ఎరుక

-లలిత గోటేటి

          మార్గశిరమాసం  సాయంత్రం  ఐదు గంటలకే చలి నెమ్మదిగా కమ్ముకుంటోంది. శ్రీధర్  కారు ఊరు దాటింది. రోడ్డుకు ఇరు పక్కలా  విస్తరించుకున్న చింత చెట్లు ఆకాశాన్ని కప్పుతున్నాయి. కనుచూపు మేర  పచ్చగా అలుముకున్న వరిచేలు, పొలాల్లో పని చేసుకుంటున్న మనుషులు అక్కడక్కడ కనబడుతున్నారు. తాను ఎక్కడికి వెళుతోంది  తనకే తెలియదు అనుకున్నాడు శ్రీధర్. కారును ఓ పక్కగా ఆపి,డోర్ లాక్ చేసి,చుట్టూ పరికిస్తూ నిలబడ్డాడు. 

          చేను గట్టునున్న కాలిబాట మీద నడుస్తూ ముందుకు వెళ్ళాడు. చల్లని గాలి వీస్తోంది. పంటచేల మీద ,చెట్ల మీద ఎగురుతున్న కొంగలు,  గోరువంకలు సందడి చేస్తున్నాయి. చేను దాటి ఆవలి ప్రదేశానికి చేరుకున్నాడు శ్రీధర్. అక్కడ నీళ్ళతో నిండిన  చిన్న చెరువు వుంది. ఆ నీటి అలల మీద తేలియాడుతున్న నాలుగు బాతులు కనబడ్డాయి. చెరువు గట్టు మీద  కూర్చున్నాడు శ్రీధర్. 

          అలా పరిసరాలను చూస్తూ ఆలోచనలో పడ్డాడు. ఇటీవల కాలంలో తన మనస్థితి తనకే అర్థం కాకుండా పోతోంది. ఉద్యోగం, హోదా, సంపద, పలుకుబడి, కీర్తిప్రతిష్టలు, అన్ని తనకు ఉన్నాయి. అనుకూలవతి అయిన భార్య, పిల్లలు , మనవలు కూడా పుట్టుకొచ్చారు. షష్టి పూర్తి చేసుకున్నాడు. అసలు జీవితంలో ఏది సౌఖ్యం అనుకున్నాడో దాన్నెలా సాధించాడు. ధర్మకార్యాలు, దానాలు చేశాడు అవి తనకు మరింత పేరుని తెచ్చిపెట్టాయి.నిజానికి  ఇప్పుడు తనకు ఏదో పొందాలనే తపనా, కోరికా కూడా  లేవు. ఎందుకు ఈ  అశాంతి? ఈ కుంగుబాటు? జీవితం ఉత్సాహాన్ని కోల్పోయింది. ఏ అనుభవమూ ఆనందాన్ని ఇవ్వడం లేదు. ఇంట్లో ఉండనివ్వని   అశాంతి ఏదో తననిలా ఊరు బయటకు  లాక్కొచ్చింది.

          ఆలోచనలో పడ్డ శ్రీధర్ తన పక్కనే నిలబడ్డ చిన్న పిల్లవాడిని గమనించలేదు’ 

          సింతకాయలు కావాలా?  ఇందా “అంటూ చేతిలో వున్న చింతకాయలను చూపుతున్నాడు  చిన్న పిల్లాడు” .   తైల సంస్కారం లేని జుట్టు, మాసిన బట్టలు, నవ్వు ముఖంతో తన వైపు  చూస్తున్న సుమారు ఏడేళ్ళ వయసున్న పిల్లాడిని చూసి వద్దన్నట్టుగా తల ఊపాడు శ్రీధర్. 

          “తిను బాగుంటాయి!” ,అన్నాడు పిల్లవాడు.

          “రేయ్, గోయిందూ!  ఆరేమన్నా సిన్నోడు ఏంట్రా? సింతకాయలు తింటానికి .” అంటూ పిలుస్తూ వచ్చాడు అతను. 

          “ఈడు మా తాత  ఈరయ్య  అన్నాడు.” పిల్లాడు నవ్వుతూ.

          పిల్లాడి పరిచయ వాక్యాన్ని చూసి శ్రీధర్ కి నవ్వొచ్చింది.

          బాబూ! పొలాలు ఏమన్నా కొంటానికి వచ్చారా?” అడిగాడు వీరయ్య శ్రీధర్ ను ఉద్దేశించి.

          వీరయ్య కు తన వయసే ఉండవచ్చు లేదా తనకంటే చిన్న వాడుకూడా అయి ఉండవచ్చు. కాయకష్టం చేసిన శరీరం. అనుకున్నాడు వీరయ్యను చూస్తూ శ్రీధర్.

          లేదన్నట్టుగా తల అడ్డంగా ఊపాడు. 

          షికారుగా వచ్చారా? అడిగాడు వీరయ్య.

          అవునన్నాడు  శ్రీధర్. పిల్లాడిని తీసుకుని  కొద్ది దూరంలో ఉన్నన తన ఇంటి వైపు వెళ్ళిపోయాడు వీరయ్య.ఆకాశం ఒక్కొక్క రంగును మారుస్తూ నలుపులో కి తిరిగింది.ఒక అరగంట గడిపి శ్రీధర్ లేచి కారు వైపు నడిచాడు.

                                                                  ************

          శ్రీధర్ ఈరోజు కాస్త ముందుగానే బయలుదేరి వచ్చాడు. పరిసరాలను పరికిస్తూ కూర్చున్నాడు. చెట్లమీద,  చేల మీద తిరుగాడుతున్న కొంగలు, గోరింక పిట్టలు గోల చేస్తున్నాయి. చెరువులో  అలలపై ఊగుతున్న ఎర్ర తామరలు సూర్య తాపానికి  తలలు వాల్చాయి . వచ్చి అరగంట దాటినా వీరయ్య అతని మనవడు కనబడలేదు. లేచి వీరయ్య ఇంటి వైపుగా నడిచాడు శ్రీధర్. ఇంటి ముందున్న విశాలమైన  పరిశుభ్రంగా ఉన్న జాగాలో నులక మంచం మీద కూర్చుని చుట్ట కాల్చుకుంటున్నాడు వీరయ్య .

          శ్రీధర్ ని చూసి “రండి బాబు కూసోండి” అంటూ మంచం చూపించాడు. శ్రీధర్ వెళ్లి అతని పక్కనే కూర్చున్నాడు. “గళాసుతో  మంచినీళ్ళు  తీసుకురాయే అమ్మీ”. అంటూ కేకేశాడు.  ఇంట్లోంచి  ముప్పై ఏళ్ల ఆడ మనిషి వచ్చి మంచి నీళ్ళ గ్లాసు అక్కడ పెట్టి వెళ్ళింది.ఇంటి అరుగులు మట్టితో  మెత్తి , పేడతో అలికి, ముగ్గులు వేసి   పరిశుభ్రంగా ఉన్నాయి. వీరయ్య ఇంటికి   పక్కగా  ఉన్న పెద్ద చింత చెట్టు మీద  కాకులు గోలగోలగా  అరుస్తున్నాయి.  వీరయ్య మనవడు  మరో ఇద్దరిని వెంటేసుకుని  తాటిమట్టకు  తాటికాయల చక్రాలు కట్టుకుని తోసుకుంటూ వచ్చాడు. శ్రీధర్ వాడిని పిలిచి జేబులోంచి  మిల్క్ బార్ చాక్లెట్లు ఉంచిన  కవరు తీసి వాడి చేతిలో పెట్టాడు. వాటిని చూస్తూనే పిల్లాడి మొహం వెలిగిపోయింది. శుభ్రంగా తోమిన గ్లాసులో నీళ్లు స్వచ్ఛంగా చల్లగా ఉన్నాయి, తాగి గ్లాసు కింద పెట్టాడు  శ్రీధర్.

          “తమరు ఏం సేత్తారు బాబూ?” అడిగాడు వీరయ్య.

          శ్రీధర్  తన ఉద్యోగం, హోదా ,పరపతి, భార్య పిల్లలు  తన గురించిన పూర్తి వివరాలు చెప్పాడు. ఈ వివరాలన్నీఅతనికి చెప్పటం ఎంతో  అసందర్భం అని తెలిసినా కూడా చెప్పాడు.

          వీరయ్య మౌనంగా విన్నాడు.

          “మరి నువ్వేం చేస్తావ్ ?”అడిగాడు శ్రీధర్.

          చాన్నాళ్ల క్రితమే నా బార్య సచ్చిపోయింది బాబూ! ఆ పిల్ల నా కూతురు. ఇద్దరు పిల్లలు  పుట్టుకొచ్చినాక  దాని మొగుడు వదిలేసిపోనాడు. నాలుగు  కుంచాల భూవి ఉంది నాకు. ఇలా గొడ్డు-గోదా పెట్టుకుని  కాలచ్చేపం సేత్తున్నాను అన్నాడు వీరయ్య. 

          గాలివాటుకు  చింతకాయలు రాలికింద పడ్డాయి. వీరయ్య వ్యవసాయ భూముల గురించి పంటల గురించి రైతు ఎదుర్కునే కష్టనష్టాల గురించి చెబుతున్నాడు. వీరయ్య తన మాటల్లో ఏ భావము ప్రకటించకపోవడం శ్రీధర్ గమనిస్తున్నాడు. ఉన్నట్టుండి  కమ్మని మట్టి పరిమళం  శ్రీధర్ నాసికా పుటాలు తాకింది. ఉత్తరాన  కర్రి మబ్బులు కమ్ముకున్నాయి. సన్నని వానజల్లు పడుతోంది. శ్రీధర్ లేచి వీరయ్యకు వీడ్కోలు చెప్పి బయలుదేరాడు. 

                                                                  *********

          ఆకాశం పసుపు ఎరుపు రంగులను కలబోసి చెరువు నీళ్లలోకి వంపుతోంది. గట్టున పచ్చగా ఒత్తుగా పెరిగిన పచ్చిక మీద వెల్లకిలా పడుకున్నాడు శ్రీధర్. నీలపు ఆకాశంలో ఎగురుతున్న కొంగల బారు ముత్యాల పేరులా ఉంది. వీరయ్య కూతురు నీళ్ళ దొరువులో దిగి  బిందెతో  నీళ్ళు ముంచుకుని వెళ్ళింది. శ్రీధర్ కళ్ళు మూసుకుని పడుకున్నాడు. ఈ విశాలమైన హరితవనంలో తానుగాక మరో నలుగురు మనుషులు మాత్రమే ఉన్నారు అనుకున్నాడు.

          “చమస్యలేవీ లేవు  గందా?” వీరయ్య వచ్చి పక్కనే  కూర్చున్నాడు.

          ఉలిక్కిపడి శ్రీధర్ లేచి కూర్చుని  లేవు అన్నాడు.

          “మరి నీకు?” అన్నాడు శ్రీధర్.

          “నాకా……. . చమస్యా?” నవ్వాడు  వీరయ్య.

          “ఆలోచిస్తే వుంటది.” అన్నాడు.

          “ఆలోచించకపోతే?”  రెట్టించాడు శ్రీధర్. 

          “ఉండదు అన్నాడు” వీరయ్య.

          “ఆలోచన లేకుండా ఎలా ఉంటావు?” అడిగాడు శ్రీధర్.

          “అయితే ఇదన్న మాట నీ సమస్య” నవ్వాడు వీరయ్య. “నీకు అన్నీ ఉన్నాయి గందా”  అన్నాడు వీరయ్య. 

          “ఏవి?”   శ్రీధర్ అడిగాడు.

          “అయ్యే డబ్బు,హోదా, ఉజ్జోగం,భార్యాబిడ్డలు అన్నీ ఉన్నాయి గందా?”

          “అవును ఉన్నాయి  అయితే?”  అడిగాడు శ్రీధర్.

          “ఆ ఆలోసెనల తోటే గందా ఇన్నాళ్లు గడిపావు?” 

          అవునన్నాడు  శ్రీధర్.

          “సూడుబాబూ!   పొలం పని సేత్తానా, ఆ  పని అయిపోయినాక  పనిముట్లు శుభ్రంగా కడిగి, అదుగో ఆ కనపడే పాకలో పెట్టేత్తాను. ఎప్పుడూ నెత్తినెట్టుకుని తిరగతానా ఏంటి?” నవ్వుతున్నాడు వీరయ్య.

          ఆ మాటలకు ఒక్కసారిగా గా తలెత్తి ఆశ్చర్యంగా చూశాడు శ్రీధర్.

          “నేను సెప్పింది ఎరుక  అయ్యిందా బాబూ?

          బుర్రలో ఏదో మెరిసినట్టు అయింది శ్రీధర్  కు

          “వదిలేయ్!” “అయ్యే  నువ్వు బుర్రనిండా బూజు పట్టినట్టు మోత్తున్నావే  ఆలోసెనలు!  అయ్యే ఆటిని వదిలేయ్!” ఈ మాటలు సిన్నప్పుడు  మా అమ్మ సెప్పింది.

          “ఒరేయ్ అబ్బాయా!  పని సెయ్యిగానీ పని గురించి ఆలోసించమాక అని.”

          “ఒక్కసారిగా  తాను మోస్తున్న బరువు ఏదో  తనకు కనబడింది” అనుకున్నాడు శ్రీధర్. కొద్ది క్షణాలు మౌనంగా గడిచిపోయాయి. ఆ మౌనం చాలా ప్రశాంతంగా ఉంది.

          “లుక్కింగ్ ఎట్ సంబడి వితౌట్  హేవింగ్  ఎనీ ఇమేజ్ ఈజ్ ఏ  బ్లెస్సింగ్.”  ప్రపంచ తత్వవేత్త  అన్న ఈ మాటలు ఎందుకో జ్ఞాపకం  వచ్చాయి  శ్రీధర్ కు వీరయ్యను చూస్తే. చంద్రోదయం అయింది. చవితినాటి చంద్రుడు తనతో పాటు మరో రెండు చుక్కలను కూడా తీసుకొచ్చాడు. 

          “థాంక్యూ! వీరయ్యా” అంటూ శ్రీధర్ లేచి  వీరయ్య తో కరచాలనం చేశాడు.

          వీరయ్య పసిపిల్లాడిలా నవ్వాడు.

****

Please follow and like us:

5 thoughts on “ఎరుక (కథ)”

  1. పని ఒత్తిడి కావొచ్చు. కుటుంబంలో సభ్యుల నడుమ సమన్వయలోపం కావొచ్చు లేక పరస్పర అవగాహనతో మొదలవ్వాల్సినవి ముగిసేలా లాంటివి కావొచ్చు. అలజడితో అశాంతితో ఉన్న మనఃస్థితితో శ్రీధర్ గమ్యంలేని చిన్నప్రయాణంచేస్తే అందులో తారసపడిన చిన్న బాబు, అతని తాత వీరయ్య… వారితో పంచుకున్న మాటలు. చల్లగాలికి మట్టి పరిమళానికి పచ్చదనానికీ మోడు చిగురించిన భావోద్వేగానికి గురయ్యాడు శ్రీధర్. వీరయ్య ఇచ్చిన లేదా పంచిన సలహాలాంటి మాటతో శ్రీధర్ టన్ను బరువును మోస్తున్న స్థితినుండీ ఎంతో తేలికయిన స్థితి… నిజంగా కొన్ని ఎక్కడివక్కడే వదిలెయ్యాలి కదూ. అనవసరాల్ని అతిగా తలకెక్కించుకోడదు…

    అభినందనలు లలిత గోటేటి గారూ.
    కథను నడిపించడం..కథ ముగియడం.. మధ్యన సంభాషణలు
    అన్నీ బావున్నాయి.

    Anuradha Bandi.

  2. ఎరుక కథ చదువుతున్నంత సేపు శ్రీధర్ తోటే నాకు కూడా వారి చేలు దగ్గర హాయిగా హికారుకు వెళ్లిన అనుభూతిని కలిగించారు త్రచయత్రిగారు. అభినందనలు.

    1. Thank you అనూరాధ గారూ
      మీ కధలో లోని వ్యధ దాదాపు స్త్రీ లందరిదీను.చాలాబావుంది

Leave a Reply

Your email address will not be published.