కాళరాత్రి-20

ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌”

అనువాదం : వెనిగళ్ళ కోమల

         సైరన్లు మోగాయి. లైట్లు వెలిగాయి. అందరం లోనకు జొరబడ్డాం. వాకిలి దగ్గర సూపు బాండీలున్నా ఎవరికీ తినాలనిపించలేదు. మంచాల మీదకు చేరితే చాలనుకున్నాం. చాలా బంకులు ఖాళీగా ఉన్నాయి.

         ఉదయం మెలకువ వచ్చింది. నాకొక నాన్నున్నాడని జ్ఞప్తికి వచ్చింది. హడావిడిగా రాత్రి లోనకు జొరబడిపోయానేగాని నాన్నను పట్టించుకోలేదు. నాన్నకోసం చూడటానికి వెళ్ళాను. నా అంతరంగంలో ఆయన లేకపోతే నాకేమీ బాధ్యత ఉండదనే దుర్మార్గపు ఆలోచన పొడసూపింది. నా ఆలోచనకు నేనే సిగ్గుపడ్డాను.

         గంటల సేపు వెతికినా నాన్న కనిపించలేదు. ఒక దగ్గర నల్ల కాఫీపోస్తున్నారు. హీనంగా గొంతు వినిపించింది. ‘‘బాబూ  ఎలైజా, కొంచెం కాఫీ తెచ్చి పెట్టు’’ అని.

         ‘‘నాన్నా, నీ కోసం గాలిస్తున్నాను. ఎక్కడున్నావు? ఎలా వున్నావు? విశ్రాంతి తీసు కున్నావా?’’ అని అడిగాను. జ్వరంతో మంట కాగుతున్నాడు.

         మిగతా వారిని క్రూరంగా తోసుకుంటూ కప్పు కాఫీ తేగలిగాను. ఒక గుటక వేసి మిగతాది నాన్నకిచ్చాను. నాన్న ముఖంలో వెలసిన కృతజ్ఞతా భావం ఎన్నటికీ మరువలేను. ఆబగా తాగాడు, అప్పుడు నాన్నకు కలిగిన తృప్తి నేను నా బాల్యం అంతటిలో ఎప్పుడూ కలిగించలేదేమో!

         అక్కడ చెక్కల మీదపడి ఉన్నాడు మూలుగుతూ. ఎక్కువసేపు నాన్న పక్కన ఉండలేకపోయాను. శుభ్రం చేయటానికి మమ్మల్ని బయటకు పొమ్మని ఆర్డరు పడటం వలన జబ్బు పడిన వారినే లోన ఉండనిచ్చారు.

         మాకు సూపు యిచ్చారు. లోనకు పోగలిగిన మీదట నాన్న నడిగాను. తిన్నావా?’’ అని. ‘‘లేదు, మాకేమీ ఇవ్వలేదు’’ అన్నాడు. ఎలానూ చచ్చిపోతున్నాం. మా మీద ఆహారం వృధా చేయలేరట’’ అన్నాడు.

         నా దగ్గర మిగిలిన కొంచెం సూపు తప్పనిసరై నాన్నకిచ్చాను. రబీఎలియాహు కొడుకులా నేనూ మారాను. నేను నా డ్యూటీలో ఫెయిలయ్యాను.

         రోజురోజుకీ నాన్న పరిస్థితి దిగజారుతున్నది. వాడిపోయిన ఆకులా ఉన్నది ముఖం. కళ్ళల్లో నీళ్ళు బుకెన్‌ వాల్డ్‌కి వచ్చిన మీదట రోజు రోగులతో సహా అందరూ షవర్‌ చేయాలన్నారు. బ్లాకుల శుభ్రత టైము తీసుకున్నది, బయట వేచి ఉన్నాం.

         దూరం నుండి నాన్నను చూచి దగ్గరకు పరుగెత్తాను. నా వెంట నా నీడలా నడుస్తూ నన్ను దాటి పోతున్నాడు నన్ను గమనించకుండా. నాన్నా! ఎక్కడికి పోతున్నావు అంటే ఒక్క క్షణం నా వైపు చూసాడు. ఎక్కడో చూస్తున్నట్లున్నది ఆ చూపు. నేను ఎరగని వ్యక్తిలా కనిపించాడు. మరల పరుగెత్తాడు.

         నాన్నకు డిసెంట్రీ పట్టుకున్నది. ఇంకా 5గురు రోగులతో ఉన్నాడు నాన్న. పక్కన కూర్చొని ఎంత ఓదార్చినా మృత్యు ముఖం నుండి బయట పడలేకపోతున్నాడు. సడన్‌గా లేచి నా చెవిలో చెప్పాడు. ‘‘సెల్లార్‌లో మన బంగారం, వెండి పాతి పెట్టాను’’ అని.

         అతివేగంగా మాట్లాడుతున్నాడు. చెప్పదలచినదంతా చెప్పే టైము మించి పోతున్నదన్నట్లుగా. ‘‘మనం ఇద్దరం కలిసే యింటికి వెళతాం’’ అని నేను చెపుతున్నా వినలేదు. నోటివెంట రక్తంతో కూడిన నురగ కారుతున్నది. కళ్ళు మూసుకున్నాడు, ఊపిరందటంలేదు.

         నా రేషన్‌ నాన్న పక్కన ఉన్న అతనికిచ్చి అతని మంచం నేను తీసుకున్నాను. డాక్టరు వస్తే నాన్నకేమీ బాగాలేదని చెప్పాను. ‘‘అతన్ని నా దగ్గరకు తీసుకురా’’ అన్నాడు డాక్టరు. నాన్న లేవలేడని చెప్పినా అతను వినిపించుకోలేదు. నాన్నను మోసి అతని దగ్గరకు తీసుకెళ్ళాను. ‘ఏమి కావాలి?’ అన్నాడు. ‘నాన్నకు డిసెంట్రీ’ అన్నాను. ఇది నా కేసు కాదు. నేను సర్జన్ని, జరుగు, వేరే వాళ్ళను రానివ్వు’ అన్నాడు. ఎంతో బ్రతిమాలినా అతనేమీ చేయలేదు. ‘నన్ను బంక్‌కు తీసుకుపో’ అన్నాడు నాన్న. తీసుకెళ్ళి పడుకో బెడితే ఒణికి పోతున్నాడు. నిద్రపోవటానికి ప్రయత్నించమన్నాను.

         కళ్ళు మూసుకున్నాడు. జరుగుతున్నదంతా తెలుస్తున్నది. మరో డాక్టరు వస్తే నాన్న లేవటానికి యిష్టపడలేదు. తనకింకా ఎవరూ ఏమిచేయలేరని అర్థమయింది నాన్నకు. డాక్టరు రోగులను కోప్పడుతున్నాడు. ‘‘దేనికీ పనికిరారు. అలా సోమరిపోతుల్లా పడుకోవా లనుకుంటున్నారు’’ అని నాకు కోపం నషాలానికంటింది. ఎగిరి అతని గొంతు నులమాలనుకున్నాను. నాలో బలంగానీ, ధైర్యంగానీ లేవు అలా చేయటానికి.

         నా చేతులు బిగుసుకుంటున్నాయి. మా నాన్నను చంపుతున్నవారినీ ఈ ప్రపంచాన్ని కాల్చి బూడిద చెయ్యాలని ఉక్రోషంతో కనీసం అరవలేకపోయాను ` గొంతు పెగలలేదు.

         రొట్టెతీసుకు వచ్చేటప్పటికి నాన్న పసిపిల్లవాడిలా ఏడుస్తున్నాడు. ఆ ఫ్రెంచివాడూ, పోలండ్‌ వాడూ నన్ను కొడుతున్నారు బాబూ, వాళ్ళకి చెప్పు నన్ను కొట్టవద్దని, నేను ఎవరికీ అపకారం చేయలేదు అన్నాడు.

         పక్కన వాళ్ళను తిట్టాను. వాళ్ళు నన్ను ఎగతాళి చేశారు. నా రేషను వాళ్ళకిస్తా నన్నాను నాన్నను హింసించకుండా ఉండటానికి. వాళ్ళు నవ్వారు. నాన్న టాయిలెట్‌కి పోలేక పోతున్నాడు.

         మరురోజు వాళ్ళు తన రేషన్‌ తీసేసుకున్నారని చెప్పాడు. ‘నీవు నిద్రపోతున్నప్పుడు తీసేసుకున్నారా’ అని అడిగితే ` లేదు  నన్ను కొట్టి మరీ లాక్కున్నారు.  ఇక భరించలేను బాబూ!’’ అన్నాడు. కొంచెం నీళ్ళు తాగించమన్నాడు. నాన్న నీళ్ళు తాగకూడదు. అవి విషంతో సమానం అని తెలిసినా నాన్నకు నీళ్ళు యిచ్చాను. నీళ్ళు తాగినా, తాగకున్నా యింక ఎంతో సేపు లేదు నాన్న మనుగడ అని అర్ధమయింది. ‘‘నా మీద దయతలచు’ అంటున్నాడు. ఆయన కొడుకునైన నేను దయతలచాలి.

         అలా వారం గడిచింది. బ్లాకల్‌ టెస్ట్‌ ‘‘ఈయన మీ నాన్నా?’’ అని అడిగాడు. ‘‘అవును, చాలా సుస్తీగా ఉన్నది. డాక్టరేమీ చేయలేదు’’ అని నేనంటే, ‘‘ఇంక డాక్టరు గానీ, నీవుగానీ ఆయనకు ఏమీ చేయలేరు’’ అన్నాడు.

         ‘‘చూడబ్బాయి. నీవు కాన్‌సెంట్రేషన్‌ క్యాంపులో ఉన్నావు. ఇక్కడ ఎవరికీ వారే. ఇతరుల గురించి ఆలోచించలేరు. ఇక్కడ నాన్న, సోదరుడు, స్నేహితుడు అనేవారికి విలువలేదు. ఎవరికి వారే బ్రతికినా చచ్చినా, మీ నాన్ననెలాగూ బ్రతికించుకోలేవు. ఆ రేషన్‌ ఆయనకివ్వబోకు. నిన్ను నీవు బాధపెట్టుకుంటున్నావు. ఆయన రేషన్‌ కూడా నీవే తీసుకోవచ్చు’’ అని అంటుంటే అతని మాటలు నిజమే అనిపించాయి. నేను రెండు రేషన్లు తీసేసు కోవచ్చు. అలా అనిపించగానే దోషిగా అనిపించాను నాకు నేను. వెళ్ళి కొంచెం సూపు తెచ్చి నాన్నను తినమన్నాను. ‘వద్దు, నీళ్ళివ్వు’ అన్నాడు. నీళ్ళు తప్ప తనకిప్పుడేమీ అవసరంలేదు.

         ‘‘కాలిపోతున్నాను. నన్నెందుకు అర్థంచేసుకోవటం లేదు నువ్వు?’’ అన్నాడు. నీళ్ళిచ్చాను.

         హాజరు వేయించుకుని వెంటనే నాన్న దగ్గరకు తిరిగి వచ్చాను. రోగులు ఆ బ్లాక్‌లో ఉండవచ్చు. నేను రోగిగా నాన్నతోనే వుంటాను.

         ఎస్‌.ఎస్‌.లు బంకుల చుట్టూ తిరిగి చూస్తున్నారు. నాన్న నీళ్ళివ్వు అని అడుగు తూనే వున్నాడు. నన్ను పిలుస్తూనే ఉన్నాడు. ఆఫీసరు గదిమాడు నోరుమూసుకోమని. కాని నాన్న నీళ్ళివ్వు అని పిలుస్తూనే వున్నాడు. ఆఫీసరు గట్టిగా నాన్న తలమీద కొట్టాడు. నేను కదలలేదు, కదిలితే నాకూ తగులుతాయి దెబ్బలు. నాన్న ఎలైజర్‌ అని పిలుస్తున్నాడు, నేను కదలలేదు.

         నేను హాజరు పలికి వచ్చేటప్పటికి నాన్న మూలుగుతున్నాడు. పెదవులు వణకు తున్నాయి. అలా ఒక గంట దాకా నాన్న ముఖంలోకి చూస్తుండిపోయాను. నాన్న రూపాన్ని మదిలో పొదివి పట్టుకుంటున్నాను. నేను పడుకోవాలి. బంకు ఎక్కాను. నాన్న యింకా జీవించేవున్నాడు. అది జనవరి 28, 1945.

         29 జనవరి ప్రొద్దున్నే లేచాను. నాన్న పక్కమీద మరెవరో రోగి పడుకుని ఉన్నాడు. నాన్నను చీకటితోనే కరెంటు స్మశానానికి  తీసుకుపోయి వుంటారు ఇంకా బ్రతికుండగానే.

నాన్న కోసం ప్రార్థనలు చెప్పలేదు. నాన్న జ్ఞాపకార్థం మైనపు వత్తి వెలిగించలేదు. నాన్న నోట్లో ఆఖరి మాట నా పేరే. నన్ను పిలిచినా నేను పలకలేదు.

         కన్నీళ్ళు రాలేదు. నేను ఏడవనందుకు బాధ పడ్డాను. కన్నీళ్ళు యిగిరి పోయాయి. నాలోని అంతరాత్మను వెదికితే ‘నాకు స్వేచ్ఛ దొరికింది’ అనేది తెలుస్తుందేమో!

         నేను బుకెన్‌వాల్డ్‌లో ఏప్రిల్‌ 11 దాకా ఉన్నాను. ఆ కాలంలో నా జీవితాన్ని వర్ణించ లేను. దాన్ని గురించి చెప్పటం కూడా అనవసరమేమో! నాన్న చనిపోయిన నాటి నుండి నాకే విషయం వైపు దృష్టిపోవటంలేదు.

         నన్ను పిల్లల బ్లాక్‌కు తరలించారు. మొత్తం 600 మందిమి ఉన్నామక్కడ. యుద్ధం ముందుకు నడుస్తున్నది.

         రోజంతా ఏమీ చేయకుండా గడుపుతున్నాను. తినాలనే కోరిక తప్ప నాన్ననీ, అమ్మనీ గురించి ఆలోచించటం మానివేశాను.

         నాకు కలలో కూడా తిండి గురించే ` ఎక్కువ సూపు, రొట్టె దొరికినట్లు.

         ఏప్రిల్‌ 5న చరిత్ర మలుపు తిరిగింది. మధ్యాహ్నపు వేళ ఎస్‌.ఎస్‌. వచ్చి మమ్మల్ని లెక్కిస్తాడని బ్లాక్‌లోనే ఎదురు చూస్తున్నాం.

         ఆలస్యంగా వచ్చాడు. బుకెన్‌వాల్డ్‌లో అలా ఆలస్యంగా రావటం ఇంతకు ముందు జరగ లేదు. ఏదో జరిగే వుంటుంది. రెండు గంటల తరువాత క్యాంప్‌ కమాండర్‌ లౌడ్‌ స్పీకర్‌లో ప్రకటన యిచ్చాడు. యూదులందరూ అపెల్‌ ఫ్లాట్స్‌లో సమావేశమవ్వాలని.

         మా అంతం యిదే. హిట్లర్‌ తన మాట నిలబెట్టుకున్నాడు. మేమంతా ఆర్డరు ప్రకారం ఒక దగ్గర చేరాము. వేరే గత్యంతరం లేదుగదా? గెస్టాపొ ` బ్లాకల్‌ టెస్ట్‌ తన లాఠీ ఆడిస్తూ మాకా సంగతి గుర్తు చేశాడు. దారిలో ఇంకొంత మంది ఖైదీలను కలిశాం. వాళ్ళు మాకు గుసగుసగా చెప్పారు ` మీ బ్లాకులలోకి పొండి జర్మనులు మిమ్మల్ని షూట్‌ చేయ బోతున్నారు. వెనక్కు వెళ్ళండి కదలబోకండి అని.

మేము తిరిగి వెళ్ళాము. క్యాంపులో అంతర్గత తిరుగుబాటు వలన యూదులనెవరినీ వదలకూడదని నిర్ణయించారని తెలిసింది.

         బాగా పొద్దుపోతున్నది. అంతా గడబిడగా ఉన్నది. యూదులు, యూదులు కానట్లు చెలామణి అవుతున్నారు. ‘‘మరురోజు హాజరు వేస్తాము, అందరూ ఉండాలి’’ అన్నారు.

         హాజరు పట్టీ తరువాత బుకెన్‌వాల్డ్‌ క్యాంపు మూసే స్తున్నాము. బ్లాక్స్‌లో వారిని రోజుకింత మందిని తరలిస్తాము. అని లాగర్‌ కమాండెంట్‌ ప్రకటించాడు. ఆ క్షణం నుండి రొట్టె, సూపు ఇవ్వటం ఆపేశారు. తరలింపు ప్రారంభమయింది. ప్రతిరోజూ కొన్ని వేల మంది ఖైదీలు గేటు దాటారు. మరల తిరిగి రాలేదు.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.