సముద్రం (కథ)

– కె. వరలక్ష్మి

          ఆ బస్టాండులో బస్సు దిగేసింది లసిమి.

          ఎక్కడానికి తోసుకుంటున్న జనం మధ్య నుంచి బైటపడింది.

          కాలికందనంత ఎత్తైన మెట్టెక్కి ప్లాట్ఫాం మీదికొచ్చింది, భయం భయంగా కాస్త ముందుకి నడిచి అక్కడున్న బెంచీ మీద కూర్చోబోయింది. అంతలో ఎవరో వచ్చి కూర్చున్నారు. ఆగిపోయి చుట్టూ పరికించింది.

          అప్పటి వరకూ ప్రశాంతమైన కొండలు, గుట్టలు, అడవిచెట్ల మధ్య ప్రయాణించి
వచ్చిన బస్సు ఒక్కసారిగా జనసందోహంలో కొచ్చిపడింది. ఆ రోజు సోమవారం ఆ
ఊరి సంతకావడంతో తిరిగి ఇళ్ళ కెళ్ళే జనాల్తో నిండిపోయి ఉంది బస్టాండు.

          కొంతలోపలికి నడిచి స్తంభానికి చేరబడింది లసిమి. తన ఎర్ర బేగ్ ని పదిలంగా
గుండెకి హత్తుకుంది. ‘మన్యం సంతలో ఇష్టపడి కొనుక్కున్న బేగ్ అది. వారం అంతా ఏరు కొచ్చిన తట్టడు కుంకుడుకాయలు, ఇరవై చీపురుకట్టలు, బుట్టడు చింతబుట్టలు, ఒక తేనెతుట్ట ఇచ్చినా ఇంకా చాలవని ఇంకో రూపాయి బాకీ కట్టేడు సావుకారు. డబ్బుల్లేవంటే మరసటి వారం తెచ్చి ఇమ్మన్నాడు. మరసటి వారానికి కూడా రూపాయి పోగెయ్యలేక ఇంకో బుట్టడు కుంకుడు కాయలు. ఏరుకొచ్చి ఆడి ఎదాన్న పోసింది.

          ‘ సావుకార్ని అలాగ ఆడు అనుకున్నందుకు బలే సంతోషమేసింది లసిమికి.
తెలీకుండానే పెదవుల మీదికి నవ్వు పాకి వచ్చి ముఖం అంతా నిండిపోయింది.

          ఎర్ర బేగ్ ని మళ్ళీ ఒకసారి హత్తుకుని లోపలికి చూసింది. దాని జిప్పు కొత్తల్లోనే ఊడి చేతిలో కొచ్చింది. బేగ్ లో రంగు వెలిసిపోయిన చీర-జాకెట్టు, పంతులమ్మ ఇచ్చిన పంజాబీ డ్రెస్సు, తండ్రి నీళ్లు తాగే సత్తుగ్లాసు, లోత్తలు పడిన స్టీలుచెంబు కన్పించేయి.

          పదిహేను రోజుల క్రితం చచ్చిపోయిన తండ్రి గుర్తుకొచ్చేడు.

          రాబోయిన ఏడుపుని ఆపుకొంది. తనిప్పుడు ఎక్కి వచ్చిన భద్రాచలం- కాకినాడ
బస్సులో తీసుకెళ్ళి సముద్రాన్ని చూపిస్తాననేవాడు. అక్కడికి ఊళ్లన్నీఅయిపోతాయంట. ఎదట సముద్రం ఒక్కటే కనుచూపు మేరా ఉంటాదంట. అదేదో తనకెప్పుడూ ఊహకందేదికాదు. అలాగెలాగ? అని ఒకటే ఆలోచనలో పడిపోయేది.

          తనగూడెం చుట్టూ ఉన్న కొండలు – గుట్టలు ఎక్కిదిగితే అవతల ఊళ్లుంటాయి.
పక్కన పారుతున్న గెడ్డ దాటెల్తే ఊళ్లుంటాయి. కదా! అనునుకునేది.

          ఎక్కడ ఎంత పనిలో ఉన్నా రోజుకొక్కసారి వచ్చే భద్రాచెలం బస్సుని చూడ్డానికి ఆ టైంకి రోడ్డుకాడికి పరుగెత్తు కొచ్చేది. 

          ఎవరో వచ్చి టకటకా స్విచ్చులు నొక్కేరు. కొన్ని లైట్లు వెలిగేయి. కొన్ని వెలగలేక టపటపా కొట్టుకుంటున్నాయి. ఇంకొన్ని కిరసనాయిలు దీపాల్లాగా కునుకు తున్నాయి.

          భద్రాచలం నుంచి కాకినాడ వెళ్తున్న బస్సు కదలబోతోందని మైకులో ఎనౌన్సు మెంటు విన్పించింది. అప్పటిదాకా ఎక్కడికి పోయేరో డ్రైవరు, కండక్టరు వచ్చి బస్సెక్కేరు. కిందికి దిగి సేద తీరుతున్న జనాలు పరుగెత్తి బస్సెక్కేరు. ‘రైట్ రైట్’ అన్నాడు కండక్టరు. బస్సు కదిలి కాకినాడ వైపు రోడ్డులో మలుపు తిరుగుతోంది. దానివేపు విచారంగా చూసింది లసిమి. ‘తన దగ్గర డబ్బులు సరిపోక తననిక్కడ దించేసేడు కండక్టరు. లేక పోతే తనుకూడా ఆజనంతో ప్రయాణంచేసి సముద్రం ఒడ్డున దిగేది.’

          “సంద్రాన్ని కళ్ళారా సూసేక సచ్చిపోయినా పర్లేదే లసిమీ ” అనీవోడు తండ్రి,
అదేటోమరి!

          యథాలాపంగా పైకి చూస్తే అక్కడ బూజులు నిండిన గడియారం ఒకటి కన్పించింది,
అంగన్ వాడీ బళ్ళో పంతులమ్మ నేర్పించిన అంకెలన్నీ గుర్తుకు తెచ్చుకుని ఆ
గడియారంలో టైమెంతైందో లెక్కకట్టింది. మూడైంది. ‘ ఉప్పుడు మూడేటి’ అని
లెక్కలేసుకుని అదేపనిగా చూస్తే అర్థమైంది అదెప్పుడో ఆగిపోయిందని.

          కిసుక్కున నవ్వింది.

          పక్కనున్న కుర్రోడు ఆమె వేపు ఆసక్తిగా చూసేడు, లసిమి గుర్తుతెచ్చుకుంది.

‘దోబూచులాడుతూ బస్సుతో సమానంగా ప్రయాణించిన సూరీడు సింగరమ్మ సింత కాడ
మాయవైపోయేడు. అప్పుడ్నుంఛీ లెక్కకడితే … ఎవర్నైనా అడుగుదామని చూస్తే ఎవరి చేతికీ వాచీ కనపడలేదు. అయినా ఎవరూ పలికేలాగ లేరు. ఎవరికి వాళ్లు ఫోనుల్లో మునిగి పోయి హడావుడిగా ఉన్నారు.

          ‘ఏటి బాబా ఇంత జనం” అని విసుక్కుంటోందొకావిడ.

          ‘నాలుగురోడ్ల జంక్షను కదా మరి! రద్దీ ఇలాగే ఉంటాది. అటు రాజమండ్రి, ఇటు వైజాగు వెళ్లే హైవే బస్సులొస్తే అప్పుడు ఖాళీ అవుద్ది’ అంటున్నారెవరో జవాబుగా..

          ‘అరగంటకొక రాజమండ్రి బస్సో, కాకినాడ బస్సో వత్తానే ఉన్నాయి. ఎక్కడ ఖాళీ అవుతుంది? ఎళ్లేవాళ్లెల్తుంటే కొత్తగా వచ్చివోళ్లొస్తున్నారు’ అంటున్నారింకెవరో, ఆ చివర ఒక బెంచి ఖాళీగా కనిపిస్తే వెళ్లికూర్చోబోయింది లసిమి. అది పైకి తేలిపోయి పడబోయి నిలదొక్కుకుంది.

          బస్సు ఎక్కుతున్నవాళ్ళందరి సంచుల్లోంచి ఏదో ఒక మిఠాయి పొట్లం తొంగి చూస్తోంది. 

          లసిమికి ఆకలేసింది. బస్టాండు బైట రోడ్డు నిండా పళ్ల బళ్ళు. వాటి వెనక మిఠాయి కొట్లు.

          బస్టాండుకి సరిగ్గా ఎదురుగా రోడ్డు పక్క రాజస్తానీ సేటు టీ కొట్టు దగ్గర జనం రద్దీ తగ్గడం లేదు. జిలేబీలు, సమోసాలతో బాటు ఘుమఘుమలాడే యాలకుల టీ కూడా దొరుకుతుందక్కడ.

          లసిమి ఆశగా ఎర్ర బేగులో చెయ్యి పెట్టి వెతికింది. ఏమీ దొరకలేదు. తమ సంతల్లో కొచ్చే చిట్టిపొట్టి సమోసాలు కావివి. ఒక్క సమోసా, ఒక్క టీ చాలు. మధ్యాహ్నం తిన్న నూకల జావ ఎప్పుడో అరిగిపోయింది. కడుపులో ఎలకలు పరుగెడుతున్నాయి. ఆశగా అటే చూస్తూ కూర్చుంది లసిమి.

          నిజంగా హైవే బస్సులు వచ్చి వెళ్ళగానే జనం పల్చబడిపోయేరు. కానిస్టేబులు ఒకతను అవతలి పక్క నుంచి బస్టాండులో కొచ్చేడు, నడుం మీద చేతులుంచుకుని బస్టాండంతా పరిశీలించి చూస్తున్నాడు.

          లసిమికి గుండె గతుక్కుమంది. చటుక్కున లేచి ఎర్ర బేగ్ భుజానికి తగిలించుకుని
గబగబా రోడ్డువేపు నడిచింది. లసిమికి పోలీసులంటే భయం. ఆమెకే కాదు, వాళ్ళ గూడెం లో అందరికీ భయమే. పోలీసులొస్తున్నారని తెలిస్తే చాలు గుండు దెబ్బకి కాకుల్లాగా చెల్లా చెదురై పోతారు. ఆడవాళ్లైతే వాకిళ్ళలో ఆడుకుంటున్న పిల్లల్ని చంకనేసుకుని గుడిసెల్లోకి పరుగులు తీస్తారు, అందర్ని చూసి ఆ భయం లసిమికీ అంటుకుంది.

          రోడ్డు మీద షాపుల్లో లైట్లు పట్టపగల్లా వెలుగుతున్నాయి. రోడ్డు కిరువైపులా ఉన్న షాపుల్ని సంభ్రమంగా చూస్తూ ఒక రౌండు తిరిగొచ్చింది. సమోసాల షాపు ముందు నుంచి కదలం అని ఆమె కాళ్లు మొరాయించాయి. సమోసాల పని ముగిసినట్టుంది. మరుగుతున్న నూనెలో ఉల్లిపాయ పకోడీలు వేయిస్తున్నాడు సేటు. చట్రంలో వేయించి  పక్కనున్న పెద్ద పళ్లెంలో వేస్తున్నాడు. వచ్చిన వాళ్ళకి ఎవరు ఏదడిగితే అదల్లా కాయితాల్లో పొట్లాలు కట్టి ఇచ్చి డబ్బులు తీసుకుంటోంది సేటు పెళ్లాం. పక్కనే బల్లమీద  మరుగుతున్న చిక్కని టీని వడకట్టి గ్లాసుల్లో పోసి ఇస్తున్నాడు కుర్రాడొకడు. ఎర్రబేగ్ ని పొదివి పట్టుకుని ఓ పక్కగా నుంచుని తదేకంగా అటే చూడసాగింది లసిమి.

          కొంత రద్దీ తగ్గేక సేటు పెళ్లాం లసిమిని చూసి చిన్నగా నవ్వింది. చిన్నకాయితం ముక్కమీద సమోసా ఒకటి పెట్టి ఇచ్చింది. లసిమి ఆత్రంగా అందుకుని తినేసింది. గ్లాసుతో టీ ఇచ్చింది.

          లసిమికి ప్రాణం లేచొచ్చింది.

          తిరిగి బస్టాండులోకి నడిచింది. బస్టాండంతా ఖాళీగా ఉంది. ఎనౌన్స్ చేసే గది తలుపు మూసేసి ఉంది.

          రోడ్డు నుంచే లసిమిని ఫాలో అవుతున్న కుర్రోళ్ళిద్దరు బర్రుమని బుల్లెట్టు బండి మీద వచ్చి లసిమి వైపే తదేకంగా చూస్తున్నారు. లసిమి ఇందాకటి బల్ల మీదికి చేరుకుని కుదురుకోబోతూండగా ఆ పక్క బల్ల మీద ముసుగెయ్యబోతున్న కాపలా జోగయ్య దిగ్గుమని లేచి కూర్చున్నాడు.

          జోగయ్యని చూసి కుర్రాళ్ళు బండి స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయారు. 

          “ఓ పిల్లా, ఏటిక్కడ కుదురుకుంటన్నావ్” అని కసిరేడు జోగయ్య. “లాస్టు బస్సులన్నీ ఎల్లిపోయేయి, అయివే బస్సులు ఇంక కిందకి రావు. ఫ్లై ఓవరుమీంచి ఎలిపోతాయి. కుంచేపట్లో లైట్లు ఆరిపేత్తారు. సూసేవా, పిట్టమనిసైనా లేదు బస్టేండులో.”

          తనంత వాగినా ఆపిల్ల మాట్లాడకపోయేసరికి-“ఏ ఊరు మీది? ” అన్నాడు.

          లసిమి చెప్పింది.

          “ఓరి బాబోయ్, అంతదూరం నించి ఇక్కడి కొచ్చేవా? ఏం పనిమీదొచ్చేవు? ఏంటెవరూ లేకుండా ఒక్కదానివే వొచ్చేవా? సుట్టాలెవరైనా ఉన్నారా? అయినా, అక్కణ్నుంచంటే నువ్వు బద్రాసెలం బస్సులో వచ్చుండాల. అప్పుణ్ణించి ఇక్కడే తిరుగుతున్నావా? ఎవరింటికెల్లాల? ఇల్లు దొరకలేదా?

          “లసిమి ఏ ప్రశ్నకీ సమాధానం చెప్పకపోవడం చూసి ఏదో అర్థమైనట్టు తల
పంకించేడు. కప్పుకోబోతున్న చిరుగుల దుప్పటిని మడత పెట్టి చంకలో పెట్టుకుని ” అరగంటరగంటకీ బీటు కానిస్టేబులొచ్చి సూసుకుని ఎల్తాడు. ఓలమ్మ తల్లో నన్నిక్కడ నీతో సూసేడంటే తుక్కు రేగ్గొట్టి మళ్లీ నన్నీ సాయలకి కూడా రానివ్వడు” అంటూ బైటికి దారి తీసేడు.

          లసిమి నిర్ఘాంతపోయి అతన్నే చూస్తూ నిలబడిపోయింది. పోలీసొస్తాడన్న మాట తప్ప ఇంకేదీ ఆమె తలకెక్కలేదు. దోమలు ఝుమ్మని సంగీతం పాడేస్తున్నాయి.
నాలుగడుగులు వేసినవాడు ఏమనుకున్నాడో మళ్ళీ వెనక్కొచ్చేడు.

          “ఎందుకు సెప్తున్నానో అర్ధం సేసుకో. ఇదా అయివే పక్కూరు. నువ్వా వొయసులో ఉన్న పిల్లవి. రోజులసలే బాగో లేవు. ఉంకొంచెం సేపుంటే ఆ రోడ్డు మీద కనపడతాన్న మనుసులు కూడా ఎవలగూళ్లలోకి ఆళ్లు సేరిపోతారు. ఎంటనే ఏదో ఒక నీడకి సేరుకో” అని వెనక్కి తిరిగేడు.

          లసిమి రెండగల్లో అతన్ని చేరుకుంది.

          “అయ్యా, నువ్వు మా అయ్య లాటోడివి. ఆ నీడేదో ఈ రాత్రికి నువ్వే సూపించాల”
అంది.

          “ఇదేటమ్మా తల్లీ ! నా వల్లెక్కడౌతాది? మాటత్తాదని నిన్ను సూసి పారిపోతున్నాను కానీ లేపోతే ఈ కూల్రింకుల షాపుకి ఆ పక్క నున్న టీ బంకుకి కాపలాగా నేనిక్కడ పడుకోవాల”

          “ఏదో ఒకటి సేసి పున్యం కట్టుకోయ్యా, నీ కాళ్ళట్టుకుంటాను”

          జోగయ్య ఏం చెయ్యాలో తోచక బుర్ర గోక్కున్నాడు.

          లసిమి మొహంలోకి రెండు నిమిషాలు తదేకంగా చూసి ఓ నిశ్చయానికి వచ్చి నాతోరా “అని దారి తీసేడు,

          సేటు, అతని పెళ్లాం కొట్టు మూసేసి వెళ్లిపోతున్నారు. ఫ్లై ఓవరు దాటగానే ఉన్న పోలీసుస్టేషను ముందు నుంచి వెళ్ళే ధైర్యం చెయ్యలేక కుడిపక్కకి తిరిగి మరో వీధి లోంచి తనింటికి తీసుకెళ్ళేడు.

          చిన్న పెంకుటింట్లో ఒక గది. కుక్క ఒకటి అరుస్తూ దగ్గర కొచ్చింది. ‘ఛీ’ అని దాన్ని
అదిలించేడు జోగయ్య. లసిమిని బైట నుంచోమని అతను లోపలికెళ్ళేడు.

          “ఏం మల్లీ వచ్చావు? తినే ఎల్లేవుకదా” అంది అతని పెళ్ళాం.

          “అది కాదే రావులూ, పాపం బస్సెల్లిపోవడం వల్ల ఈ పిల్ల ఇక్కడ సిక్కడి పోయింది. ఈ రేత్రికి మనింట్లో ఉండనిత్తే పొద్దున్నే ఎలిపోతాది” అన్నాడు బతిమాలుతూ.

          “ఎవరాపిల్ల? ఏటయ్యా? ఎన్నిసార్లు సివాట్లు తిన్నా నీకు బుద్ది రాదేటి” అంటూ బైటి కొచ్చింది రావులమ్మ. వీధి దీపం వెలుగులో ఎర్ర బేగ్ ని గుండెలకదుముకుని బిక్కు బిక్కుమని చూస్తోంది లసిమి.

“ఇలాగే జాలిపడి క్రితంసారి ఒక సెత్తనాగుంటని తీసుకొచ్చేవు. అది డబ్బులు పోయేయని మన మీద పోలీసు కేసెట్టి ముప్పు తిప్ప లెట్టి మూడు సెరువుల నీళ్ళు తాగించింది. అప్పుడే మరిసిపోయేవా?”

          “నాకాడ డబ్బుల్లేవు.” అంది చటుక్కున లసిమి.

          “పాపం ఈ పిల్ల మంచిదానిలాగే ఉందే, రేపొద్దున్నే ఎలిపోతానంటంది. ఏం పిల్లా, తెల్లారగట్టే ఎల్లిపోవాల” అన్నాడు. జోగయ్య.

          “అందరూ మంచోళ్లే నీకు!” అంటూ రావులమ్మ జోగయ్యని కొరకొరా చూసింది.

          ఏటో సంచులట్టుకుని దిగిపోతారు. బయ్యంబత్తుల్లేవు! అంటూ నెత్తికొట్టుకుని లోపలికెళ్లి పోయింది.

          అందరూ నిద్రలు పోయేవేళ, వీధంతా నిర్మానుష్యంగా, నిశ్శబ్దంగా ఉంది. లసిమిని లోపలికెళ్లమని సైగ చేసి జోగయ్య వెళ్ళిపోయేడు.

          లసిమి భయం భయంగా లోపలికి అడుగుపెట్టింది.

          తక్కువ కేండిలు బల్బు వెలుగులో గదంతా మసకమసకగా ఉంది. లసిమి చూపులు గది నాలుగుదిక్కులా పరుగెత్తేయి. నేల మీద చాపపైన బాంతపరిచి ఉంది. పెచ్చులూడి పోయిన గోడలు సున్నం మొహం చూసి చాన్నాళ్లైనట్టుంది. ఓ మూల నేలపైన స్టవ్వు, గిన్నెలు. దండెం మీద బట్టలు, ఇంకో మూల రెండు అట్టపెట్టెలు, ప్లాస్టిక్ బకెట్టు, బిందె.

          గదిలో గాలి లేక ఉక్కపోస్తోంది. బైటి నుంచి మురుగు కాలవ వాసన ముక్కుపుటాల్ని అదరగొడుతోంది. 

          గూడెంలోని తన గుడిసె గుర్తుకొచ్చింది లసిమికి. కావాల్సినంత గాలి, వెలుతురు.

          “తిన్నావా?”

          ఉలిక్కి పడి రావులమ్మ వైపు చూసింది లసిమి,

          అవునో కాదో తెలీకుండా తలకాయ ఊపింది.

          ఒక్క కెరడు అన్నవూ, కుసింత ఉల్లిపాయల పులుసు ఉన్నాయి. తింటావా?

          “తింటాను”

          రావులమ్మ అందించిన కంచాన్ని అందుకుని గబగబా తింటోంది. లసిమికి మంచి
నీళ్లిచ్చి, తనో గ్లాసుతో నీళ్లు తాగుతూ …

          “పేరేటి?’ అంది

          “లసిమి”

          తాగుతున్న నీళ్లు కొరబోయి నెత్తి మీద కొట్టుకుంది రావులమ్మ.

          “లచ్చిమా?”

          “కాదు, లసిమి”

          “అదేం పేరు ?”

          “మాకాడ అంతే మన్నెంలో”

          సర్లే ; ఉన్నదొకటే సాప, బొంత. దా, ఇలాగొచ్చి నా పక్కన పడుకో. పొద్దున్నే లెగిసి ఇళ్లల్లో పనులకెల్లాల నేను.

          లసిమి ఓపక్కకి ఒదిగి పడుకుంది.

          మధ్యలో రావులమ్మకెందుకో మెలకువొచ్చేసరికి తన డొక్కల్లో దూరిపోయి హత్తుకుని నిద్రపోతోంది లసిమి. “తనకే ఇలాంటి ఓ కూతురుంటే ఎంతబావుణ్ణు!” అనుకుంది రావులమ్మ.

          తెల్లారి రావులమ్మకి మెలకువొచ్చేసరికి వాకిట్లో ముగ్గేసి ఉంది, రాత్రి తిన్న అంట్ల గిన్నెలు తోమి, బోర్లించి ఉన్నాయి. బొంత పక్క నుంచి గది అద్దంలా తుడిచేసి ఉంది, ఎర్రబేగ్ మాత్రం లేదు.

          రావులమ్మ బైటికి రాగానే పక్కింటివాళ్లు చెప్పేరు – “రాత్రి మీ ఇంటికొచ్చిన సుట్టం పిల్ల తెల్లారగట్టే ఎలిపోయింది, నువ్వు లేసేక సెప్పమంది.”

          జోగయ్య రాగానే చెప్పింది రావులమ్మ.

          వేపపుల్లతో పళ్లు తోముకుంటూ వచ్చిన జోగయ్య ఆ పుల్ల విసిరేసి వెనక్కి పరుగెత్తేడు.

          పదకొండు గంటలవేళ కాళ్లీడ్చుకుంటూ ఇంటి కొచ్చేడు.

          పనులు ముగించుకుని రావులమ్మ రాగానే అడిగేడు-

          “రేత్రి నువ్వేమన్నా అన్నావా ఆ పిల్లని ?”

          “అయ్యో, లేదయ్యా ఒట్టు. తెల్లారి లేసేక ఆ పిల్ల ఒప్పు కొంటే నాలుగిళ్లలో పనికి కుదురుద్దావనుకున్నాను. ఏం, ఏమైంది?”

          “తెల్లారకముందే ఎల్లి అయివేలో రాజుగాడి టీ బంకుకాడ నిలబడిందంట. ఆడు
పోన్లే పాపం అని రె౦డిడ్లీ పెట్టి టీ ఇచ్చేడంట, అంతలోకి పైనెక్కణ్నించో వొత్తన్న లారీ ఒకటొచ్చి ఆగిందంట, పిల్లసేతిలో బేగ్ చూసి ‘ఎక్కడికి’ అనడి గేడంట డ్రైవరు, ‘సముద్రం కాడికి’ అందంట !’ దా, ఎక్కు. మేవక్కడికే ఎల్తన్నాం’ అని కేబిన్లోకి ఎక్కించుకుని తీసుకెల్లేరంట”

          ‘అయ్యో, సంద్రాన్ని సూడాలంటే మన కాకినాడో, ఉప్పాడో. ఎల్తే సరిపోయీది కదా! గంటలో ఎలిపోవచ్చు,

          ‘పోనీలే వొయిజాగు సంద్రాన్ని సూసేసొత్తాది’ అంది రావులమ్మ.

          అయ్యో రావులూ! అది అన్నెంపున్నెం తెలీని పిల్లే, పైగా అడివిలో పెరిగిన పిల్ల. అలాగ ఒంటరిగా లారీ ఎక్కిన ఆడపిల్లల గతేటౌదో మన సెంటర్లో అందరికీ తెలుసు.
అంతెందుకు, నిన్న ఆ పిల్ల బస్సు దిగినకాణ్నుంచి అందరి కళ్ళూ దాని మీదేనంట,
రేత్రి మనం ‘పొద్దున్నే ఎల్లిపోవాల’ అనకుండా ఉండాల్సిందేమో’ అంటూ
పై మీది తువ్వాలుతో కళ్ళు ఒత్తుకున్నాడు జోగయ్య.

*****

Please follow and like us:

7 thoughts on “సముద్రం (కథ)”

  1. కథ, కథనం చాలా బాగున్నాయి. అయితే కథని ఈ క్రింది విధంగా ఆశాజనకంగా ముగిస్తే బాగుండేదేమో.
    ***

    లోడు లారీ చెక్‌పోస్ట్ దగ్గర ఆగింది.
    “పేపర్లు చూపించు”
    డ్రైవర్ చూపించాడు.
    “ఈ అమ్మాయెవరు. ఏయ్ ఎవరమ్మాయ్ నువ్వు?”
    “ఈ అన్నయ్య నాకు సముద్రం చూపిస్తా అన్నాడు”
    “అసలు ఇటు సముద్రం ఎక్కడుంది? నువ్వు దిగు. దిగమంటున్నానా. రేయ్ అమ్మాయిని ఎత్తుకుపోతున్నారని కేస్ పెట్టి లోపల తోయించేస్తాను స్కౌండ్రల్స్”
    లసిమి దిగింది. సేల్స్ టాక్స్ ఇన్‌స్పెక్టర్ వివరాలు కనుక్కుని మందలించి భద్రాచలం వెళ్ళే బస్సు ఎక్కించాడు.

  2. సముద్రం కథ యెంతో సున్నితంగా వుంది. ఇది కథ కాదు, వాస్తవంగా జరిగిందా అనే రీతిలో సాగింది.

  3. ముగింపు చదవగానే మనసు ఎలాగో అయిపోయింది. పాపం సముద్రం చూడాలన్న ఆశ.. ఆ పిల్లని జనసముద్రం పాలు జేసింది అన్యాయంగా..

  4. కథ అద్భుతంగా ఉంది మేడమ్…చెప్పడానికి ఏమీ మిగలలేదు. పోటీకి పంపి వుంటే బహుమతి వచ్చేటంత గొప్ప కథ.. అభినందనలు మేడమ్

  5. ముగింపు హృదయాన్ని తాకిందండి. లసిమి పాత్రను కూడా బాగా బిల్డ్ చేశారు. అభినందనలు.

Leave a Reply

Your email address will not be published.