వడగండ్ల వాన

-రుబీనా పర్వీన్

         ‘డాడీ నువ్వు తొందరగా ఇంటికొచ్చేయ్‌’ అంది ఆద్య.

         ‘ఏమైంది తల్లీ! ఎందుకంత టెన్షన్‌ పడుతున్నావ్‌?’

         ‘నువ్వొచ్చేయ్‌ డాడీ’ ఏడుపు గొంతుతో అంది.

         ‘అయ్యో… ఏడవుకురా. నువ్వేడుస్తుంటే చూడడం నా వల్ల కాదు’

         ‘నేనేడవద్దంటే నువ్వు తొందరగా వచ్చేయ్‌’

         ‘లీవ్‌ దొరకడం లేదు తల్లీ… దొరకగానే వచ్చేస్తా’

         ‘లీవ్‌ లేదు. గీవ్‌ లేదు. జాబ్‌ వదిలేసి వచ్చేయ్‌’

         ‘ముందు ఏడుపు ఆపు. ఏమైందో చెప్పు’

         ‘నాకు భయమేస్తోంది. నువ్వు రాకపోతే మమ్మీ మనిద్దరిని వదిలేసి వెళ్ళిపోతుంది. తొందరగా రా’ ఫోన్‌ పెట్టేసింది ఆద్య.

         బెడ్‌రూమ్‌ వైపు చూసింది.

         తల్లి అలికిడి లేదు.

         ఆఫీస్‌ నుంచి వచ్చి ఫోన్‌ ఛార్జింగ్‌లో పెట్టి స్నానానికి వెళ్ళింది శ్వేత. ఇంకా బయటకు రాలేదు.

         ఆద్య నెమ్మదిగా బెడ్‌రూంలోకి వచ్చి, ఛార్జింగ్‌లో ఉన్న ఫోన్ తీసి చెక్‌ చెయ్యడం మొదలుపెట్టింది. బాత్‌రూమ్‌ తలుపు చప్పుడు అవడంతో ఫోన్‌ తిరిగి ఛార్జింగ్‌లో పెట్టి ఏమీ ఎరగనట్టు బయటకు వెళ్ళబోతుంటే శ్వేత గమనించింది.

         ‘మళ్ళీ పాస్‌ వర్డ్‌ మార్చావా?’

         ‘లేదు మమ్మీ…’

         ‘లాస్ట్‌ వీక్‌ చెప్పాపెట్టకుండా మార్చేశావ్‌… ఆఫీస్‌కు వెళ్ళాక చూసుకున్నా… ఆ రోజంతా చాలా ఇబ్బంది పడ్డా…’

         ‘నీ ఫోన్‌ తో నాకేం పని…’ మొహం మాడ్చుకొని అంది ఆద్య.

         ‘పొద్దున్నుంచి ఇంటిపని, ఆఫీస్‌పని చేసుకొని చచ్చీ చెడి కొంప చేరితే కనీసం పలకరించకుండా ఏంటిది? ఎందుకిలా తయారౌతున్నావ్‌?’

         ‘మమ్మీ నువ్వు నాకు నచ్చట్లేదు’

         ‘ఏం ఎందుకు?’

         ‘నువ్వు సన్నగా, అందంగా ఎందుకౌతున్నావ్‌. ఐ హేట్‌యూ’

         ‘ఆద్యా! షట్‌ యువర్‌ మౌత్‌. ఏంటా వాగుడు?’ కసిరింది శ్వేత.

         ఆద్య కళ్ళల్లోంచి పెద్ద పెద్ద చినుకులు రాలాయి.

         ‘అసలు నువ్వేం పిల్లవి? నేను చాలా హర్ట్‌ అయ్యాను నీ బిహేవియర్‌తో’

         ఆద్య ఇంకా ఏడుస్తూనే ఉంది.

         ‘నేను పోతే నీ పీడా విరగడైపోతుంది’ అరిచింది శ్వేత.

         ఆద్య పరిగెత్తుకొని వచ్చి గట్టిగా పట్టుకొని ‘మమ్మీ అలా అనకు. నువ్వు నాకు కావాలి’ వణికిపోతోంది ఆద్య. వళ్ళు కూడా వెచ్చబడింది.

         శ్వేత ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకొని ‘ఏమైంది ఆద్యా? ఎందుకు భయపడు తున్నావ్‌? చెప్పు?’ గట్టిగా కౌగిలించుకొని కళ్ళు తుడిచింది.

         ‘మమ్మీ. నన్ను వదిలి నువ్వెక్కడికి వెళ్ళొద్దు. నాతోనే ఉండు’ గజగజా వణుకుతోంది ఆద్య.

         ‘నేనెక్కడికి వెళ్తానాన్న. అసలేమైంది నీకు?’ అంటూ తల నిమిరింది శ్వేత.

         నెమ్మదిగా ఆద్య నిద్రలోకి జారుకుంది.

         మంచం మీద పడుకోబెట్టి టిష్యుతో కళ్ళు తుడిచి బెడ్‌షీట్‌ కప్పి కాసేపలాగే ఆద్య పక్కన కూర్చుంది. చటుక్కున ఏదో గుర్తొచ్చి ఆద్య స్కూల్‌ బ్యాగ్‌లోంచి లంచ్‌ బాక్స్‌ తీసి చూసింది. పొద్దున పెట్టిన లంచ్‌ అలాగే ఉంది. ఏమై ఉంటుందా అని భర్తకి ఫోన్‌ చేసింది.

         ‘కిరణ్‌.. ఆద్య ఏమైనా నీకు ఫోన్‌ చేసిందా?’

         కిరణ్‌ వెంటనే రియాక్ట్‌ అయ్యాడు.

         ‘చేసింది. ఏదో వర్రీగా ఉంది. ఏంటి రీజన్‌?’

         ‘అదే తెలియడం లేదు’

         ‘సరే.. రేపు వస్తున్నాను’ అన్నాడు.

         ఫోన్‌ పెట్టేసి కిచెన్‌ లోకి వెళ్ళి వేడి అన్నంలో ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి వేసి కలిపి ఆద్యను లేపింది.

         ‘వద్దు మమ్మీ… నేను తినను’

         ‘నా బంగారు తల్లివి కదూ. కొంచెం తిను. రేపు డాడీ కూడా వస్తున్నారు’ అంది శ్వేత.

         ‘వస్తున్నారా’ కళ్ళు పెద్దవి చేసి గబగబా తినేసింది.

         ప్లేట్‌ సింక్‌లో వేసి చేతులు కడుక్కొని ఆద్య మూతి తుడిచి పడుకోబెట్టి తనూ పడుకొంది. చాలాసేపు నిద్రపట్టలేదు. ఆద్యనే చూస్తూ ఉంది. ఎనిమిది తొమ్మిదేళ్ల పసి పిల్ల. ఆ పసి మనసులో ఏం అల్లకల్లోలం ఉందో. దానికి తానెంత కారణమో… కిరణ్‌ ఎంత కారణమో.

         పొద్దున్నే ఐదు గంటలకు లేచి గంటసేపు జాగింగ్‌ చేసి వచ్చి బేసిల్‌ సీడ్స్, లెమన్‌ వాటర్‌ తాగుతోంది శ్వేత. ఆద్య కూడా లేచి సోఫాలో బద్దకంగా వాలి ఫోన్‌ చేతిలోకి తీసు కుంది. కాలింగ్‌ బెల్‌ మోగింది. ఆద్య హుషారుగా వెళ్లి డోర్‌ తీసింది. ఎదురుగా శ్వేత ఫిట్‌ నెస్‌ ట్రైనర్‌. మొహం కిందకు వేసుకొని పలకరించకుండా బెడ్‌రూంలోకి పరిగెత్తింది.
మామూలుగా అయితే ట్రైనర్‌ బార్బెల్, వెయిట్స్‌ హాల్లోకి తెస్తుంటే ఆద్య మ్యాట్, స్ట్రెచ్చింగ్‌ బ్యాండ్స్‌ శ్వేతకు అందిస్తుంది. అలాంటిది మొహం తిప్పుకొని పలకరించ కుండా లోపలికి వెళ్ళిపోతే ట్రైనర్‌ కొంచెం ఆశ్చర్యపోయాడు.

         ‘మేడం.. ఆద్యనేమైనా కొప్పడ్డారా?’ అడిగాడు.

         ‘అదేం లేదు శ్రవణ్‌. రాత్రి నుంచి ఏంటో మూడీగా ఉంది. కాసేపు వదిలేస్తే సెట్‌ అయి వస్తుందిలే’

         ‘బైక్‌ పార్క్‌ చేసి వస్తుంటే కింద ఒక పెద్దయన ఆపి ఎవరు? ఎక్కడి కెళ్తున్నావ్?‌ లాంటి యక్ష ప్రశ్నలు వేసాడు మేడం. ఎవరాయన?’

         షూ లేస్‌ కట్టుకుంటున్న శ్వేత ఉలిక్కిపడి పైకి చూసింది.

         ‘ఎంత వయసు ఉంటుంది?’

         ‘65 పైనే అనుకుంటా మేడం’

         ‘ఒకసారి బాల్కనీలోంచి చూడు కన్పిస్తున్నాడేమో?’

         తలూపి రెండు అంగల్లో బాల్కనీలోకి వెళ్ళి కిందకి తొంగి చూసాడు.

         ‘మేడం ఇట్రండి, చూపిస్తాను…’

         శ్వేత వచ్చేసింది.

         ‘ఆ చేతులు వెనక్కిపెట్టుకొని గ్రీన్‌ టీషర్ట్‌ ఆయన’

         ‘అపార్ట్‌మెంట్‌ కమిటీ వైస్‌ ప్రసిడెంట్‌’ పైకే అనేసింది.

         ‘ఇంతకు ముందు కూడా నా వెనకాలే వెళ్ళి వాచ్‌మెన్‌ ని ఏ ఫ్లాట్‌కి అతను వెళ్ళేది?’ అని అడుగుతుంటే విన్నాను…

         మేడం! నేను రావడం ఏమైనా ప్రాబ్లమా?’

         ‘పని పాడులేక ఆరాలు తియ్యడం తప్ప ఏం ప్రాబ్లం ఉంటుంది శ్రవణ్‌. నేను కనుక్కుంటాలే’ అంటూ కిందకెళ్ళి మాట్లాడొచ్చింది.

         గబగబా ఆరోజు రెసిస్టెన్స్ ట్రైనింగ్‌ ముగించుకొని రెడీ అయ్యి ఆఫీస్‌కుబయల్దేరింది.
మెట్ల పక్కనే ఉన్న రూంలో వీడియో ఫుటేజ్‌ రివైండ్‌ చేసి చూస్తున్నారు వైస్‌ ప్రెసిడెంట్‌ భార్య మాలతి, సూపర్‌ వైజర్‌ రాయుడు.

         ‘వంట్లో ఎలా ఉంది ఆంటీ?’ పలకరించింది శ్వేత.

         ‘నోట్లో వేసుకున్న బిళ్ళలు నోట్లోనే ఉన్నాయి, ఒంట్లో రోగం తగ్గడం లేదమ్మా…’ అంది మాలతి.

         ‘అయ్యో జాగ్రత్త ఆంటీ’

         ‘సరేగాని అమ్మాయ్‌. ఏంటి? భలే నాజూగ్గా తయారౌతున్నావ్‌ రోజురోజుకి? భలే ఉన్నావ్‌ షిఫాన్ చీరలో’

         ‘థ్యాంకు ఫర్‌ కాంప్లిమెంట్‌ ఆంటీ. టైం అవుతోంది… మళ్ళీ కలుద్దాం…’ పార్కింగ్‌లో కార్‌ తియ్యబోతుంటే వాచ్‌మెన్ వెనుక నుంచి వచ్చాడు.

         ‘అమ్మా! మీకో విషయం చెప్పాలి’ నసిగాడు

         ‘ఏంటి రాములు?’

         ‘అమ్మా! మీ ఇంటికి పొద్దున్నే వస్తాడు సారు, ఆ సారు ఎన్నింటికొచ్చిండు ఎన్నింటికి పోయిండని మాలతమ్మ, రాయుడు సారు రోజు వీడియో చూసిబుక్‌లో రాస్తున్నారు. చాలా సెడ్డగ మాట్లాడుతున్నరమ్మా. మీ మీద వాళ్లు పుకార్లు పుట్టిస్తాంటే దుక్కమెచ్చిందమ్మా’

         ‘అంత పొయ్యేకాలం ఏమొచ్చింది వాళ్ళకు’ కోపంగా అంది శ్వేత.

         ‘అమ్మో. మీ దండం బెడత. నేను చెప్పిన్నని మల్ల జెప్పద్దు’

         ‘వాళ్ళ బొంద. ఏడిసారులే.. నేనేం అడగనులే, టెన్షన్‌ పడకు’ అని వెళ్ళిపోయింది.

         శ్వేత ఆఫీస్‌ నుంచి వచ్చేసరికి కిరణ్‌ ఇంట్లో ఉన్నాడు. ఆద్య కిరణ్‌ని అతుక్కుని అతని ఒళ్ళో కూర్చుంది. కిరణ్‌తో కాసేపు మాట్లాడి లోపలికెళ్ళింది. ఆద్య ఆడుకోవడానికి గ్రౌండ్‌ఫ్లోర్‌కి వెళ్ళింది. కాసేపటికి ఫస్ట్‌ ఫ్లోర్‌లో ఉండే ‌ వనజ వచ్చింది. శ్వేత లోపలుంది వెళ్ళమన్నాడు కిరణ్‌.

         ‘శ్వేతా! చాలా రోజుల నుంచి మాట్లాడుదామను కుంటున్నా. ఆఫీస్‌ నుంచి వచ్చే సరికి రోజూ లేట్‌ అవుతోంది. అందుకే కుదరలేదు’

         ‘ఏమైనా అర్జంట్‌ విషయమా వనజా?’

         ‘అసలు ఈ అపార్టుమెంట్‌లో వాళ్ళకు పని పాడు లేదు. వయసు మళ్ళీనా వీళ్ళ బుద్ధి గడ్డి తింటూనే ఉంది’

         ‘ఏమైంది వనజా…?’

         ‘ఒకరోజు కింద స్పోర్ట్స్‌ కారు ఆగి ఉంది. రాయుడు, మాలతి ఆంటీ సిక్స్‌ జీరో టు రావ్‌ అంకుల్‌ కింద డిస్కషన్ పెట్టారు. ఈ కారు నీ కోసమే వచ్చిందని. అప్పుడు నువ్వు ఊరెళ్ళావు శ్వేతా. అది నాకు గుర్తుండి ఆ మాట వినగానే నాకు ఒళ్ళు మండింది. వెంటనే వాళ్ళను పైకి తీసుకొచ్చి మీ ఇంటికి వేసి ఉన్న తాళం చూపించా. ముగ్గురు నాలుకకరుచు కొని మారు మాట్లాడకుండా వెళ్ళిపోయారు’

         షాక్‌ అయి వింటోంది శ్వేత.

         ‘ఆ రాయుడుగాణ్ణి తన్నాలి. దొంగ వెధవ. ఉద్యోగాలు చేస్తున్న ఆడవాళ్ళంటే వాడికి చులకన. అపార్టుమెంట్‌లో కన్పించిన ఆడవాళ్ళందర్ని కామెంట్‌ చేస్తాడు. ఆ మాలతాంటి వాడి గురువు. రోజు వాకింగ్‌ ట్రాక్‌ దగ్గర కూర్చొని గాసిప్స్‌ స్ప్రెడ్‌ చేస్తుంటారు. వీళ్ళ కూతుళ్ళు, కోడళ్ళు ఉద్యోగాలకెళ్తే కష్టపడుతున్నారు. మిగతా వాళ్ళందరూ తిరగ డానికి కెళ్తున్నారు అనుకుంటారు. వీళ్ళకు బుద్ధెవరు చెప్తారో’

         వెనుక నుంచి కిరణ్‌ వచ్చాడు. కాసేపు మాట్లాడి వనజ వెళ్ళిపోయింది. ఆ వీక్‌ ఎండ్‌ శ్వేత, కిరణ్‌ ఆద్యను తీసుకొని రిసార్ట్‌కి హాలిడేకొచ్చారు. సాయంత్రం పడుకోబోయే ముందు ఆద్యను ఒళ్ళో కూర్చోబెట్టుకొని అడిగాడు కిరణ్‌.

         ‘ఆద్యా! అమ్మ ఎక్కడికి వెళ్ళిపోతుందని అనుకుంటున్నావ్‌?’

         ‘పెళ్ళి చేసుకొని వెళ్ళిపోతుందటగా డాడీ…?’

         కిరణ్, శ్వేత ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు.

         తేరుకొని ‘ఎవరు చెప్పారు?’ అన్నాడు కిరణ్‌.

         ఏమీ మాట్లాడలేదు ఆద్య.

         కిరణ్‌ ఒళ్ళో నుంచి ఆద్యను తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంది శ్వేత.

         ‘నా బంగారు తల్లివి కదూ. ఏం జరిగింది చెప్పు?’

         ‘మరీ మాలతమ్మమ్మ, రావు తాత చెప్పారు…’

         ‘ఏమని…?’

         ‘మీ నాన్న ఇంటికి రాడు. మీ అమ్మ సన్నగా, అందంగా అవుతోంది. ఎవడ్నో ఒకడ్ని పెళ్ళి చేసుకొని వెళ్ళిపోతుంది. అప్పుడు నువ్వెక్కడికి పోతావ్‌? చెప్పు’ అన్నారు అంటూ ఏమోషనల్‌ అయ్యింది ఆద్య.

         కిరణ్‌ ఆద్య కళ్ళు తుడిచి ‘పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లల లాంటి వారే. అమ్మమ్మకు తెలియక అలా అనుకుంది. మనల్ని వదిలేసి అమ్మ ఎక్కడికీ వెళ్ళదు నాన్న’ అన్నాడు.

         ‘ప్రామిస్‌ వెళ్ళవు కదా మమ్మీ’ శ్వేత చేతిలో చెయ్యివేసి అంది ఆద్య.

         ‘ప్రామిస్‌ నాన్న’ అంది శ్వేత.

         ‘మమ్మీకి ఈ మధ్య షుగర్‌ వచ్చింది. ఇంకా రిపోర్టులన్నీ తేడా వచ్చాయి. అందుకే డైటింగ్‌ చేస్తూ ఎక్సర్‌సైజ్‌ చేస్తోంది. దానివల్ల హెల్త్‌ బాగై సన్నబడి అందంగా కన్పిస్తోంది’ అన్నాడు కిరణ్.

         ‘అయ్యో సారీ మమ్మీ. నేను బ్యాడ్‌ గర్ల్‌ని. తెలీక అలా అమ్మమ్మ మాటలు నమ్మేసా, ఇంకెప్పుడూ పిచ్చి మాటలు నమ్మను’ శ్వేత భుజాల చుట్టూ చేతులు వేసి కుయ్‌మని మళ్ళీ ఏడుపు లంకించుకుంది.

         శ్వేత, కిరణ్‌ ఆద్యను ఓదార్చి నిద్రపుచ్చారు.

         శ్వేత కిరణ్‌ భుజం మీద తలవాల్చి కూర్చుంది. శ్వేత ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తోంది కాని తనవల్ల కావడం లేదని గ్రహించిన కిరణ్‌.

         ‘మనం కెరీర్లకు ఇచ్చే ఇంపార్టెన్స్‌ పాపకు ఇవ్వడం లేదు. నువ్వు నా దగ్గరకు రావు నేను నీ దగ్గరకు రాను. పిల్లలు ఇలాంటివే ఆలోచిస్తారు’ అన్నాడు.

         ‘నువ్వు దూరం మాత్రమే చూస్తున్నావు. మన మధ్య తెలియకుండా పెరుగుతున్న దూరాన్ని చూడటం లేదు. డిప్రెషన్‌లోకి పోకుండా కనీసం బాడీ యాక్టివ్‌గా ఉంటే అయినా బెటరని, నువ్వూ సరే అన్నావని పెట్టుకుంటే ఇంతయ్యింది. చివరకు నా మీద డౌట్‌తో పాప నా ఫోన్‌ చెక్‌ చేసే దాకా వెళ్లింది’ అంది శ్వేత.

         వారిద్దరూ ఒకరి పక్కన ఒకరు మాట్లాడకుండా కూచున్నారు. కాని వారు మౌనంగా చాలానే సంభాషించుకున్నట్టు అనిపించింది. ఆ సంభాషణ తమ గురించి, ఆద్య గురించి మాత్రమే జరిగింది.

వడగండ్ల వాన… కాసేపు కురిసి ఆగింది.
ఇక కురవదు.

*****

Please follow and like us:

3 thoughts on “వడగండ్ల వాన (కథ)”

  1. రుబీనాగారు వ్రాసిన కథ వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది. నిత్య జీవితంలో ప్రతి రోజూ చూస్తూనే ఉంటాం. హార్థిక శుభాకాంక్షలు

  2. రుబీనా గారు వ్రాసిన “వడగండ్ల వాన” బాగుంది. ఇలాంటి గాసిప్స్ రోజూ చూస్తున్నవే. మన ముందు మంచిగా మాట్లాడుతూ, మన వెనుక నానా రకాలుగా నిందలు వేసే వాళ్లున్నారు. వాళ్లకి పనీపాటు ఉండదు. పని చేసుకునే వాళ్లను వాళ్ల నోటి తీటతో అవమానపరుస్తుంటారు. కిరణ్ కి, శ్వేతకి అసలు విషయం తెలిసిన తర్వాత టిట్ ఫర్ టాట్ అన్నట్టు ఏదైనా చేసినట్టుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఈ కథను ఆ కోణంలో కూడా ఇంకా బాగా వ్రాయవచ్చు. ఎనీ హౌ, రుబీనా గారి ప్రయత్నం బాగుంది. అభినందనలు.

  3. సంప్రధింపూల ధ్వారానే సకల సమస్యలు పరిష్కార
    మవుతాయని రచయిత్రి చెప్పకనే చెప్పారు.

Leave a Reply

Your email address will not be published.