నడక దారిలో-6

-శీలా సుభద్రా దేవి

ఆ ఏడాది గడిచాక తిరిగి విజయనగరం లోని కంటోన్మెంట్  మున్సిపల్ హైస్కూలులో ఫోర్త్ ఫాం (తొమ్మిదో తరగతి)లో చేరాను. స్కూలు కు అయిదారు ఇళ్ళు అవతల మా ఇల్లు ఉండేది.అదే స్కూలులో అన్నయ్య ఇంగ్లీష్ మాష్టారు.అప్పుడే చిన్నన్నయ్యకి ట్రైనింగ్ పూర్తి కావటంతో వెంటనే ప్రాధమిక పాఠశాల లో మాష్టారుగా ఉద్యోగం వచ్చింది.మామయ్య యూఎస్ కి వెళ్ళటం వలన పెద్దక్కకూడా మాతోనే కలిసి  ఉంది.
     ఏడాది పాటు సాహిత్య పఠనం వల్ల కావచ్చు.క్లాసులో తెలుగు మాధ్యమంలోని అన్ని సబ్జెక్టులలోనూ బాగా రాణించేదాన్ని. ముఖ్యంగా తెలుగులో కొత్తగా చందస్సు బోధించారు.ఆటవెలదిలో గణాలు కూర్చుకొని మా తెలుగు మాస్టారు రామకృష్ణమాచార్లులుగారి మీదే మొదటి పద్యం రాసి చూపించుతే మా మాష్టారు పొంగిపోయారు.”నువ్వు కవయిత్రి వి అవుతావు తల్లీ” అని దీవించారు.మాష్టారి యిల్లు విజయనగరం కొత్తపేట మంటపం దగ్గర ఉండేది.1980 లో నా మొదటి కవితా సంపుటి ” ఆకలినృత్యం” వారి ఇంటికి వెళ్ళి ఇచ్చి వచ్చాను.
              1965లో భారత్ పాకిస్తాన్‌ల మధ్య జరిగిన యుద్దాన్ని రెండవ కాశ్మీర్ యుద్దం అని కూడా అంటారుట.భారత వాయు సేన, పాకిస్తాన్ వాయు సేనలు స్వాతంత్ర్యం తర్వాత తొలిసారిగా ఈ యుద్ధంలోనే పాల్గొన్నాయిట.ఆ సమయం లో ఆకాశంలో చాలా కిందనుండి విమానాలు తిరుగుతూ ఉండేవి.నౌకాశ్రయాలపై దాడి జరుగే అవకాశం ఉందని కూడా వార్తలు వచ్చేవి.రాత్రి సమయంలో  ” బ్లాకౌట్” చేయాలని అనేవారు.ఆ బ్లాకౌట్ అనేమాట మొదటిసారి వినటం.ఇంట్లోని వెలుతురు బయటకు కనబడకుండా కిటికి అద్దాలకు నల్లకాగితం అంటించాలి అని అనేవారు.మరి వైజాగ్ లో అది పాటించారో లేదో నాకైతే తెలియదు.
1965 జులైలో పాకిస్తాన్ సైన్యం, భారత పాలిత కశ్మీర్‌ను భారత్ నుంచి దూరం చేయడానికి ఒక గొరిల్లా ఆపరేషన్ ప్రారంభించింది. దానికి ‘జిబ్రాల్టర్’ అనే పేరు పెట్టారుట.ఆ యుద్ధం విశేషాల్ని తేదీ వారీగా ఒక పాత డైరీ లో కూడా రాసుకునే దాన్ని. 
              ఐదు వారాల పాటు జరిగిన యుద్దంలో ఇరు వైపుల వేలాది మంది సైనికులు చనిపోయారు. చివరికి ఐక్యరాజ్య సమితి నిర్ణయించిన కాల్పుల విరమణ ఒప్పందంతో యుద్దం ముగిసింది.ఆ యుద్ధం సందర్భాన్ని, పౌరుల బాధ్యత తెలిపేలా నా రెండవ ఆటవెలది పద్యం రాసాను.బహుశా నేను ఇరవై ఏళ్ళ క్రితం “యుద్ధం ఒక గుండె కోత” దీర్ఘ కవిత ను రాసేందుకు మూలం ఆనాడు నా మనసులోనే బీజం పడిందేమో అనిపిస్తుంది.
              మా మాష్టారు అప్పట్లో  ఒక లిఖిత పత్రికను ప్రారంభించారు.దానికోసం రాయమని నన్ను ప్రోత్సహించారు.ఆ విషయాలు మరొక సందర్భం లో తెలియజేస్తాను.
             తొమ్మిదో తరగతి ఏ సెక్షన్ లో పదిమంది అమ్మాయిలం.ఆ ఏడాది నుండి గణితంలో కాంపోజిట్,జనరల్ అని రెండు కేటగిరీ లు ఉండేవి.కాంపోజిట్ లెక్కలు క్లాస్ లో  నేనూ,రాజీ తప్ప మిగతా అందరూ అబ్బాయిలే.అందువల్ల ఆ మూడేళ్ళలో రాజీ నాకు మంచి స్నేహితురాలైంది.               
            హిందీ సినిమాలు ఆడే ధియేటర్లలో ప్రేక్షకులు తక్కువగా ఉంటారు.అందుకని మేమిద్దరం హిందీ సినిమాకే వెళ్ళి ఆ సినిమా నడుస్తున్నంత సేపు బోల్డు కబుర్లతో పాటూ మనసులోని మాటలన్నీ కలబోసుకునేవాళ్ళం.ఆ స్నేహం నా చదువై నేను హైదరాబాదు వచ్చాక కూడా కొనసాగింది.రాజీ ఇంటర్మీడియట్ ప్రశ్నపత్రాలు దిద్దడానికి హైదరాబాద్ వచ్చినప్పుడు కలిసే వాళ్ళం.ఐతే నేను ఆమెని సాంప్రదాయ ఆంక్షల లక్ష్మణ రేఖ దాటేందుకు చేయందిస్తున్నానని వాళ్ళింట్లో అపోహపడి మా స్నేహానికి మరొక లక్ష్మణ రేఖ గీసారు ఆమె పెద్దలు.ఐతే ఆ పెద్దలు వెళ్ళిపోయినా కూడా ఆమె ఉన్నత ఉద్యోగాలకు ఎదిగినప్పటికీ మరెందుచేతో పెద్దలు గీసిన లక్ష్మణరేఖలు దాటటానికి బదులుగా ఆ రెండు రేఖలకూ అదనంగా మరో రేఖను తనచుట్టూ తానే చుట్టుకుని ముడుచుకుపోయింది.ఆనాటి స్నేహం అలనాటి హిందీ పాటల్లో సుడులు తిరుగుతూ నా గుండెల్లో ఇంకా గుస గుస లాడుతూనే ఉన్నాయి.రాజీకి గుర్తు వస్తున్నాయో లేదో.
           పోలీస్ బారెక్స్  నుండి జానకీ, మేరీ రాజ్యలక్ష్మి కలిసి మా ఇంటికి వస్తే ముగ్గురం కలిసి రోజూ బడికి వెళ్ళే వాళ్ళం.జానకీ వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత రెండో పెళ్ళి చేసుకున్న తండ్రి జానకిని పెద్దమ్మ ఇంట్లోనే ఉంచి చదివించేవారు.పెద్దమ్మకూతుళ్ళు ముగ్గురు ఉన్నా మానసికంగా ఒంటరి తనం అనుభవించేది జానకీ.
           తండ్రి పోయి ఆర్థిక స్వావలంబన లేని తల్లిదగ్గర పెరిగే ఆడపిల్లల గాధ నాదైతే,తల్లి పోయి తండ్రి మరో పెళ్ళి చేసుకుంటే పరాయి పంచన పెరిగిన బాధ జానకిది.అప్పటికి నేను చిన్నదాన్నే ఐనా నేను చదివిన సాహిత్యం లో అనేక జీవితాలు గురించి చదవటం వల్లనేమో నాకు తెలిసిన వారి జీవితాలనూ,వారి కుటుంబ పరిస్థితులను అవగాహన చేసుకోవటానికి ప్రయత్నం చేసేదాన్ని. అందువలనే కాబోలు జానకి నా మనసుకు చాలా దగ్గర అయ్యింది.టిఫిన్ బాక్స్ మా ఇంట్లోనే ఉంచి మధ్యాహ్నం బెల్ అయ్యాక నాతో ఇంటికి వచ్చి రోజూ అందులోని ఎర్రని ఆవకాయ అన్నం తింటూ ఉండేది. నేను కూరగానీ, పప్పు గానీ ఇవ్వనా అని అడిగినా తీసుకునేది కాదు.పదో తరగతి తర్వాత వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయిన జానకీ  హైదరాబాద్ లో మంచి ఉద్యోగస్తుని భార్యగా తిరిగీ కలిసింది.సుమారు ఇరవై ఏళ్ళ క్రితం వరకూ మా స్నేహం కొనసాగింది.అమాయకత్వం నిండిన పెద్ద పెద్ద కళ్ళూ,ఒత్తైన తాచుపాము లాంటి బారు జెడ తో బాపూ బొమ్మ లాంటి జానకి మాత్రమే “ఒసేవ్ సుభద్రా ఎన్నాళ్ళైందే చూసి ఎలా ఉన్నావే?” అంటూ నన్ను ఆలింగనం చేసుకుని  ఆత్మీయంగా సంభోదించే ఒకే ఒక్క  స్నేహితురాలు.నాకున్న ఇంటాబయటా తీరికలేని జీవితం తో జానకి ని మళ్ళీ కలుసుకోలేక పోయాను.పాత లేండ్ లైన్  నెంబర్ కు ఫోన్ చేస్తే బాగుండును అనుకొని కూడా ఏ వార్త వినాల్సి వస్తుందోనని నా జ్ణాపకాల లోనే జానకిని భద్రపరచుకొని గుర్తు వచ్చినప్పుడు ఆత్మీయంగా తడుముకుంటాను.
               మేరీ రాజ్యలక్ష్మి కూడా ఫిఫ్త్ ఫాం(పదోతరగతి) తర్వాత స్కూలు ఫైనల్ కి గుంటూరు వెళ్ళి పోయింది.మళ్ళీ ఎనభైలలో అనుకుంటా కవి దేవీప్రియ భార్య గా పరిచయం అయ్యింది.కానీ అప్పుడప్పుడు కలిసినా ఎందుచేతనో స్నేహం బలపడలేదు.రెండేళ్ళక్రితం ఆమె భౌతికంగా కూడా దూరమయ్యింది.
                  మరో మంచి స్నేహితురాలు కృష్ణకుమారితో స్నేహం ఆ నాటి నుండి నేటి వరకూ కొనసాగుతూనే ఉంది. కృష్ణకుమారి ,ఆర్థికపరమైన, సామాజిక పరమైన ఏ విధమైన బాదరబందీలు గానీ ఏమీలేని మధ్య తరగతి కుటుంబానికి చెందినది.బహుశా అందువలనే కావచ్చు ఎప్పుడూ సరదాగా,జోవియల్ గా కలుపుగోలుగా నిష్కల్మషంగా ఉంటుంది.కుమారితో కబుర్లకు కూచుంటే కాలం ఇట్టే కరిగిపోయే ది.మరో స్నేహితురాలు కమల,నేనూ కుమారీ తో కలిసి ఒకసారి శివరాత్రి జాగారం కబుర్లు చెప్పుకుంటూనే పూర్తి చేయగలిగాము.అప్పుడప్పుడు నేనూ కుమారీ సినిమాలకు వెళ్ళే వాళ్ళం.
                  సినిమా అంటే గుర్తొచ్చింది.సినీమాహాల్లో  కుర్చీ టికెట్టు ఆరు అణాలో, అర్థ రూపాయో ఉండేది.చిన్నన్నయ్య ప్రతీ నెలా తీసుకు వచ్చే వెచ్చాలషాపులో ఆరోజుల్లో వార్తా పత్రికలలోనే ఆరోజుల్లో వెచ్చాలు పొట్లం కట్టి ఇచ్చేవారు.వాటిని డబ్బాల్లో వేసాక అమ్మ ఆ పేపర్లను సాపుగా చేసి దొంతు పెట్టేది.చిన్నన్నయ్య ప్రభా, ఆంధ్రజ్యోతి వారపత్రిక లు కొనే వాడు.అందులో నాకు నచ్చిన సీరియల్స్ కట్ చేయగా మిగిలిన పత్రికల్ని, దొంతి పెట్టిన పేపర్లను కలిపి  ఇంటి పక్కనే ఉన్న చిల్లర దుకాణంలో అమ్మితే రెండో మూడో రూపాయలు వచ్చేవి అందులోంచే నాకు అమ్మ సినిమాకు డబ్బులు ఇచ్చేది.
                  మా ఇద్దరికీ కాస్త బోర్ కొట్టే క్లాస్ హిందీ.కుమారీ పత్రిక ఒకటి తెచ్చేది వెనకబెంచీలో కూర్చుని జోకులు చదువుకొనేవాళ్ళం.ఒకసారి హిందీ టీచర్ కంటబడ్డాము.”కూసే గాడిద మేసే గాడిదని చెడగొట్టినట్లు  సుభద్రని చదవనీకుండా చేస్తున్నావా” అని కుమారినే ఎక్కువ తిట్టేవారు.” “పెద్దయ్యాక ఏ హైదరాబాద్ లాంటి ఊళ్ళోనో ఉండాల్సి వస్తే అప్పుడు హిందీ నేర్చుకోనందుకు బాధ పడతారు” అని టీచర్ తిడితే “మేము విజయనగరం దాటి వెళ్ళమండీ”అని కుమారి గొణిగేది.టీచర్ అన్నట్లు గానే కుమారీ నేనూ కూడా వివాహానంతరం ఒకేసారి హైదరాబాద్ చేరాం.అప్పట్లోఅంటే 1972 లో బజార్లో, కూరగాయలు కొనేటప్పుడూ,రిక్షావాలా తోటీ బేరం ఆడాలన్నా హిందీ రాక ఇద్దరం చాలా ఇబ్బంది పడేవాళ్ళం.”హిందీ టీచర్ మనల్ని శపించేసారు సుభద్రా “అనేది కుమారీ.
                  నేను రాంకోటీ లో, కుమారి చిక్కడపల్లి లో ఉండటం వల్ల కలుసు కునే వాళ్ళం.తర్వాత మేమిద్దరం తరుచూ కలుసు కోకపోయినా, ఇప్పుడు  సింగపూర్ లో కొడుకు ఇంట్లో ఉన్నా ఏ ఏడాదికో ఫోన్ చేసుకున్నా మాస్నేహం పచ్చదనం అలాగే ఉంది.అందుకే  నేను2006 లో ప్రచురించిన నా కథలసంపుటి “రెక్కలు చూపు” ఆమెకి  అంకితం చేసాను.
                  నా చిన్ననాటి స్నేహితురాళ్ళ జ్ణాపకాలు తలచు కున్నప్పుడల్లా పెదాలమీద చిన్న చిరునవ్వు,గుండెల్లో సన్నని గిలిగింతా కలగలిసి నాచుట్టూ సురభిళాలు వెదజల్లుతూనే ఉంటాయి.మనసులోని మాట చెప్పుకో గలిగే స్నేహితులను మించిన సంపద లేదు కదా!అందుకేనేమో ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారు ” సృష్టి లో తీయనిది స్నేహమేనోయీ” అన్నారు.

*****

Please follow and like us:

7 thoughts on “నడక దారిలో(భాగం-6)”

  1. సుభద్రా,
    చక్కటి చిక్కటి కధనం … నీ తో పాటు మమ్మల్ని నడిపించి నువ్వు నడిచిన దారి అంతా చూపించావు…
    అమ్మగురించి బాల పేరmటాల్ల గురించి, బాల్య మ్ గురించి,స్నేహితుల గురించి సూ టీ గా గుండె నీ తాకే లా చెప్పావు…కొనసాగించండి…
    అన్నట్టు నేస్తంకట్టడం గురించి మల్లిశ్వరి గారి నవల లో చదివాను… మీ కూ అనుభవమే అన్నమాట…ఇంక ఇలాంటివి ఎన్నో మీనుంచి తెలుసుకోవాలని చూస్తూన్న

  2. సుభద్రా దేవి గారూ,
    మీ నడక దారిలో కొనసాగించండి. మీ బాల్యం తో పాటు ఆనాటి సామాజిక, రాజకీయ పరిస్థితుల్ని కూడా గుర్తుంచుకొని చెప్పడం బాగుంది. మీ చిన్ననాటి ఆత్మీయ స్నేహితుల్ని మాకు కూడా పరిచయం చేస్తున్నట్లుగా వుంది.

    1. మీ ఆత్మీయ స్పందన కు ధన్యవాదాలు లక్ష్మీ

  3. చాలా చాలా బాగుంది సుభద్ర గారు. మీ చిన్నప్పటి జ్ఞాపకాలు పరిమళాలు సున్నితంగా మమ్మల్నీ తాకాయి.

    1. మీ స్పందన కు ధన్యవాదాలు సుశీల గారూ

  4. మీ నెచ్చెలుల ముచ్చట్లు జ్ఞాపకాలు బాగున్నాయి సుభద్ర గారూ.. ప్రతిదీ డైరీలాగా వ్రాసుకునే అలవాటు చాలా మంచిది కదా! ఎపుడైనా చదువుకుంటే ఆ కాలంనాటి వివరాలు విలువైనవిగా వుంటాయి. కాలాన్ని నోటీస్ చేయడం కదా!

    1. మీ స్పందనకు ధన్యవాదాలు వనజా

Leave a Reply

Your email address will not be published.