పునర్నవి (కథ)

-బి.భవాని కుమారి

          సీతకి నిద్ర రావటం లేదు. ప్రక్కనే వున్న సెల్ తీసి టైం చూసింది. రాత్రి రెండు. ఎంత ఆలోచించినా తన సమస్యకు ఒకటే పరిష్కారం. ఈ ఇంట్లో తనకింక స్థానం లేదు. వెళ్ళిపోవాలి, యాభైఏళ్ళ వయసులో, తాను వుంటున్న ఈ గూడునీ, ఈ చిన్ని తోటని, తన అస్థిత్వాన్నీ కోల్పోయి వెళ్లిపోవాల్సిందేనా? దారిలేదు. ఎలా మురారిని వదిలి పోవటం? వెళ్ళిపోయి ఎవరి ఆశ్రయం పొందాలి?

          పెళ్లయిన ముప్పయేళ్ళ తర్వాత ఇప్పుడు ఈ సమస్యకి తనకంటే పెద్దవాళ్ళు, అన్నయ్య, అక్కయ్య ఏం పరిష్కారం చూపుతారు? ఎనిమిదేళ్లుగా ఒక బంజారా యువతి తో  కలిసి ఉంటున్నాడు, ఇద్దరు పిల్లలు, ఈ ఎనిమిదేళ్లుగా ఇంటికి వందల మైళ్ళ దూరంలో వుద్యోగం. పిల్లల చదువులు, మూడేళ్ళ క్రితం ఇద్దరి పెళ్ళిళ్ళు, సక్రమంగా జరిగాయి.

          వారం క్రితం ఆమె తన వాళ్ళతో వచ్చింది. ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకొని, తనని వదిలేసి వచ్చాడని చెబుతుంటే, నమ్మలేకపోయింది. మురారి వాళ్ళని బతిమిలాడుకొన్నాడు. ఆమెకేలోటూ రానివ్వనని, డబ్బు పంపుతానని, ఆవూళ్ళోనే ఉండమని అడిగాడు.

          “వదిలేసి వస్తే అడ్రస్ తెలుసుకోలేమనుకొన్నావురా?” అంటూ అతనిని సోఫా లోంచి లాగి , కొట్టసాగేరు. ఆమె అడ్డుచెప్పలేదు, పైగా అతన్ని తిడుతున్నది. ఆమె భాష చాలా అసభ్య పదజాలంతో నిండి వుంది. కాసేపు వాళ్ళ భాషలో మాట్లాడుతూ, ఒక రకమైన తెలుగు యాసలో తిడుతున్నది.

          సీత అతన్ని కొడుతుంటే చూస్తూ ఊరుకోలేక పోయింది. అడ్డం పోయింది, ఆమెకు కూడా రెండు దెబ్బలు తగిలాయి. పదేళ్ళు పైబడిన వాడిలా నిస్సహాయంగా కూర్చుండి పోయాడు మురారి. ఇంకా ఎనిమిదేళ్ళ సర్వీస్ వుంది అతనికి. అతన్ని ఊళ్ళోనే వేరే ఇల్లు చూస్తానన్నాడు. ఆమె ఒప్పుకోలేదు, వెళ్ళిపోతూ ఒకమాట అన్నది, “ఇన్నేళ్ళు నువ్వున్నావుగా ఈ ఇంట్లో, నీ పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయి వారం తర్వాత నేనొచ్చి వుంటాను, ఇక్కడే, ఈ ఇంట్లోనే, వుండలేకపోతే నువ్వు వేరే ఇల్లు తీసుకొనివుండు”, ఆమె ఎంత పెద్ద కరోడానో సీతకి అర్ధమైంది. ఇదంతా జరిగి వారమైంది. ఆమె రోజూ ఫోన్ చేస్తూనే వున్నది, అతను రకరకాలుగా బతిమిలాడుకొంటున్నాడు. విసుక్కొనే సాహసం కూడా అతను చేయటం లేదు.

          సీతకు ఇదంతా భరించరానిదిగా అయ్యింది. తనతో సౌమ్యంగా ఉండేవాడు, పిల్లల చదువు పట్ల ఎంతో భాద్యతగా వుండి, అన్నీ సక్రమంగా  జరిపించాడు. ఇన్నేళ్ళు అత్త గారిని అన్న రిటైర్ అయ్యాక పంపుతానని చెబుతూ వచ్చాడు. నమ్మింది, నెలకు వారమైనా వచ్చేవాడు, తరచూ ఫోన్ చేసేవాడు, అందుకే ఆమెకు ఏ అనుమానము రాలేదు. ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే ఎంతో సంతోషించింది. అతను ఈ కారణం చేతనే అనుకుంటా, చాలా డల్ గా  ఉంటున్నాడు. తాను కల్లోకూడా ఊహించలేదు, అతనింకో స్త్రీతో సంబంధం పెట్టుకొని తనని మోసం చేయగలడని . దైహికంగా  తనుకూడా అతనికి దూరంగా వుంది, ఈ చాపల్యం తనకు కలగలేదెందుకని? ఎనిమిదేళ్ళు, కలిసి జీవిస్తు న్నాడు ఆమెతో. ఆమె గురించి చెడుగా అనుకోకూడదు, కారణాలు ఏమైనా కానీ, మురారిదే తప్పు.

          కొడుకు శ్రీకాంత్ హైద్రాబాద్ లోనే వున్నాడు. బాగా ఉన్నవాళ్ళ అమ్మాయిని చేసు కొన్నాడు, తన దుస్థితి వాడికి చెప్పుకోలేదు విషయం తెలిస్తే ఎలా ఫీల్ అవుతాడో? కూతురు సౌమ్య ఆస్ట్రేలియలో వుంది, వాళ్ళ ఫామిలీ అంతా ఎన్నో ఏళ్ళుగా అక్కడే స్థిరపడ్డారు.

***

          చిన్ననాటి స్నేహితురాలు దారి చూపింది, ఇంక ఇక్కడ వుండలేదు. ఆమె కాంపౌండ్ లోనే రెండేసి గదుల వాటాలు  మూడు వున్నాయి. ఒకటి తనకు ఏర్పాటు చేసింది. తాను ఎప్పుడో చదివిన 10వ  క్లాస్ సర్టిఫికెటుతో ఏ వుద్యోగం ఈ వయసులో వస్తుంది? ఏ పనైనా చేస్తానని చెప్పింది.

          మురారితో బంధం తెంచుకోవటం అంత తేలిక కాదు. ఇంత జరిగినా, అంత తేలిగ్గా అతనిని మరచి పోలేదు తను. అతనితో గడిపిన జీవితమూ, అనుభవాలు, కలిసి పంచు కొన్న అనుభవాలూ, భాద్యతలు, అతని శరీరము, మనసు అంతా నాకే స్వంతమను కొన్నది ఇన్నాళ్ళూ, కానీ అతనికి తానే అంతాకాదని తెలిసిందిప్పుడు, ఇంకా తాను ఈ బంధాన్ని నిలుపుకోలేదు, వెళ్ళిపోక తప్పదు , అతని జీవితంలోంచి అతని ఇంట్లోంచి.

          ఆమె నిర్ణయం విన్న అతను దుఃఖం ఆపుకోలేక పోయాడు. ఆమె దుఃఖం అతని కేమి తెలుసు? అతను తప్ప తనకింకో జీవితం లేదు. ఒంటరి తాను, ఆమె వస్తుంది, నలుగురిలో కొంతకాలం తలవంపులుగా ఉంటుంది, తర్వాత అంతా మామూలే. అతను ఎక్కడ వున్నా, డబ్బు పంపుతానన్నాడు, చూడటానికి ఒప్పుకోమని బ్రతిమిలాడాడు, ఆమె నిరాసక్తంగా నవ్వి, ఆఖరిసారి అతనిని కౌగిలించుకొని సెలవు తీసుకొంది.   

          బస్ స్టేషన్ నుండి బయిటికి వచ్చి రిసీవ్ చేసుకోవటానికి వచ్చిన జానకి కార్లో ఇంటికి వెళ్లారు. ఒక గది వంటిల్లు , మూడు వాటాలకు కలిపి కామన్ వరండా. ముప్పై ఏళ్ళు నాది అనుకొని బ్రతికిన సంసారాన్ని, ఇంటినీ వదిలి ఈ చిన్న గూటిలో కొత్త నిరామయ జీవితం గడపాలి అనే భావన మనసుని వేదనా భరితం చేసింది.

          జానకి మంచం, వంటకి కావలిసిన సామాన్లు సెట్ చేసింది. రెండురోజుల తర్వాత ఒక శాకాహార కుటుంబంలో వంటపనికి కుదిరింది. ఆ ఇంట్లో అయిదుగురు పెద్దవాళ్ళు, ఇద్దరు పిల్లలు వున్నారు. టిఫిన్, ఉదయం ,సాయంత్రం వంట చేయాలి. చేతి కింద పని మనిషి వుంది. ఇరవై వేలు జీతం. జానకి ఒప్పుకొంది. ఉదయం టిఫిన్ , పనమ్మాయి    సారమ్మతో  కలిసి చేసేది. మిగిన కూరలు అవీ తీసుకోనని చెప్పేసింది. ఆమె వంట వాళ్ళకు బాగా నచ్చింది. ఆమె తన వివరాలు చెప్పడానికి అయిష్టత చూపడంతో వాళ్ళు అడగటం మానేశారు. 

          కాలం గడిచిపోతోంది. మురారి ఫోన్ చేస్తూనే  వున్నాడు అతనిలోని గిల్టీ ఫీలింగ్ ఆమెని భాద పెడుతోంది. ఇంటా, బయటా, బంధువులలో పలుచునై పోయాడు. చివరికి ఓ రోజు చెప్పేసింది, ఇంకా తన గురించి ఆలోచించ వద్దనీ, వున్న  జీవితాన్ని ఆమెతో సాధ్యమైనంత వరకు సామరస్యంగా గడపమనీ చెప్పింది.

          శ్రీకాంత్. సౌమ్య, కొత్తలో చాలా ఆవేశ పడ్డారు. క్రమంగా ఆ ఉద్వేగం తగ్గింది. తల్లి తమ సాయం ఏ రకంగానూ అంగీకరించక పోవఁటంతో , క్రమంగా వాళ్ళు ఫోన్ కాల్స్ తగ్గించారు.

          ఇంటి వాళ్ళ అబ్బాయి అమెరికాకి వెళ్ళి పోయాడు. జీతం అయిదు వేలకి చేయ మన్నారు. సీత మరో ఇల్లు చూసుకొంటానని చెప్పింది.

          ఆ రోజు జానకి సీతని పిలిచి ఒక విషయం చెప్పింది. ఆమె  అక్కకొడుకు లవ్ మ్యారేజ్ చేసుకొన్నాడు. ఇప్పుడా అమ్మాయి ప్రెగ్నెంట్. చాలా బలహీనంగా వుంది US వెళ్ళాలి, “వెళతావా సీతా?” అని అడిగింది. ఇద్దరి తల్లి తండ్రులూ వాళ్ళ పట్ల  కనికరం చూపలేదు.

          సీత వెంటనే ఒప్పుకొంది. జీవితంలో మరో మలుపు, విదేశీ యానం ఒకసారి జానకి అడిగింది, పిల్లల గురించి, భర్త గురించి. సీత కళ్ళలో నీళ్లు తిరిగాయి. నెమ్మదిగా అన్నది,” ఇంత జరిగినా మురారి అంటే కోపం లేదు. అతనంటే చాలా ఇష్టం నాకు, ఆమె విషయం తెలిసాక అతని జీవితం నుంచి తప్పుకోవాలి, ఇంకా ఆ బంధానికి అర్ధం లేదు, ఎలా వున్నాడో అనిపిస్తుంది, ఏవరితోనైనా చెబితే అతని పట్ల నాకున్న భావాలని ఏవగించు కొంటారని తెలుసు. ఆ రోజు ఆమెని చూసాక అర్ధమయ్యింది, ఊబిలో పడి పోయాడని. తప్పుచేసాడు, మిగతా జీవితాన్ని ఆమెతో కలిసి బ్రతకాలిసిందే, నచ్చినా, నచ్చక పోయినా. శ్రీకాంత్, సౌమ్య పెళ్ళిళ్ళు అయిపోయాయి. నేను వాళ్ళకి బరువుగా కాదలచుకో లేదు”. ఆ గొంతులో నిర్వేదం జానకిని కలచి వేసింది.

          సీతకి పాస్ పోర్ట్ వుంది. అమెరికా వెళ్ళే అన్నిఏర్పాట్లు వినీత్ చేసాడు. సీతని ఎయిర్ పోర్ట్ లో రిసీవ్ చేసుకొన్నాడు. ఇంటికెళ్ళాక అతని భార్య శ్రీజ వచ్చి నమస్కరిం చింది. ఆ అమ్మాయి చాలా బలహీనంగా, నీరసంగా వుంది. పనిరాక, పనిచేయలేక , తిండి సరిగ్గా అమరక అలావుందని అర్ధం చేసుకొంది నోటికి హితవుగా అన్నీ వండిపెట్టింది. పాలు, పండ్లరసాలూ టైం ప్రకారం ఇచ్చి, శ్రీజ కోలుకునేలా చేసింది. రోజు పార్క్ లోకి వాఁకింగ్ కి వెళ్ళేవాళ్ళు. వినీత్  నిశ్చింతగా ఆఫీస్ కి వెళుతున్నాడు. నొప్పులు వస్తు న్నప్పుడు తల్లిలా ధైర్యం చెప్పింది. వినీత్ మరో ఆరునెలలకి పర్మిషన్ తీసుకొన్నాడు.

          ఏడాది కాలం గిర్రున తిరిగింది. పసివాడితో బంధం పెంచుకోకూడదని అనుకొంది. కానీ వచ్చేసేటప్పుడు వదలలేక పోయింది. వినీత్ కి చాలా ఆశ్చర్యం కలిగేది  సీతని చూస్తే, ఏ రోజూ ఎంత ఇస్తున్నారని అడగలేదు. ఆమెని ఫ్లైట్ ఎక్కించి, జానకికి ఫోన్ చేసాడు. సీత వస్తోందని, ఆ మాట చెబుతున్నప్పుడు అతని గొంతు నిండిపోయింది. మాకు అమ్మలా సేవ చేసింది పిన్నీ, శ్రీజ చాలా ఏడ్చింది. నెలకు మూడువేల డాలర్స్ చొప్పున వేసాను ఆమె అకౌంట్లో, నువ్వు ఆవిడకు చెప్పు” జానకి అంది, ‘ అవసరముంటే మళ్ళి వస్తుందిలే’ ఓదార్పుగా అన్నది.

          జానకి అనుకొన్నది సీతలాంటి స్రీలు పునర్నవి లాంటి వాళ్ళు. పొలాల గట్ల మీదా, రోడ్ల ప్రక్కన వుండే పునర్నవి విలువ కొద్దిమందికే తెలుసు. సీత లాంటి వాళ్ళు ఎటువంటి జీవితాలలోనైనా క్రొత్త జీవము తేగలరు. ఆ విలువ తెలియని మురారి లాంటి వాళ్ళు, జీవితంలో చాలా కోల్పోతారు, మర్నాడు పునర్నవిని స్వాగతించడానికి ఎయిర్ పోర్ట్ కి బయలుదేరింది జానకి.

*****

Please follow and like us:

4 thoughts on “పునర్నవి (కథ)”

  1. పునర్నవి పేరు కొత్తగా ఉంది… కథ… కథనం చాలా బాగుంది..ఆడవాళ్ళు ఎప్పుడూ ఓడిపోతూనే వుంటారు.. చక్కటి ముగింపు ఇచ్చారు… అభినందనలు…

  2. ఎలాటి సందర్భం వచ్చినా ఆత్మ స్థైర్యంతో నిలబడగలిగేది స్త్రీనే అని నిరూపించేలా వుంది కథ. అభినందనలు

  3. కథ పేరు కొత్తగా అనిపించి చదివానండి. కథని అంతటా చక్కగా సాగించారు. కానీ బంజారా అమ్మాయి విషయంలో మీరు ఆ పాత్రకి న్యాయం చేయలేదనిపిస్తోంది. ఒకసారి ఆమె వైపు నుండి ఆలోచించండి. ఆమె కూడా అతని చేత మోసగించబడ్డదే కదా! ఆమెను ఒక గయ్యాళిగా చిత్రించకుండా ఉండవలసింది. ఆ భాగం కథలో అనవసరం కూడా. కథా చిత్రణ పునర్నవి గురించి కాబట్టి ఆమె అందరి జీవితాలను పునర్నవీకరించింది కాబట్టి ఆ పాత్రను హై లైట్ చేస్తే సరిపోయేది. ఆమె తన స్వంత పిల్ల సహాయం ఎందుకు తీసుకోలేదో కూడా మీరు ఎఫెక్టివ్ గా జస్టిఫై చేయలేకపోయారు. కథా , కథనాలు మాత్రం బాగున్నాయి. అభినందనలు.

Leave a Reply

Your email address will not be published.