నా జీవన యానంలో- రెండవభాగం- 61

-కె.వరలక్ష్మి

26.7.2015 నాటి అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన ప్రయాణం అతి చిత్రంగా జరిగింది. 11 A.M. కి శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఫ్లైట్. ఉదయం 5.30 కి అలారం పెట్టుకుని లేచి రెడీ అయ్యేను. 7.30 కి గీత, నేను, అమరేంద్ర ఇంట్లోనుంచి బయలుదేరేం. నాది బ్రిటిష్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్. కనెక్టింగ్ ఫ్లైట్ అమెరికన్ ఎయిర్ లైన్స్ కి అప్పగించేరని తెలీక ఆ కౌంటర్ తెరుస్తారని ఎదురు చూస్తూ కొంత కాలయాపన చేసేం. తెలిసింతర్వాత పరుగులు పెట్టి ఆ టెర్మినల్ కి చేరుకున్నాం. నా బేగేజ్ చెకప్ అయ్యింతర్వాత వాళ్లు వెళ్లిపోయేరు. నేను నా ప్లేస్ 58 బి కి వెళ్లి కూర్చున్నాను.

ఫ్లైట్ ఎక్కేముందు నా హేండ్ లగేజ్ బేగ్ చికాగోలో ఇస్తామని తీసుకున్నారు. ఫ్లైట్ లో కూడా అస్థిమితంగానే ఉన్నాను. శాన్ ఫ్రాన్సిస్కోనుంచి చికాగో చేరేవరకూ కన్పిస్తున్న అద్భుతమైన లేండ్ దృశ్యాలను ఎంజాయ్ చెయ్యలేకపోయాను. మధ్యాహ్నం రెండు గంటలకి ఆకలి తెలిసి గీత పేక్ చేసి ఇచ్చిన పూరీలు తిన్నాను. సాయంకాలం 5.30 కి ఫ్లైట్ చికాగోలో ఆగింది. పైనుంచి చూస్తే చికాగో చాలా పెద్ద నగరం అని అర్థమైంది.

దిగేటప్పుడు ఎయిర్ హాస్టెస్ ని నాబేగ్ ఏదని అడిగితే నా వెంట వచ్చి నన్ను ఒక ఇండియన్ ఎంప్లాయ్ కి అప్పగించింది. అతను 8వ నెంబరు గేట్ లోకి వెళ్లి నా బేగ్ తీసుకోవచ్చని చెప్పేడు. ఎందుకు నా బేగ్ తీసుకున్నారని అడిగితే ‘‘ఐ డోంట్ నో’’ అన్నాడు. ఎటెళ్లాలో చెప్పేడు. కాని, అటెళ్లేకొద్దీ నెంబర్స్ తగ్గుతూ వస్తున్నాయి. డౌటొచ్చి ఒక కౌంటర్ దగ్గర లేడీని అడిగితే ఆవిడ వివరాలు చెప్పి, నన్ను ఆగమని ఫోన్ చేసి వీల్ చెయిర్ తెప్పించింది. నాకేమో ఆకలి దంచేస్తూ నీరసం ముంచుకొస్తోంది. తాగుదామంటే బోటిల్ లో నీళ్లు కూడా అయిపోయాయి. వీల్ చెయిర్ అమ్మాయి బ్లేక్ పిల్ల. ఇరవై ఏళ్లుంటాయేమో! అతి చికాకుగా పెట్టింది మొహం. ‘నీళ్లెక్కడుంటాయి’ అని అడిగినా ‘నాకు తెలీదు’ అంటోంది. 8వ నెంబర్లో కన్వేయర్ బెల్ట్ మీద సూటికేసులన్నీ అయిపోయాయి. అక్కడ కౌంటర్లో ఉన్నవాళ్లని అడిగితే నా పాస్ పోర్టు, బోర్డింగ్ పాస్ వగైరాలన్నీ పరిశీలించి లోపల్నుంచి ఒక బేగ్ తెచ్చేరు, అది నా బేగ్ లాగే ఉన్నా టాగ్ మీద కెవిన్ జార్జ్ అని ఉంది. అది నా పేరు కాదు కాబట్టి ఓపెన్ చేసి చూడ్డానికి కూడా వీల్లేదన్నాడు. రిక్వెస్ట్ చేసి కొంత తెరిస్తే లోపల నాటవల్ కన్పించింది. అది నాదే అని చెప్తే ఏవో లెక్కలేసుకుని, దిక్కులు చూసి అప్పుడిచ్చేడు.

మా మనవడు కోమల్ నాకు కొనిచ్చిన బుల్లి స్మార్ట్ ఫోన్ తో ఎంతో అందంగా ఉన్న చికాగో ఎయిర్ పోర్ట్ ఫోటోలు తీసుకోవాలనుకున్నా ఆ గందరగోళంతో వీలుపడలేదు. మరోపక్క వీల్ చెయిరమ్మాయి స్పీడుగా తోసుకెళ్లిపోవడం. సడెన్ గా ఒకచోట ఆపి డబ్బులడిగింది. నా పర్స్ లో ఇండియన్ కరెన్సీ వందనోట్లు మాత్రమే ఉన్నాయి. పైకి తీసిచూపించి, ‘ఇవి తీసుకుంటావా’ అని అడిగేను. విసిరికొట్టినట్టు వెనక్కి ఇచ్చేసింది. ఆ పిల్లకి నా మీద చికాకు ఇంకాస్త ఎక్కువైంది. 5వ టెర్మినల్ కి మరోదారిలో లిఫ్ట్ లో తీసుకెళ్లిపోయింది. అక్కడ సెక్యూరిటీ చెకప్ చాలా స్ట్రిక్ట్ గా ఉంది. చాలా మందిని పక్కకి నిలబెట్టి పరీక్షిస్తున్నారు. నా మీద ఏం అనుమానం వచ్చిందో తెలీదు. నాబేగ్, పర్స్ తీసేసుకుని నన్నుప్రత్యేకమైన గదిలోకి తీసుకెళ్లి డిటెక్టర్ తో పదేపదే చెక్ చేసేరు. నా వొళ్లంతా తడిమితడిమి చూసేరు. నా బేగ్ నీ, పర్స్ నీ ట్రేలలోకి పంపేసి ప్రతి వస్తువునీ పరిశీలించి చూసేరు. బేగ్ పోకెట్ లో ఉన్న ఆరునెలలుగా నేను రాసుకున్న కథలు, జ్ఞాపకాలు, పొయెట్రీ కాయితాలన్నీ ఎక్స్ పర్ట్ ని రప్పించి పరిశీలించేరు. ఏం జరిగిందని అడిగితే చెప్పలేదు. గొంతు ఎండిపోతున్నా నీళ్లు ఇవ్వలేదు. నన్ను బైటికి పంపలేదు, నాకు బ్లడ్ ప్రెజర్ చాలా ఎక్కువైపోయిందని నాకు తెలుస్తోంది. కాని, కొందరు సెలబ్రిటీస్ ని కూడా ఇలా చెకప్ చేస్తారని చదివి ఉండడం వల్ల ముఖం మీద నుంచి నవ్వు చెరగనీకుండా కూర్చున్నాను. చివరికి నా వస్తువులన్నీ వాళ్లే సర్ది ‘సారీ మేడమ్’ అని చెప్పింది చెకింగ్ ఆఫీసర్స్ లో ఉన్న నార్త్ ఇండియన్ అమ్మాయి. తర్వాతి కౌంటర్ దగ్గరకి తీసుకెళ్లింది వీల్ చెయిర్ అమ్మాయి. అప్పటికే నా బోర్డింగ్ పాస్ లు రాంగ్ గా ఉన్నాయని, బ్రిటిష్ ఎయిర్ లైన్స్ బదులు అమెరికన్ ఎయిర్ లైన్స్ అని ఉన్నాయని గ్రహించేను. ఆ కౌంటర్లో అమ్మాయి అవి చెక్ చేసి కంగారుగా చింపేసింది. నా బేగ్ కున్న కెవిన్ జార్జ్ టేగ్ కూడా కట్ చేసి డస్ట్ బిన్ లో పడేసారు, ఏదో కంగారు వాళ్ల మొహాల్లో. మొత్తానికి ఫ్లైట్ బయలుదేరే టైంకి ఆ టెర్మినల్ కి చేర్చి, థేంక్స్ అందుకుని వెళ్లపోయింది వీల్ చెయిరమ్మాయి.

ఆ గేట్ లో ఫ్లైట్ కోసం కూర్చున్న ముగ్గురు తెలుగు స్త్రీలు నన్ను పలకరించేసరికి నాకు ప్రాణం లేచివచ్చింది, అందులో ఒకామె నా స్థితిని చూసి మంచి నీళ్లు తెచ్చి ఇచ్చింది, నా కథల ఫైల్ ఉందా అని వచ్చిన నా డౌట్ ని అందులో ఒకావిడ సూట్ కేస్ మొత్తం వంపి తిరిగి సర్ది క్లియర్ చేసింది. మొత్తానికి చికాగో టైం 20:25 కి ఫ్లైట్ లండన్ బయలుదేరింది. లండన్ టైం 10:15 కి ఫ్లైట్ లండన్ చేరింది. 15:15 కి బయలుదేరిన మరో ఫ్లైట్ ఉదయం 5:30 కి జూలై 28న హైదరాబాద్ లో దింపింది. జెట్ లాగ్ నీరసం ఓ పక్కా, ప్రయాణంలో పడ్డ పాట్లు ఓ పక్కా, ఆరు నెలలు కలిసి గడిపిన ప్రాంతాల్నీ, పిల్లల్నీ వదిలేసి వచ్చిన బాధ ఓపక్కా హెల్త్ మీద ప్రభావాన్ని చూపగా చాలా సిక్ అయిపోయిన భావనతో అంతులేని నీరసం వచ్చింది. నీరసంలో ఒక నిర్ణయం తీసుకున్నాను ‘‘ఇంకెప్పుడూ అమెరికా వెళ్లొద్దు’’ అని. ఒక వైరాగ్యం. ఒక నిరాసక్తత. ఎప్పుడూ నాకు నేనే ధైర్యం చెప్పుకోవాలి. ‘‘కెరటం నా స్ఫూర్తి. లేచి పడినందుకుకాదు, పడి లేచినందుకు’’.

మా మరిది (చిన్న మామగారి కొడుకు) అప్పారావు భార్య కేన్సర్ తో కాలం చేసిందట వైజాగ్ లో, వాళ్లకు ముగ్గురు కొడుకులు. వాళ్ల చదువులు, ఉద్యోగాలకోసం తన సేవింగ్స్ డబ్బు చాలక ఇల్లుకూడా అమ్మేసారు. ఇవాళ బాడీని ఇంటికి తీసుకురావడానికి ఇల్లుగలవాళ్లు ఒప్పుకోక రాత్రంతా బరియల్ గ్రౌండ్ లో పెట్టుకుని జాగరణ చేసారట. విన్నాక మనసంతా కలతచెందినట్టైపోయింది.

ఏడు నెలల తర్వాత ఆగష్టు 22న జగ్గంపేటలోని నా ఇంటికి చేరుకున్నాను. దారిలో ఆకాశంలో మబ్బులు, సన్నని చినుకులు, నిండిన చెరువులు, పచ్చని పైరులు, చల్లని గాలుల్తో ప్రాణానికి హాయిగా అన్పించింది.  నిజానికి మాటిమాటికీ పవర్ కట్, పనిచెయ్యని AC, TV, ఇన్వెర్టర్, వేడి, ఉక్క, చెమటలు. అయినా, నా ఇంట్లో నేను ప్రశాంతంగా.

ఆ సెప్టెంబర్ 20న తెనాలి గౌతమ్ గ్రాండ్ హోటల్ లో జరిగిన కథ 2014 ఆవిష్కరణకి వెళ్లేను, ముందు రోజు రాత్రి విజయవాడలో పి.సత్యవతి గారింటికి వెళ్లి అక్కడినుంచి సత్యవతి గారి కారులో తెనాలి వెళ్లేం. అక్కడ రచయితలు అందరూ దగ్గరకు వచ్చి పలకరిస్తూంటే మళ్లీ సాహిత్యానికి సంబంధించిన ఓ కొత్తజీవం వచ్చినట్టు ఆనందంగా అన్పించింది. డా.వి. చంద్రశేఖర్రావు అధ్యక్షుడుగా ఏడుగురు కథా రచయితలు విమల, రమాసుందరి; భగవంతం, అద్దేపల్లి ప్రభు; పతంజలి శాస్త్రి, నరేంద్ర, కొట్టం రామక్రిష్ణారెడ్డిలు తమ కథల నేపథ్యాలు చెప్పేరు. శివారెడ్డి గారి లాంటి పెద్దల్ని నేనే దగ్గరకెళ్లి పలకరించేను, అప్పాజోస్యుల సత్యనారాయణ గార్ని నేను, నన్ను ఆయనా గుర్తు పట్టలేకపోయాం. నేనెవరో చెప్పేక ఆయన నా చేతిని ఆప్యాయంగా తన చేతుల్లోకి తీసుకున్నారు. అప్పటికి ఆయన కొత్తగా రాసిన సుగుణాఢ్య శతకం ఇచ్చేరు. మధ్యాహ్నం ఆయన అధ్యక్షతన రచయితలు కాని వివిధ రంగాల వాళ్లు కథ గురించి తమ అభిప్రాయాలు చెప్పేరు. ఇంద్రగంటి మోహనక్రిష్ణ, సంధ్య, భిక్షు, ఒక ప్రచురణ కర్త, ఒక జర్నలిస్ట్ లు మొత్తం మీద రోజంతా చాలా ప్లెజెంట్ గా గడిచింది, ప్రజ్వలిత సంస్థవాళ్లు 200 మంది విద్యార్థుల్ని పిలిచి కూర్చోబెట్టడంవలన సభ నిండుగా అన్పించింది.
ఇంటికొచ్చేసరికి వినాయక ఉత్సవాల హోరు ముగిసింది. ఆ రోజు అన్న సంతర్పణ జరుగుతోంది. మైకులోంచి పెద్దగా ఎనౌన్స్ మెంట్ విన్పిస్తోంది. ‘‘ఆ… రండి బాబూ రండి. రాత్రికి వినాయకుడి లడ్డూ పాటకి రండి, ఈ లడ్డూ తింటే అన్ని సంపదలూ సమకూరుతాయి. పిల్లలు లేనోళ్లకి పిల్లలు, ఇల్లు లేనోళ్లకి ఇళ్లు, డబ్బుల్లేనోళ్లకి డబ్బులు వత్తాయి’’ అంటూ. ఇంకానయం జబ్బుల్లేనోళ్లకి జబ్బులు అనలేదు. ఎంత కవర్లో పెట్టినా తొమ్మిది రోజులుగా దుమ్ము, ధూళి, దోమలు, ఎలకలు, కోతులు అన్నీ అంతో ఇంతో భుజించిన లడ్డూలు మరి!

 

*****

Leave a Reply

Your email address will not be published.