మా కథ 

రచన: దొమితిలా చుంగారా 

అనువాదం: ఎన్. వేణుగోపాల్ 

మధ్యాహ్నం మూడింటికి వాళ్ళు నన్ను వాంగ్మూలం ఇవ్వడం కోసం పిలిపించారు. ఇక అక్కడ ఇంటరాగేషన్లో నన్ను ఏడిపించడం కోసం విపరీతంగా తిట్టారు.

“గెరిల్లాలకు సాయపడతావు గదూ. ఇక చూసుకో” అంటూ నన్ను ఘోరంగా అవమానించారు. నేను తట్టుకోలేకపోయాను. భయపడ్డాను. పాప ఏడవడం మొదలు పెట్టింది. నేను “మీరు దేనిగురించి మాట్లాడుతున్నారో నాకేమీ తెలియదండి, నిజంగా నాకేమీ తెలియదు” అన్నాను. ఆ అధికారి చాల ఉద్రేకపడిపోయి గావుకేకలు పెట్టడం మొదలెట్టాడు. “మనను మోసం చేయాలని ప్రయత్నిస్తోంది. నేను దీన్ని చం పేయకముందే బయటికి తీసుకెళ్ళిపొండి” అన్నాడు.

నేనారోజంతా ఏమీ తినలేదు. నాతో పాటు కొట్లో ఉన్న యువతి పాపకు తినడానికి ఒక బ్రెడ్ ముక్క ఇచ్చింది.

వాళ్ళు నన్ను మళ్ళీ మర్నాడు తీసుకెళ్లి అవే ప్రశ్నలు పదే పదే అడిగారు. వాళ్ళు నా ఫొటోలు తీసుకున్నారు. నా కళ్ళకు గంతలు కట్టి ఎక్కడో పై అంతస్తులోకి తీసుకెళ్ళారు. అక్కడ నన్నొక గదిలోకి తీసుకెళ్ళి గంతలు విప్పారు. ఎదురుగా, ఒక అమెరికన్ జెండా, బొలీవియన్ జెండా పక్కపక్కనే ఎగురుతున్న దృశ్యం కనిపించింది. ఆ జెండాల పక్కనే పటంలో రెండు చేతులు కలిపి ఉండి వాటికింద ‘ప్రగతి కోసం స్నేహం’ అనే మాటలు రాసి ఉన్నాయి. గదంతా నీలంరంగు వేయబడి ఉంది. ఆ గదికి తలు పెక్కడ ఉందో తెలియకుండా ఉంది. సొరుగు నిండా చాలా చాలా రబ్బర్ ముద్రలున్నాయి.

వాళ్ళు నన్నక్కడ కూచోబెట్టి మా నాన్న ఫొటో చూపించారు. పేదరికంవల్ల డబ్బు అవసరం కొద్దీ ఈ రాజకీయాల్లో దిగి ఉంటానని సానుభూతి ప్రకటించారు. నాతో లెఫ్టినెంట్ “ఈ విదేశీయులు నీ కోసం చూస్తున్నారు. బొలీవియన్ ప్రభుత్వమేమో నీ మీద కఠిన చర్యలు తీసుకోదలచుకుంది. ఐనా నువు మాకు సాయపడేటట్టయితే ప్రభుత్వం నీకు సాయపడుతుంది. అలా నువు నీ పిల్లల్నీ, భర్తనీ, నిన్నూ కాపాడుకోగలుగుతావు” అని చెప్పాడు.

సైగ్లో-20లో ఉన్నప్పుడే సిఐఎ గురించి విని ఉన్నాను గనుక, కొన్ని సినిమాల్లో ఈ గూఢచార కార్యకలాపాలు చూసి ఉన్నాను గనుక ఏం జరగబోతున్నదో నాకు కొద్దిగా అర్థమైంది. తర్వాత వాళ్లు నాతో “మేం నీకు సాయపడతాం. నీ పిల్లలు విదేశాల్లో చదువుకోవచ్చు…” అని మొదలెట్టారు.

ఏం కావాలో ఒక్క మాటలో చెప్పమని నేను వాళ్ళను అడిగాను.

గెరిల్లాలతో సంబంధాలు పెట్టుకున్న వాళ్లెవరో చెప్పమనీ, వాళ్ల ఆయుధాలెక్కడున్నాయో చెప్పమనీ, అలాంటివి మరెన్నో ప్రశ్నలడిగారు.

“ఈ ప్రశ్నలన్నీ నన్నడగడానికి మీరెవరు? నాకేమన్నా యూనియన్ సమస్యలో రాజకీయ సమస్యలో ఉంటే తీర్చడానికి ప్రభుత్వం ఉంది. నిజానికి నేనే మిమ్మల్ని ఒక ప్రశ్న అడగవలసి ఉంది. మీరెవరు? మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? నేను అచ్చమైన బొలీవియన్ ను. అమెరికన్ ను కాదు” అన్నాను.

వాళ్ళప్పుడు ఇంగ్లీషులో మంతనాలాడుకున్నారు. బయటికి గంట కొట్టి నా పుట్టుపూర్వోత్తరాలు రాసి ఉన్న కాగితాలు తెప్పించారు.

“నువు బొలీవియన్ అయినందుకు గర్వించడం మాకు చాల సంతోషంగా ఉంది. చాల బాగుంది. కాని నువు సంబంధాలు పెట్టుకున్న విదేశీయులు మంచి వాళ్ళు కాదు. విదేశీయులను ఇంతగా అసహ్యించుకోవాలని నీకు ఉద్బోధించిన వాళ్ళు ఏం చేస్తున్నారు? విదేశీయులమైన మేం మీకోసం ఎన్ని పనులు చేస్తున్నామో చూడు. సైగ్లో-20లో బడి పెట్ట లేదా? అన్ సియాలో బడి పెట్టలేదా? గని కార్మికుల పిల్లల కోసమే ప్రత్యేకంగా బళ్ళు తెరిచామే! ఇటు చూడు ‘ప్రగతి కోసమే స్నేహం’ – అంతే – జరిగే ప్రతీదీ అందుకోసమే ఇదంతా మా చలవే కాదూ? పోనీ నువు చెప్పు – బొలీవియా కోసం క్యూబా చేసిందేమిటి? చైనా ఏం చేసింది? వాళ్ళు కనీసం ఒక్క బడి అయినా పెట్టారా? లేదే? వాళ్ళు మిమ్మల్ని బానిసలు చేయదలచుకున్నారసలు” అన్నాడు.

“నేను మీ ప్రశ్నలకు ఒక్కదానికీ జవాబు చెప్పదలచు కోలేదు” అన్నాను నేను. లెఫ్టినెంట్ పడీ పడీ నవ్వి పరిస్థితిని నేను చేతులారా చెడగొట్టుకుంటున్నా నన్నాడు.

వాళ్ళు నన్ను అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చారు. ఏజంట్లు నన్నీసారి తోసుకు రాలేదు. భుజం పట్టుకొని నడిపించుకొచ్చారు. కళ్ళకు గంతలు కట్టేసి మళ్ళీ నా కొట్టులోకి తీసుకెళ్లారు. .

రెండు గంటలు పోయాక ఆ ఏజెంట్లు చాల వినయంగా దుప్పట్లూ ఆహారమూ పట్టుకు వచ్చారు. “నువు బొలీవియన్ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకుంటున్నందుకు క్వింటానిలా గారు నిన్ను అభినందిస్తున్నారు” అని వాళ్ళు నాకు చెప్పారు. క్వింటానిలా అంటే డి.ఐ.సి. పెద్దల్లో ఒకడు. వాడు సి.ఐ.ఎ. ఏజెంటు. .

నేను ఆ ఆహారాన్ని నమ్మలేదు. పాపమాత్రం ఆకలితో మొత్తం తినేసింది.

గదిలో ఇంకో వైపున ఉన్న విదేశీ యువతి నా దగ్గరికొచ్చి మాటలు కలిపింది. నేను చాల మొరటుగా, అయిష్టంగా బదులు పలికాను. ‘నన్ను విసిగించకు’ అని కూడా మొరటుగా చెప్పాను. ఆమె నవ్వి నా అనుమానాన్ని అర్థం చేసుకున్నానన్నది. తనది’ బ్రెజిల్ అనీ, తనకక్కడ మరణశిక్ష పడిందనీ, అక్కడి కామ్రేడ్స్ సాయంతో తప్పించుకొని ఉరుగ్వే వెళ్లామని రహస్యంగా బొలీవియా చేరాననీ వీళ్లిక్కడ గెరిల్లా అనుకొని అరెస్టు చేశారనీ చెప్పింది. వీళ్ళు ఆమెను మళ్ళీ సరిహద్దులోకి తీసుకెళ్ళి వదిలి పెడతా మంటున్నారట. ఆమె తన తరఫున న్యాయవాదిని కూడా పెట్టుకుంది.

నేనామె చెప్పిన వాటికేమీ జవాబివ్వలేదు. “పాప చాల ముద్దుగా ఉంది” అందామె. “నువు ఒంటరిగా లేవు. గని కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఏమీ గాభరా పడకు” అంది. ఆ తర్వాత కూడా ఎన్నో సార్లు ఆమె నాతోపాటే ఉన్నానని చూపు కోవడానికి ఎంతో ప్రయత్నించింది.

ఏజెంట్లు వచ్చి బెదిరించినప్పుడల్లా నేను ఏజెంట్లు స్త్రీల పట్ల ఎట్లా ప్రవర్తిస్తారో విని ఉన్న విషయాలన్నీ ఏకరువు పెట్టేదాన్ని – రేప్ కూడా చేస్తారని విన్నానని చెప్పేదాన్ని. “ఇక ఇప్పుడు రుజువు కూడా చూస్తున్నాను. కాని నేను సైగ్లో-20కి వెళ్లగానే మీరిక్కడ చేసిన దుర్మార్గం అందరికీ చెప్పేస్తాను. మీరే గనుక క్రిస్టియన్ పార్టీ వాళ్ళయితే మీరు ఈ పాపాలన్నిటికీ దేవుడికే జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది” అనేదాన్ని.

బారియెంటోస్ అధికార పార్టీ ‘ది పాపులర్ క్రిస్టియన్ మూవ్ మెంట్’. అందుకనే నేను వాళ్లతో అలా అంటుండేదాన్ని. కాని ఆ తర్వాత పరిస్థితి నేనే చెడగొట్టు కుంటున్నానా అని భయం వేసేది.

నాకు బయటి నుంచి ఏ సమాచారమూ అందకుండా అయిపోయింది. బైటి విషయాలు ఒక్క ముక్క కూడా తెలియడం లేదు. ఎప్పుడో ఓ సారి నా వకీలు వచ్చి నప్పుడు చెప్పే సంగతులు తప్ప నాకు మరేమీ తెలిసేవి కావు.

ఒకరోజు ఒక ఏజెంటు నా దగ్గరికొచ్చి తాను ప్రభుత్వాన్ని సమర్థించనని చెప్పాడు. “నాకు ముగ్గురు చిన్నారి పిల్లలున్నారు గనుక ఈ కొలువు చెయ్యాల్సి వస్తోంది” అన్నాడాయన. ఆయన తన చిన్న కూతురి ప్యాంట్ల జత ఒకటి తీసుకొచ్చి నాకిచ్చాడు. నేను అవి నా కూతురి కోసమని తీసుకున్నాను.

“నేను రాత్రి డ్యూటీమీద మంత్రిత్వ శాఖ కార్యాలయం ముందు ఉన్నాను. అక్కడ నేలమాళిగ గది ఒకటి ఉంది. మామూలుగా ఆ గదిలో నేరస్తుల్ని ఉంచుతారు. రాత్రి మాత్రం అక్కడినుంచి నాకు పిల్లల ఏడుపులు వినిపించాయి. సంగతేమిటని నేను తోటివాళ్ళనడిగాను. వాళ్ళలో చాలా క్రూరమైన వాడొకడు “సైగ్లో-20 కమ్యూనిస్టు ఆడదిలేదూ – దాని పిల్లల్ని అక్కడ పడేశారు అన్నాడు. నేనిక వాళ్ళను చూడ్డానికి వెళ్ళాను” అని ఆ ఏజెంటు సరిగ్గా నా పిల్లలందరి పోలికలూ చెప్పాడు.

“ఐతే వాళ్ళనేం చేస్తారు?” అని నేను భయంగా అడిగాను.

“ఈ సర్కారు అట్లా ఉంది. వాళ్ళకు తిండికూడ పెట్టడం లేదు. అందుకనే నేను నీకు సాయపడదామనుకుంటున్నాను. అయితే ఈ విషయం మనిద్దరి మధ్యా మాత్రమే రహస్యంగా ఉండిపోవాలి. నువ్వెప్పుడైనా మైనర్స్ కౌన్సిల్ గురించి విన్నావా?” అని అడిగాడు. విన్నానన్నాను నేను.

“సరే నేను వాళ్ళకు ఉత్తరం రాస్తాను. నువు విడుదలయ్యేవరకూ వాళ్ళు నీ పిల్లల బాధ్యత తీసుకుంటారు.”

“అన్నా – నీకు పుణ్యముంటుంది. దయచేసి నా కోసం ఆ పని చెయి” అన్నాను.

“ఇప్పుడు పిల్లల్ని కాపాడుకోవడమే నీకు ముఖ్యం” అని ఆయన వెళ్ళిపోయాడు.

నేనెంతగానో ఆందోళన పడ్డాను. ఏజెంట్ తో నాకు జరిగిన సంభాషణంతా బ్రెజిలియన్ యువతికి చెప్పాను. ఆ రోజంతా ఏడుస్తూనే ఉన్నాను. ఆమె నాతో కోపంగా. “విను – బ్రెజిల్ లో మేం నీ గురించీ, గృహిణుల సంఘం గురించి ఎంతో విని ఉన్నాం. నువు చాల సాహసివై ఉంటావని నేను అనుకున్నాను. ఇప్పుడు నేను బైటికి వెళ్లాక సైగ్లో-20 స్త్రీతో కలిసి ఉన్నానని చెప్తే మా వాళ్ళెంతో ఆశ్చర్యపోతారు. నేను వాళ్ళకింకా ఏం చెప్తానో తెలుసా? ఏజెంట్లు సైగ్లో-20 స్త్రీతో చెప్పిన మొదటి అబద్దానికే ఆవిడ కడవలకొద్దీ ఏడ్చేసిందని కూడా చెప్తాను” అంది.

వాళ్ళు నా పిల్లలకేం చేస్తున్నారో అని నేను చాల ఆవేదన చెందాను. ఇలాంటి పరిస్థితి — ఎదుర్కోవడం నా జీవితంలో అదే మొదటిసారి. నా పిల్లలు ఒక చీకటి కొట్లో అనారోగ్యంతో పడి ఉండి, తిండిలేక, చలికి కప్పుకోవడానికేమీ లేక ఉన్నారని తలచుకుంటేనే నాకెంతో భయం వేసింది. వాళ్లు ‘అమ్మా! నాన్నా’ అని అరుస్తూ ఏడుస్తున్నారని కూడా ఆ ఏజెంట్ నాతో చెప్పాడు. ఇది తలచుకున్నప్పుడల్లా నేను గుండె కోత అనుభవించాను. నేను విపరీతమైన నిస్పృహతో అంతులేని శోకాలు పెట్టాను.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.