ఖబర్ కె సాత్

పుస్తకాలమ్’ – 14

(ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ )

  -ఎన్.వేణుగోపాల్

సాధించిన కథన నైపుణ్యం ఎక్కడికి పోతుంది?

           ఈ వారం నాకు ముప్పై అయిదేళ్లుగా మిత్రుడూ, చాల ఆత్మీయుడూ అయిన ఒక కథకుని పుస్తకం పరిచయం చేస్తున్నాను. తాను కథకుడు మాత్రమే కాదు, కవి, విమర్శకుడు, విద్యార్థి ఉద్యమ, సాహిత్యోద్యమ కార్యకర్త, రసాయన శాస్త్రవేత్త, విద్యార్థుల అభిమానం చూరగొన్న ఉపాధ్యాయుడు, అన్నిటికన్న మించి సుతిమెత్తని మంచి మనిషి. అయితే ఈ పుస్తకాన్ని పరిచయం చేయడానికి ఎంచుకోవడం నా స్నేహం వల్లనో, ఆ వ్యక్తిత్వ లక్షణాల వల్లనో మాత్రమే కాదు. నా వరకు నాకు అది ఒక అద్భుతమైన కథల సంపుటం. నాకు చిరకాలంగా ఉన్న ఒక సాహిత్య, సామాజిక ప్రశ్నకు ఆ పుస్తకం సమాధానం చెప్పిందనిపించింది.

           చిన్నప్పుడెప్పుడో నేర్చుకున్న అక్షరాలు, గుణింతాలు, ఎక్కాలు జీవితాంతం ఎలా గుర్తుంటాయి? ఆ అక్షరాలతో, గుణింతాలతో, ఎక్కాలతో నిత్య సంబంధం లేకపోయినా, సంబంధం తెగిపోయినా, ఎంత హఠాత్తుగానైనా అవసరమైనప్పుడు మెదడు ఎట్లా రిట్రీవ్ చేయగలుగుతుంది? ఒకసారి నేర్చుకున్న నైపుణ్యాన్ని కొన్ని ఏళ్లపాటు, దశాబ్దాలపాటు వాడకపోయినా, ఆ నైపుణ్యం అవసరమైనప్పుడు అప్పుడెప్పుడో వదిలి పెట్టిన స్థాయిలోనో, ఇంకా పై స్థాయిలోనో ఎలా వస్తుంది? ఈ మామూలు ప్రశ్నలు నాకెప్పుడూ ఉండేవే. మానవ మేధ సృజనాత్మకత అనే మహాద్భుతం గురించి, సూపర్ సూపర్ కంప్యూటర్ అయిన మెదడుకు ఉండే రిట్రీవల్ శక్తి గురించి ఎంత చదివినా, ఆలోచించినా ఈ ప్రశ్నలను రేకెత్తించే అనుభవాలు నా కెప్పుడూ అబ్బురంగానే తోస్తాయి.

           ఇప్పుడీ పుస్తకం అటువంటి అనుభవమే కలిగించి, ఆ ప్రశ్నలనే మరొకవైపు నుంచి వేసి, అద్భుతమైన జవాబులు చెప్పింది. ఈ కథకుడు ఇరవై ఐదేళ్ల కింద కథలు రాయడం మొదలుపెట్టాడు. ఐదేళ్ల పాటు విరివిగా రాశాడు. వస్తువుల ఎంపికలో, వస్తు పరిశోధనలో, శిల్ప నైపుణ్యంలో, భాషా వినియోగంలో మిరుమిట్లు గొలిపాడు. గొప్ప వాగ్దానం ఇచ్చాడు. కారణాలేమైనప్పటికీ ఇరవై ఏళ్ల కింద సాహిత్యానికి, కథా రచనకు, లేదా ప్రచురణకు దూరమయ్యాడు. లేదా నేనలా అనుకున్నాను. ఇరవై ఏళ్ల తర్వాత రెండు సంవత్సరాలుగా మళ్లీ కథా రచనలోకి, ప్రచురణలోకి వచ్చాడు. నాకు ఆశ్చర్యం కలిగించినదేమంటే, ఇరవై ఏళ్ల మౌనం తర్వాత, ధ్యానం తర్వాత, ఆ పాత వాగ్దానమూ నైపుణ్యమూ చెక్కు చెదరలేదు సరిగదా, ఎన్నో మెట్లు పైకి ఎదిగాయి.

           ఆ కథకుడు శ్రీనివాసమూర్తి. తాను రాసిన మొదటి కథ 1990లో అచ్చయింది. ఐదేళ్ల విరామం తర్వాత 1995 నుంచి 2001 మధ్య మరొక ఎనిమిది కథలు అచ్చయ్యాయి. మళ్లీ ఇరవై ఏళ్ల విరామం తర్వాత 2020లో రెండు, 2021 లో నాలుగు కథలు అచ్చయ్యాయి. ఆ పదిహేను కథలూ కలిసి ఇప్పుడు ‘ఖబర్ కె సాత్’ అని ఒకే సంకలనంగా వచ్చాయి. సుదీర్ఘ విరామానికి ముందు, తర్వాత రాసిన కథలు అనే ప్రత్యేకత మాత్రమే కాక, ఈ సంకలనానికి ఈ విరామాన్ని అధిగమించిన, విస్తరించిన నైపుణ్యధార అనే ప్రత్యేకత కూడ ఉంది.

           విప్లవోద్యమ నేపథ్యంలో నిర్బంధం ఎదుర్కొంటున్న ఒక రైతు తాను చేసే సేద్యానికీ, తన కొడుకు చేసే విప్లవానికీ పోలిక చూసిన కథ ‘సేద్యం’, ఇరవై ఎకరాల ఆసామి కుటుంబం తమ భూమిని శ్రీశైలం ప్రాజెక్టు కింద ముంపులో పోగొట్టుకుని పడుతున్న కడగండ్ల కథ ‘ఊరు మునిగింది’, కుటుంబ వ్యవస్థ స్త్రీల పట్ల జరుపుతున్న అమానుష దుర్మార్గాల కథ ‘ధ్వంస రచన’, గ్రామీణ కులవృత్తుల ఘర్షణను, ధిక్కారాన్ని చిత్రించిన ‘అడివోడు’, దళితులపై అవమానకరమైన అత్యాచారం కథ ‘మేడమీద వేలాడే కత్తి’, పారిశుధ్యపు పనికీ “స్త్రీల పని”కీ భేదం లేదని చూపిన ‘ఇదీ మన పనే’, పార్లమెంటరీ రాజకీయాలు మనుషుల మధ్య ఎటువంటి విభజనల ద్వారా వోట్లు రాబట్టగలవో చెప్పిన కథ ‘ఓటు మల్లన్న’, భూమి సమస్య ఒక గ్రామంలో రేపగల ఘర్షణల, హింసల కథ ‘దేవుని మాన్యం’, మాల మాదిగల మధ్య ఘర్షణను శత్రుపూరితం చేస్తున్న గ్రామీణ పెత్తందారీ కుట్రల పథకాల కథ ‘ఏకం గార్రి’ – ఈ తొమ్మిది కథలూ విరామం ముందరి ఉధృత ప్రవాహ కాలానివి.

           పంటపొలాల మీద పడుతున్న ఏనుగుల సమస్య మీద వీథి నాటకం దగ్గర మొదలై, రాజ్య స్వభావం దాకా, తాత్విక చర్చల దాకా విస్తరించిన ‘స్వాములొచ్చారు’, కరోనా నేపథ్యంలో కార్పొరేట్ కాలేజీల అక్రమాలతో చిత్త చాంచల్యానికి గురైన లెక్చరర్ కథ ‘హాయి హాయీ హాయీ ఆపదలు గాయీ’, కోవెల ఏనుగు మావటి జీవిత కథ ‘కోవెల మావటి’, పొలుసుల వ్యాపారం కోసం అలుగులను వేటాడితే పర్యవసానాలు ఎలా ఉంటాయో చెప్పిన పర్యావరణ కథ ‘దొర్లు దొర్లు పుచ్చకాయ్’, పరిశోధన కోసం వెళ్లి కశ్మీర్ తల్లుల, తండ్రుల విషాదాన్ని తన అనుభవంలోకి తెచ్చుకున్న ఉత్తరాఖండ్ పరిశోధకుడి ద్వారా కశ్మీర్ చరిత్ర కథనం ‘ఖబర్ కె సాత్’, కార్పొరేట్ కాలేజీ అధ్యాపకుల జీవిత నేపథ్యంలో మనిషి రూపాల చిత్రణ ‘కవుడు అనునొక కాపటి’ – ఈ ఆరు కథలూ విరామం తర్వాతి జలపాత తరంగాల కాలానివి.

           విరామానికి ముందు అయినా, తర్వాత అయినా వస్తువుల ఎంపిక, వైవిధ్యం ఆశ్చర్యం గొలుపుతాయి. కార్పొరేట్ కాలేజీల నేపథ్యం ఉన్న రెండు కథలు మినహాయిస్తే, మిగిలిన పదమూడు కథలు ఒక్కొక్కటీ ఒక ప్రత్యేక, విభిన్న వస్తువును చిత్రించినవి. ఒకే వస్తువు పునరావృతం కాలేదు. నిజానికి నేనిక్కడ సులభ పరిచయం కోసం ఒక స్థూల కథాంశాన్ని ప్రస్తావించాను గాని, వీటిలో ఏ ఒక్క కథా ఆ ఒక్క కథాంశానికే పరిమితం కాలేదు. పొరలు పొరలుగా, అనేక, తరతమ స్థాయిల్లో అనేక అంశాలను చదువరి దృష్టికి తెస్తూ, అంతిమంగా అవగాహనను ఉన్నతీకరించే అద్భుతమైన శిల్పంలో విస్తారమైన వస్తువును, వస్తువులను చిత్రించిన బహుపార్శ్వాల కథలు అవి.

           కథా వస్తువుల వైవిధ్యం ఒక అంశమైతే, భిన్నమైన కథా వస్తువులు తీసు కున్నప్పుడు, ఆ కథల నేపథ్యం అంతే భిన్నంగా, ప్రత్యేకంగా ఉండడం కోసం విస్తృతమైన పరిశోధన చేయడం, ఆ పరిశోధనాంశాలతో కథను విశ్వసనీయ వాతావరణంలో చెప్పడం, ఆ వాతావరణాన్ని పట్టి ఇచ్చే పరిసరాలను, సన్నివేశాలను,  సంభాషణలను, భాషను ఉపయోగించడం మరొక అంశం. తొలిదశ తొమ్మిది కథలూ స్థూలంగా కర్నూలు, రాయలసీమ వాతావరణంలో ఉండగా, మలిదశ ఆరు కథల్లో ఒకటి తమిళనాడు, ఒకటి కశ్మీర్, ఒకటి చిత్తూరు వాతావరణానివి. రెండు కార్పొరేట్ కాలేజీల వెంట దేశమంతా తిరిగినవి. ఆయా కథల్లో చిత్రణ పొందిన ప్రాంతీయ ప్రత్యేకతలు కథలకు అత్యవసరమైన శక్తినీ, విశ్వసనీయతనూ సమకూర్చాయి.

           అలాగే ఏ కథను ఎక్కడ ఎత్తుకోవాలి, ఎట్లా ముందు వెనుకలుగా నడపాలి, ఏ సాంకేతిక పద్ధతులు వాడాలి, ఎక్కడ ముగించాలి, పాత్రల సంభాషణలకు, మౌనానికి, ఉద్వేగాలకు ఎంతెంత పాత్ర కేటాయించాలి, రచయిత ఎక్కడ జోక్యం చేసుకోవాలి, ఎక్కడ జోక్యం చేసుకోకుండా ఉండాలి వంటి అనేక శిల్ప సంబంధమైన అంశాలలో శ్రీనివాసమూర్తి తొలిదశ కథల్లో చూపిన నేర్పు, సంయమనం, ఔచిత్యం, మలిదశ కథల్లోకి వచ్చేసరికి మరింత పదునుదేరాయి, పరిణతి సాధించాయి, అభివృద్ధి చెందాయి. ఈ కథలకు ఒక కథనశిల్పపు పాఠ్యపుస్తక స్థాయి కలిగించాయి.

           శ్రీనివాసమూర్తికి పరిచయమైనదీ, సన్నిహితమైనదీ కర్నూలు భాష గనుక కావచ్చు, వస్తువు ఏదైనా భాష, ప్రత్యేక పదాలు కర్నూలు భాషలోనే సాగాయి. కాని విచిత్రంగా ఆ కర్నూలు భాషా సౌందర్యం ఏ వాతావరణానికైనా సరిపోయింది.

           మళ్లీ నా మొదటి ప్రశ్న దగ్గరికే వస్తే, ఈ రెండు దశల కథల మధ్య ఇరవై సంవత్సరాల మౌనం, విరామం ఉండడం విస్మరించదగినంత చిన్న విషయమేమీ కాదు. ఆ విరామం మౌనం కాదేమో, సాధన సాగిందేమో అనుకున్నప్పటికీ, ప్రచురణ జరగలేదు గనుక నిశ్శబ్దం ఉండడమైతే వాస్తవం. ఆ నిశ్శబ్దం అవతల ఉండిన నైపుణ్యం, నిశ్శబ్దం ఇవతలికి ఇంత సునాయాసంగా ఎట్లా ప్రవహించింది? మధ్యలో సాధన, రచన, ప్రచురణ అనే వారధులు లేకుండా గుణాత్మకంగా ఎట్లా మెరుగు పడింది?

           ఒక సృజనకర్తకు ఎప్పుడైనా ఎక్కడైనా వస్తువు దొరకడం సులభమే. దానికి కాలంతో, విరామంతో నిమిత్తం లేదు. కాని ఆ వస్తువును సాహిత్యంగా మార్చడానికి అవసరమైన నైపుణ్యం ఉంటుంది గదా, అది కాలంతో ఎట్లా మారుతుంది, ఎట్లా అభివృద్ధి చెందుతుంది, అసలు సాహిత్యం జోలికే పోకుండా కొన్ని దశాబ్దాలు గడిపినాక ఆ నైపుణ్యం మళ్లీ అదే స్థాయిలో, లేదా అంతకన్న పై స్థాయిలో యథాలాపంగా వస్తుందా, లేక మళ్లీ చాల కృషి చేయవలసి వస్తుందా?

           శ్రీనివాసమూర్తిని ఇరవై ఏళ్ల కింద, అంతకు ముందరి పదిహేనేళ్లూ సన్నిహితంగా చూసిన అనుభవంతో, ఆ నైపుణ్యపు నిరంతరాయ ప్రవాహానికి కారణంగా నాకు కనబడుతున్నది తన దృక్పథం, తన విలువలు. నిశ్శబ్దానికి ముందే రూపొందిన, అభివృద్ధి చెందిన దృక్పథమూ విలువలూ నిశ్శబ్దం తర్వాత కూడ కథకుడిగా తన నైపుణ్యాన్ని కొనసాగించే, ఉన్నతీకరించే అవకాశం ఇచ్చాయి. ఒకసారి ఏర్పడిన దృక్పథం, విలువలు ఆగిపోవచ్చు, తిరోగమించనూ వచ్చు, కాని ఆ దృక్పథాన్ని ఎప్పటికప్పుడు పదును పెట్టుకుంటూ ఉంటే, ఎటు వంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా, అంతకంతకూ ఉన్నత జీవన విలువల వ్యవస్థను కలగంటూ, నిలబెట్టుకుంటూ ఉంటే, నైపుణ్యం దానంతటదే ప్రవహిస్తుంది, విస్తరిస్తుంది, జలపాతమై దూకుతుంది.

           అందుకు నిదర్శనం అటువంటి జలపాత సదృశ కథా సంపుటం ‘ఖబర్ కె సాత్’.

           ఆ దృక్పథమూ విలువలూ మారలేదని, పదునెక్కాయని అంకితం ఒక్కటి చదివితే తెలిసిపోతుంది: “రెండు దశాబ్దాలు/ మూడు అసహజ మరణాలు/ నా వ్యక్తిత్వ నిర్మాణంలో/ భాగమైన ముగ్గురు ఆత్మీయులు/ చక్ర వేణు/ రాప్తాడు గోపి/ శంకరన్న/ జ్ఞాపకాలకు”. ఈ మాటలకు వివరణ అవసరం లేదు.

 
*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.