కనక నారాయణీయం -44

పుట్టపర్తి నాగపద్మిని

          కనకవల్లి రెండు స్టీల్ లోటాల్లో పొగలు కక్కుతున్న కాఫీతో వచ్చేవరకు, శేషమ్మ, రెండు పెళ్ళిళ్ళు ఒకేసారి చేయవలసి రావటంలోని సాధక బాధకాలను వివరిస్తూ వున్న శేషమ్మ, ‘ అల్లుడూ, ఇంతకూ మా వియ్యంకులు ఎప్పుడు వస్తున్నారట? ‘ అని అడిగింది.  

          ‘ఔను, మా అయ్యకు ఉత్తరం రాయవలె! కనకా!! త్వరగా రాద్దాం యీ రోజే!!’ అనేసి, కాఫీ తాగుతూ, పెళ్ళిళ్ళ నిర్వహణాభారం మోసేదెలాగా? అని ఆలోచనలో పడ్డారు, పుట్టపర్తి.

          కనకవల్లి ఉత్తరం వ్రాసేందుకు కార్డు, పెన్ను తీసుకుని వచ్చింది కూడా!! ఎదురుగా కూర్చోగానే, పుట్టపర్తి అక్కడి నుంచీ లేచి హడావిడిగా తన గదిలోకి వెళ్ళిపోబోతుంటే, కనకవల్లి, చేతిలో కార్డు పట్టుకుని చూస్తూ వుండి పోయింది.

          ఇది గమనించిన శేషమ్మ పుట్టపర్తితో, ‘అదేమిటయ్యా, ఉత్తరం రాద్దామని పిలిచి, అంతలోపలే వెళ్ళిపోతున్నావ్? ‘ అని అడిగింది.

          ఆ మాటలు వినిపించుకోకుండానే, ‘నీకూ తెలుసుకదా, ఏమి వ్రాయాలో, ఆ నాలుగు మాటలూ వ్రాసి, పోస్ట్ చేసేయి. నాకు పనుంది.’ అంటూ తన గదిలోకి వెళ్ళిపోయారు పుట్టపర్తి.

          శేషమ్మ బిడ్డ వైపు చూసింది అయోమయంగా!!

          కనకవల్లికి ఇవేవీ కొత్త కావు. ఇంటి కార్యభారం వహించినట్టే, ఇటు వంటి పనులు కూడా తానే బాధ్యత వహించి చేసేస్తూ వుంటుంది మరి! సరే, ఇక కార్డు అందుకుని వ్రాయటం మొదలు పెట్టింది. 

‘శ్రీమాన్ అయ్యగారికి,

          సేవింపులు. ఉభయ కుశలోపరి, సాంప్రతం. ఇదివరకు లేఖలో వ్రాసినట్టుగా, మీ పెద్ద దౌహిత్రి, చి. కుం.సౌ. కరుణాదేవి పరిణయోత్సవ లేఖ మీకు యీ పాటికే అంది ఉంటుందని భావిస్తాను. ఇంట్లో మొదటి పెళ్ళి కాబట్టి కాళ్ళూ చేతులూ ఆడటం లేదు. పైగా యీ పెళ్ళి అవగానే రెండవ కుమార్తె పెళ్ళి పనులు కూడా మొదలు పెట్టవలె! పైగా రెండు పెళ్ళిళ్ళకూ తగిన ఆర్థిక స్థోమత కూడా సమకూర్చుకోవలెనంటే, తలకు మించిన భారం. ఐనా చి. మాలేపాటి సుబ్రమణ్యం, సుబ్బన్న వంటి శిష్య పరమాణువుల అండ దండలూ, ప్రొద్దుటూరు అభిమానుల ఆసరాతో ముందడుగు వేస్తున్నాము. పెరుమాళ్ళు కృప వల్ల పెళ్ళి పనులు మొదలైపోయినాయి. సమయానికి మా అత్తగారు కుం.సౌ.శేషమ్మ గారు ముందుగానే వచ్చి, మంచి ముహూర్తాన పెళ్ళి పనులు ప్రారంభింప జేసినారు. అమ్మతో పాటూ మీరు కూడ వచ్చి దగ్గరుండి మమ్ములను నడిపించవలె! మీరు ఎప్పుడు బయలుదేరుతారు? కడపకే వారం రోజుల ముందుగా రావాలని కోరుకుంటూ వున్నాను. ఇంక తక్కిన విషయాలన్నీ మామూలే!!  నా తమ్ముళ్ళు నరసింహుడు, రాజగోపాల్, కమలాకాంతుడూ అంతా బాగున్నారని తలుస్తాను. వాళ్ళకు కూడా వివాహ పత్రిక పంపినాను, పెళ్ళికి ఆహ్వానిస్తూ!! వాళ్ళ రాక కోసమూ ఎదురు చూస్తూ వున్నాము. ఇంతే సంగతులు,

ఇట్లు,

తమ కుమారుడు,

పుట్టపర్తి నారాయణాచార్య దాసుడు

***

          పెళ్ళి దగ్గర పడుతున్నది. ఇంట్లో పెళ్ళి పనులు జరుగుతూనే వున్నాయి. చూస్తూ వుండగానే వారం గిర్రున తిరిగిపోయింది. లేఖ అందుకున్న పుట్టపర్తి తండ్రిగారు పుట్టపర్తి శ్రీనివాసాచార్యులవారు, భార్య లక్ష్మీదేవమ్మతో పాటు కడపకు చేరుకున్నారు కూడా!!

          మాఘమాసం అంటే ఫిబ్రవరి నెలలో కాబట్టి స్కూల్ పనిచేసే రోజులే!! పుట్టపర్తి స్కూల్ కు సెలవు పెట్టవలసి వచ్చింది. లక్ష్మీదేవమ్మ, శేషమ్మ ఇద్దరు వియ్యపురాళ్ళూ కలిసిమెలిసి మాట్లాడుకుంటూ సంప్రదింపులు జరుపుకుంటూ పెళ్ళి పనులు చేస్తూ వుంటే కనకవల్లి ఇద్దరితోనూ అణకువతో మెలుగుతూ వారు చెప్పినట్లే పనులు చేస్తూ వుంది.

          ప్రొద్దుటూరులోని పుట్టపర్తి అభిమానులు, ఎక్కువ భాగం వైశ్యులు. కొప్పరపు సుబ్బయ్యగారి ఆరాధకులందరూ పుట్టపర్తి అభిమానులే!!  సుబ్బయ్య గారి పలుకుబడి అటువంటిది మరి!! సుబ్రమణ్యం కూడా వైశ్యుడే!! అతడు ఇలా వచ్చి వివాహ పత్రిక ఇవ్వగానే, ‘మా పుట్టపర్తి అయ్యగారి ఇంట్లో తొలి పెళ్ళి కదా!! మా తరఫున ఇదిగో నాలుగు  బస్తాల బియ్యం ఇస్తున్నా..’ అన్న వాళ్ళొకరైతే, మా తరఫున పెళ్ళికొడుకు పట్టు బట్టలూ, పెళ్ళి కూతురికి పట్టు వస్త్రాలూ ఇస్తున్నాం..’ అన్న వాళ్ళు మరొకళ్ళూ!! పెళ్ళి రోజు వంటకు కూరగాయలు మేము పంపిస్తాం..’  ”పెళ్ళి సరుకులు మా అంగట్లో తీసుకుపోరా సుబ్రమణ్యం..’ ‘పెళ్ళి మండపం అలంకరణకు మా పిల్లోళ్ళను పంపిస్తా పో!’ ఇలా మొత్తానికి పుట్టపర్తి ఇంటి పెళ్ళికి ప్రొద్దుటూరు మొత్తం తమ ఇంటి పెళ్ళిలా పూనుకుని చేయటం, ఆ రోజుల్లో ఒక గొప్ప వార్తే!!

          అందరి గుండెల్లో పుట్టపర్తి పట్ల ఇంతటి అభిమానమూ ఆదరణా వుండటానికి కారణం, తమ ఊరి అగస్తీశ్వర స్వామే కదా పుట్టపర్తి శివతాండవం నాయకుడు!! ఆయన ఎక్కడికి వెళ్ళి గానం చేసినా, ఆ కావ్య రచనకు నేపథ్యం ఏమిటి? ప్రేరణ ఏమిటి? అన్న విషయాలూ కూడా పత్రికల్లో వచ్చేసేవి. ఈ కారణంగా, రాజకీయ నాయకులకంటే, పుట్టపర్తి నారాయణాచార్యుల వారికి ఎక్కువ అభిమానులుండేవారన్నది జగమెరిగిన సత్యం. 

          పుట్టపర్తి శ్రీనివాసాచార్యులవారికి, తన కొడుకు ప్రభ యీ విధంగా వెలిగిపోవటం చూస్తూ వుంటే, మహదానందంగా వుంది. బాల్యంలో యీ కుమారుడి  తీరు తెన్నులకూ, ఇప్పటి పేరు ప్రఖ్యాతులకూ పోలికే లేదు.

          12, 13 సంవత్సరాల వయస్సులో తనయుడు వ్రాసిన కావ్యం పెనుగొండ లక్ష్మిని ఛూడనైనా లేదు తాను!! కానీ ఆ కావ్యం ద్వారా  కుమారునికి వచ్చిన పేరు ప్రఖ్యాతులను ప్రత్యక్షంగా చూస్తుంటే, రాబోయే రోజులన్నీ ఇతనివే అనిపించే విధంగా వున్నాయి. అనంతపుర ప్రాంతమంతా కరువు ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. విజయనగర సామ్రాజ్య  వేసవి విడిదిగా ఉన్నప్పటి కాలం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఎండాకాలం తప్ప మరో కాలం తెలియని ప్రాంతంగా మారిపోయిన కారణంగా, కుమారుడి పెళ్ళి తరువాత, దత్త మండలంలో అనంతపురం కంటే వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కాస్త మెరుగైన ప్రొద్దుటూరులో స్థిరపడటం అక్కడ కూడా గడియారం, దుర్భాక వంటి కవులుండటం వల్ల తనయుడి సాహిత్య యాత్రకు కూడా అనువైన ప్రాంతంగా తోచింది. తరువాత సరస్వతీ పుత్రుడుగా పేరు ప్రఖ్యాతులు కూడా గడించటం, ఆర్థిక స్థోమత సంగతి ఎటున్నా, కవిగా చక్కటి స్థాయిని  చేరుకోవటం చూస్తుంటే పట్టరానంత ఆనందంగా వుంది వారికి!!

          ఒకటే సందేహం, పెద్దలు పిల్లలను పొగిడితే ఆయుక్షీణమన్న ఆర్యోక్తిని దృష్టిలో వుంచుకుని, తన సంతోషాన్ని బాహాటంగా ప్రకటించటానికి ఇష్టపడటం లేదు – ఆ కన్న తండ్రి హృదయం.

          నారాయణాచార్యులకూ తండ్రి ముందు తిరుగాడటమంటే సంకోచమే!! కారణం, వారు కలం పట్టి యే కావ్యమూ వ్రాయక పోయినా జిహ్వాగ్రాన పిలిస్తే పలికేలా తాండవించే సంస్కృతాంధ్ర కావ్య శ్రేణీ, వివిధ శాస్త్ర విషయాలూ, వారికి సర్వేపల్లి రాధాకృష్ణన్, రాళ్ళపల్లి, చిలుకూరి నారాయణరావుగారి వంటి పెద్దల పాండితీ సాన్నిహిత్యం – ఇవన్నీ వారి సమీపంలో సైతం నిలబడేందుకు సంకోచం కలిగించేవి!!

          అప్పట్లో కావ్య రచన కంటే పాండిత్యానికే విలువ ఎక్కువుండేది, కాబట్టే, తండ్రి ముందు తానొక సామాన్యునిగానే మెదిలేవారు – నారాయణాచార్యులు!  ఇప్పుడూ అదే అలవాటే !!

***

          ఇంట్లో పెళ్ళి పనుల మధ్య తీరిక లేకున్నా కనకవల్లికి మాత్రం, పెద్ద కుమార్తె పెళ్ళై అత్తగారింటికి వెళ్ళిపోతూ వుందంటే, ఏడుపు కట్టలు తెంచుకుని వస్తూ వుంది. మనసులో ఏదో బాధ సుళ్ళు తిరుగుతూ వుంది. ఆడపిల్లను కన్న తల్లిదండ్రుల బాధను కావ్యాల్లో ఎలా వర్ణించారో ఒక్కసారి స్ఫురణకు వచ్చి మాటిమాటికీ కళ్ళు చెమరుస్తూనే వున్నా యామెకు!!

          జనకుడు ‘సీతను రాముడికి అప్పగించే వేళ, ‘ఇయం సీతా మమ సుతా సహధర్మ చరీ తవ..’ అని  మాత్రమే అని ఊరుకున్నాడా? సీతను అత్తవారింటికి పంపే సమయాన బాధ పడలేదా?? వాల్మీకి యీ విషయాన్ని పొడిగించక పోయినా కాళిదాసు మాత్రం అభిజ్ఞాన శాకుంతలంలో పెంచిన బిడ్డే అయిన శకుంతలను దుష్యంతుని వద్దకు పంపే సమయాన కణ్వుడు పడిన బాధను ఎంత చక్కగా అక్షరీకరించాడు? ఆమె ముగ్ధ మనోహరి. ఎండ కన్నెరుగని ముని కన్నెక. ఆశ్రమంలోని లేడి పిల్లలూ, నెమళ్ళే కాదు, పూల మొక్కలూ, పెద్ద వృక్షాలూ కూడా ఆమె చెలికత్తెలే!! వాటికి ప్రేమను పంచటమే కాదు, వాటి ప్రేమను కూడా తిరిగి పొందిన భాగ్యశాలిని. అందుకే  కణ్వునికి ప్రీతిపాత్ర మైన కొమరిత.         

          ఆమె ఎంతో ప్రేమగా పెంచిన లేడి పిల్లలూ, పూల మొక్కలూ కూడా ఆమెను విడనాడలేకున్నాయి. నోరులేని అవే ఇంతగా బాధపడుతుంటే వాటి ముందు తానెంత? ఐనా బ్రహ్మచారి అయిన తనకే ఇంత బాధగా వుంటే, నిజంగా కని పెంచిన వారి కష్టం ఇంకా ఎంత ఎక్కువగా వుంటుంది?  కన్యా పితృత్వం ఖలు నామ కష్టం..తండ్రిగా ఆడబిడ్డను పెంచటమే కదా యీ లోకంలోని కష్టాలలో అతి కష్టతరమైన కష్టం!!

                         అర్థొహి కన్యా పరకీయ యేవ

                        తామద్య సంప్రేక్ష్య పరిగ్రహీత:

                        జాతో మమాయం విశద: ప్రకామం

                       ప్రత్యర్పితన్యాస ఇవాంతరాత్మా !

          ఆడ పిల్ల అంటేనే పరుల బిడ్డ అని కదా అర్థం. ఇన్ని దినాలూ నేను యీమెకు నా ఆశ్రమంలో చక్కగా రక్షణనిచ్చాను, ఎలా?? ఇతరుల ధనాన్ని, బాధ్యతాయుతంగా కాపాడేలా!! ఇప్పుడిక వారి ఆస్తిని వారికి అప్పజెప్పవలసిన సమయం వచ్చింది. నాకిప్పుడు నిశ్చింతగా వుంది !!

          అలా అనుకుని మనసును దిటవు పరచుకున్నాడేమో కణ్వుడు కానీ ఇప్పుడు తమ బిడ్డ కరుణాదేవి పెళ్ళి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోతున్నదంటే ఎంత బాధగా వుందో!! నిజానికి ఆమెకు ఇప్పుడే పెళ్ళి ఇష్టం లేదు. కానీ తమ పరిస్థితుల దృష్ట్యా ఎంత త్వరగా బాధ్యత దించుకుంటే  అంత మేలు అన్నట్టున్నదిక్కడ!! అమె అదృష్టం కొద్దీ మంచి ఇంటికే వెళ్ళబోతున్నది!! కాకపోతే డిగ్రీ పూర్తి చేయాలన్న ఆమె కోరిక పెళ్ళైన తరువాతైనా తీరితే సంతోషం!! ఆమె పెళ్ళి కుదిరిన వేళా విశేషం, రెండవ బిడ్డ తరులతకూ పెళ్ళి కుదరటం!! రెండు నెలల తేడాతోనే ఇద్దరికీ కళ్యాణ ఘడియలు రావటం!! ఇదంతా బాగానే వున్నా, ఇద్దరు ఆడపిల్లలను కాస్త అటూ ఇటూగా అత్తవారి ఇళ్ళకు పంపించి వేస్తే, ఇల్లు బోసిపోదూ??

          పెళ్ళైన తరువాత అత్తగారింట్లో ఎలా మసలుకోవాలో తాను చెప్పనైనా లేదేనాడూ?? ఆడబడుచులతో, మరుదులతో ఎలా మెలగాలో, అత్తగారి ముందు అణకువతో మసలు కోవటం, మామాగారి ముందు, ఇంటికి వచ్చి పోయే బంధువులతో ఎటు వంటి పద్ధతులు పాటించాలో ఇవన్నీ చెప్పవలె తల్లిగా!! ఎప్పుడు సమయం దక్కేదిక? 

          ఈ ఆలోచనలు ముప్పిరిగొనగా, ఆమె మనసులోంచీ ఒక గీతిక శోకం నుంచీ శ్లోకం వలె ఊపిరి పోసుకుంది.

   అమ్మరో కౌసల్య! అతివ సుకుమారియగు,

   ఇమ్మహీజాత గైకొమ్మ వేవేగ

   నమ్మతిని నీ సుతకు  సమముగా జూతువని 

   నమ్మి మదిలోన మా యమ్మనొప్పించితిని..అమ్మరో కౌసల్య…     

***** 

  (సశేషం) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.