చరిత్రలో వారణాసి పట్టణం – 4

-బొల్లోజు బాబా

  1. అల్లర్లు మత ఘర్షణలు

          1809లో జ్ఞానవాపి మసీదు నుండి ముస్లిములను బయటకు పంపివేయాలనే నినాదంతో పెద్దఎత్తున మతఘర్షణలు జరిగాయి. కాశిలో 50 మసీదులు నేలమట్టం చేయబడ్డాయి. ఆనాటి మేజిస్ట్రేట్ Watson, జ్ఞానవాపి మసీదును హిందువులకు అప్పగించి ముస్లిములు అక్కడ నుండి తొలిగిపోవాలని ఆదేశించమని ప్రభుత్వానికి సిఫార్సు చేయగా, ప్రభుత్వం అతని ప్రతిపాదనను తిరస్కరిస్తూ March 28, 1810 న వ్రాసిన ఒక ఉత్తరంలో “ఆ మసీదు ఎలాకట్టారన్నది కాదు ముఖ్యం, దాన్ని ఎలా వినియోగించు కొంటున్నారన్నది ముఖ్యం, యధాతధస్థితిని కొనసాగించటం సముచితం” అని వ్యాఖ్యానించటం గమనార్హం. (రి. thewire.in 27/MAY/2022)

          1936లో జ్ఞానవాపి మసీదు ఉన్న ప్రాంతం వక్ఫ్బోర్డుకు చెందినదిగా ప్రకటించాల్సిందిగా ఆనాటి మసీదుకమిటీ కోర్టును అభ్యర్ధించగా కోర్టు ఆ కోర్కెను తిరస్కరించింది. 1942 లో మసీదుకమిటి మరలా అభ్యర్ధించగా కోర్టు జ్ఞానవాపి మసీదును అధికారికంగా మసీదుగా గుర్తిస్తూ తీర్పునిచ్చింది. (AIR 1942 Allahabad 353).

          1991లో హిందువులు జ్ఞానవాపి మసీదులో పూజలు చేసుకోవటానికి అనుమతినివ్వమని కోర్టును కోరారు. ప్రార్ధనాలయాలు 1947 నాటికి ఎవరి ఆధీనంలో ఉంటే వారివిగానే పరిగణించాలని, మార్పులు చేర్పులు చేయరాదంటు 1991 సెప్టెంబరులో కేంద్రప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ఇచ్చింది.

          2006, 2010 లలోకాశిలో జరిగిన బాంబ్ బ్లాస్టును మరిచిపోలేం.

          2021 లో ఢిల్లీకి చెందిన కొందరు మహిళలు, జ్ఞానవాపి మసీదులో ఉన్న శృంగార గౌరిదేవికి పూజలు నిర్వహించుకొనటానికి అనుమతినివ్వమని కోర్టును కోరారు. దరిమిలా ఏప్రిల్ 2022 న జ్ఞానవాపి మసీదును వీడియో సర్వేచేసి సమర్పించమని కోర్టు స్థానిక అధికారులను ఆదేశించింది. దీనితో మరొకసారి పాండోరాబాక్స్తెరచుకొన్నట్లయింది.

  1. ముగింపు

          25/5/2022 నుండి మూడురోజుల పాటు నేను కాశిలో ఉన్నాను., జ్ఞానవాపి మసీదు ఎక్కడో దూరంగా ఉంటుందనుకొన్న నాకు విశ్వనాథుని ఆలయంలోకి ప్రవేశించగానే ఎదురుగా హిందు ఆలయానికి చెందిన గోడలతో దర్శనమిచ్చింది. ఎందుకో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాను.

          యుద్ధసమయంలో యుద్ధోన్మాదంలో ఆలయాల విధ్వంసం ఒక సహజమైన ఉన్మత్త చర్యగా భావిస్తాను. మధ్యయుగాలలో ఒక రాజ్య ప్రధాన ఆలయాన్ని విరూపం చేయటం ద్వారా ఆ రాజ్యంపై విజయం సంపూర్ణమైనట్లు భావించేవారు. ఈ పనిని వివిధ హిందూ రాజులు కూడా చేసారు. అలా యుద్ధాలలో ఏదైనా ఆలయాన్నివిధ్వంసం చేస్తే యుద్ధానంతరం దానిని తిరిగి నిర్మించుకోవటమూ పరిపాటే. సోమనాథ ఆలయం ప్రతీ వందేళ్లకూ ఓసారి ధ్వంసం చేసినట్లూ దానిని తిరిగి నిర్మించుకొన్నట్లు అనేక చారిత్రిక ఆధారాలు లభిస్తాయి. భారతదేశ చరిత్రలో ఇదొక మెటానెరేటివ్.

          ఈ క్రమంలో మొఘలులు ఏదైనా ఆలయాన్ని ధ్వంసం చేస్తే దానిని తిరిగి నిర్మించకుండా ఆ ఆలయ శిథిలాల పై మసీదులు నిర్మించేవారు. ఇదొక యుద్ధతంత్రంగా పాటించారు చాలాసార్లు. రాజు మతం మారితే ఆలయం కూడా మతం మార్చుకోవటం చరిత్రలో కోకొల్లలుగా జరిగింది. కాశిలో బిందుమాధవ స్వామి ఆలయంలాగ సమూలంగా తొలగించి మసీదు నిర్మించినట్లయితే అది వేరే సంగతి. కానీ పూర్వ ఆలయానికి సంబంధించిన కుడ్యాన్ని, పునాదులను యధాతథంగా ఉంచి నిర్మించటం వల్ల భావోద్వేగాలు చెలరేగటం సహజం. తటస్థంగా ఉండే సెక్యులర్  హిందువు కూడా ఆలయ గోడలతో ఉన్న జ్ఞానవాపి మసీదును చూస్తే భావోద్వేగానికి గురికాక తప్పదు.

          ఇరు పక్షాలూ పంతాలకు పోకుండా సామరస్యంగా సమస్యను పరిష్కరించు కోవటం దేశ భవిష్యత్తుకు మంచిది అని భావిస్తాను, అలా జరగాలని ఆశిస్తాను.

సంప్రదించినగ్రంధాలు

  1. Power, Piety and People by Michael Dumper
  2. Banaras Reconstructed, by Madhuri Desai
  3. The India They Saw, by Meenakshi Jain
  4. Banaras, City of Light by Diana L. Eck
  5. Flight of Deities and Rebirth of Temples Episodes from Indian History by Meenakshi Jain
  6. On Yuan Chwang’s Travels in India, 629-645, by Thomas Watters
  7. The Kasi Vishvanatha, Varanasi city, India: Construction, Destruction, and Resurrection to Heritagisation by Rana P.B. Singh and Pravin S. Rana
  8. Temple Destruction And The Great Mughals’ Religious Policy In North India: A Case Study Of Banaras Region, 1526-1707 By Parvez Alam
  9. Aurangzeb, The Life and Legacy of India’s Most Controversial King by Audrey Truschke
  10. Temple desecration and Indo Muslim States by Richard M. Eaton
  11. Wikipedia

 

*****

(సమాప్తం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.