నా జీవన యానంలో- రెండవభాగం- 26

-కె.వరలక్ష్మి

          కొత్త ఇల్లు కట్టుకున్నాక  ‘కిలా కిలా నవ్వులా-కురిసేలే వెన్నెలా!’ అన్నట్టు కళకళ లాడిన మా ఇల్లు పిల్లల పెళ్లిళ్ళై ఎవరిళ్ళకి వాళ్లు వెళ్లేక చిన్నబోయింది. స్కూలు ఆపేసేక మరింత దిగులు తోడైంది. ఒకప్పుడు అందరికీ ధైర్యం చెప్పిన నేను ఏ చిన్న సమస్యనూ తట్టుకోలేనంత బలహీనమై పోయాను.

          ఉత్తరం వైపు పెరట్లోను, ఇంటి చుట్టూ ఉన్న నేలలోనూ వేసిన పూలమొక్కలు, పండ్ల చెట్లు నాకు తోడయ్యాయి. వాటి సంరక్షణ, వాటి మధ్య తిరగడం ఒక రిలీఫ్ గా ఉండేది. మనం పెంచిన పిల్లలైనా వాళ్ల అసంతృప్తిని ఏదో ఓ రూపంలో వెళ్లగక్కుతారు కానీ అవి అలాచెయ్యవు కదా! తిరిగి మనకి పళ్లు పూలు ఇచ్చి సేదతీరుస్తాయి.

          ఒకసారి ఒక కొబ్బరి మొక్క కాపు రాలేదని “మిగలిన అన్నీ కాపుకొచ్చాయి, నువ్వెందుకురా ఇలా ఉండిపోయావు?” అని జాలిగా, మృదువుగా నిమురుతూ అన్న పది రోజుల్లో పూతకొచ్చి ఆశ్చర్యపరచింది. అవి కూడా మన మాటలు వింటాయని, మనల్ని అర్థం చేసుకుంటాయని తెలిసిందప్పడే. మనుషులు చేసే మోసాలు అవెప్పటికీ చెయ్యవు.

          ఇంట్లో అద్దెకున్న వాళ్లతో స్నేహంగా, మృదువుగా ఉంటే వాళ్లేమో వాళ్ల వైపున్న సబ్ మీటరు తిరగకుండా చేసి మొత్తం కరెంటు బిల్లంతా నేనే కట్టేలా చేసేవాళ్లు. నేను స్కూలు ఆపేసేక ఒకే ఒక్కసారి మా మోహన్ గారు పాతిక కేజీల బియ్యం, 500 రూ॥ ఇచ్చి, “ఇంటద్దె ఏం చేస్తున్నావ్? దాంతో ఇల్లు నడపొచ్చుకదా! బేంకులో ఉన్న డబ్బులు తీసి వాడితే మంచిది” అంటూ నీతి బోధలు చేసాడు.

          1992లో వచ్చిన మొదటి పెరాలసిస్ స్ట్రోక్ తర్వాత మోహన్ కి మరో రెండు సార్లు స్ట్రోక్స్ వచ్చాయి. ఒకసారి రాజమండ్రి నుంచి ఆలమూరు స్కూలుకి వెళ్తుండగా మూతికీ, కంటికీ. మరోసారి రాజమండ్రి నుంచి జగ్గంపేట వస్తూండగా కాలుకీ, చేతికీ. మొండిమనిషి టెంపరరీగా మందులు వాడెయ్యడం, తిరిగేయడం. ఆయన చెప్పిన జాగ్రత్తలు పాటించడం లేదని మా ఫేమిలి డాక్టరు జయగారు ధైర్యం చేయనని కొప్పడ్డారు. ప్రకృతి సహజమైన కామవాంఛ సాంస్కృతిక భావాల్తో కలిసి దాంపత్యప్రేమగా రూపొందుతుంది. ప్రేమ లేని దాంపత్యం ఉత్త కామవాంఛ కోసమే కొనసాగు తుంది. లేదా ఇద్దర్నీ దూరం చేస్తుంది.

          1998లో అజో-విభా ఫౌండేషన్ వారి ఐదవ వార్షికోత్సవ సభలు రాజమండ్రి ఆనెం కళాకేంద్రంలో జరిగాయి. ఆ సంవత్సరం లైఫ్ టైం ఎచీవ్ మెంట్ ప్రతిభామూర్తి పురస్కారం శ్రీ నండూరి రామ్మోహన రావు గారికి ఇచ్చేరు. ముందు సంవత్సరం ప్రకటించిన నవలల పోటికి నవల రాయలేక పోయాను గృహ కల్లోలాల వల్ల. నవలకు వారు ఇచ్చిన 50 వేలను గీతాంజలి, బండి నారాయణస్వామి చెరిసగం అందుకున్నారు. వారి ఆహ్వానం మేరకు ఆ నాలుగు రోజులూ ఉదయం వెళ్లి సాయంత్రానికి తిరిగి వస్తూ నేనూ పాల్గొన్నాను.

          ఆ జనవరి పదో తేదీన ప్రఖ్యాత రచయిత్రి తెన్నేటి హేమలత కాలం చేసారు.

          ‘అవమానాలు చేసినవాళ్లు పిల్లలైతే మాత్రం వాళ్లని ఎప్పట్లాగే ప్రేమించడం సాధ్యమైతే ఆ తల్లి ఆత్మాభిమానానికి అర్థమేముంది?’ అంటారు రంగనాయకమ్మగారు జానకి విముక్తి లో.

          1998 మార్చి 22, 23, 24 వ తేదీల్లో జరిగిన మధ్యప్రదేశ్ తెలుగు మహాసభలకు భిలాయ్ రమ్మని ఆహ్వానం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి నేను, కాత్యాయనీ విద్మహే, జయధీర్ తిరుమల రావు, ఒమ్మి రమేశ్, కాళేశ్వరం శంకరం, అందెశ్రీ, ఎనౌన్సర్ ఆశాలత, అంతర్జాతీయ తెలుగు కేంద్రం డైరెక్టర్ డా.ఎన్.శివరామమూర్తి గారు నాగ్ పూర్  వరకు దక్షిణ్ ఎక్స ప్రెస్ లోను, అక్కడి నుంచి పూణే-హౌరా ఎక్స ప్రెస్ లోను ప్రయాణం చేసి భిలాయ్ చేరుకున్నాం. ఇంకా అప్పటి తెలుగు యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ నాయని కృష్ణకుమారి, ఆంధ్ర సాంస్కృతిక శాఖా మంత్రి పడాల అరుణ, అద్దేపల్లి రామమోహనరావు, ఎండ్లూరి, దర్భశయనం, కె.శివారెడ్డి, ఎ.అప్పల్నాయుడు, ఆర్.ఎస్. కృష్ణమూర్తి, జూకంటి జగన్నాధం, అప్సర్ మొదలైన వారంతా వేరే వాహనాల్లో చేరు కున్నారు. మాకందరికీ స్టీల్ ప్లాంట్ వారి స్టార్ గెస్ట్ హౌస్ ఇచ్చారు. మొదటిరోజు ఇనాగురల్ ఫంక్షన్ తర్వాత నెహ్రూ సాంస్కృతిక భవనంలో కూచిపూడి నాట్యం, వీణ, బుర్రకథ, అద్భుతమైన ఛత్తీస్ గఢ్ జానపద నృత్య ప్రదర్శనలు జరిగాయి. నేను 23న కవి సమ్మేళనంలో పొల్గొన్నాను. 24న తెలుగుకథానిక- ప్రస్తుత ధోరణులు చర్చలో స్త్రీవాద కథ గురించి మాట్లాడేను, మధ్యాహ్నం అందర్నీ స్పెషల్ బస్సులో భిలాయ్ స్టీల్ ప్లాంట్ చూపించేరు. నిజంగా యంత్ర రాక్షసే అది. లోపల భరించలేని వేడి, కాస్సేపటికే విలవిలలాడిపోయాం. అక్కడ వర్కర్స్ ఎలా భరిస్తున్నారో అనిపించింది. 24 రాత్రికే అందరం తిరుగు ప్రయాణమయ్యాం.

          94 మే 4న కవి ఆరుద్ర కాలధర్మం చెందారు.

          జూన్ 13న హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ‘చలం’ సభలో కవిసమ్మేళనంలో గీత, నేనూ పోయెమ్స్ చదివేం. జూన్ 14న వెస్ట్ మారేడ్ పల్లిలోని అస్మిత ఆఫీస్ లో జరిగిన కథా చర్చలో పాల్గొని, రూప్ కన్వర్ – సతి వీడియో పిక్చర్ చూసాం, ఆ సంవత్సరం ప్రారంభంలో మోహన్ కి హెడ్మాస్టర్ గా ప్రమోషన్ వచ్చింది. ఆ కబురు తెలిసిన మోహన్ ముఖంలో ఎప్పుడూ చూడనంత ఆనందం వెల్లివిరిసింది. దగ్గర్లోని ఏలేశ్వరం గవర్నమెంట్ కాలేజ్-హైస్కూల్ కి ట్రాన్స్ ఫర్ అయ్యింది.

          జూన్ 27న మోహన్ కి ఏలేశ్వరం హైస్కూల్ H.M రూమ్ లో గట్టి స్ట్రోక్ వచ్చింది. ఈ సారి మాటతో బాటు గొంతులోంచి ఆహారం వెళ్లడం ఆగిపోయింది. అంతకు కొన్ని నెలల ముందే డా॥ జయగారు కాలం చెయ్యడం వల్ల రాజుమండ్రి తీసుకెళ్లవలసొచ్చింది. గీత, నేను కలిసి టాక్సీలో స్వతంత్ర హాస్పిటల్ కి తీసుకెళ్ళాం. న్యూరాలజిస్ట్ సెలవులో ఉన్నాడట. ట్రైనీ డాక్టర్స్ “ముక్కులోంచి ట్యూబులు పెట్టి ఆహారం ఎక్కించాలని,మూడు నాల్గు రోజుల కన్నా చెప్పలేమని” మమ్మల్ని బాగా భయపెట్టేసారు. రిసెప్షన్ లో 30 వేలు కట్టమన్నారు. ఈలోగా మోహన్ బెడ్ మీది నుంచి లేచి బైటికెళ్లి సిగరెట్ కాల్చు కోవడం మొదలుపెట్టేడు. హమ్మయ్య అనుకొని, ప్రకాశ్ నగర్ లో వేరే  డాక్టర్ కి చూపించి,  మందులు తీసుకుని ఇంటికొచ్చాం.

          మా అబ్బాయి ఎబ్రాడ్ లో తను పని చేసే చోట వాతావరణం వాళ్ల పాపాయికి
సరిపడడంలేదని జాబ్ వదిలేసి వచ్చి హైదరాబాద్ లో ఇల్లు తీసుకుని కాపురంపెట్టాడు.

          గీతకు ఆంధ్రాయూనివర్సిటీలో డాక్టరేట్ చెయ్యడానికి స్టైఫండ్ తో సీటు వచ్చింది. జాయినైన కొన్ని నెలలకే లెక్చరర్ గా పోస్టింగ్ వచ్చింది. తన Phd ని రెగ్యులర్ నుంచి పార్ట్ టైంకి మార్చుకుని మెదక్ జూనియర్ కాలేజ్ లో జాయినైంది సెప్టెంబర్ 4న.

          మా చిన్న అల్లుడు రాజమండ్రి ట్రాన్స్ర్ ఫరై వచ్చి రాజమండ్రిలో ఉన్నారు.


‘ఏక్ ఖత్రా జిందగీకో సిఖాతాహై సబక్ కభీ షబ్నమ్ బనా కభీగోహార్ బనా కభీ అష్క్’ అంటాడు ఇక్బాల్, ఒక బిందువు జీవితానికి పాఠం నేర్పుతుంది. అది ఒకప్పుడు మంచు బిందువు, ఒకప్పుడు ముత్యం, ఒకప్పుడు బాష్పబిందువు అవుతుంది. తుహిన బిందువు బాల్యం, ముత్యం యవ్వనం, బాష్పబిందువు వార్థక్యం.

ఈ TV లో ఒకరోజు AVM వాళ్ల ‘సంఘం’ మూవీ వచ్చింది. నాకు ఐదేళ్ల వయసుంటుందేమో మా నాన్నకు ఏదో ఆపరేషన్ జరిగి సామర్లకోట బేతిన వీర్రాజు గారి హాస్పిటల్లో ఉన్నాం. మా ఆఖరు మావయ్య హాస్పిటల్ దగ్గర్లో ఉన్న టూరింగ్ టాకీస్ లో ఆడుతున్న ఈ సినిమాకు నన్ను ఎత్తుకుని తీసుకెళ్లేడు. టిక్కెట్టు అడుగుతారని గేటు దగ్గర నన్ను ఎత్తుకుని నిద్రపోయానని చెప్పి గేట్ కీపర్ తో గొడవ కూడా పడ్డాడు. తీరా లోపలికెళ్ళేక నేను నిజంగానే నిద్రపోయాను. అప్పట్నుంచి చూడాలనుకున్న ఆ మూవీ 98 జూలై తొమ్మదిన చూడగలిగేను. మా చిన్న మావయ్య కాలం చేసాక అతడి భార్య అనసూయను పలకరించడానికి కాకినాడ వెళ్ళి నప్పుడు చొల్లంగి దగ్గర్లో రెల్లు కులస్థుల కోసం ప్రభుత్వం కట్టి ఇచ్చిన అతి చిన్న ఇంట్లో ఇన్నాళ్లుగా వాళ్లు అద్దెకున్నారని తెలిసి చాలా బాధ కలిగింది. ముఖ్యంగా ఎప్పుడో పోయిందనుకున్న నా యుక్తవయస్సు నాటి ఫోటో మామయ్య బట్టలు పెట్టుకునే ట్రంకు పెట్టె మూతకి లోపల అతికించి ఉంది. నా బాల్యంలో మామయ్య నన్నెత్తుకుని తిరగడం, తర్వాత కూడా నా మీద ఎంతో ఆప్యాయత కనబరచడం గుర్తొచ్చింది. ఆ జ్ఞాపకాల లోంచి ‘చిన్న మావయ్య’ కథ పుట్టింది. ఆ కథ 27.11.98 స్వాతి వీక్లీలోవచ్చింది.

          అప్పటికి గుర్తింపు పొందిన కథలు రాసిన కొందరు రచయితలను ఎన్నుకుని ఆంధ్రజ్యోతిలో వచ్చిన అలాంటి కథ ఒకటి ఇచ్చి నేపథ్యాలు రాయమన్నారు ఆంధ్రజ్యోతి వాళ్లు. ఆ క్రమంలో నాకు ‘గాజుపళ్లెం’ కథ ఇచ్చారు. ఆ నేపథ్యాన్ని 18.1.98 ఆదివారం ఆంధ్రజ్యోతి స్పెషల్ లో ప్రచురించారు,

          మా వీధి చివర ఒక పూరింటి పేదరాలు, వృద్ధురాలు ఉండేది. ఆమె వాకిట్లో ఒక నేరేడు చెట్టు, ఓ కుంకుడు చెట్టు ఉండేవి. ఆ చెట్లు కాయలు, పళ్లు అమ్మి తన తాగుబోతు కొడుకును కూడా పోషిస్తూ ఉండేది. ఒక రోజు పిచ్చితుప్పల్లోకి బహిర్భుమికి వెళ్లిన ఆమె కొడుకుని పొడపాము కాబోలు కాటేసింది. దాంతో వాడు మంచం ఎక్కేడు. జనాలు ఆమె బుర్ర తినేసి, వాకిట్లో ఆ చెట్లుండడం వల్లే అలా జరిగిందని ఆ చెట్లు కొట్టి౦చేసారు. అయినా ఆ కొడుకూ పోయాడు. ఆమెకి జీవనాధారమైన చెట్లూ పోయాయి. ఈ సంఘటన ఆధారంగా రాసిన ‘నమ్మకం’ కథ 8.6.98 ఆంధ్రప్రభ వీక్లీలో వచ్చింది.

          ఓ పనికిమాలిన మొగుడు పెట్టిన కష్టాల జీవితపు స్త్రీమూర్తి కథ ‘పక్షులు’ 98డిశంబర్ విపులలో ప్రచురింపబడింది.

          మనం తక్కువ ఖర్చులో కట్టుకునే ఇళ్లకు గవర్నమెంటు కడితే అవధి దాటి లక్షలు, కోట్లు ఎందుకౌతుంది అన్నప్రశ్నల్లోంచి పుట్టిన ‘రేపటి చిత్రం’ కథ 25.2.98 విశాఖ రేడియోలో బ్రాడ్ కాస్ట్ అయ్యింది.

          నా ‘పాప’ కథ ఆధారంగా రాసిన ‘అమ్మా’ అనే రేడియో నాటిక 8.8.98న బ్రాడ్ కాస్ట్ అయ్యింది.

          11.5.98 ఆంధ్రజ్యోతి ‘నవీన’ లో ‘ఏకాంత శ్రోతస్విని’ కవిత వచ్చింది. ఇదే కవిత ‘ముద్ర’ సంకలకంలో కూడా వచ్చింది.

          మా గీత తనకు ఉద్యోగం వచ్చిన సందర్భంగా నన్నూ వాళ్ళ తండ్రినీ సౌతిండియాటూర్ కి తీసుకెళ్ళింది. డిసెంబర్ 26న ఇంట్లో బయలుదేరి 99 జనవరి 2వ తేదీకి మేం జగ్గంపేటకి, తను, కోమల్ బాబు మెదక్ కి చేరుకునేలా ప్లాన్ చేసింది. కేరళలోని త్రిచూర్, గురువాయూర్, త్రివేండ్రం చూసి కన్యాకుమారి, మధురై, మద్రాస్, మహాబలిపురం – స్థిమితంగా, లీజర్ గా అన్నీ చూపించింది..

          ‘భగవద్విశ్వాసం’ అనేది ఆది మానవుడి అజ్ఞానం కాదు, జిజ్ఞాసకు సంకేతం’ అంటాడు గ్రాంట్ అల్లెన్,

          ‘మృత్యుభయాన్ని జయించాలంటే శాశ్వతత్వం మీద ప్రీతి నశించాలి’ అంటారు జిడ్డు కృష్ణమూర్తి,

          ‘భార్యాభర్తల మధ్య శతృవైఖరి ప్రబలం అవుతూ ఉన్నప్పడు దాన్ని గమనించుకోకపోతే మాత్రం జీవితం వ్యర్థం అయిపోతుంది. జీవితం అమూల్యమైనది. ఎవరి జీవితం వారి సొంతం’ అంటారు రంగనాయకమ్మ జానకి విముక్తిలో.

          పుస్తకాలు నా మనస్సుకూ హృదయానికి రెక్కలిచ్చాయి. నేను బురద నుండి బైటపడడానికి ఎంతో తోడ్పడ్డాయి. పుస్తకాలు చదవకపోతే నాచుట్టూ ఉన్న మౌఢ్యంలోనూ, నీచంలోనూ, దుఃఖంలోనూ మునిగిపోయి ఉండేదాన్ని. విశాలమైన ప్రపంచాన్ని, ప్రపంచ దృశ్యాల్ని, వ్యక్తుల్ని పుస్తకాలు నా ముందు నిలిపాయి. అప్పడప్పుడూ ఆదమరచి మౌఢ్యంలో కూరుకు పోయినా నన్ను బైటికి లాగి రక్షించేవి పుస్తకాలే –

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.