చాతకపక్షులు  (భాగం-9)

(తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల)

– నిడదవోలు మాలతి

ఆ రెండుభావాలూ శివరావూ, పరమేశం దృష్టి దాటిపోలేదు. ఆవిడ మనసులో మాట ఇద్దరికీ అర్థం అయింది. అదే వరసలో ఒకరికి సంతృప్తీ, రెండోవారికి అసంతృప్తీ కలిగేయి. అదే కారణంగా మొదటివారు ఆ సంభాషణ పొడిగించడానికీ, రెండోవారు తుంచేయడానికీ తలపడ్డారు. 

“నామాట విను, పరమేశం. ఆడపిల్లకి చదువు అవసరమా కాదా అన్నమాట అటుంచి. ఈరోజుల్లో అబ్బాయిలు కూడా చదువుకున్న అమ్మాయిలనే ఇష్టపడుతున్నారన్న సంగతి మర్చిపోకు. హీనపక్షం బియే డిగ్రీ అయినా వున్న అల్లుడు కావాలని కోరుకుంటావు నువ్వు. ఈరోజుల్లో బియేలేం వేలకి వేలు సంపాదించటంలేదు కదా. అమ్మాయికి కూడా ఓ కాయితం వుంటే చన్నీళ్లకి వేణ్ణీళ్లు తోడుగా వుంటుందని పెళ్లికొడుకులు అనుకుంటున్నారు. అమ్మాయిని పనిలో పెడతారా లేదా అన్నది వాళ్లిష్టం. కానీ అవసరం అయితే ఆదుకోడానికి పనికొస్తుంది కదా. చెరో నాలుగు రాళ్లూ తెచ్చుకుని సుఖపడతారు,” అన్నాడు శివరావు. 

“ఆరుగురు మగబిడ్డల తండ్రివి. ఎన్ని కబుర్లు చెప్పినా నీకే తగును. నలుగురుపిల్లల్ని బియేలూ ఎమ్మేలూ చదివించే స్తోమతు నాకు లేదు. వున్నసంగతి అదీ..”

“మరీ అంత లేమి కబుర్లు చెప్పకు.”

“పోనీ, మీరు తీసుకెళ్లి దగ్గర పెట్టుకు చదివిస్తారేమిటి? అంత గట్టిగా వాదిస్తున్నారు దాని తరఫున వకాల్తా పుచ్చుకుని,” అన్నాడు భానుమూర్తి అమాయకంగా మొహం పెట్టి, ఒక్కొక్క మాటా వొత్తి పలుకుతూ. 

హఠాత్తుగా అనుకోకుండా వచ్చిన ఈ ప్రతిపాదనతో లిప్తపాటు పెద్దలంతా స్థబ్ధులయిపోయేరు. 

“నువ్వు నోరు మూసుకో” పరమేశంగారు తమ్ముడిని కసురుకున్నారు.

“బాగుంది వరస. అయ్యవారూ, మీనెత్తిన తేలుందంటే మీచేత్తోనే తీసెయండి అన్నట్లు” అంది కామాక్షి.

“బాగా చెప్పేవు” అంది బామ్మగారు ఎవరిని ఉద్దేశించో తెలీకుండా.

శివరావు నోట్లో పెట్టుకున్న ముద్ద మింగి, గుక్కెడునీళ్లు తాగి, “బాగా చెప్పేవు, భానూ. అవునయ్యా, నాతో పంపించు. మాయింట్లో వుండి చదువుకుంటుంది.” అన్నారు పరమేశంతో.

“నీకు మరీ వేళాకోళంగా వుందేం?” అన్నారు పరమేశంగారు చిన్నబుచ్చుకుని.

“నేలబోయింది నెత్తిన రాసుకోడం, మీకేందుకు అన్నగారూ” అంది కామాక్షి.

Dec2021శివరావు ఒప్పుకోలేదు. “ఇందులో వేళాకోళమూ లేదు. నెత్తిన రాసుకున్నదీ లేదు. చిన్నవాడయినా భాను చెప్పినమాట సబబే. అసలు నిజానికి ఆమాట నాకే తోచాల్సింది. మీ వదినగారికీ నాకూ కూడా బాలాత్రిపురసుందరిలా కలకల్లాడుతూ ఆడపిల్ల నట్టింట తిరుగుతూ వుంటే చూడాలని ఎంతకాలంగానో కోరిక. ఆ ముచ్చట కూడా తీరుతుంది గీతమ్మతల్లితో.”

“సరేలే, లే. పద చెయ్యి కడుక్కో” అన్నారు పరమేశంగారు ఆ సంభాషణ అక్కడికి తుంచేస్తూ.

ఆయన అభిప్రాయం ఏమిటో ఎవరికీ అంతు బట్టలేదు. 

కామాక్షికి కూతుర్ని పరాయివారింటికి పంపడం ఇష్టంలేకపోయినా పిల్లచదువు కొనసాగుతుంది అనుకుంటే సంతోషంగానే వుంది. 

తానేదో తమాషాకి అన్నమాట వీళ్లందరూ ఇంత సీరియస్ చేసేశారేమిటి అని గాభరా పడుతున్నాడు భానుమూర్తి. 

వెర్రి వెక్కిరించినట్టే వుంది అనుకుంటోంది బామ్మగారు. 

మామయ్యగారింట్లో ఆరుగురు మగపిల్లలమధ్య తనకి రోజులు ఎలా గడుస్తాయో ఊహించడానికి ప్రయత్నిస్తోంది గీత.

మంచంమీద వాలగానే నిద్ర ముంచుకొచ్చేసింది శివరావుగారికి. మర్నాడు ఉదయం ఆయన లేచేవేళకి గీత హిందీక్లాసుకి వెళ్లిపోయింది. భానుమూర్తి ఆఫీసుకి వెళ్లిపోయాడు. పరమేశం చెప్పుల్లో కాళ్లు పెట్టుకు గుమ్మం దిగుతున్నారు. 

“అప్పుడే నీకు టైం అయిపోయిందేమిటి?” అన్నారు శివరావుగారు మంచంమీంచి లేస్తూ. 

“నీకిప్పుడే తొలికోడి కూసింది మరి. సాయంత్రం నేనొచ్చేవరకూ వుంటావు కదూ?” అన్నారాయన.

“ఉంటానులే. మరి గీత నీదగ్గర శలవు పుచ్చుకోకుండా వచ్చేస్తుందా?”

పరమేశం కిందమెట్టుమీద వుంచినకాలు వెనక్కి తీసుకుని, “హాస్యానికన్నావు అనుకున్నాను,” అన్నారు.

శివరావు బాల్యస్నేహితుడిదగ్గరకొచ్చి, మొహంలోకి సూటిగా చూస్తూ, “నిన్న చెప్పేను, మళ్లీ చెపుతున్నాను. ఇందులో హాస్యమేమీ లేదు. మనస్ఫూర్తిగానే అంటున్నాను. నేను గీతని తీసుకెళ్లినందువల్ల ఏదైనా హాని వుందని నువ్వు అనుకుంటే చెప్పు,” అన్నారు. 

“కామాక్షి ఏంవంటుందో,” అన్నారు పరమేశంగారు సందిగ్ధంగా.

“ఆవిడ మాత్రం ఏవంటుందీ? అయినా ఆవిడతో కూడా మాట్లాడే చెప్పు. మీ ఉభయులకీ సమ్మతమైతేనే పంపుదువుగానీ. గుంటూరులో ఆడపిల్లలకాలేజీ మంచి పేరున్న కాలేజీ కూడాను. పెళ్లంటావూ? చూస్తూండు. నాక్కూడా ఎవరైనా తటస్థపడితే చెప్తాను.” 

పరమేశం సరేనన్నట్టు తలూపి మెట్లు దిగి రోడ్డెక్కారు. శివరావు వెనక్కి తిరిగి చూసేసరికి కామాక్షి గుమ్మాన్నానుకుని నిలబడి వుంది. 

“ఊళ్లో కాలేజీ లేదూ చదివించదలుచుకుంటే. మధ్య మీకెందుకు లేనిపోని తద్దినం,” అందావిడ తల్లికుండే అప్రమత్తతతో. నిన్న గీతకిలాగే ఇవాళ ఆవిడకీ ఆరుగురు మొగపిల్లలు మెదిలేరు మనోవీధిలో!

“అయ్యో అదేమిటమ్మా! అలా అంటావు. మాఇంట్లో కళకళ్లాడుతూ మసిలే ఆడపిల్ల లేదని మాఇద్దరికీ కొరతే. పైగా మన గీత మరీ పసిపిల్ల కాదు గదా, తల దువ్వాలి, బట్టలు తొడగాలి అంటూ మథనపడడానికి. మాతో పాటే తింటుంది. కాలేజీకెళ్లి చదువుకుంటుంది.,” అన్నారాయన అభిమానంగా..

“అది బొత్తిగా లోకజ్ఞానం లేని పిల్ల. వదినగారు మాత్రం ఎంతకని కనిపెట్టుకుని వుండగలరు?” అంది మళ్లీ కామాక్షి. ఇప్పుడు ఆవిడ మనసులో లోకంలో మగాళ్లందరూ మెదిలేరు. 

శివరావుకి అర్థం అవడానికి రెండు నిముషాలు పట్టింది. “నీ భయం నాకర్థం అయిందమ్మా. జాగ్రత్తగా చూసుకుంటాం. చెప్తున్నా కదా గీత మీకెంతో మాకూ అంతే.” అని పెరటివేపు రెండడుగులు వేసి, “మీ యిద్దరికీ నమ్మకం కుదిరితేనే పంపించండి” అన్నారు. 

“ఎంతమాట” అంది కామాక్షి వంటింటివేపు నడుస్తూ. 

హిందీ క్లాసునించి తిరిగి వచ్చింతరవాత కామాక్షి గీతని అడిగింది, “శివం మామయ్యగారింట్లో వుండి చదువుకుంటావా?” అని. 

గీత ఈ ప్రస్తావన మొదలయిన దగ్గిర్నుంచీ ఆలోచిస్తూనే వుంది. తలుచుకుంటే గుండెల్లో దడగా వుంది. అనేకరకాల ఆలోచనలతో కుస్తీ పడుతోంది. ఇప్పుడు అమ్మ ప్రశ్నతో, అది దాదాపు ఖాయమేనని తెలిసింతరవాత, అలా జరక్కపోతే బాగుండునని కూడా అనిపించింది కొంచెంసేపు.

“వాళ్లింటికెందుకు వెళ్లడం? ఇక్కడా వుంది కదా ఆడపిల్లల కాలేజీ?” 

“వాళ్లు, వాళ్లు అంటావేమిటి ఎవరో పరాయివాళ్లు అయినట్టు. వాళ్లకీ మనకీ బంధుత్వాలకి మించిన స్నేహం. మూడు తరాలనుంచీ ఎరిగున్నవాళ్లం. వాళ్లిద్దరికీ ఆడపిల్లలంటే ఆపేక్ష. ప్రతి కాన్పుకీ ఆడపిల్ల కావాలని వెయ్యిదణ్ణాలు పెట్టుకునేదావిడ,” అంది కామాక్షి అనునయంగా. 

అసలు నిజంలో అది సగం మాత్రమే అని ఇద్దరికీ తెలుసు. కానీ ఏ ఒక్కరూ బయటపడలేరు. అదొక చేదు నిజం. 

శివరావుగారు ఆరాత్రికి కూడా అక్కడే వుండి మర్నాటికి ప్రయాణం పెట్టుకున్నారు. 

గీత పెట్టెలో బట్టలు సద్దుకుంటుంటే ‘నేనూ వస్తాను’ అంటూ చెల్లీ, తమ్ముడూ ఏడుపు మొదలెట్టేరు. శివరావు చెరో అర్థరూపాయి వాళ్లచేతిలో పెట్టాడు ‘బిస్కెట్లు కొనుక్కోండి’ అని.

* * * * *

(ఇంకా ఉంది)

చిత్రకారుడు: ఆర్లె రాంబాబు

Please follow and like us:

2 thoughts on “చాతకపక్షులు నవల- 9”

Leave a Reply

Your email address will not be published.