పౌరాణిక గాథలు -44

-భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి

దండుడు కథ

ఇక్ష్వాకు వంశంలో చిట్టచివరగా పుట్టినవాడు దండుడు. అతడికి ఆటలంటే చాలా ఇష్టం. పిల్లలందరితో ఆటలాడుతూ అందరితో తగాదాలు పెట్టుకుని అల్లరి చేస్తూ ఉండేవాడు. ఒక్కొక్కసారి పిల్లలు దండుడి చేతిలో బాగా దెబ్బలు తింటూ ఉండేవాళ్ళు.

చివరికి పిల్లల గొడవలు పెద్దవాళ్ల వరకు వెళ్లేవి. గొడవలెందుకని పెద్దవాళ్ళు పిల్లల్ని ఆడుకునేందుకు పంపించడం మానేసేవాళ్ళు. పిల్లలు ఊరుకుంటారా…? మళ్ళీ మొదలే!

దండుడు చేస్తున్న అల్లరి తెలిసి, అతడి తండ్రి అల్లరి చెయ్యకూడదని అందరితో కలిసి ఆడుకోవాలని నెమ్మదిగా చెప్తుండేవాడు. ఎవరితోను గొడవలు పెట్టుకోకూడదని, దాని వల్ల స్నేహం చెడిపోతుందని ఎన్ని సార్లు చెప్పినా వినేవాడు కాదు. విసిగిపోయిన తండ్రి దండుణ్ణి ఊళ్ళోంచి వెళ్ళగొట్టాడు. దూరంగా వింధ్య పర్వత ప్రాంతానికి వెళ్ళిపొమ్మన్నాడు.

దండుడు వింధ్య పర్వత ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక నగరాన్ని నిర్మించుకుని పాలించడం మొదలెట్టాడు. ఆ నగరం పేరు ’’మధుమంతపురం’’. దండుడు శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి తనకు విద్య నేర్పించమన్నాడు. అతడు రాజకుమారుడు కనుక శుక్రాచార్యుడు అతడికి విద్య నేర్పడానికి అంగీకరించాడు. దండుడు శుక్రాచార్యుడికి శిష్యుడయ్యాడు. రాక్షసులందరు అతడితో స్నేహం చేశారు. వాళ్ళందరితో కలిసి మెలిసి ఉంటున్నాడు దండుడు. దుర్మార్గుడయిన దండుడికి రాక్షసులు స్నేహితులవడంతో అతడి దుర్మార్గానికి రాక్షసత్వం కూడా తోడయింది.

ఒకరోజు దండుడు శుక్రాచార్యుడి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆయన కూతురు ’’అరజ” తపస్సు చేసుకుంటోంది. ఆమె దగ్గరికి వెళ్ళి “నువ్వెవరు?” అని అడిగాడు.

ఆమె ““నా పేరు అరజ. నేను శుక్రాచార్యుడి కూతుర్ని!”” అని చెప్పింది.

“వెంటనే బయలుదేరి నాతో వచ్చెయ్యి!”” అన్నాడు. అమె అతడితో వెళ్ళడానికి నిరాకరించింది. దండుడు బలవంతంగా అమెని తనతో లాక్కెళ్ళాడు. శుక్రాచార్యుడికి విషయం తెలిసింది. దండుడితో “”నీవంటి వాడికి విద్య నేర్పించడమే తప్పు. నిన్ను వదిలిపెట్టను!”” అన్నాడు కోపంగా.

సకల విద్యలు తెలిసినవాడు…రాక్షస లోకానికే గురువు అయిన శుక్రాచార్యుడు మధుమంత పురానికి వెళ్ళాడు. మధుమంతపురంలోనే కాకుండా దాని చుట్టూ వంద మైళ్ల వరకూ మట్టి వర్షం కురవాలని శపించాడు.

రాక్షస గురువు శుక్రాచార్యుడికి కోపం వస్తే ఊరికే పోతుందా…? ఆయన శాపం వృధ అవుతుందా…?

ఆ ప్రదేశం మొత్తం మట్టి వర్షం కురిసి శుక్రాచార్యుడు శపించినట్టే మట్టితో కప్పబడి పోయింది. అక్కడ పెద్ద పెద్ద చెట్లు పెరిగిపోయి మధుమంత పురం మట్టిలో కూరుకు పోయింది. ఆ ప్రదేశమంతా అరణ్యంగా మారిపోయింది.

దండుడు చిన్నతనం నుంచి దుర్మార్గంగా ప్రవర్తించి, రాక్షసులతో సాహచర్యం చేసి, చివరికి తను స్థాపించుకున్న రాజ్యమే అరణ్యంగా మారిపోడానికి కారకుడయ్యాడు. దండుడి చెడు స్నేహానికి చిహ్నంగా మిగిలింది దండకారణ్యం!

*****

0 thoughts on “పౌరాణిక గాథలు -44 – దండుడు కథ”

Leave a Reply

Your email address will not be published.