యదార్థ గాథలు

సాధనమున పనులు…

-దామరాజు నాగలక్ష్మి

 

ధరణి, వాళ్ళక్క రజిత ఇద్దరూ అపురూపమైన అక్కచెళ్ళెళ్లు. ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ. వాళ్ళ అమ్మానాన్నలు చిన్నతనంలోనే పోవడంతో మేనమామ చాలా ప్రేమగా పెంచాడు. ఇద్దరూ డిగ్రీలు పూర్తి చేశారు. రజితకి మంచి సంబంధం కుదిరింది. పెళ్ళి చేసేశారు.

ధరణి నాకు కొన్నాళ్ళు ఉద్యోగం చెయ్యాలని వుందని చాలా కంపెనీలకి అప్లై చేసింది. వార్నర్ హిందూస్తాన్స్ లో టైపిస్టుగా ఉద్యోగం వచ్చింది. కంపెనీ మంచిదవటంతో ధరణి హాయిగా, సంతోషంగా జీవితం  గడిపేసేది. ఖాళీ టైములో పుస్తకాలు చదవడం, తనకు నచ్చిన అల్లికలు, కుట్లు చేసుకోవడంలో మునిగిపోతుంది.

ఒకరోజు వాళ్ళ మామయ్య, ధరణీ నేనూ పెద్దవాడిని అవుతున్నాను. నీకు కూడా పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుంది. మా స్నేహితుడు ఒకాయన చెప్పాడు – శ్రీరామ్ అని రైల్వేలో చేస్తాడుట. అతనికి ఇంతకుముందే పెళ్ళయ్యింది. ఒక ఐదు సంవత్సరాల బాబు వున్నాడుట. చాలా మంచి వాడుట. చేసుకుంటావా….?  అని అడిగాడు.

మావయ్యా మీకు అన్నీ తెలుసు కదా… మీ ఇష్టం అంది ధరణి. అన్నీ మాట్లాడుకోవడాలు, పెళ్ళవడం అయిపోయింది. ధరణి బాబుని బాగా చూసుకునేది. క్రమ క్రమంగా తన భర్త మనస్తత్వం అర్థం కాసాగింది. బాగా పీనాసి వాడు. ఏది ఖర్చు పెట్టాలన్నా లెక్క చూసుకుంటాడు. వంటకి అన్నీ కొలిచి ఇస్తాడు. అప్పటి వరకూ తను ఉద్యోగం చేసుకుంటూ హాయిగా గడిపిన ధరణికి ఇదంతా మింగుడు పడలేదు.

ఇవి మాత్రమే కాదు. కోపం చాలా ఎక్కువ. ఏదైనా ఎదురు మాట్లాడితే బాగా కొట్టేవాడు. చెడు అలవాట్లు ఏమీ లేవు కానీ. కొట్టడం బాగా వుండేది. శ్రీరామ్ ఆఫీసుకి వెళ్ళినప్పుడు బాగా ఏడుస్తూ వుండేది. ఏమైనా సరే ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది.

కానీ అప్పుటికి ధరణి మూడవనెల   గర్భవతి. ఒకరోజు తన స్నేహితురాలు మాలతికి ఏడుస్తూ ఫోన్ చేసింది. మాలతి అయ్యో ఎందుకలా చెయ్యాలనుకుంటున్నావు. తప్పు కదా… నీలో చాలా టాలెంట్ వుంది. ప్రస్తుతం ఎవరో ఒకరు పుట్టాక అప్పుడు మారతాడేమో చూద్దాం. తొందరపడకు నేనెప్పుడూ నీకు సపోర్టుగా వుంటాను అంది.

ధరణికి కొంత వూరటగా అనిపించింది. బాబు పుట్టాడు. అటు బాబుని ఇటు శ్రీరాంకి అన్నీ అందించడంలో తలమునకలయ్యేది. చాలా కష్టంగా వుండేది. శ్రీరాం ఏమాత్రం సహకరించేవాడు కాదు. పైగా ఇంకా చికాకులు ఎక్కువయిపోయాయి.

శ్రీరామ్ ముందరి కొడుకు పేరు సునీల్, ధరణి తన కొడుకుకి అనిల్ అని పేరు పెట్టుకుంది. ఇద్దరినీ బాగా చూసుకునేది.

ఇవన్నీ ఇలా వున్నా కూడా మనసుని గట్టి చేసుకుని బాబుని బాగా చదివించేది. స్కూల్లో ఏ ప్రోగ్రాం అయినా ప్రతి దాంట్లో అనిల్ ముందుండేవాడు. చదువులోనూ ముందే. ఇవన్నీ ఇలా వున్నా కూడా  శ్రీరాం ఏమీ మారలేదు. ఎందుకో, ఏమిటో ఆ చిరాకు తెలీదు.  అనిల్ ఇంజనీరింగ్ లోకి వచ్చాడు. మంచి మార్కులతో పాసయ్యాడు. ఎమ్మెస్ చెయ్యడానికి అమెరికా వెళ్లాడు. కాన్వకేషన్ కి అనిల్ స్నేహితుడు రమేష్ సహకారంతో ధరణి అమెరికా వెళ్ళింది.  తన జీవితంలో ఇంత మంచి రోజు వస్తుందని అనుకోలేదు అని చాలా సంతోషపడింది. శ్రీరాంకి ఫ్లైట్ అంటే భయం కాబట్టి రానన్నాడు.

ధరణి అనిల్ ప్రోగ్రాం అయ్యాక ఇండియా వచ్చేసింది. అప్పటి నుంచీ మానసికంగా ధైర్యం వచ్చింది. అప్పటి వరకూ సతాయించిన శ్రీరాంకి కొన్ని రోజులు ధరణి దూరంగా వుండేసరికి కొంత మార్పు వచ్చింది. ధరణి విలువ తెలిసింది. తను ఇంకా ఇలాగే వుంటే కొడుకు దగ్గిరకి వెళ్ళిపోతుందని అర్థమయ్యింది.

శ్రీరాం భార్య విషయంలో చికాకు పడడం తగ్గించుకున్నాడు. ధరణితో నీకు ఇష్టమయితే ఎక్కడయినా టీచరుగా చేరు. నువ్వు చెప్పగలవు కదా. నేను ఆఫీసుకి వెళ్ళినప్పుడు  కాలక్షేపం అవుతుంది అన్నాడు. ధరణికి ఆ మాటలు చల్లని వెన్నెల కురిసినట్లు అనిపించింది.

ఉద్యోగానికి ఎందుకులే అని ట్యూషన్స్ చెప్పడం మొదలు పెట్టింది. తన సంపాదన తనకి వుండడమే కాకుండా, తనకున్న చదువుని సద్వినియోగం చేసుకునే రోజు వచ్చిందని సంతోషించింది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.