“రామచిలక “

(మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

– రావుల కిరణ్మయి

ఆరోజు జనవరి 25.జాతీయ బాలికా దినోత్సవం.ఈ సందర్భంగా వివిధ అంశాలలో ప్రతిభాపాటవాలు ప్రదర్శించిన పధ్నాలుగుమంది బాలికలను ఘనం గా సన్మానించుటకు ఆ సమావేశం ఏర్పాటు చేయ బడింది.”ఆడపిల్లను పుట్టనిద్దాం –మెట్టు మెట్టు ఎదగనిద్దాం’’, అన్న నినాదం తో గౌరవ కలెక్టర్,స్త్రీ –శిశు సంక్షేమ అధికారులు అందరూ ఆసీనులై ఉన్నఆ సభా వేదిక సభా ప్రాంగణం లోనే బాలికల తల్లితండ్రులు,ఉపాధ్యాయులు,వివిధ పాఠశాలల విద్యార్థులందరూ ఆనందోత్సాహాలతో చూస్తుండగా ఆ సమావేశ మందిరం గంభీరమైన వాతావరణంతో ఉంది.

వారిలో నిరంజన్ రెడ్డి కూడా ఒకడు.ఆయన కూతురు ప్రణవి కూడా పధ్నాలుగు మంది బాలికల లో ఉంది.తన గారాల కూతురు కలెక్టర్ చేతుల మీదుగా సన్మానించబడటం అతనికెంతో గర్వంగా ఉంది.

సభ ప్రారంభమైనది.అద్యక్షుల వారు ఆనాటి కార్యక్రమం ఆవశ్యకత ను గురించి,ఆడపిల్లల భద్రత,సంరక్షణ మొదలగునవి అన్ని విషయాలలో సమాజం బాధ్యత,భాగస్వామ్యం గురించి కూలంకషంగా వివరించి సన్మాన కార్యక్రమం ప్రారంభించి కలెక్టర్ చేతుల మీదుగా చిన్నారులందరినీ పూలదండ,శాలువా,మెమొంటోతో సత్కరించారు.ఆ తరువాత కలెక్టర్ గారిని ప్రసంగించాల్సింది గా కోరినప్పటికీ ఆయన,ఆ చిన్నారుల తల్లితండ్రులు తమ ఆడపిల్లల పట్ల చూపుతున్న శ్రద్ధను తెలియజేయాలని సూచించగా ముందుగా నిరంజన్ రెడ్డి కే ఆ అవకాశం వచ్చింది.

నిరంజన్ రెడ్డి వేదిక మీద కు వెళ్ళి సభను ఉద్ధేశించి నాకు అన్యధా భావించక కొంత సమయం కేటాయించాలని కలెక్టర్ గారితో సహా ఇతర మంత్రులను,అధికారులను అభ్యర్థించి మాట్లాడడం మొదలు పెట్టాడు.

నేను ఒక ఉపాధ్యాయుడిని.నిత్య చైతన్యస్ఫూర్తి తో నేటి బాలలైన విద్యార్థులను రేపటి పౌరులుగా తీర్చిదిద్దవలసిన ప్రముఖ స్థానంలో ఉన్న ఒక వ్యక్తిని.నాకు నా హోదా,నా అందం,నా డబ్బు తెచ్చిన గర్వమే ఎక్కువ.నాకు నా కుటుంబానికి సంబంధించి నా భార్య,అక్కాచెల్లెలు ముఖ్యంగా నా కూతురంటే పంచ ప్రాణాలు.ఇక మిగతా ఏ స్త్రీ అయినా గంజి లో ఈగ వంటిదే.నన్ను చూసి జెలసీ గా ఫీలవుతారనేది  నా భావన.

ఈ రోజు నా కూతురు అందుకుంటున్న ఈ బహుమానానికి నేను చాలా గర్విస్తున్నా.కానీ ఆమెను వెన్నుదన్ను తో ప్రోత్సహించింది మాత్రం నేను కాదు.ఆమెను కన్నతండ్రి గా ఆమెకు అవసరాలు తీర్చడం వరకే నా బాధ్యత అనుకున్నాను.కానీ అనుకోని సంఘటనలు ఎదురైనపుడు ఎలా పరిష్కరించుకోవాలో అందుకు అవసరమైన మానసిక స్థైర్యం,మాటు వేసిఉన్న ప్రమాదాలను గుర్తించి ఎలా పరిష్కరించుకోవాలో ఆ నేర్పరితనం కూడా ముఖ్యమని నేను గ్రహించ లేదు.  ఆ పని ని నా తోటి ఉపాధ్యాయురాలు గుర్తించి మా అమ్మాయి తో పాటు ఇంకా కొంత మందికి కరాటే లో ఉచిత శిక్షణ నిచ్చి ఈ రోజు పోకిరీల నుండి మా అమ్మాయి నే కాక మరికొంత మంది అమ్మాయిలను కాపాడి ఆ పోకిరీ లలో కౌన్సిలింగ్ ద్వారా మానసిక పరివర్తనకు కారణమయింది.ఆ ఉపాధ్యాయురాలికే మీరు చెప్పే అభినందనలు చెందుతాయి.

ఇంకొక ముఖ్య విషయం నా  కూతురు పట్ల పోకిరీలు ప్రవర్తించి వేధించినట్లుగానే నేనూ ఆ ఉపాధ్యాయురాలిని మానసికంగా ద్వంద్వార్థ మాటల తోనూ,వ్యంగ్యంగా మాట్లాడుతూ చాలా హిం సించాను.నాకు తెలుసు గృహ హింస లాగే పని చేసే చోట స్త్రీలు తాము ఇలాంటి హింసను ఎదుర్కొన్నట్లయితే మొబయిల్ లో ‘’షీసేఫ్’’యాప్ నిక్షిప్తం చేసుకుంటే చాలు.గృహహింసకు గురవుతున్న,ఆకతాయిలు వేధిస్తున్నా,సైబర్ నేరాల బారిన పడ్డా,జీవితం పై విరక్తి చెంది తీవ్ర ఒత్తిడిలో ఉన్నా,కారణాలేమయినా ఎలా బయటపడాలో మార్గదర్శక్ లు దగ్గరుండి మరీ మార్గదర్శనం చేసి అవసరమైన సహాయాన్ని చేసే సౌలభ్యం తనకున్నప్పటికీ తాను ఆ పని చేయలేదు.నాలో ప్రవర్తన కలిగే విధంగా ప్రవర్తించింది.ఇందుకు నేను ఆమెకు పాదాభివందనాలు చేసినా తప్పు లేదు.

తోటి ఉపాధ్యాయుడనని పోలీస్ పరంగా,న్యాయపరంగా,షీటీమ్ ల పరంగా ఎలాంటి చర్యలకు నేను శిక్షించబడకుండా మానసిక పరివర్తన ద్వారానే నాలో మార్పును ఆశించి ఆ దిశ గా ప్రయత్నించి విజేత గా నిలిచింది.ఈ సందర్భంలో ఆమె ను మీ అందరికీ పరిచయం చేసి ఆమె నోటి ద్వారానే నా తప్పు ను మన్నించినట్లుగా చెప్తే నాకు అంతకు మించిన పాప పరిహారం లేదని కంటి నిండా నీరు జల జలా రాలుతుండగా ‘’కచ్ఛపి’’గారు వేదిక మీదకు రావాలి అని మనస్పూర్తిగా ఆహ్వానించి దోషిలా అక్కడే నిలబడి పోయాడు.

‘’కచ్ఛపి’’ఎక్కడో చివరన నుండి లేచి నడిచి వస్తుండగా అందరూ ఆమెను గౌరవభావం తో,అభినందన పూర్వకంగా తమ కరతాళధ్వనులు చేయుచుండగా వేదికను చేరి ప్రసంగించడం మొదలు పెట్టింది.

నమస్కారం.నాపేరు కచ్ఛపి.మాది నిరుపేద కుటుంబం.ఎనిమిది మంది సంతానంలో ఐదవ బిడ్డ గా జన్మించాను.తల్లితండ్రులు రోజు వారి కూలీలు.సెంటు భూమి,ఆస్తి పాస్తులు ఏమీ లేవు.సంతానం ఎక్కువ.సంపాదన తక్కువ.అందువల్ల ఏనాడూ కడుపు నిండేది కాదు.మా పరిస్థితిని చూసి ఊర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు పిల్లల్ని పంపిస్తే ఒక్కపూట తిండి తో పాటు ఓ నాలుగు అక్షరం ముక్కలు నేర్చుకుంటారని ఆ బడి లో మాష్టారు కృష్ణశాస్త్రి గారు బలవంత పెడితే తల్లితండ్రులు బడిలో చేర్పించినా,తమ చుట్టూ ఉన్న పరిసరాలు కుటుంబ పరిస్థితులు మమ్మల్ని చదువుకు దగ్గర చేయలేక పోయాయి.అందరం మధ్యలోనే మానేసి తల్లితండ్రులకు చేదోడు వాదోడు గా కూలీ పనులకు వెళ్ళడం అలవాటు చేసుకున్నాము.నేను మాత్రం కూలీ పనులకు వెళ్ళినా సమయం చూసుకొని మాష్టారు చెప్పినట్టుగా చదువుతూ శ్రద్ధ పెట్టేదాన్ని.అలా తానే నా పేరును చదువులతల్లి సరస్వతి అమ్మ చేతిలోని వీణ గా నీవూ చదువుల్లో రాణించాలని ‘’కచ్ఛపి’’అని పేరు పెట్టాడు.

పేరు మహత్యమో,గురువు ఆశీస్సులో కానీ నేను గురువు గారి దత్తపుత్రిక లా ఒక్కో మెట్టూ ఒక్కో మెట్టూ ఎదిగి బీఫార్మసీ పూర్తి చేసి సివిల్స్ కోచింగ్ తీసుకొని మంచి ర్యాంక్ సాధించి కలెక్టర్ అయ్యే అవకాశం వరించినాశాస్త్రి గారే మనసంతా నిండి పోగా నేను కూడా నా లాంటి విద్యార్థులను ప్రయోజకులుగా తయారు చేయాలనే సత్సంకల్పం తో బోధనా వృత్తి ని స్వీకరించాను.

నేను ఏ పాఠశాలలో పని చేసినా అక్కడ నా కంటూ ఒక ముద్ర వేసుకోవాలనే తాపత్రయం,శిల  లాంటి విద్యార్థులను శిల్పాల్లా మట్టి ముద్ధలాంటి వారి మెదళ్లను మాణిక్యాల్లా దిద్దాలనే ఆరాటం తో అడుగులు వేస్తున్నాను.సామాజిక దృక్పథం కూడా ఆసక్తి ఉండడం తో నేను పని చేసే చోట కలిసే అవకాశం లేక పోవడం వల్ల నా పట్ల ఇతరులకి ఒక రకమైన అహంభావిని అనే ఆలోచన రాక మానదు.దాని ఫలితమే ఇప్పుడు నిరంజన్ రెడ్డి గారు నన్ను ఏమాత్రం అందంగా లేకుండా కారు చీకటిలా నల్లగా ఉన్నా ‘’రామచిలక’’అని దెప్పి పొడుస్తూ,వ్యంగ్యంగా మాట్లాడే మాటలు నన్ను ఏనాడూ బాధించ లేదు.నాలో ఇంకా పట్టుదలను పెంచాయి.

ఇలా ఉండగా హరితహారం కార్యక్రమం చాలా సమర్థవంతంగా నిర్వహించిన తీరు పలువురి ప్రశంసలు అందుకుంది.ప్రతీ ఇంటికి నర్సరీలలో లిఫ్స్టిక్ మొక్కలను పెంచేలా ప్రోత్సహించి ఆ మొక్కల నుండి వచ్చే గింజలతో ఆర్గానిక్ ఫుడ్ కలర్ తయారు చేసే అవకాశం ఉండడం తో భవిష్యత్ ఉపాధికి బాటలు వేయించాను.

శివుడికి అత్యంత ఇష్టమైన పారిజాతం మొక్కలు దోమల నుండి రక్షణకు,కృష్ణ తులసి మొక్కలు పంపిణీ చేశాను.పాఠశాల భవనం పై నుండి పడే వర్షపు నీటిని రూట్ వాటర్  హార్వెస్టర్ సిస్టం ద్వారా మొక్కలకు అందిస్తున్నాను.దాతల ద్వారా విరాళాలు సేకరించి అంటు మామిడి,కేసరి,బంగినపల్లి రకాలు తెప్పించి అంటు పద్ధతి లో గ్రామం లో అభివృద్ధి చేయించాను.పాఠశాల విద్యార్థులతో వాడి పారేసిన కొబ్బరి బోండాలలో పెరిగిన మొక్కలను పాఠశాలలో నాటించాను.అలాగే వాడి పారేసిన టైర్లకు రంగు లేసి పాఠశాలలో విద్యార్థులతో అందమైన పూల మొక్కలను నాటించి ప్రతీ గ్రామం లో కూడళ్ళలో ఏర్పాటు చేశాము.

ఉపాధి హామీ పథకం లో భాగంగా నిర్మించిన అన్ని సేద్యపు కుంటల్లో చేపల పెంపకం చేపట్టి పాండ్ ఫిషరింగ్,సోలార్ విలేజీ గా గ్రామాన్ని అభివృద్ధి చేయడం,ఉచిత వై-ఫై సేవలు తండాలలో అక్షరాస్యత 100 %సాధించేందుకు కృషి చేయడం తో పాటు అవగాహన కల్పించడం తో పాటు అత్యంత గౌరవాభిమానాలు దక్కాయి .వీటన్నిటికి నేను సివిల్స్ కోసం తీసుకున్న శిక్షణ చాలా ఉపయోగపడింది.మరుగుదొడ్ల నిర్మాణం,ఇంకుడుగుంతల నిర్మాణం మొదలగు చైతన్యవంతమైన కార్యక్రమాలతో ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నాను.

నేను నా సొంత ఊరిలో హరితహారాన్ని ఉద్యమంగా చేపట్టి 15౦౦ విత్తన బంతులను తయారుచేయించాను.ఇవన్నీ జీర్ణించుకోలేక నిరంజన్ సర్ లాంటి వాళ్ళు నన్ను,నా ఆత్మస్థైర్యం పై వేటు వేయాలని మానసికంగా నన్ను వనం లో తిరిగే రామచిలక అని ద్వంద్వార్థాలతో వెకిలిగా నవ్వడం ఎవరితోనైనా అలాగే చెప్పడం దాన్ని మరోలా సమర్థించడం ఇవన్నీ నేను గమనిస్తూనే ఉన్నానని అత్యవసర పరిస్థితుల్లో ‘’షీటీమ్’’హెల్ప్ తీసుకోవాలని ఆలోచించానని,  అలా నాలోని ఈ సహనమే ఈ రోజు సార్ లో పరివర్తన తీసుకువచ్చిందని.

ప్రతీ ఒక్కరు ఇలాగే వేధింపులు ఎదురైనపుడు సామరస్య ధోరణి లో మొదటి ప్రయత్నం గా తమ వంతు కృషి చేయాలని అలా సాధ్యం కానప్పుడు తప్పక ‘’షీటీం’’ద్వారా పరిష్కరించుకోవాలని నేను అమ్మాయిలకు,యువతులకు కరాటే లో ఉచిత శిక్షణను కూడా ఇవ్వడం వల్లే ఈ రోజు ప్రణవి తనను తాను కాపాడుకోగలిగింది.పోకిరీలలో మానసికంగా తప్పు చేశామనే భావనతో మంచి మార్పుకు శ్రీకారం చుట్టింది.

నా ఉద్దేశం మహాత్మాగాంధీ గారు అహింసా మార్గం లో పయనించి,ఆచరించి అందరినీ ఒక్క తాటి పైకి తెచ్చి ఈ దేశ స్వాతంత్ర్యానికి పునాది వేసినపుడు ,ఆడపిల్లల సమస్యలు కూడా వారు తలచుకొంటే ఎందుకు సాధ్యంకాదు?అన్న ధోరణిలో అభ్యుదయం వైపు పయనించాలని ఆశ తో ఇదంతా చేస్తున్నాను.

ఇక నిరంజన్ రెడ్డి గారు అన్నట్టు నేను రామచిలకనే.నాకు ,రామచిలక ఎండి మోడువారిన చెట్ల మీద ఉండడం ఎలాగైతే ఇష్టపడదో,నాక్కూడా నా చుట్టూ పరిసరాలు నైతిక విలువలు లేకుండా ఉండడం ఇష్టముండదు.మంచి విలువలతో కూడిన సమాజమనే హరిత వనమే నా కిష్టం.అందుకే ఆ వనం నాకు నేనే నాటాలని కృషి,పట్టుదల అనే మొక్కలను నాటుతూ శ్రమిస్తున్నాను.

నిరంజన్ రెడ్డి గారూ!మీరు చాలా ఉత్తములు.ఎవరైనా ఇంత మంది ముందు ఎంత పెద్ద సభ లో క్షమాపణలు అడగడానికి తటపటాయిస్తారు.కానీ మీరు నిష్కల్మషమైన మనసు తో హృదయ పూర్వకంగా మన్నించుమని అడిగినపుడు నేనే కాదు నా స్థానం లో ఎవరున్నా మిమ్మల్ని మన్నిచి తీరుతారు.అనగానే సభ మొత్తం చప్పట్లతో మారు మోగింది.తరువాత 

కలెక్టర్ గారు లేచి 

ఈ రోజు చాలా ముఖ్యమైన సమావేశాలు ఉన్నప్పటికీ అన్నిటినీ సభ పూర్తయ్యేంతవరకు వాయిదా వేసుకొని ఇక్కడికి రావడం యొక్క ముఖ్య ఉద్దేశం కొంత వరకు నెరవేరినట్లయినది.నన్ను, సమాజాన్నిబాగా కలిచి వేస్తున్న సమస్యలు భ్రూణహత్యలు,మానభంగాలు,హత్య లు వీటిని సమర్థవంతంగా ఎదుర్కోనాలంటే మీ లాంటి స్ఫూర్తి నింపే ఉపాధ్యాయులు చాలా అవసరం.అదే విధంగా ప్రతి మహిళ,ప్రతి ఆడపిల్ల శిశువు నుండి పండు ముదుసలి వరకు తమ మాన ప్రాణాలకు తామే మొదటి స్వీయ రక్షణ కల్పించుకోవాలి.ఇందుకు హెల్ప్ లైన్,చట్టాలు మొదలగు వాటి సహాయం తీసుకోవాలి.అన్నిటికన్నా శారీరక,మానసికదృఢత్వం,కోసం మంచి ఆహారం తో పాటు ఇటువంటి ఆత్మ రక్షణ శిక్షణలు కూడా తీసుకోవాలి.అప్పుడే సమయం వృధా కాకుండా సమస్యలు పరిష్కరించబడుతాయి.అందుకు నిదర్శనంగా నిలిచిన కచ్ఛపి,నిరంజన్ రెడ్డి గార్లను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.

అలాగే కచ్ఛపి గారన్నట్లు ప్రతీ వారు హరిత వనాలపై వాలే రామచిలకల్లా ఈ సమాజాన్ని ఒక నందనవనం లా తీర్చిదిద్దడం లో భాగస్వాములు కావాలి.

అందుకు ‘’సహకారం తో అడుగేద్దాం –నందనవనమును నిర్మిద్దాం’’అని నినాదమీయగానే అందరు ముక్త కంఠం తో ఎలుగెత్తి చాటారు.ఆడపిల్లకు భరోసా ఇద్దామని భాధ్యతాయుతంగా భావిస్తుండగా సభ ముగిసింది.

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.