కథాకాహళి- 1 7

సోషలిస్టు స్త్రీవాద కథావిస్త్రృతి విమల కథలు

                                                                – ప్రొ|| కె.శ్రీదేవి

విమల 1963లో జన్మించారు. హైదరాబాద్ లో పుట్టి, పెరిగిన విమల విద్యార్థి దశ నుండే ప్రజా ఉద్యమాల్లో రాజకీయ కార్యకర్తగా సుదీర్ఘకాలం పనిచేశారు. ప్రస్తుతం రెయిన్‌బో చిల్డ్రన్స్ హోమ్ కన్సల్టెంట్ గా ఉన్నారు. కవి, కథకురాలుగా  తెలుగు పాఠకులకి విమల సుపరిచితురాలు. అడవి ఉప్పొంగిన రాత్రి‘, ‘మృగనరెండు కవిత్వ సంకలనాలు, “కొన్ని నక్షత్రాలు కాసిన్ని కన్నీళ్ళు”  ఒక కథాసంకలనం, “నువ్వేం చేస్తావ్”, “అతడి ముఖచిత్రం” కథలు రాశారు. సఫాయి కార్మికుల జీవితాలను వెలుగులోకి తెస్తూ, “మాకొద్దీ ఛండాలం” పుస్తకాన్ని మరో రచయితతో పాటు రాశారు. విమోచన పత్రికా సంపాదకురాలు, ఉద్యమ స్ఫూర్తితో రచనలు చేస్తూ, వివిధ కార్యక్రమాలలో పాల్గొంటూంటారు. ప్రస్తుతం ప్రగతి శీల మహిళా సంఘం రాష్ట్రకార్యదర్శిగా పని చేస్తున్నారుఈ టీవీ-2, సాక్షి టీవీ లకు స్త్రీల కార్యక్రమ రచయితగా ఉన్నారు. ఈమె ప్రముఖ తెలుగు కవయిత్రి. ఈమె రాసిన రెండు కవితలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బి.ఏ.లో పాఠ్యాంశంగా చేర్చారు. అంబేద్కర్ దూరవిద్యా విధాన పాఠ్యాంశాలలోనూ చేర్చారు. ప్రకృతి పౌండేషన్ సభ్య కళాకారులలో ఒకరు. ఈమె కార్యక్షేత్రాలు విభిన్నమైనవి. అందుకే ఈమె ఎంచుకున్న కథావస్తువులు తెలుగు సాహిత్యంలో సృజింపబడని, చర్చకురానివి. అందులోని పాత్రల చలనాలు స్త్రీల అనుభవ వైవిధ్యానికి గల మరోకోణాన్ని నిర్దారిస్తాయి.

అమలులో వున్న రాజకీయ నిర్మాణాలన్నీ పురుషవాద తాత్విక దృక్పథంతో కూడుకుని వున్నందున వాటికి వెలుపల స్త్రీలు రాయగలిగే, ఆలోచించగలిగే, మాట్లాడగలిగే ఒకానొక తలాన్ని (space) సాధించుకోవటం లక్ష్యంగా  క్షేత్రపర్యటనలు చేస్తూ, కొంతమంది స్త్రీవాదులు పనిచేస్తున్నారు. ఆవిధంగా చూసినప్పుడు క్రితంలోవున్న అన్ని స్త్రీవాదదోరణుల కంటే భిన్నంగా విమల ఆలోచిస్తోంది. లైంగికత సంబంధించిన విషయాలలో ఈ విభిన్నతను” “అతడి ముఖచిత్రం”  కథలో స్పష్టంగా చూడవచ్చు. పురుషవాద ప్రవచనాలకు భిన్నంగా ఉండే ప్రతి ప్రవచనాలను (కౌంటర్ discourses) ఈకథలో ప్రతిపాదించారు. ఈక్రమంలో పెట్టుబడిదారీ  విధానం మీద కంటే లింగవిధానం (sexism) మీద ఎక్కువగా విమల దృష్టిసారించారు. అందువల్లే  స్త్రీలు, స్త్రీలుగా ఎటువంటి పితృస్వామిక అణిచివేతకు గురవుతున్నారు అనే విషయం మీద తన కథాప్రయాణం కొనసాగించింది. ప్రేమ, పెళ్ళి, సెక్స్, పురుషత్వం లాంటి విశాల విశ్లేషణకు పూనుకుంది. ఈ విశ్లేషణలో భాగంగా అనేక అంశాలను లోతుగా విశ్లేషించేందుకు వ్యక్తిగతంగా స్త్రీఅనుభవాల మీద,  వాళ్ళ కథన (narrative) రూపాలమీద దృష్టి సారించారు. అదే సందర్భంలో ఆమె సృజించిన స్త్రీపాత్రలు చైతన్యాన్ని పొందే ప్రయత్నం చేశాయి. 

ఒక రకంగా సామ్యవాద స్త్రీవాదం మామూలుగా స్త్రీవాదంలో ఒక శాఖగా వుంటూనే స్త్రీ జీవితానికి సంబంధించిన public, private తలాల్లో ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తూ విముక్తి అనేది లేక అణిచివేత నుండి స్త్రీ బయటపడటం అనేది అందుకు కారణమయిన లేక మూలమయిన ఆర్థిక, సాంస్కృతిక మూలాలను అంతమొందించటం ద్వారా మాత్రమే సాధ్యపడుతుందని నమ్ముతుంది. సోషలిస్ట్ స్త్రీవాదులు స్థూలంగా చాలా విషయాలను బలంగా ఆమోదిస్తారు. అయితే మార్క్సిజంలో బలంగా వున్న ఆర్థిక నియతివాదాన్ని (economic determinism) నిరాకరిస్తారు. అలాగే ఆర్థిక అంశమే అణిచివేతలో కీలకం అనే భావనను కూడా నిరాకరిస్తారు.

స్థూలంగా చెప్పాలంటే సాహిత్యానికి సామాజిక రాజకీయ ఉద్యమాలకు అన్ని సమాజాల్లో అన్ని కాలాల్లో సంబంధం ఉంటూ వచ్చింది. తెలుగు సాహిత్య చరిత్రను పరిశీలిస్తే, ఈసంబంధం ఎంత గాఢంగా వుందో అర్థమవుతుంది. నిజానికి ఆధునిక యుగంలో తెలుగు సాహిత్యాన్ని ఉద్యమాల నుంచి విడదీసి చూడటం అసాధ్యం. ఉద్యమాల ప్రేరణలోంచి రూపొందే సాహిత్యం అనివార్యంగా ఉద్యమాన్ని కీర్తించే సాహిత్యంగానే ఉంటుంది. ఉద్యమ సందర్భంలో ఉండే సాహిత్య ఉద్యమాల మీద విమర్శ పెట్టిన సందర్భాలు అరుదు. అయితే ఈ అరుదైన సాహిత్య సందర్భాలను  విమల తన కథల్లో చర్చకు పెట్టింది. 

సాధారణంగా వామపక్ష రాజకీయ నేపథ్యంగల రచయితలు స్త్రీదృష్టికోణంతో సూటిగా, సున్నితంగా పితృస్వామ్య మూలాలను వివరించిన సంధర్భాలు  అరుదు. విమల కథల్లో ఈతత్వం ఒక ప్రేమ విషయంలోనే కాక చాలా సమయాల్లో ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, దాదాపు అన్ని కథల్లో కానబడుతుంది. మరణ సదృశ్య దృశ్యాలను కూడా త్యాగం పేరుతో తేలికగా తీసుకోలేకపోతున్న ఒకానొక సందర్భాన్ని సాధించుకునేటట్లుగా చేస్తాయి. మనుషులలోని భావుకత, మానవీకరణ పొందే క్రమంలో మరో రూపాన్ని సంతరించుకోవాల్సిన ఆవశ్యకతను కల్పిస్తున్నాయి.

ఉద్యమాల దారులలో నడిచి వచ్చిన విమల తన జీవితంలో ఎదురైన అనుభవాలను, వాటి ఫలితంగా ఎదురైన చేదు అనుభవాలను గుర్తు చేసుకునే క్రమంలో ఏడుపు, నవ్వు, ఆగ్రహాన్ని, మానసిక ఉద్వేగ సంక్షోభాన్ని దిగమింగక తప్పని అనివార్యతను కథనం చేశారు.  ఒక స్త్రీగా స్పందించిన తీరు, ఉద్విగ్నతా వ్యక్తీకరణ కథారూపం “కొన్ని నక్షత్రాలు కాసిన్ని కన్నీళ్ళు”. తమ కలల ప్రపంచాన్ని పునర్నిర్మాణం చేసుకునెందుకు ఉద్యమం లోకి ప్రవేశించిన వాళ్ళున్నారు. వారి నిమగ్నత, నిబద్ధతతో కూడిన ఆచరణాత్మక వాస్తవాన్ని గుర్తించి, తమ కలలను సాకారం చేసుకునేందుకు, స్థానిక ప్రజలు ఉద్యమ నాయకులను ఆశ్రయించటం కూడా సర్వసామాన్యం. అంతస్తుల అసమానతలు తను ప్రేమించిన జ్యోతిని పెళ్లాడేందుకు మాధవ లోకల్ క్యాడర్  రవిని ఆశ్రయిస్తాడు. హఠాత్తుగా ఎదురైనా కూంబింగ్ పోలీసుల చేతిలో హతమైతాడు. జ్యోతితో తన ప్రేమైక జీవితాన్ని సఫలం చేసుకునేందుకు ఉద్యమం ఒక దోహదకారిగా భావించిన మాధవ, ఆక్రమంలో ప్రాణం వదలాల్సి వస్తుంది. అతని కవిత్వాలు, కలలు అక్కడితో అయిపోయాయి. కానీ అతని కవిత్వాన్ని, జ్యోతి పట్ల  అతనికున్న ప్రేమను ఆమె లేని జీవితాన్ని జీవించేందుకు సంసిద్ధంగా లేని మాధవ మానసిక స్థితి ఏరియా కోఆర్డినేటర్ గా పనిచేస్తున్న కథకురాలి జ్ఞాపకాల్లో చాలా సున్నితంగా వ్యక్తమవుతుంది. మాధవను ప్రేమించిన జ్యోతి,  అతను తప్పకుండా తనను తీసుకు వెళ్తాడని ఆశించిన జ్యోతికి, అతని మరణవార్త మాత్రమే చేరుతుంది.

 జ్యోతి పట్ల తన ప్రేమకు గుర్తుగా మాధవ వేసుకున్న వెలుగుతున్న దీపం పచ్చబొట్టు, అతన్నే గుండె నిండుగా నింపుకున్నజ్యోతి, అతని   మరణానంతరం తన పచ్చబొట్టు రూపంలో అతని  జ్ఞాపకాలకు శాశ్వతత్వాన్ని కల్పిస్తుంది. అతని జ్ఞాపకాల సజీవ రూపం జ్యోతి కళ్లల్లో కదిలే కన్నీటి సాక్ష్యం. ఆయువకులు కనీసం మనిషిగా కూడా జీవించలేనితనం పాఠకుల  హృదయాన్ని కదిలిస్తుంది.

         జీవిత భాగస్వాములను కోల్పోయిన స్త్రీల అనుభవం, మూడు నెలల పసిగుడ్డుతో భర్త మృతదేహాన్ని చూడవచ్చిన తిరుపతి భార్య లాంటి స్త్రీలు గుండెలు బాదుకుంటూ రోధిస్తున్న తల్లుల ఆర్తనాదాలతో సమ్మిళితమైన ఘాతుక వాతావరణం ఈ క్రమంలో ఒక ఉద్యమ బాటసారిలా ఆమె ఆత్మిక అంతరంగ ఆవిష్కరణకు విమల కవితాత్మక కథన శైలి, అతి సునాయాసంగా పాఠకుల మెదళ్ళను అల్లుకు పోవడాన్ని ఈవర్ణణా శిల్పంలో గమనించవచ్చు. 

తాను ప్రేమించిన జ్యోతి ప్రేమ పట్ల మాధవకు గొప్ప నమ్మకం. ఆ భరోసా అతని మాటల్లోనే గమనించవచ్చు…. “తండ్రి బలవంతపు పెళ్లి చేసినా జ్యోతి ఊరుకోదులే, ఆ మొగుణ్ణి ఒక్క తన్ను తన్ని నా దగ్గరకి వస్తాది  మల్ల” అన్న నమ్మకం, జ్యోతి ప్రేమ పట్ల విశ్వాసం ఆతర్వాత అతను తిరుపతితో కలిసి చనిపోవడం విమల చెప్పాలనుకున్న కథాంశం గాఢంగా పాఠకుల మనసులో బలంగా ముద్ర వేస్తుంది. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళ ప్రేమలు, విశ్వాసాల బలంతో కోల్పోతున్న వాళ్ళ ప్రాణాలను గురించి చెప్పడంలో కథకురాలి సంవేదనలు పాఠకులకు స్పష్టంగా బోధపడతాయి.

శిధిలమైన మట్టి గోడలు, జాజు, నీలంరంగులు పూసిన ద్వారబందాలు, చెదిరిపోయిన నినాదాలు ఇంటిపై కప్పుపై వచ్చిచేరిన ఆంటీనాలు,  దేవుళ్ళ గుడులు, చదువు చెప్పని బడులు, విరిగిన తంబాకు చాటలు, కదిలే మునివేళ్ళు మర్రి చెట్ల నీడన మోటారు బండ్లపై పోల్లగాళ్ళు, తెల్ల బట్టల చోటా నాయకులు, పైరవీకార్లు సిమెంట్ రోడ్లు ఈచిత్రం ఒకప్పుడు మహోద్యమం నడిచిన పల్లెలు, ఈనాడు బహుళజాతి కంపెనీల సంపద్కంతో పొందిన సాంస్కృతిక పరిణామాలు విమల కథల్లో అంతర్లీనంగా కనిపించే అంశాలు.

          ఒక మహోద్యమం నడిచిన చోట విస్తరించిన ఈనాటి అశ్రుగీతంగా మారిన ఆనాటి పల్లె స్వరూపం,  దూరమైంది కథకురాలి  జ్ఞాపకాల జాడలు మాత్రమే కావన్నది వాస్తవం. తనది కానితనాన్ని మూట కట్టుకున్న పల్లెలు, శిధిల జ్ఞాపకాల రూపంలో మూర్తీభవించిన పల్లెలు,  తన అనుభవంలోని  పల్లె రూపంలో ఏమాత్రం సంబంధంలేని ఈనాటి పల్లెల్ని చూడలేక వెనుదిరిగిన కథకురాలి హృదయావిష్కరణ  ఈకథ. తన పర్య వేక్షణలో కొనసాగిన  పల్లెల అనుభవాలను అత్యంత సహజమైన, బలమైన ప్రతీకలుగా రెక్కలు చాచిన రాబందులుగా టి.వి.ఆంటీనాలకు ప్రతీకగా వాడటం ద్వారా ఉద్యమ అస్తిత్వాన్ని కోల్పోవడం వలన కలిగిన పరిణామాలకు గుర్తుగా ఆవిష్కరించారు విమల.అయితే పల్లెలో వచ్చిన మార్పులు ఒక క్రమంలో జరిగిన సామాజిక పరిణామ ఫలితమని ఆమెకు తెలుసు. ఆపరిణామాలను చర్చించడం రచయిత్రి ఉద్దేశ్యం కాదు.

విమల తను చెప్పాలనుకున్న దాన్ని ఏజంకు గొంకులుడొంక తిరుగుళ్ళు లేకుండా కథనాన్ని సూటిగా స్పష్టంగా చెప్పడంలోని రచనా నైపుణ్యం, పారదర్శకంగా నడిపించే ప్రయత్నంలో వ్యక్తమయ్యే ఆమె రచనా వ్యక్తిత్వం పట్ల పాఠకులలో గౌరవం పెరుగుతుంది. సామాన్యంగా ఉద్యమజీవితాన్ని విమర్శనాత్మక వాస్తవిక దృక్పథంతో చెప్పాల్సి వచ్చినప్పుడు, రచయితలు అనేక ప్రతీకలతో, ఉపమానాలతో, చెప్పీచెప్పనట్లుగా, అందీఅందనట్టుగా కథనాన్ని నడిపిస్తారు.  పాఠకుల్ని గందరగోళానికి గురిచేస్తూ ఉంటారు. కానీ ఉద్యమాల పట్ల విశ్వాసంతో పాటు  రక్త సిక్త దారులలో నడుస్తున్నపుడు (ఎదురయ్యే అనుభవాలలో)  వినిపించిన మరణ మృదంగ హృదయ ఘోష ఈకథంతా విస్తరించింది. విమల  ఒక  పటిష్టమైన సమన్వయాన్ని “కొన్ని నక్షత్రాలు కొన్ని కన్నీళ్లు“ కథలో సాధించటం యాధృచ్చికం కాదు. ఒక వినూత్న ప్రయత్నం.

ఈకథలో అనుబంధాలు ఆప్యాయతలు నిలిచిపోయిన, మిగిలిపోయిన వ్యధలుగా చూపించటంలో ఆమె ప్రయత్నం విజయవంతమైంది. స్త్రీ చైతన్య స్పృహను పొందుతూ తనేమిటో తాను తెలుసుకుంటూ, స్త్రీ జీవితం చుట్టూ అల్లుకున్న వ్యక్తులను, వాళ్ళ మధ్య వున్న సంబంధాలను వర్తమాన సామాజిక వ్యవస్థను  స్త్రీలుగా వాటిని ఏ దృష్టితో చూస్తున్నారు? ఎలా ఉండాలని భావిస్తున్నారు? ఏం చేస్తున్నారు? అని చూసినప్పుడు విమల క థాలక్ష్యం చాలా స్పష్టంగా  ద్యోతకమవుతుంది.

 స్త్రీ పురుషుల మధ్య ప్రేమానురాగాన్ని, ఆకర్షణ, వాంఛలను వ్యతిరేకించే లేదా సమర్థించే కథా సాహిత్యం ఇంతకు ముందే స్త్రీవాద రచయితలు సృష్టించారు. కానీ పెళ్లి పేరుతో ప్రేమ పేరుతో ఎదురయ్యే సవాళ్ళకు విమల కథల్లోని నేపధ్యం మాత్రం సరొకొత్తది. ఈమె రాసిన “కొన్ని నక్షత్రాలు కాసిన్ని కన్నీళ్ళు”, “సూర్యుని మొదటి కిరణం”, “కన్నీళ్లు”, “సావిత్రి”, “దౌత్య”, “కనకలత” “చుక్కల క్రింది రాత్రి”, “మార్తా ప్రేమ కథ”, “వాళ్ళు ముగ్గురేనా”, “నీలా వాళ్ళమ్మ మరికొందరు”, “అతడి ముఖం” ఇలా విమల రాసిన మొత్తం 15 కథల్లో 11 కథలు రకరకాల ప్రేమకథలు. దాదాపు అన్ని కథలు స్త్రీపురుష సంబంధాలను చిత్రించినవే. ఒక కథలో చర్చించిన కథావస్తువు మరో కథలో కనపడదు. అన్నీ భిన్నసందర్భాలు, విభిన్న జీవనదారులు.  మరి ఇన్ని రకాల ప్రేమ కథలు సారాంశంలో మాత్రం ఒక్కటిగానే మిగలడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 

ఎవరిని ప్రేమించాలి ?ఎంతవరకు ప్రేమించాలి? ఆ ప్రేమలు ఎంతవరకు కొనసాగుతాయి? అని ఎంత మీమాంసకు లోనైనా, పర్యవసానం మాత్రం అంతులేని నైరాశ్యం మాత్రమే. విప్లవ సంస్థలో పని చేసే వాళ్ళ ప్రేమలకు, దాంపత్యాలకు కూడా లిమిటేషన్స్ ఉంటాయని, అవి ఉద్యమ అవసరాలకు లోబడి ఉంటాయన్న అవగాహనను కొత్తగా రంగం మీదకు తెచ్చిన కథ “సావిత్రి”. విప్లవ రాజకీయ ఉద్యమంలో పూర్తికాలం పనిచేసే (hole timer) నాయకులు- భార్య, పిల్లలను బరువుగా భావించడం వల్ల, ఒక భార్యగా సావిత్రి జీవితంలో ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, ఒంటరితనం ఈకథలో చాలా సహజంగా చిత్రీకరించారు.

      విప్లవోద్యమంలో పనిచేస్తున్న ప్రకాశ్రావుతో అతను తిరిగి వచ్చేంత వరకూ సావిత్రి ఎదురు చూస్తానంటుంది. కానీ ఆమె మాటల్ని అతడు తోసి పుచ్చి, తాను ఎప్పటికీ ఉద్యమం నుండి బయటకు రాలేనని “నీ జీవితం నీది. నాజీవితం నాది. నాతో ఉన్న సంబంధం సంకెలవలే వేలాడటం సరైందికాదని భార్యతో స్వచ్ఛందంగా విడిపోయి, “ఎవరి జీవితాలు వాళ్లు జీవిద్దామని” తీర్మాన ఉత్తరం పంపుతాడు. దాన్ని చదివిన సావిత్రి నిశ్ఛేష్టురాలవుతుంది. 

ప్రకాశ్ రావు స్నేహితుడు రషీద్ సాయంతో సావిత్రి ఆర్థిక పరిస్థితులు కొంతవరకు సమాధాన పడతాయి. విప్లవ రాజకీయాల పట్ల ఉన్న గౌరవంతోనే అతను ప్రకాశ్ రావు కుటుంబానికి ఆసరా అవుతాడు. కష్టంలో అండగా మారిన రషీద్ పట్ల సావిత్రికి అత్యంత సహజంగానే సాఫ్ట్ కార్నర్ పెరిగి, బలపడుతుంది. కానీ కాలక్రమేణా పిల్లలు పెద్దవాళ్ళు అయిన తరువాత వారి మధ్య గల సన్నిహితత్వం అన్యాపదేశంగా సావిత్రి కొడుకు క్రాంతిని గందరగోళ పరుస్తుంది. కానీ సావిత్రి కూతురు అరుణిమ వాళ్ళ సన్నిహితత్వాన్ని అర్థం చేసుకుంటుంది. 

ఈమనిషిని ప్రేమించి, ఇతని కోసమేనా తను ఇంట్లోంచి పారిపోయి వచ్చింది?. తన తల్లిదండ్రులతో తోబుట్టువులతో తెగతెంపులు చేసుకుంది? ఇతని కోసమేనా చంటి పిల్లల్ని తీసుకొని అజ్ఞాతంలో జీవించింది? ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో జీవించింది? అన్న వాక్యాల్లో సావిత్రి అనుభవించిన వేదన వ్యక్తమవుతుంది.  తనతో సంబంధాన్ని తెంచుకున్న ప్రకాశ్ రావు పట్ల, అతనితో గడిపిన వైవాహిక బంధంపట్ల ఆమె అవగాహన, అంచనా తారుమారవుతుంది. 

“నిమగ్న రచయితలకు జీవితం కొన్ని వరాలతో బాటు కొన్ని శాపాలను అందిస్తుంది” అని స్టేట్మెంట్ ఇవ్వడం  చాలా సులభం. కానీ ఒంటరి మహిళలుగా వాళ్ళు పడిన అవస్థలు, అవమానాలు అనుభవించిన వాళ్ళకే తెలుస్తాయి. జీవితాన్ని గౌరవించే వాళ్ళు ఎవరూ ఇలా మాట్లాడరు. సావిత్రికి సహచర జీవితాన్ని ఇవ్వలేనప్పుడు, “నన్ను పెళ్ళి చేసుకోవడం నీకు ఇష్టమేనా” అని అడిగి మరీ ఆమెను తన జీవితం లోకి ఆహ్వానించిన ప్రకాశ్రావులోని బాధ్యాతారాహిత్యమే పాఠకులకు కనబడుతుంది. 

సావిత్రి పెళ్ళికి ముందు అందమైన కలలు ఉండేవి. ఏదో తెలియని ఆనందం ఉండేది. వాటన్నిటికీ సావిత్రి దూరమవుతుంది. “ఉద్యమంలోకి వెళ్ళిన తరువాత నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను” అన్న సావిత్రిని నిర్దాక్షిణ్యంగా “నీ జీవితం నీది నా జీవితం నాది” అంటూ తీర్మానం పంపిస్తాడు. అయితే, తప్పొప్పుల తక్కెడలో వేసి తూచెందుకు  విమల ఈకథ రాయలేదు . స్త్రీల బహుళ జీవిత పార్శ్వాలను రికార్డు చేయడం మాత్రమే ఈకథ లక్ష్యం. ఈ కథను ఆటు ప్రకాశ్రావు పక్షం నుండి, ఇటు సావిత్రి పక్షం నుండి లేదా మరో పక్షం అంటే పరిశీలక పక్షం నుండి చూసినా  గొప్ప సమన్వయంతో కథనం నడుస్తుంది. అలాగే ఆపాత్రల స్వభావానికి, కార్యాచరణకు సంబంధించిన justification కూడా విమల కథాకథనం లోని సంవిధానమే అందిస్తుంది. ఈ కథలో ప్రధాన పాత్రధారి విప్లవ రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని సావిత్రిని, రాజకీయాలలో తలమునకలుగా మునిగిన వ్యక్తితో జరిగిన వివాహం, ఆ తర్వాత ఏ దిక్కు కానరాక ఇద్దరు చంటి పిల్లల తల్లైన సావిత్రికి దొరికిన రషీద్ సాన్నిహిత్యం అర్థం చేసుకోలేని ఆమె కొడుకు క్రాంతి “అతను కావాలో నేను కావాలో తేల్చుకో అమ్మ అతను ఇంటికి వస్తే, మళ్లీ నేను రానంటూ” అల్టిమేటం జారీచేయడంలో ప్రకాష్ రావు కొడుకు మాత్రమే కానబడతాడు. తన కొడుకు పెంపకంలో పెరిగిన కొడుకు కాదన్న పరాయి తనం ఆమెను బాధపెడుతుంది. సావిత్రి ప్రమేయం లేకుండానే ఆమె జీవితంలోకి ప్రవేశించారు.  సావిత్రి మనస్ఫూర్తిగా తన జీవితంలోకి ఆహ్వానించింది రషీద్ ను మాత్రమే.  తన కష్టం అతని కష్టంగా భావించిన రషీద్ ను మాత్రమేనని, ఆమె కూతురిని అడిగిన “అమ్మా రషీద్ ఎక్కడున్నాడో తెలుసా నాకో సారి చూడాలని ఉంద”నడం లోనే సావిత్రి మనసులోని ఎంపిక బహిర్గతమవుతుంది.

తెలుగు సాహిత్యంలో ప్రేమ, ప్రేమించడం భావనలు గురించి ఎక్కువ సాహిత్యం  రాలేదు కానీ చాలా కొద్ది మంది రచయితలు ప్రేమను ఒక వస్తువులాగా తీసుకొని లైంగకత్వాన్ని ,లైంగికస్వేచ్చ భావనల్ని మన ముందుకు తీసుకొచ్చారు. అయితే స్త్రీవాదం వచ్చిన తరువాత ప్రేమ పర్యవసాన ఫలితాలను స్త్రీవాదులు కథాసాహిత్యంలో నిక్షిప్తం  చేసే ప్రయత్ర్నం చేశారు. వైవాహిక వ్యవస్థకు ప్రత్యామ్నాయ పరిష్కారంగా సహజీవనాన్ని (లివింగ్ టుగెదర్) ప్రతిపాదించారు. అయితే స్త్రీల నిరాశా నిస్పృహలను మాత్రం ఈ ప్రత్యామ్నాయ జీవనవిధానం దూరం చేయలేకపోయిందని, అందులో తలెత్తే కొన్ని కీలకాంశాలను ”దౌత్య”, ”వాళ్ళు ముగ్గురేనా”, “అతడి ముఖచిత్రం”, కథల్లో విమల నమోదు చేసింది. స్త్రీల మానసిక ప్రపంచంలో సహజీవనం ఒక ప్రత్యామ్నాయంగా స్థిర రూపాన్ని పొందడానికి ఇంకా సమాజం సిద్ధంగా లేదని భావించాలా? అన్న ప్రశ్నపాఠకులలో ఉదయిస్తుంది. ఆచరణలో పెళ్ళి ప్రసక్తి లేకుండా సహజీవనం సాగిస్తున్న వారి జీవితంలో పురుషుల లోపాయికారి పాత్రను చిత్రీకరించడమే కాకుండా అందులోంచి బయట పడటం వల్ల స్త్రీలు తమదైన జీవితాన్ని తాము సొంతం చేసుకోవడం, దానివల్ల పొందిన సంతృప్తిని విమల “అతడి ముఖచిత్రం” కథగా మలిచారు.

ఈబంధానికి నువ్వేదన్నా పేరు పెట్టగలవా? ఇప్పుడు చేసుకుంటున్న పెళ్లికి ముందు నుండీ నేనీమెతో ఒక ప్రత్యేక బంధంలో ఉన్నానని, నన్ను నీప్రపంచంలోకి తీసుకు వెళ్ళగలవా? నీతో కలిసి నడుస్తున్న నామొఖాన్ని అందరికీ నేను చూపగలను. అలాగే నాప్రపంచంలోకి నువ్వు నీ మొఖంతో రాగలవా? వస్తావో రావో తెలియని నీకోసం, నువ్వు నాకోసం చివరిదాకా వుంటావో, వుండవో తెలియని బంధాన్ని పట్టుకుని నేను జీవితాంతం ఎదురుచూడాలా? ఇలాగే ఉండాలా? ఎంత స్వార్ధపరులు మీ మగవాళ్ళు” (పే.౪౫,) అన్న మయూరి మాటల్లో తుషార్ ప్రేమ దైహికమైంది తప్ప కలసిమెలిసి బ్రతకాలన్న జీవనకాంక్ష వ్యక్తమవదు. కుటుంబచట్రంనుండి, వృత్తి వ్యాపార లావాదేవీల నుండీ దొరకని రిలాక్స్ కోసం మయూరిలాంటి అందమైన, చదువుకున్న స్త్రీలు కావాలి.  అలాంటి అందమైన అబద్ధపు జీవితాన్నుండి మయూరి బయటపడుతుంది.

 ఈ బంధం పోతుందేమోనని భయపడుతూ బ్రతికేకంటే, ఇలాంటి బంధం పోతే మాత్రం ఏం? ప్రేమ తగ్గిన వట్టి శారీరకబంధంగా తమ సంబంధం రూపాంతరం చెందుతున్నా, అర్థంకానట్టుగా అయోమయంగా, అలవాటుగా బ్రతకడంలోని అర్థరాహిత్యాన్ని మయూరి గుర్తిస్తుంది. అమె తన స్నేహితురాలు పరోమితతో తన బాధను పంచుకుంటుంది. కలిసి వున్నంతకాలం తుషార్, మయూరి మధ్య బంధం పోతుందేమో అనే సందేహంలోనే బ్రతికే బంధాలు ఏం బంధాలు? అతడు లేకపోతే ఉండలేమోనన్న భయం  పోతేనేకదా, అతన్ని వదిలేసి ఉండగలమని తెలిసేది అంటూ స్నేహితురాలు పరోమిత చేసిన విశ్లేషణ వల్లనే, ఆమె తుషార్ చేసిన గాయం నుండి బయటపడగలిగింది. దౌత్యకు కూడా స్పష్టమైన దృక్పథం కలిగిన పరోమితలాంటి స్నేహసాంగత్యం లభించివుంటే, దౌత్య ప్రేమగాయానికి స్నేహలేపనం లభించేదన్న స్పృహ పాఠకులకు కలుగుతుంది. “దౌత్య” కథలో పాఠకులు పొందిన గాయాలకు “అతడి ముఖచిత్రం”కథ ఒకగొప్ప రిలీఫ్ అవుతుంది. 

తుషార్ వర్మ ముఖం లేని నగ్నచిత్రం మయూరి గీసినరోజు ఆమెకు కలిగిన మానసిక కల్లోలం అతడి ముఖచిత్రంగా రూపొందింది. స్త్రీల శరీరాలతో మగవాడికి వుండే సంబంధాలలో ఆతడి మొఖం ఎలా బహిర్గతమయ్యిందో అనేక నెలలుగా తనలో సుళ్ళుతిరుగుతున్న ఆలోచనలకు మయూరి ఇచ్చినరూపం అతని ముఖచిత్ర అంతర్గత రూపం అతని మర్మావయవమే. మరుగుపరిచిన లేదా కనిపించని పురుష కాంక్షను మయూరి చిత్రించిన నగ్నచిత్రపటం బహిర్గతపరుస్తుంది. 

అసలు స్తీ లైంగికతఅనేది లేక దాని ప్రాతినిధ్యాలు అనేవి మొత్తం మానవ లైంగికతలో (human sexuality) కలసివుంటూ వచ్చింది. లైంగికత అనేది లైంగిక గుర్తింపు (sexual identity) లైంగిక ప్రవర్తనలతోపాటు (sexual behaviour) సెక్సకున్న అన్ని శారీరక మానసిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆత్మిక, కోణాలన్నింటిని సూచిస్తుంది. లైంగికత విషయంలో ఒక సంస్కృతి నుంచి మరొక సంస్కృతి భిన్నంగా  చరిత్ర క్రమంలో మారుతున్నప్పటికీ, ప్రతి సంస్కృతిలో, చారిత్రక సందర్భంలో స్త్రీల లైంగికత మీద ఆంక్షలు, నిషేధాలు, నియంత్రణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ విషయాన్ని అలాఉంచితే, స్త్రీ లైంగికతలో శారీరక శృంగారం (biological sex) శరీర (body image) మూర్తిమత్వం, లైంగిక విలువలు, జండర్ పాత్రలు (gender roles) అన్నీ కలగలసివుంటాయి. లైంగికతకు సంబంధించిన అంశాలన్నీ పురుష లైంగిక ఆధిపత్యంలో, అణచివేతలో, నియంత్రణలో ఈ ఆధిపత్యాన్ని  సునాయాసంగా ఆమోదించేట్లు చేస్తోంది.

 ప్రతి సంస్కృతిలోని, భాష, సాంప్రదాయం లాంటి అంశాలు ప్రతిమనిషి పురుషుడిగానో, స్త్రీగానో వర్గీకరింపబడడం, నిర్ధారించటం జరుగుతోంది. ఈ నిర్మాణం క్రమంగా స్త్రీలలో స్థిరంగా ఉండిపోతుంది. నిరంతరం సంస్కృతి, భాష చైతన్యం లాంటి అంశాలు దాన్ని బలపరుస్తూ వస్తాయి. సారాంశంలో జండర్ విభిన్నతను ఒక సామాజిక నిర్మితిగా గుర్తించినప్పుడు, “దేహభాష”, “అతడి ముఖచిత్రం” కథల్లోని స్త్రీపాత్రలు పొందిన చైతన్య స్థాయితో, ఆ పాత్రల చేత విమర్శచేయించడం వలన ఈకథల్లోని పాత్రల   agony ని విమల  శక్తివంతంగా ఆవిష్క రించగలిగారు. స్త్రీలను నడిచే యోనులుగా చూస్తున్న చోట, మాయూరి ఒక స్త్రీగా తన అనుభవంలో పురుషుడంటే అతని మర్మావయంగా చిత్రించటంలోని వైచిత్రి ఏముంటుంది?. అతనితో ఆమె సాన్నిహిత్యం పంచిన వేదనలోంచి, పురుషాంగాన్ని అతని ముఖంచిత్రంగా శక్తివంతంగా ప్రతిబింబిస్తుంది. అలా ప్రతిబింబించటమేకాక, అటువంటి అనుభవానికి గురైన వ్యక్తులు తీసుకునే నిర్ణయంలో ఉండే అసాధారణత్వాన్ని కూడా అంతే శక్తివంతంగా విమల ఆవిష్కరించారు. తనను యోనిగా తప్ప మరే రకంగా గుర్తించని పురుష దృష్టిని నిరాకరించి,  అతనితో జీవించా లన్న వాంఛను  రద్దుచేసుకొని, అతనిముఖంగా అతని మర్మాంగాన్ని చిత్రించడంలోని వేదన, అమలయిన హింస పాఠకుల్ని కదిలిస్తాయి.

ఎందుకంటే, వర్తమాన సంధర్భంలో  శరీరం దాని సర్వాంగాలను స్త్రీవాదులు తమ రచనలకు ప్రేరణగా భావిస్తున్నారు. ఈశరీరక విభిన్నతలోని ప్రతిఅంశాన్ని  విభిన్నంగా చూసేటట్లుగా, విభిన్నంగా అనుభూతిలోకి తెచ్చుకునేటట్లుగా, విభిన్నంగా ఆలోచించేటట్లుగా చేయగలుగుతుంది. కాబట్టి ఈకథ స్థూలంగా  పురుషుల bodyని నిరాకరించటంగా చూడకుండా ఒక నిర్దిష్ట సందర్భంలో తలెత్తిన నిర్దిష్ట అంశానికి స్పందనగా మాత్రమే చూడాల్సి వుంటుంది. కథలో ఈ సున్నితాంశాన్ని గుర్తించక పోయినట్లయితే, ఈకథ పురుషులకు వ్యతిరేకంగా రాసిన కథగా మిగిలే ప్రమాదం వుంది.

సమాజంలో బృందాలు లేక వ్యక్తులు వేరు వేరు రంగాలలో, తలాలలో ఉండటంవలన అనివార్యంగా వారి అనుభవం భిన్నంగా వుంటుంది. అలాగే వారి దృక్పథాలు కూడా విభిన్నంగా రూపొందుతాయి. ఇదే విషయాన్ని స్త్రీకి వర్తింపజేసి ఆలోచించినప్పుడు ఆమెవుంటున్న తలం(స్పేస్), పనిచేస్తున్న రంగం రెండూ వేరు, అలాగే  శరీర నిర్మాణం వేరు. వీటన్నింటి ప్రభావం స్త్రీ ఆలోచన మీద వుండడం కూడా అసాధ్యం. ఎందుకంటే, ఇవన్నీ ఆమె అనుభవాన్ని నిరసిస్తున్నాయి. అలా నిరసించటంవలన ఆమె ఆలోచనలు లేక దృక్పథం కూడా పురుషుని దృక్పథం నుండి భిన్నంగా పుండటం ఆశ్చర్యపడాల్సిన విషయమేమీకాదు. ఈ విషయాన్ని గుర్తించిన స్త్రీవాదులు తమదైన జ్ఞాన సిద్ధాంత రూపకల్పనకు పూనుకున్నారనడానికి “అతడి ముఖచిత్రం” కథే సాక్ష్యం.

స్త్రీల జీవితాన్ని ఒంటరి ప్రపంచానికి వారసులుగా మారుస్తున్నాయి. ఇక్కడితో స్త్రీల ప్రయాణం  ఆగిపోయినట్లయితే, విమల కాంట్రిబ్యూషన్ పరిమితం అయ్యేది. కానీ విమల తీర్చిదిద్దిన స్త్రీ పాత్రల ప్రపంచం స్ఫూర్తిదాయక సామాజిక జీవితంలోని ప్రవేశించి స్వతంత్ర వ్యక్తిత్వంతో నిలబడ్డాయి. ఈ కథలు చదివిన స్త్రీలు తమ జీవితాలను తాము అర్థవంతంగా, సమర్థవంతంగా జీవిస్తారన్న భరోసా నిస్తాయి.  స్త్రీతమ జీవిత వైఫల్యాలను గుర్తించి ఆ వైఫల్యాల నుండే శకలాలు శకలాలుగా మారిన జీవితాన్ని మనోనిబ్బరంతో చూసే ఒక స్పష్టమైన చూపును విమల కథలు అందిస్తాయి. ప్రేమ, లైంగిక స్వేచ్ఛ ఈరోజు సాధారణ అంశాలు కాదు. ఇంటర్నేషనల్ గా డిబేట్ చేస్తున్న అంశాలు. వీటిని కథాంశంగా స్వీకరించడంలో విమల చేసిన సాహసం వల్లే ఆమె కథలు విస్తృతిని పొందాయి.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.