ఆలీబాబా అనేక దొంగలు…..దేశరాజు కథలు

– సి. సుజాత

 
 
 

          నవలకి సూక్ష్మ రూపమే కదా కథ. పూర్తి జీవితం గురించి చదివిన ఫీలింగ్ వస్తుంది కనుకే నాకు కథే ఇష్టం. సంపుటిలోని 13కథలు చాలా కథలు వివరంగా రాయవలసినంత బాగున్నాయి. చిలుక…..కూడా అపార్ట్ మెంట్ సంస్కృతికి సంబంధించినది కనుక కొంచం దగ్గరగా ఫీల్ అయ్యా. ఆలీబాబా అనేక దొంగలు ఐతే ఏదో కళ్ళ ముందు జరిగినట్లే ఉంది. మా అపార్ట్ మెంట్‌లో మేం అద్దెకు దిగిన కొత్తలో ఒక ముస్లిం కుటుంబం ఒక్కటే ఉండేది. ఇది 85 ఇళ్ళున్నది. ఏ చిన్న వేడుక జరిగినా మొత్తం అన్ని ఇళ్ళ వాళ్ళు భోజనాలు చేస్తారు. కానీ ఆ ఒక్క కుటుంబం చివరగా సర్డుకున్నట్లో లేదా వాళ్ళకి సంబంధించిన కొద్దీ మంది బంధువులతో ఒక కార్నర్ లో వంటలు వండుకునే వాళ్ళు. అక్కడే భోజనాలు.. తరవాత ఆ ఇల్లు అమ్ముకున్నారా లేదో తెలియదు కానీ వాళ్ళు లేరు ఇప్పుడు. ఎందుకు అందరూ ఒకటి కాదు అంటే కాదు. కనిపించని ఒక ఇనుప తెర మాటున అందరం దాక్కుని దొంగల్లాగా నటిస్తాం, మాకేం బేధాలు లేవు అని. కానీ ఉన్నాయి. అనేక  దొంగలు.. అందరిలో ఒక దొంగ.. మంచి బట్టలు వేసుకుని హుందా తనం నటించే దొంగ మనలో ఉన్నాడు లేదా పిరికి తనంతో ఎవరినీ సమర్థించకుండా,  ఒప్పుకోకుండా మన తలుపులు వారగా వేసుకుని లోపల భద్రంగా ఉన్నాం. చెప్పాను చాలా సార్లు నేనో పత్రిక ఎడిటర్ గా ఉంటాను అని అడిగితే మిగతా వాళ్ళు నీ టోన్ లో కనిపించే, వినిపించే జాలితో సంపాదకీయం రాస్తే చండాలంగా ఉంటుంది అని తేల్చారు. ఒక కులంలో నా ప్రమేయం లేకుండా జన్మించినందుకు నా ఆప్తుల అభిప్రా యంలో నేను అంతే.

          ఏమంటాను? కథ చాలా గిల్లినట్లైంది. కిక్కురు మనకుండా ఊరుకోవడం. భలే కథ రాసావు దేశరాజు. కవి దుర్భేద్య, కాసేపు మనిషి, కుదుపు కథలు అన్ని మంచివే. సంకలనంగా వస్తే తప్ప కథలు చదివే ఛాన్స్ లేదు. ఇంతకు ముందు కొన్ని పత్రికలు ఉండేవి. ఇప్పుడు అన్ని ఆన్లైన్ లోనే. సత్యవతి గారు రాసిన పిల్లాడోస్తాడా కథ లాగా భలే బాధ పెట్టింది ‘కుదుపు’ కథ. అంతలాగే మనసులో ఒక అనీజీ నేస్. మా ఇంట్లో మూడు గదుల్లో, ఒక హాల్లో అందరం ఎవరి ఫోన్లలో వాళ్ళుగా ఉంటాం. తిండి కోసం తప్ప వేరేగా కలిసి కూర్చోవటం లేదు. అసలు రోజుకు కొన్ని మాటలు కూడా లేవు. దేశరాజు చాలా తెలివైన కథలే రాశాడు. నా ఉద్దేశ్యం కథ చెప్పటం వస్తె దేన్నైనా చెప్పచ్చు. కవి దుర్భేద్యలో చాలా మంది కనపడ్డారు. నిజమే పీఠాధిపతిగా ఉండటంలో ఒక సౌకర్యం ఉంది. బోలెడుమంది శిష్యులు, మీటింగ్స్, పుస్తకాలు అచ్చువేయటం వంటి కాలక్షేపం పనులు చాలానే దొరుకుతాయి. 13కధలున్న ఈ పుస్తకం వెల 200 రూపాయిలు.

*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.