మా కథ (దొమితిలా చుంగారా)- 50

రచన: దొమితిలా చుంగారా 

అనువాదం: ఎన్. వేణుగోపాల్ 

          కొన్ని కుటుంబాలు ఆకలికి అల్లల్లాడిపోవడం మొదలైంది. అప్పుడు స్త్రీలు “ప్రజా వంటశాలలు” తెరిచి ఎవరూ ఆకలి బారిన పడకుండా చూడాలని ప్రకటించారు. వాళ్ళు గని శిబిరాలన్నీ తిరిగి తిండి పదార్థాలు సేకరించుకొచ్చేవారు. వీళ్ళ సేకరణలో ప్రతి ఒక్కరూ తమ దగ్గర ఏదుంటే అది ఇచ్చేశారు. కొంచెం పిండి, బియ్యం , సేమ్యాలు… ఏవంటే అవే…! అవి తీసుకొచ్చి చాల అవసరమున్న వాళ్ళకు పెట్టేవారు.

          అలాగే లాపాజ్ నుంచీ, కొచబాంబా నుంచి కొన్ని బట్టలూ, కొన్ని తిండి పదార్థాలు వచ్చాయి. కాని వాటిని సైన్యం ప్లాయావెడ్డి ప్రధాన ద్వారం దగ్గర ఆపేసి లోపలికి రానివ్వ లేదు.

          సమ్మె నడిచినంత కాలమూ వేరు వేరు చోట్ల నుంచి మాకు సంఘీభావ ప్రకటన లందుతూనే ఉన్నాయి. యూనివర్సిటీ విద్యార్థులు, ఫ్యాక్టరీ కార్మికులు, రైతులు, ప్రైవేట్ గనుల కార్మికులు… ఎందరెందరో మాకు తమ మద్దతు ప్రకటించారు. కాని రేడియోలోనూ, పత్రికల్లోనూ ఈ ప్రకటనల్లో ఒక్క ముక్క కూడా రాలేదు.

          అప్పుడు ఒక స్త్రీ తాను రెడ్ క్రాస్ తరఫున వచ్చానని చెప్పుకొని కటావి స్త్రీ జనాన్నంతా ఒక చోట కుప్పజేసి “బిడ్డలారా! మీ భర్తలను పనిలోకి వెళ్ళమని చెప్పండి. మళ్ళీ ఒక హత్యాకాండ జరగాలని ఉందా మీకిక్కడ? ఎలాగైనా మీరు మీ భర్తలని ఒప్పించి సమ్మెను ఆపేయించాలి. విదేశీ తొత్తులకు మీ భర్తల్ని కిరాయికి పోనిస్తారా మీరు…” అని చాల నాటకీయంగా, మధ్య మధ్య ఏడుస్తూ మాట్లాడిందట. అప్పుడొక, స్త్రీ “సరేనమ్మా మా బాగా చెప్పొచ్చావ్ – కాని, పనిలోకి పొమ్మని అడగడానికైనా నా భర్త నా దగ్గర లేడుగా, జైల్లోనే ఉన్నాడుగా, పన్లోకెలా వెళ్తాడు? బతకడానికి సరిపోయినంత దొరకడం లేదనీ, జీతం పెంచమనీ అడగడం తప్ప ఆయన చేసిన తప్పేముంది? తిండి సంపాయించు కోవడానికి నేను నా బట్టలమ్ముకున్నాను. నా నగలమ్ముకున్నాను. నా పెళ్ళి ఉంగరం అమ్ముకున్నాను. ఈ దుర్భర దారిద్రియాన్ని ఎవరు సరిచేయాలి? మేం ఎవరికోసం పని చేయాలి? మా భర్తలు ఎవరికోసం పని చేసీ చేసీ ప్రాణాలు పోగొట్టుకోవాలి….” అని అడిగిందట.

          అప్పుడా స్త్రీ “ప్రతిదీ చర్చల ద్వారా పరిష్కారమవుతుంది. బిడ్డా…” అని శాంతంగా పలికిందట.

          దానితో మా వాళ్ళు ఆమెను అపనమ్మకంగా చూసి “నువు రెడ్ క్రాస్ నుంచి వచ్చాన న్నావే, ఏవీ నీ కాగితాలు?” అని అడిగారట. అప్పుడావిడ తాను రెడ్ క్రాస్ నుంచి రాలేదనీ, “జాతీయ మహిళల” నాయకురాలిననీ చెప్పేసిందట. అప్పుడిక మా వాళ్ళు..

          “మా నాయకుల్ని కష్టాలపాలు జేస్తూ మా పక్షం ఉన్నానని ఎలా అంటున్నావు నువ్వు?”

          “గర్భంతో ఉన్న ఈ సమయంలో దొమితిలా  చుంగారాను మీ రెన్ని బాధలు పెడుతున్నారు…” అని ఒకరి వెనుక ఒకరు అందుకున్నారట.

          “అమ్మో… ఆ స్త్రీ గురించా… ఆవిడ పేరెత్తకండి నా దగ్గర… ఆవిడకు విదేశాల నుంచి డబ్బులొస్తాయి… ఆవిడకు క్యూబన్లు, రష్యన్లు, చైనా వాళ్ళూ (రష్యాకూ, చైనాకూ మధ్య విభేదాలున్న సంగతి కూడ తెలియదు ఆవిడకు, పాపం!) డబ్బులు ధారపోస్తూనే ఉంటారు. ఆవిడ ఇప్పుడు సమ్మె చేస్తున్న వాళ్ళకి రోజుకి ముప్పై పిసోలిస్తోందట గదూ…” ఇక దాంతో మా వాళ్ళు చిర్రెత్తిపోయారట. ఆవిడ పాపం పరుగెత్తి వెళ్ళిపోవాల్సి వచ్చిందట.

          సరే – మొత్తం మీద వాళ్ళు సమ్మెను విచ్ఛిన్నం చేయలేకపోయారు. “మిమ్మల్నం దర్నీ ఉద్యోగాల్లోంచి తొలగిస్తాం” అన్నా కూడా కార్మికులు పనికి వెళ్ళలేదు. వాళ్ళింక సరుకుల దుకాణాన్ని వారం రోజుల పాటు మూసేశారు.

          అప్పుడు వాళ్ళు తమ మనుసు మార్చుకున్నారు. “సరుకుల దుకాణం తెరుద్దాం. వాళ్ళు సరుకులు కొనీ, కొనీ బాకీ పడతారు గదా… అప్పుడింక పనిలోకి రాకతప్పదు…” అనుకొని దుకాణం తెరిచారు. అలా మర్నాడు వేకువ జామున్నే స్థానిక ఏజెంట్ల భార్యలు దుకాణం తెరవడానికి వెళ్ళారట. కాని కొందరు స్త్రీలు “మా దుకాణం తీసేసుకున్నారు గదా… మాకేమొద్దు… మీరే ఉంచుకోండి…” అన్నారట. దుకాణం మీదికి రాళ్ళు విసిరారట. అప్పుడు దుకాణం మళ్ళీ మూసేశారట. పోలీసులొచ్చి దుకాణం తెరిచి, బాష్పవాయువు ప్రయోగించి కొందర్ని అరెస్టు చేసి పట్టుకు పోయారట.

          ఇలా శిక్షలతోనూ, బెదిరింపులతోనూ సమ్మెను విచ్ఛిన్నం చెయ్యలేక పోలీసులు నిరుద్యోగుల్ని పనిలోకి పిలవడం మొదలెట్టారు. వాళ్ళు పల్లెసీమల్లోకి కూడ వెళ్ళి రైతులకి తిండి పదార్థాలు పంచి పెట్టి గనుల్లో కొలువిస్తాం రమ్మని పిలిచారు. కొందరు సైనికులతో మామూలు దుస్తుల్లో పనిచేయించడానికి సిద్ధపడ్డారు కూడా.

          రైతులు వాళ్ళిచ్చినవి తీసుకున్నారు గాని గనిలోకి రావడానికి సిద్ధపడలేదు. వాళ్ళకు గని పని గురించీ, మా గురించి బాగానే తెలుసు. నేను కొందరు రైతుల్తో మాట్లాడి నప్పుడు “ఆ గనుల్లో అంత వరకూ మా బిడ్డలో, మనవలో పనిచేస్తూ ఉంటే, అక్కడ మేం వాళ్ళ నోట్లో మట్టి కొడతామా? అంతేగాక గని పని ఏమిటో మాకు తెలియదు. మాకు డైనమైట్ అంటే భయం…” అని చెప్పారు.

          ఇలా సైన్యం ఉపయోగించిన అన్ని ఎత్తుగడలూ నిరుపయోగమై పోయాయి. కొందరు నిరుద్యోగులు పనిలోకి వెళ్ళడానికి సిద్ధపడ్డారు గాని అక్కడెలా పనిచేయాలో వాళ్ళకేం తెలుసు? దాంతో పాపం ఇలాంటి వాళ్ళలో కొందరు చనిపోయారు కూడా.

          పోలీసులు మా రేడియోల్లో 55 శాతం మంది పనిలోకి వెళ్తున్నారని ప్రకటించారు. పత్రికల్లో కార్మికులు పనిచేస్తున్న ఫొటోలు వేశారు. కాని వాళ్ళెవరూ కంపెనీ కార్మికులు కారు. సమ్మె విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం వాడిన ద్రోహులు వాళ్ళు.

          స్త్రీలు ఇలాంటి సమ్మె విచ్ఛిన్నకులకు వ్యతిరేకంగా మెరుపుదాడి బృందాలుగా ఏర్పడ్డారు. ఒకరోజు ఉదయం అరింటికి కొందరు ద్రోహుల్ని తీసుకుపోతున్న ట్రక్కుల మీద సాల్ వదోరా శిబిరం దగ్గర స్త్రీలు రాళ్ళు విసిరారు. అప్పుడిక మగవాళ్ళు ఏమీ చేసే పరిస్థితి లేకుండింది గనుక స్త్రీలు, పిల్లలూ యాదృచ్ఛికంగా కొన్ని కార్యక్రమాలు తీసుకున్నారు.

          ఇంకా తెల్లావారక ముందే వాళ్ళు గని ప్రవేశ ద్వారాల దగ్గర నిలబడేవారు. కార్మికుల్ని లోపలికి తీసుకెళ్ళే డబ్బా ఎటూ కదలకుండా పిల్లల్ని పట్టాల మీద నిలబెట్టే వాళ్ళు. ఆ డబ్బా కదలాలంటే పిల్లల మీదుగా కదలాల్సిందే. ఇక గనిలోకి వెళ్ళే వాళ్ళను స్త్రీలు ఎట్లా చూసేవారో చెప్పలేం. నోటికొచ్చిన తిట్లల్లా తిట్టేవారు. “పిరికి వెధవలు! ఏడు, ఎనిమిది మంది పిల్లలతో మేం సమ్మెకు కట్టుబడి ఉంటున్నాం. నీకు అలా అమ్ముడు పోవడానికి సిగ్గులేదూ…” అని తిట్టిపోసి వాళ్ళ మీదికి రాళ్ళు విసిరేవారు.

          అప్పుడు వాళ్ళు స్త్రీలనక్కడి నుంచి లాగేయడానికి సైన్యాన్ని పంపించారు. కాని సైనికులు అక్కడిదాకా వచ్చి స్త్రీలనూ, పిల్లల్ని చూసి ఏం చేయడానికి చేతులాడక ఊరికే నిలుచున్నారట. అధికారులు మాత్రం “ఈ ఆడవాళ్ళందరూ కమ్యూనిస్టులు. మనం వీళ్ళను తొక్కి పారేయాల్సిందే… వాళ్ళు ఆడవాళ్ళూ కాదూ, వాళ్ళు పిల్లలూ కాదు… ఏమీ వెనకా ముందూ ఆలోచించకండి…. ” అని మొరిగారట.

          అప్పుడు వాళ్ళు సైన్యాన్ని మార్చింగ్ గీతం పాడుతూ స్త్రీల మీదికి పొమ్మన్నారట. అప్పుడక్కడ ఉన్న తల్లులూ, బిడ్డలూ “జయ జయ జయ హే మాతృభూమి బొలీవియా” అని పాడడం మొదలెట్టారట. ఆ దృశ్యం ఎంత బాగుండిందో! ఆ సైనికులు ఏమీ చేయలేకపోయారట. ఇక దాంతో అధికారులు రెచ్చిపోయి బాష్పవాయు ప్రయోగానికి, లాఠీచార్జీకి ఉత్తర్వు ఇచ్చారట. ఇలా సైనికులకీ, స్త్రీలకీ పిల్లలకీ మధ్య ఘర్షణ సాధ్యం కావడం లేదని చూసి వాళ్ళు లాపాజ్ నుంచి మహిళా పోలీసులను రప్పించారట. ఆ మహిళా పోలీసులు కరాటే శిక్షణ కూడ పొందిన బలిష్టులైన స్త్రీలు. వాళ్ళంతా మరుసటి రోజు ఉదయమే గని ప్రవేశద్వారం దగ్గర మా వాళ్ళకోసం కాచుకు కూచున్నారట. అది తెలిసి మా వాళ్ళసలు అక్కడికి వెళ్ళనే లేదు. ఆ రకంగా వాళ్ళు చేసిన ఈ ప్రయత్నమూ భగ్నమైపోయింది.

          ఇక వాళ్ళింకో ప్రయత్నం మొదలెట్టారు. జైల్లో ఉన్న కార్మికుల ఇళ్ళ మీద దాడి చేసి, కార్మికుల కుటుంబాలని తన్ని తరిమేశారు. ఆ కుటుంబాలన్నిటికీ 1965లో లాగనే ఇరవైనాలుగు గంటల్లోగా ఇళ్ళు ఖాళీ చేయాలని నోటీసులిచ్చారు. వెళ్ళడానికి గమ్యం ఏమీ లేనప్పుడు వాళ్ళు ఎక్కడికెళ్తారు? అందుకనే ఆ స్త్రీలు నోటీసుల్ని ఖాతరు చేయ లేదు. అప్పుడు సైన్యం కమీషనరూ, యాజమాన్యమూ కలిసి మహిళా పోలీసుల సాయం తో ఆ కుటుంబాలన్నిటినీ ట్రక్కుల్లోకెక్కించి పంపేశారు. అరెస్టయి ప్రవాసం పంపబడిన కార్మికుడు సెవెరో టారెస్ ఇంటికి మహిళా పోలీసులు ఉదయం ఏడు గంటలకే వచ్చారట. అప్పుడతని భార్య జబ్బుపడి ఉంది. వాళ్ళకు వరసగా ఎనిమిది మంది పిల్లలున్నారు. ఆమెను మంచంలోంచిలేపి, ఆమెనూ, పిల్లల్నీ, సామానునూ ట్రక్కులోకి ఎక్కించడానికి మహిళా పోలీసులు ప్రయత్నించినపుడు ఆ దృశ్యం హృదయ విదారకంగా కనిపించింది. ఒకడు టీ సీసా నోట్లో పెట్టుకొని వచ్చాడు. మరొకడు పంచదార నీళ్ళ సీసా నోట్లో పెట్టుకొని వచ్చాడు. మరొకడు బ్రెడ్ ముక్క నములుతూ వచ్చాడు. అందరికందరూ ఒంటి మీద నూలుపోగు లేకుండా చలికి గజగజ వణకుతూ ఉన్నారు.

          మహిళా పోలీసుల్లోనే ఒకావిడ ఈ దృశ్యం చూసి తట్టుకోలేక ఇంటివెనకకెళ్ళి వల వలా ఏడ్చిందట. ఒక కార్మికుడు ఆమెను చూసి “ఎందుకు ఏడుస్తావు? ఏడవకేడవకు. వాళ్ళ తండ్రి ఎవరో తెలుసునా? ఆయన ఒక కార్మికుడు. గని కార్మికుల మహాసభకు వెళ్ళి అక్కడ ఆయన జీతాల పెంపుదల డిమాండ్ ను ఆమోదించి వచ్చాడు. అంటే ఆయన తన పిల్లల చేతుల్లోకి మరి కొంచెం బ్రెడ్ తేవాలనీ, ఆ నీళ్ళ సీసాలో, టీ సీసాలో పాలు నింపాలనీ అనుకున్నాడు. అదే నేరం. అందుకనే వాళ్ళను తన్ని పంపించడానికి మిమ్మల్ని పిలిపించారు…” అన్నాడట.

          అప్పుడా పోలీసావిడ మరింత శోకాలు పెట్టి తనకు లాపాలో చెప్పింది ఒకటనీ, ఇక్కడ చూస్తున్న దృశ్యం ఒకటనీ చెప్పిందట. అలా ఆ కుటుంబాన్నంతటినీ లాపాజ్ తరలించుకు వెళ్ళారు. అప్పటికీ ఇప్పటికీ వాళ్ళకేమైందో మాకు తెలియదు.

          ఖచ్చితంగా అరెస్టయి జైళ్ళలో ఉన్నవాళ్ళెంత మందో, బందీలుగా ప్రవాసం పంపబడిన వాళ్ళెంతమందో మాకు తెలియదు. ఒక్క సైగ్లో-20లోనే ఇరవై కుటుంబాలు ఈ పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చింది. దేశంలో ఎన్నోచోట్ల జరిగినదానికి ఇది మచ్చుతునక.

          ఇలా ఇళ్ళు ఖాళీ చేయించిన వాళ్ళందరినీ సాజులియన్‌కు పంపాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నదని కొందరన్నారు. శాంతాక్రజ్ రాష్ట్రంలో సాన్ జులియన్ ఒక ఉష్ణ ప్రదేశం. మేం మాది చలిప్రాంతం కాబట్టి మా వాతావరణానికి అలవాటుపడ్డాం గాని ఉష్ణప్రాంతాన్ని తట్టుకోలేం. ముఖ్యంగా గని రోగం వచ్చి ఉన్నప్పుడు వేడిమిని భరించడం అంటే చావుకు దగ్గరకావడమన్న మాట. కాని అది చాల సారవంతమైన ప్రాంతం. అక్కడ పని చెట్లు కొట్టడం దగ్గరి నుంచి ప్రారంభించాలి. అందుకు ఎన్నో పరికరాలూ ఎంతో డబ్బు కావాలి గదా?! అవిలేక, అక్కడికెళ్ళిన గని కార్మికులు సేవకులుగా మారిపోయారు.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.