ఆ తొలిఅడుగు

(మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

– దినవహి సత్యవతి

బి.కాం. చదువు పూర్తైన నెలలోపే, కిడాంబి గృహ నిర్మాణ సంస్థలో, ఉద్యోగం దొరికేసరికి సమీర ఆనందానికి అవధులు లేవు. ఊహ తెలిసినప్పటినుంచీ తన కాళ్ళపై తాను నిలబడాలన్నదే ధ్యేయంగా, వేరే వ్యాపకాలేవీ పెట్టుకోకుండా, ధ్యాసంతా చదువు మీదే పెట్టి డిగ్రీ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలైంది. ఎం.కాం చేయాలన్న ఆశ ఉన్నా, తనని అప్పటిదాకా ఆదుకున్న మేనమామకి ఇంకా భారం కాకూడదని, వెంటనే ఉద్యోగాల వేట మొదలు పెట్టింది. అదృష్టవశాత్తూ ఈ ఉద్యోగం దొరికింది. వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోకుండా, జీతం తక్కువైనా ఖర్చులు పోనూ పదో పరకో మిగిలినా చాలనుకుని, చేరిపోయింది.  ఆ  వెనువెంటనే మేనమామకి అత్తకీ కృతజ్ఞతలు తెలిపి వర్కింగ్ వుమన్స్ హాస్టల్లో చేరిపోయింది.  

ఉద్యోగంలో చేరి నెలైంది. మొదటి జీతం అందుకోబోతోన్న తరుణంలో మనసులో అవ్యక్తానందం. 

“మేనేజరుగారు పిలుస్తున్నారమ్మా” ప్యూను పిలుపుకి ఆలోచనలలోంచి తేరుకుని అటుగా అడుగులు వేసింది. 

క్యాబిన్ ముందు నిలబడి తలుపు తట్టింది.  

“కమిన్” లోపలినుంచి వినొచ్చిన బొంగురు స్వరానికి ఉలిక్కిపడి సర్దుకుని తలుపు నెమ్మదిగా తోసి లోపలికి  వెళ్ళింది. 

ఫైలులోంచి తలెత్తి సమీరని చూసి సంభ్రమానికి లోనయ్యాడు గగన్…

“ఈమె మళ్ళీ ఇక్కడ? ఏమి నా అదృష్టం. ఇంత త్వరలో మళ్ళీ చూస్తానని అనుకోలేదు సుమా! మొదటిసారి చూసినప్పుడే ఆ అందం మత్తెక్కించింది. ఇప్పుడింత దగ్గరగా చూస్తుంటే ఆ సొగసూ వయసూ పిచ్చివాడ్ని చేస్తున్నాయి. ఎలాగైనా ఈమెని…” వక్రంగా సాగుతున్నాయి అతగాడి ఆలోచనలు.  

“ఇతగాడిని మునుపెక్కడో చూసినట్లుందే?” ఎంత ఆలోచించినా జ్ఞప్తికి రాక ఆ ప్రయత్నం విరమించుకుంది.  పిలిపించి మాటామంతీ లేకుండా గుడ్లప్పగించి చూస్తున్న అతడి ప్రవర్తన  ఇబ్బందిగా అనిపించి “సార్” అంది. 

అయినా ఆ తీరులో మార్పు లేకపోయేటప్పటికి “సార్” ఈసారి మరి కాస్త గట్టిగా పిలిచింది.  

“ఆ..ఆ” తొట్రుపడి “మీరూ….” ఎదురుగా ఉన్న కవరు చేతిలోకి తీసుకుని పేరు చూసి “ఓ! సమీర, మీలాగే అందమైన పేరు” అన్నాడు. ఆ అతి చనువుకి చిర్రెత్తుకొచ్చినా సంబాళించుకుని “ఎందుకో పిలిచారట?”  అంది. 

ఆమె స్వర తీవ్రతకి ఖంగుతిని “మీ జీతం” కవరు చేతిలో పెడుతూ అలవోకగా తాకాడు. అయితే జీతం అందుకున్న ఆనందంలో అదేమీ పట్టించుకోకుండా థ్యాంక్స్ చెప్పి బయటకి వచ్చి ఆత్రుతగా డబ్బు లెక్క చూసుకుని తిరిగి పనిలో మునిగిపోయింది. 

ఆ క్షణాన ఆమెకు తెలియదు గగన్ తన జీవితాన్ని కబళించే ఆలోచన చేస్తున్నాడని!? 

****

చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయిన సమీరని సొంత బిడ్డలా సాకి విద్యాబుద్ధులు నేర్పించాడు మేనమామ.  అన్ని పనుల్లోనూ మేనమామకి చేదోడు వాదోడుగా ఉండే సమీర ఒకనాడు బ్యాంకుకి వెళ్ళినప్పుడు, టెల్లర్ కౌంటర్ వద్ద నిల్చున్న ఒక వ్యక్తి తనని గుడ్లప్పగించి చూడటం గమనించింది. ఆ వంకర చూపులకి చిరాకొచ్చి గబగబా పని ముగించుకుని బయటపడి ఆ విషయం అప్పుడే మర్చిపోయింది. కానీ సదరు వ్యక్తి మాత్రం మర్చిపోలేకపోయాడు… 

అతడి పేరు గగన్. మధ్య వయస్కుడు. సన్నగా పీలగా ఉంటాడు దానికి తోడు జుట్టుకి రంగు కూడ వేసుకుని ముప్ఫై ఏళ్లవాడిలా అగుపిస్తాడు. కిడాంబి కంపెనీలో మేనేజరుగా చేరక పూర్వమే ఒకానొక సందర్భంలో అత్యంత సౌందర్యరాశి సమీరను చూసి మానసిక వికారానికి లోనైయ్యాడు. తీరా పని ముగించుకుని పరిచయం చేసుకుందామని చూస్తే సమీర అక్కడ లేదు. “ఛ ఛ మంచి అవకాశం పోగొట్టొకున్నాను” తనని తానే తిట్టుకున్నాడు. 

పైకి చూడటానికి ఎంతో మర్యాదస్తుడిలా అనిపించే అతడు ఒక గోముఖ వ్యాఘ్రమంటే నమ్మశక్యం కాదెవ్వరికీ.  వివాహమై భార్యా పిల్లలూ ఉన్నా స్త్రీ లోలత్వం తగ్గలేదు. అందమైన అమ్మాయిలను మాయమాటలు చెప్పి లొంగదీసుకోవటం అతగాడికి ఒక ఆట…   

**** 

ఆనాడు బ్యాంకులో చూసి చేజారిపోయిన అమ్మాయి, సమీరని, మళ్ళీ ఇలా ఆఫీసులో తన క్రిందపని చేసే ఉద్యోగస్థురాలిగా చూసినప్పటినుంచీ ఎలాగైనా లొంగదీసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. రోజూ సమీరని తన క్యాబిన్ కి రప్పించి ఏదో వంకన తాకేవాడు. మొదట యాదృచ్ఛికమనుకున్నా, క్రమేపీ కావాలనే అలా చేస్తున్నాడని అవగతమైయ్యాక జాగ్రత్తగా మసులుకోసాగింది సమీర.  

స్నేహితురాలు అన్యమనస్కంగా ఉండటం గమనించి “ఏమైందే అలా ఉంటున్నావు ఏదైనా సమస్యా?” ఆరా తీసింది హాస్టల్ రూం లో సహ నివాసి, జమున.   

గగన్ గురించీ అతడి అసభ్య ప్రవర్తన గురించీ చెప్పుకొచ్చి “ఈ ఉద్యోగం నాకెంత అవసరమో నీకు తెలుసు. అలాగని ఆ దుర్మార్గుడి వికృత చేష్టలు భరించటం నావల్ల కావటం లేదే” అని బాధపడింది. 

“నువ్వెందుకు ఉద్యోగం మానేయాలి?ఈ మధ్యన పని చేస్తున్న చోట, చాలామంది నీలానే, లైంగిక వేధింపులని ఎదుర్కుంటున్నారు. కానీ వారిలో ఏ కొద్దిమందో మాత్రమే ధైర్యం చేసి ముందు కొచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. నువ్వూ, మీ పై ఆఫీసర్లకి, అతడి గురించి, ఫిర్యాదు చెయ్యీ?”  

“కానీ నా మాటలెవరు నమ్ముతారు? తాను దొంగచాటుగా చేసే వెధవపనులన్నీ ఎవరికీ తెలియవని తెలివిగా తప్పంతా నామీదకి తోసేసి ఆ దగుల్బాజీ తప్పించుకున్నా ఆశ్చర్యంలేదు” అసహనం, కోపం సమీర స్వరంలో.   

“ఊ…అవునే అలాంటి వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. సరేగానీ ముందిది చెప్పు మీ అఫీసులో మొత్తం ఉద్యోగస్థులు ఎంతమంది ఆడా మగా కలిపి?” 

“సుమారు పదిహేనుమందిమి ఆఫీసులో ఉంటాము. నిర్మాణ సంస్థ కదా! మరికొంతమంది ఎక్కువ సమయం ఫీల్డ్ లో ఉండి అప్పుడప్పుడూ ఆఫీసుకి వస్తుంటారు. నేనూ ఇంకో అమ్మాయీ తప్పించి మిగిలినవాళ్ళంతా  మగవాళ్ళే. ఎందుకూ?” 

“మరింకేం. నీ సమస్యని మీ ఆఫీసు ఐ.సి.సి కమిటీలో ఫిర్యాదు చేయవచ్చు” 

“ఐ.సి.సి కమిటీనా అదేమిటే?” 

“ఆఫీసులలో పనిచేసే ఆడవారిపై లైంగిక వేధింపుల నివారణా, నిరోధం మరియు ఫిర్యాదుల పరిష్కారం కోసం 2013 లో ప్రభుత్వం పోష్ (ప్రివెన్షన్  ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ వుమెన్ ఎట్ వర్క్ ప్లేస్) చట్టాన్ని రూపొందించింది. ఆ చట్టాన్ని అమలుపరచడానికి, ఆడవారూ మగవారూ కలిపి కనీసం పదిమందికంటే ఎక్కువ ఉద్యోగస్థులు ఉన్న ప్రతి సంస్థలోనూ తప్పనిసరిగా ఐ.సి.సి (ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ) అని ఒక కమిటీ ఉండాలి”

“కమిటీ ఏం చెస్తుందీ?” 

“అదే చెప్తున్నా విను మరీ. సంస్థలో ఉద్యోగస్థులు ఎవరైనా, తమని లైంగిక వేధింపులకి గురిచేస్తున్న వారిపై, ఈ కమిటీలో, సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేస్తే, కమిటీ విచారణ జరిపి, ఆరోపణ వాస్తవమై  రుజువైతే, సదరు వ్యక్తినుంచి వ్రాతపూర్వక క్షమాపణ పత్రం, హెచ్చరించటం, పదోన్నతి, ఇంక్రిమెంటు వగైరాల నిలుపుదల, సైకాలజిష్టు చేత కౌన్సిలింగ్ ఇప్పించటం, ఉద్యోగంలోంచి తొలగించటంవంటి చర్యలు తీసుకుంటుంది. ఒక్కొక్కసారి, ఆరోపణల తీవ్రతని బట్టి, నిందితుడికి జుర్మానా,  మూడేళ్ళ వరకూ జైలు శిక్ష లేదా రెండూ కూడా విధించే అవకాశం ఉంది”  

“నిజంగానా! ఎంత మంచి విషయం చెప్పావే! కానీ పరువే ప్రాణంగా బ్రతికే మామయ్యకు ఈ విషయం తెలిస్తే తట్టుకోలేరేమోనని భయంగా ఉందే! అందుకే  ఫిర్యాదు చేయాలంటే…కొంచం ఆలోచించాలే”

“ఇందులో నీ తప్పేముందే? ఇప్పుడు వాడ్నలానే వదిలేస్తే ఇంకా పేట్రేగి పోయి మరెంతమందిని ఏడిపిస్తాడో! నేను నీ తరఫున ఫిర్యాదు చేయవచ్చు కానీ నువ్వే ధైర్యం చేసి ఒక్క అడుగు ముందుకు వెయ్యవే ఆ తరువాత నీకు సహకరించడానికి నేను, ఇందాక చెప్పానే ఆ పటిష్ఠమైన పోష్ చట్టం ఉండనే ఉన్నాము కదా! మరొక్కసారి బాగా ఆలోచించు” సలహా ఇచ్చింది జమున.  

“ఊ…నువ్వన్నదీ నిజమే. ఒకసారి మామయ్యని కూడా సంప్రదిస్తాను.” 

“అవును అదీ మంచిదే. ఈలోగా నువ్వు చేయాల్సిన ముఖ్యమైన పని ఇంకొకటుంది” ఆ తరువాత చాలాసేపు చర్చించుకున్నారు స్నేహితురాళ్ళిద్దరూ. 

కొన్ని రోజులు గడిచాయి……. 

ఒకనాడు సమీరను తన క్యాబిన్ కి పిలిచి “రెండు రోజుల్లో అత్యవసరమైన ఫైల్స్ పంపించాలి. మరి కొంచం ఎక్కువ సేపు ఆఫీసులో ఉండాల్సి ఉంటుంది. తగిన ఏర్పాట్లు చేసుకో” అన్నాడు. 

ఇది తనని వేధించడానికి పన్నిన కొత్త పన్నాగమేమో అనిపించినా, గత కొన్ని రోజులుగా నిజంగానే పని ఒత్తిడి అధికంగా ఉండటంతో అనవసరంగా అనుమానిస్తున్నానేమో అనుకుంది. అదీగాక తనతో పాటే మరిద్దరు ముగ్గురు కూడా రాత్రి చాలా సమయం వరకూ ఉండటం చూసిన సమీర తన భయాలన్నీ ఊహాజనితాలేనని మనసుని సమాధాన పరుచుకున్నా తన జాగ్రత్తలో తానుండసాగింది. 

ఒకరోజు ఎంతలా పనిలో మునిగిపోయిందంటే సమయమే తెలియలేదు. తీరా చూసేటప్పటికి రాత్రి పది దాటింది. ఆఫీసంతా ఖాళీగా ఉంది. గగన్ ఇంకా ఆఫీసులోనే ఉన్నాడని సూచిస్తూ అతడి క్యాబిన్ లో లైటు వెలుగుతోంది. అంతే అవ్యక్తమైన భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టాయి. గబగబా అప్పటిదాకా తయారు చేసిన రిపోర్టులన్నీఒక ఫైలులో  సర్ది సీటులోంచి లేచి క్యాబిన్ వైపు అడుగులు వేసింది. 

సరిగా అప్పుడే క్యాబిన్ బయటకి రాబోతూ ఇంకా ఆఫీసులోనే ఉన్న సమీరని చూసి ఆశ్చర్యపోయాడు గగన్. ఆమె తనని చూడక మునుపే గబుక్కున లోనికి వెళ్ళి తలుపు వెనకాల దాక్కుని ‘అనుకోకుండా దొరికిన ఇంత మంచి అవకాశం వదులుకోవటం వెర్రితనం. తాను ఇన్నాళ్ళుగా ఆమెకి దగ్గరవటానికి చేస్తున్న ప్రయత్నాలని చూసీ చూడనట్లు ఊరుకున్నదంటే ఆమెకీ నేనంటే కోరిక ఉన్నట్లే! అంతేగా మరి. అందుకే ఇప్పటిదాకా ఆఫీసులో ఉన్నదేమో? ఆడపిల్ల కనుక తనంత తానుగా చొరవ తీసుకోవటానికి జంకుతోందేమో పాపం. అదేదో నేనే చేసేస్తే పోలా? ఆలోచనే ఇంత హాయిగా ఉంటే ఇక అనుభవమో…” ఊహలలోకంలో తేలుతున్నాడు.  

అంతలో ఫైలు తీసుకుని క్యాబిన్ లోకి వచ్చి టేబుల్ పై ఉంచి వెనుతిరిగిన సమీరకి అతిదగ్గరగా నిల్చుని వెకిలిగా నవ్వుతూ “అమ్మదొంగా! ఇందుకేనా ఇంత రాత్రి వరకూ ఉండిపోయావు. అంత సిగ్గైతే ఎలా మరీనూ? ఇద్దరి ఆలోచనలూ ఒకటేనని నాకు అర్థమైందిలే. ఇవాళ మనిద్దరమే ఆఫీసులో. ఇదే మంచి అవకాశం. రా నా కౌగిలిలో వాలిపో” వెర్రి  ప్రేలాపనలు మొదలెట్టాడు గగన్. 

అనుకోని ఈ పరిణామానికి విస్తుపోయి “ఛీ ఛండాలుడా మరొక్క అడుగు ముందుకేసావంటే మర్యాద దక్కదు” బలమంతా ఉపయోగించి ఒక్కతోపు తోసి అతడు నిలదొక్కుకునేలోగానే ఒక్క పరుగులో క్యాబిన్ వదిలి బ్యాగు దొరకబుచ్చుకుని ఎలాగోలా హాస్టల్ కి వచ్చి పడింది.  

వచ్చీరాగానే మాటాపలుకూ లేకుండా మంచంపై పడి ఏడుస్తున్న సమీరని చూసి ఆఫీసులో ఏదో జరిగుంటుందని ఊహించి, అప్పటికేమీ ప్రశ్నించక, ఓదార్చుతూ ఉండిపోయింది జమున….. 

మర్నాడు జమునకి విషయమంతా చెప్పి, ఆమె సలహాని అనుసరించి, వెంటనే కిడాంబీ సంస్థ ఐ.సి.సి. కమిటీలో, తనను లైంగిక వేధింపులకి గురి చేస్తున్నాడని, గగన్ పై ఫిర్యాదు చేసి, ఈ విషయం తేలే వరకూ సెలవు కోసం దరఖాస్తు పెట్టింది సమీర. అవసరమైతే హాజరవ్వాలన్న నిబంధనపై, సమీరకు పదిహేను రోజులు సెలవు మంజూరు చేసింది యాజమాన్యం. 

సమీరని చూసి ధైర్యం తెచ్చుకుని, తానూ ముందుకు వచ్చి, గగన్ తనపట్లా అసభ్యంగా ప్రవర్తించాడని, ఐ.సి.సి. కమిటీలో వ్రాతపూర్వక ఫిర్యాదు నమోదు చేసింది అదే ఆఫీసులో పని చేస్తున్న మరొక అమ్మాయి కూడా. 

రెండు ఫిర్యాదుల పూర్వాపరాలు క్షుణ్ణంగా పరిశీలించి, గగన్ పై అభియోగం సరైనదేనని సాక్ష్యాధారాలతో సహా నిరూపణ అవటంతో, గగన్ ఉద్యోగం ఊడటమే కాకుండా, పోష్ చట్టం 2013 ని అనుసరించి జుర్మానా తో పాటు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించబడింది…

తెర వెనుక జరిగిన కథేమిటంటే…

గగన్ ప్రవర్తన రోజు రోజుకీ అసభ్యకరంగా మారుతుండటంతో ముందు జాగ్రత్తగా, జమున సలహాపై, రహస్య కెమేరా ఉన్న పెన్నొకటి కొని కుర్తాకి తగిలించుకుంది. ఆమె ఎప్పుడు పెన్ను అలాగే తగుల్చుకుంటుందని తెలుసు కనుక ఎవరికీ అనుమానం కలగలేదు. ఆఫీసులో, ముఖ్యంగా, పని ఉండి గగన్ క్యాబిన్ కి వెళ్ళినప్పుడు, కెమేరా ఆన్ చేసి ప్రతీ క్షణాన్నీ రికార్డ్ చేసింది…ఆ నేపథ్యంలో గగన్ అసభ్య ప్రేలాపనా, చేష్టలూ అన్నీ కెమేరాలో రికార్డ్ అయ్యాయి. అవన్నీ, సాక్ష్యాల క్రింద కమిటీకి సమర్పించింది…     

****

సమీర సెలవు ముగిసింది. మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళే రోజు “పోష్ చట్టం గురించి అవగహన కల్పించి సహకరించినందుకు థ్యాంక్స్” జమునని కౌగలించుకుని  కృతజ్ఞతలు తెలిపింది. 

“ఇందులో నేను చేసిందేముందే. ఆఫీసులలో లైంగిక వేధింపులను భరిస్తూ బలయ్యేకంటే నీలాగే అందరూ, తమ సమస్య పరిష్కరించుకునే దిశగా ఆ మొదటి అడుగు వేయడంలో ధైర్యం చూపిస్తే, తదుపరి, ప్రభుత్వం రూపొందించిన పటిష్టమైన చట్టాలు ఉండనే ఉన్నాయి దారి చూపడానికి. అయితే చట్టాలున్నాయి కదాని ఎదుటివారిపై తప్పుడు ఆరోపణలు చేసినవారికి తగిన  గుణపాఠం చెప్పేందుకు శిక్షలు కూడా ఉన్నాయని మరువకూడదు సుమా!”  తర్జనితో హెచ్చరిక చేస్తూ నవ్వింది జమున. 

“అలాగే మేడం జమునా!” నాటక ఫక్కీలో అంటూ స్నేహితురాలి నవ్వుకి జత కలిపింది సమీర. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.