“ఇక మారాల్సింది నువ్వే”

పెనుగొండ సరసిజ కవితా సంపుటి పై సమీక్ష

  -గిరి ప్రసాద్ చెలమల్లు

వరంగల్ లో పుట్టిన సరసిజ పెనుగొండ గారు తాను పుట్టిన నేల ఆవేశాన్ని ఇక మారాల్సింది నువ్వే కవితా సంపుటి లోని తన కవితల్లో పెల్లుబికించారు. కవితా సంపుటి లో స్త్రీ వాదాన్ని , ప్రశ్నించే తత్వాన్ని, వలసల్లోని బాధని, రైతు వ్యధని చిత్రీకరిస్తూ లోతైన పదాలను వాడుతూ సామాన్య పాఠకులకు చేరువయ్యేల వ్రాసారు. కవితా వస్తువుల ఎంపికలో తనదైన అభిమతాన్ని పాటిస్తూ వైవిధ్యాన్ని కనబరిచారు. సమకాలీన సమాజంలోని  అంశాలను మానసిక సంఘర్షణలను కొరడాలతో ఝుళిపించారు.
  మళ్ళీ మళ్ళీ చూస్తూ కవితలో ” సమాధి నుండి నిజం గళం నిశ్శబ్ద ఆర్త నాదాలతో నిస్తేజమై ఈ ఖర్మ భూమిలో నా శీలం నిత్యకర్మ కాండలతో కాలిపోతూనేవుంటుంది అని ఆవేదన ను వ్యక్తం చేస్తూ పితృ స్వామ్య వ్యవస్థ లోని లోటుపాట్లను ఎత్తి చూపారు. శీలం పదమే తప్పు అనే విషయాన్ని స్పష్టం చేసారు.
  ది అన్ టయర్డ్ కవితలో ” మూల్యమాశించని శాశ్వత కార్మికై తరతరాల మానవ మనుగడ కు అవిశ్రాంత యోధురాలవుతూనే వుంది” ఆమె శ్రమ తత్వాన్ని తనదైన శైలిలో విశదీకరించారు.  “మార్పు కై ఆశల కలాన్ని ఎర్ర సిరా తో నింపుతూనే వుంది” అంటూ మార్పు ఎరుపు తోనే సాధ్యమనే సంకేతాన్ని ఇచ్చింది. ఆమె “పూడ్చ బడ్డ మాతృ స్వామ్య వ్యవస్థ పునర్ని ర్మాణం కై కొత్త ఇటుకలు ఒక్కొక్కటి గా పేర్చుతూ వుంది” అని కవయిత్రి మాతృ స్వామ్య వ్యవస్థ కోసం పడ్డ ఆరాటం పోరాటం అగుపించింది. కవితల్లో తెలంగాణా మాండలికం అక్కడక్కడ కనిపించినా అందరికీ అర్థమయ్యే విధంగా వుంది. ఒక పదానికి వివరణ ఇవ్వడం సరైంది గా తోచింది. పాఠకులకు చేరువ కావాలనే జిజ్ఞాస కాన వచ్చింది.
 శీలమంటే కవితలో “అన్ని భాగాల్లో రక్తస్రావమే శీలమంటే ఆడది అవును ఆడదే “అని గద్దించిన తీరు శ్లాఘనీయం. రక్తం కవిత లో “ఆమె పాలు రక్తం ఆమె చెమట రక్తం ఆమె రెక్కలు రక్తమై నీకు అన్నమౌతుంది. రక్తపు గుడ్డు కై ధార పోసే రక్తం విలువ ఎరుగాలనే తాపత్రయం కవయిత్రి లో వ్యక్తమైంది.
  టచ్ మి ( నాట్) కవితలో శృంగార కవులు ఆమె అంగాల వర్ణన  లో వాడుతున్న దొండ పండ్లను.. ..శంఖం.. తమలపాకులు.. అరటిబోదెలు .. నిశిత పరిశీలన తో త్యజించాలనే హెచ్చరిక జారీ చేసారు. 
 మనిషి గా చూడు  కవితలో చెట్టు,  ప్రతిమ, దేశం, నదులకు ఆమె పేరు ను వాడుతూ  ఆమె ను పూజించినట్లు నటిస్తున్న సమాజంపై చెళ్లున చరిచి
అమ్మలేని కాలమంటూ వస్తే పూరించాల్సింది ఇక మృత్యు శంఖమే అని పురుషుడి కి తన స్థానాన్ని చెబుతూ మనుగడయే ప్రశ్నార్ధకం అనే విషయాన్ని గుర్తు చేసారు.
 
కాలచక్రం లో “నీవే చుక్కానివిప్పుడు ఈ అస్తవ్యస్త సమాజ నావ ప్రయాణానికి..” వర్తమాన కాల పరిస్థితి ని ఆవిష్కరించారు.”అందం తో నీకేం పని రా ! రంధ్రం తో కదా!! అని సూటిగా స్పష్టంగా కామ పిశాచులను ప్రశ్నిస్తూ పసిపిల్ల నుండి కాటికి కాళ్ళు చాపిన ముదుసలి లో ప్రతి దశలో చూచే కామ దృష్టి ని తూల నాడారు.
  స్నానం కవితలో “వాడిచే వాడబడ్డ నా చర్మానికి చెరచలేని తొడుగు నివ్వు.. కలుషితమైన నా కాయానికి మళ్ళీ కాన్పు నివ్వూ” అని ఆమె అసహనాన్ని ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. 
 
ఎందుకంటే కవిత లో “ప్రశ్నిస్తున్న గొంతుకలకు గొయ్యి పూడుస్తున్నంత కాలం ఎన్ని గొర్రె గొంతుకలుంటే ఏం లాభం” అని ఆవేదన ను వెలిబుచ్చారు. పోరాడిన గొంతులు గడీ లో బాంచెన్ అంటూ సలాం చేస్తుంటే చూస్తూ ఊరుకోలేక వంత పాడుతున్న గొంతుకలకి  నీవు ఆ గోయి లోకే కొంచెం ముందూ వెనుకా అని భావి ని కళ్ళ ముందు ఉంచారు.
ఆటుపోట్లు కవితలో ఎప్పుడన్నా పీల్చుకోవాలనుకున్నా దీర్ఘ శ్వాస కూడా నీ ప్రమేయం లేకుండా నిట్టూర్పు తో నీరసించి పోతుంది అంటూ ఆంక్షల పై యుద్ధం ప్రకటించారు కవయిత్రి.
  శ్వేత రుధిరం కవిత లో తెలుపు ఎరుపు సంఘర్షణలో “ఒక్కసారి గట్టిగా చెవులు మూసి ఆమె నిశ్శబ్దపు ఘోష ను క్షణ కాలం విను.. ఓ సన్నని మూలుగు వినిపిస్తుంది కదూ!! అంటూ ఆమె పక్షాన కొంచెం సేపైనా ఆలోచించమనే సందేశమిచ్చారు సరసిజ గారు.
కరోనా కాలం లోని కడగండ్లకి దర్పణం గా తెల్వక పాయె కవితలో ” వలస కూలీలంటే వలల జిక్కిన పక్షుల్లెక్క వలవల ఏడుసుడని తెల్వకపాయే” వరుసగా కూసోబెడితే ఇంత కూడు కోసమని సూశినం గాని పిచికారికని కనుక్కోలేని పిచ్చిమాలోకం అంటూ వలస జీవుల పక్షాన తన గొంతుక ని వినిపించారు
 వస్త్రానివ్వు కవితలో ఆమె ఏ దుస్తులు ధరించినా.. చీర, పంజాబీ డ్రెస్, పరికిణీ ,జీన్స్  ఏదైనా.. అందులో ఎత్తు పల్లాలు ముడతలు మడతలు వెతికే హ్రస్వ దృష్టి గాళ్ళకు ” నన్ను తాకే ముందే మీ అమ్మకి ఓ వస్త్రానివ్వు” అని చెప్పి ఆత్మ విమర్శ చేసుకోమని వారిని మందలించిన వైనం లో కొత్తదనం కనబడింది.
ఆమె అభిమతం కవితలో ముత్తైదువ ముసుగులో జరుగుతున్న బ్రాహ్మణీయ సమాజ  వివక్ష ను తెగనరుకుతూ మానవత్వమే మతం అని చాటే ప్రయత్నం చేసారు.
 మొరటోడు లో మగవాడి మరో కోణాన్ని స్పృశిస్తూ “ఎడారోడు అనుకునేరు తవ్వి సూత్తే ఒయాసిస్సూ అసోంటి కన్నీటి చెలిమలు కూడా.. అని చెప్పారు.
 ఇంకా బోలెడు మంచి కవితలు ఉన్నాయి. తన రెండో సంపుటి లో స్త్రీ వాదాన్ని బలంగా వినిపించారు. కవితా శీర్షికలు తెలుగు లోనే పెట్టడానికి కవయిత్రి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను.
 
*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.