వ్యాధితో పోరాటం-43

కనకదుర్గ

డా. జెఫ్రీ ఇచ్చిన సలహాతో నేను బాగా ఆలోచించి ముందు చైతన్యకు వివరంగా ఒక ఉత్తరం రాయడం మొదలుపెట్టాను. వాడు పుట్టినప్పట్నుంచి వాడెన్నీ సంతోషాలు మా జీవితాల్లోకి తీసుకొచ్చాడో, వాడి ఆటపాటలు, వాడు పెరుగుతుంటే ఒక్కో వయసులో ఒకోరకంగా వాడి ముద్దు ముచ్చట్లు ఎంత ఆనందించానో, వాడి తెలివితేటలను చూసి ఎంత అబ్బురపడ్డానో, వాడ్ని చూసి అందరూ మెచ్చుకుంటుంటే ఎంత మురిసిపోయానో, వాడు సరిగ్గా తినకపోతే ఎంత బాధపడ్డానో, వాడికి ఇష్టమైనవి చేసిపెడ్తే కనీసం కడుపునిండా తింటాడని అన్నీ రకాలు ఎలా చేసేదాన్నో, వాడు చదివినా, ఆడినా, పాడినా ఎంత ముచ్చట పడ్డానో రాస్తున్నపుడు నిజంగా ఒకో సంగతి తల్చుకుంటుంటే అవన్నీ కళ్ళముందు మళ్ళీ కదలాడి వెనక్కు వెళ్ళిపోయాను చాలాసేపు. ఒకవేళ నేను ఉండకపోతే వాడు ఎలా ఉండాలో, మంచి అలవాట్లు వదలకుండా, ఎదుగుతూ వున్నపుడు కొత్త మంచి అలవాట్లు చేసుకుని శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో అవి చేయాలని, చేసే పని తనకు ఇష్టమైనదైతే సంతోషంగా చేయొచ్చని, లేకపోతే అబ్బా! ఎందుకురా బాబు ఈ పని చేస్తున్నాం అని జీవితాంతం బాధ పడ్తూ చేయడం వల్ల మనశ్శాంతి కరువవుతుందని, పుస్తకాలు అవి కూడా అన్ని రకాల పుస్తకాలు చదవాలని, మంచి రచయితల పుస్తకాలు చదవడంతో పాటు జీవితంలో డబ్బు అవసరానికి మించి ఎక్కువ సంపాదించనవసరం లేదని, సమాజంలో వున్న సమస్యల గురించి కేవలం అవగాహన ఉండడమే కాదు వాటి పరిష్కారం కోసం పని చేసే సంస్థలతో కలిసి పని చేయాలని, నాన్నకి ఆసరాగా ఉండాలని, చెల్లిని స్వతంత్రంగా బ్రతికేలా పెంచడంలో నాన్నకు సాయం చేయాలని ఇలా నాకు ఏది రాయాలనిపిస్తే అది రాసాను. స్ఫూర్తికి చాలా వరకు తను ఎవ్వరికన్నా తక్కువ కాదనీ, తను ఏది చేయాలనుకున్నాఅది చేయగలదని, తనని తాను కొన్ని విషయాలకే పరిమితం చేసుకోనక్కర్లేదని, శారీరక ఆరోగ్యం కోసం మంచి ఆరోగ్యకరమైన ఆహరంతో పాటు వ్యాయామం కూడా అవసరమని, అది జీవితంలో ఒక అలవాటయిపోవాలని, మిగతా విషయాలన్నీ దాదాపు చైతన్యకు రాసినట్టుగానే రాసాను. శ్రీనికి నేను ఏమి రాయలేకపోయాను.

తనలాగ నేనెందుకు ధైర్యంగా ఉండలేకపోతున్నానని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఎందుకివ్వన్నీ చేస్తున్నాను? ఎందుకంటే నేను పేషంట్ని, నేను నిజంగా నొప్పిని బాధననుభవిస్తున్నదాన్ని. శ్రీనిలా ధైర్యంగా ఎందుకు ఉండలేకపోతున్నానంటే ఈ పెద్ద సర్జరీలు ఒకోసారి సక్సెస్ అవుతాయి, ఒకోసారి సక్సెస్ అవ్వవు అన్న సంగతి తెల్సు కాబట్టి నాకు కంగారుగా ఉందనిపిస్తుంది.
మొదటి సర్జరీ కూడా చాలా పెద్దదే, అది కూడా కోలుకోవడానికి చాలా సమయమే పట్టింది. ఆ సర్జరీ పూర్తిగా సమస్యను పరిష్కరించలేదు. అందుకే ఇపుడు ఈ సర్జరీ చేస్తున్నారు. కానీ అపుడు ఇలా బెంబేలు పడలేదు కదా! సర్జరీ అయిపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చుననే ఆలోచించాను, ఎందుకంటే ఇల్లు విడిచి దాదాపు రెండునెలల్లయ్యిందప్పటికే, పిల్లల మీద బెంగ నన్నేమి ఆలోచించనీయలేదు. ముందు ఇంటికి వెళ్ళొచ్చి చేయించుకుందామనుకున్నాను, ఒకవేళ సర్జరీ సక్సెస్ కాకపోతే అన్న చిన్న అనుమానం ఉండేది కానీ చైతన్య, “ఒకటేసారి సర్జరీ తర్వాత ఇంటికి వచ్చేయమ్మా, అయిపోతుంది.” అనగానే ఆ చిన్న అనుమానం కూడా వీడిపోయింది.

విపుల్ సర్జరీకి సమయం దగ్గర పడ్తుందని పిల్లలతో ఎక్కువ సమయం గడపసాగాను. ఇంట్లో చిన్న చిన్న పనులు చేసాను, పిల్లల బట్టలు, బొమ్మలు, పుస్తకాలు, తీసిన ఫోటోలు అల్బమ్స్ లో పెట్టడం చేసాను.

మా అన్నయ్య, ఉదయభాను సినిమాలకు బాగా తీసుకెళ్ళేవాడు. ఒకసారి బాల్ చందర్ గారి ’అందమైన అనుభవం,’ సినిమాకి తీసుకెళ్ళాడు. అందులో జయప్రద సంతోషంగా ఉన్నపుడు, నవ్వుతూ ఉన్నపుడు ఆమెకి సడన్ గా ఎవరో ముసుగు మనిషి వెంటాడుతున్నట్టు కనిపిస్తుంటుంది. ఆ ముసుగు మనిషి మృత్యువని తర్వాత తెలుస్తుంది. నేను నిజంగా బాగవుతానా, లేకపోతే ఏ సర్జరీ జరిగేపుడో, కోలుకునేపుడో ఊపిరి ఆగిపోతుందా? అని అనుమానం రాసాగింది.

శ్రీనివాస్ కి ఆప్త మిత్రుడు శ్రీనివాసే, వీళ్ళిద్దరూ కలిసి చదువుకునేవారు. కాలేజిలో ఇతర స్నేహితులున్నా వీరిద్దరి స్నేహం గురించి అందరూ చెప్పుకుంటారు. ఆయన చాలా రోజులుగా అమెరికాకు రావడానికి ప్రయత్నిస్తున్నాడు, వచ్చి ఇక్కడ కొన్నేళ్ళుఉండడమో, వీలయితే సెటిల్ అవ్వాలని ఉంది. ఇక్కడకి రావడానికి ముందు కెనడాలో కొన్నాళ్ళున్నారు. పిల్లల్ని అమ్మమ్మ, తాతల దగ్గరుంచి భార్యా, భర్తలు వెళ్ళి పనున్నన్నినాళ్ళు అక్కడే ఉన్నారు. శ్రీనివాస్ ఆఫీస్ కెళ్ళిపోతే మాధవి (భార్య) అక్కడ బస్సులు, ట్రైన్స్ ఎక్కువగా ఉండేవి కాబట్టి చూడవల్సిన ప్రదేశాలను ఒకోరోజు ఒకోచోటకి బస్ లో కానీ ట్రైన్ లో కానీ వెళ్ళి చూసి వచ్చేది. వాళ్ళు మొత్తానికి అమెరికాకు 2001లో వచ్చారు. అది కూడా మాకు దగ్గరే ఉన్న న్యూజెర్సీకి వచ్చారు.

మేము సర్జరీ కోసం రెడీ అవుతున్నాము. జోన్ వచ్చి సహాయం చేయడానికి ఒప్పుకుంది. ఒకవేళ రాత్రి నా దగ్గర పడుకోవాల్సి వస్తే పడుకుంటాను, (రాత్రికి ఇంత ఇవ్వాలి అని శ్రీని, జోన్ మాట్లాడుకుని నిర్ణయించుకున్నారు.) డబ్బు గురించి తెలిస్తే, అది ఎక్కువ అని నాకనిపిస్తే ఏ సహాయం వద్దంటానని శ్రీని భయం. అందుకే తను నాకు ఏ ఖర్చుల గురించి కానీ, జీతం సరిపోతుందా, లేదా, అప్పులేమైనా చేస్తున్నాడా లాంటి విషయాలు చెప్పేవాడు కాదు. సర్జరీకి ఇక రెండ్రోజులుందనగా సడన్ గా న్యూజెర్సీ నుండి శ్రీనివాస్ తన భార్యా, పిల్లలిద్దరిని తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళాడు. మాకేం అర్ధం కాలేదు. మనకి ఏదైనా కష్టం వస్తే, కుటుంబం వారు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ వచ్చి సాయం చేయడం అనే సంగతికి దూరమయ్యాము. ఇక్కడి వాళ్ళే కష్టం అర్ధం చేసుకుని వాళంతట వాళ్ళే వచ్చి సాయం చేసారు.

జోన్ కి ముందే చెప్పాము తన సాయం తీసుకుంటామని. అంతా సెటిల్ అయ్యింది, ఇపుడు వీళ్ళు వచ్చారు. మాకు ఒకవైపు సంతోషంగా వున్నా, జోన్ ఎలా అర్ధం చేసుకుంటుందో తెలియదు. ఆమెని ముందు ఎలా అనుకున్నామో అలాగే రమ్మన్నాము. పిల్లలకి తోడుగా వాళ్ళ పిల్లలుంటారు కాబట్టి సంతోషంగా వుంటారులే అనుకున్నాను. మాధవి వాళ్ళ బందువులు హైద్రాబాద్ లో చిన్నపుడు మా ఇంటి దగ్గర ఉండేవారు. మా పెళ్ళయిన కొత్తలో శ్రీనివాస్ తమ్ముడి పెళ్ళికి శ్రీని నన్ను తీసుకెళ్ళాడు. అపుడు పెళ్ళికి వచ్చినవారిలో మా ఇంటి దగ్గర ఉన్నవాళ్ళని చూసి అడిగితే శ్రీనివాస్ భార్య వైపు బందువులని తెలిసింది. వాళ్ళందరూ బాగా సాంప్రదాయకంగా, హిందూ ఆచారాలను, (మూఢాచారాల)ను పాటించేవారు. ఆయన పేరు మాధవరావుగారు, ఆయన ఇంజనీర్ గా పని చేసి రిటైర్ అయ్యారు. వాళ్ళది ఉమ్మడి కుటుంబం ముగ్గురు కొడుకులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు అందరూ కలసి ఉండేవారు. నేను, అక్క వాళ్ళింటికి వెళ్ళి చిన్న అమ్మాయిలకు తలలు దువ్వి, జడలు వేసి శుభ్రంగా మొహాలు కడిగి, చక్కగా మంచి బట్టలు వేసి తయారు చేసేవారం. ఆ యింటి కోడళ్ళు మేమెళ్ళకపోతే వాళ్ళకు పిల్లల పని ఎక్కువయ్యి, “ఈ పిల్లలెందుకు రాలేదో ఈ రోజు,” అనుకునేవారు.
ఆ యింట్లో ముట్లగది ఒకటి కట్టించారు. అందులో గాలి, వెలుతురు ఏమి రాకుండా కట్టించారు. ఎవరికి బహిష్టు వచ్చినా ఆ గదిలోనే వుండాలి. మేము ఎపుడు వెళ్ళినా ఎవరో ఒకరు, “దూరం వున్నాను, ముట్టుకోకు,’ అనేవారు ఆ గది లేక ముందు. ఎవరైనా కనపడకపోతే వాళ్ళు ఆ ముట్ల గదిలో వున్నారని అర్ధమయ్యేది మాకు. ఒకోసారి ఇద్దరుండేవారు ఆ గదిలో. మాధవిని చూసినపుడు నాకు వాళ్ళు గుర్తొచ్చారు.

ముఖ్యంగా తను నన్ను స్తోత్రాలున్న ఒక చిన్న పుస్తకం ఇచ్చి, “ఇందులో అన్ని సమస్యలకు ఒక స్తోత్రం వుంది, అనారోగ్యం తగ్గడానికి కూడా ఒకటి ఉంది, రోజు చదువుకో, కొన్నాళ్ళయ్యాక దాని ఫలితం కనిపిస్తుంది,’ అన్నది. అంటే నేను, ” ఇది ఎపుడంటే అపుడు చదవొచ్చా లేకపోతే పొద్దున్నే లేచి, తలస్నానం చేసి, అపుడు చదుకోవాలా? నాకు అలాంటివన్నీ చేయడానికి రాదు మరి. నొప్పి వచ్చినపుడు ఒకోసారి కొన్ని రోజుల వరకు స్నానం చేయలేను…..”

“అట్లా ఏం లేదు నువ్వు ఎపుడైనా, ఎక్కడైనా చదువుకోవచ్చు. అన్నీ బాగున్నవాళ్ళకి స్నానం చేసి ఉదయమే చదవాలని అంటారు కానీ నీకా పరిస్థితి లేదు కాబట్టి నువ్వు మంచంలోనే చదువుకోవచ్చు.” అని అంది మాధవి.

“మరి మంత్లీ వచ్చినపుడు …” అని ఆగాను “అది కాదు ఇపుడు నాకు వీలవ్వదు…” అన్నాను అర్ధం చేసుకోవాలని.

” అయితే నీ భర్తను చదవమను ..” అని అంది.

శ్రీని అసలే చదవడు. పైగా, “ఇవన్నీ మాటలెందుకు, నేను చదవనని నేరుగా చెప్పలేవా?” అని నా మీదే అరుస్తాడు.

మర్నాడు సర్జరీ అనగా ఒకరోజు ముందు వెళ్ళి హాస్పిటల్ లో జాయిన్ అయ్యాను. ఈ హాస్పిటల్ కూడా ఫిలడెల్ఫియాలోనే ఉంది. మొదటి సర్జరీ అయినపుడు ఫిలడెల్ఫియాలోనే జెఫర్సన్స్ అనే హాస్పిటల్లో అయ్యింది. ఇపుడు జాయిన్ అయిన హాస్పిటల్ పేరు పెన్న్ (PENN Hospital) హాస్పిటల్, దీన్ని హాస్పిటల్ ఆఫ్ ది యునివర్సిటీ ఆఫ్ పెన్సల్వేనియా అని కూడా అంటారు, (HUP). శ్రీని, నేను మధ్యాహ్నానానికల్లా వెళ్ళి జాయిన్ అయ్యి, వాళ్ళిచ్చిన పేపర్ వర్క్ అంతా చేసాము. సాయంత్రం జోన్ మా పిల్లలను, మాధవి, ఆమె పిల్లలను తీసుకుని ఆసుపత్రికి వచ్చింది. దాంతో నాకు పిల్లలతో సమయం గడిపడానికి వచ్చింది. చైతన్యకు మాధవి పిల్లలతో ఆడుకోవాలని, వాళ్ళు హాస్పిటల్ చూడటానికి వెళితే తను మాత్రం నా దగ్గరే ఉన్నాడు. “నీకు వెళ్ళాలని వుంటే వెళ్ళిరా.” అన్నాను నేను.

“లేదమ్మా, నేను నీ దగ్గరే ఉంటాను,” అని అన్నా, చెల్లి నేను మంచం పై కూర్చొని ఉంటే ఇద్దరు చెరో ప్రక్కన కూర్చున్నారు.

“మీ వాడికి చెల్లి మీద చాలా ప్రేమ, చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు.” అంది మాధవి.

“మరి ఒక్కగానొక్క చెల్లి కదా! ఎన్నాళ్ళు ఎదురు చూడాల్సి వచ్చింది పాపం.” అంది జోన్. “అయినా చై ఎప్పుడూ బాగానే ఉంటాడు. అందరి పిల్లల్లా అస్సలు అల్లరి చేయడు.హీ ఈజ్ ఆల్వేస్ ఎ గుడ్ బాయ్.” అన్నది జోన్.

” ఫ్యామిలితో బాగానే ఉంటారు. కానీ మగపిల్లలందరూ కలిస్తే కోతుల్లాగే ఎగురుతారు. నిన్నంతా ఇల్లంతా పీకి పందిరేసారు ముగ్గురు కల్సి. మా ఇద్దరు మగపిల్లలు, మీ వాడు కల్సి ఒకటే అల్లరి. స్ఫూర్తి జోన్ తో ఆడుకుంది. కానీ మధ్య, మధ్యలో వచ్చి చెల్లిని చూసి, దానికి నీళ్ళు కావాలా? ఆకలేస్తుందా? స్నాక్ కావాలా? అని అడుగుతూనే వున్నాడు. దానికి కళ్ళు మూసుకుపోతుంటే వీడు దాని బ్లాంకెట్ తెచ్చి ఇచ్చాడు పడుకోవడానికి.” అని చెప్పింది మాధవి.

నేను పిల్లలిద్దరిని దగ్గరకు తీసుకుని ముద్దుపెట్టుకున్నాను. జోన్ ముందు బయటికి వెళ్ళింది, తర్వాత, ” మా పిల్లలెక్కడున్నారో చూస్తాను,” అని తను మాధవి కూడా బయటికి వెళ్ళింది.
శ్రీని, పిల్లలు, నేను. “అమ్మా, నువ్వు ఆ సర్జరీ అపుడు ముందు ఇంటికి వచ్చి మాతో టైం గడిపి తర్వాత సర్జరీ చేయించుకుంటానన్నావు కదా?”

“అవును, గుర్తుంది నాన్న, అపుడు నువ్వే కదా, ఒకటేసారి సర్జరీ చేయించుకుని రావొచ్చు కదా! అని నువ్వన్నావు. అపుడు నాకు చాలా ధైర్యం వచ్చేసింది.”

ఇపుడు కూడా అట్లాగే ధైర్యంతో వెళ్ళి చేయించుకుని వచ్చేయమ్మా. ఆ తర్వాత నువ్వు కొంచెం రికవర్ అయ్యాక డిశ్చార్జ్ చేసాక ఇంటికి వెళ్ళి పోవచ్చు.. ఇంకొన్ని రోజుల్లో మాకు సమ్మర్ వెకేషన్ మొదలవుతుంది. నేను ఇంట్లో వుంటాను, నీకు హెల్ప్ చేస్తాను చెల్లిని చూసుకోవడానికి. నీకు కొంచెం తగ్గాక మనమందరం కల్సి పార్క్స్ కి, చిన్న చిన్న ప్లేసెస్ కి వెళ్లొచ్చు.

అన్నీ హ్యాపీ థింగ్స్ ఆలోచించు అపుడు నీకు భయమేయదు. నువ్వు మాకు చెప్తుంటావు కదా, ఏదైనా భయపడకుండా ఎలా వుండాలో! నువ్వు కూడా ఇవన్నీ గుర్తు పెట్టుకో. ఎవ్విరిథింగ్ విల్ బి ఆల్రైట్ అమ్మా!” అన్నాడు.

“నిజంగా మీరు బంగారు కొండలు రా నాన్న! ఎంతమంది పిల్లలు అమ్మా, నాన్న చెప్పింది గుర్తు పెట్టుకుని మళ్ళీ అమ్మకి గుర్తు చేస్తారు… సూపర్ కన్నా! మీ అందరి సపోర్ట్ ఉంటే నాకేం కాదురా, నేనుంటాను, నీ హైస్కూల్ గ్రాడ్యూయేషన్, కాలేజ్ గ్రాడ్యూయేషన్ చూస్తాను, నీకు ఇష్టమైన జాబ్ రావాలి, నీ పెళ్ళి చూడాలి. ఇంత మంచివాడివి కదా! నీకు చాలా మంచి అమ్మాయి దొరకాలి. స్ఫూర్తి హైస్కూల్, కాలేజ్ గ్రాడ్యూయేషన్, మంచి జాబ్, పెళ్ళి, మీ పిల్లలు అన్నీ చూస్తాము మేము, నేను, నాన్న. తెలిసిందా!”

“అయ్యాయా మీ మాటలు. చీకటి పడుతుంది ఇక బయల్దేరుదామా,” అన్నది. మాధవి ఇద్దరు పిల్లలను తీసుకుని వచ్చింది.

“ఆంటీ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సర్జరీ,”అన్నారు మాధవి పిల్లలు, చందు, కార్తీక్ లు.

“థ్యాంక్యూ నాన్న. ఇంట్లో అమ్మకు సాయం చేయండి.”

“వాళ్ళ సాయమా? నా పనికి అడ్డం రాకుంటే చాలు.” అంది మాధవి.

పిల్లలు వెళ్తుంటే నాకు ఏడుపు వస్తుంది. కానీ వాళ్ళ ముందు ఏడుస్తే బెంబేలు పడిపోతారని ఏడుపు ఆపుకుంటున్నాను. ఇద్దరిని గుండెకు హత్తుకున్నాను. “సర్జరీ అయ్యి నాకు కొంచెం శక్తి రాగానే ఇంటికి వచ్చేస్తాను సరేనా!” అని ఇద్దరి బుగ్గలపై ముద్దు పెట్టాను.

“మేము నిన్ను చూడడానికి వస్తాము కదా అమ్మా! సో నువ్వు ఇంటికి వచ్చేదాక వేయిట్ చేయక్కరలేదు, మేమొస్తాము.” అన్నాడు చైతన్య నన్ను చుట్టేసి అలా ఉన్నాడు కాసేపు నన్ను కదలనీయకుండా.
నన్ను మెల్లిగా వదిలేసి కళ్ళు తుడుచుకోవడం నేను చూసాను. నేను ఏదో చెప్పబోయాను, కానీ శ్రీని తన వేలు మూతి పై ఉంచి మాట్లాడకు అన్నట్టు సైగ చేసాడు. నేను మాట్లాడతాలే అని మళ్ళీ సైగ చేసాడు.

స్ఫూర్తికి ఇదంతా ఏం అర్ధం కావటం లేదు కానీ అమ్మకి మళ్ళీ బాగాలేదు అందుకే హాస్పిటల్ కి వచ్చారని ఆలోచన వచ్చిందో, రాలేదో నాకు అర్ధం కాలేదు. అందరూ వెళ్ళిపోయారు, శ్రీని వాళ్ళని కింద దాక పంపించివస్తానని వెళ్ళాడు. శ్రీని రాత్రి దాక ఉన్నాడు. ఏం మాట్లాడాలో తెలియదు. ఇది ఎటు పోతుందో తెలియని పరిస్థితి. నేను, ” నాకేమైనా అయితే నువ్వు ఇక్కడ ఒక్కడివే ఉండకు, ఇండియాకి వెళ్ళిపో. అక్కడ మనవాళ్ళున్నారు కదా! వాళ్ళు సాయం చేస్తారు పిల్లల్ని పెంచడానికి. నువ్వు చాలా ఏళ్ళు తోడు లేకుండా ఉండకు. పిల్లలు వాళ్ళే సర్థుకుపోతారు, ఒక మంచి అమ్మాయిని, ఫస్ట్ మ్యారేజి చేసుకునే వాళ్ళు కాకుండా, డైవోర్స్ అయిన అమ్మాయిలు, లేదా భర్తలు పోయిన వారిలో మంచి మనిషిని చూసుకుని పెళ్ళి చేసుకో!” అని చెప్పాలనుంది. కానీ మనిషిని చూస్తే తనకి కూడా చాలా చెప్పాలనుంది కానీ మాట్లాడలేకపోతున్నట్టనిపిస్తుంది. రాత్రి పది గంటలకు బలవంతంగా ఇంటికి పంపించాను. ’మధ్యాహ్నం కదా సర్జరీ అని మెల్లిగా రాకు పదకొండు గంటలకల్లా వచ్చేస్తే కాసేపు కూర్చున్నట్టుంటది,’ అని చెప్పాను.

ఆ రాత్రి కన్ను మూత పడలేదు. అమ్మా, నాన్నతో హాస్పిటల్ కి వచ్చే ముందే మాట్లాడాను. అందరూ గుర్తు రాసాగారు. అన్న, వదిన, పిల్లలు, అక్క, కుటుంబం ముఖ్యంగా పిల్లలను చూడాలనిపిస్తున్నది. పిల్లలందరు నేను లేకుండానే పెద్దవుతున్నారు. అన్నయ్య, ఉదయభాను, ఆంధ్ర ప్రదేశ్ టూరిజంలో పని చేస్తూ రచనలు కూడా చేస్తుంటాడు. జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాలనుకునేవాడు. కుటుంబాన్ని వీలయినపుడల్లా కొత్త కొత్త ప్రదేశాలు చూపించడానికి తీసుకువెళ్ళేవాడు. మేము అంటే తన తర్వాత పుట్టిన ముగ్గురం, అమ్ములు అక్క, అక్కా అని ఎపుడు పిలవలేదు. నేను నా తర్వాత చిన్నోడు పుట్టాం. చిన్నోడికి నాకు పదినెలల తేడాయే. అన్నకు, మాకు 14 ఏళ్ళ తేడా వుండడంతో మాకు నిజంగానే పెద్దన్నలా వుండేవాడు. మా ముగ్గురిని, అన్ని ప్రదేశాలకు తిప్పేవాడు. జూ పార్క్ కు, ఎగ్జిబిషన్లకు, సినిమాలకు అవి కూడా పిల్లలు చూడగలిగే సినిమాలు వెతికి తీసుకెళ్ళేవాడు. పాటల గురించి, అందులో సంగీతం గురించి, గీత రచన గురించి, ఎక్కడ ఏ వాయిద్యం ఎక్కువగా వాయిస్తున్నారో కూడా చెప్పేవాడు. మాకు పాటలంటే పిచ్చి మా అన్నయ్య దగ్గరనుంచే వచ్చింది. అన్నకు నిద్రంటే చాలా ఇష్టం. నాన్నేమో, పొద్దున్నే లేవడని అన్నని తిట్టేవాడు. పెద్దోడవుతున్నాడే కానీ ఇంకా బాధ్యత తెలియటం లేదని, చదువు పూర్తి చేసి ఉద్యోగం చూసుకుని తనకు చేదోడు వాదోడుగా ఉండాలని మా నాన్న కోరిక. కానీ అన్నకు రోజు పొద్దున్నేతొమ్మిది గంటలకల్లా ఆఫీసుకి వెళ్ళి సాయంత్రం అయిదు గంటలకు ఇంటికి రావడం లాంటి ఉద్యోగాలు ఇష్టం లేదు. అన్నకు కళలంటే ఇష్టం, కార్టూన్స్ వేసేవాడు, మంచి బొమ్మలేసేవాడు, పాటలన్నా, సంగీత వాయిద్యాలన్నా చాలా ఇష్టం. అందుకే టూరిజంలో ముందు గైడ్ ట్రైనింగ్ చేసాడు. గైడ్ గా సిటీ టూర్ కి వెళ్ళినప్పుడల్లా చాలా సంతోషంగా ఉండేవాడు. నన్ను కూడా ఒకసారి సిటీ టూర్ కి తీసుకు వెళ్ళాడు. ప్రతి సారి కొత్త కొత్త మనుషులు వాళ్ళతో మాట్లాడటం రక రకాల విషయాల గురించి తెలుసుకోవడమంటే అన్నకి ఆసక్తిగా ఉండేది. ఆ తర్వాత టూరిజంలో డిప్లోమా కోర్స్ చేసి ఆంధ్ర ప్రదేశ్ టూరిజం డిపర్ట్మ్ంట్లో పని చేస్తున్నాడు. ఏ మూలకి పంపించినా వెళ్ళి అక్కడి టూరిజంని బాగా కొత్త కొత్త ఐడియాలతో అక్కడ చూసే ప్రదేశాలను అందంగా తీర్చిదిద్ది పాపులర్ చేసేవాడు. అలా ఇష్టమైన పని చేస్తూ ఆనందంగా ఉన్నాడు. పిల్లలను చదివిస్తున్నారు, అన్నా, వదిన. వదిన కూడా స్కూల్లో టీచర్ పని చేసి, మెషిన్ మీద బట్టలు కుట్టి ఆర్ధికంగా సాయంగా ఉంటూనే పిల్లల చదువులు చూసుకుంటూ బిజీగా ఉంటుంది. వాడు.

అన్నయ్య నన్ను అన్నీ పుస్తకాలు చదవమని ప్రోత్సహించేవాడు, నేను రాయడం మొదలు పెట్టినప్పటినుండి బాగా రాయాలంటే చాలా పుస్తకాలు చదువుతుండు అని తెచ్చిచ్చే అన్నయ్యకు ఇద్దరు ఆడపిల్లలు, ఒకబ్బాయి. అమ్ములు అక్కకు, ఒకబ్బాయి, ఒకమ్మాయి. వాళ్ళబ్బాయి అచ్చం మా చిన్న తమ్ముడిలానే ఉంటాడు. వాడు భోగి రోజునాడు పోతే వీడు భోగి రోజు నాడే పుట్టాడు. రెండేళ్ళ తర్వాత ఒక పాప పేరు సుకృత. అబ్బాయి పేరు శశాంక్. నేను చిన్నదాన్ని కాబట్టి పిల్లలందరిని చూసుకునేదాన్ని, ఆడించేదాన్ని.

కన్ను మూత పడలేదు ఆ రాత్రి. కాసేపు కునుకు పట్టినా అది కలత నిద్రే…

తెల్లవారుఝామున నర్సులు వచ్చి లేపారు. బ్లడ్ టెస్ట్స్, వైటల్ సైన్స్ చూడడం కోసం. ఇందులో బి.పి, టెంపరేచర్, పల్స్ చూస్తారు. బ్లడ్ టెస్ట్ చేస్తుండగా ఆపరేషన్ థియేటర్ నుండి ఒకతను వచ్చి ఒక సర్జరీ క్యాన్సిల్ అయ్యిందని, పది గంటలకే సర్జరీ చేస్తారని మీ భర్తకు ఫోన్ చేసి చెపితే చెప్పండి అన్నాడు. రక్త పరీక్ష చేసి వెళ్ళిపోయాక నేను శ్రీనికి ఫోన్ చేయసాగాను. ఎంతకీ ఎత్తటం లేదు. ఒక పది నిమిషాలు కాగానే మళ్ళీ ఇందాక వచ్చినతనే వచ్చి పది గంటల సర్జరీ కూడా క్యాన్సిల్ అయ్యిందని ఇంకో అరగంటలో అంటే ఏడున్నరకు సర్జరీ చేస్తారని చెప్పారు. నేను, ” నా భర్తకి ఈ విషయం తెలియదు ఇంకా, నేను ఫోన్ చేసి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ డా. రొసాటోకి నా భర్త వచ్చేవరకు వేయిట్ చేయమని నా మనవిగా చెప్పమని మిమ్మల్ని వేడుకుంటున్నాను…” అని చెప్పాను కానీ ఏడుపు వస్తుంది. అయ్యో సర్జరీకి వెళ్ళేముందు శ్రీనిని చూడకుండా వెళితే ఎలా? అంతా బాగా జరిగితే పరవాలేదు, కానీ ఏదైనా జరిగితే నాకు మళ్ళీ తనని చూసే అవకాశం రాకపోతే….

వచ్చినతను నా పరిస్థితి చూసి, “ఓకే, ఐ విల్ ట్రై మై బెస్ట్ టు వేయిట్ అన్టిల్ యువర్ హజ్బెండ్ కమ్స్… కీప్ ట్రైయింగ్ టు కాల్ హిమ్..” అని వెళ్ళి పోయాడు.

నేనెన్నిసార్లు చేసినా ఫోన్ ఎత్తడం లేదు. తన ఫోన్ ఎత్తడంలేదని, ఇంటికి చేస్తున్నాను. ఇంటిఫోన్ గట్టిగా మ్రోగుతుంది కదా! మరి ఎందుకు వీళ్ళు ఎత్తటం లేదు. ఇంటి ఫోన్ ఎంగేజ్ రావడం మొదలయ్యింది. నాకు ఏం చేయాలో అర్ధం కావడం లేదు. మాధవి ఎవరితోనో మాట్లాడుతున్నట్టుంది. నాకు ఇక తనను చూడకుండానే నేను సర్జరీకి వెళ్తానని రూఢీ అయిపోయింది.

ఇంతలో జోన్ ఫోన్ గుర్తొచ్చింది. జోన్ ఇపుడు మా అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో వుండడం లేదు. కానీ తను వెళ్ళనన్నా వెళ్తుంది, లేకపోతే కొడుకునయినా పంపిస్తుందనుకుని ఆమెకి ఫోన్ చేసాను. వెంటనే ఎత్తింది. “హే దుర్గా, వాట్స్ అప్? ఈజ్ ఎవ్విరిథింగ్ ఆల్రైట్?” అని అడిగింది.

నేను ఏడ్చేసాను, తను కంగారు పడిపోయింది. “ప్లీజ్ దుర్గా, ఏడుపు ఆపి చెప్పు ఏమయ్యిందో, నాకు భయం వేస్తుంది….”
సంగతి చెప్పాను. “ఓకే ఓకే డియర్, డోంట్ వర్రీ. ఐయామ్ గోయింగ్ రైట్ నౌ టు టెల్ హిమ్ అబౌట్ ది చేంజ్ ఆఫ్ ది టైం…హి విల్ కాల్ యూ. జస్ట్ స్టే కామ్ డియర్…” అంటూనే కార్ స్టార్ట్ చేసిన చప్పుడు వినిపించింది.

ఆ నిమిషం నుండి శ్రీని కాల్ చేసి వస్తున్నానని చెప్పేవరకు నాకు కంగారు తగ్గలేదు. వస్తున్నాడా, లేదా అని ఓ.ఆర్ అతను వచ్చి మళ్ళీ మళ్ళీ అడగసాగాడు ప్రతి పది నిమిషాలకు.

నేను శ్రీనికి ఫోన్ చేసి, ” నువ్వు కంగారులో స్పీడ్ గా డ్రైవ్ చేయకు ప్లీజ్! వాళ్ళు ఆగుతారు నువ్వొచ్చేవరకు,” అని చెప్పాను.

తను వచ్చేవరకు మళ్ళీ కంగారు. సర్జరీ గురించి భయం ఎక్కడ పోయిందో ఈ హడావిడిలో. మొత్తానికి వచ్చాడు. ఆపరేషన్ థియేటర్ అతను వచ్చి డా. రోసాటో, “మీ హజ్బెండ్ వచ్చేవరకు ఆగుతామని,” చెప్పమన్నారు డాక్టర్ గారు అని చెప్పాడు. శ్రీని మొహంలో కోపం, ఆదుర్ధా, మిస్ అవుతానేమోనన్న కంగారు కనిపించాయి. వచ్చి మంచం మీద కూర్చున్నాడు.

” ఏంటిది? ఎందుకలా చేసారు? ఇది కరెక్ట్ కాదు..” తల అడ్దంగా ఊపుతూ అన్నాడు.

“ఏది కరెక్ట్ కాదు. నేను ఫోన్ అన్ని సార్లు చేసినా ఎత్తకపోవడం కరెక్టేనా….”

“సారీ, వెరీ వెరీ సారీ! రెండు మూడ్రోజులుగా నిద్ర లేదు. రాత్రి చెక్ చేయడం మర్చిపోయాను. పాప పడుకుంటే ఫోన్ వస్తే ఆ చప్పుడుకి లేస్తుందేమోనని ఆఫ్ చేస్తాను. రాత్రి ఆన్ చేసి చిన్న సౌండ్ తో నా దగ్గరే పెట్టుకుంటాను. పొద్దున కాస్త లేటుగా కూడా లేచాము. ఫోన్ ఆఫ్ ఉంది అన్న సంగతి మర్చిపోయాను… జోన్ వచ్చి చెపితే నాకు కాళ్ళుచేతులు ఆడలేదు.”

శ్రీని నా చేతులు తీసుకుని తన కళ్ళపై పెట్టుకున్నాడు. కంటి తడి నా చేతులకు తాకింది.

“ఏయ్… శ్రీని, ఏంటిది? నువ్వు కరెక్ట్ సమయనికే వచ్చావు. ఇంకా టైముంది సర్జరీకి…పర్వాలేదు….”

నాకూ గొంతులో పట్టేసినట్టయ్యింది. ఇంకేం చెప్పాలో అర్ధం కాలేదు. ఇంతవరకు ధైర్యంగా ఉన్న మనిషి…. కానీ నేను కూడా తనని చూస్తానని అనుకోలేదు.
ఇద్దరికీ అదే భయముండింది. ఒకరినొకరం చూసుకోకుండానే నన్ను ఆపరేషన్ రూంకి తీసుకెళ్ళిపోతారేమోనని. అంతా బాగయితే పర్వాలేదు కానీ ఒకవేళ సర్జరీ ఫెయిలై నేను బ్రతకకపోతే నిన్న రాత్రి చూసుకున్నదే ఆఖరి చూపవుతుందని ఇద్దరి భయం. నేను ఏడవకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ…గొంతు సవరించుకుంటూ….

“నువ్వు ఇలా బెంబేలు పడిపోతే ఎట్లా? పిల్లలు ఇంకా దిగాలుపడ్తారు. నువ్వు జాగ్రత్తగా ఉంటూ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా…!”

” నేనొచ్చేవరకు నువ్వు ఇక్కడ ఉంటావనుకోలేదు…..అందుకే అట్లా అయ్యింది…నువ్వు పిల్లల గురించి ఏం ఆలోచించకు..నేను, జోన్, ఇపుడు మాధవి కూడా ఉంది పిల్లలను చూసుకోవడానికి నువ్వేం కంగారు పడకు….”

“ఊ… అలాగే, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు.”

“నువ్వు ఒకటే గుర్తు పెట్టుకో, సర్జరీ సక్సెస్ అవుతుంది, నువ్వు త్వరగా ఇంటికి వస్తే, ఆరోగ్యంగా ఇంట్లో తిరుగుతుంటే అంతా అదే చక్కపడుతుంది.” అన్నాడు.

ఒకటేసారి స్ట్రెచర్ తీసుకుని వచ్చారు ముగ్గురు నర్సులు. తలకు క్యాప్ లు పెట్టుకున్నారు, చేతులకు గ్లోవ్స్ వేసుకున్నారు. ఆపరేషన్ కు అంతా సిద్దంగా ఉన్నట్టున్నారు.
శ్రీని లేచి నిలబడ్డాడు.

శ్రీని మేము థియేటర్ వైపు తిరిగుతుండగా నా చెయ్యి పట్టుకుని, “ఆల్ ది బెస్ట్… నీ సర్జరీ అయ్యేదాక నేను ఇక్కడే వుంటాను.”

“మీ కొలీగ్ వస్తాడన్నావుగా నీకు తోడుగా వుండడానికి … ఇంకా రాలేదేమిటి?”

“వస్తాడు. తప్పకుండా వస్తాడు. మేమిద్దరం కలిసే లీవ్ తీసుకున్నాం….నువ్వు ఇవేవి ఆలోచించకు. యూ విల్ బి ఫైన్.” అని చెయ్యి ప్రేమగా నొక్కి వదిలేసాడు.

” పిల్లలు జాగ్రత్త!” అని నేను వెనక్కి చూస్తూనే వున్నాను.

థియేటర్ ముందర స్ట్రెచర్ ఆపారు ఒక పక్కన. డా. రొసాటో నా దగ్గరకి వచ్చారు. “హౌ ఆర్యూ డియర్?”

” ఓకే ఐ థింక్ … ఐ యామ్ స్కేర్డ్…”

“డోంట్ వర్రీ డియర్, బికాజ్ ఐ యామ్ నాట్… ఐ హావ్ ఆపరేటడ్ ఆన్ ఎ లాట్ ఆఫ్ పేష్ంట్స్. గుడ్ సక్సెస్ రేట్. డూ యూ హావ్ ఎనీ మోర్ క్వశ్చన్స్?”

మా ముందు నుండి ఒక నర్స్ బ్లడ్ బ్యాగ్ తీసుకెళ్తుంది. “బ్లడ్ బాగా చెక్ చేస్తారా?”

“ఓహ్ దట్! డెఫినెట్లీ … ఇలాంటి విషయాల్లో మా హాస్పిటల్లో చాలా మంచి సిస్టమ్ వుంది. డోంట్ వర్రీ. అవును మీ హజ్బెండ్ వచ్చాడా నిన్ను కలవడానికి?”

“వచ్చాడు..”

“అది చాలా ముఖ్యమైంది. ఫ్యామిలీ ఈజ్ సో ఇంపార్టెంట్ .. ఐ యామ్ సో గ్లాడ్ దట్ యు కుడ్ మీట్ హిమ్.”

ఒక నర్స్ వచ్చి అంతా రెడీ అని చెప్పింది. నన్ను ఓ.ఆర్, ఆపరేషన్ రూంలోకి తీసుకెళ్ళారు. ఒకరొకరు రావడం మొదలుపెట్టారు, అసిస్టెంట్ సర్జన్స్, డా.రొసాటో చేతులు కడుక్కుని పైకి పెట్టుకుని వుంటే నర్సులు సర్జికల్ గౌన్స్ వెనక్కి కడ్తున్నారు. ఒక రెండు నిమిషాల్లో అందరూ నా చుట్టూ మూగసాగారు. అనస్థిషియాలజిస్ట్ నా పక్కన వచ్చి మెల్లిగా మాట్లాడుతూ అంకెలు లెక్క పెట్టమన్నాడు. ఆయనకు నాకు చాలా భయమేస్తుందని చెప్పాను. ఆయన మళ్ళీ నెమ్మదిగా, ” ప్లీజ్ స్టార్ట్ కౌన్టింగ్…వియ్ విల్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ యూ.”

ఆయన నవ్వుతూ నా వైపు చూస్తున్నాడు, నేను నెంబర్లు లెక్కపెట్టడం మొదలుపెట్టాను. కళ్ళు మూసుకుపోసాగాయి. ఆ తర్వాత నాకేం గుర్తులేదు. విపుల్ సర్జరీకి 5-8 గంటల సమయం పడ్తుంది కేస్ ఎంత క్లిష్టమైనదనే దాని మీద ఆధారపడి వుంటుంది. పాడయిపోయిన వాటిని తీసివేయడమే కాదు, అంటే కొంతమందికి పూర్తిగా దెబ్బతిన్న పాన్క్రియాస్ తల, బాడీ (మధ్య భాగం) తో పాటు కొంత కడుపు భాగం, కొంత భాగం చిన్నప్రేగులు, కొంత పిత్తనాళం తీస్తారు. నాకు ముందే పిత్తాశయం మొదటి సర్జరీలోనే తీసారు. పాడయినవాటిని తీయడానికి కొన్ని గంటలైతే మళ్ళీ పాన్క్రియాస్ తోకని, పిత్తనాళాన్ని(bile duct), కడుపు కొంత భాగం, చిన్న ప్రేగుల్లో కొంత భాగం, పిత్తనాళాన్ని కలిపి పునర్నిర్మించడానికి (జీర్ణక్రియ సరిగ్గా జరగడానికి) కొన్ని గంటలవుతుంది.

5-8 గంటల సమయం పడ్తుందనుకుంటే నా సర్జరీ పూర్తవడానికి మొత్తం తొమ్మిది గంటలయ్యిందట. అన్ని గంటలు శ్రీని ఒక్కడే కూర్చుని వుంటే కంగారు పడ్తాడని ఆఫీస్ కొలీగ్ ను తోడుగా తీసుకెళ్ళమని చెప్పారట. ఇద్దరుంటే ఇతర విషయాల గురించి మాట్లాడుకోవచ్చు కేవలం సర్జరీ గురించే ఆలోచిస్తూ కూర్చోకుండా. శ్రీని ఒక్కడే ఉంటే తినేవాడో లేదో తెలీదు. పక్కన ఒక మనిషి ఉంటే తనతో పాటు తినడానికి తీసుకెళ్తాడు, కాఫీ, టీ టైంలకి కూడా వెళ్ళి వస్తారు ఇద్దరు ఉంటే.

*****

(సశేషం)

Leave a Reply

Your email address will not be published.