మిట్ట మధ్యాహ్నపు మరణం- 24

– గౌరీ కృపానందన్

          టెలిగ్రాము ఇచ్చిన తరువాత మాధవరావు డి.సి.పి. ని చూడడానికి బయలు దేరారు. టెలిఫోన్ లో మాట్లాడుతున్న ప్రభాకరం ఆయన్ని కూర్చోమన్నట్లు సైగ చేశారు. మాధవరావు కూర్చోలేదు.

          “ఏమిటి మాధవరావు. యు లుక్ ఎక్సైటెడ్?” అడిగారు డి.సి.పి. మౌత్ పీస్ ను చేత్తో మూసుకుంటూ.

          “సార్! కనిపెట్టేశాను. ఆ హనీమూన్ మర్డర్ కేస్.”

          “అలాగా. ఐ విల్ టాక్ టు యు లేటర్ సంపత్” అంటూ ఫోన్ పెట్టేశారు.

          “అతని పేరు రాకేష్. ఎవిడెన్స్ అన్నీ సరిగ్గా ఫిట్ అవుతున్నాయి.”

          “గుడ్ షో! అరెస్ట్ చేసేశారా?”

          “లేదు సార్. ఇంకా లేదు. అతను ఎక్కడ ఉన్నాడో తెలియలేదు.”

          “అంటే కేసు సగం మాత్రమే అయ్యింది.”

          “సర్. ఎలాగైనా వాడిని పట్టుకు తీరుతాను.” నొక్కి చెబుతున్నట్లుగా అన్నారు.

          “మీరు పరిశోధన చేసిన విషయాలను పూర్తిగా తెలియ జేయండి. ఎంతసేపు అలా నిలబడతారు? మొదట కూర్చోండి.”

          మాధవరావు ఒక్కొక్కటిగా వివరించారు. పోస్టుమార్టంరిపోర్ట్ లో, ఒక వెంట్రుక, హెయిర్ డై ఉపయోగించిన వ్యక్తిది, పార్కులో తీయబడ్డ ఫోటోలో చెట్టు వెనకాల తొంగి చూసిన వ్యక్తి. అతని టీషర్ట్ లో ఉన్న అక్షరాలు, షూస్ గురించిన వివరాలు, బాస్కెట్ బాల్ ఆడిన సర్వర్ని మొదట తప్పుగా అనుకున్నది, మళ్ళీ క్రికెట్ టీం అన్వేషించింది, ఇంతియాస్ దగ్గర గ్రూప్ ఫోటో దొరికిన వివరాలు, అందులోరాకేష్ ఫోటో, సంతకం, అతను బెంగళూరులో బస చేసిన రూములో ఎంక్వయిరీ చేసి, అతని ఫ్యాక్టరీకి, అక్కడి నించి అతని ఫ్లాటుకు వెళ్ళింది, అక్కడ దొరికిన కత్తి, రక్తం మరకలు నిండిన షర్ట్…  ఆఖరుగా హోటల్లో మారు పేరుతో సంతకం, ఆ రోజు అతను అక్కడే బస చేసి ఉన్నాడని చెప్పడానికి ఆధారం, పచ్చరంగు సిరా.

          “రిమార్కబిల్ మాధవరావ్! మీకు ప్రమోషన్ ఎప్పుడు కావాలో చెప్పండి.”

          “అతన్ని పట్టుకున్న తరువాత ఇవ్వండి సార్.”

          “సిగరెట్ లోపలి అట్ట మీద కూడా మాయా అని వ్రాసి ఉందా?”

          “అవునుసార్. ఒకవేళ మనల్ని టీజ్ చెయ్యడానికి ఆలా ఆధారాలను వదిలేసి వెళ్ళాడా?”

          “ఇది ఒక విధమైన సిండ్రోం. ఆ వ్యక్తి కొంచం మెంటల్లీ అప్ సెట్ గా ఉంటాడు అనిపిస్తోంది.”

          “ఎలా చెబుతున్నారు సార్?”

          “పచ్చరంగు సిరా, ఆ తరువాత ఇలా మాయా అని వ్రాసి ఉండడం. తనను పట్టుకుంటారా లేదా అని పోలీసులకి సవాల్ చేస్తున్నట్లుగా లేదూ? అతని గురించి ఫ్రెండ్స్ ఏమని చెప్పారు?”

          “కొన్నిసార్లు ఫ్రెండ్లీగా ఉంటాడని, మరి కొన్నిసార్లు మూడీగా ఉంటాడని చెప్పారు.”

          “ఇట్ఫిట్స్!”

          “చేతివ్రాత ఇంత వరకు మూడు సాంపిల్స్ దొరికాయి. అన్నిటినీ ఎక్స్పర్ట్ కి ఇచ్చాను. హోటల్ రిజిస్టర్ లో శేఖర్ అన్న మారుపేరు ఉపయోగించాడు. అతని ఫ్లాటు లో దొరికిన రక్తపు షర్ట్ , కత్తి లాబ్ కి పంపించాను. కత్తి మీద ఉన్న రక్తం, మూర్తిది ఒకేగ్రూప్ అని తేలింది. కత్తి బ్లేడులో ఫింగర్ప్రింట్స్ఉన్నాయి. అతన్ని అన్ని కార్నర్స్ లోనూ ట్రాప్చేశాము.”

          “కానీ ఇంకా అతను పట్టు బడలేదు.”

          “చెన్నై పోలీసులకి మెసేజ్ ఇచ్చాను. ఫోటో పంపించాను. ఎక్కడ కనబడినా వెంటనే అరెస్ట్ చేయమని. మిసెస్ ఉమకి టెలిగ్రాం ఇచ్చాను. అతనితో జాగ్రత్తగా….”

          మధ్యలోనే అడిగారు.“మోటివ్ ఏమిటో తెలిసిందా?”

          “కారణం ఇంకా తెలియదు. మొదట అతను చేతికి చిక్క నివ్వండి.”

          “బెంగళూరులోనూ అతన్ని వెతికించే ఏర్పాట్లు…”

          “చేయించాను సార్. అన్నిపోలీస్ స్టేషన్స్ కి ఫోటో కాపీ పంపించాను.”

          “అతని తల్లితండ్రులు ఎక్కడ ఉన్నారు?”

          “తండ్రి మాత్రమే ఉన్నారు. జర్మనీలో.”

          “ఒక వేళ జర్మనీకి ఎస్కేప్ అయి ఉంటే?”

          “అలా చెప్పకండి ప్లీజ్.”

          “అన్నిఆస్పెక్ట్స్ చూడాలి. ఎందుకైనా మంచిది, విమానాశ్రయంలో ఎంక్వయిరీ చేయండి. అతనికి పాస్ పోర్టు ఉందా. ఎంత కాలం వాలిడ్ అని చూడండి.”

          “ఓ యెస్. అది కూడా చూడాలి కదా.”

          “మాధవరావ్! మీ సహనాన్ని ఎప్పుడూ మెచ్చుకుంటానంటే, అతను దొరికిన తరువాత.”

          “ఓ.కె. అతను దొరికిన తరువాతే.” మాధవరావు తన హేటును పెట్టుకుని, స్టిఫ్ గా సల్యూట్ చేసి నిష్క్రమించారు.

***

          ఉమ చూసింది.“ఏది రాకేష్? ఎక్కడ ఉంది మాయా?”

          “అదిగోచూడు.”

          అతణు చూపించిన దిశలో టి.వి.ఆంటెనా, నీలం రంగు ఆకాశం మాత్రమే కనిపిం చాయి.

          “ఏమయ్యింది? ఎవరిని చూపిస్తున్నారు?”

          “ఆకాశాన్ని! అదేమాయ అంటే. నీలి రంగులో కనబడుతుంది. కాని దగ్గిరికి వెళ్ళి దానిని తాకగలమా? ఆ నీలి రంగు ఒక భ్రమ మాత్రమే. అలాగే మాయ అన్నది వట్టి భ్రమ.”

          “ఏమంటున్నారు మీరు? అర్థం కావడం లేదు.”

          “ఉమా! మాయా అని ఎవరూ లేరు. అది ఒక కల్పితమైన పాత్ర.”

          “ఆమె వ్రాసినట్లు ఉత్తరాన్ని చూపించారు మరి?”

          “నేనే వ్రాశాను.”

          దిగ్భ్రమ చెందింది.“ ఎందుకు అలా చేశారు?”

          “నువ్వు మూర్తిని ద్వేషించాలని, అతన్ని మర్చి పోయి నన్ను తలచుకోవాలని.”

          “ఎంత సిల్లీగా మాట్లాడుతున్నారు?”

          “నన్ను క్షమించు ఉమా. నిన్ను ఎంతగా ఆరాధిస్తున్నానో మళ్ళీ మళ్ళీ చెప్పడం నాకు ఇష్టం లేదు. నిన్నుఆ దుఃఖం నుంచి ఎలా మళ్ళించాలో నాకు అర్థం కాలేదు. నీ జీవితంలో మళ్ళీ వెలుతురు రావాలని, నా జీవితంతో నిన్నుముడేసుకోవాలని… వీటిని ఎలా నెరవేర్చగలను? అప్పుడే ఈ ఐడియా వచ్చింది. మాయా అన్న ఒక స్త్రీనీ భర్త గత జీవితంలో ఉన్నట్లు, మూర్తి ఆమెను కోరుకున్నాడని ఒక భ్రమను ఏర్పరిస్తే మూర్తి మరణం తాలూకు దుఖాన్నించి నువ్వు త్వరగా కోలుకోగలవని అనుకున్నాను. అందుకే ఒక ఉత్తరం వ్రాసి నీకు ఇచ్చాను. నిన్ను నేను ఎంతగా ప్రేమిస్తున్నానో ఈ పాటికి నీకు అర్థం అయ్యే ఉంటుంది.”

          ఉమ రెండు చేతులతో తలను పట్టుకుంది. “ఓమైగాడ్! మూర్తి ఎందుకు హత్య చేయబడ్డారు అని తెలుసుకోవడానికే ఇవన్నీ చేశాను. ఇప్పుడు ఆ ప్రశ్న అలాగే ఉండి పోయింది.”

          “అవును” అన్నాడు రాకేష్. “ఉమా! నిన్నుతప్పుదోవ పట్టించినందుకు నన్ను క్షమిస్తావా? నాకు అబద్దం ఆడటం చేతకాదు.”

          ఉమ వినోదంగా నవ్వింది.

          “అమ్మయ్య! నవ్వేసావు.”

          “మీరు చాలా క్రేజీగా బిహేవ్ చేస్తున్నారు. నేను బయలు దేరుతాను.”

          “ఉండు. ఆనంద్ ఇక్కడికి వస్తాడని చెప్పావుగా?”

          “అతను ఆఫీసు నించి రావడానికి ఆలస్యం అవుతుందని అనుకుంటాను. రాకేష్! ఒక సాయం చేయగలరా. నన్ను మా యింటి వరకూ దింపగలరా?”

          “ఓయెస్. సంతోషంగా. నా మోటార్ సైకిల్ లో వస్తావా?”

          “మోటార్ సైకిల్ వద్దు. ఆటో, టాక్సీ ఏదైనా సరే. బస్ స్టాండు దాకా తోడుగా వచ్చినా చాలు.”

          “వద్దు వద్దు. టాక్సీలో వెళదాం.”

          “మా యింటికి కాస్త ముందుగానే దిగి పోదాము. సరేనా?”

          రాకేష్ నవ్వాడు.“నువ్వు ఎలా చెబితే అలా.”

          “ఎందుకు నవ్వుతున్నారు?”

          “నువ్వుఇంకా లోకం చూసే చూపులకు భయపడుతున్నావు ఉమా. నువ్వు స్వతంత్రురాలివి. మనం స్వతంత్రులం.”

          “అలాంటి ఫీలింగ్ రావడానికి ఇంకా కొన్ని రోజులు  పోవాలనుకుంటాను. మిమ్మల్ని చూస్తే జాలి వేస్తోంది రాకేష్.”

          “థాంక్స్!”

          “నా కోసం ఒక అబద్దాన్ని సృష్టించి. దానిని అలాగే కొనసాగించలేక మధ్యలోనే అబద్దాలు ఆడటం చేతకాదని నిజాన్ని ఒప్పుకుని.. హౌ స్వీట్!”

          “ఇదంతా నేను చేసింది మీ కోసమే.”

          “నీ కోసమే అని చెప్పండి.”

          “అయితే ఒక షరతు! నువ్వూ నన్ను రాకేష్ అని పిలవాలి. సరేనా?”

          “సరే. రాకేష్!”

          ఉమ నవ్వింది. ఆమె గుండెలో చాలా రోజుల తరువాత ఉత్సాహం ఉప్పెనలా పొంగి వచ్చింది. ఇతను నన్ను ప్రేమిస్తున్నాడు. నేనెలా ఉన్నా నన్ను అలాగే స్వీకరించడానికి తయారుగా ఉన్న మనిషి. నా దుఖాన్ని తగ్గించడం కోసం, మరపింప చెయ్యడం కోసం అబద్దాలు ఆడి…. చంటి పిల్లాడి మనస్తత్వంలా అనిపించింది ఉమకి. తనకు మళ్ళీ జీవితం అంటూ ఒకటి ఏర్పడితే అది ఇతని వల్లనే సాధ్యం!

          బయలు దేరే ముందు, “మీకు… సారీ… నీకు నా చేతులతో కాఫీ చేసి ఇవ్వనా ఉమా?” అన్నాడు రాకేష్.

          “వద్దు. నేను నీకు కాఫీ చేసి ఇచ్చే రోజు త్వరలోనే వస్తుందని అనిపిస్తోంది రాకేష్”

          “అలాగా!” కళ్ళువిప్పార్చి చూశాడు. సన్నగా ఈల వేయడానికి ప్రయత్నించాడు.

          “కొంచం ముందు నాకు ఏమని అనిపించిందో తెలుసా? నీకు మతి భ్రమించిం దనుకున్నాను.”

          “నిజమే! పిచ్చి వాడినే. ఉమ కోసం” అంటూ టాక్సీని పిలిచాడు.

***

          టెలిగ్రాము ఐదున్నరకి వచ్చింది. నాలుగైదు టెలిగ్రాములను సేకరించుకుని టెలిగ్రాం మెసెంజరు బయలు దేరేటప్పటికి ఐదు నలభై అయిదు అయ్యింది.

          “ఆనంద్ కి ఫోన్ చేసి చెప్పాలి, నేరుగా ఇంటికి వచ్చెయ్యమని.”

          “నేను ఫోన్ చేస్తాను ఉమా” అన్నాడు రాకేష్.

          టాక్సీ డ్రైవర్ అడిగాడు.” ఎక్కడికి సార్ వెళ్ళాలి?”

          ఉమ అడ్రస్ చెప్పింది.

          “ఉమా! నీకొక సవాల్!”

          టెలిగ్రాం మెసెంజర్ ఒక ఇంట్లో గ్రీటింగ్స్ టెలిగ్రాము ఇచ్చి, సైకిల్ లో మరో వీధి మలుపు తిరిగాడు.

          “నువ్వు నన్ను స్వీకరించాక ఇంకా ఈ విషయాన్ని ఎందుకుదాచాలి?”

          “అందుకు ఏం చేయాలి?”

          “ఎందుకు వీధి చివరన దిగడం మీ ఇంటి వరకూ వెళ్ళి ఇద్దరమూ కలిసి వాకిటి ముందు దిగుదాం.”

          “అయ్యో! మా అత్తగారు చూసిందంటే గుండె ఆగిపోతుంది తనకి.”

          “ఇక మీద ఆవిడ నీకు అత్తగారు కాదు. ఏదో ఒక రోజు ఆవిడకీ షాక్ ఇవ్వాల్సిందేగా. ఆలస్యం చేయడం ఎందుకు?”

          “అయినా కూడా…”

          “ఏమిటి అయినా కూడా? ఇక మీద నేను అన్నీ చూసుకుంటాను. నీ మంచీ చెడు అన్నీ నాకు వదిలెయ్యి. భయపడకుండా రా. ఎవరికీ భయపడవలసిన అవసరం లేదు. నువ్వు నా దానివి ఉమా.”

          ఉమకి కాస్త జంకుగానే ఉంది. కానీ మనసులో ఒక మూల అతను చెప్పేదాంట్లోనూ న్యాయం ఉన్నట్లు అనిపించింది. ఇక మీద నాకూ వాళ్ళకీ ఏమిటి సంబంధం? మూర్తి చనిపోయిన తరువాత అక్కడ నాకే ముంది? ఎవరు నన్ను ప్రశ్నించగలరు? అయినా కూడా…

          మూర్తిని హత్యా చేసింది ఎవరు? ఎందు కోసం హత్య చేయబడ్డాడు? కారణం ఇంకా తెలియ లేదే?’

          అది తెలిసినంత మాత్రాన ఏ విధంగా తన జీవితం మారబోతుంది? అది ఒక పీడకల. మూర్తి పెళ్ళికాక ముందు ఏదో తప్పు చేసి ఉండాలి. అందుకే ఆ శిక్ష అనుభ వించాడు. అది తెలుసుకోవడం వల్ల నాకు లాభం ఏమిటి? నాకు జీవితం మునుముందు ఎంతో ఉంది. నన్ను ఇంత ప్రేమించే వ్యక్తి ఇంకొకడు ఉంటాడా? ఇదే సరియైన తరుణం.

          “సరే. ఇంటి ముందే దిగుదాం.”

          “దట్ఈస్ది గర్ల్!”

          “ఇక్కడ ఉమ అనేది ఎవరండి?”

          టెలిగ్రాం మెసెంజర్ అడిగిన ప్రశ్నకి ఆ చిన్నపిల్ల పెదవి విరిచి, మళ్ళీ తన ఆటలో మునిగి పోయింది.

          “14/4 ఎక్కడ ఉంది?”

          “ ఇది13/1” అని జవాబు వచ్చింది.

          టెలిగ్రాం మేసంజర్ అక్కడికి వెళ్ళినప్పుడు రాకేష్ టాక్సీకి డబ్బులు ఇస్తున్నాడు. ఉమ కంగారుగా అటూ ఇటూ చూసింది. అమ్మయ్య! ఈ రోజు గుడికి వెళ్ళి ఉంటుంది.

          టెలిగ్రం మెసెంజర్ రాకేష్ దగ్గరికి వచ్చాడు.“ఉమ ఎవరండీ?”

          “అదిగో! ఆవిడే ఉమ.”

          “టెలిగ్రాం వచ్చింది ఆమెకి.”

          “ఉమా! నీకు టెలిగ్రాం వచ్చిందట.”

          “సంతకం పెట్టి తీసుకోరాదూ. నా దగ్గర పెన్ను లేదు.”

          రాకేష్ సంతకం పెట్టి టెలిగ్రాం తీసుకుని ఉమ చేతికి ఇచ్చాడు. ఉమ దాన్ని విప్పి చూసింది. సాయంత్రం మసక వెలుతురులో అక్షరాలు స్ఫష్టంగా కనిపించ లేదు. మళ్ళీ రాకేష్ కి ఇచ్చి.“కాస్త ఉండండి. వరండా లైటు వేసి వస్తాను” అని అంది.

          లోపలికి వెళ్ళి వరండా లైటు వేసి వచ్చినప్పుడు రాకేష్ టెలిగ్రామును పరిశీలనగా చదవడం చూసింది.“టెలిగ్రాం లో ఏమని ఉంది?” అని అడిగింది.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.