గ్రీన్ కార్డ్

-రాజేశ్వరి దివాకర్ల

పొదుపుబతుకులశ్రీమతులు
కొంగు బంగారాన సంతానవతులు
సంసార చక్రాలకు బండి కందెన ఇరుసులు
హక్కుల ఆత్మగతానికి
విడిపోనివి ఆప్యాయతలు, అనుబంధాలు
అందుకే ఎడతెగని ప్రయాసలు.

విశ్రాంతి తీరాన ఉబలాట ప్రయత్నాలు .
తోలుపెట్టెల తూకాల బరువుకు
కిటికీలు తెరుచుకోని గాలి పయనాలు.
దిగగానే బిత్తరిచూపుల కలయికలు,
తివాచీల మెత్తదనానికి
కాలిమడమల పగుళ్ళు
గుచ్చుకోనీయక పదిలపడిన వాళ్ళు .
వాలుకుర్చీలో దినపత్రికను
అక్షరాలకు ఒంటరిగా విడువక
ఆయనను సిగముడిలో
తురుముకుని వచ్చినవాళ్ళు

కొరియన్అంగళ్ళ భారతీయతలో
వంటింటి పచనల కొరతలేని వాళ్ళు .
అవిఇవి దొరకవన్న
అపవాదులన్నింటినీ మించి
రోటిపచ్చళ్ళ దంపుళ్ళకు
నడుంనొప్పిని సడలించిన వాళ్ళు.
చలిలోగిళ్ళకు ధైర్యమొకింత సడలినా
ఊలుబట్టల దిట్టపు నిట్టూరుపులలో
మోమోటమిగెలిచినవాళ్ళు.
కన్నబిడ్డలు కళ్ళెదుట కనబడుతుంటే
భుజపుటెత్తుల సిరిధాన్యపు
మూటబరువు దించుకున్నవాళ్ళు .
అవకాశాల ఆవలి తీరాలకు
అవధులనుదాటి
కడుపుతీపి చెక్కెరమడుగులకు
కనుకొలను ముత్యాల వారధికట్టిన వాళ్ళు

విశ్వగ్రామంలో జానపదాన్ని
నెలకొలుపుతుంటారు
భ్రమలన్నీ తొలగిన వయసులో
ఆకుపచ్చని చీటీరాకడల తలవాకిట
నిశ్చింతను కోరుతుంటారు .
నిలకడ ఊపిరుల రెండు
ఉదయాలకు ధన్యవాదాలను తెలుపుకుంటారు .

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.