జ్ఞాపకాల సందడి-46

-డి.కామేశ్వరి 

కావమ్మ కబుర్లు – 23

         పెళ్ళికి మూడు రోజులుందనగా నాన్న మందీ మార్బలంతో దిగేవారు. ఒక సూపర్ వైజర్, నలుగురు కూలీలను వెంట బెట్టుకుని దిగేవారు. హడావుడి మొదలు. పందిర్లు వేయడం, గాడిపొయ్యి తవ్వించడం, పెరడంతా బాగు చేయడం, గడ్డి గాదం పీకించి, చదును చేయించి, ఎత్తుపల్లాలు లేకుండా నాలుగైదు సార్లు దిమిసా కొట్టించి, నాలుగయిదుసార్లు పేడనీళ్ళు జల్లించే వారు. ఆ రోజుల్లో టేబుల్ మీల్స్ ఎక్కువుండేవి కాదు. కింద నేలమీద అరిటాకు లు వేసి భోజనాలు వడ్డించేవారు. మరి తింటున్నప్పుడు విస్తరిలో దుమ్ముఎగరి పడకుండా, ఒకటికి రెండుసార్లు నీళ్ళజల్లించి దిమిసా కొట్టించి సిమెంట్ నేల లా తయారు చేసేవారు. వీధి వైపు కొన్ని కుర్చీలు, ఆడవాళ్లు కూర్చోవడానికి  కింద జంబుకనాలు పరిచేవారు. మామిడాకు తోరణాలు, అరటి చెట్లు, స్తంభా లకి మహ అయితే రంగు కాగితాలు అంటించి తోరణాలు కట్టేవారు. అప్పటి కింకా ఎలక్ట్రిసిటీ రాలేదు కనక అరడజను పెట్రోమాక్స్ లైట్లు – వంటశాలకొకటి, పెళ్ళి పందిరికి రెండు, భోజనాలకి ఒకటి, మిగతావి గదులలోకి వెలుతురుకోసం ఉపయోగించేవారు         

         ఇప్పటి డెకరేషన్స్ లక్షల్లో ఒకరిని మించి ఒకరు కాంపిటిషన్లుగా ఖర్చు పెట్టడం చూస్తే, ఒక పూట పెళ్లి కోసం ఏమిటీ ఖర్చులనిపిస్తుంది. చీరలు మానేసి లంగాలు (గాగ్రా సెట్స్, లెహంగా సెట్స్) ఒక గంట కట్టుకోవడానికి వేలకు వేలు ఖర్చుపెడుతున్నారు. పోనీ అవేమన్నా మళ్ళీ కడతారా అంటే మరి వాటి మొహం చూడరు. చీర అయితే మళ్ళీ ఎప్పుడైనా కట్టుకునే ఛాన్స్ ఉంటుంది. అసలు ఇప్పటి అమ్మాయిలు ‘మెహిందీ’ అని సంగీత్ లని, డ్రెస్ లకు, నగలకు, మేకప్ లకి ఎంతఖర్చు పెడుతున్నారో. 

         వరుడు, వధువు సింపుల్ గా, హాయిగా, ఏ రిజిస్టర్ మ్యారేజో చేసుకుని, ఓ రిసెప్షన్ ఇవ్వచ్చుగా! తల్లితండ్రుల సరదాలకు ముచ్చట్ల కోసం వృధాగా లక్షలు ఖర్చు పెడుతు న్నారు. భోజనాలు చూస్తే పోటాపోటీగా ఇండియన్, చైనీస్, ఈస్టర్న్ వెస్ట్రన్ అంటూ ఏభయి రకాలు. అందులో తినేవి, తినగలిగేవి పట్టుమని పది కూడా ఉండవు. నిజంగా ఈ కరోనా టైములో నూరునూట యాభైకి మించి పిలవకూడదని రూలు పెడితేనైనా ఖర్చులు తగ్గుతాయేమో. ఫోటోలకు లక్ష పైన… ఆ ఆల్బమ్ లన్నీ తరువాత మూల పడేస్తారు, తీసుకెళ్ళ డానికి బరువని. ఇలాటి దండగ ఖర్చులు ఎన్ని చేస్తున్నారో! మాకు పెళ్ళిళ్ళకి ఫోటోగ్రాఫర్ వచ్చి, గ్రూప్ ఫోటో ఒకటి, పెళ్ళికొడుకు పెళ్లికూతురిని కలిపిఒకటి తీసేవాడు, పెళ్లి సరదాలు, ముచ్చట్లు కోసం. అనవసరంగా ఖర్చుపెట్టిస్తు న్నారు  షో  కోసం ఈనాటి వారు.

         ఇదివరకు పెళ్లిళ్లు సంప్రదాయబద్ధంగా జరిపి, సుష్టుగా తిండి పెట్టేవారు. రెండు కూరలు, పప్పు, పులుసు, పచ్చడి, ఒక స్వీట్ హాట్ తో రోజుకో రకం వండించి, వడ్డించే వారు. వడ్డన మనదే. వంటవాళ్లు ఒక దాని తర్వాత ఒకటి వండడమే వాళ్ళ పని. ఇంటి కొచ్చిన చుట్టాలంతా వడ్డన చేసేవారు. అసలు స్టోర్ రూమ్ ఇంచార్జి ఒకరు, గాడి పొయ్యి దగ్గర ఒకరు, పెళ్లికి సామానులందిం చేది ఒకరు, విడిదికి వెళ్ళి టిఫిన్ కాఫీలు అందించేది ఒకరు! అన్ని పనులూ అందరూ అందుకుని చేసేవారు, రెండు  రోజుల ముందు వచ్చి. ఇప్పుడు చుట్టాలు సరే, ఇంటావిడ మేకప్పులు చేయించుకుని గంటకో చీర మార్చడానికే టైం చాలడం లేదు.

         అందుకే ‘ఆడపిల్ల పెళ్లిచేసి చూడు ఇల్లు కట్టి చూడు!’ అన్నసామెత వచ్చిందేమో.

*****

( సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.