గవ్వలు

తమిళ మూలం – హరన్ ప్రసన్న
తెలుగు అనువాదం – రాజీ రఘునాథన్

          మురళీధర రావు తన  మనోభావాల బారానికి తట్టుకోలేక ఎక్కడ పడిపోతాడో అని అనిపించేటట్లు తూలుతూ నడుస్తున్నాడు. ఆయన సన్నటి శరీరం మీద అంత కంటే సన్నటి జంద్యం గాలిలో తేలుతుంది. పైన కప్పుకుని ఉన్న ఉత్తరీయాన్ని లాగి నల్లగా, ఎండిపోయి ఉన్న చను మొనని  కప్పుకున్నాడు.  బట్ట తలలో మిగిలి ఉన్న ఒకటీ రెండు తెల్ల వెంట్రుకలు పొడవుగా గాలికి వేలాడాయి. నుదుటి మీద దిద్దుకున్న నామం చమటలో కారుతుంది. భుజం మీది ఉత్తరీయంతో  ముఖాన్ని గట్టిగా తుడుచుకున్నాడు. నామం మధ్య ఆయన దిద్దుకున్న బొగ్గు  గీత తగిలి తుండు గుడ్డ  నల్లగా మారింది. కళ్ళజోడు ధరించి తెల్లగా క్షయమయిన చెట్టు కొమ్మ నడిచి వస్తున్నట్టున్నది ఆయన నడక. వృద్ధాప్యం తో పాటు ఆయన మనస్సులోని కల్లోలం కారణంగా వేగంగా నడవలేక పోయినా వేగంగా నడుస్తున్నాడు.

          ప్రియమైన స్నేహితుడు రాఘవేంద్ర రావుని తలుచుకున్నాడు. ఆయన స్నేహితుడు మాత్రమే కాదు. జ్యోతిష్కుడు కూడా. ఆయన చెప్పినవి ఏవీ ఫలించక మానవు. ఒకటీ రెండు ఫలించ లేదోమో అని వెంటనే గుర్తుకు వచ్చింది. దానికి కారణం కూడా తన గ్రహచారమే అయి ఉండాలి. ఎందుకంటే రాఘవేంధ్ర రావు చెప్పినా కూడా ఫలించ లేదంటే తను ఎంతటి ధౌర్భాగ్య వంతుడై ఉండాలి అని అనుకున్నాడు.

          కానీ రాఘవేంధ్రుడు జాతకాన్ని చూడడు. వెంటనే ఓ సంఖ్య చెప్పమంటాడు. అందులో నుండి ఆయన మనస్సు వెను వెంటనే రెండుగా, నాలుగుగా, వేయిగా విస్తరిస్తూ పెరిగి, అన్నీ ఒక్క సారిగా చేరి క్షణంలో ఓ వాక్కు పలుకుతాడు. అంతే. అదియే ఆయన జ్యోతిష్యం. పిమ్మట పిలిచి, ‘గవ్వలు వేసి చూసాను. బ్రహ్మాండంగా ఉంది’ అంటాడు. అన్ని గవ్వలూ వెల్లకిలా పడి  తెలుపు చూపిస్తే యోగముట. చెప్పాడు.

          ఇంకా కూడా రాఘవేంధ్రుడు చెప్పిన దాన్ని ఆలస్యం చెయ్యటం మంచిది కాదు అనే నిర్ణయానికి వచ్చాడు మురళీధర రావు. ఈ రోజే వెళ్లి ఆ ఆవును కొనుక్కు రావాలి అని తలవంగానే ఆయన  మనస్సులో వేగం పెరిగింది.

          “ఇక్కడ అత్త గారి మూత్రాన్ని తుడిచే దిక్కు లేదు. ఇంకా ఆవు ఒక్కటే తక్కువ” అని కోడలు నిష్టూరంగా అన్న మాటలు గుర్తుకు రాగా, ఒళ్ళు బలహీనమై దారిలో పక్కనే పడి ఉన్న ఓ రాయి మీద కూర్చున్నాడు. ఆయాసం వచ్చింది. తనకు గుండె పోటు ఒస్తుందేమోనని భయపడ్డాడు. కానీ తనకు అంత అదృష్టం కూడానా అని విరక్తి చెందాడు. లక్ష్మి లాగా తానూ సంవత్సరాల తరపడి మంచంలో పడి మూత్రంలో నాని కోడలి చేతిలో దెబ్బ తినే చావే రాసి పెట్టి ఉంటుంది అని అనుకుని బాధపట్టాడు.

          లక్ష్మి ఇరవైయ్యవ ఏట ఈయనకు భార్యగా వచ్చింది. ఇవ్వాళ మంచం పట్టి ఉంది. ఈ రోజుల్లో ఆమెకు ఏది గుర్తు ఉండటం లేదు. క్రూరమైన కాలం అన్నింటిని చెత్త కాగితంగా తుడిచి పారేస్తుంది. చాప మీద ‘ఎవరో ఈమె’ అన్నట్లుగా పడి ఉంది. ఆమె అంతట ఆమె ఎప్పుడన్నా నవ్వుకుంటుంది. దగ్గరికి వెళితే చాప నిండా పడియున్న మూత్రం దగ్గరకి వెళ్ళనీకుండా తరుముతుంది.

“నన్ను కాదని ఇంట్లోకి ఆవు గనక వచ్చింది అనుకోండీ, ఇక నేను ఇంట్లో ఉండను” అని ఖచ్చితంగా చెప్పేసింది కోడలు.

          రాఘవేంధ్రుడు ఓ సంఖ్య చెప్పుమన్నాడు. కాసేపటికల్లా “గవ్వలు వేసి చూసానురా” అన్నాడు. “ఏమి వాక్కు వచ్చిందంటే, ఇక లక్ష్మిని కాపాడటం మన వల్ల కాదు. ఇంకో లక్ష్మిని తీసుకెళ్ళు ఇంటికి. ఈమెకు విముక్తి లభిస్తుంది” అన్నాడు.  

          అది ఏమీ లెక్కో మురళీధర రావుకి అర్ధం కాలేదు. కాని ఇలా అర్ధం కాని ఎన్నో విషయాలు రాఘవేంద్ర రావు చెప్పినవి సరిగ్గా జరిగాయి. దాన్ని మరువ లేము.

          తాను ఉన్న స్థితిలో ఇంకో నోరు లేని జీవి ఎందుకు అని ఓ క్షణం ఆలోచించాడు మురళీధర రావు. ఆయన యావత్ కుటుంబం ఆయనని నోటికి వచ్చినట్టు తిడుతుంది. “అన్నం పెడుతున్నాము కాదా, రామా క్రిష్ణా అని పడి ఉండాల్సిందేగా” అంటారు. కానీ గవ్వలు అబద్ధం చెప్పవుగా.  దానిని ఎవరు వింటారు?

          ముందు రోజు రాత్రి మంచి వాన. చలిలో ఒణుకుతూ ఆయన నిద్ర పోతున్నప్పుడు లక్ష్మి ఏదో కలవరిస్తున్నట్టు అనిపించింది. దగ్గరకి వెళ్లి చూసాడు. ఆమె మాటలు అర్ధం కాలేదు. లక్ష్మీ! లక్ష్మీ!  అని పిలిచాడు. ఆమెవద్ద నుండి ఏమీ సమాధానం లేదు. కాసేపట్లో మరలా గొణిగింది. చాపలో రంగు పోయిన చీరలాగా పడి ఉన్న భార్యను చూసి ఆయన మనస్సు బాధపడింది. భరించలేక పోయాడు. నిధానంగా ఆమె కళ్ళను తెరచి చూసాడు. శుక్లాలు పడియున్న కంటిలో ఇంకా ప్రాణం ఉంది. కాని ప్రకాశం లేదు. ఒళ్ళంతా మంచం పుండ్లు. రేపు తుడిచి మందు రాయాలి అనుకున్నాడు. ఇంకా ఈమె ఎన్నాళ్ళు అవస్త పడుతుందో అని తలచి భయపడ్డాడు. ఆమె చేతిని తీసి తన చేతిలో పెట్టుకున్నాడు. అందులో ఏ స్పందన లేదు.

          రాఘవేంద్ర రావు చెప్పాడు, “ఏమి చెయ్యలేము, త్వరగా తీసుకెళ్ళి పొమ్మని భగవంతుణ్ణి ప్రార్దించుకో. అలా వేడుకోవటం ప్రారంభించి చాలా రోజులు  అయినయి.  కొత్తలో అలా వేడుకున్నప్పుడు కంటి నిండా నీళ్ళు కదిలేవి. ఒక వేళ ఆమెకు నయమయి లేచిందంటే ఆమె ముఖాన్ని ఎలా చూస్తాను అని ఆలోచించేవాడు. కానీ లక్ష్మి ఆయనకు ఆ కష్టాన్ని ఇవ్వలేదు.

          “ఇక్కడ జానకీ తోట ఎక్కడ ఉందీ?” అని ఓ ఆటోవాడిని అడిగాడు. ఆయన దారి చూపించాడు. ఇప్పుడు కూడా ఏమీ జరగనట్టు తిరిగి వెళ్ళిపోవచ్చు. ఇంటికెళ్ళి లక్ష్మి దగ్గర కూర్చుని పొద్దున్నే కాఫీ, మధ్యాహ్నం భోజనం రాత్రి పాలు తాగుతూ గడిపేయ వచ్చు. అప్పుడప్పుడు కోడలు ఏదో ఒకటి అంటుంది. కానీ భోజనంలో లోటు చెయ్యదు. కొద్దిగంత స్వాభిమానం తగ్గించుకుంటే చాలు. మహారాజులాగ బ్రతికేయవచ్చు. లేకపోతే లక్ష్మిలాగా ఏదీ వినపడనట్లు ఉండి పోవచ్చు. లక్ష్మిని తలవంగానే ఆయనకు గొంతులో ఏదో అడ్డు పడినట్టు బాధ కలిగింది. కుందులు లాగా ఇంటికి వచ్చి దీపం పెట్టిన పెళ్ళాం. హుమ్…

          జానకి తోట చాల చిన్న వాకిలితో లోపల చాలా పెద్దగా విశాలంగా ఉంది. చాలా రకాల మొక్కలు పండించ పడి ఉన్నాయి. కొబ్బరి చెట్లు ఓ ఐదు వందలన్నా ఉంటాయి. ఓ కొబ్బరి బొండం కొట్టి ఇస్తే లక్ష్మికి ఇవ్వొచ్చు. ఆమె తాగుతుందా? ఏమో. చిన్న చిన్న తేనెటీగల పెట్టెలలో తేనె నిండుగా ఉన్నాయి. మురళీధర రావుకు ఆశ్చర్యంగా అనిపించింది. తేనె కూడా లక్ష్మికి తీసుకెళ్లవచ్చు. అడిగి చూద్దాం అని అనుకున్నాడు. ప్రక్రుతి శుద్ధమైన తేనె ఒంటికి మంచిది. ఎవరి ఒంటికి? అని అనుమానం వచ్చి దానిని దాటి లోపలకు వెళ్ళాడు. చెరుకు పంట కనపడింది. నిమ్మ చెట్లు కనబడ్డాయి. నిమ్మ కాయలు చాలా కాసి ఉన్నాయి. తోటలో మెల్లగా నడిచి ఓ గుడిసె ముందు నిలబడి, “మేనేజర్ గారు ఉన్నారా?” అని అడిగాడు.

          మేనేజర్ వచ్చి  మడత మంచము మీద కూర్చుని ఆయననూ కూర్చోమన్నాడు. ‘శ్రీ రామా!’ అనుకుంటూ కూర్చున్నాడు. కొంచం మనసు శాంతించి, “రాఘవేంద్ర రావు గారు పంపారు” అన్నాడు.

          మేనేజరుకి అన్నీ రాఘవెంద్రుడే నంట. ఆయన చెప్పింది ఏది మానడంట.ఆయన చెప్పనది ఏదీ చెయ్యడుట. రాఘవెంద్రుడ్ని ‘రావ్ జీ గారు’ అని ప్రస్తావించాడు మేనేజర్. వారు నడయాడే జ్ఞానవంతుడు అన్నాడు.

          చిన్న వయసులో తనతో కలిసి బావిలో ఈత కొట్టి స్నానం చేసిన రాఘవేంద్రుడు ఈ రోజు ఎంత పై స్థితిలో ఉన్నాడు అని తలచి మురళీధర రావు పొంగిపోయాడు. ఆయనకు మంచి భార్య. మంచి కోడలు అని గుర్తుకు వచ్చించి. అది ఓ వరం అనుకున్నాడు. తన భార్య కూడా మంచిదే. కోడలు కూడా మంచిదే అనే తలంపు కూడా తోడుగా గుర్తుకు వచ్చింది. అన్నీ ఉన్నా తనకు  ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆయనకు ఎన్నడూ అర్ధం అయ్యేది కాదు.

          ‘పాలు ఇవ్వలేని ఒట్టిపోయిన  ఆవులను కసాయి దుకాణానికి అమ్మటం తప్ప వేరే దారి లేదు’ అన్నాడు మేనేజర్. కేరళలో అలాంటి ఆవులను చాలా ఇష్ట పడుతారుట. 

          “దేవుడా!” అన్నాడు మురళీధర రావు. ఆయన కడుపులో ఓ అగ్ని బంతి ఆడ్డు పడినట్టు అనిపించింది.

          తక్కువ ధరలో ఓ ఆవును కొని ఇవ్వమని రాఘవేంద్రుడితో చెప్పి ఉంచాడు.

          “రావ్ జీ గారు చెప్పారు. అందుకే ఓ పాలు ఇవ్వలేని ఆవును మీకు ఇద్దామని…” అన్నాడు మేనేజర్. 

          “దానికి ఎక్కువ దాణా, తవుడు పెట్టనక్కరలేదు. ఎక్కువగా పచ్చి గడ్డి కూడా అవసరం లేదు. ఏది ఇస్తే అదే తింటుంది. అరవదు. చివరిగా దూడను కని నాలుగేళ్లయింది. దానికి కంటి చూపు కూడా తగ్గి పోయింది. కానీ ఆ ఆవు మా పొలంలోని మొదటి ఆవు. అందుకే దాన్ని కసాయి వాడికి అమ్మలేదు. రావ్ జీ గారు చెప్పారు కాబట్టి  మీకు ఇచ్చేస్తున్నాను. అక్కడ అది ప్రాణంతో ఉంటుంది. రెండు వేలు ఇస్తే చాలు” అన్నాడు మేనేజర్. కసాయి వాడి వద్ద ఐదు వేలు దాకా అమ్ముడు పోతుందంట. తోలుకి మంచి ఆదాయం వస్తుందన్నాడు.

          “ఇవన్నీ నాతొ చెప్పకండి” అని ఒణుకుతున్న స్వరంతో చెప్పాడు మురళీధర రావు.

          “సారి సామి” అన్నాడు మేనేజర్ నవ్వుతూ.

          బయిలుదేరే ముందు ఆవుకు ఓ కొమ్ము విరిగిందనీ, అందులో చీము, పురుగు పట్టిందనీ, దానికి మందు ఇస్తానని అన్నాడు. రోజుకు ఓ సారి మందు వేయమన్నాడు. కోడలును తలుచుకున్నాడు మురళీధర రావు. “మిమ్మల్ని ఆ ఆవుతో పాటు కట్టేస్తాను. కంపు ” అనే కోడలి గొంతు వినపడింది ఆయనకు.

          “ఆవును ఎలా తీసుకెళుతారు?” అని అడిగాడు మేనేజర్.

          ఏమి సమాధానం చెప్పాలో తెలియక మురళీధర రావు, “పక్కనే, దగ్గరే ఇల్లు” అన్నాడు.

          మేనేజర్ నవ్వుతూ, “మీరు వెళ్ళండి. నేను పంపిస్తాను” అన్నాడు.

          “నేను ఓ సారి ఆవును చూడొచ్చా?” అని అడిగాడు మురళీధర రావు.

          ఎవరినో పిలిచి, “లక్ష్మిని ఈయనకు చూపించు” అన్నాడు మేనేజర్. 

          ఆ గుడిసెలోని చెక్క కొమ్మని పట్టుకుని నిలబడ్డ మురళీధర రావు “భగవంతుడా!” అని నిట్టూర్చి, “తరువాత చూస్తాను లే అబ్బాయి” అని చెప్పాడు.

          రెండు వేల రూపాయిలు ఇచ్చేసి రాఘవేంద్రుడిని ఫోనులో పిలిచి, “ధన్యవాదాలు” అన్నాడు.

          వెంటనే రాఘవేంద్ర రావు, “పది లోపల ఓ నంబర్ చెప్పు” అన్నాడు.

          ఏమి చేప్పాలో తెలియక, “నాలుగు” అన్నాడు మురళీధర రావు.

          “నాలుగు అంటే… నాలుగు ఏడులు, మూడు ఆరులు, రెండు ఐదులు… అంటే…” అని లెక్కలు వేసి ఓ క్షణం ఆగాడు రాఘవేంద్ర రావు.

          ‘వేరే ఏదైనా నంబరు చెప్పి ఉండాల్సింది. తొందర పడ్డానేమో’ అని అనుకుని చింతించాడు మురళీధర రావు.

          “సమస్య ఏమి లేదు. అంతా మంచికే” అన్నాడు రాఘవేంద్ర  రావు. కాసేపు తరువాత మరలా ఆయనే పిలిచి, “గవ్వలు కూడా వేసి చూసాను. అవి కూడా అదే చెప్పాయి” అన్నాడు.

          ఇంటిలోకి వెళ్ళగానే కోడలు ఒకటే గోల. “ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు మా ప్రాణం తీస్తారు? ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఎందుకు ఎత్తరు? ఇక్కడ అత్తకు ఒళ్ళు చల్లబడి పోయింది” అంది.

          మురళీధర రావుకి తల తిరిగింది.

          “ఆయనకు ఫోన్ చేసాను” అన్నది కోడలు.

          కొడుకు ఓ కారు తీసుకువొచ్చి లక్ష్మిని ఎక్కించుకుని హాస్పిటలుకు తీసుకు వెళ్ళాడు.

          “ఇక్కడ మురళీధర రావు గారి ఇల్లు ఇదేనా?” అని అడుగుతూ ఒకడు ఆవును పట్టుకొచ్చాడు.

          అప్పుడే మురళీధర రావు ఆవును మొదటి సారిగా చూసాడు. ఒళ్ళు ఎండి పోయి, పొదుగు కుంచించుకు పోయి ముఖంలోని ఎముకలు ముందుకు పొడుచుకుని ఉన్నాయి. ఓ కొమ్ము విరిగి అందులో ఈగలు వాలాయి. ఆ ఆవు కూడా ఆయన లాగే నిలకడగా ఉండక అటు ఇటు చూస్తున్నది.

          “ఎక్కడ కట్టను?” అని అడిగాడు పనివాడు.

          కోడలు పట్టరాని కోపంతో మామగారిని చూసింది. “నా కర్మ. నా మెడలో కట్టు ఆ ఆవుని” అని చెప్పేసి తలను చేతులతో కొట్టుకుని ఇంటి మధ్యలో కూర్చుని ఏడవటం మొదలు పెట్టింది. తన మాట ఎవ్వరు వినటం లేదు అని, తనకు ఎవ్వరు లేరు అని ఆమె ఏడుస్తుంటే, తొందర పడ్డామేమో అని మురళీధర రావు భయపడ్డాడు.

          హాస్పిటల్ నుండి లక్ష్మిని ఇంటికి తీసుకు వచ్చాడు కొడుకు. చక్కర లెవల్ తగ్గటం వల్ల ఒళ్ళు చల్ల పడినట్టు చెప్పాడు. మరలా యథా ప్రకారం చాప మీద పడుకో పెట్టాడు. ఇక వాకిలి ఇనుప గ్రిల్ కి కట్టేసి ఉన్నఆవును ఏమి చేయాలో తెలియక చూస్తూ కూర్చున్నాడు మురళీధర రావు.

          “ఏమి చేయ బోతున్నారు ఈ ఆవుతో?” అని నిలదీసింది కోడలు.

          మురళీధర రావు ఒణుకుతున్న స్వరంతొ, “అది కాదు. దాని పేరు కూడా లక్ష్మే” అన్నాడు.

          ఏమి సమాధానం చెప్పాలో తెలియక చూస్తున్న కోడలితో ఇంకా ఇలా అన్నాడు, “ ఆ మేనేజరు పచ్చి గడ్డి, దాణా అన్నీ పంపిస్తాను అన్నాడు”.

          “అంతా నా తల రాత. నాకు చావు వస్తే కాని ఈ ఇంటికి మంచి రోజులు రావు” అని చెప్పేసి లేచి లోపలకు వెళ్ళింది కోడలు.

          మరలా రాఘవేంద్ర రావుకు ఫోన్ చేసాడు మురళీధర రావు. “తొందర పడి ఆవును కోనేశానేమో” అన్నాడు.

          “నీకు కష్టంగా ఉంటె, నేను మేనేజర్ తో చెప్పి ఆవును తిరుగి తీసుకెళ్ళమని చెప్పనా?” అని అడిగాడు రాఘవేంద్ర రావు.

          “డబ్బు పోతే పోయింది. ఆవును  తీసుకెళ్ళమను” అన్నాడు మురళీధర రావు.

          “గవ్వలు పొరపాటు చెప్పవు రా మురళీధరా” అన్నాడు రాఘవేంద్రుడు. కాని మురళీధర రావు గొంతులోని భయాన్ని గ్రహించి, “సరే. మేనేజర్ తొ నేను చెప్పిచూస్తాను” అన్నాడు.

          ఇంటి బయిటకి ఒచ్చి ఆవు పక్కన నిలబడి మెల్లిగా దానిని నిమిరాడు మురళీధర రావు. వెంటనే మేనేజర్ చెప్పింది గుర్తుకు రాగా, లోపలకు వెళ్లి మేనేజర్ ఇచ్చిన మందు తీసుకు ఒచ్చి దాని విరిగిన కొమ్ములో రాసాడు. పుసులు కట్టిన కళ్శ తో ఉన్న లక్ష్మి తలను ఊపింది. కింద పడి ఉన్న పచ్చి గడ్డి తీసి దానికి చూపించాడు. దానికి కనిపించ లేదు. మెల్లిగా ముక్కు దగ్గర తీసుకెళ్ళాడు. అది వాసన చూసి మెల్లిగా నాలుక ను బైటకు చాచి తిన్నది.

          ఆ రోజు రాత్రి కొడుకు కోడలు ఇరువురు పట్టరాని కోపంతొ మురళీధర రావును అనరాని మాటలు అన్నారు. “ఈ ఇంటిలో ఆవును పెంచటం ఎలా సాధ్యం?” అని మరలా మరలా అడిగారు. “మమ్ముల్ని సంప్రదించాలా వద్దా?” అనే ప్రశ్నకు ఆయన వద్ద సమాధానం లేదు.

          “రాఘవేంద్రుడు చెప్పాడు. ఒక లక్ష్మి వస్తే ఒక లక్ష్మికి విముక్తి లభిస్తుంది అని. అందుకే…” ఆయన మాటలు ఆయనకే వినపడని స్వరంతో చెప్పాడు.

          కోడలు పెద్ద గొంతుతో, “వాడు ఓ ఫ్రాడు. వాడికి మీరు సరైన జోడి. ఆవు వస్తే అత్తకు మంచిగ ఆవుతుందా? ఇది ఏమి జ్యోతిష్యం? చెప్పే వాడు వేయి చెప్తాడు. మీకు బుద్ధి ఉండక్కర్లేదా?” అని నిలదీసింది.

          మురళీధర రావు ఏదీ బదులు చెప్పకుండా తన స్థానానికి వెళ్లి పడుకున్నాడు.

          మరుసటి రోజు పొద్దున్నే కోడలు బిగ్గరగా అరుస్తూ  కొడుకుని లేపింది. చప్పుడు విని మురళీధర రావు లేచి వచ్చి చూసాడు. లక్ష్మి ఎప్పటిలాగే పడుకుని ఉంది. బయిటకు వచ్చాడు. అక్కడ ఆవు పచ్చి గడ్డి మధ్యలో నాలుగు కాళ్ళూ విరుచుకుని గట్టిపడి ఉన్న నోటిలో నుండి నీరు కారుతూ విముక్తి చెంది ఉంది.

***

రచయిత హరన్  ప్రసన్న గారి గురించి :

హరన్  ప్రసన్న గారు  తమిళ భాషలో ఇరవై ఏళ్ళుగా  సాహిత్య రంగంలో సేవలు చేస్తూ మంచి రచయిత గా గుర్తింపు పొందారు. మూడు కథల సంపుటాలు‌, రెండు వ్యాస సంపుటాలు, ఒక కవితా సంపుటం, ఒక నవల ప్రచురింంచబడ్డాయి. చెన్నైలో శ్వాసం అనే ప్రచురణ సంస్థను నడుపుతున్నారు.  

         

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.