మర్చిపోతున్నారు

-లక్ష్మీ శ్రీనివాస్

 

అమ్మ పాలు వదిలి
అమ్మకం పాలు రుచి చూచినప్పుడే
అమ్మ భాషను మరిచి ..
అమ్మకం భాషకు బానిస అయ్యారు!
స్వేచ్ఛగా తెలుగు భాషను
మాట్లాడడానికి మొహం చాటేసుకుంటూ 
పరాయి భాషను బ్రతికిస్తూ
గొప్పగా బ్రతుకుతున్నామని
అనుకొంటున్నారు కాని
బ్రతుకంతా బానిసేనని మర్చి పోయారు !!

నేడు పరాయి భాష కోసం
ప్రాకులాడుతున్న వాళ్లంతా
విదేశాలకు పారిపోయి
కన్న వాళ్ళను అనాధలుగా చేసి
వాళ్ళ కన్నీటికి కారణమవుతున్నారు
తెలుగు జాతి ఆత్మ గౌరవానికి
తెలుగు భాష మనుగడకు 
భంగం చేకూరుస్తున్నారు
చీకటికి వెలుగు కరువైనట్టు
తెలుగుకి తెలుగువాడు మరుగౌతున్నాడు!!

పెద్ద పెద్ద చట్ట సభలలో
సూటు బూటు వేసుకొని
అర్ధం కాని పదాలతో
ఫ్యాషన్ ఫ్యాషన్ గా
ప్లాస్టిక్ నవ్వుని మొఖానికి తగిలించుకొని
మైకుని అటుతిప్పి ఇటు తిప్పి
నాలుగు మాటలు మాట్లాడి
మురిసి పోతున్నారు ..
మతిహీనులై మాతృ భాష ద్రోహులై
మాతృ భాషను మరిచి పోతున్నారు!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.