జ్ఞాపకాల సందడి-27

-డి.కామేశ్వరి 

తెలుగు సాహిత్యానికి మరో శరాఘాతం , ప్రముఖ ఈనాడు గ్రూపునించి ప్రచురణ  అయ్యే నాలుగు మాసపత్రికలు ఆగిపోవడం ,నిజంగా ఎంత బాధాకరం  ,ఎంతటి దుర్దశ తెలుగు సాహిత్యానికి.

ఈమధ్య ఎందరో సాహితీపరులు కళాకారులూ పోయినపుడు విచారంగా నివాళులు అర్పించినట్టు ఇప్పుడు ఒకో సాహిత్య  పత్రిక ఊపిరి ఆగిపోతుంటే నివాళులు అర్పించాల్సిందేనా నిస్సహాయంగా.

అంతటి ప్రముఖ సంస్థలే పత్రికాభారం మోయలేక వెంటిలేటర్ మీద బతికించే  ప్రయత్నాలు చాలింక ప్రశాంతంగా దాటిపోనీండి అని  మనసురాయిచేసుకుని తమవారికి వెంటిలేటర్ తీయించే స్థితి కనపడుతూంది చూస్తుంటే.

చదివే పాఠకులే కరువవుతే పత్రిక ఎలా నడుస్తుంది , ఓ రచయితా కధ రాస్తే ఎవరు చదివేవారు లేకపోతే ఎవరికోసం రాయాలి అనిపించినట్టు , నష్టాల్లోకూడా ప్రచురించినా చదివేవారు కొనేవారు లేకపోతే ఎవరుమాత్రం ఎన్నాళ్ళు నడపగలరు?

నవ్య లాటి పత్రిక నలభయి వేల సర్కులేషన్ ఉండికూడా ఆపేశారంటే కారణాలు ఏమిటని ఎవరడగాలి. గతకొద్దికాలంగా ఒకో  పాతిక  కనుమరుగవుతూ ఇపుడు కేవలం దినపత్రికలు,  స్వాతిలాటి ఒక వార పత్రిక మిగిలాయంటే తెలుగు భాష, సాహిత్యం  ఎంతటి దుర్దశలో ఉందో  తెలుస్తుంది.

70 ప్రాంతాల్లో నాకు తెలిసి కనీసం పాతిక వార మాసపత్రికలుండేవి. 90 తర్వాత ఒకోటి మాయమయి అరడజను ప్రముఖ పత్రికలూ మాత్రం  మిగిలాయి ఇపుడు అవికూడా కనుమరుగయ్యాయంటే నిజంగానే అశ్రు తర్పణాలు విడవాల్సిందే సాహిత్యాభిమానులు.

రచయితలింకా చాలామంది పాత, కొత్తవారున్నారు మిగిలిన వారేదన్నా  రాస్తే  ప్రచురించడానికి పత్రికలేవి?  రాసిన రచనలేంచేసుకోవాలి, అని రచయితలూ నిస్పృహలో పడి , రాయడం మానేస్తారు. లేదంటే   ఫేసుబుక్లోనో  వాట్సాప్ లోనో పెట్టుకోవాలి ,లేదా వున్న ఆన్లైన్ మ్యాగజిన్ కో పంపాలి.

ఇప్పుడు ఆన్లైన్ లో చదవగలిగే వారి శాతం ఎంత? ఒక పత్రిక సర్కులేషన్  కనీసం పాతికమప్పై వేలన్నా  ఉండేది.  ఆన్లైన్ లో అంత శాతం వుందా? తెలుగు చదివే శాతమే ఎంతో తగ్గిపోయింది. యువత అసలు సాహిత్యంవైపు చూడదు.  అరచేతిలో ఇమిడే సెల్ఫోన్లో మొత్తం ప్రపంచం చూడగలిగిన సౌలభ్యం వున్నప్పుడు వారికీ ఈ కధలు ఎందుకు? చదవాలనుకునే  సీనియర్ సిటిజెన్స్ కి కంప్యూటర్లో చదివే సౌలభ్యం వుంటుందా?  వున్నా పుస్తకంలో చదివిన అనుభూతి దొరుకుతుందా?

అంటే ఇకముందు తెలుగు సాహిత్యం క్రుంగి కృశించి అంతమయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయా? పూర్వం మహారాజుల కాలంలో కళలు , సాహిత్యాలని , పోషించి ముందుతరాలకు అందించారు కనక మనకు రామాయణ భారతభాగవతలు , భగవద్గీతలు , ఓ అన్నమయ్య, త్యాగయ్య,  శ్రీనాధుడు, పోతన, కాళిదాసులు లాటి మహామహులని ఈనాటికీ మనం చదువుకుంటున్నాం.

రేపు భావితరాలకు మనమేం అందిస్తాం? సంగీత సాహిత్య నాట్య కళ లని ఆదరించి,  ప్రోత్సహించి , భద్రపరచాల్సిన ప్రభుత్వాలు ఎంతసేపు వారి రాజకీయాలు , పదవులపైనా తప్ప ఇలాటివి పట్టించుకోరు.

ఏవో ఒకటో రెండో సాహిత్య సంస్థలు ఏంచేయగలరు ? ఉన్న లైబ్రరీలు  దుస్థితి లో వున్నాయి.  పుస్తకాలూ కొనేందుకు గ్రాంట్స్ వుండవు , వున్నవి భద్రపరిచే స్థలం ఉండదు. ఇంత ఆశ్రద్హ  నిర్లక్ష్యం మధ్య సాహిత్యం బతుకుతుందా , బ్రిటిష్ రాజ్య కాలంలో కూడా ఒక తాలూకా అయినా రామచంద్రపురం లాటి చిన్న ఊర్లో కూడా మంచి లైబ్రరీ ఉండేది.  1945 ప్రాంతలోనే  సాహిత్యాభిలాషకి బీజం పడింది అలాటివూర్లోనే .

ఇప్పుడు ఏమాత్రం కూడా లేని దిక్కులేని స్థితిలో వున్నాయి మన గ్రంధాలయాలు . ప్రభుత్వాలు ఇప్పటికైనా మేలుకుని , ఉచిత పంపకాలు తగ్గించి , ఇలాటి వాటిమీద దృష్టి పెట్టకపోతే  కొన్ని ఏళ్ళకి మాట్లాడేభాషగా మిగిలిపోయే ప్రమాదం వుంది.

కనీసం మొత్తం తెలుగు సాహిత్యాన్ని డిజిటల్గా మార్చి భద్రపరిచి ముందుతరాలకు అందించే ప్రయత్నం చేస్తే వున్నా సాహిత్యమేనా మిగులుతుంది. ఇప్పటినించి అకాడమీలకి ఈ పని అప్పగించి   మొత్తం తెలుగు సాహిత్యాన్ని   కంప్యూటర్లలో భద్రపరిస్తే చరిత్రలో తెలుగు భాష మిగులుతుంది.  భాష పోతే జాతి పోతుంది అది మరవకండి.  తెలుగు భాషోద్యమానికి  నడుం కట్టాల్సింది యువత ,  మీ నిర్లక్ష్యంతో భాషకి అంత్యక్రియలు చేయకండి. ఇది అందరి సాహిత్యాభిమానుల తరఫున  నా విన్నపం .

*****

Please follow and like us:

One thought on “జ్ఞాపకాలసందడి -27”

  1. ప్రస్తుత తెలుగు భాష, సాహిత్య, పుస్తకాల పరిస్థితిని చాలా బాగా చెప్పారు కామేశ్వరి గారు. ఆన్లైన్ పుస్తకాలు చదివేవాళ్ళు వున్నారు, కానీ చాలామందికి ఏవి అందుబాటులో వున్నాయో తెలీదు. అన్ని ఆన్లైన్ మాగజీన్ లని ఒక వేదిక మీదకి తేగలిగితే చాలా మంది చదివే అవకాశాలు వున్నాయి అని నేను భావిస్తున్నాను.

Leave a Reply

Your email address will not be published.