మా కథ (దొమితిలా చుంగారా)- 46

రచన: దొమితిలా చుంగారా 

అనువాదం: ఎన్. వేణుగోపాల్ 

          సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉపన్యాసాలున్న రోజున నేను కూడా మాట్లాడాను. మేం ఎంతగా విదేశాల మీద ఆధారపడి బతకవల్సి వస్తున్నదో, వాళ్ళు ఆర్థికంగానే కాక, సాంస్కృతికంగా కూడ మా మీద తమ ఇష్టం వచ్చినవి ఎలా రుద్దుతున్నారో నేను వివరించాను.

          ఆ సమావేశంలో నేను చాలా నేర్చుకున్నాను కూడా. మొట్టమొదట అక్కడ నా ప్రజల జ్ఞానపు విలువ గురించి మరింత ఎక్కువగా నేను అంచనా వేయగలిగాను. అక్కడ ప్రతి ఒక్కరూ మైక్రోఫోన్, ముందుకెళ్ళి “నేను ఫలానా వృత్తిలో ఉన్నాను …. నేను ఫలానా సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను…..” అని లొడ లొడ వాగేవారు. “నేనో ఉపాధ్యాయు రాల్ని”, “నేనో న్యాయవాదిని”, “నేనో జర్నలిస్టును” ఇలా అందరు లొడ లొడ లాడేవారు.

          అప్పుడు నాలో నేనే “ఇక్కడ మాట్లాడే వాళ్ళు చూడు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, జర్నలిస్టులు …. నేనెవరిని? నేనిక్కడేం మాట్లాడగలను? …” అను కున్నాను. నేను కొంచెం ఆందోళన పడ్డాను కూడ. నాకు అప్పుడు మాట్లాడే ధైర్యమే రాలేదు. నేనక్కడ మొదటిసారి మైక్రోఫోన్ ముందుకెళ్ళి, అంత మంది హోదాదార్ల ముందర నిలబడి, నన్ను నేను ఏమీ కానిదానిగా భావించుకొని “నేను ఒక బొలీవియన్ గని కార్మికుని భార్యను …” అని తడబడుతూ చెప్పాను.

          నేను క్రమంగా ధైర్యం తెచ్చుకొని అక్కడ చర్చించబడుతున్న సమస్యల గురించి మాట్లాడాను. ఆ ‘సమావేశం ద్వారా ప్రపంచమంతా నన్ను వినాలనే ఉద్దేశ్యంతో నేను నా భావాలన్నిటినీ అక్కడ పరిచాను.

          ఈ ఉపన్యాసంతో నేను అమెరికాలోని ప్రముఖ ఫెమినిస్టు నాయకురాలు బెట్టిఫ్రీడ లో వాదనకు దిగాల్సి వచ్చింది. ఆవిడా, ఆవిడ బృందమూ కలిసి “ప్రపంచ కార్యాచరణ ప్రణాళిక”కు కొన్ని సవరణలు సూచించారు. అవన్నీ ముఖ్యంగా ఫెమినిస్టు సమస్యలు. మేం వాటిని అంగీకరించలేదు. అవి లాటిన్ అమెరికన్ స్త్రీల విషయంలో చాల ఆసంబద్ధ మైనవి.

          బెట్టీ ఫ్రీడన్ మమ్మల్ని తనతో కలవమని ఆహ్వానించింది. మా “యుద్ధతరహా ఆచరణను” మానుకొమ్మని సలహా యిచ్చింది. మేం మా “మగవాళ్ళ వల్ల తప్పుదోవ పడుతున్నా”మనీ, మేం “రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడుతున్నా”మనీ ఆవిడంది. “బొలీవియన్ ప్రతినిధివర్గం మాట్లాడినట్టు వాళ్ళు అసలు పూర్తిగా స్త్రీ సమస్య ల్నే పట్టించుకోవడం లేదు” అని ఆవిడ ఆరోపించింది.

          ఇక నేను మాట్లాడతానన్నాను. కాని వాళ్ళందుకు అనుమతించలేదు. నేనింక అక్కడే లేచి నిలబడి మాట్లాడడం మొదలు పెట్టాను. “ఈ సమావేశాన్ని చేపల మార్కెట్టు లాగ మారుస్తున్నందుకు నన్ను క్షమించండి. కాని మరొకరు నా పేరెత్తి విమర్శించి నప్పుడు నేను జవాబివ్వక తప్పదు. నాకు పంపిన ఆహ్వాన పత్రంతో పాటే ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల పత్రం కూడా ఉంది. దాంట్లో స్త్రీలకు పాల్గొనడానికీ, సంఘటితం కావడానికీ ఉన్న హక్కు గుర్తించబడింది. బొలీవియా కూడ ఈ పత్రం మీద సంతకం చేసింది గాని వాస్తవానికి ఆ హక్కులు బూర్జువాలకే ఉన్నాయిగాని మాకు లేవు”.

          నేనింకా అలాగే మాట్లాడడం సాగించాను. అప్పుడు మెక్సికన్ ప్రతినిధి వర్గం అధ్యక్షురాలు నా దగ్గరికొచ్చింది. అంతర్జాతీయ మహిళా సంవత్సర సమావేశపు నినాదాన్ని ఆవిడ నాకు విప్పి చెప్పడం మొదలెట్టింది. “సమానత్వం, అభివృద్ధి, శాంతి” అనేది ఆ నినాదం.

          “మనం మన గురించి మాట్లాడుకుందామమ్మా …. చూడు మనిద్దరమూ స్త్రీలం ….. నీ ప్రజలు పడుతున్న బాధలు కాసేపటి కోసం మరిచిపో … ఒక్క క్షణం ఆ హత్యా కాండల్ని మనుసు నుంచి తుడిచెయ్యి … వాటి గురించి మనం చాల సోది వెళ్ళబోసు కున్నాం. ఇంక చాలు. … మనమింక మన గురించి మాట్లాడుకుందాం …. నువ్వూ, నేనూ … ఇతర స్త్రీలూ.

          నేను వెంటనే అందుకొని “సరే, మంచిది … మనిద్దరం మనిద్దరి గురించే మాట్లాడు కుందాం. సరేనా … నేను నిన్ను ఓ వారం నుంచి చూస్తున్నాను గదా … ప్రతి రోజూ ఉదయాన్నే నువు ఒక కొత్త రకం దుస్తుల్లో సింగారించుకుంటావు. మరోవైపు నాకన్ని దుస్తులే లేవు. ప్రతిరోజూ నువ్వు బ్రహ్మాండంగా అలంకరించుకుంటావు. బ్యూటీ పార్లర్ లో ఎన్నో గంటలు గడిపి వచ్చిన దానిలా తయారవుతావు. వెంట్రుకలు అందంగా దిద్దు కుంటావు. … ముస్తాబు మీదనే ఎంతో డబ్బు ఖర్చు పెట్టగలుగుతావు. నాకా మోజులేమీ లేవు. ప్రతిరోజూ మధ్యాహ్నం నిన్ను ఇంటికి తీసుకెళ్ళడానికి కారు డ్రైవర్ వచ్చి పడిగాపు లు పడడం కూడ నేను చూస్తున్నాను. నాకదీ లేదు. ఇక్కడ నువు ఉంటున్న తీరును బట్టి ఆలోచిస్తే నువు ఒక బ్రహ్మాండమైన ఇంట్లో, సంపన్నుల పరిసరాల్లో ఉండి ఉంటావు. కాని మేం, గని కార్మికుల భార్యలం. కంపెనీ మాకు అద్దెకిచ్చే ఇళ్ళలో ఉంటాం. మా భర్తలు చనిపోయినా, జబ్బు పడ్డా, రిటైరైనా తొంభై రోజుల్లోగా ఆ గూడు వదిలేయాలి. అంటే రోడ్ల మీద బతకాలి.

          ఇప్పుడు చెప్పమ్మా – నీ పరిస్థితి నా పరిస్థితికి సమానంగా ఉన్నదా? నా పరిస్థితి నీతో పోల్చదగినదేనా? కనుక మనం మనిద్దరి మధ్య ఏ రకమైన సమానత గురించి చర్చించ బోతున్నాం? మనిద్దరమూ ఇంత వేరు వేరైనప్పుడు, మనిద్దరి మధ్యా ఇంత అఖాతం ఉన్నప్పుడు మనం స్త్రీలుగానైనా సరే సమానం కాలేం. కాలేం …” అన్నాను.

          అప్పుడు మరొక మెక్సికన్ స్త్రీ ముందుకొచ్చి “విను, నీకేం కావాలసలు? ఆవిడెవరను కుంటున్నావు? మెక్సికన్ ప్రతినిధివర్గ అధ్యక్షురాలిగా ఆవిడకు మొదట మాట్లాడే అధికారం ఉంది. అంతే గాదు, నిన్ను మేమిక్కడ ఇప్పటికే ఎంతో భరించాం. నిన్ను మేం రేడియోలో విన్నాం, టీవీలో చూశాం. పత్రికల్లో చూశాం. ఇప్పుడు సమావేశంలో చూస్తున్నాం. నిన్నింక’ మెచ్చుకోలేనంత అలసిపోయాను నేను …” అంది.

          ఈ మాటలు నాకు పిచ్చెత్తించాయి. అంటే నేను వివరించిన సమస్యలు వీళ్ళ దృష్టిలో నన్నొక ఆటబొమ్మని చేసి మెప్పుదల తెచ్చుకోవడానికి పనికొస్తున్నాయన్న మాట. వాళ్ళు నన్నొక విదూషకురాలిలా చూస్తున్నారని అర్థం. నాకు పిచ్చికోపం వచ్చింది.

          “నీ మెప్పుదల కోసం ఎవరేడిచారు? మెచ్చుకోళ్ళతోనే సమస్యలు పరిష్కారమైతే నాకు వాటికి బొలీవియాలో లోటేమీ లేదు. అలాటప్పుడు పిల్లల్నక్కడ వదిలేసి, మా సమస్యలు వివరించడానికి బొలీవియా నుంచి మెక్సికో దాకా రావాల్సిన అవసరమే లేదు. నేను నా జీవితాంతమూ గుర్తుంచుకోవలసిన మహత్తరమైన పొగడ్తలెన్నో అందుకున్నా ను. అవి గని కార్మికులు తమ మట్టిచేతులతో ఇచ్చినవి. నీ పొగడ్త నువ్వే ఉంచుకో …” అన్నాను. మేమలా కొంచెం ఘాటుగానే తిట్టుకున్నాం. చివరికి వాళ్ళు “నువు చాలా గొప్ప మనిషి ననుకుంటున్నట్టున్నావు – ఏదీ’ మాట్లాడు వింటాం” అన్నారు.

          నేనిక మాట్లాడడం మొదలెట్టాను. వాళ్ళు మా ప్రపంచంలో బతకడం లేదు. బొలీవియాలో మానవహక్కులు గౌరవించబడడం లేదు. అక్కడ హక్కులు కొందరికే పరిమితమై ఉంటాయి. పేకాట ఆడుతూ, ఏలిన వారిని పొగుడుతూ ఉండే పెద్దింటి ఆడబడుచులకు హక్కులుంటాయి. కాని మా ప్రజల బతుకుల్ని బాగుచేయాలనే ఆశయంతో సంఘటితమైన మాలాంటి స్త్రీలమీద మాత్రం సర్కారు నిర్బంధాన్ని అమలు చేస్తుంది. వాళ్ళివన్నీ చూడలేరు. వాళ్ళు నా ప్రజల కడగండ్లు ఎలాంటివో స్ఫురణకు తెచ్చుకోలేరు. మా భర్తలు ఎలా తమ ఊపిరితిత్తుల్ని ముక్కలు ముక్కలుగా రక్తంలో కక్కుకోవలసి వస్తోందో వాళ్ళకు తెలియదు. మా పిల్లలు ఎంత తక్కువ తిండితో బతుకుతున్నారో వాళ్ళు అర్థం చేసుకోలేరు. మేం నివసిస్తున్న అత్యంత హీనమైన పరిస్థితుల్లో పనంతా పూర్తి చేయడానికి ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి పదకొండు, పన్నెండు గంటల దాకా వంచిన నడుమెత్తకుండా పనిచేయడమంటే ఏమిటో కూడ వాళ్ళకు తెలియదు.

          “మీకివన్నీ తెలిసే అవకాశం ఏముంది? మీకున్న పరిష్కారం ఒక్కటే. మగవాళ్ళతో పోరాటం – అంతే. మీకు మరేమీ తెలియదు. కాని మాకో … ? అది మార్గమే కాదు. అది మౌలిక పరిష్కారమే కాదు.”

          చెలరేగిన కోపోద్రేకాలతో నేనిదంతా మాట్లాడి వేదిక మీది నుంచి దిగాను. అప్పుడు నా దగ్గరికెంతో మంది స్త్రీలొచ్చి నన్ను మెచ్చుకున్నారు. సమావేశంలో లాటిన్ అమెరికన్ స్త్రీలందరికీ ప్రతినిధిగా నన్ను వ్యవహరించమని కోరారు.

          నేనిన్నాళ్ళూ నా ప్రజల జ్ఞానాన్ని సరిగా అంచనా వేయలేక పోయినందుకు సిగ్గు పడ్డాను. ఎందుకంటే – చూడండి నేను, ఎన్నడూ యూనివర్సిటీ ముఖం చూసి ఎరగని దాన్ని, బడికి కూడా సక్రమంగా పోలేకపోయిన దాన్ని, ఉపాధ్యాయురాలినో, న్యాయవాది నో, ప్రొఫెసర్ నో కాదు. కాని, నేను ఈ సమావేశంలో ఎలా ప్రవర్తించాను? నేనిక్కడ ప్రసంగించిందంతా నేను నా బాల్యం నుంచీ నా చుట్టూ వున్న జనం మాట్లాడగా విన్నదే. ప్రజానీకపు అనుభవాలకన్న గొప్ప పాఠశాల మరేమున్నది? నేను జన జీవితం నుంచి నేర్చుకున్నదే గొప్ప విద్య. నాకిలా ఆలోచిస్తే కళ్ళలో నీళ్ళు తిరిగాయి. నా ప్రజలెంత గొప్పవాళ్ళు!

          లాటిన్ అమెరికన్ స్త్రీలందరమూ కలిసి అక్కడ ఒక పత్రం తయారుచేసి విడుదల చేశాం. మూడో ప్రపంచ దేశాలలో స్త్రీలు నిర్వహించవలసిన పాత్ర గురించి మా అవగాహనలో ముఖ్యమైన విషయాలన్నీ మేం దాంట్లో రాశాం. పత్రికల్లో ఆ ప్రకటన అచ్చయింది.

          సమావేశంలో మరొక ముఖ్యమైన సంగతేమంటే నేను ఎంతో మంది ఇతర దేశాల మిత్రురాళ్ళను కలుసుకోగలిగాను. బొలీవియన్లు, అర్జెంటైన్లు, ఉరుగ్వేయర్లు, చిలియన్లు …… ఎందరెందరు? అందరికీ జైళ్ళలో, నిర్బంధాలలో, సమస్యలలో నాతో సమానమైన అనుభవాలున్నాయి. నేను వాళ్ళ నుంచి ఎంతో నేర్చుకోగలిగాను.

          సైగ్లో-20 కార్మికులూ, స్త్రీలూ నా మీద ఉంచిన బాధ్యతను నేను సక్రమంగానే నిర్విర్తించాననుకుంటాను. ఆ సమావేశానికి ఎన్నో దేశాల నుంచి ఎంతో మంది హాజరయ్యారు. వాళ్ళందరూ బొలీవియా నిజరూపం తెలుసుకోవడంలో నా పాత్ర నేను నిర్వర్తించాను.

          అంతే కాదు, అంత మంది స్త్రీలను ఒక్కదగ్గర చూడడమూ, తమ పీడిత ప్రవిముక్తి కోసం ఎంత మంది అగ్ని సదృశ కాంక్షతో జ్వలించిపోతున్నారో చూడడమూ ఎంత గొప్ప అనుభవం!

          అలాగే నాకు ముఖ్యమనిపించిన మరొక విషయమేమిటంటే ఆ ఐదువేల కన్న ఎక్కువ మంది స్త్రీల సాహచర్యంలో బూర్జువా వర్గ ప్రయోజనాలు మా ప్రయోజనాలకు ఎంత వ్యతిరేకమో నాకు మరింత స్పష్టమయింది.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.