యుద్ధం ఒక గుండె కోత-8

(దీర్ఘ కవిత)

-శీలా సుభద్రా దేవి

యుద్ధమేఘం కింద అనాధ పసిబాలలు

విచ్చుకోలేని గిడసబారిన మొగ్గలు!

శాంతిపావురం కోసం ఆశగా వారు

ఆకాశానికి అతికించిన చూపుల పూరేకులు

అలసిపోయి నేలరాలిపోతున్నాయి

ఆర్తనాదాల్ని కంఠంలోనే బంధించి

డేగరెక్కలు విసురుతోన్న భయ వీచికల్ని కప్పుకొని

కలుగుల్లో ఎలకలై బిక్కచచ్చిపోతూ

పసితనపు ఆహ్లాదాన్ని

యుద్ధంముళ్ళకంపపై ఆరేసుకొని

చీలికలువాలికలు అయిపోతోన్న బాల్యాన్ని

తన గర్భంలో దాచుకొనేందుకు

యుద్ధభూమే మాతృమూర్తి అయిపోతుందేమో!

అక్షరాలు దిద్దాల్సిన వయసులో

అమ్ములపొది లౌతున్నారు

ఆర్తిగా అమ్మఒడిలో

తలదాచుకోవాల్సిన వయసులో

మృత్యువుని కౌగిలించుకోటానికి

ముందుకు ఉరుకుతున్నారు

ఆయుధాలతో బిళ్ళంగోడీ ఆటలు

రాళ్ళగుట్టల చాటున బాంబులతో

దోబూచుల సయ్యాటలు వాళ్ళ నిత్యకృత్యాలైపోయాయి

అనాధల ఆర్తనాదాలు

ముడివేసిన గొంతుకలోనే ఆగిపోతున్నాయ్‌

పిలిచినా పలకటానికి అమ్మ

ఏ పరదామాటున మలిగిపోయిందో

స్పర్శతో ఉపశమింప చేయటానికైనా

నరికిన తల్లివేళ్ళు

ఏ భూగర్భంలో కలిసిపోయాయో!

ఆత్మీయత ఏ శిథిలాల కింద

సమాధి అయిపోయిందో!

అక్కడ తల్లీ, చెల్లీ కూడా

నిత్య అపరిచితులే

అనురాగ చూపుల ఆలింగనాలు సైతం

పరదా అడుగున వెలిసిపోయిన

అపురూప వరాలే

*   *   *

ప్రతీ యింటిమీదా

యుద్ధరాగాలు జండాల్లా ఎగురుతున్నాయ్‌

మనసు మైదానం నిండా

ముళ్ళచెట్లు పెరిగిపోయాయి

అప్పుడప్పుడు సానుభూతి కన్నీటి బిందువులు

ఒకటి రెండు చిలికి గుండె ఎడారిని తడపలేక

నిస్సహాయంగా ఇంకిపోతున్నాయ్‌

తప్పొప్పుల పట్టికలు

వేళ్ళ మధ్యలోనే లెక్కతేలక ఆగిపోతున్నాయ్‌

కుప్పకూలుతున్న మానవీయ విలువలు

పెదాల చాటునే మలిగిపోతున్నాయ్‌

మృత్యుచ్ఛాయ దేహాల్ని ఆవరిస్తోంది

మహాత్ముడెవరైనా

ఏ గ్రహంనుండో రాల్తాడేమోనని

ఊపిరి బిగబెట్టి చూపుల టెలిస్కోపుని సారిస్తారు

పక్షి నీడకూడా బాంబర్‌ విమానమై

శరీరాల గుండా దూసుకుపోతోంది

యుద్ధరంగానికి పయనమైన కుమారుల్ని

కళ్లారా చూసుకోడానికి కూడా భయం

కన్నీటి పొరని చీల్చుకొని ఆశీస్సులు వర్షమౌతాయి

తిరిగి చూడగలనో లేనోనని

గుండె కెమేరాతో చిత్రాన్ని తీసి పదిలపరుచుకుంటోంది తల్లి

వీరమరణాలకి యుద్ధరంగమే అక్కరలేదు

ఎండకన్నెరగని జనానాలో దాగినా

మృత్యువు దారి తప్పైనా

వంటింట్లోకో, నట్టింట్లోకో

కాలసర్పమై వచ్చి కాటువేస్తుంది

ప్రపంచ యుద్ధవేదిక

యిప్పుడు డ్రాయింగు రూములోకే వచ్చేసింది

ఊరు పొలిమేరలలో పేలిన ఫిరంగి

పొత్తిళ్ళలో కలగంటూ నవ్వుకుంటున్న పసిపాప ప్రాణాల్ని

డేగలా కాళ్ళతో తన్నుకుంటూ ఎగరేసుకుపోతోంది

యుద్ధరంగంలో నేలరాలిన కొడుకు కోసమో

అన్నెం పున్నెం ఎరగని పసిపాప ప్రాణం కోసమో

అర్ధంకాని వీరమాత కన్నీళ్ళు మేఘమై

శ్మశానమైపోతున్న దేశంమీద కురుస్తాయి

చావగా మిగిలిన పిల్లలకు

తిండికోసం వెతుకులాట తప్పదు

పైనుండి పిడుగులా రాలిన ఆహారపొట్లం విప్పి

ఇదిగిదిగో

ఇప్పుడే విప్పి తినిపిస్తాను

ఏడవకండేడవకండి

అయ్యయ్యో ఇదేమిటి

ఈ రక్తంకూడు ఎవరికి పెట్టాలి?!

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.