ఆ విమానాలలోనే పయనిస్తూ తోటి ప్రయాణీకులకు ఉపయోగపడుతూ, వా రిదత్తపుత్రికగా మారానంటే అదంతా నీవిచ్చిన ప్రోత్సాహమే కదా! అందుకే ఆ అభినందన నీకే చెందాలి” అంది ఉద్వేగంతో కస్తూరి.

         “మోసపోయానని తెలుసుకున్న వెంటనే సరయిన నిర్ణయాన్ని తీసుకుని, జరిగిన దానికి కృంగిపోక, ఆత్మవిశ్వాసంతో నీవు అనుకున్న ధ్యేయాన్నిచేరి, వృత్తిలో ఆనందాన్ని పొందుతున్న నిన్ను చూస్తూంటే నాకు గర్వంగా ఉందమ్మా” అంటూ చెల్లికి శుభాకాంక్షల నందించింది మాలాసిన్హా. 

*****

Please follow and like us:

3 thoughts on “ఎగిరే పావురమా! (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)”

  1. మోసపోయిన ఆడపిల్లలకు ఇలా సపోర్టుగా ఎంతమంది ఉంటారో తెలియదు గానీ, ఈ కథ చదివిన తరువాత అయినా పసితనంలో తెలియక మోసపోయిన ఆడపిల్లలను ఆదుకునే అతివల సంఖ్య పెరిగితే బాగుండు. చేయి తిరిగిన రచయిత్రి కనుక నేరేషన్ చాలా బాగుంది. అభినందనలు మేడమూ

  2. చాలా మంది ఇలా ఆడపిల్లలకి ఉద్యోగాలు ఇస్తామంటూ తీసుకెళ్లి మోసం చేయడం లేకపోతే చేస్తున్నారు. ఆ విషయాన్ని చక్కగా చెప్తూ అలా మోసపోయిన ఒక అమ్మాయికి మాలసిన అండగా దొరకటం తీసుకుంటాను లాంటి తండ్రి లాంటి మనిషి నీ తను ప్రధమ చికిత్స చేసి బతికించడం చాలా బాగుంది కదా
    మాలసిన కస్తూరిని రక్షించటం ఆమెకు జీవితాన్ని ఇవ్వటం సందేశాత్మకంగా ఉంది.

  3. ఎగిరే పావురమా – కథ కొన్నిసార్లు first person లోనూ మరికొన్నిసార్లు third person లోనూ నడిచింది. జాగ్రత్త పడి ఉండాల్సింది అనిపించింది.కస్తూరిని తప్పించడానికి Maalasinha చేసిన ట్రిక్ బాగుంది.
    ఏకబిగిన చదవాలి అని అనిపించే అంశాలు కనిపించలేదు.

Leave a Reply

Your email address will not be published.