జ్ఞాపకాల ఊయలలో-4

-చాగంటి కృష్ణకుమారి

నా ఒకటవ క్లాసు  చదువును మధ్యలోనే ఆపేసి  మాపల్లె కు వెళ్లాక అక్కడ బడికి ఒకటి రెండు రోజులకన్నా ఎక్కువ పోలేదు.ఒక  చిన్నతాటాకు చదరని  తీసుకొని  బడికి వెళ్లాలి.చదర మీద కూర్చొని  ఇసుకలొ ఎవో కొన్ని తెలుగు పదాలు రాయడం,దిద్దడం వంటివి చేసిన గుర్తుంది.మరి  ఆ బడికి  నన్ను పంపలేదు. ఇంట్లోనే ఏవో నేర్పుతూ వుండేవారు.    

ఇవి ఏడూ ..  వారముల పేర్లు, ఈ పన్నెండు  నెలల పేర్లు–  అన్న పంథాలో రాయప్రోలు సుబ్బారావు, బసవరాజు అప్పారావు, విశ్వనాధసత్యనారాయణ , దేవుల పల్లి  కృష్ణ శాస్త్రి, నండూరి సుబ్బారావు, దువ్వూరి రామిరెడ్డి ,  అబ్బూరి రామ కృష్ణారావు, గుర్రం జాషువా అని నాచేత ఈ పేర్లను   తులసి వల్లె వేయించేది.ఎందుకో మరి నాకు తెలియదు.గుర్రం జాషువా పేరు  నాకు తమాషాగా అనిపించేది . అలా నాకు ఈ పేర్లు తెలుసు.  

 “ నీ పుట్టదరికి నాపాప లొచ్చారు”   అనే  నాగుల చవితి  కవిత  నేర్పింది.  ఆకవిత లో  “అటుకొండ ఇటుకొండ ఆరెంటి నడుమ…. “  నాకు చాలానచ్చేది,  పగలనక రేయనక పనిపాటలందు…. కంపచాటున నుండి కొంపదీకోయి …”  ఇంకానచ్చేది  .  ఈ కవితని  పూర్తిగా ….   

 నీ పుట్టదరికి నాపాప లొచ్చేరు

పాపపుణ్యమ్ముల వాసనే లేని

బ్రహ్మస్వరూపులౌ పసికూనలోయి!

కోపించి బుస్సలు కొట్టబోకోయి!

    నాగులచవితికీ నాగేంద్ర! నీకు

    పొట్టనిండా పాలు పోసేము తండ్రి!

చీకటిలోన నీ శిరసు తొక్కేము

కసితీర మమ్మల్ని కాటేయబోకు

కోవపుట్టలోని కోడెనాగన్న

పగలు సాధించి మాప్రాణాలు దీకు

     నాగులచవితికీ నాగేంద్ర! నీకు

     పొట్టనిండా పాలు పోసేము తండ్రి!

అర్ధరాత్రీవేళ అపరాత్రీవేళ

పాపమే యెఱగని పసులు తిరిగేని

ధరణికి జీవనాధార మైనట్టి

వాటిని రోషాన కాటేయబోకు

    నాగులచవితికీ నాగేంద్ర! నీకు 

    పొట్టనిండా పాలు పోసేము తండ్రి!

అటు కొండ యిటు కొండ ఆ రెంటినడుమ

నాగులకొండలో నాట్యమాడేటి

దివ్యసుందరనాగ! దేహియన్నాము

కనిపెట్టి మమ్మెపుడు కాపాడవోయి!

    నాగులచవితికీ నాగేంద్ర! నీకు

    పొట్టనిండా పాలు పోసేము తండ్రి!

పగలనక రేయనక పనిపాటలందు

మునిగి తేలేటి నా మోహాలబరిణె

కంచెలు కంపలూ గడచేటివేళ

కంపచాటున వుండి కొంప దీకోయి!

    నాగులచవితికీ నాగేంద్ర! నీకు

    పొట్టనిండా పాలు పోసేము తండ్రి! 

( ఇది బసవరాజు అప్పారావుగారిదని తరువాత ఎప్పటికో తెలిసింది) 

అలాగే రాయప్రోలు సుబ్బారావుగారి  ఏ దేశమేగినా ఎందుకాలిడినా, శ్రీలు పొంగిన జీవగడ్డయి, అమరావతీ పట్టణమున బౌద్ధులు విశ్వవిద్యాలయములు స్థాపించునాడు   వంటి కొన్ని కవితలు నేర్పి వరుసగా అప్పచెప్పమనేది . ఉత్సాహంగా అప్పచెప్పేదాన్ని. ఇటువంటి కవితలేకాక గజేంద్రమోక్షం,  ప్రహ్లాద చరిత్ర  లో కొన్ని పద్యాలూ ,  ఇంకా “నల్లని వాడు పద్మ నయనంబులవాడు ….” వంటి పద్యాలు కూడా అప్పచెప్పగలిగేదాన్ని. మాబామ్మ కాళ హస్తీశ్వర శతకం లో పద్యాలు కూడా  చదువుతూ వుండేది . వాటిలో ఈ పద్యాన్ని  చలా ఇష్ట పడేదాన్ని  

 అంతా మిధ్య తలంచి చూచిన నరుం డట్లౌ టెఱింగిన్ సదా

కాంత ల్పుత్రులు నర్ధమున్ తనువు ని క్కంబంచు మోహార్ణవ

భ్రాంతిం జెంది జరించు గాని పరమార్ధంబైన నీయందుదా

జింతాకంతయు జింత నిల్పడుగదా శ్రీ కాళహస్తీశ్వరా

“ శైశవ గీతి”   లో 

 “మెరుపు మెరిస్తే,వాన కురిస్తే,ఆకసమున హరివిల్లు విరిస్తే 

అవి మీకే అని ఆనందించే

కూనల్లారా ! 

అచ్చటి కిచ్చటి  కనుకోకుండా

ఎచ్చ టెచ్చటికో ఎగురుతూ పోయే,

ఈలలు వేస్తూ ఎగురుతూ పోయే

పిట్టల్లారా !పిల్లల్లారా !”  —  భాగాన్ని ఇష్టపడేదాన్ని. 

నాన్న నాకు ఓ  నర్సరీ రైమ్  ను ఇంగ్లీషువారి రాగం లో నేర్పాడు. అది — 

I had a little pony,
His name was Dapple Grey,
I lent him to a lady,
To ride a mile away.

She whipped him, she slashed him,
She rode him through the mire;
I would not lend my pony now,
For all the lady’s hire. 

ఇది ఇప్పటికీ గుర్తుంది. ఏదైనా సరే, చెపితే  మనసుకు నాటుకు పోయేలా చెప్పేవాడు.            

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.