చినుకు తాకిన నేల కవిత్వ సమీక్ష

   -వురిమళ్ల సునంద

ప్రపంచమొక పద్మవ్యూహం కవిత్వమొక తీరని దాహం అన్నారు శ్రీ శ్రీ ‌.కవిత్వం అంటే తన మూలాల్లోకి వెళ్లి రాయడమే అంటారు మరో కవి.మాట తొలి క్షతం అంటారు వడ్డెర చండీదాస్.’అక్షరం ఉదయించాలి/ఒంటిమీది చెమట బిందువులా/అక్షరం ఉదయించాలి/ప్రాణ వాయువు ల్లో స్నానం చేసి/కురులార్చుకుంటున్న ప్రభాత కిరణంలా’ అన్నారు డా సి నారాయణరెడ్డి గారు.
అమెరికా కవి ప్రొఫెసర్ కెన్నెత్ కోచ్ ఏమంటారంటే రెండు రెళ్ళు నాలుగు అని చెబితే అది వచనము.రెండురెళ్ళు పచ్చగా ఉన్నాయంటే అది కవిత్వం. 
ఆధునిక కవిత్వ చరిత్రకు ఇప్పటికే నూటా ఇరవై ఏళ్ళు పూర్తి అయ్యింది.  నేటి పాఠకులు ఎక్కువగా 
ఆధునిక కవిత్వం ఒక వ్యక్తి మరొక వ్యక్తితో ఆత్మీయంగా చేసే సంభాషణలా ఉండాలని కోరుకుంటున్నారు. కవిత్వం ఆత్మ కళే కాదు.రూప కళ కూడా.రాబర్ట్ ఫాస్ట్ ఒక కవితకూ మరో కవితకూ భిన్నత్వాన్ని ప్రదర్శించక పోతే అసలు కవిత్వం రాసే అవసరమే లేదంటాడు. 
కవిత్వాన్ని చదివినప్పుడు మనసుకు కొంత పరవశం, ఆలోచన, అవగాహన, హృదయాన్ని కదిలించే వినూత్న  భావన మనసులో సందడి చేయాలి.అలా చేసిన కవిత్వంలోని పంక్తులు మనో యవనికపై పదిలంగా ఉంటాయి. కవి సామాజిక అంశాలతో పాటు విశ్వ జనీనమైన ప్రేమ గురించి కూడా కవిత్వీకరించడం చూస్తుంటాం. అలాంటి కవిత్వం రాయడంలో స్త్రీ పురుష భేదం ఉండకూడదని కోరుకునే వారికి , ప్రేమ కవిత్వం రాయడం నిషిద్ధం కాదని కవయిత్రి శాంతి కృష్ణ తన కవిత్వంలో కనిపిస్తుంది.
చినుకు తాకిన నేల – చిగురించే హరిత కాంతిలా మనసును ఎలా రాగ రంజితం చేస్తుందో తెలుసుకోవాలంటే శాంతి కృష్ణ గారి కవిత్వం లోకి  కళ్ళనూ మనసును పరుగులు తీయించాల్సిందే..
 ఈ కవితా సంపుటి లో డెబ్బై కవితలు దేనికదే ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఇందులో మొదటి కవిత తనకెంతో ఇష్టమైన నాన్న కవిత ‘గురువంటే నాన్నే’ కవితలో నాన్న ఎందుకు గురువు? . గురువు ఏం చేస్తాడు విద్యార్థిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి గురువు ఎంత శ్రమిస్తాడో అలాగే తన నాన్న కూడా.. అందుకే ” నాన్నంటే ఆది గురువే.. సాయం చేసే గుణముంటే/ సామ్రాజ్యాన్ని జయించే ఆత్మ విశ్వాసం/ నా తోడుంటుందని బోధన చేస్తూ.. ఈ పంక్తులు చదివితే చాలు నాన్న మీదున్న గౌరవం ప్రేమ, గురువు ఎందుకయ్యారో తెలుస్తుంది.
అర్థ నారీశ్వరులైన హిజ్రాల ఆకాంక్షలను,ఆవేదనలను కళ్ళకు కట్టినట్టు చూపించిన కవిత “మొగలి రేకులు”‘ఆకలి చేసే పేగుల సంగ్రామంలో/ యాచకులమై తిరిగే అనామకులం/…. కనిపించని స్నేహపు పలకరింపులకై/ మీ కళ్ళలో వెతుకుతూనే ఉంటాం’…  రేయంతా సలుపుతున్న గాయాల నుండి/ రేపటి చప్పట్లకై శక్తిని పుంజుకునే అర్థ నారీశ్వరులం..’ అంటూ రాసిన కవిత వారి వేదనకు అద్దం పడుతుంది. మృగాళ్లు తిరిగే ఈ లోకంలో అతివల జీవన గమనం  ఏమై పోతుందో.. “ఎప్పుడు ఏ అధముడి పరిష్వంగంలో నలిగిపోతోందో ” అంటూ.. బాధాతప్త స్త్రీ బతుకులను గురించి రాస్తూ ఓ మాట అంటారు మృగమన్న పదం వాడితే తిరగబడతాయేమో మృగాలు.. ఉరి కొయ్య కూడా మరణిస్తుందేమో/వాడి దేహాన్ని మోసిన పాపానికి… ఈ పదాలు  చదివి … అలాంటి పాపపు ఆలోచనలు ఉన్న వారిలో కొంతైనా మార్పు వస్తుందేమో…
‘మబ్బుల్లో దాగిన /నా చందమామకి రాఖీ శుభాకాంక్షలు’ ..ఈ కవిత తన తమ్ముడి స్మృతి కవిత.. చదువుతుంటే కళ్ళు చెమ్మగిల్లుతాయి.
‘ప్రేమా నీకు వందనం కవితా శీర్షిక వినగానే మనసులో ఓ యవ్వనపు ఝరి కదలాడుతుందీ ఎవరిలోనైనా.. కానీ  ఈ కవిత చదివిన తర్వాత ప్రేమంటే అద్వైతం అనే గొప్ప భావన మలయజ వీచికలా మనసును ఆనందంగా చుట్టుకుంటుంది.
వానంటే సంబురపడని ఆబాల గోపాలం ఉంటారా..ఈ వాన ఎలాంటిదంటే ‘ఇంద్ర ధనువు చేతికొచ్చిన సంబరం’.. పొలమారిన జ్ఞాపకాలతో మనసంతా తడవడమే…
బాల్యాన్ని కాగితప్పడవలోకి మళ్ళీ ఒంపేసుకోవడమేగా..
వానంటే వయారాల వేకువ..
వానంటే సందె పొద్దుతో చీకటి చేసే కువకువ… ఇది చదివిన తర్వాత మనసు ఇలాంటి వానలో తడిచి పులకరించకుండా వుంటుందా… ఇందులో ఇలాంటి ఎన్నో కవితలు ఉన్నాయి. మనసును చినుకు తాకిన పుడమిలా  పులకింప చేస్తాయవి.
‘అడవంటే అమ్మే ‘కవితలో అడవిని గురించి రాసిన అద్భుతమైన ఈ పంక్తులు కవయిత్రి రచనా శైలికి అద్దం పడతాయి’ పచ్చని చీరకట్టి నట్టింట్లో నడిచే అడవి కదా అమ్మ….
మనిషి పుడుతూనే ఊయలై / పోయాక కాల్చే కట్టె అయి/అనుక్షణం తోడుండే జనని కదా అడవి” అడవికి మనిషికి ఉన్న అవినాభావ సంబంధాన్ని వ్యక్తీకరిస్తూ.. అందుకే అడవిని కాపాడుకుందాం. యురేనియం తొవ్వకాలను నిషేధిద్దాం అంటూ అందమైన అడవిని ప్రకృతిని కాపాడుకునే బాధ్యత ను గుర్తు చేస్తారు.
చీర కట్టులోని అందాల వర్ణన చదువుతుంటే మన భారతీయ సంస్కృతి గొప్ప తనం మరొకసారి గుర్తుకొస్తుంది..’ఎంత మాతృత్వమో ఆ చీర కొంగులో’..
అమ్మ చీర కొంగులో తీపిదనం/ పాప దోబూచులాటల ఆనందం’ .. గుండె లోని వానితో కొంగు ముళ్ళు/ గుండె ఆగేంత వరకు వానికవి తీపి సంకెళ్ళు.. ఇలా చీరను వర్ణిస్తూ ..అదే కదా మన సంప్రదాయపు సొగసుదనమని… ఇచ్చిన ముక్తాయింపు బాగుంది.
 ఈ కవితా సంపుటి పేరుతో ఉన్న కవిత చదివినప్పుడు కళ్ళు తడవకుండా ఉండవు.. ఈ అసమాన అసమతుల్య వివక్షతా సమాజంలో  చేసిన చీకటి తప్పుల ఫలాలు
 అనాధలై మన కళ్ళ ముందు కనబడుతుంటే దయార్ద్ర హృదయం కలుక్కుమనక మానదు. ‘ నేస్తమా..
వసివాడిన పువ్వుల్లాంటి / అనాధ బాలలను ఎపుడైనా చూశావా…
‘ సమాజం ముందు ఖాళీ విస్తరిలా/ జవాబు కోరే ప్రశ్నలుగా/ ఎలా దరిశనమిస్తారో.. అంటూ చదివే పాఠకులకు కర్తవ్య బోధ చేస్తారిలా..’ నీ మనసును ఏదైనా తడి స్పర్శిస్తే/ చినుకు తాకిన నేలలా పరిమళించు’/నిదురించిన మానవత్వాన్ని/ మరీ మరీ తట్టి లేపు… ‘దేశాన్ని ప్రేమించడమంటే  ఇదే కదా… చక్కని ముగింపుతో గొప్ప సందేశం ఇచ్చారు.
“సూరీనికో ప్రేమ లేఖ” చదువుతుంటే కవయిత్రిలో ఓ చిలిపి దనం,  కొంటెతనం కనిపించి పెదవులపై ఓ దరహాస చంద్రిక విరుస్తుంది.
‘రేయి ముసుగులో ఉన్న లోకాన్ని/ అల్లరిగా గిల్లేటి రాలుగాయివి నీవు..’ ఉలికిపడి జగమంతా/ పరుగులు పెడుతుంటే/ పగలబడి నవ్వుతూ/ సెగలు పుట్టిస్తుంటావు.. లోపాలు కినుకగా ఎత్తి చూపుతూ .. అంతలోనే అంతులేని ప్రేమతో లాలిస్తూ’ సందె పొద్దుకేమో చంటి పిల్లాడవుతావు/ పడమటి కొండల్లో గుక్క పట్టి ఏడ్చేవు…
అందుకో సూరీడా సొగసైన నా లేఖ/ మాపటేళంతా నువ్వు మత్తుగా చదువుకో..
తొలి జాముకంతా నను అందంగా చేరుకో’ మని ప్రియురాలు కమలం సూర్యునికి రాసిన లేఖలా అనిపించింది..  వెచ్చని తడి’ కవిత కంటతడి పెట్టిస్తుంది మన దేశమాత రక్షణ కోసం అసువులు బాస్తున్న సైనికుల కవిత చదువుతుంటే.. అందుకే ఇలాంటి యుద్దాలు వద్దు ప్రపంచ శాంతి కావాలంటారు.
ఇంకా ఇందులో ఆహ్లాదంగా చదివించే కవితలు కొన్ని,ఆలోచన కలిగించేవి కొన్ని , ప్రముఖుల గొప్పతనాన్ని శ్లాఘిస్తూ కొన్ని ..మూస భావనలతో కూడిన కవితలకు తావు ఇవ్వకుండా వైవిధ్యమైన అంశాలతో రాసిన కవితలు బాగున్నాయి.’ధీర వనిత ఇందిరాగాంధీ.. విశ్వకవి రవీంద్రునుకి అక్షర కుసుమాంజలి, శ్రీ శ్రీ, గిడుగు లాంటి  వారి గురించి, సైనికుల త్యాగాలు, “తెలుగంటే వెలుగు’ అని తెలుగు భాష సౌరభాన్ని, తెలుగు జాతి నాదని సగౌరవంగా ఎలుగెత్తి వినిపించ మంటారు. తానొక స్త్రీ గా  ఆధిపత్య సమాజంలో పుట్టడానికి, బతకడానికి నోచుకోకుండా గర్భంలోనే  ఛిద్రమవుతున్న ఆడపిల్లల గురించిన కవితలు చదువుతుంటే మనసు ద్రవిస్తుంది. ‘ఆమె కలం’ శీర్షిక తో రాసిన కవితలో ‘ ఏ తీపి కలలు ముద్దాడాయో/ఆమె పెదవులపై/జాబిలి నవ్వులు జావళీలు పాడాయి… ‘ఏ భావాలు మదిని హత్తుకున్నాయో/ అమృతాన్ని కురిపిస్తోంది.. కవిత్వంలో ప్రేమొక అద్వైతమై… ‘నింగి నుండి జారిన చినుకు/ నేలను ముద్దాడిన వేళ/ పరవశించదా నేల/ పరిమళాల వాగై.. స్పందించే మనసెపుడూ చినుకు తాకిన నేలే.. పరిమళిస్తూ..పరవశిస్తూ..
ఈ పంక్తులు చదివితే కవయిత్రి మనసును చదివినట్టే.. 
తొలి కవితా సంపుటి అయినా చదువరులను ఒప్పించి మెప్పించే పరిణితి కలిగిన కవితలు ఈ సంపుటిలో ఎన్నో  ఉన్నాయి. భావుకత సున్నితత్వం కలిగిన కవయిత్రి శాంతి కృష్ణ గారి కలం నుండి మరెన్నో కవితలు జాలువారాలనీ మరో కవితా సంపుటి కోసం ఆత్మీయ నేస్తంగా ఎదురు చూస్తూ.. చక్కని చిక్కని అంశాలతో కూడిన కవితా సంపుటి ‘చినుకు తాకిన నేల ‘ పాఠకుల మనసులను తప్పకుండా ఆకట్టుకుంటుందని చెబుతూ కవయిత్రి శాంతి కృష్ణ గారికి మరోసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
 
సమీక్షా వ్యాసం
పుస్తకం పేరు: చినుకు తాకిన నేల (కవిత్వం)
కవయిత్రి: శాంతి కృష్ణ
ప్రచురించిన సంవత్సరం2020
వెల:120/రూ

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.