నడక దారిలో-64

-శీలా సుభద్రా దేవి

జరిగిన కథ:-     (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే చదువు తో బాటు సాహిత్యం , సంగీతం, బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో సభావివాహం.మా జీవితంలో పల్లవి చేరింది.వీర్రాజుగారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,.అమ్మ చనిపోవటం,పల్లవి వివాహం,నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, .పాప రెండవ పుట్టినరోజు వేడుక , కొత్త ఇంటి గృహప్రవేశం తిరిగివెళ్ళిన రెండు నెలలకే అజయ్ చనిపోవడంతో ఆషీని తీసుకుని పల్లవి తిరిగివచ్చేసి ఉద్యోగంలో చేరింది.నేను హెచ్చెమ్ కావటం,రిటైర్ కావటం, పెద్దక్క మరణం,ప్రత్యేకతెలంగాణా ఏర్పాటు, వీర్రాజు గారి పెయింటింగ్స్ ప్రదర్శనలు .సరూర్ నగర్ అపార్ట్మెంట్ కు మారటం.డా.పి.శ్రీదేవి మోనోగ్రాఫ్ రాయటం . తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు.వీర్రాజుగారికి బోయి భీమన్న,బాపూరమణల పురస్కారాలు- అమృతలతగారి పరిచయం-ఉమ్మడిశెట్టి రాధేయ ప్రతిభా పురస్కారం -చిన్నక్క మరణం, వీర్రాజుగారి పెయింటింగ్స్ ప్రదర్శనలూ,నాకు అమృతలత అపురూప పురస్కారం,ఆషీకి కాలేజీ ఎంపిక ప్రహసనాలూ,ఇంట్లో పెరిగిపోతున్న పుస్తకాలూ, కరోనా విజృంభణ,ఆత్మీయ మితృలమరణాలూ తర్వాత—)

***

నెచ్చెలి అంతర్జాల పత్రికని నడుపుతోన్న కె.గీత “నెచ్చెలి పత్రికలో మీ జ్ణాపకాలు రెగ్యులర్ గా రాస్తారా సుభద్రగారూ”అంటూ మెసేజ్ పెట్టింది.రెగ్యులర్ గా రాయగలనో లేదో అనుకొంటూనే మొదట రోణంకి అప్పలస్వామి గారి కుటుంబంతో నాకు గల సాన్నిహిత్యంతో మొదలుపెట్టి, తర్వాత, అమ్మ గురించి,తదనంతరం అక్కయ్య గురించి రాసాను.ఇంక ఆ తర్వాత జీవితంతో ముడిపడిన సంఘటనలతో జీవితకథగానే కొనసాగిస్తూనే ఉన్నాను.

కోవిడ్ పరిస్థితులు కారణంగా ఇంటికి వచ్చేవారూ లేరు,మేము వెళ్ళేదీ లేదు.

ఎనిమిదో తరగతి తర్వాత అక్కయ్య ఇంట్లో ఉంటున్నప్పటినుండీ చిన్న పుస్తకం కుట్టుకొని మనసు నొచ్చినప్పుడూ,ఆనందం కలిగినప్పుడు అందులో నా ఆలోచనలు రాసుకునే అలవాటు మొదలై తర్వాత డైరీ బుక్ కొనుక్కుని ఉమ్మడి కుటుంబంలో సంఘటనలు వరకూ డైరీ రాయటం అలవాటైంది.అవన్నీ వివాహానంతరం నాతో నేను పత్రికలోంచి చింపి కుట్టుకున్న ధారావాహికలతో పాటుగా తెచ్చుకున్నాను.

నెచ్చెలిలో జ్ణాపకాలు రాసే నేపధ్యంలో నా పాత డైరీలన్నీ తీసి చదవటం మొదలుపెట్టాను.నా రచనకి వీర్రాజుగారే నడక దారిలో అనే శీర్షిక నిర్ణయించారు.నాకూ ఆ పేరు నచ్చింది.నడకదారిలో నా పాదాలను గుచ్చినముళ్ళూ రాళ్ళే కాకుండా తాకిన పూలూ,పరిమళాలూ కూడా రాయాలని నిర్ణయించుకున్నాను.

నా డైరీలో కొన్ని సంఘటనలు చదువుతున్నప్పుడు ఎన్ని దుర్ఘటనలు ఎదుర్కొన్నాను, ఎన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలన్నంతటి దుఃఖాన్ని తట్టుకుని ఈ నాడు ఇలా ఎదిగాను అని నాకే ఆశ్చర్యం కలిగించింది.కొన్ని డైరీపేజీలు అప్పుడప్పుడు వీర్రాజుగారికి కూడా చదవమని చూపించాను.తన తోబుట్టువుల ప్రవర్తనలో ,వారి మాటల్లో తప్పువుందని తెలిసినా వారిని ఏమీ అనలేక “నువ్వు చదువుకున్న దానినీ,రచయిత్రివి కనుక సహనం వహించాలని,ఎప్పుడో వాళ్ళకే తమ తప్పు తెలుస్తుందని ” వీర్రాజుగారు సర్ది చెప్పినప్పుడు నేనెలా బాధ పడ్డానో డైరీలో చూపాను.

నా జ్ణాపకాల్ని ఎదలోతుల్లోంచి తవ్వి తవ్వి ,తడిమి చూసుకుంటున్నప్పుడు దెబ్బలు తగిలి తగిలి నా హృదయం ఇప్పుడు ఎంత రాటుతేలిందో నాకు కూడా అర్థమైంది.

అదే సమయంలో ఇంటికి స్నేహితులు ఎవరూ రాకపోవటం, ప్రపంచమంతా కోవిడ్ ప్రభావంతో మరణమృదంగం వినిపించటంతో వీర్రాజుగారు తర్వాత్తర్వాత పుస్తకాలు చదవటం కూడా మానేసి తరుచూ ఆలోచనల్లో మునిగిపోయి
గదిలో కుర్చీలో చీకటిలో వుండి పోవటంతో ఆయన్ని తిరిగి ఏక్టివ్ గా చేయటానికి తొలిరోజుల్లో మేము రాసుకున్న ప్రేమ లేఖలు ఇచ్చాను.నేనూ చదివి ఆయనకీ ఇచ్చేదాన్ని.వాటివలన కూడా ఎన్నో సంఘటనలు నాకు గుర్తు వచ్చేవి.

కోవిడ్ ప్రభావం కొంత తగ్గినట్లు అనిపించింది.కానీ మరో వెరియంట్ గా మారుతోంది.బయటకు వెళ్ళటానికి జనం భయపడుతూనే వున్నారు.

మాడభూషి స్మారక కథల అవార్డులు రెండింటినీ ప్రకటించినా వీర్రాజుగారు ఈ ఏడాది కూడా మీటింగ్ పెట్ట వద్దని అన్నారు.ఈ ఏడాది కూడా అవార్డు ప్రకటించి,వచ్చే ఏడాది మూడూ కలిపి ఇద్దాం అనిచెప్పి ఆ ఏడాదికి అయోధ్యా రెడ్డిగారి ” అక్కన్న పేట రైల్వే స్టేషన్” కథలసంపుటిని ఎంపిక చేసారు.

అదేవిధంగా ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డులు 2018 కి సిరికి స్వామినాయుడి ‘మట్టి రంగు బొమ్మలు ‘ కవితా సంపుటికీ, ఇబ్రహిమ్ నిర్గుణ్ ‘ ఇప్పడేదీ రహస్యం కాదు’ కవితా సంపుటికీ ప్రకటించడమే కాకుండా వీటితో ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డులు నిలుపుచేయాలనే విషయం కూడా వీర్రాజుగారు ప్రకటించారు.

అయితే వాసిరెడ్డి నవీన్, శివారెడ్డి గారూ ఇంటికి వచ్చి ఫ్రీవర్స్ ఫ్రంట్ ను నిలిపి వేయొద్దనీ వీర్రాజుగారి సలహా మేరకే తాము కొనసాగిస్తామనీ
అని ఆయన్ని ఒప్పించాలని చాలా ప్రయత్నించారు.శంకరంగారు కూడా అదే అన్నారు.కానీ ససేమిరా వీర్రాజు గారు వొప్పుకోలేదు.కుందుర్తి, సత్యమూర్తిగార్ల అభీష్టం ప్రకారం నిబద్ధతతో పారదర్శకంగా కొనసాగించాము.దాన్ని ఇంకొకరి చేతికి అందించటానికి ఆయన అంగీకరించలేదు.

కోవిడ్ ప్రభావం కొంత తగ్గినట్లు తగ్గినట్లు తగ్గి మరో వెరియంట్ డెల్టాగా రెట్టింపు తీవ్రతతో విజృంభించింది.జనం భయాన్ని కూడా రెట్టింపు చేసింది. ఒకవైపు కోవిడ్ అతలాకుతలం చేస్తుంటే అటు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చీదర పుట్టిస్తున్నాయి.రాజకీయ దాడులు ఒకవైపు,కేసులు మరోవైపూ.నాయకుల తిట్లపురాణాలతో రాజకీయాలను బురద బురద చేశాయి.

తెలంగాణా లో కోవిడ్ తీవ్రత యథాస్థితిలోవున్నా రామాప్ప దేవాలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం గుర్తింపు లభించటం ఉపసమనం కలిగించింది.

పెద్దాడబడుచుకు ఒంట్లో బాగుండటం లేదనీ,తరుచూ హాస్పటలైజ్ అవుతున్నట్లు తెలిసింది.వాళ్ళ ఇల్లు మా ఇంటికి అయిదు నిమిషాల నడక దూరం.కానీ కోవిడ్ సమయంలో హాస్పిటల్ నుండి వచ్చిన వాళ్ళని వెళ్ళి చూడాలంటే కొంచెం మా వయసుల దృష్ట్యా జంకాము.

అందులోనూ ఏప్రిల్-మే నెలల్లో డెల్టా వేరియంట్‌తో కరోనా సెకండ్ వేవ్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది.స్నేహితుల బంధువులూ,తెలిసిన వారూ చాలా మంది కోవిడ్ డెల్టా వెరియంట్ తో కన్నుమూసారు.ఆర్టిష్ట్ చంద్ర కూడా అలాగే వెళ్ళిపోయారు.రాజకీయనాయకుడు, విశ్లేషకుడు సబ్బం హరిని డెల్టా వేరియంట్ కబళించింది.అన్నింటికన్నా మమ్మల్ని షాక్ గురి చేసింది ప్రస్తుతం మా స్కూల్ హెచ్చెమ్ గా వున్న నివేదిత నెలరోజులుగా కోవిడ్ తో హాస్పిటల్ లో వుండి చనిపోవటం చాలా బాధ కలిగించింది.

వీర్రాజుగారు అటువంటి పరిస్థితుల్లో ఆడపడుచును చూడటానికి వెళ్దామన్నారు.ఇక తప్పక ఆయనను తీసుకొని వాళ్ళింటికి వెళ్ళాము.ఆడబడుచు చాలా బలహీనంగానే వుంది.కొంతసేపు కూర్చుని వచ్చేసాము.

డెల్టా వేరియంట్ వలన ప్రపంచమంతా భీతావహంగావుంది.హాస్పటల్సే కాకుండా రోగుల్ని క్వారంటైన్ లో వుంచి చికిత్స చేసేందుకు ప్రభుత్వం అనేక ఏర్పాట్లు చేస్తూనే వుంది.భౌతిక దేహాన్ని బంధువులకు అప్పగించకుండా నిబంధనల ప్రకారం డాక్టర్లే అంత్యక్రియలు ముగించే పరిస్థితులతో ప్రపంచమంతా భయం గుప్పిట్లో వుండిపోయింది.

కరోనా రెండో దశ సమయంలో కరోనా రోగులకు ఆక్సిజన్ అవసరం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఆసుపత్రుల్లో పడకలు, ప్రాణవాయువు కొరత ఏర్పడింది. కొన్ని ఆసుపత్రుల్లో ఒక బెడ్ మీద ఇద్దరు, ముగ్గురు రోగులను ఉంచి చికిత్స అందించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వార్తలు. ఆక్సిజన్ సిలిండర్ల కోసం రోగుల బంధువులు పడిన అవస్థలు అంతా ఇంతా కాదు.

ఏడాది పాటు రైతులు సాగు చట్టాలపై సాగించిన ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి సాగు చట్టాలను రద్దు చేసింది.

అక్కయ్యకూతురు రంజన కూడా కోవిడ్ బారిన పడింది.శ్వాసతీసుకోవటమే కష్టమైన పరిస్థితిలో అర్థరాత్రి పూట ఏ హాస్పిటల్ లోనూ చేర్చటానికి ఖాళీలు లేక తిరిగి తిరిగి ఒక దాంట్లో చేర్చారని ఫోను వచ్చింది.దాంతో మాకు కూడా బెంగగా అయిపోయింది.

మరికొన్ని రోజులకే ఉదయమే మా ఆడపడుచు చనిపోయిందని ఫోన్ వచ్చింది.వాళ్ళు ఇంటికి తీసుకు వస్తున్నామని చెప్పారు.ఇటువంటి పరిస్థితుల్లో పదిహేను రోజులకు పైగా హాస్పిటల్లో వుండి వచ్చినపుడు అంత్యక్రియలకు వెళ్ళాలంటే భయపడ్డాము.అందులోనూ ఎనభై ఏళ్ళు దాటిన వీర్రాజుగారిని ఎలా తీసుకు వెళ్ళాలని ఆలోచించాము.నేనూ, పల్లవీ మాత్రమే వెళ్దామనుకున్నాము.

ఎలాగో వీర్రాజుగారిని వప్పించి ఆయన్ని ఆషీకి అప్పగించి వెళ్ళాము.కానీ వీర్రాజుగారు తానూ వస్తానని పేచీ పెట్టటంతో ఎంతైనా రక్తసంబంధం కదా ఎవరినో ఆయన్ని తీసుకు రావటానికి పంపించాము.
కార్యక్రమం ముగిసేవరకూ వుండి ఇంటికి వచ్చేసాము.

మూడోరోజు దినాలకు వెళ్ళటానికి ఆడపడుచు ఫొటో దగ్గర పెట్టటానికి పల్లవి మెయిన్ రోడ్డు వరకూ స్వీట్ గానీ పళ్ళుగానీ దొరుకుతాయేమోనని వెళ్ళింది.

తీరా వాళ్ళింటికి వెళ్ళాలనుకునేసరికి వాళ్ళ బిల్డింగ్ కి కరెంటు లేదు.కాగలకార్యం గంధర్వులు తీర్చారన్నట్లు రెండింతస్తులు మెట్లు ఎక్కడం కష్టమని వీర్రాజుగారిని రావద్దని,కరెంటు వస్తే తీసుకు రావటానికి ఎవరినైనా పంపిస్తామని చెప్పి పల్లవీ,నేనూ వెళ్ళాం.చిన్నమరిదీ,తోటికోడలూ వచ్చారు.కుకట్పల్లిలో వున్న అన్నయ్య కొడుకులూ జ్వరాలని రాలేదు .,పెద్దమరిది ముగ్గురు పిల్లల్లో పెద్దమ్మాయి వచ్చింది. కార్యక్రమం పూర్తిచేసుకుని ఇంటికి వచ్చాము.
పల్లవికి వాళ్ళ ఇంట్లో మొదలైన తలనొప్పి అంతకంతకూ ఎక్కువై సాయంత్రానికి జ్వరం వచ్చేసింది.పారాసెటమల్ టేబ్లెట్ వేసుకుని ఎందుకైనా మంచిదని చివరి రూములో పడుకుంది.అందరియిల్లు డా.వింజమూరి సూర్యప్రకాష్ గారికి ఫోన్ చేస్తే ఆయన వెంటనే క్వారంటైన్ అయిపోమని మర్నాడు బ్లడ్ టెస్ట్ చేయటానికి లేబ్ అసిస్టెంట్ ను పంపుతానని అన్నారు.

డా.సూర్యప్రకాష్ దంపతులు కోవిడ్ కాలానికి ప్రభుత్వం తరపున ఆన్లైన్ లో ఆరోగ్య సలహాదారులుగానే పనిచేస్తున్నారు.

పల్లవికి టెష్టులు చేయిస్తే కోవిడ్ డెల్టా వేరియంట్ అని నిర్థారణ అయ్యింది.సూర్యప్రకాష్ గారు మేము పెద్దవాళ్ళం,ఆషీ చిన్నది కనుక హాస్పిటల్ లో చేరవద్దని ఇంట్లోనే ట్రీట్మెంట్ చేసుకోవటం మంచిదని దానికి సంబంధించిన మందులు పంపించి ఆహారనియమాలన్నీ తెలియజేసారు.రోజూ తప్పని సరిగా పప్పు ,నిమ్మరసం తీసుకోమన్నారు.

పల్లవి తలుపులు వేసుకొని రూములోనే వుండిపోయింది.భోజనం, టిఫిన్ ద్వారం దగ్గర పెడితే తీసుకునేది.లక్ష్మిని తిరిగి పిలిచేవరకూ పనికి రావద్దని చెప్పాను.ఆషీ సాయంతో ఇంటి పనీ,వంటపనీ చేసుకునేదాన్ని.వారం వారం కోవిడ్ టెష్టులు డాక్టర్ గారు చేయించారు.

పల్లవికి కోవిడ్ వచ్చేసరికి వీర్రాజుగారు మరింత భయపడ్డారు.వైజాగ్ లో రంజనా కూడా పదిహేను రోజులకు పైగా హాస్పిటల్లో క్వారంటైన్ లో వుండటం మాకు బెంగగా అయిపోయింది.
బిల్డింగ్ లో వున్న స్వాతిగారు ,సరిత కూడా కూరలవీ ఒకటి రెండు సార్లు పంపించారు.

ఆడపడుచు దశదినకర్మకి వాళ్ళు అమ్మాయి సంగీత పిలిచింది.కానీ పల్లవికి జ్వరతీవ్రత వుంది.అందులోనూ ఇంట్లో కోవిడ్ బాధితురాలు వుంటే ఎలా వెళ్తాము.అందుకని రాలేమని చెప్పాము.కుకటపల్లిలోనూ మరిది పిల్లలు అందరికీ జ్వరాలు.దాంతో వాళ్ళూ ఎవరూ రాలేక పోయారు.చిన్నమరిదీ,అతని భార్యా,దీప,వాళ్ళాయన మాత్రమే హాజరయ్యారు.
పరిస్థితి అర్థం చేసుకోకుండా సంగీత కావాలనే అందరూ, ముఖ్యంగా మేము ఈ వంక పెట్టి రాలేదని మనసులో కక్ష పెట్టుకుంది.ఆడబడుచు ముత్తైదువుగా పోవటం వలన చేట వాయినాలు అయిదుగురికి ఏర్పాటు చేసిందిట.దగ్గరే కనుక పెద్దత్తకి ఇంటికి వెళ్ళి ఇవ్వు అని మా తోటి కోడలు చెప్పటంతో మా ఇంటికి వచ్చి కవరులో ఆ చేటవాయినాన్ని తీసుకు వచ్చి మాడుముఖంతో టీపాయ్ మీద పెట్టి వెళ్ళిపోయింది.ఆమె ఇచ్చిన విధానం,ఆ ముఖం చూసాక నాకు అది ముట్టుకో బుద్ది కాలేదు.కానీ వీర్రాజుగారు బాధ పెడతారని తీసుకుని లోపల పెట్టాను.

డెల్టా వేరియంట్ తీవ్రతతో జనం పిట్టల్లా రాలిపోయారు.సిరివెన్నెల సీతారామశాస్త్రి, రోశయ్య వంటి ప్రముఖులని తెలుగు ప్రజలు కోల్పోయారు.తెలిసిన వారూ మిత్రులూ, పరిచయస్తుల మరణాలు ఉక్కిరిబిక్కిరి చేసాయి.

మూడో వారానికి పల్లవికి ఇన్ఫెక్షన్ తగ్గుముఖం పట్టింది.కానీ డాక్టర్ గారు మేము పెద్దవాళ్ళం కనుక మరో రెండు వారాలు క్వారంటైన్ లోనే వుండమన్నారు.

ఇంచుమించు రెండునెలలు అందరం చాలా టెన్షన్ లోనే వున్నాము.మళ్ళా పల్లవి మామూలుగా అయ్యేక వూపిరి పీల్చుకున్నాం.వైజాగ్ లో రంజనాకి కూడా గండం తప్పి ఆరోగ్యం కుదుటపడి ఇంటికి వచ్చింది.

నడక దారిలో తప్ప రెండు నెలలుగా రాయటం చదవటం కొంచెం తగ్గింది.డైరీలు,ఉత్తరాలు వలన రాయటం ఏమంత కష్టంగా లేదు.రాయటం మొదలు పెడితే ఒకదాని తర్వాత సంఘటనలు గుర్తు వచ్చి ఎక్కడా తడబడ కుండానే రాయగలుగుతున్నాను.వీర్రాజుగారు కూడా బాగా రాస్తున్నానని ప్రశంసించారు.

రచయిత్రుల కథల గురించి నేను రాస్తున్న వ్యాసాలు ప్రచురితమైనవి ఇరవై మూడు అయ్యాయి.జంట రచయిత్రులు మందిరపు పద్మ,లలితల కథల గురించి రాసిన వ్యాసం చదివి రచన సాయి గారు ఫోన్ చేసారు.పద్మ,లలితలను గురించి అప్పటి వారికి తప్ప ఎవరికీ తెలియదు అటువంటి రచయిత్రులు గురించి రాయటం సంతోషంగా వుంది అని ప్రశంసించారు.అయితే ‘వాళ్ళు వైజాగ్ కి చెందిన వారు. మా ఇంటికి దగ్గరలోనే ఉండేవారు.వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు ‘ అన్నారు వ్యాసం పత్రికలో ప్రచురితమైనపుడు కథానిలయం లో చూసిన దానిని బట్టి తెలంగాణాలోని ఒక గ్రామానికి చెందిన వారని రాసాను.పుస్తకంగా వేయాలనుకున్నప్పుడు ఆ వాక్యం తీసేసాను.

నేను రాసిన ఇరవై మూడు వ్యాసాలకు రచయిత్రులకు చెందినవే సదస్సులలో నాప్రసంగవ్యాసాలు రెండింటిని కలిపి ” కథారామంలో పూలతావులు” గా నా వ్యాససంపుటిని ప్రచురణకు ఇచ్చాను.

నేను వ్యాసాలు రాసే సందర్భంలో నిడదవోలు మాలతి కథలు గురించి రాసినప్పుడు ఆమె బ్లాగులో ఆరు కథలపుస్తకాలు ,ఎన్నెమ్మకతలు పేరిట మరో అయిదు పుస్తకాలు,రెండు నవలలు, ఆరేడు వ్యాస సంపుటాలు కాకుండా వందకు పైగా గురజాడ నుండి మొదలుకొని ఆమెతరం వరకూ కథకుల కథల్ని ఆంగ్లానువాదం చేసినట్లుగా తెలిసింది.1973లోనే యూఎస్ వెళ్ళిపోవటంతో ఆమె రచనలు చేసినా తన బ్లాగులోనే పొందుపరిచుకోవటంతో ఇక్కడ తెలుగు వారికి ఆమె ఇంత సాహిత్య సృజన చేసినట్లు తెలియకుండా పోయిందని బాధకలిగించింది.

ఫేస్బుక్ లో మాలతి గారికి మెసేజ్ పెట్టి నేను ఆమె రచనలమీద సమగ్రంగా పుస్తకం రాయాలనుకున్నట్లు తెలియజేసి అవసరమైనప్పుడు సంప్రదించడానికి ఈ మెయిల్ ఐడి కోరాను.మాలతిగారు చాలా సంతోషంగా స్పందించారు.

*****

Leave a Reply

Your email address will not be published.