పట్నం వద్దు – ప్రకృతి ముద్దు

-కందేపి రాణి ప్రసాద్

 

          ఒక అడవిలో ఆవుల మంద ప్రశాంతంగా జీవిస్తోంది. పచ్చని ప్రకృతి మధ్య అంతా అన్యోన్యంగా బతుకుతున్నా యి. తాజాగా మొలిచిన గడ్డిని మేస్తూ ఆరోగ్యంగా జీవిస్తున్నా యి.. పెద్దలు దూడలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎలా తినాలో నేర్పిస్తాయి. అడవిలోని అన్ని రకాల జంతువులను, అత్త, మామ, పిన్ని, బాబాయి, అన్న, అక్క అంటూ ప్రేమగా పలకరించుకుంటాయి.

          ఒకసారి పట్నంలోని చుట్టాలు వాళ్ళు వాళ్ళింటికి రమ్మని పిలిచారు. అమ్మా, నాన్న ఆవులు “తర్వాత వస్తాములే” అంటూ సున్నితంగా తిరస్కరించారు. ఇంట్లో ఉన్న చిన్ని దూడ మాత్రం పట్నం చూడాలని తెగ సంబరపడింది. “పాపం ఇంత వరకు పట్నం చూడలేదు” అనుకుని అమ్మా నాన్నలు ‘చిన్ని’ ని పట్నం పంపించారు. చిన్ని ఆవు పట్నం గురించి చాలా కథలు విన్నది. ఆకాశాన్నంటే మేడలు, రయ్యిమని పరిగెత్తే కార్లు, నున్నగా జారిపోయే రోడ్లు ఇంకా ఎన్నో రకాల ఆకర్షణలు ఉంటాయని తన చుట్టాల పిల్లలు గొప్పగా చెప్పగా విన్నది. ఎన్నో రకాల ఆహార పదార్థాలు తింటామని కూడా చుట్టాల పిల్లలు చెప్పారు. అందుకే చిన్ని ఎప్పుడెప్పుడు అక్కడికి వెళ్దామా అని ఆతృత పడింది.

          చిన్ని ఆవు చుట్టాలతో కలసి హైదరాబాద్ వెళ్ళింది. నిజంగానే అక్కడి రోడ్లు, బంగళాలు, కార్లు చూసి ఆశ్చర్యానికి గురయింది. జీవితంలో ఇంత సంతోషం ఎప్పుడూ అనుభవించలేదు. అనుకుంది. పట్నంలో ఉండే చుట్టాలు చాలా గొప్పవాళ్ళని భావించింది. వాళ్ళతో నగర విహారం చేసింది. దారిలో అక్కడక్కడ కవర్లలో పడేసిన ఆహారం నూడుల్స్ , బ్రెడ్లు, కేకులు వంటివి పెట్టారు. చిన్నికి చాలా కొత్తగా అనిపిచింది. అన్ని బావున్నాయనిపించింది. చుట్టాల పిల్లలు అన్నిటినీ వింతగా చూపిస్తున్నారు. గోప్పలుగా చెబుతున్నారు. గప్ చిప్ లు,కట్ లెట్ లు చూపించారు. గప్ చిప్ ను నీళ్ళతో నింపి నోట్లో వేసుకోవడం భలే తమాషాగా ఉంది చిన్నికి.

          మధ్యాహ్నమయ్యే సరికి చిన్నికి పడుకోవాలని అన్పించింది. కానీ ఎక్కడా చెట్టు నీడ లేదు. నీడ సరే పడుకోవటానికి కొంచెం స్థలం కూడా లేదు. రోడ్డు మీద కార్లు మీది కోస్తుంటే జాగ్రత్తగా నడవటం కష్టమైపోయింది. చేసేదేం లేక రాత్రికి బాగా నిద్ర పోదాం అనుకున్నది. తీరా చూస్తే వాళ్ళకు కొష్టమే లేదు. రోడ్డు మీదే పడుకుంటున్నాయి. చిన్నికి అసలు నిద్ర పట్టలేదు. తెల్లారి చిన్నికి గడ్డి తినాలనిపించింది కానీ ఎక్కడా దొరకలేదు. గోడలకు అంటించిన సినిమా వాల్ పోస్టర్లు తింటున్నారు వాళ్ళు. చిన్నిని కూడా తినమన్నారు. ఎదో తిన్నది కానీ రుచించలేదు.

          ఆ తర్వాతి రోజు పండ్లు తిందామా అడిగింది చిన్ని చుట్టాల పిల్లలను. పండ్ల మార్కెట్ దగ్గరకు తీసుకెళ్ళారు. కుళ్ళి పోయిన పాడై పోయిన పండ్లు చెత్త కుప్పలో పోసి ఉన్నాయి. ‘అదిగో తిను’ అన్నాయి. చిన్నికి ఆ కుళ్ళిపోయిన పండ్లు నచ్చలేదు పాడు వాసన వస్తున్నాయి. చిన్నికి తన అడవిలో చెట్లకు ఉండే తాజా పండ్లు గుర్తొచ్చాయి. కవర్లలో పారేసే ఫుడ్స్ ను తినటం చేతకాక కవర్ కూడా తినేస్తోంది చిన్ని. అందులో కొన్ని సార్లు పాచిపోయిన ఆహారం ఉంటున్నది.

          అలా ఓ వారం గడిచే సరికి చిన్నికి ఈ పట్నం మీద మోజు పోయింది. ఇక్కడ దొరికే పాస్ట్ ఫుడ్, కుళ్ళిపోయిన కూరగాయలు, సినిమా పోస్టర్లు తినలేక పోతున్నది. ఇంటి దగ్గర తినే కమ్మని పచ్చగడ్డి గుర్తొస్తోంది. అమ్మా నాన్నా కూడా గుర్తు వస్తున్నారు. ఇక ఇంటికెళ్ళి పోతానని గొడవ పెట్టింది. సరేనని చుట్టాలు తెలిసిన వాళ్ళతో వాళ్ళింటికి పంపారు.

          ఇంటికి చేరగానే అమ్మను నాన్నను చూసి కళ్ళ నీళ్ళు పెట్టుకున్నది. గబ గబా పోయి గడ్డిని కడుపారా తిన్నది. అత్తా, మామా పిన్ని బాబాయి అంటూ ఆనందంతో అందరిని పలకరించింది. చెట్టు మీద మగ్గిన అరటి పళ్ళను అమ్మా తెచ్చిస్తే తిన్నది. కడుపు నిండా తిని కోష్టంలో గడ్డి పరుపు మీద అమ్మ పక్కలో పడుకున్నది. కాసేపటి కల్లా అమ్మా అమ్మా నాకు కడుపులో నొప్పి వస్తోంది అంటూ పెద్దగా కడుపు పట్టుకొని ఏడ్వడం మొదలు పెట్టింది. చిన్నిని తీసుకుని అమ్మానాన్నలు వెంటనే డాక్టరు ఎలుగుబంటి దగ్గరకు తీసుకెళ్ళారు. డాక్టరు ఎలుగుబంటి చిన్ని పొట్టను పరిక్ష చేసింది విషయం అర్థమయింది.

          చిన్ని అమ్మానాన్నల్ని పిలిచి “చిన్ని కడుపులో ప్లాస్టిక్ కవర్లున్నాయి. దాని వల్లనే కడుపు నొప్పి వస్తున్నది. వెంటనే ఆపరేషన్ చేయాలి. మొన్న పట్నం వెళ్ళింది కదా. బహుశ అక్కడ తిని ఉంటుంది. ఇంకా కడుపులో ఇన్ఫెక్షన్ కూడా ఉన్నది. కుళ్ళిపోయిన ఆహారం తినడం వల్ల వచ్చి ఉండవచ్చు” అని చెప్పింది ఎలుగుబంటి.

          చిన్నికి వెంటనే ఆపరేషన్ చేసి దాదాపు పాతిక కవర్లను బయటకు తీసింది. ఇన్ఫెక్షన్ తగ్గడానికి మందులు ఇచ్చింది. చిన్నిని జాగ్రత్తగా చూసుకోవాలని తల్లిదండ్రు లకు చెప్పింది. మరల ఎప్పుడూ పట్నం పంపిచవద్దని చెప్పింది. ఈసారి ప్రమాదం నుంచి బయట పడింది. జాగ్రత్తగా చూసుకోండి’ అన్నది ఎలుగుబంటి.

          చిన్నిని అమ్మా నాన్నలు కంటికి రెప్పలా కాపాడారు. ఆపరేషన్ కుట్లు మాని పోయాయి. చిన్ని కూడా చెప్పింది. “పట్నం వద్దు ప్రకృతి ముద్దు” అని చెప్పింది.

*****

Please follow and like us:

One thought on “పట్నం వద్దు – ప్రకృతి ముద్దు”

Leave a Reply

Your email address will not be published.