అనుసృజన

కవితలు చనిపోతూ ఉండటం

మూలం: సోనీ పాండే

అనువాదం: ఆర్. శాంత సుందరి

ఇప్పుడే వచ్చింది
ఒక కవిత
కొన్ని పదాలు ఉప్పొంగాయి
కొన్ని భావ తరంగాలు ఎగసిపడ్డాయి
వేళ్ళు వణుకుతూ తహతహలాడసాగాయి
ఒక కలం దొరికితే
కవిత పుడుతుంది కదా కాగితం మీద అని
అణువణువూ విరుచుకుపడింది
కవిత ఇక మొలకెత్తబోతూ ఉంది
 
ఇంతలో ఒక కరకు గొంతు చెవులకి సోకింది
ఉతకవలసిన బట్టలు అలాగే ఉన్నాయి
మధ్యాహ్నం అయిపోయింది అన్న ధ్యాస ఉందా?
మత్తెక్కిస్తుంది కవిత్వం
రాయటం అనేది ఒక వ్యసనం
గౌరవమైన కుటుంబ స్త్రీలు ఎక్కడైనా అలవరుచుకుంటారా
ఇలాంటి అసభ్యమైన అభిరుచులు…
ఊళ్ళో ఎంతమంది ఆడవాళ్ళకుంది
ఇలాంటి అభిరుచి
అంతే ఈ మాటలు వినిపించగానే-
మూసుకున్నాను కళ్ళు, చెవులూ
అయినా ఆ ఘాటైన విషం పడనే పడింది చెవుల్లో
శవం దగ్గర శోకాలు పెట్టే ఆడవాళ్ళ లాంటిది కవిత
పుట్టకముందే మరణించింది కవిత

*****

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.