ఓటమి దీపం

-నారాయణ స్వామి వెంకట యోగి

ఎక్కడో దీపం పెట్టి 
మరెక్కడో వెలుతురుని 
కోరుకోగలమా 
 
ఎక్కడో, ఎప్పుడో 
గెలుస్తామేమోనన్న 
ఆశ ఉంటె 
యుద్ధం మరో చోట 
ఎందుకు చెయ్యడం
 
ఎందుకు 
ప్రతిసారీ చీకటి లోకి 
అజ్ఞాన సుఖంతో కూరుకుపోవడం 
 
మనం వెలిగించిన దీపం 
మనని దాటి వెళ్ళకపోవడం 
వెలుతురు తప్పు కాదు కదా 
 
దీపం నీడల్ని కూడా దాటలేని 
మన అడుగుల  తప్పేమో 
అని 
తడుతుందా మనకు ఎప్పటికైనా 
 
ప్రతిసారీ ఓటమీ,
ఓటమిని చూసి ‘మురిసి’ పోవడమేనా 
మనకు గెలుపు లేదా 
లేక 
అసలు గెలవడమే రాదా 
 
గెలిచినా 
గెలుపును నిలుపుకోవడం రాదు 
గనక
ఓటమే నయమా 
 
అందుకే 
మన ప్రయాణం 
ఎప్పుడూ 
గెలుపును ‘ఇతరుల’ పరం చెయ్యడానికో 
 
లేదూ 
లక్ష్యానికి సగంలో ఆగిపోవడానికి 
మాత్రమేనా 
 
ఎవరు ఎక్కడ ఎందుకు 
మిగిలిపోతారో 
 
ఎవరు ఎవరితో ఎక్కడిదాకా 
ప్రయాణిస్తారో
 
ఈ చిమ్మచీకట్లో 
ఏ చరిత్ర లో దొరుకుతుంది 
 
ఇంతకీ 
ప్రయాణించేది మనమా 
మనతో కాలమా 
లేక 
స్థలకాలాలు లేని శూన్యమా

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.