బతుకు చిత్రం-23

– రావుల కిరణ్మయి

జరిగిన కథ: దేవత చెప్పిన సలహాలతో జాజులమ్మ తన సంసారాన్ని బాగు చేసుకొని గడిచిన కాలం లో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి జీవితాన్ని పండించు కుంది. ఆ తరువాత ఆమె తీసుకున్న నిర్ణయం ఈర్లచ్చిమిని ఆశ్చర్యానికి గురిచేసింది .

***

          రోజులు గడిచి నిండు అమాస వేళ జాజులమ్మ జాబిల్లి లాంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

          ఈర్లచ్చిమి ఎంతగానో పొంగి పోయింది. ఆడపిల్లలు లేనందుకు మనుమరాలు పుట్టిందని అందరి నోళ్ళు తీపి చేసింది.అది చూసి రాజయ్య ,

          సిగ్గులేదు !నీకు !ఇంకోగరి కాళ్ళు పట్టుకొనే బాన్చతనం నా కొడుక్కు తెచ్చిందని ఏ మాత్రం సోయి లేకుండా ఏమిటీ మురిపెం ?అన్నాడు చిరాగ్గా.

          మురిపెమే !లగ్గం గాదు అని కొన్ని దినాలు ,లగ్గమైనా పిల్లలు గారని కొన్ని దినాలు నలుగురు నానా తీర్ల ఎకసేక్కేం చేసిండ్రు. ఇప్పుడు ఆల్లందరి నోళ్ళు మూతవడి నా కొడుకు ఇంకింత బాధ్యతగ ఉండడానికే ఆ దేవుడు బిడ్డనిచ్చిండు. వానికి పావురమంటే ఎరుక చెయ్యడానికే బిడ్డనిచ్చిండు. నీకూ ఓ బిడ్డుంటే ఇట్లున్దపోడువు గావచ్చు……అని మరోసారి నోరెత్తకుండా చేసింది.

          కొడుకా!నీకు మాలచ్చిమి పుట్టిందిరా. నీ దశ తిరిగినట్టే.ఇంగా నువ్వు నారాజు గా బతికే రోజులు పోయినయి. దర్జాగా మీసం మెలేసి తిరుగచ్చు . అని పుట్టిన పసికందును తెచ్చి సయిదులు చేతిలో పెట్టింది.

          సైదులు బండరాతి లాంటి చేతులకు ఆ కూన మెత్తగా తగిలేసరికి ఒక్క క్షణం మధురానుభూతికి లోనయ్యాడు. కొద్ది సేపటికే ఏడవడం మొదలు పెట్టడంతో
అవ్వా ! నువ్వే ఎత్తుకోవే ఎత్తుకోవే ఏడుస్తాంది ,నన్ను చూసి భయపడుతున్నదేమో !అన్నాడు.

          పిచ్చి సన్నాసి !భయపడడం కాదురా !ఆకలిగా ఉన్నట్టుంది .ఇప్పుడు నేనేత్తుకున్న ఊరుకోదురా ! అని జాజులమ్మ ఒళ్ళో చేర్చింది. ఆ ముగ్గురిని ప్రశాంతంగా వదిలేశారు .

          జాజులమ్మను చూస్తూ ..సయిదులు నువ్వు నొప్పులతో ఏడుస్తుంటే నీకు ఏమైనా ఆపతి కలుగుతదని గజ్జున లోపల లోపల వణికిన .అన్నాడు మెల్లగా .

          ఆ మాటలకు జాజులమ్మ నీరసంగా నవ్వింది.

***

          కొత్త లేకుండా సాధారణ ప్రసవం చేసినందుకు దేవతను ఆసుపత్రి వర్గం అభినందించింది . సర్కారు దవాఖానా ల పట్ల, పౌష్టికాహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను గూర్చి గ్రామీణులలో అవగాహన కల్పిస్తున్నందుకు ఆమెను ఘనంగా సన్మానించారు.

          దేవత ఆ సంతోషం లో

          మీ వల్లే నాకు ఇంత గొప్ప గౌరవం దక్కింది. ఇన్ని రోజులుగా ఈ ఊర్లో పని చేస్తున్నా ఎవ్వరూ నా మీద పూర్తి భరోసా పెట్టుకోలేదు. కాన్పు సమయానికి ప్రైవేటుకు పోయేవారు. ఈ రోజున నేనే మళ్ళీ ఓ బిడ్డను కన్నట్టుగా ఆనందంగా ఉంది. దీనితోనైనా జనాలు అనవసరమైన డబ్బు ఖర్చు, అనారోగ్యం బారిన పడకుండా ఒక చక్కని ఋజువు దొరికిందని ఎంతగానో తృప్తి చెందింది.

          ఇట్లా ఎవరికీ వారు ఆ బిడ్డను చూసి ఆనందిస్తుండగానే ఇరవయ్యొక్క రోజు రానే వచ్చింది.

          ఈ ఉత్సవాన్ని కూడా ఘనంగా చేసింది ఈర్లచ్చిమి .

          పీరయ్య ,పూజారి మొదలుకొని అందరూ తొట్టెలో వేసి ఊయల లూపారు .

          వేప చెట్టుకు కట్టి చిన్నీ ఉయ్యాలా …
          ఊపరారేమే చిలుకలారా ……..
అని జోల పాటలు పాడి ఆ బిడ్డకు ఈర్లచ్చిమి కోరిక మేరకు అమ్మ వారి పేరు ‘’శార్వాణి’ పెట్టారు.

          కాన్పు తరువాత తల్లీ బిడ్డల ఆరోగ్యం కోసం బలానికి,బిడ్డకు కడుపు నిండా పాలకు అవసరమయ్యే ఎచ్చాలు చేసి తెచ్చి వారి అభిమానాన్ని చాటుకున్నారు. కాళ్ళకు వెండి కడియాలు,వానిపయి గజ్జెల పట్టీలు చేతులకు నల్లటి దిష్టి పూసలతో,తలకు కట్టిన పట్టుకుచ్చుల కుల్లాతో ఆ బిడ్డ అందంగా మెరిసిపోయింది.

          ఈర్లచ్చిమి తల్లికి. బిడ్డకు దిష్టి తగలకూడదని మంచం పక్కన పాత చీపురు, చెప్పులు కాపలాగా ఉంచింది. అదొక్కటే కాక ఊదు పొగ వేసి ఎప్పటి కప్పుడు బట్టలు మారుస్తూ తానె పిల్ల తల్లిగా కంటికి రెప్పలా కాపాడసాగింది.

          సయిదులు బిడ్డ పట్ల తన తల్లి చూపుతున్న శ్రద్ధకు తానూ కూడా తల్లికి ఆసరా కాసాగాడు.’ సయిదులు బిడ్డ కోసమని మరింత కష్టం చేయసాగాడు.

***

          మూడేళ్ళ కాలం గడిచింది.

          ఈ కాలం లో ఎన్నో మార్పులు. జాజులమ్మ కు ఇద్దరు అమ్మాయిలు కవల  పిల్లలు కలిగారు. ఇద్దరినీ చూసుకోవడం కొంచెం ఇబ్బందిగా మారింది. ఈర్లచ్చిమికి అప్పుడప్పుడూ ఛాతిలో నొప్పి రావడం మొదలయింది. అయినా ఆమె మనుమరాళ్ళ పట్ల ఏ మాత్రం నిర్లక్ష్యం లేకుండా ఆలనా పాలనా చూసుకోసాగింది.

          రాజయ్య మాత్రం

          ఒక్కరు ఒయ్యి ముగ్గురు ఆడోల్లే అయిండ్రు. రేపటికి ఎట్లా ?గుమ్ములకు గుమ్ములు ఇంట్ల సొమ్ములు ఏం మూలుగుత లెవ్వు. ఒకరిని ఉంచుకొని మిగిలిన ఇద్దరిని లేని పిల్లాజెల్లా లేనోల్లకు సాదుకం ఇత్తే మంచిగుంటది. మనకూ పైసలు కనవడుతయ్.మల్ల మగపిలగాడు అయ్యేదాంక ఫోటోల చూపించి తీసేయించితే సరి. అని దారుణంగా మాట్లాడడం మొదలుపెట్టాడు.

          ముగ్గురు పిల్లల తల్లయినా మామ అంటే భయం,భక్తి వల్ల ఎదురు చెప్పలేక లోపల లోపల కుముల సాగింది.

          ఈర్లచ్చిమి మాత్రం ,

          దేవుడిచ్చిన బిడ్డలు. ముగ్గురయితెంది?ముప్పయి మందయితెంది?ఆడపిల్లలని అలుసుగా మాట్లాడుడే కాక, ఇంకా సక్కదనానికి కొడుకు పుట్టేదాంక ఫోటోల చూపిచ్చు కుంట తెసేసుకోవాల్న? బుద్దున్న పెద్ద మనిషి మాట్లాడే తరిక గిదేనా? నీలాగ సోచాయించవట్టే ఆడపిల్లలకు ఆపద వచ్చింది…..అంటూ తీవ్రంగా రాజయ్యను,అతడి ఆలోచనను ఖండించి వేసింది.

          దేవత సలహా తీసుకొని జాజులమ్మకి కుని ఆపరేషన్ చేయించింది.
సయిదులుకు చేయించాలన్న ఈర్లచ్చిమి ఆలోచనను జాజులమ్మ ఒప్పుకోలేదు.
ఆంతర్యం ఈర్లచ్చిమికి బోధ పడలేదు.

          రాజయ్య కొంత తగ్గినా అప్పుడప్పుడూ వారసుడు లేడనే అక్కసును ఏదో రకంగా వెల్ల బోస్తున్నాడు.

          ఈర్లక్ఛిమి ఓ రోజు జాజులమ్మను అడిగింది.

          ఎందుకే ?కాన్పు కాకుంట నువ్వు ఆపరేషన్ చేయిన్చుకున్నవెందుకు ?ఆడవాళ్ళం చాలా పనులు చేస్తూ పెయ్యంత పున్దయితాన్తది. మల్ల గిసూన్తివింటే ఇకింత బెజారయితం కదా!అని .

          ఏమయినా కానియి అత్తా మామకు వంసం పోతాందనే రంది పట్టుకునే. గందుకని నేను నా పిల్లల తీస్కోని మా ఊరికి పోతా. ఆయనకు మళ్ళా లగ్గం జేత్తే మగపిలగాండ్లు అయితే వంశం నిలవడి అందరం సంబురంగ ఉంటం కదా !

          నాకు లగ్గమవుడే కల అనుకున్న. దేవుడు దయ జూసి లగ్గం జేసి ముగ్గురు బిడ్డలను ఇచ్చి నాకు బతుకు మీద ఇష్టమిచ్చిండు. కోరికలు తీరితే మనసు ఎంత కుషీగుంటదో ఎరుక జేసిండు. గట్నే మామ కు కూడా మనువడు పుడితే ఎంత మంచిగుంటడు. రంది పెట్టుకొని పాణం తెరలు చేసుకోడు. నిన్ను సుత ఇంకా మంచిగా చూసుకుంటడు ……అని తలెత్తకుండా కళ్ళలోని కన్నీరు అత్తకు కనిపించకుండా చెప్పుకు పోతున్న జాజులమ్మ ను ఆశ్చర్యంగా చూసింది.ఈర్లచ్చీమి.

          జాజులు !నీ మాటలు విన్టాంటే కాలం మల్ల ఎనుకకు పోతాందాని అనుమానమత్తాంది. మా తరంల గిట్నే ఉండి మీ తరముల సుత గిట్నే ఉంటె ఆడ పిల్లలు, ఆడ జన్మ ఇగెన్నడే బాగుండేది? ఈ తీర్గ మాట్లాడ నీకు ఇంతనన్న శరమనిపిస్త లేదా? నీళ్ళల్ల పడ్డప్పుడు మనకు తెల్వకుండనే అటిటు కాళ్ళు చేతులు కొట్టుకుంట బతకాల్నని పాకులాడుతమే! నువ్వెందే నేను మునుగుతనని కాళ్ళు చేతులు ముడుచు కుంటానవ్? పిరికిగ ఉరుకుతాంటే మీ మామలాంటి ఊరకుక్కలు తరిమి తరిమి ఉరికిస్తనే ఉంటయి. ధైర్నం జేసి ఎదురు నిలవడితే తోక ముడుస్తయ్. నువ్వు నా పిల్లలు అనుకుంటున్న ఆ పిల్లలు నా మనుమరాండ్లు అన్న సంగతి యాది మరువకు. ఆళ్ళను నేనెట్ల ఇడ్సి పెడుత …అంటూ జాజులమ్మ అర్థం లేని ఆలోచనను కొట్టి పారేసింది.

          సయిదులుతో ఆ రాత్రి జరిగిన సంగతి వివరంగా చెప్పింది.

          సయిదులు నవ్వి,మొదటిసారే దిక్కులేక ఇన్నెండ్లకు లగ్గమయితే ,ఇంకా రెండోపారి సుతనా ?నా బిడ్డలే నన్ను మనిషిని జేసిండ్రు.ఇన్నోద్దులు ఎవల కోసం అని అనుకున్న నాకు ఇప్పుడు బిడ్డల కోసం ఎంత పనైన చెయ్య బుద్ధయితాంది. ఎంత దూరమైనా పోబుద్ధయితాంది. దాని పిచ్చి మాటలు నువ్వు లెక్క జేయ్యకే అవ్వ !…అని పిల్లల మీద మమకారం తో సయిదులు మాట్లాడిన మాటలకు ఈర్లచ్చీమి ఉప్పొంగి పోయింది.

***

          జాజులమ్మ బతుకమ్మ పండుగని పుట్టింటికి బయలుదేరి వెళ్ళింది. ఊరు వాళ్ళందరూ ఆమెను ఆప్యాంయం గా వచ్చి చూసి పలుకరించి పోతున్నారు. పీరయ్యకు మనుమరాళ్ళ ఆటలతో సమయమే తెలియడం లేదు.

          బతుకమ్మ కోసం బంతి,మందార,సీతజడలు,గుమ్మడి వంటి పూల మొక్కలను పాదులు తీసి పెంచగా అన్నీ జాజులమ్మ జీవితం లాగే విరగ బూసి ఆనందాన్ని చూసేవారికి పంచుతున్నాయి.

          ఆ రోజు ఎంగిలి పూల బతుకమ్మ.తెల్లవారు జాముననే లేచి పీరయ్య తంగేడు పూలను, గునుగు పూలను గుట్టకు పోయి ఎదురుకురాగా జాజులమ్మ …

          బంగారు పళ్ళెము మా యన్నలియ్య ఉయ్యాలో ……
          గుమ్మడాకుల పరుపు గా పరిచి …………………………..
          తంగేడు,గునుగుల ముగ్గుల్లు వేసి ………………………
          మా లచ్సిమిని తలుచుక ………………………………….
          రమ్మని పాడుతు ……………………………………………..
          బతుకమ్మ పే ర్వంగ …………………………………………
అంటూ బతుకమ్మను పేర్చి ఆ సాయంత్రం గుడి చేరింది. ముగ్గురు బిడ్డలను చుట్టూ చేర్చి బతుకమ్మను ఆడిస్తూ చిన్ననాటి నేస్తాలందరినీ కలుసుకుంది. కానీ ఆ ఊర్లోనే ఉండే కమల కలవక పోవడం ఆమె కు బాధగా అనిపించింది. రేపు ఇంటికయినా వెళ్ళి కలిసి రావాలని అనుకోని ఇల్లు చేరి ఆ విషయమే తండ్రి తో చెప్పింది.

          అదివిని తండ్రి చెప్పిన సంగతి విని జాజులమ్మ తల్లడిల్లింది. కమలకు పెళ్ళి కావడమే కాక ,నెల లోపునే భర్త ఆత్మహత్య చేసుకోవడం ,ఆమెను అందరూ నష్ట జాతకురాలిగా చూస్తూ వె లేస్తున్నారని, అందుకే తానె ఎవరితోనూ కలువకుండా ఒంటరిగా ఉంటున్నదని తెలిసి భరించలేక పోయింది.

          మరునాడు పిల్లలను తండ్రికి అప్పగించి తాను కమలను కలవడానికి వెళ్ళింది.
మొదట మాట్లడడానికి,చూడడానికి ఇష్టపడని కమల స్థితిని అర్థం చేసుకొని తానె బ్రతిమిలాడుకొని స్నేహితురాలిని ఆప్యాయంగా అక్కున చేర్చుకొని ఓదార్చింది.
కమల ద్వారా తెలిసిన దారుణం ఆ ఊరి కామందు ఒకడు ఎలాగూ నీది రాలిన జీవితమే కాబట్టి నాతో ఉంటే రాజభోగాలు చూపిస్తా అని వెకిలిగా మాట్లాడి అల్లరిపెడుతుండడంతో బయటికి రావడం కూడా మానేశానని చెప్పిన మాటలు విని, చిక్కి శల్యమయిన కమలను చూసి జాజులమ్మ బాగా ఏడ్చింది. తనివితీరా ఆమె చెప్పుకున్న వెతనంతా విని అక్కడి నుండి స్నేహితురాలికి కొత్త జీవితం ఇవ్వడం లో తన అత్త ఈర్లచ్చిమి సాయం తీసుకోవాలని ఆలోచిస్తూ ఇల్లు చేరింది.

*****

ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.