పౌరాణిక గాథలు -14

-భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి

పట్టుదల – ఉదంకుడు కథ

          మహర్షుల్లో గొప్పవాడు గౌతమ మహర్షి. ఆయన దగ్గరకి విద్య నేర్చుకునేందుకు ఎంతో మంది విద్యార్ధులు వస్తుండేవాళ్ళు. వాళ్ళందరు మహర్షి చెప్పినట్టు విని విద్య నేర్చుకునేవాళ్ళు.

          ఆ రోజుల్లో శిష్యులకి విద్య నేర్చుకోవడం అయిపోయిందో లేదో గురువుగారే నిర్ణయిం చేవారు. ఆయన ఒక్కొక్కళ్ళనే పిలిచి “ఒరే అబ్బాయ్! నువ్వు ఎంత వరకు నేర్చుకున్నా వు?” అని అడిగేవారు.

          వాళ్ళు చెప్పినదాన్ని బట్టి కొన్ని ప్రశ్నలు వేసి వాళ్ళ చదువు పూర్తయిందో లేదో నిర్ణయించేవారు. జవాబులు బాగా చెప్పాడు అనిపిస్తే అతడికి అవసరానికి కావలసినవి ఇచ్చి ఇంటికి పంపించేసేవారు.

          ఆయన దగ్గర చదువుకున్న శిష్యుల్లో ఉదంకుడు ఒకడు. గురువుగారి దగ్గర విద్య పూర్తి చేసుకుని ఎంతో మంది శిష్యులు వెళ్ళిపోతున్నారు, కొత్తవాళ్ళు వస్తున్నారు.

          కాని, ఉదంకుడికి మాత్రం వెళ్ళిపోవడానికి గురువుగారి అనుమతి దొరకలేదు. ఎప్పటికయినా నీ చదువు అయిపోయింది ఇంక ఇంటికి వెళ్ళచ్చు అంటారేమో అని ఎదురు చూస్తున్నాడు.

          ఉదంకుడికి గురుభక్తి ఎక్కువ. ఎప్పుడూ గురువు మాటకి ఎదురు చెప్పేవాడు కాదు. వినయ విధేయతలతో మెలిగేవాడు. ఒకరోజు ఉదంకుడు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తల మీద పెట్టుకుని తెచ్చి గురువుగారి ఇంట్లో పెట్టాడు.

          కట్టెలు కింద పెట్టినప్పుడు కట్టెలకి అతుక్కుని కొన్ని వెంట్రుకలు తల నుంచి ఊడి వచ్చాయి. వాటిలో కొన్ని తెల్లగా కనిపించాయి. అవి చూసి గట్టిగా ఏడవడం మొదలు పెట్టాడు.

          అతడి ఏడుపు విని గురువుగారు భయపడి కూతుర్ని పిలిచి అతడి కళ్ళనీళ్ళు కింద పడకుండా దోసిలి పట్టమన్నారు.

          వెంటనే గురువుగారి కూతురు పరుగెత్తుకుని వెళ్ళి ఉదంకుడి కళ్ళ నీళ్ళు కింద పడకుండా దోసిలి అడ్డుపెట్టింది. భూదేవి ‘హమ్మయ్య’ అనుకుంది. అంత గురుభక్తి కలవాడు ఉదంకుడు.

          గురువుగారు ఉదంకుణ్ని “ఎందుకేడుస్తున్నావు?” అని అడిగారు.

          “గురువుగారూ ! మీ దగ్గర చాలా మంది శిష్యులు విద్య నేర్చుకుని వెళ్ళిపోతున్నారు. నా విద్య ఎప్పుడు పూర్తవుతుందో, నన్ను ఎప్పుడు పంపిస్తారో తెలియట్లేదు. నా జుట్టు కూడా తెల్లగా అయిపోతోంది. అందుకే ఏడుపొస్తోంది” అన్నాడు.

          “ఉదంకా! నువ్వు గురుభక్తి కలవాడివి. నీ చదువు ఎప్పుడో అయిపోయింది. నీ మీద గల అభిమానంతో నిన్ను విడిచి ఉండలేక పంపించలేదు.

          నువ్వు బాధపడుతున్నావు కనుక నీ తరిగి పోయిన వయస్సు తిరిగి వచ్చేటట్టు చేసి నీకు నా కూతుర్ని ఇచ్చి పెళ్ళి చేస్తాను సుఖంగా ఉండు” అన్నారు గురువుగారు.

          అన్నట్టుగానే గురువుగారు ఉదంకుడికి తన కూతుర్ని ఇచ్చి పెళ్ళిచేశారు. తను ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని వెడుతూ ఉదంకుడు గురువుగార్ని గురుదక్షిణగా ఏం కావాలో అడగమన్నాడు.

          గురువుగారు ఏదీ వద్దన్నారు. గురుపత్ని ఉదంకుణ్ని మిత్రసహు మహారాజు భార్య దమయంతి దగ్గర కుండలాలు ఉన్నాయి వాటిని తెచ్చిపెట్టమని అడిగింది.

          ఉదంకుడు కుండలాల కోసం వెడుతుండగా దార్లో రక్తంతో తడిసిన శరీరంతో ఉన్న ఒక రాజు ఉదంకుడి మీద పడి “ఆకలిగా ఉంది నిన్ను తినేస్తా!” అన్నాడు.

          అతడితో ఉదంకుడు “నేను గురువుగారి పనిమీద వెడుతున్నాను. పని పూర్తి చేసుకుని వస్తాను. అప్పుడు తిందువుగాని, ఇప్పుడు మాత్రం నన్ను వదిలెయ్యి” అన్నాడు.

          “మళ్ళీ వస్తావని ఏమిటి నమ్మకం. నువ్వు ఎక్కడికి వెడుతున్నావో చెప్పు” అన్నాడు రాజు.

          “మిత్రసహు మహారాజు ధర్మపత్ని దగ్గరున్న కుండలాలు తెచ్చుకునేందుకు వెడు తున్నాను” అన్నాడు ఉదంకుడు.

          రాజు అతడి మాటలు విని “నువ్వు వెడదామనుకుంటున్న మహారాజుని నేనే. అయినా ఏ ఆనవాలూ లేకుండ వెడితే నిన్ను లోపలికి ఎవరు రానిస్తారు? నువ్వు మంచి వాడిలా కనిపిస్తున్నావు. నేను ఆనవాలు ఇస్తాను. దాన్ని చూపించి కుండలాలు తెచ్చుకో” అని రాజు తన ఆనవాలు ఉదంకుడికి ఇచ్చాడు.

          దాన్ని తీసుకుని మహారాణి దమయంతి దగ్గరకు వెళ్ళి కుండలాలు తెచ్చు కున్నాడు ఉదంకుడు. వాటిని నేల మీద పెట్టవద్దని మరీ మరీ చెప్పింది రాణి.

          కుండలాలు రాజుకి చూపించి, వాటిని గురుపత్నికి ఇచ్చి మళ్ళీ వస్తానని చెప్పాడు ఉదంకుడు.

          అతడి మాటలకి “ఉదంకా! నువ్వు పట్టుదల కలవాడివి. అసలు బ్రాహ్మణులే అంత. నేను ఈ విధంగా మారడానికి బ్రాహ్మణుడి శాపమే కదా కారణం. నువ్వైనా నన్ను రక్షించ వచ్చు కదా?” అన్నాడు రాజు.

          అతడి బాధని అర్ధం చేసుకుని ఉదంకుడు “రాజా! బాధపడకు. నీకు మంచే జరుగుతుంది!” అని రాజు భుజం మీద చెయ్యి వేశాడు. వెంటనే రాజుకి శాపవిమోచనం కలిగింది.

          ఉదంకుడి గురుభక్తికి అంత శక్తి ఉందన్నమాట! ఉదంకుడు కుండలాలు తీసుకుని గురువు దగ్గరికి బయలుదేరాడు. నడుస్తూ నడుస్తూ ఆకలేసి చుట్టూ చూశాడు.

          దగ్గర్లో ఒక పండ్ల చెట్టు కనిపించింది. పండ్లు కోసుకుని తిందామని తన చేతిలో ఉన్న మూటని చెట్టు కొమ్మ మీద ఉంచాడు.

          పండ్లు కోసుకుంటూ ఉండగా చెట్టు కొమ్మ మీద పెట్టిన మూట కింద పడిపోయింది. ఒక నాగు పాము ఆ మూటని పట్టుకుని పాతాళానికి వెళ్ళిపోయింది.

          ఉదంకుడికి చాలా కోపం వచ్చింది. ఏమయినా సరే దీన్ని విడిచి పెట్టను! అంటూ ఒక కర్రముక్క కోసం వెతికాడు. దానితో నేల మీద తవ్వడం ప్రారంభించాడు.

          ఇంతలో అక్కడికి ఇంద్రుడు వచ్చి “ ఏమిటీ? ఈ కర్రతో తవ్వి పాతళంలోకి వెళ్ళి  పోదామనే అనుకుంటున్నావా? అది నీకు సాధ్యం కాదు కాని ఆ పని వదిలెయ్యి” అన్నాడు.

          “గురుపత్ని కోసం తీసుకుని వెడుతున్న కుండలాల్ని నాగరాజు తీసుకుని వెళ్ళి  పోయాడు. అవి లేకుండా వెనక్కి వెళ్ళను” అని చెప్పి మళ్ళీ తవ్వడం మొదలుపెట్టాడు ఉదంకుడు.

          అతడి పట్టుదలకి మెచ్చుకుని ఇంద్రుడు ఆ కర్రని శూలంగా మార్చి ఇచ్చాడు. నీ కోరిక తప్పకుండా తీరుతుంది అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు.

          ఉదంకుడు మళ్ళీ తవ్వడం మొదలెట్టాడు. ఈసారి భూదేవి భయపడి అతడికి పాతాళానికి వెళ్ళడానికి దారి ఇచ్చేసింది. నాగలోకానికి చేరుకున్నాడు ఉదంకుడు.

          అక్కడ ఒక గుర్రం కనిపించి “నేను గౌతమ మహర్షి అగ్నిని. నీకు మేలుచేస్తాను!”  అని చెప్పి దాని రోమ కూపాల్లోంచి పొగని వదిలింది. పాములు భయపడి కుండలాలు తెచ్చి ఉదంకుడికి ఇచ్చేశాయి.

          వాటిని తీసుకుని వెళ్ళి గురుపత్నికి ఇచ్చాడు. అతడి గురుభక్తికి, పట్టుదలకి మెచ్చుకుంది గురుపత్ని అహల్య. ఉదంకుడు భార్యని తీసుకుని తన ఆశ్రమానికి వెళ్ళి పోయాడు.

          కౌరవపాండవ యుద్ధం పూర్తయ్యాక ఒకసారి శ్రీకృష్ణుడు ఉదంకుడి ఆశ్రమానికి వెళ్ళాడు. కౌరవ పాండవ యుద్ధం జరగడానికి నువ్వే కదా కారణం అన్నట్టు శ్రీకృష్ణుడి వైపు కోపంగా చూశాడు ఉదంకుడు.

          అతడి కోపం చూసి ఉదంకుడికి శ్రీకృష్ణుడు తన విశ్వరూపం చూపించాడు. శ్రీమన్నారాయణుడి విశ్వ రూపం చూసి “దేవదేవా! నన్ను క్షమించు!” అని ప్రార్ధించాడు.

          “ఉదంకా! నువ్వు దైవభక్తి, గురుభక్తి, పట్టుదల, మంచితనం ఉన్నవాడివి. నీకు ఏం కావాలో కోరుకో!” అన్నాడు శ్రీకృష్ణుడు.

          “స్వామీ! నీ దర్శనం కలగడమే గొప్ప వరం. అంత కంటే నాకు ఏం కావాలి స్వామీ… ఏదీ వద్దు!” అన్నాడు భక్తిగా.

          శ్రీకృష్ణుడు ఊరుకోలేదు ఏదో ఒకటి అడగమన్నాడు.

          ఉదంకుడు “దేవా! ఈ ప్రదేశంలో నీళ్ళు దొరకవు. సమృద్ధిగా నీళ్ళు దొరికేలా చెయ్యి!” అన్నాడు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నీళ్ళు సమృద్ధిగా ఉండేలా వరమిస్తు న్నాను తీసుకో! అని చెప్పి శ్రీకృష్ణుడు అంతర్ధానమయ్యాడు.

          ఉదంకుడు పొందిన వరం వల్ల అక్కడి ప్రజలు కూడా లాభం పొందారు. అందుకనే నీటికి ‘ఉదకం’ అనే పేరు కూడా సార్ధకమయింది.

పట్టుదల ఉంటే అనుకున్నదాన్ని సాధించవచ్చు!!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.