చాతకపక్షులు  (భాగం-20)

(తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల)

– నిడదవోలు మాలతి

          తొలిసారి రాసినప్పుడు తాను ఒక మంచి కథ రాసేనన్న నమ్మకం కుదిరింది. ఓ చిన్న తెలుగు సైటుకి పంపింది. రెండు నెలల తరవాత ఆ సైటువారు ప్రచురించారు. మంచి వ్యాఖ్యలే వచ్చేయి. ఆ ఉత్సాహంలో మరో రెండు కథలు రాసింది. కానీ అవి బాగున్నట్టు అనిపించలేదు. అయినా ఆశ చావక తపతికి చూపించి ఆడిగింది.

          తపతి చదివి, “ఫరవాలేదు,” అంది.

          “మొదటి కథకీ, వీటికీ తేడా ఏమిటంటావు?”

          “మొదటి కథలో ఒక స్నేహితురాలి ప్రవర్తన, ఒక సంఘటన నీ మనసులో గట్టిగా నాటింది. నీ వ్యథ ఆ కథలో వ్యక్తమయింది. ఈ రెండు కథల్లో ఏదో రాయాలన్న తపనే కానీ ఒక అనుభవం, దానికి అనుగుణంగా నీ స్పందనా ఏమీ లేదు.”

          “అవును కాబోలు” అనుకుంది గీత ఆలోచిస్తూ.

          “ఏదేనా పత్రికకో సైటుకో పంపించు. బాగుందనుకుంటే వేసుకుంటారు. లేకపోతే లేదు.” అంది తపతి.

          గీత రెండు నిముషాలు ఆలోచించి, బుట్టదాఖలా చేసింది ఆ కాయితాలు.

          “అయ్యో అదేమిటి. నా మాటలే వేద వాక్యాలుగా తీసుకోకు.”

          “ఎవరో ఎడిటర్ చేసేపని నేనే చేస్తే పోలా” అంది గీత నవ్వుతూ.    

          గీత ఆ సంగఘటన తలపుకొచ్చి, “రాయగలనో లేనో” అంది ఆలోచిస్తూ.

          హరి తన ఆలోచనల్లో వుండి గీత మాటలు వినిపించుకోలేదు.

          మర్నాడు ఉదయం ఏదో కతికి, బయల్దేరుతుంటే, షికాగోలో మేనేజరు ఉద్యోగం గురించి రమణ హరిని మళ్లీ అడిగేడు, “మీకు ఇష్టమేనా? ఇష్టమే అంటే నేను మరోసారి విలియమ్సు‌తో మాట్లాడతాను,” అన్నాడు.

          “మాట్లాడండి. నిజం చెప్పాలంటే మేనేజిరియల్ పోస్టు కంటే ప్రాజెక్టులలో పని చెయ్యడమే నాకు ఎక్కువ ఇష్టం,” అన్నాడు హరి సందిగ్ధంగా. 

          “నిజమేలెండి. కానీ ఏ వుద్యోగం లేకపోవడం కంటే ఏదో ఒక ఉద్యోగం నయం కదా, ప్రస్తుతానికి ఇది తీసుకుని, మీకు నచ్చిన వుద్యోగం తీరిగ్గా వెతుక్కోవచ్చు,” అన్నాడు రమణ.

          “అదీ నిజమేలెండి. కనుక్కోండి”

          “కనుక్కుంటాను. వేరే అవకాశాలు కూడా చూస్తాను. మీ రెస్యూమె కాపీ పంపండి నాకు.”

          గీత ఫొటో సంగతి కూడా ఆయనకి గుర్తు చేయమని మరోసారి చెప్పింది.

          తరవాత ఇద్దర్నీ రమణ కారులో ఎక్కించుకుని, airpportకి బయల్దేరాడు.

***

          ఇంటికి తిరిగి వచ్చేక హరి తన రెస్యూమే తిరగరాయడం మొదలు పెట్టేడు. 

          గీత తపతికి ఫోను చేసి విశేషాలు చెప్పింది. షీత్రో బెహన్జీ సంగతి కూడా చెప్పింది.

          “ఎలా వుంది? ఏం చేస్తోంది? నువ్వు మాటాడేవా తనతో?” అంటూ తపతి ఆతృతగా వెయ్యి ప్రశ్నలేసింది.

          “ఏమో, తలొకరూ తలో మాటా, అసలు తను చిత్ర అవునో కాదో కూడా తెలీదు కదా. నాకేం అర్థం కావడం లేదు. ఫొటో అడిగేను ఆవిడగారి శిష్య పరమాణువుని. అది వచ్చేక, నువ్వే చూసి చెప్పు” అంది. 

          ఫొటో వచ్చిం తరవాత. గీత ప్రింటు తీసుకుని తపతి ఇంటికి వెళ్లింది.

          తపతి ఫొటో చూస్తూ, “చిత్రలాగే వుంది. కాస్త చిక్కినట్టుంది. హెయిర్ స్టైల్ మార్చింది కానీ చూస్తున్న కొద్దీ చిత్రే అనిపిస్తోంది,” అంది సాలోచనగా.

          ఇంక ఇప్పుడేం చెయ్యడం అన్నది పెద్ద ప్రశ్న. అసలు ఆ అమ్మాయి చిత్రే అని గట్టిగా చెప్పడానికి లేదు. చిత్రే అయితే ఆపిల్ల జీవితం అక్కడ ఎలా వుంది? జేమ్స్ తనని బాగా చూసుకుంటున్నాడా? లేక మందులిచ్చి తనచెప్పు చేతల్లో పెట్టుకున్నాడా? ఒకవేళ అదే నిజమయితే అందులో తన పాలు ఎంత? గాయత్రిగారికి చెప్పడమా? మరిన్ని వివరాలు తెలిసే వరకూ వేచి వుండడమా? – తపతి తనకి తనే ప్రశ్న మీద ప్రశ్న వేసుకుంటూ మథన పడుతోంది. ఆఖరికి చెప్పడానికే నిశ్చయించుకుని ఫోను తీసింది.

          అవతలినించి గాయత్రి “హలో”.

          “నేనండీ. తపతిని”

          “ఆఁ. తపతీ, బాగున్నారా? మా అమ్మాయి సంగతి ఏమైనా తెలిసిందా?” అన్నారావిడ ఆతృతగా. మునుపటి ఆవేశం లేదు ఆ కంఠంలో.

          తపతి మనసు గిజగిజలాడింది. నెమ్మదిగా చెప్పింది, “అదేనండీ. ఆ మాట చెప్పడానికే పిలిచాను. నా స్నేహితురాలు ఒకావిడ న్యూజెర్సీ వెళ్లి నిన్ననే వచ్చింది. చిత్రని చూడలేదు కానీ, తన గురించి విందిట. వాళ్లిద్దరూ బాగానే వున్నారుట. చిత్ర వేసిన బొమ్మలు బాగానే అమ్ముడు పోతున్నాయిట.”

          “మీ స్నేహితురాలు ఎక్కడ విందిట? ఏమని? ఎడ్రెసు కనుక్కోగలరా? ఒక్కమాటు మాట్లాడతాను” అందావిడ బొంగురు గొంతుతో.

          తపతి వెంటనే, “నేనూ అదే అనుకుంటున్నానండీ. ప్రయత్నిద్దాం. అక్కడ తెలిసినవాళ్లెవరైనా కనుక్కుని చెప్పగలరేమో చూస్తాను. మీరు ధైర్యంగా వుండండి. తప్పకుండా కనుక్కుందాం” అని మరో పది నిముషాలు సర్వవిధాలా నచ్చచెప్పి ఫోను పెట్టేసింది.

          గీత చెప్పిన విషయాలు తననే కలవర పెడుతున్నాయి. జేమ్స్ చిత్రని మందులిచ్చి తన చెప్పు చేతల్లో పెట్టుకున్నమాట నిజమే అయితే ఆ మాట ఆ తల్లికి ఎలా చెప్పడం? నిజం అవునో కాదో తెలీని మాటలు చెప్పి ఎందుకు ఆవిణ్ణి క్షోభ పెట్టడం అన్న అభిప్రాయంతో పూర్తి వివరాలు చెప్పలేదు. న్యూయార్క్ అని కూడా చెప్పలేదు.

***

          గీత ఉద్యోగంలో చేరిన తరవాత హరి ఉద్యోగం గురించి మరీ మథనపడసాగేడు. ఆ విలియమ్స్ ఏదో ఒకటి త్వరగా తేల్చితే బాగుండునని మహా ఆరాటంగా వుంది. పైకి తేలకపోయినా గీత ఉద్యోగం అంతరాంతరాల ముల్లయి కెలుకుతోంది. ఆ మధ్య ఒకసారి టేషు మాటాడుతూ, “పోన్లే, కనీసం మీ ఆవిడ నాలుగు రాళ్లు తెస్తోంది కదా” అన్నాడు. ఎంత సర్దుకుపోదాం అన్నా అలాటి ఎత్తిపొడుపులు వినడం చేతకావడం లేదు.

          గోరుచుట్టు మీద రోకటి పోటు. ఇండియానించి టెలిగ్రాం వచ్చింది. పోస్టాఫీసువాళ్లు ఫోనులో పిలిచి, ఇంట్లో ఎవరూ లేకపోతే, మెయిల్ చేశారు ఆవార్త. 

          హరి టెలిగ్రాం చూసి, టైం చూశాడు. గీత వచ్చే టైమవుతోంది.

          గీత ఇంట్లో అడుగు పెడుతూనే హరిని అట్టే చూసి ఆగిపోయింది.

          గీత లోపలికి వచ్చే వరకూ ఆగి, హరి నెమ్మదిగా “ఇంటినించి టెలిగ్రాం వచ్చింది” అన్నాడు.

          “టెలిగ్రామా?” అంది గీత దడదడా కొట్టుకుంటున్న గుండెలతో.

          “మీ అమ్మ గారు పోయారని” అన్నాడు కాయితం అందిస్తూ.

          గీత నిశ్చేష్టురాలయి కూర్చుండి పోయింది. ఠప్మని మొహమ్మీద కొట్టినట్టయింది. అమ్మ పోయిందన్నమాట తలకెక్కడం లేదు. ఏదో జరిగింది. ఎవరికో జరిగింది. … ఎలా పోయింది? ఎందుకు ఇలా జరిగింది? అలా ఎంత సేపయిందో చెప్పడం కష్టం.

          ఆఖరికి హరే అన్నాడు, “వెళ్తావా?”

          గీత వెర్రిగా చూసింది అతని వేపు. అవును. అమ్మని చూడాలి. వెంటనే వెళ్లాలి. అమ్మా, నేనొచ్చానమ్మా అని చెప్పాలి. …

          ఇంతలో భాగ్యంగారు ఫోను చేశారు. వూరికే హలో చెప్పడానికి పిలచారు.

          హరి ఫోను తీసుకుని సంగతి చెప్పాడు. ఆవిడ అయ్యో అని బాధ పడి, నేనొస్తానండీ అని చెప్పి ఫోను పెట్టేశారు. ఆ తరవాత హరి తపతిని పిలిచి చెప్పేడు.

          తపతి అయ్యో అని నొచ్చుకుని, చిత్రని వాళ్లమ్మ దగ్గర విడిచేసి వస్తానని చెప్పింది.

          భాగ్యంగారు మరి కొంత మంది స్నేహితులకి కూడా చెప్పేరు విషాదవార్త. సాయంత్రం ఏడయ్యే సరికి చాలామందే పోగయ్యేరు గీతకి సానుభూతి చూపడానికి.

          గీత మాత్రం రాయిలా కూర్చింది. బుద్ధీ, మనసూ కూడా గడ్డ కట్టుకుపోయేయి.

          హరి మళ్లీ గీత దగ్గరికొచ్చి “టికెట్ సంగతి చూస్తాను” అన్నాడు.

          నిజానికి అతని మనసులో జరుగుతున్నది మరొక సంఘర్షణ. ఇండియా ప్రయాణానికి ఇది అనువైన సమయం కాదు. నిల్చున్నపాళాన ఇండియా వెళ్లడం అంటే మాటలు కాదు. ఏ బందరో, కాకినాడో వెళ్లడంలాటిది కాదు కదా. ముందు టికెట్ చూసుకోవాలి. టికెట్‌కి డబ్బు చూసుకోవాలి. గీత ఇప్పుడు బయల్దేరి వెళ్లినా, తను చేరేవేళకి శవం కూడా వుంచుతారో లేదో.

          హరి ఆలోచనలకి వాగ్రూపం ఇచ్చేరు అక్కడ చేరిన జనాలు.

          “మరి ప్రయాణం అవుతున్నారా గీతగారు?”

          “ఇంత హఠాత్తుగా ప్రయాణం అంటే టికెట్ చాలా అవుతుందేమో.”

          “అయినా నువ్వెళ్లి చేసేదేముంది. మంచంలో వుంటే అదో దారి. అంతా అయిపోయినాక ఏముంది. కట్టెయినా వుంచుతారో లేదో!”

          “మరే. ఆస్తులూ, నగలూ ఏమయినా వుంటే అదో దారి …”

          “ఆహా. నగలుంటే మాత్తరం వుంచుతారేంటి అక్కడున్నోళ్లు. మా అత్తగారు పోయినప్పుడు అట్లానే అయింది. ఒంటినిండా ఒంటెడు నగలు అచ్చు కనకమాలక్ష్మి మాదిరి వుండేది.  మేం దిగేనాటికి నల్లపూసలు తప్ప మరేమీ కనిపించ లేదు”

          గీతకి ఉప్పెనగా దుఃఖం ముంచుకొచ్చింది. తపతి గీతచెయ్యి పుచ్చుకుని లేవదీసి, పక్కగదిలోకి తీసుకు పోయింది. తరవాత ముందు గదిలోకి వచ్చి, అక్కడ వున్నవాళ్లందరినీ పంపించేసింది అవసరం అయితే పిలుస్తాం అని చెప్పి.

          భాగ్యంగారు వంటింట్లోకి వెళ్లి కాఫీ పెట్టి, తీసుకొచ్చారు, “ఓ గుక్క తాగమ్మా.” అంటూ.

          గీత కప్పు తీసుకుని పక్కన పెట్టేసింది. ఆవిడ గీత బుజంమీద చెయ్యేసి, చిన్నగా తట్టి, తరవాత పిలవమని తపతితో చెప్పి శలవు తీసుకున్నారు.

          హరి తపతిని పక్కకి పిలిచి, “ఏం చెయ్యమంటారు? నాకేం తోచడం లేదు” అన్నాడు.

          “ప్రయాణం మాటా?”

          హరి అవునన్నట్టు తలూపేడు.

          “గీతని మరోసారి అడిగి చూడండి.”

          “ఏమని అడగను? తనకి వెళ్లాలనే వుంటుంది. నాకూ తెలుసు. కాని పరిస్థితి చూడండి. నాకా వుద్యోగం లేదు. తనా ఇప్పుడే కొత్తగా చేరింది. వెళ్లి మాత్రం ఏం చేస్తుంది? వాళ్లెవరో అన్నమాట కటువే అయినా నిజమే. టికెట్ దొరికి, తను అక్కడికి చేరేసరికి శవమయినా చూడడం అవుతుందో లేదో తెలీదు.”

          “అవునండీ. గీతతో మీరే చెప్తే బాగుంటుంది.”

          హరి నెమ్మదిగా వచ్చి, “నువ్వు వెళ్తానంటే టికెట్ సంగతి కనుక్కుంటాను.” అన్నాడు. మిగతా విషయాలు మాటాడడానికి అతనికి నోరు రాలేదు. డబ్బుకి వెనకాడి, తల్లి కడసారి చూపులు లేకుండా చేశాడన్న అప్రతిష్ఠ తను భరించలేడు.   

          గీత నెమ్మదిగా మన లోకంలోకి వచ్చింది. “నేను వెళ్లి చేసేదేముందిలెండి” అంది.

          హరి మళ్లీ వచ్చి “గీత తరవాత చూద్దాం అంటోంది” అన్నాడు తపతితో.

          తపతి నిట్టూర్చింది. ఇదే దేశంలోనే వుంటే ఇలా జరుగునా? ఆఘమేఘాల మీద తల్లి పక్కన వాలి వుండును. ఇలాటి సందర్భాలలోనే పరాయిదేశంలో వున్న మన బతుకులు ఎంత దౌర్భాగ్యమో వ్యక్తమయ్యేది. “ఎంత సంపాదించి మాత్రం ఏం లాభం?” “చివరికింతే గదా!” లాటి వైరాగ్య ప్రవచనాలు ఎంత వద్దనుకున్నా తలలో మెదలక మానవు.

          రెండో రోజు గీత ఆఫీసుకి బయల్దేరింది.

          “రెండు రోజులు శలవు పెట్టకూడదూ?” అన్నాడు హరి.

          ఇంట్లో వుంటే మరీ బాధగా వుంది. కనీసం అక్కడ పనిలో కాస్త ఉపశాంతి పొందొచ్చు. “లేదు లెండి, వెళ్తాను” అంటూ వెళ్లిపోయింది.

          గీత అలా అనడంలో ఆశ్చర్యం లేదు. బ్యాంకులో సహోద్యోగులు తనని గౌరవంగా చూస్తున్నారు. తన కంప్యూటర్ ప్రజ్ఞ కూడా బాగా పనికొస్తోంది. కంప్యూటరు మీద ఎవరికి ఏ చిన్నకష్టం వచ్చినా తను తీర్చిపెడుతోంది. మేనేజరుకి తనంటే మంచి అభిప్రాయం ఏర్పడింది. తన తెలివితేటలూ, చాకచక్యం చూసి త్వరలోనే తనని లోను ఆఫీసరు చేస్తానన్నాడు. కొత్త స్నేహాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా mortgage విభాగంలో పని చేస్తున్న కీషాకి తనంటే ఎంతో అభిమానం. ఇంతకు ముందు హరిలోకమే తన లోకం. తన స్నేహాలన్నీ హరిద్వారా కలిగినవే. ఇప్పుడు కేవలం తనని చూసి తన స్నేహం కోరేవారు కనిపిస్తున్నారు. గీతకి ఒక అస్తిత్త్వాన్నిచ్చింది ఆ ఉద్యోగం.

***

          ఓ నెల రోజులు పోయేక, విలియమ్స్ ఫోను చేశాడు. షికాగోలో బ్రాంచి ఏర్పాట్లకి తాను షికాగో వస్తున్నానీ, హరి కూడా షికాగో వస్తే వివరాలు మాటాడుకోవచ్చనీ. 

          “సరే. తప్పకుండా వచ్చి మిమ్మల్ని కలుస్తాను, అన్నాడు హరి. 

          హరి శుక్రవారం బయల్దేరి షికాగో వెళ్లేడు. ఆదివారం సాయంత్రం తిరిగి వస్తానని చెప్పేడు. 

          శనివారం మధ్యాహ్నం ఏం తోచక తపతికి ఫోన్ చేసింది గీత. అవతలి నుంచి ఏ జవాబూ లేదు. బయటికి వెళ్లిందేమోననుకుని, సాయంత్రం వరకూ ఆగి మళ్లీ చేసింది. కాస్త చీకటి పడ్డాక మళ్లీ చేసింది. మామూలుగా తపతి ఆవేళప్పుడు ఎక్కడికీ వెళ్లదు. గీతలో తలెత్తిన అనుమానం పెనుభూతంగా రూపు దిద్దుకోసాగింది. ఒకవేళ ఒంట్లో బాగులేదేమో. ఒక్కర్తే వుంటుంది. ఏమైనా జరిగితే … అమ్మో … నన్ను పిలవొచ్చు కదా. .. 

          గీత ఉండబట్టలేక, రాధని పిలిచి చెప్పింది. ఆవిడ అనుకోకుండా పిల్లల దగ్గరికి వెళ్లాల్సొచ్చిందేమో. మీరేం కంగారు పడకండి. అంత ప్రమాదం అయితే ఆవిడే తప్పకుండా పిలిచి చెప్పి వుండేవారు కదా అంది. 

          గీత ఉండబట్టలేక కారు తీసుకుని తపతి ఇంటికి బయల్దేరింది. 

          తలుపు తట్టి చూసింది. మనిషి అలికిడి లేదు. గరాజులోకి తొంగి చూసింది. కారు అక్కడే వుంది. దిక్కు తోచక అటూ ఇటూ చూస్తుంటే, ఎదురింటాయన మొక్కలకి గొప్పులు తవ్వుతూ కనిపించేడు. ఆయన్ని అడిగితే, రెండు రోజులుగా తనకీ కనిపించలేదనీ, పోలీసులకి రిపోర్టు ఇవ్వమనీ సలహా ఇచ్చేడు. తన యింట్లోనించి ఫోను చెయ్యమన్నాడు. గీత గాభరా పడిపోతూ ఆయన్నే పిలవమంది. 

          పావుగంటలో రెండు పోలీసు కార్లూ, నలుగురు పోలీసులూ, ఆంబులెన్సూ, లక్ష ప్రశ్నలూ..

          “ఆవిడ వయసెంత? ఇంగ్లీషు వచ్చునా? కళ్లు కనిపిస్తాయా? చెవులు వినిపిస్తాయా? ఆరోగ్య సమస్యలు ఏమైనా వున్నాయా? ఎమర్జన్సీ రూంలో వాకబు చేసారా? …

          ఒక్కొక్క ప్రశ్నతో గీత గుండెలు అంచెలంచెలుగా దిగజారిపోతున్నాయి. అది చూసి, పొరిగింటాయన జవాబులివ్వడం మొదలు పెట్టేడు. దాంతో పొలీసులు తమ జోరు కాస్త తగ్గించేరు. 

          ఇంతలో ఇంటి ముందు టాక్సీ ఆగింది. తపతి, దిగి వస్తుంటే పోలీసులు అడ్డుపడ్డారు. 

          గీత ఒక్క ఉదుటున లేచి, పరుగెత్తుకు వెళ్లి తపతిని కౌగలించుకుని, ఎక్కడికెళ్లావు? నాకెందుకు చెప్పలేదూ? చచ్చినంత పనైంది నాకు అంటూ అరిచేసింది. 

          “ఏమైంది? ఈ పోలీసులేమిటి? అంది తపతి కూడా కంగారు పడిపోతూ. 

          తపతి క్షేమంగానే వుందని మొట్టమొదట గ్రహించింది పక్కింటాయన. పోలీసులకి ఆవిడే తపతి అనీ, వాళ్లు వెళ్లిపోవచ్చుననీ చెప్పి పంపించేసి, తపతికి సూక్ష్మంగా వివరించేడు సంగతులు. 

          “మీరు నా యందు అంత శ్రద్ద చూపినందుకు కృతజ్ఞతలు. మీకు శ్రమ కలిగించినందుకు క్షమాపణలు. అని చెప్పి ఆయన్ని పంపించేసి, ఇంట్లోకి పద. కథంతా చెప్తాను అని గీతకి చెప్పి, టాక్సీవాడికి డబ్బులిచ్చేసి, వెనక సీటులో వున్న చిత్రనీ, ట్రంకులో వున్న సూటుకేసునీ తీసుకుని వచ్చింది. 

          గీతకి తాను చూసిన షీత్రో బెహన్జీ చిత్రే అని అర్థమయిపోయింది. 

          తపతి చిత్రని బాత్రూంలోకి తీసుకెళ్లి మొహం కడుక్కు రమ్మని చెప్పి, గీతతో కాఫీ పెట్టు, బట్టలు మార్చుకు వస్తాను అంది. 

          గీత తపతిని మింగేసేలా చూస్తూ వంటగదిలోకి నడిచింది. పోలీసుల ముందూ, పక్కింటాయన ముందూ తన పరువు పోయిందని మహమంటగా వుంది ఆవిడకి. 

          జరిగింది ఏమిటంటే …

          తపతికి అర్థరాత్రి న్యూయార్క్ ఫోనొచ్చింది. ఇక్కడ షీత్రో అన్న పేరు గల ఒక చిన్నది ఆపదలో వుందనీ, కాంటాక్ట్ నెంబరుగా మీ నెంబరు ఇచ్చింది అనీ చెప్పారు. 

          తపతి నాలుగు ప్రశ్నలు వేసి, ఆ అమ్మాయి చిత్రే అని నిశ్చయించుకుని, వెంటనే బయల్దేరి వస్తున్నానని చెప్పి, దొరికిన ఫ్లైటు తీసుకుని న్యూయార్క్ చేరుకుంది. 

          వారంరోజుల కిందట ఆక్సిడెంటయి, జేమ్స్ లేక జేమీభాయి ప్రాణాలు అక్కడికక్కడే పోయేయిట. చిత్రకి నా అన్నవాళ్లు ఎవరూ వున్నట్టులేదనీ, మందబుద్ది అనీ పొరుగువాళ్లు సోషల్ వెల్‌ఫేర్ ‌వాళ్లని పిలిచారు. వాళ్లొచ్చి చిత్రని తాత్కాలికంగా గ్రూపు హోంలో పెట్టేరు. చిత్రకి ఎందుకు ఎలా తోచిందో చెప్పలేం కానీ తపతిని పిలవాలని తోచింది. ఆవిడ తనకి తొలిసారి ఇచ్చిన పెయింటు బ్రష్షూ, ఫోన్నెంబరూ ఓ చిన్నపెట్టెలో పదిలంగా దాచుకుంది. గ్రూపుహోంలో సూపర్వైజరు ఆ పిల్ల పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో ఆ పెట్టె చూపించి, ఆ నెంబరు పిలుస్తానంది. సూపర్వైజరు మొదట రూల్సొప్పవని గునిసినా, చిత్ర వేసిన బొమ్మలు చూసి, రూల్సు వంచి, తపతిని పిలవడానికి ఒప్పుకుంది. తపతికి పిలుపు రాగానే ఫ్లైటు అందుకున్నందున గీతకి చెప్పే అవకాశం లేకపోయింది. అక్కడికి వెళ్లిం తరవాత ఫోను చేద్దాం అనుకుంది కానీ అక్కడ చూసుకోవలసిన వ్యవహారాలు తలమునకలు కావడంతో గీతని పిలవడానికి వీల్లేకపోయింది.  

          తపతి గాయత్రిని పిలిచి చెప్పింది. గాయత్రీ, సోమలింగం ఆదరా బాదరా వచ్చేరు గుండె గోక్కుంటూ. 

          “ఎన్నాళ్లకి కళ్లబడ్డావు తల్లీ, మళ్లీ నిన్ను చూడనేమోనని కటకటలాడిపోతున్నాను అంది తల్లి కన్నీళ్లతో.

          “మమ్మల్నెందుకు పిలవలేదూ? అంటూ కసురుకున్నాడు తండ్రి. మీకు ఫోన్‌కాల్ రాగానే మాకు చెప్పవలసింది అన్నాడు తపతితో. 

          “తరవాత చూసుకుందాం ఆ గొడవలు. పదండి, ఇంటికెళ్దాం అంది గాయత్రి. 

          చిత్ర కదల్లేదు. తండ్రి చెయ్యి పుచ్చుకు లేవదీయబోతే, తోసేసింది.

          కొంత తర్జనభర్జనలయ్యేక, రెండు రోజులు ఇక్కడ వుండనివ్వండి. కాస్త స్థిమితపడితే తనే వచ్చేస్తుంది అంది తపతి. 

          చిత్రమొహంలో చిన్న వెలుగురేఖ మెరిసింది. 

          తల్లిదండ్రులు చిన్నబుచ్చుకుని వెళ్లిపోయేక, తపతి గీతవేపు తిరిగి ఏం చేద్దాం? అంది.

          “బాగుంది. నన్నడిగితే నేనేం చెప్పగలను?

          “మరెవర్ని అడగను? నీకు పిల్లల్లేరు. నాకు వున్న ఇద్దరూ వాళ్లబతుకులు వాళ్లు బతుకుతున్నారు. వాళ్లకి నేను చెయ్యవలసిందేమీ లేదు. అంచేత ఇప్పుడు ఈ చిట్టితల్లి బాధ్యత మనిద్దరిదీను. 

          “నా మొహంలాగే వుంది నీ లాజిక్కు.

          “నీ మొహానికేం బహుసుందరంగా వుంది. అలాగే నా లాజిక్కూను. చెప్పు ఏం చేద్దాం?.

          గీత ఆలోచిస్తూ, నువ్వు మొదట జేమ్స్‌ని పరిచయం చేసినప్పుడు ఈ సుందరకాండ అంతా ఊహించలేదు కదా. నువ్వన్నట్టే రెండ్రోజులు ఊరుకుంటే ఆ పిల్లే చెబుతుందేమో, అంది.

***

          వారం గడిచింది. ఇంటికెళ్లడానికి చిత్రలో చిన్నమెత్తు సుముఖత అయినా కనిపించడం లేదు.  

          ఓ రోజు తపతి ఏదో రాసుకుంటుంటే చిత్ర నెమ్మదిగా వచ్చింది. సాధారణంగా ఆ అమ్మాయి తన గదిలోకి రాదు. అసలు తను ఇంట్లో వున్నట్టే లేదు. 

          తపతి నవ్వుతూ, రా అంది పుస్తకాలు పక్కకి జరిపి, మంచం మీద చోటు చేస్తూ. 

          చిత్ర మంచం అంచున కూర్చుని, మాటాడకుండా ఓ కవరు అందించింది తపతికి. 

          “ఏమిటది? అంటూ తపతి కవరు తీసి చూసింది, అవి గవర్నమెంటు బాండులు పాతికవేలకి. తపతి అదిరిపడింది అవి చూసి. ఎక్కడివీ ఇవి? నీకెలా వచ్చేయి? అంది. 

          క్షణకాలం ఇదెక్కడి గొడవ అని కూడా అనిపించక పోలేదు. డబ్బు అనగానే ఆ తల్లిదండ్రులు ఏమంటారో, ఏమనుకుంటారో అన్న ప్రశ్న ఉదయించకమానదు కదా. రోజులు సాఫీగా సాగిపోతున్నాయి అనుకున్నప్పుడల్లా ఏదో ఓ కలకలం. తపతి ఏ నిర్ణయానికీ రాకముందే గాయత్రి పిలిచింది. అన్నలు ఇద్దరూ చెల్లెలు తిరిగొచ్చిందని తెలిసి వచ్చేరుట. మీకు ఫరవాలేదంటే వస్తాం అంది గాయత్రి.

          “రండి, తప్పకుండాను, సాయంత్రం రండి అని చిత్రకి చెప్పింది, మీ అన్నలు వస్తున్నారు నిన్ను చూడ్డానికి అని. 

          చిత్ర ఊఁ అంది. అంతే. 

          వాళ్లు వచ్చి ఆ మాటా ఈ మాటా మాట్లాడుతుండగా తపతి బాండ్స్ విషయం చెప్పింది. అనుకున్నంతా అయింది.

          “ఇంతకాలంగా బిజినెస్ చేస్తున్నారు, అందులోనూ న్యూయార్కులో. పాతికవేలేనా? కనీసం రెండు లక్షలుండాలి అన్నాడు పెద్దన్న.

          తపతి చిరాకునణుచుకుని, అదంతా నాకు తెలీదు. అయినా ఇక్కడి సంపాదనలు మీకు మాత్రం తెలీవేమిటి? అన్నీ అప్పులే కదా. ఇంటి మీద అప్పూ, కార్లమీద అప్పూ, క్రెడిట్ ‌కార్డుల మీద అప్పులూ అంతా ప్రొబేటుకోర్టులో వుంటుంది. మీరే చూసుకోండి. ఈ బాండ్స్ వున్నాయని నాకు తెలీనే తెలీదు ఇంతవరకూ. అవి మీ చెల్లెలి ఇష్టం. అంటూ ఆ కోర్టు వ్యవహరాల ఫోన్ నెంబరిచ్చింది. 

          “చెల్లెల్ని తమ ఇంటికి తీసుకుపోతాం అన్నారు అన్నలిద్దరూ. 

          చిన్నన్న ప్రోగ్రామరు. చిత్రకి సైటు తయారుచేసి, తను వేసిన బొమ్మలు అక్కడ అమ్ముతాను అన్నాడు. 

          గాయత్రి ఒప్పుకోలేదు. ఇంత వరకూ అయిన నాటకం చాలు. ఏ సైటులూ వద్దు. అమ్మకాలూ వద్దు. దానిమానాన దాన్ని బతకనియ్యి అంది. 

          “జేమ్స్ ‌లాగ మనం పిల్లని ఓ భారీపరిశ్రమ చెయ్యక్కర్లేదు. కానీ దాని బొమ్మలు పదిమందీ చూసి ఆనందిస్తే దానికి తృప్తే కదా అన్నాడు తండ్రి. 

          తపతి చిత్రని పక్కకి పిలిచి ఏమంటావు? అని అడిగితే, మీయిష్టం అంది ఆ అమ్మాయి. చిత్ర కనీసం ఈ మాత్రమయినా అభిప్రాయంలాటిది వెలిబుచ్చడం ఇదే తొలిసారి. 

          “మీ చిన్నన్ననిజంగా మనస్ఫూర్తిగా నమ్మి చెబుతున్నట్టుంది అంది తపతి. 

          చిత్ర మాటాడలేదు. ఇహ తప్పదు. తనే ఏదో ఒక నిర్ణయం చేయాలి. అలాగే. ఆలోచిద్దాంలెండి అని వాళ్లకి నచ్చచెప్పి పంపేసరికి తాతలు దిగొచ్చారు. 

*** 

          హరి ఆదివారం రాత్రి తిరిగొచ్చేడు. ఉద్యోగం ఖాయం. పదిరోజుల్లో చేరాలి, అన్నాడు పొంగిపోతూ. 

          గీత కూడా సంతోషించింది, హమ్మయ్య, కష్టాలు గట్టెక్కేయి అనుకుంటూ. తపతిని పిలిచి చెప్పింది. ఆవిడ హరికి అభినందనలు తెలిపింది. 

          హరి హుషారుగా స్నేహితులనందర్నీ పిలిచి చెప్పేడు. వాళ్లందరూ అభినందించి పార్టీ ఇవ్వాలని గట్టిగా చెప్పేరు. వూరు వదిలి వెళ్లిపోతున్నందుకు విచారం వెలిబుచ్చేరు. అయినా షికాగో ఎంత దూరం కనక అని సమాధానాలు చెప్పుకున్నారు. 

          పలకరింపులూ, అభినందనలూ, విచారాలు వెలిబుచ్చడాలూ అయిం తరవాత, హరి గీతతో అన్నాడు, “మనం షికాగోకి మార్చాలి కాపురం,” అని.

          అప్పుడు తలకెక్కేయి గీతకి రాబోయే పరిణామాలు. మొదటిది తన ఉద్యోగం. 

          “అంటే ఇక్కడ నా ఉద్యోగానికి తిలోదకాలు” అంది. పెళ్లిచూపులనాడు ఇలాటి సంభాషణే జరిగింది తమ ఇద్దరిమధ్య.  కానీ హరికి గుర్తున్నట్టు లేదు. 

          “అయితేనేం. అక్కడ మరోటి చూసుకోవచ్చు అంతగా కావాలనుకుంటే,” అన్నాడు తేలిగ్గా, కాయితాలు చూసుకుంటూ. 

          గీతకి మనసు చివుక్కుమంది. గొప్పఉద్యోగం కాకపోవచ్చు కానీ తనకొక ప్రత్యేకతని తెచ్చిపెట్టింది అది. ఆ మాట హరికి తెలీలేదు. జీవితంలో రెండోసారి సర్వస్వం వదిలేసుకుపోతున్న భావన కలిగింది. ఆ రోజంతా ముభావంగానే వుంది. 

          మర్నాడు హరి మాధవుకి ఫోను చేస్తే రాధ తీసింది ఫోను. ఆయన ఇంట్లో లేరని చెప్పి, “షికాగో ప్రయాణం ఎప్పుడు?” అని అడిగింది యదాలాపంగా.

          కొత్త ఆఫీసు కనక చూసుకోవాల్సినవి చాలా వుంటాయనీ, వెంటనే చేరాలనీ అన్నాడు. 

          “గీతగారికి ఇక్కడ వుద్యోగం బాగుంది. వదిలేసి పోవడం పాపం ఆమెకి కష్టం అనుకుంటా” అంది రాధ. 

          “ఏం కష్టం అండీ? ఆమాత్రం వుద్యోగాలు ఎక్కడ దొరకవు కనక,” 

          “అవుననుకోండి,” అని, మాధవు వచ్చేక చెప్తానని చెప్పి ఫోను పెట్టేసింది. 

          హరికి ఓ పావుగంట పట్టింది రాధమాటల్లో అంతరార్థం. గీత లివింగ్రూంలో కూర్చుని టీవీ చూస్తోంది. కాస్సేపు ఆలోచించి, “మీ ఆఫీసులో మనం ఊరు మారుతున్నాం అన్న మాట ఇప్పుడే చెప్పకు. కొన్నాళ్లు చూద్దాం. నువ్వు ఇక్కడే వుండి నీ పని చూసుకో. కొత్త ఉద్యోగం ఎలా వుంటుందో తెలీదు కదా. నేను చిన్న ఇల్లు తీసుకుని అక్కడ వుంటూ, నా పని చూసుకుంటాను. వీకెండ్స్ వస్తాను. అక్కడి వ్యవహారం ఓ కొలిక్కి వచ్చేక చూద్దాం” అన్నాడు. 

“సరే”నంది గీత. 

***

          ‘మరి పార్టీ ఎప్పుడండీ” అంది రాధ గీతని పిలిచి. 

          “చూద్దాం లెండి” అంది గీత. పార్టీ ఇవ్వకూడదని కాదు కానీ చాకిరీ తలుచుకుంటే సరదాగా లేదు. 

          “చూద్దాం అంటే ఒప్పుకోంవండీ. మీరు అట్టే కష్టపడక్కర్లేదు లెండి. మేం అంతా లేం? అచలని పిలుద్దాం.” అంది. 

          సాంప్రదాయాలు అంచెలంచెలుగా మారిపోతున్నాయి. ఇంటావిడే వంటంతా చెయ్యడం, పాట్లక్కులూ తగ్గి, కేటరింగు మొదలయింది.

          “అచల ఎవరూ?”

          “కేరళ అమ్మాయి. కేటరింగ్ చేస్తోంది చదువూ, బతుకూ సాగించుకోడానికి.”

          “సరే. నెంబరివ్వండి. పిలుస్తాను.” 

          హరి కూడా “చాలా మందిని పిలవాలి. అంచేత అచలని పిలవడమే మంచిది. నువ్వు ఒక్కదానివీ చెయ్యలేవు” అన్నాడు. 

          గీతకి మొదట అంతగా నచ్చలేదు. మనలాగే ఇక్కడ గొప్ప చదువులూ, ఉద్యోగాల కోసం వచ్చిన వాళ్లని వాడుకోడం ఏమిటని. కానీ మళ్లీ ఆ అమ్మాయే చేస్తానంటోంది కదా, ఇది కూడా సాయమే అనుకుని పిలిచింది. 

          ఫోను తీస్తూనే, అచల సంతోషంగా “అలాగే ఆంటీ. ఎప్పుడు?” అని అడిగింది. 

          “వచ్చే వారం కాక పై వారం. దాదాపు నలభైమంది వుంటారు. పిల్లా, పెద్దా. అంతా మనవాళ్లు కారు. అమెరికనులు కూడా వుంటారు. అంచేత వంటలు అన్ని రకాలూ కారంగానూ, తియ్యగానూ, ఉప్పగానూ, చప్పగానూ, అలా …” అంది గీత వివరాలు చెప్తూ. 

          “అలాగే ఆంటీ. నాకు అలవాటేలెండి. మీరు మెనూ చెప్తే, మిగతా సంగతులు నేను చూసుకుంటాను” అంది అచల. 

          “మరి ఛార్జీ మాట చెప్పండి. ఎంత అవుతుందో, నేనేం చెయ్యాలో.”

          “చూద్దాంలెండి మీరు మెనూ చెప్పండి”

          “అలా కాదు. నాకు ఇదంతా కొత్త కదా. అంచేత అడుగుతున్నాను”

          “ఏం చేస్తానో దాన్నిబట్టి చెప్తానండీ. మొదటిసారి 10 పర్సెంటు డిస్కౌంటు. మీకు 15 పర్సెంటు ఇస్తాలెండి.”

          గీత తెల్లబోయి, “అయ్యో, నేను తగ్గింపుధరల కోసం అడగడంలేదండీ. ఎంత తీసుకుంటారు అని అడిగేనంతే. నాకు డిస్కౌంటు ఇవ్వక్కర్లేదు” అంది.

          అచల ఒక్క క్షణం ఆగి, “మన ఇండియన్సు అంతా డిస్కౌంటు అడుగుతారండి” అంది. 

          గీతకి చిరాకేసింది, “రిఫరల్ ఫీ కూడా అడుగుతారా?” 

          “ఒకొకప్పుడు. రాధగారు అలా కాదులెండి” అంది అచల. 

          అచల సాధారణంగా మన వంటలే చేస్తుంది కనక కస్టమర్లు అందరూ మనవాళ్లే. నిజానికి హోటల్ వాళ్లకంటే తక్కువే తీసుకుంటుంది. అయినా అందులో బేరాలు, మనం, మనం అంటూ వేలకి వేలు సంపాదిస్తున్నవాళ్లు కూడా గీచి గీచి బేరాలు పెట్టడం గీతకి హేయంగా అనిపించింది. “పాపం ఆ డబ్బుకోసమే కదా ఆ అమ్మాయి ఒప్పుకుంటోంది ఈకూలి పనికి” అన్న జ్ఞానం ఎవరికీ వున్నట్టు లేదు. ఆ క్షణంలో గీతకి విపరీతమయిన ఏహ్యభావం కలిగింది మనవాళ్ల మీద. ఆ కక్షతోనే పార్టీ సూక్ష్మంగా ముగించేయాలన్న తలపు కూడా కలిగింది. 

          హరి ఒప్పుకోలేదు. “మనం ఇచ్చే చివరి పార్టీ ఇది. చాలా మంది వస్తారు. పైగా నువ్వు వంటకాలు తగ్గిస్తే అచలకే కదా నష్టం. తక్కువ చేస్తే తక్కువ ఆదాయం” అన్నాడు. 

          గీతకి నిజమే అనిపించింది. 

          మొత్తమ్మీద పార్టీ ఘనంగానే జరిగింది. అచల అమెరికనులకీ, ఇండియనులకీ, అమెరికా భోజనాలు అలవాటయిన ఇండియనులకీ, పిల్లలకీ, పెద్దలకీ రకాల వారీగా వంటకాలు చేసి అందర్నీ సంతోషపెట్టింది షడ్రుచులతో. చాలా బాగున్నాయని వచ్చిన వాళ్లందరూ మెచ్చుకున్నారు. 

          అచల ఏమీ తినలేదు. అది చూసి, గీత “అవియల్, బిసిబిళ్లహోగి అన్న, సాంబారూ అవీ చాలా రుచిగా వున్నాయండీ. కొంచెం తిని చూడండి,” అంది నవ్వుతూ ఒక ప్లేటులో వంటకాలన్నీ పెట్టుకొచ్చి.

          అచల కూడా నవ్వుతూ, “నేనే చేసేను కదా ఆంటీ, తినాలనిపించదు.” అంది, ప్లేటు తీసుకుంటూ.

          “అలా అయితే, మిమ్మల్ని మరో రోజు భోజనానికి పిలిచి, నేనే వంట చేసి పెడతాను.”

          పార్టీకి తపతి చిత్రని తీసుకొచ్చింది. చిత్రతోపాటు అచలా మరో అబ్బాయి ఓ వారగా కూర్చుని, అక్కడ చేరినవాళ్లనందరినీ చూస్తున్నారు సినిమా చూస్తున్నట్టు. అబ్బాయి సన్నగా, నాజూగ్గా. పచ్చని పసిమిరంగుతో సంస్కృత నాటకాల్లో రాకుమారి వేషానికి తగుతాడు అనిపించేలా వున్నాడు. 

          “ఎవరతను?” అని గీతని అడిగితే, “గణపతి రూమ్మేటుట. ఆయనే తీసుకొచ్చాడు. యూనివర్సటీలో యం.యస్. చేస్తున్నాట్ట” అంది.

          “సునాద అద్భుతంగా పాడతాడు. అతన్ని ఓ పాట పాడమనండి” అన్నారెవరో. తపతి ‘ఎవరా సునాద’ అనుకుంటూ చుట్టూ చూస్తే, చిత్ర పక్కన నిశ్శబ్దంగా కూర్చుని వున్న సుకుమారుడే అని అర్థం అయింది. అతని మిత్రబృందం అతన్ని రెక్కపుచ్చుకు గది మధ్యలోకి లాక్కొచ్చి, పాడు పాడంటూ గోల పెట్టేరు. 

          అతను మొహమాటపడుతూనే గళం విప్పి, “కలగంటి, కలగంటి కమలారేకుల వంటి కన్నులూ గల స్వామి కనుపించెనే” అని పాడుతుంటే, కోకిలలు పలికేయి. అంత వరకూ గలగల్లాడుతూ కబుర్లు చెప్పుకుంటున్నవాళ్లందరూ మాటలాపేసి విన్నారు ఆశ్చర్యంగా. అద్భుతంగా ఉందని అంతకుముందు విననివారు మరొక్క పాట, మరొక్క పాట అంటూ దాదాపు గంటసేపు అతనిచేత పాడించుకుని మరీ విన్నారు.  

          చిత్ర మొహం విప్పారింది. తపతి అది చూసి తీసుకురావడం మంచిదే అయింది అనుకుంది మనసులో.  “సంగీతం నేర్చుకున్నారా?” గీత సునాదని అడిగింది. 

          “లేదండీ. మా అమ్మ గొప్ప విద్వాంసురాలు. కచేరీలు చెయ్యలేదు కానీ చేస్తే సుబ్బలక్ష్మీ, వసంతకుమారిగారల స్థాయిలో వుండేది. మా నలుగురు అక్కయ్యలు కూడా గాయనీమణులే. రేడియోల్లోనూ అక్కడా చిన్న చిన్న కచేరీలు చేస్తూంటారు. మా యింట కిటికీలూ తలుపులూ కూడా కదిలిస్తే కిర్రుమనవు సరసనాదాలే తప్ప లేపాక్షిలో స్థంభాల్లాగ. నాది మాత్రం శృతపాండిత్యం.” 

          “సునాద పేరు బాగుంది కొత్తగా. మీకు అతికినట్టు సరిపోతుంది.”

          సునాద నవ్వేడు. “మా అమ్మ అసలు సరిగమపదని అని పెట్టాలనుకుందిటండీ. మా నాన్నగారు మరీ పొడుగ్గా వుంది అంటే కుదించి సనిద అందిట. అదే దరిమిలా సునాద అయిపోయింది. ఈ మధ్య ఒక తెలుగు పండిట్జీ శ్రీనాథ ప్రకృతి అనీ సునాద వికృతి అనీ చెప్పేడు నాకు.”

          గీత నవ్వింది. చిత్ర అతనివేపు తదేకంగా చూస్తోంది. సునాద చాలాసేపు అక్కడే కూర్చుని వాళ్లిద్దరితో చాలాసేపు కబుర్లు చెప్పేడు. తను ఇండియా నుంచి చాలా టేపులు తెచ్చుకున్నాడుట. తనకి కర్ణాటక సంగీతం ఎక్కువ అర్థం అవుతుందిట కానీ హిందూస్థానీ సంగీతం ఎక్కువ ఇష్టంట. 

          “నాకు అంత పాండిత్యం లేదు లెండి. నాకు తెలీదు” అంది గీత. 

          “కిషోరీ అమోంకర్ సంగీతం విన్నారా ఎప్పుడయినా?”

          “లేదు. పేరు కూడా వినలేదు.”

          “నేను మీకు టేపు ఇస్తాను. వినండి. మీకే తెలుస్తుంది.” 

          మిగతా అతిధులతో మాటాడకపోతే బాగుండదని, గీత “ఇప్పుడే వస్తాను” అని లేస్తూంటే తపతి వచ్చింది. ఆవిడ కూడా సునాద సంగీతాన్ని చాలా మెచ్చుకుంది. ఇద్దరూ సంగీతజ్ఞులే కనక ఇంకా పై స్థాయిలో సాగింది సంభాషణ. 

          వచ్చిన వారందరూ ఒకొకరే మెల్లిగా లేచి శలవు తీసుకునేసరికి పదకొండు దాటింది. 

***

          వారం రోజులనాడు గీత ఏదో రాసుకుంటుంటే సునాద ఫోన్ చేశాడు. “మీకు కిషోరీ అమోంకర్ టేపులు ఇస్తానన్నాను కదండీ. మీకు ఓ రెండు నిముషాలు ఖాళీ అంటే తీసుకొస్తాను” అన్నాడు. 

          “రండి, ఖాళీయే” అని ఫోను పెట్టేసింది ఆశ్చర్యపోతూ. మాటవరసకి అన్నాడు అనుకుంది కానీ నిజంగా తెస్తాడు అనుకోలేదు. 

          శనాదివారాలు తప్పిస్తే హరి ఇంట్లో వుండడం లేదు కనక సునాద వస్తానంటే మంచి కాలక్షేపమే అనిపించింది. అరగంటలో వచ్చేడు అతను. ఎలాగా భోజనంవేళే కనక భోంచేయమంది. 

          “మీకేం ఇబ్బంది కాకపోతే వుంటాను” అన్నాడు. 

          “నాకు ఇబ్బంది లేదు. అన్నం వండుతాను. కూరా, పులుసూ, leftovers మీకు అభ్యంతరం లేకపోతే” అంది గీత నవ్వి.

          ఆ తరవాత సునాద అప్పుడప్పుడు గీతయింటికి వస్తూనే వున్నాడు. తపతి మూలంగా పునరుద్ధరింపబడిన తన సంగీతం సునాద స్నేహంలో పదును తేలుతోంది. శృతపాండిత్యం అన్నాడు కానీ సంగీత పరిజ్ఞానం అతనికి బాగానే వుంది. చాలా పుస్తకాలు చదివేడు. వారానికి రెండు రోజులు సాధన చేస్తాడుట. ఓ రోజు తపతితో ఆ మాట చెప్తే, “అవును, మా యింటికి కూడా వస్తూ వుంటాడు” అంది. 

          మొదటిసారి వచ్చినప్పుడు గీతలాగే తపతి కూడా ఆశ్చర్యపోయింది. సాటి అబ్బాయిలతో సినిమాలకీ, పార్టీలకీ, ఫుట్‌బాల్ చూడ్డానికీ తిరక్కుండా ఇదేమిటి అని. 

          మొదటిసారి వచ్చినప్పుడు అనుకోకుండా వచ్చేడుట. తపతి వాకిట్లో కలుపు మొక్కలు తీస్తోంది. కారాగితే ఎవరా అనుకుంటూ తలెత్తి చూసింది. సునాద కనిపించేడు. 

          “సారీ అండీ. పిలిచి రావాల్సింది. ఊరికే రోడ్లంట తిరుగుతూ ఇటొచ్చేను. మీకు ఇబ్బంది అంటే లోపలికి రాను. తరవాత ఎప్పుడేనా వస్తాను” అన్నాడు గబగబా. 

          తపతి నవ్వుతూ, “ఫరవాలేదండీ. నేనూ ఏం పనిలేకే కలుపు తీస్తున్నాను. రండి” అని లోపలికి తీసుకెళ్లింది. 

          సునాద సోఫా అంచున కూర్చుని, “నాకు మరీ చిరాగ్గా వున్నప్పుడు, కార్లో నాలుగు మంచి టేపులు పడేసుకుని కంట్రీరోడ్ల మీద కార్లో తిరుగుతానండీ. మీరు ఇక్కడ వున్నారని తెలుసు కానీ మీరేం అనుకుంటారో అని ఎప్పుడూ రాలేదు. గీతగారు మీ గురించీ, చిత్రగారి గురించీ చెప్తూ వుంటారు” అన్నాడు. 

          తపతి “బాగుంది మీ కాలక్షేపం. కాఫీ తాగుతారా, టీనా?” అంది.

          సునాద, “అవేవీ తాగనండీ. మంచినీళ్లివ్వండి. చిత్ర గారేరీ?” అన్నాడు చుట్టూ చూస్తూ. 

          “వెనక వరండాలో వుంది. పిలుస్తానుండండి”

          “వద్దులెండి. ఆవిడ ఏమైనా పనిలో ఉన్నారేమో?” 

          తపతికి, గీత ఇంట్లో పార్టీరోజు గుర్తుకొచ్చి, “ఫరవాలేదు. మీరూ రండి. ఏం చేస్తోందో చూద్దాం” అంది అటు నడుస్తూ. 

          చిత్ర అక్కడ లాన్ ‌ఛెయిర్లో కూర్చుని వుంది. తపతి వెనక వస్తున్న సునాదని చూసి చిన్నగా నవ్విందో, నవ్వినట్టు తపతికి అనిపించిందో! సునాద ఆ పక్కన మరో కుర్చీలో కూర్చున్నాడు. తపతి లోపలికి వెళ్లింది ఏదో పనుందని. పావుగంట తరవాత చూస్తే, వాళ్లిద్దరూ వరండాలో లేరు. 

          చిత్రగదిలో చూసింది. చిత్ర ఏదో బొమ్మ గీసుకుంటోంది. సునాద కొంచెం దూరంలో కూర్చుని చిన్నగా కూనిరాగం తీస్తున్నాడు. తపతిని చూసి, సునాద పాట ఆపి, “ఎంత అద్భుతంగా వేస్తారండీ చిత్రగారు. ప్రతి చిత్రంలోనూ ఏవో రెండు కళ్లు గుండెల్ని సూటిగా తాకుతాయి. ఎలా వచ్చిందో అంత నైపుణ్యం ఆమెకి” అన్నాడు. 

          తపతి ఉలికిపడింది ఆ మాటకి. వెనక గీత కూడా ఇదే మాట అంది చిత్ర వేసిన బొమ్మల గురించి. బహుశా ఆ కళ్లు కనిపించడానికి ప్రత్యేకమయిన కళాహృదయం వుండాలేమో అనుకుంది.

          కనీసం నెలకోసారి అయినా వస్తుంటాడుట వాళ్లింటికి. తపతికి సంగీతంలో అభినివేశం వుందని తెలిసినా తనతో మాటాడడుట. ఎక్కువ చిత్రతోనే గడుపుతాడుట.

          “ఏమిటి మాటాడతాడు ఆ అమ్మాయితో?”

          “ఏమో. నేనంతగా పట్టించుకోడంలేదు. వాళ్లిద్దరికీ నచ్చింది. ఎలా, ఎందుకు, ఏమిటి అంటూ నేనెందుకు గొడవ చెయ్యడం.” అని ఓ క్షణం ఆగి, “అసలు మాటాడుకుంటున్నట్టు కనిపించదు. ఆ పిల్ల చిత్రాలు గీసుకుంటూ వుంటుంది. ఇతనేమో పాడుకుంటూ కూచుంటాడు. ఏదేనా పెడితే తింటారు. లేకపోతే మంచినీళ్లేనా అడగరు” అంది తపతి చిన్నగా నవ్వుతూ. 

          “గాయత్రిగారికి తెలుసా? మళ్లీ కథ మొదటికి రాగలదు,”

          “తెలీదనుకుంటాను. నేనయి చెప్పలేదు. నేనూ మొదట నీలాగే అనుకున్నాను. కానీ నాకేం ప్రమాదం కనిపించడంలేదు. పాపం, ఆ పిల్ల మాత్రం మనిషి కాదూ. అతని సాన్నిహిత్యంలో ఊరట పొందుతోంది. నేనెందుకు అది పాడుచెయ్యడం? గొడవయితే అప్పుడే చూసుకుందాం.”

          అటు చిత్ర చిన్నన్న కూడా చెల్లెలికి చేతనయిన సాయం చెయ్యడానికి పూనుకున్నాడు. ముందు చెప్పినట్టుగా ఒక వెబ్‌సైటు పెట్టి, చెల్లెలి బొమ్మలు పోస్ట్ చేస్తున్నాడు, తపతి స్కాన్ చేసి ఇస్తోంది. అయితే ముందులాగా పెద్ద హడావుడి ఏమీ లేదు. నెట్లో ఎవరేనా కావలిస్తే కాపీలు తీసుకోవచ్చు. ఒరిజినల్‌ పెయింటింగు కావాలంటే కొనుక్కోవచ్చు. డబ్బేమయినా వస్తే తపతికి పంపించేస్తాడు. తపతి చిత్ర పేరుమీద వేరే ఎకౌంటుపెట్టి ఆ డబ్బు దాస్తోంది. ఆరు నెలలు గడిచేయి. వూళ్లో ఓ చిన్న షాపు యజమాని ఆ సైటు చూసి, ఒక బొమ్మ కొని వాళ్ల స్టోరులో పెట్టుకున్నాడు. 

          సునాద అది చూసి, తపతికి చెప్పేడు. “మీరు ఫరవాలేదంటే, నేను చిత్రని తీసుకెళ్లి ఆ స్టోరులో గోడమీద ఆ బొమ్మ చూపిస్తాను” అన్నాడు. మళ్లీ “మీరు కూడా వస్తే బాగుంటుంది” అన్నాడు.

          తపతి గాయత్రికి చెప్పింది. గాయత్రికి సునాద విషయం తెలిసింది కానీ తను చేసేదేమీ లేదని తెలుసుకుని, తపతి మీదా, దైవం మీదా భారం వేసి ఊరుకుంది. కనీసం పిల్ల కళ్లముందు వుంది అని తృప్తి పడింది. 

          అందరూ కలిసి ఆ స్టోరుకి వెళ్లేరు. చిత్రమొహంలో చిన్న మెరుపు కనిపించింది. కోటివరహాలు సాటి రావు ఆ మెరుపుకి. తపతీ, గాయత్రీ, సోమలింగం, సునాద అందరూ పొంగిపోయేరు. 

          “మీకు థాంక్స్ చెప్పాలి” అంది తపతి సునాదతో. 

          “నాకెందుకండీ. బొమ్మలు నలుగురి కళ్లలో పడేసింది వాళ్ల అన్న. కొన్నది ఆయనా. ఆయనకి చెప్పండి థాంక్స్” అన్నాడు సునాద.

          ఆ షాపు యజమాని, “నాక్కూడా చెప్పక్కర్లేదండీ. నాకు నిజంగానే ఆ బొమ్మ నచ్చింది.” 

          పక్కనే వున్న ఆయన భార్య “మాకు ఒక అబ్బాయి వున్నాడు. ఆరేళ్లు. వాడు కూడా special needs child. చాలా మంది డాక్టర్లకి చూపించేం. పరీక్షలూ, స్పెషల్ స్కూలూ,  ఖర్చులమాట అడక్కండి. మీరు పరిష్కారం తేలిగ్గానే కనుక్కున్నట్టున్నారు” అంది. 

          “ఈ స్థితిలో చాలా రకాలుంటాయి అనుకుంటానండీ. చిత్ర సమస్య మరీ అంత తీవ్రం కావచ్చు” అంది తపతి. 

***

          ఓ రోజు సునాద “ఇక్కడ స్పెషల్ ఎడ్ స్కూలికి చిత్రని తీసుకెళ్దామండీ” అన్నాడు తపతితో.

          “ఎందుకూ?”

          “నాకూ తెలీదు. వూరికే చూపిద్దాం అనిపించింది. అంతే. మీకు ఇష్టం లేకపోతే వద్దులెండి.” 

          చిత్రబొమ్మ కొన్న షాపుయజమాని భార్య చెప్పిన మాటలు విన్నప్పట్నుంచీ, అక్కడ ఏం చేస్తారో చూడాలని వుంది సునాదకి. చిత్ర అక్కడ ఎలా స్పందిస్తుందో చూడాలని వుంది. తపతి సరే తీసుకెళ్లమంది.

          సునాద అక్కడ ప్రిన్సిపాలుతో మాట్లాడి, వాళ్లు చెప్పిన రోజున చిత్రని తీసుకుని వెళ్లేడు. 

          పిల్లలు వేస్తున్నబొమ్మలు చూస్తూ చాలాసేపు గడిపింది చిత్ర అక్కడ. ఓ చిన్న అబ్బాయి పక్కన నిలబడి, చెయ్యి పట్టుకుని ఆ అబ్బాయి వేస్తున్న బొమ్మ దిద్దించింది. అది చూసి సునాద మురిసిపోయేడు. ఇంటికొచ్చి ఆ మాటే చెప్పేడు తపతితో. 

          “చిత్ర అక్కడ పిల్లలకి పెయింటింగు నేర్పుతుందేమో” అన్నాడు ఆ తరవాత.

          “చిత్రకి డిగ్రీలు లేవు కదా. వాళ్లొప్పుకోరేమో.”

          “లేకపోవడమేమిటి? న్యూయార్కులో స్కూలు నడిపిందిట కదా. గీతగారు చెప్పేరు. ఇప్పుడు కొన్ని బొమ్మలు కూడా అమ్ముడు పోయేయి. అంతకంటే ఏం కావాలి,” అని సునాద హుషారుగా అప్పటికప్పుడు కంప్యూటరు మీద చిత్ర రెస్యూమే తయారు చేసేశాడు. చిత్ర నైపుణ్యం, స్కూలు నడపడంతో పాటు ఆమె మేథ లోపం గురించి కూడా పేర్కొన్నాడు. స్కూలికి స్వయంగా తీసుకెళ్లి ప్రిన్సిపాలుకి ఇచ్చేడు.  

          ప్రిన్సిపాలు గీత అర్హతలు చూసి, సునాద మాటలు విని, “చిత్రకళలో ఒక ప్రత్యేకమయిన స్థాయి చేరుకుంది అంటున్నారు కనక వాలంటీరుగా తీసుకుంటాం,” అన్నారు. 

          సునాద అదే చాలు అని వాళ్లకి పుష్కలంగా కృతజ్ఞతలు చెప్పి, ఇంటికొచ్చేడు. 

          తపతి ఆలోచనలో పడింది. చిత్రని అక్కడికి తీసుకెళ్లడం, తీసుకురావడం ఒక సమస్య. ఆ పైన ఇప్పుడు వెట్టిచాకిరీకి ఒప్పుకుంటే తరవాత వాళ్లు జీతం అంటూ ఇస్తారా అన్నది రెండో ప్రశ్న. కానీ అన్నిటికంటే ముఖ్యమయినది చిత్ర మనుషులలో పడడానికి ఇది ఉత్తమ మార్గం. గీతనడిగితే, తను కూడా అదే అంది.

          సునాద బోలెడు సరదాపడిపోతూ “పంపించండి మేడమ్” అంటున్నాడు. అతడి వుత్సాహం చూస్తుంటే తపతికీ, గీతకీ కూడా ఆశ్చర్యంగానే వుంది. అనేక విషయాల్లో ఎంతో అమాయకంగా కనిపించే ఈ కుర్రాడిలో ఇంత చురుకుదనం ఎక్కడిదా అని. అతన్ని ఎలా అంచనా కట్టాలో అర్థం కాలేదు. చిత్రని వారానికి ఒకరోజు స్కూలికి పంపడానికి అంగీకారం తెలిపింది తపతి. 

***

          ఒకరోజు తపతీ గీతా మాటాడుకుంటుంటే, గీత ఇంట్లో పార్టీమాట వచ్చింది. 

          గీతకి కూడా బాగుంది ఆ రోజు. అచల వంటకాలతో అందర్ని సంతోషపెడితే, సునాద సంగీతంతో ప్రాణం పోశాడనీ చెప్తూ, “నాకు అప్పటికప్పుడు బయల్దేరి ఇండియా వెళ్లిపోవాలనిపించింది” అంది దిగులుగా. 

          “ఇండియా అంటే గుర్తొచ్చింది.  మ.తె. సమావేశాలు త్వరలోనే.” అంది తపతి. 

          “మాతే సమావేశాలా?” అంది గీత అయోమయంగా.

          “మన తెలుగు సమావేశాలు. సూక్ష్మంగా మా.తే.వేసాలు అంటాం నాలాటి వాళ్లం. నాలుగేళ్లకోమారు కవులూ, గాయకులూ, పండితులూ, పామరులూ, ఒకరేమిటి సకల జనులూ కలుస్తారు అక్కడ.”

          “నువ్వు వెళ్తున్నావా?” అడిగింది గీత.

          “లేదులే. ఒకసారి వెళ్లేను నేను వచ్చిన కొత్తలో. వీలయితే మీరిద్దరూ వెళ్లండి. ఒకసారి చూడడానికి బాగానే వుంటుంది. పైగా నీకు అనంతం గారు అభిమాన రచయిత కదా. ఆయన వస్తున్నారుట” అంది తపతి.  

          అనంతంగారు అర్థశతాబ్దిగా తన కథలతో తెలుగు పాఠకులని అలరిస్తున్న సుప్రసిద్ధ రచయిత. ఆయన వస్తున్నారంటే గీతకి కాస్త చురుకు పుట్టింది. కలుసుకుని ఆయన రచనల గురించి మాట్లాడాలని ఎన్నాళ్ల నుంచో కోరిక తనకి.

          “మా పిన్నికొడుకు కూడా వస్తున్నాడు. నీకు తెలుసేమో మీవూరివాడే రంగారావని. సుమారుగా నీ వయసే వుంటుంది,” అంది తపతే మళ్లీ.

          గీత “ఎందుకు తెలీదూ, హైస్కూల్లో నా క్లాస్మేటు. యస్సెల్సీ పాసయిన తరవాత నాకు అమెరికా రావడానికి ఉపాయాలు కూడా ఉపదేశించేడు. అతను అన్నట్టు కాకపోయినా ఇక్కడే తేలేను అనుకుంటే నవ్వొస్తోంది” అని ఆనాడు ఇంట్లో జరిగిన రభస చెప్పింది.  మళ్లీ “అతనికి సాహిత్యంలో ప్రవేశం వుందని నాకు తెలీదే.” అంది ఆలోచిస్తూ.

          “సాహిత్యం అనేం లేదు. అన్నిరంగాల్లో ప్రముఖులూ వస్తారు. ఆతనేదో వ్యాపారం చేస్తున్నాట్ట.”

          “ఏం వ్యాపారం?”

          “ఏదో ఇంపోర్ట్ ఎక్స్‌పోర్ట్ మన గుజ్జనగూళ్ల ఆటలోలాగే ఇక్కడివి అక్కడికీ, అక్కడివి ఇక్కడికీ సరఫరా చెయ్యడం. వెళ్లి చూడు. అదొక అనుభవం,” అంది తపతి.

          ఆ రాత్రి హరిని అడిగింది “ఏదో మన తెలుగు సమావేశాలు అవుతున్నాయిట. వెళ్దామా?”

          “నీకు నచ్చవులే అలాటివి.”

          “ఎందుకలా అనుకుంటున్నారు?”

          “చూస్తున్నాను కదా నీ ధోరణి. నీకు ఇక్కడ మనవాళ్లని చూస్తే చులకన.”

          గీతకి కోపం వచ్చింది. “అదేమిటి? నేనెప్పుడన్నాను ఆ మాట?” అంది..

          “వేరే అనక్కర్లేదు. ఒక పక్కన వీళ్ల మనస్తత్త్వాలు అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నాను అంటావు. మరో పక్కన మనవాళ్లు  అచ్చంపు తెలుగుతనం నిలుపుకోడం లేదని దెప్పుతావు. వీళ్లందరూ అమెరికా ఆచారాలూ, అలవాట్లూ, పాటిస్తూ తెలుగు సంస్కృతి మర్చిపోతున్నారంటూ బాధపడిపోతావు. నీ సంగతులు వాళ్లు మాటాడితే నీకు నొప్పి. నువ్వూ, తపతిగారూ చిత్ర విషయంలో కలగజేసుకోడం కొందరికి అలాటి తప్పుగానే కనిపిస్తుందని నీకు తోచదు.”

          గీత అతన్ని అట్టే చూస్తూ కూర్చుండిపోయింది. తనని అతను ఇంత నిశితంగా పరిశీలిస్తున్నాడని ఇంత వరకూ తేలీనే లేదు తనకి. ఆ క్షణానికి కోపం వచ్చినా, అతనన్న మాటలో తప్పు లేదనే అనిపించింది. ఇక్కడి తెలుగువారి తీరుతెన్నులు తనకి నచ్చడంలేదు, నిజమే. అయితే అతను అన్నట్టు వాళ్లని పూర్తిగా కొట్టిపారేయ లేదు. అర్థం చేసుకోడానికే ప్రయత్నిస్తోంది. ఆ మాటే అంది.

          “నేను మన వాళ్లందరినీ తప్పు పట్టడంలేదు. వీళ్లలో వచ్చిన మార్పుని ఎలా అర్థం చేసుకోవాలా అని ఆలోచిస్తున్నానంతే. పోనీండి. నాకు వీళ్ల ధోరణి నచ్చలేదన్నమాటే నిజం. ఇలా పదిమంది మనవాళ్లు చేరినచోట చూస్తే నాకేమైనా ఎక్కువ అర్థం అవుతుందేమో. మీరు కూడా ఒక్కసారే వెళ్లేనంటున్నారు. మరి మీరెందుకు రెండోసారి వెళ్లలేదూ?” అంది.

          “నా వూరూ, నా భాషా, నా ఇల్లూ అంటూ గిరి గీసుకు, మడిగట్టుకు కూర్చోవాలంటే నాకు జరుగుతుందా? నేను ఇంతదూరం వచ్చింది ఇక్కడ నా రంగంలో నా ప్రజ్ఞాపాటవాలు నిరూపించుకోడానికి. నాకు అదే ముఖ్యం. ఎవరికైనా రోజుకి ఇరవైనాలుగ్గంటలే. నేను నా ఇరవైనాలుగ్గంటలూ నా ఉద్యోగానికే సమర్పించుకోవాలి. పూర్వం మనవాళ్లు బ్రిటిషు‌వాళ్లని నీరాజనాలు పట్టేరు. ఇప్పుడు ఇక్కడ మనం అమెరినులని నీరాజనాలు పడుతున్నాం, చెయ్యాలి. పైగా, దేశంలో మనకి స్థానబలం ఉండేది. ఇక్కడ అది కూడా లేదు,” అన్నాడు హరి అలసిపోయినట్టు సోఫాలో వెనక్కి వాలి. 

          అతను చెప్పని మరో కారణం సాధారణంగా ఆ సమావేశాలకి హాజరు అయేవాళ్లు రెండు రకాల జనాలు. పిల్లలు వున్నవాళ్లు పిల్లలకి తాము నేర్పిన తెలుగు పాటలూ, డాన్సులూ ప్రదర్శించుకోడానికి వస్తారు. రిటైరయినవాళ్లూ, రిటైరవబోయేవాళ్లు రాగల  సాధకబాధకాలు చర్చించుకోడానికీ, తమ సంపాదనలు సద్వినియోగం చేసే ఉపాయాలు చర్చించుకోడానికీ వస్తారు. తనలాటి మధ్య వయస్కులకి ఆ సమావేశాలకంటే ముఖ్యమైన వ్యాపకాలు వుండడంచేత అక్కడ కనిపించరు. 

          అతని మొహంలో నిస్పృహ చూసి గీత అవాక్కయిపోయింది. గీత మళ్లీ సమావేశాలమాట ఎత్తలేదు. 

          రెండురోజుల తరవాత హరే మళ్లీ ఆ ప్రసక్తి తెచ్చి, “నీకు అంత సరదాగా వుంటే వెళ్దాంలే.” అన్నాడు. 

          ఆ తరవాత ఫోనెక్కి ఆచూకీలు లాగి తన స్కూలు మిత్రులూ, కాలేజీ మిత్రులూ, తనలా ఇతర వ్యాపకాలున్న మిత్రులనీ వాకబు చేసి ఆరుగురు వస్తున్నారని తెలుసుకున్నాడు. అది చాల్లెమ్మనుకుని, గీతని పిలిచి, “నీ పట్టుచీరెలు ఇస్త్రీ చేసుకో. బంగారునగలు మెరుగులు దిద్దుకో. సంగీతం సాధన చేసుకో. తెలుగు సభలకి మనం హాజరవుతున్నాం” అన్నాడు. 

          “డాన్సు చెయ్యక్కర్లేదా?” అంది గీత వెక్కిరిస్తూ. 

          “వద్దులే.”   

***

          మ.తె. సమావేశాలు పెద్ద పేరున్న హోటలులో ఏర్పాటు చేశారు. ఉత్తర అమెరికాలో తెలుగువారే కాక కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌నించీ ప్రత్యేకంగా ఈ సమావేశాల కోసమే వచ్చినవారు కొందరయితే, వేరే పనులమీద వచ్చి, ప్రయాణం పొడిగించుకున్నవారు కొందరు, ఇంకా ఇండియానించి ప్రత్యేకంగా ఆహ్వానింపబడినవాళ్లే కాక కొడుకులనీ, కోడళ్లనీ, కూతుళ్లనీ, అల్లుళ్లనీ, మనవల్నీ, మనవరాళ్లనీ, పుట్టినవాళ్లనీ, పుట్టబోయేవాళ్లనీ చూడ్డానికి వచ్చినవాళ్లూ వున్నారు. ఆ రెండు రోజులూ ఆంధ్రదేశానికి మిర్రర్‌సైటులా వుంది అక్కడ. జనసమూహంతో కోలాహలంగా కలకల్లాడిపోతూంది ఆ ప్రాంతం. పెద్దింట పెళ్లంత సంరంభం. 

          ఉదయం ఇడ్లీ వడ ఫలహారాలు అయింతరవాత పిట్సుబర్గునించి వచ్చిన ఆచార్యులవారు వేదపాఠాలతో, వినాయకపూజతో సమావేశం ప్రారంభించారు. మద్రాసు నుంచి వచ్చిన సుప్రసిద్ధ సినీగాయకి వందేమాతరం పాడింది. స్థానిక మేయరు అమెరికాలో తెలుగువారు చేస్తున్న అద్వితీయసేవని కొనియాడారు. 

          ఆంధ్రప్రదేశ్‌నించి వచ్చిన ఆర్థిక మంత్రిగారు దేశానికి యన్నారైలు చేసిన, చేయగల సేవల గురించి పదినిముషాలు మాటాడేరు. మన పిల్లలకి ఆంధ్రాలో మెడికల్ కాలేజీల్లోనూ, ఇంజినీరింగ్ కాలేజీల్లోనూ సీట్లు ఏర్పాటు చేస్తాం అని వాగ్దానం చేశారు. తరవాత మ.తె. అధ్యక్షులు ప్రవాసాంధ్రులు రెండు దేశాలకీ చేస్తున్నసేవ ప్రస్తుతించారు. మన దేశం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు చెప్పారు. 

ఆ తరవాత వివిధ విషయాల పై వేరు వేరు సెషన్లు వేరు వేరు గదుల్లో జరగబోతున్నాయని ప్రకటించేరు. 

          యువ రచయిత్రి దుర్భర సెషన్‌కి చాలా మంది హాజరయ్యేరు. ఈ మధ్య ఆంధ్రదేశంలో ఆవిడ పేరు మారుమ్రోగుతోంది. 

          చిన్నమ్మాయే. పాతికేళ్లుంటాయేమో. ఆవిడ ఎంచుకున్న విషయం తెలుగులో అశ్లీలాలు. స్వీయకవితతో మొదలు పెట్టింది ఉపన్యాసం. 

          అన్యాయం. అక్రమం

          పురుషుల దౌర్జన్యం

          ఘోరాతిఘోరం

          అది కడిగేయడం నా ధ్యేయం

          విరుచుకుపడతాను     

          అంటూ ఓ పదినిముషాలు కవితలు చదివి, విషయంలోకి దిగింది. సాహిత్యంలో అశ్లీలాలు, సంగీతంలో అశ్లీలాలు, సినిమాల్లో, నాటకాల్లో, దేవాలయ శిల్పాల్లో … ఉదాహరణ మీద ఉదాహరణ ఇస్తూ వర్ణించుకుంటూ పోతోందే తప్ప అసలు విషయంలో ఆవిడకున్న అవగాహన ఏమిటో దానిమీద ఆవిడ అభిప్రాయం ఏమిటో అంతుబట్టలేదు శ్రోతలకు. కొందరు ముఖముఖాలు చూసుకున్నారు.

          కొందరు తల్లులు కాస్త తెలుగొచ్చిన పిల్లల్నీ, తెలుగు రాకపోవడం చేత వాటీస్ షీ సేయింగ్ అని అడుగుతున్న పిల్లల్నీ బయటికి లాక్కుపోయేరు. తదితరులు దిక్కులు పిక్కటిల్లేలాగ కరతాళధ్వనులు చేశారు. 

          మధ్యాహ్నం మళ్లీ అచ్చమయిన తెలుగు భోజనం, పూర్ణాలూ, బొబ్బట్లతో. దాన్ని లంచి అనలేం. తెలుగు పడుచులు కొంగులు బిగించి వడ్డిస్తుంటే ఆహుతులు సుష్టుగా భుజించారు. 

భోజనాలబల్ల దగ్గర గీతకి ఎదురుగా కూర్చున్నాయనే అనంతంగారు. గీతకి అయాచితంగా లభ్యమయిన అధిక బహుమతి ఆ రోజు,  

          “మీకథలు నేను చాలా ఇష్టంగా చదివేదాన్ని చిన్నప్పుడు అంది గీత ఆయన్ని గుర్తుపట్టి.

          ఆయన చిన్నగా నవ్వేరు. మీరు నన్ను గుర్తు పట్టడమే ఆశ్చర్యం. ఇంకా కథలు కూడా గుర్తు పెట్టుకున్నారంటే మరీ ఆశ్చర్యం.

          “అలా అనకండి. మంచి కథలంటే కలకాలం నిలిచేవనే కదా అర్థం. మీ కథలకి ఆ విలువుండబట్టే కదా మిమ్మల్ని వీరు పిలవడం జరిగింది, అంది గీత ఉత్సాహంగా.

          అనంతంగారు పెదవి విరిచి, తలాడించేరు. ఆ అభినయానికి ఎన్నేనా అర్థాలు చెప్పుకోవచ్చు. 

          “మీరు ఈ మధ్య రాస్తున్నట్టు లేదు. ఎందుకు మానేశారు?

          “మానేశారు అంటే మీకు పత్రికలలో నా పేరు కనిపించుట లేదు అన్న అర్థంలో అయితే సరే. కానీ స్ఫూర్తిగల మెదడు ఎప్పుడూ పని చేస్తూనే వుంటుంది.

          “మీ మాట నిజమే అని ఒప్పుకుంటాను. ఎందుకు ప్రచురించడం మానేశారో చెప్పండి.

          “ఇదేమిటి, నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారా? అన్నారాయన నవ్వుతూ. 

          గీత సారీ చెప్పి, అది కాదండీ. ఈ దేశం వచ్చేక ఇలా కథల గురించి, ముఖ్యంగా మీ కాలం కథల గురించి మాట్లాడే అవకాశాలు బొత్తిగా లేకుండా పోయేయి. నిజంగానే నాకు మీ కథలంటే చెప్పలేనంత అభిమానం. మీ మాటల్లోనే చెప్పాలంటే పడిచచ్చేదాన్ని మీ కథల కోసం. ఆ రోజుల్లో మీతో మాట్లాడాలని కూడా చాలా కుతూహలంగా వుండేది నాకు. మరి ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. ఎలా వదులుకోమంటారు చెప్పండి.

          “సరే అడగండి. ఏదో రమ్మన్నారని వచ్చేనే కానీ నాకూ మీలాగ రచనల మీద గౌరవంతో మాటాడాలనుకున్నవారు ఎవరూ కనిపించలేదు ఇక్కడ. నేను మాత్రం ఎలా వదులుకోను ఈ అవకాశాన్ని? అడగండి. 

          “అదేం మాటండీ. మీ మీద గౌరవంతోనే కదా పిలిచారు.

          “నమ్మకంతోనే అంటున్నారా ఆ మాట? ఒక్కసారి చుట్టూ చూడండి.”

          గీత చుట్టూ చూసింది. చిన్న చిన్న గుంపులుగా విడిపోయారు అతిథులందరూ. ప్రతి చిన్న గుంపులోనూ మధ్య వెలుగుతున్నవారు ప్రముఖ రాజకీయవేత్తలూ, వాణిజ్యవేత్తలూ, ఇజాలతో, భేషజాలతో కుస్తీపట్లు పడుతున్న వర్థమాన రచయితలూ, సినీనటులూను. వారికున్న ప్రతిపత్తీ, గుర్తింపూ సంస్కృతిపరమయిన విలువలు దృష్టిలో పెట్టుకుని చిత్తశుద్ధితో రాస్తున్న రచయితలకి దొరకడం కష్టం. గీతకి అర్థం అయింది అనంతంగారి అభిప్రాయం. అనంతంగారి కళ్లు క్షణంసేపు దుర్భర పేరుతో రాస్తున్న యువరచయిత్రి మీద నిలిచి తప్పుకున్నాయి. ఆవిడ చుట్టూ ఊపిరి సలపకుండా వున్నారు జనం. 

          “మీరు వేటిని సంస్కృతిపరమైన విలువలు అంటారు? అని ప్రశ్నించింది గీత.

          “సంస్కృతిపరమయిన రచనలంటే నా దృష్టిలో మానవత్వపు విలువలు చాటుతూ ఏ కాలానికి అయినా ఏ దేశానికయినా వర్తించగల కథలు. అంటే శ్రీరాముడు మంచి రాజు, హరిశ్చంద్రుడు సత్యవ్రతుడు అంటూ ఒట్టిమాటలు చాటమని కాదు నేను చెబుతున్నది. ఈ మధ్య వస్తున్న రచనల్లో ఔద్ధత్యం ఎక్కువగా కనిపిస్తోంది. ఒక కులాన్నో, మతాన్నో, సంస్థనో, రాజకీయనాయకుణ్ణో, వినాయకుణ్ణో ఎవరో ఒకరి మీద ఒక నినాదాన్ని ఆశ్రయించుకుని విరుచుకుపడడమే ఘనంగా పరిగణింపబడుతోంది. అలా రాసినవారికే ఈనాడు కనకపు సింహాసనాలు. విమర్శకుల దృష్టిలో అవే సాంఘిక ప్రయోజనం గల రచనలు.

          “మీ దృష్టిలో కావా? ఒక ఆశయం కోసం రాసిన కథలు, సాంఘిక ప్రయోజం దృష్టిలో పెట్టుకు చేసిన రచనలు, ఆ ప్రయోజనం తీరేక నిలవవని మీ అభిప్రాయమా? తాత్కాలికం అంటారా?

          “అది కాదు నేనంటున్నది. సాహిత్యానికి కొలమానాలు వున్నాయి. నాలుగు వీధుల కూడలిలోనో, నీలాటిరేవులోనో సిగపట్ల గోత్రాలకి దిగి జనాలు తిట్టుకున్నప్పుడు అశ్లీలాలు పుష్కలంగా వుంటాయి. వాస్తవం అనో, పాత్రోచితం అనో ఆ తిట్లు వున్నవి వున్నట్టు రాయడం ఒక పద్ధతి. రెండో పద్ధతి ఆ మాటలు వాడకుండా ధ్వనితో, వక్రోక్తితో అన్యాపదేశంగా ఆ వాతావరణాన్ని రచనలో సృష్టించగలగడం. నా దృష్టిలో రెండోదే క్లిష్టతరమయినదీ, అభిలషణీయమయినదీ సాహిత్యంలో. 

          “మీరంటున్న మొదటి పద్ధతి ఈ మధ్య బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. దిగంబర కవులతో మొదలయిందనుకుంటాను. కేవలం వాదన కోసమే అనుకోండి మీరయితే ఆ పద్దతిని ఎలా సమర్థిస్తారు?

          “నేను సమర్థించను కానీ వారి వాదన చెప్తాను. వారి దృష్టిలో అది ముల్లుని ముల్లుతోనే తీయడంలాటిది. దేశాన్ని ఒక తీవ్రమైన రుగ్మత పట్టి పీడిస్తున్నప్పుడు, దానిని ఎదుర్కోడం కూడా అదే స్థాయిలో జరుగుతుందని, గుండె ఆగిపోయినప్పుడు షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చినట్టు. అది నా అభిప్రాయంలో రిపోర్టింగ్ కావచ్చు కానీ సాహిత్యం అనిపించుకోదు.  రచయితల, మేధావుల కర్తవ్యం సత్యాన్వేషణ, జీవితంలో లోటుపాటులు పరిశీలించి, విశ్లేషించి, భిన్న దృక్పథాలని సమీకరించి, వాటిని సమన్యయ పరుచుకుంటూ హృద్యంగమంగా, రసవత్తరంగా ఒక నీతిని ప్రతిపాదించడం సమర్థుడయిన రచయిత చెయ్యాలి. ప్రజలని కర్తవ్యోన్ముఖులని చెయ్యాలంటే, కర్తవ్యం ఏమిటో ఆలోచించుకోగల సామర్థ్యం ఇవ్వాలి వాళ్లకి. అంతే కానీ, మీ కర్తవ్యం ఇదీ అంటూ ప్రజల తరఫున రచయితలు నిర్ణయాలు చెయ్యడం భావ్యం కాదు. సిధ్దాంతాలు చేసే పని అదే. అందుకే వాటిని ఆశ్రయించి చేసే రచనలు ఏకోన్ముఖంగా వుంటాయి. రెండో కోణం ఆవిష్కరించవు. వాటిలో లోపం అసమగ్రత, అంటూ అనంతంగారు ఆగేరు. 

          గీత వింటూ ఆలోచనల్లో పడిపోయింది. ఆయన మాటల్లో తర్కం అర్థం కాలేదు. తనని బాధిస్తున్న ప్రశ్న నేరుగా అడిగేసింది. మీ దృష్టిలో ఆ అమ్మాయి రచనలకి విలువ ఉందా లేదా?

          “మీరు అడుగుతున్నది అశ్లీల రచనల గురించి.

          గీత అటువేపు చూసింది. దుర్భరచుట్టూ చాలా పెద్దగుంపే వుంది. ఆ ప్రాంతంలో కుర్చీలన్నీ నిండిపోయేయి. కుర్చీలు చాలక కొందరు తమ ప్లేట్లు పట్టుకుని నిల్చునే ఆవిడ మధుర భాషణలు వింటున్నారు. 

          “హోరుమని ఘోషిస్తూనూ దుర్భాషలతోనూ సంఘంలో కుళ్లు కడిగేయడం సాధ్యం కాదనే నేను అనుకుంటాను. అలా రాసేవాళ్లు ఏకాలంలోనూ వున్నారు. 30లలో చలం రాసాడు. 60లలో దిగంబరకవులు రాసారు. ఆ రచనలవల్ల సంఘం మారిపోయిందా? అలా మారిపోయి వుంటే ఇప్పుడు మళ్లీ అలా రాయవలసిన అవుసరమే లేదు. జనసామాన్యంలో ఆ రచనలు తాత్కాలికమయిన ఉత్సాహమో, ఉద్రేకమో, జుగుప్సో కలిగిస్తాయి. మేధావులకి చర్చలకి ఉపయోగపడతాయి. కానీ మనస్తత్త్వాల్లో మార్పు, అవసరమయిన మార్పు అవసరమయిన స్థాయిలో తేలేవు అని నా అభిప్రాయం. మన సాహిత్యంలో ధ్వనికీ (suggestion),  వక్రోక్తికీ (indirect communication) ప్రత్యేకమయిన స్థానం వుంది. అది రచయితకి పాఠకులమేథ యందు గల నమ్మకానికి సాక్ష్యం. పరోక్షంగా అలంకారాల ద్వారా, ధ్వనిద్వారా చెప్పిన విషయాన్ని పాఠకులు ఆలోచించుకుని, ఆకళించుకుని తమ భావనలు రూపు దిద్దుకోవాలని రచయిత కోరుతాడు. మీరు ముందు చెప్పిన వాస్తవిక రచనలకి షాక్ వాల్యూ మాత్రమే. పాఠకుల మీద ఆవి వేసే ముద్ర తాత్కాలికమే.

          గీత చుట్టూ చూస్తూ, అయ్యో మనం చూసుకోనే లేదు. అందరూ వెళ్లిపోయారు. పదండి. వరండాలో మాట్లాడుకుందాం. నన్ను బాధిస్తున్న మరో ప్రశ్న కూడా అడిగేస్తాను. 60లనాటి కథా రచయిత్రుల మీద మీ అభిప్రాయం ఏమిటి?

          అనంతంగారు కూడా లేస్తూ, వాళ్ల పరిధిలో వాళ్లు బాగా రాసారనుకుంటాను. మళ్లీ పరిధి అంటే ఏమిటి అని సాగదియ్యకండి. నేనే చెప్పేస్తాను, అన్నారు.

          గీత నవ్వి, మీకు నా సంగతి బాగా తెలిసిపోయినట్టుంది. అంది.

          “ఆహా అన్నారాయన నవ్వుతూ. 

          “అది కాదమ్మా. నేను కూడా రచయిత్రుల మీద వస్తున్న విమర్శలు చూస్తున్నాను. నాకు అర్థమయినవి రెండు విషయాలు. ఒకటి ఏ ఒకరిద్దరో తప్పించి, సామూహికంగా రచయిత్రులకి సామాజిక అవగాహన లేదని. అది నేను ఒప్పుకోను. రచయిత్రులు సంసారంలో ఒడిదుడుకుల గురించి, నిత్యజీవితంలో ఈతి బాధల గురించి రాశారు. ఆ సంసారంలో ఆడవారూ వున్నారు, మొగవారూ వున్నారు. కొడుకులూ, కూతుళ్లూ, అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్లూ, తల్లిదండ్రులూ, పిల్లలూ, అమ్మమ్మలూ, బామ్మలూ, తాతయ్యలూ వీళ్లందరూ ఆ సంసారంలో భాగమే. ఎవరి పరిధి వారిది. కొమ్మూరి వేణుగోపాలరావు హౌస్‌సర్జన్‌ మీద రాస్తే, రావిశాస్త్రి కోర్టు కథలు రాసేరు. ఎవరికి పరిచయమయిన లోకం వారు, ఎవరు గమనించిన సత్యం వారు ఆవిష్కరిస్తారు. రచయిత్రులు నాలుగ్గోడల మధ్య జీవితాన్ని ప్రతిభావంతంగా ఆవిష్కరించారు. అందుకే పాఠకుల దృష్టిని విజయవంతంగా ఆకట్టుకో గలిగారు. రచయిత్రులు చేసినవి వ్యష్టి రచనలు. కుటుంబరావులాటివారు చేసినవి సమష్టి రచనలు. మన సమాజాన్ని సమగ్రంగా అర్థం చేసుకోడానికి రెండు దృక్పథాలూ అవుసరమే.      

          రెండోది శిల్పం. మన విమర్శకులందరూ పాశ్చాత్య విమర్శనా పద్ధతులనే తిరుగులేని కొలమానాలుగా తీసుకున్నారు. కానీ మన సాహిత్య రీతులు మర్చిపోయేరు. మనది మౌఖిక సాహిత్యం. మనం కథలు చెప్తాం. మన రచయిత్రులు ఆ విధానమే అవలంబించేరు. కాయితమ్మీద రాసినప్పుడు కూడా వాళ్లు కథలు చెప్పేరు. అందుకే కథ చదువుతుంటే వాళ్లు ఎదురుగా వుండి మాట్లాడుతున్నట్టు వుంటుంది కానీ వేదిక ఎక్కి ఉపన్యాసం ఇస్తున్నట్టు వుండదు. ఆ నాటి రచయిత్రులలో చాలా మందికి పాశ్చాత్య సాంప్రదాయంతో పరిచయం లేదు. అదే వారిపాలిట వరమూ, శాపమూ కూడా అయింది.

          గీత చేతులు జోడించి, చాలా విషయాలు చెప్పారండీ. ధన్యవాదాలు అంది. 

          అనంతంగారు కూడా నమస్కరించి శలవు పుచ్చుకున్నారు. 

          గీత చుట్టూ చూసింది. హరి ఎక్కడికో మాయమయిపోయాడు తన స్నేహితులతో. అందరూ గుంపులుగా చేరి వారి అభిమాన విషయాలు మాట్లాడుకుంటున్నారు. కాస్త దూరంగా ఒకాయన ఒక్కరూ పచార్లు చేస్తున్నారు. తెలిసిన మొహంలా వుందే అని కొంచెంసేపు ఆలోచిస్తే జ్ఞాపకం వచ్చింది. రెండు దశాబ్దాలకి ముందు ఆంధ్రప్రేక్షుకుల హృదయాలు దోచుకున్న కథానాయకుడు. ఇదే దేశంలో అయితే ఊపిరి సలపకుండా చుట్టిముట్టి వుండేవాళ్లు అభిమానులు ఆయన్ని. ఇక్కడ ఆయనవేపు చూసేవారే కనిపించడం లేదు. ప్రస్తుతం వీరంతా ఈ క్షణంలో గొప్పవారిగా చెలామణి అవుతున్నవారి చుట్టూ చేరి సరస సల్లాపాల్లో మునిగివున్నారు. హరి చెప్పినట్టు స్థానబలం మరి.

          రాత్రి వినోద ప్రదర్శన. మద్రాసులో ప్రఖ్యాతి చెందిన బాలనర్తకి ప్రదర్శనతో మొదలవుతుందని కార్యదర్శి చెప్పేరు మైకు దగ్గరికొచ్చి. ఆ అమ్మాయిని పరిచయం చేస్తూ, ‘రెండోయేటే అడుగు వెయ్యడంలోనే ఆ పాప నాట్యకళావైదుష్యం కనిపించేసింద’నీ, ‘తొమ్మిదో యేట అరంగేట్రం చేసి, ఇప్పటికి కొన్ని వందల ప్రదర్శనలు దేశమంతటా ఇచ్చేసింద’నీ చెప్పేడు. ఇప్పుడు అమెరికాలో కూడా ప్రదర్శనలిచ్చేసి ‘విదేశాల్లో కూడా ప్రదర్శనలిచ్చిన ఘనత సాధించింది’ అన్నాడు.  

          అమ్మాయి స్టేజిమీద కొచ్చింది. మంచి కళగల ముఖం. ఆ పైన ఎనలేని ఆహార్యంతో ధగద్ధగాయమానంగా మెరిసిపోతోంది. నాట్యం మొదలయింది. సభకి నమస్కారం చేసి నాట్యం మొదలు పెట్టింది. 

          గీత చుట్టూ చూసింది. ప్రేక్షకులు తన్మయత్వంతో చూస్తున్నారు. గీత పక్కననున్నావిడ ఆపకుండా మెచ్చుకుంటోంది ఆ పిల్లని, బిడ్డ ముద్దుగుండది. సక్కంగ సేస్తన్నది. మోహినీదేవి మాదిరి వుండది అంటూ. 

          గీత మొదటిసారి అవునండీ, బాగుంది అంది. రెండోసారి బాగుంది అంది. ఆవిడ వదలకుండా స్టేజిమీద అమ్మాయి అడుగులతో సమానంగా ఇక్కడ మెప్పులు కురిపించేస్తూంటే మాత్రం గీతకి ఏమనాలో తోచలేదు. 

          ఆవిడ అది గమనించినట్టుంది, మనాళ్ల పాపే అంది. 

          “ఆఁ? అంది గీత అయోమయంగా చూస్తూ. 

          “ఆ పాప, మన కమ్మారమ్మాయే.

          గీతకి గొంతు కొరవడింది. చిన్నగా దగ్గుతూ లేచి బయటికి వెళ్లింది. గోడవార నీళ్ల ఫౌంటెన్ దగ్గర గొంతు తడుపుకుని, వెనుదిరిగి చూస్తే. అక్కడ కొందరు నిలబడి సూర్యచంద్రులు గతులు తప్పగల విషయాలు చర్చిస్తున్నారు. ‘రాబోయే సమావేశం ఎక్కడ పెట్టాలి? తరవాతి ప్రెసిడెంటుగా ఎవరిని చెయ్యాలి? ఎవరిని చేస్తే ఎవరికి లాభం?’ వంటివి ద్విగుణీకృతోత్సాహంతో చర్చిస్తున్నారు. 

          “ఈతడవ సౌతుకి పోనిద్దాం అన్నాడొకాయన ప్రెసిడెంటుగిరీ విషయం ప్రస్తావిస్తూ.

          “ఆయనకెట్ల వదిలేస్తామండి? బ్రామిన్సామెను చేసుకున్నడు.

          “అయితే ఏమండీ. ఆయన మనవెంపే మొగ్గు సూపుతున్నడు. గోదావరి మండలం నాయుళ్లందరికి ఆయన మాటంటే గురి.

          “ఆ వైఫుమూలంగ మనకి బ్రామిన్స్ సపోర్టు కూడ వచ్చును.

          గీత అటు తిరిగి చూస్తే దూరంగా హరి కనిపించాడు రమ్మని సైగ చేస్తూ. సాక్షాత్తు శ్రీహరి ప్రత్యక్షమయినంత సంతోషంతో అటువేపు నడిచింది. హరి తన స్నేహితుల దగ్గర శలవు పుచ్చుకుని, గీతతో కలిసి చిత్రప్రదర్శనశాలవేపు నడిచేడు. 

          అచ్చంపు తెలుగుదనమ్ము కురియునిచ్చట అనిపించేలా మన చిత్రకారులు, పైడిరాజు, రామారావు, బాపూల చిత్రాలు వున్నాయి అక్కడ. గీత అనంతంగారి మాటలు మననం చేసుకుంటూ, ఆ చిత్రాలు చూస్తూ చాలాసేపు అక్కడే వుండిపోయింది. మనసు పరవశించిపోయింది. ఇదీ మనతెలుగు అంటే అనిపించింది. 

          మర్నాడు మళ్లీ సెషన్లూ, వినోద ప్రదర్శనలూ. గీతా, హరీ కులాసాగా అటూ ఇటూ తిరుగుతూ రోజంతా గడిపేరు. హరి తనస్నేహితులనందర్నీ గీతకి పరిచయం చేసేడు.

          రాత్రి మళ్లీ పాటలూ, నాట్యాలూ, నాటకాలూ …. గీతకి నిన్నటి అనుభవంతో వాటిలో ఉత్సాహం పోయింది. హరి అలా కాదులే. ఈ రోజు బాగుంటుంది. ఇక్కడ పుట్టి పెరుగుతున్న పిల్లల పాటలూ, డాన్సులూ కూడా నువ్వు చూడాలి కదా.

          గీత అర్థమనస్కంగానే అతన్ని అనుసరించింది. నిజమే, మనపిల్లలు ఇక్కడ ఏం చేస్తున్నారో చూడాలి అనుకుంటూ. 

          మొదట పిల్లలు పాటలు పాడేరు. తరవాత ప్రహ్లాదనాటకం వేసేరు. గీతకి ఆశ్చర్యం వేసింది. ఇక్కడ గల ఒత్తిళ్లూ, చదువులూ, వ్యాపకాల మధ్య వీళ్లు ఇంత శ్రద్ధగా తెలుగు పాటలూ, మాటలూ నేర్చుకున్నారంటే. 

          ఆ తరవాత ప్రముఖ కూచిపూడి కళాకారిణి శశికళ నాట్యం. సాంప్రదాయకంగా వెంపటి చినసత్యంగారి దగ్గర నేర్చుకుందిట. 

          అమెరికాలో ఇంతటి ప్రతిభ వుందని ఎవరేనా చెప్తే గీత నమ్మకపోను. ఈ రోజు స్వయంగా కళ్లారా చూసిం తరవాత కూడా నమ్మడం కష్టంగా వుంది. ఆ పూట గీత మనసు పరవళ్లు తొక్కింది. 

          “మీ మాటే నిజం. నేను ఆలోచించుకోవలసిందీ, చూడవలసిందీ చాలా వుంది అంది హరితో. 

          హరి ప్చ్ అన్నాడు ఎటో చూస్తూ. 

          గత రెండు రోజులుగా గీత రంగారావు కోసం వెతుకుతూనే వుంది. ప్రతిసారీ ఎక్కడో దూరంగా కనిపించడం, తీరా దగ్గరికి వెళ్లేవేళకి అతను మరో దిక్కుకి వెళ్లిపోవడం జరుగుతోంది. ఆఖరికి మూడోరోజు అడ్డం వచ్చినవారందరినీ మర్యాదగానే పక్కకి తోసేస్తూ, అతని దగ్గరకి చేరుకుంది. ఫ్రెంచి పరిమళాలు గుప్పుమన్నాయి.

          “హాయ్ అన్నాడు రంగారావు. గీతని తేలిగ్గానే గుర్తుపట్టాడు. అతనిది మాత్రం బాగా గాలి పోసుకున్న బెలూనులాటి నిండు విగ్రహం. చేతిలో విదేశీ సిగార్, మెళ్లో సన్నని బంగారు గొలుసూ, సిల్కు జుబ్బా, మల్లు పంచే చూస్తూ నిలబడిపోయింది గీత. అలనాటి స్నేహితుడు కనిపించినందుకు ఆనందంగా వుంది. 

          “హై అంది తను కూడా. 

          “మీ హబ్బీ రాలేదా?

          “వచ్చారు. అదుగో అంది కాస్త ఎడంగా మరెవరితోనో మాటాడుతున్న హరిని చూపించి. హరి అక్కడ్నుంచే చెయ్యూపేడు. 

          “ఎనీ కిడ్స్?”

          గీత లేరన్నట్టు తలూపి, అతని పిల్లల గురించి అడిగింది. 

          “ముగ్గురు. ఇద్దరబ్బాయిలూ, ఒక అమ్మాయీ.”

          “ఏం చదువుతున్నారు?”

          “పెద్దవాడు మూడో క్లాసు. మూడేనా? మూడే అనుకుంటాను” అంటూ రెండు క్షణాలు ఇబ్బందిగా చూసి, “ఆ మేటర్సన్నీ మా ఆడాళ్లు చూసుకుంటారు. సంపాదించి పడేయడమే నా డ్యూటీ” అన్నాడు నవ్వుతూ.  

          ఇంతలో అతన్ని ఎవరో పిలిచారు మరెవర్నో కలవాలంటూ. అతను మళ్లీ కలుస్తాలే అంటూ వెళ్లిపోయాడు అక్కడి నుంచీ. 

          స్థలమహత్మ్యమో కాలమహత్మ్యమో అతని ధోరణి గీతకి నిరుత్సాహం కలిగించిన మాట మాత్రం వాస్తవం. 

          ఆదివారం ఉదయం ప్లినరీ సెషన్. కింగ్‌మేకర్లు తప్పించి మిగతా వారందరూ తిరుగుముఖం పట్టేరు. 

          గీతా, హరీ airportకి వచ్చేరు. మొదటిరోజు డాన్సు చేసిన అమ్మాయి తంఢ్రి కనిపించాడు గీతకి. అమ్మాయి పక్కనే ఓ షాపు దగ్గర నిలబడి రోలింగ్ స్టోన్స్ పత్రిక చూస్తోంది. 

          “మీ అమ్మాయికి మంచి నర్తకి అయ్యే లక్షణాలు వున్నాయండి అంటూ పలకరించింది ఆయన్ని. 

          ఆ తండ్రి ఏమంత ఆనందించినట్టు కనిపించ లేదు. పెదవి విరిచి తలెగరేశాడు. తరవాత నెమ్మదిగా అందరూ అట్లానే అంటున్నారు అన్నాడు.  

          గీతకి ఇంకేం మాటాడాలో తోచలేదు. ఆ పిల్ల తండ్రి నెమ్మదిగా తనకథ చెప్పేడు. ముగ్గురు అబ్బాయిల తరవాత ఈ అమ్మాయి కలిగిందిట. చిన్నప్పట్నుంచీ డాన్సంటే సరదా. తల్లీ, తదితర బంధువులపోరు పడలేక డాన్సు చెప్పిస్తున్నాడు. విజయవాడలో మొదలై, హైదరాబాదు, తరవాత మద్రాసు చేరుకునే వరకూ వచ్చింది. మంచి గురువుంటే ఇంకా బాగా వస్తుంది, ఇంకా బాగా వస్తుంది అంటూ పరుగులకి పోయేరు వారిమాటా వీరిమాటా విని. అలాటి పోరుతోనే అప్పుచేసి పిల్లని ఇక్కడికి తీసుకు వచ్చేరు.  

          “పోన్లెండి. ఇక్కడికి రావడం మూలాన పది మంది కళ్ల బడింది కదా. అందీ గీత సానుభూతిగా.

          ఆయన వెలితి నవ్వొకటి నవ్వేడు. దాంతోపాటు పదిహేనువేలు అప్పు. ఎలా తీర్చుకుంటానో తెలీదు.

          “సాయం చెయ్యమని అడిగేరు కదా సెక్రటరీగారు,

          “చాలినంత రాలేదండీ.

          గీత నిట్టూర్చింది. ఆయన్ని చూస్తే జాలేస్తోంది. హరి వచ్చి ఫ్లైటుకి టైమయిందన్నాడు. గీత వస్తానండీ అని చెప్పి ఆయన దగ్గర శలవు తీసుకుంది. 

          “ఎలా వున్నాయి సమావేశాలు? అన్నాడు హరి కిటికీసీటు గీతకి వదిలి, తను పక్కసీటులో సర్దుకు కూర్చుంటూ. 

          గీత ఇదమిత్థంగా చెప్పలేక పోయింది ఆ సమావేశాలు తనకి ఆనందాన్నిచ్చేయో లేదో, తాను ఏమి ఎదురు చూసిందో చెప్పడానికి మాటల్లేవు. అంతా కలగాపులగంగా, గందరగోళంగా వుంది. రెండు రోజులు మనవాళ్ల మధ్య గడిపేను అన్న తృప్తి కలగలేదు. అనంతంగారిని కలవడం, చిత్రకళాప్రదర్శనా, శశికళ నృత్యం చాలా తృప్తిని ఇచ్చేయి. కానీ దాంతోపాటే ఇదీ అని చెప్పలేని ఏదో లోటు కూడా బాధిస్తోంది! 

          “బాగానే వున్నాయి అంది హరి ప్రశ్నకి సమాధానంగా.

          మర్నాడు తపతితో మాట్లాడుతూ, ఇండియానించి వచ్చిన బాలనర్తకీ, యువ రచయిత్రీ, అనంతంగారితో సాహిత్యచర్చలూ, అన్నీ చెప్పి, నాకేమిటో ఆయన అభిప్రాయాలు గందరగోళంగా వున్నాయి. కుటుంబరావు రచనలకీ స్త్రీల రచనలకీ మధ్య గల వైవిధ్యం ఎత్తి చూపి, కుటుంబచిత్రణ మీద చిన్న ఉపన్యాసం ఇచ్చేరు. అది అర్థం చేసుకునేంత తెలివితేటలు నాకు లేవు. అంది.

          “విమర్శలూ, సమీక్షలూ ఎప్పుడూ అలాగే వుంటాయి. ఇదే సత్యం అని నిర్థారణగా చెప్పరు. ఆయన అభిప్రాయం ఆయన చెప్పేరు. ప్రతివారూ తాము చెప్పేదీ చేసేదీ కూడా మనసా వాచా నమ్మే చెప్తారు, చేస్తారు. 

గీతకి మాత్రం నిరుత్సాహంగానే వుంది. ఆతరవాత వరసగా రెండు కథలు రాసింది. ఒకటి చిత్ర కథా, రెండోది బాలనర్తకి కథా. అనంతంగారి మాటలు మనసులో అలా దాచుకుంది. హరికీ, తపతికీ చూపించింది. వాళ్లు ఫరవాలేదు, బాగానే వున్నాయి అన్నారు. గీతకి తృప్తిగా లేదు. రెండూ చించిపారేసింది. 

          “కాయితాలు చించిపారేస్తే ఫరవాలేదు. ఆలోచనలు పారేయకు. మంచి కథ రాయడానికి చాలా కాలం పడుతుంది ఒకొకప్పుడు అంది తపతి. 

          అఖరికి హరితో అంది, నాకు ఇండియా వెళ్లాలని వుంది, 

          “అదీ నీ అసంతృప్తికి అసలు కారణం. నీకు ఇంటి మీద మనసు పోయేలా చేసేయి ఆ సమావేశాలు అని, టికెట్ సంగతి కనుక్కుంటాను. నువ్వు మీ మేనేజరుతో కూడా మాట్లాడు శలవు సంగతి అన్నాడు.

***

          హరి కూడా ‘వెళ్లిరా’ అన్న తరవాత, గీత సూపర్వైజరుని కలుసుకుని, “మీరు ప్రమోషను సంగతి మాట్లాడతాను అన్నారు. మనం ఆ విషయం మాట్లాడడానికి వీలవుతుందా? నేను ఇండియా వెళ్ళి వద్దాం అనుకుంటున్నాను. మా నాన్నగారిని చూసి చాలాకాలం అయింది,” అంది రవంత జంకుతూ.  

          ఆయన, “అయ్యో తప్పకుండా వెళ్లిరండి. ఫామిలీ ముఖ్యం. మీరు తిరిగి వచ్చేక,  ప్రమోషను సంగతి మాట్లాడదాం, ఎన్ని రోజులు వుంటారక్కడ?” అన్నాడు.

          “ఎక్కువ రోజులు లేదు, రెండువారాలు వెళ్దాం అనుకుంటున్నాను.” 

          “అలాగే, వెళ్లిరండి. మీకెంత శలవుందో కనుక్కోండి. మిగతా రోజులు తెలుసు కదా, జీతనష్టం,” అన్నాడాయన.

          గీత సరేనని, థాంక్స్ చెప్పి వచ్చేసింది. ఆ సాయంత్రం హరితో చెప్పింది తనకి శలవు దొరికిందని. ఆ రాత్రే బాబాయికి ఫోను చేసింది వస్తున్నానని చెప్పడానికి. 

          భానుమూర్తి సంతోషంగా, “ఎప్పుడు బయల్దేరుతున్నావు? ఇద్దరూ వస్తున్నారా?” అంటూ ప్రశ్నలవర్షం కురిపించేడు. 

          తాను ఒక్కదాన్నే వస్తున్నానని చెప్పింది, ‘నన్ను మాత్రం అవీ ఇవీ తెమ్మని అడక్కు” అంది. 

          “నీ మాటతీరు చాలా మారిపోయింది.” అన్నాడు భానుమూర్తి.

          నెల రోజులనాడు గీత దేశానికి ప్రయాణమయింది. దాదాపు ఆరేళ్ల తరవాత. షికాగోలో ప్లేనెక్కుతూంటే దిగులేసింది. “మీరొక్కరూ ఎలా వుంటారో” అంది హరితో. 

          హరి నవ్వుతూ, “మరేం ఫరవాలేదు. నువ్వు రాకముందు నేనొక్కణ్ణీ వుండలేదేమిటి. నాకేం ఫరవాలేదు కానీ, నువ్వే జాగ్రత్త. ఇక్కడి వాతావరణం అలవాటయిన తరవాత అక్కడ ప్రతిదీ చిరాగ్గానే వుంటుంది. మనుషులు మనుషుల్లా కనిపించరు. ఇళ్లు ఇళ్లలా వుండవు కొందరికైతే.” అన్నాడు.

          “పోదురూ, మీరు మరీనూ” అంది గీత

* * * * *

(ఇంకా ఉంది)

చిత్రకారుడు: ఆర్లె రాంబాబు

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.