నడక దారిలో-31

-శీలా సుభద్రా దేవి

జరిగిన కథ : తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలో నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. స్వాతిపత్రికలో శీలా వీర్రాజు గారికి కలంస్నేహం ,రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం జరిగింది. డిగ్రీ పరీక్షల తర్వాత హైదరాబాద్ వచ్చేసాను. ఏడాది తిరగకుండానే మా జీవన గీతానికి పల్లవి చేరింది. మరుదుల వివాహాలతో కుటుంబం పెద్దదైంది. నాకు రెండో పాప రెండు నెలలకే అనారోగ్యంతో చనిపోయింది. ఉమ్మడి కుటుంబం విడిపోయి వేరు కాపురాలు అయ్యాయి. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, మాకు పుట్టిన బాబు అనారోగ్యం, ఎమ్మే తెలుగు పరీక్షలకు చదవటం, తర్వాత—

***

          వీర్రాజు గారికి తనని తాను ఉత్సాహం పరచుకోటానికి తన పుస్తకాలు ప్రచురించు కోవటం ఒక అలవాటు. అందుకని నాలోకి నేను ముడుచుకు పోవటం చూసి నా కథలను పుస్తకంగా వేయాలని తలపెట్టారు.
 
          నా పేరు ఎవరు ప్రస్తావించారో కాని ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వాళ్ళు మచిలీపట్నంలో నిర్వహించాలని పూనుకున్న రచయిత్రుల మహాసభల్లో కవిసమ్మేళనం లో పాల్గొనమని ఉత్తరం వచ్చింది. నాకు చాలా ఆశ్చర్యం, ఆనందం కలిగించింది. కానీ బాబును తీసుకుని ఎలా వెళ్ళాలి అనేదే పెద్దప్రశ్న.
 
          మచిలీపట్నం వాస్తవ్యులు వీర్రాజు గారికి మంచిమిత్రుడైన గుత్తికొండ సుబ్బారావు గారు తమ స్పందన సాహితీ సమాఖ్య కూడా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీతో కలిసి నిర్వహిస్తుందని తెలియజేసి, కుటుంబ సమేతంగా రమ్మనీ, మిగతా విషయాలు నేను చూసుకుంటానని అన్నారు.
 
          ఉత్సాహంగా అందరం బయలుదేరాము. సుబ్బారావుగారు మమ్మల్ని రిసీవ్ చేసుకొని హొటల్ రూమ్ లో దించారు. బాబుకు ఒళ్ళు శుభ్రం చేసి పాలు తాగించి పల్లవిని కూడా తయారు చేసాను. నేనున్నపుడే వీర్రాజు గారిని కూడా రిఫ్రెష్ అవ్వమ న్నాను. తర్వాత తొందరగా తయారయ్యాను. అంతలో సుబ్బారావు గారు వచ్చి సభలు జరిగే వేదికకు తీసుకువెళ్ళారు. అప్పుడే ప్రారంభ సభ మొదలైంది. జస్టిస్ అమరేశ్వరి ప్రారంభించారు. దేవులపల్లి రామానుజరావు గారు పుస్తకప్రదర్శన ప్రారంభించారు.
 
          నేను చిన్నప్పటి నుండి చదువుకున్న రచయిత్రులు వసుంధర దేవి, కె.రామ లక్ష్మీ, లత, ద్వివేదుల విశాలాక్షి, ఆనందారామం, ఐవీఎస్ అచ్యుత వల్లీ ఇలా ఎందరో ఉన్న ఆ సభామందిరంలో నేను కూడా ప్రత్యేక ఆహ్వానితురాలిగా కూర్చున్నా ను. ఒక ఉద్వేగం నన్ను ఆవరించింది. సాహిత్య అకాడమీ చైర్మన్ బెజవాడ గోపాలరెడ్డి గారువచ్చే సరికి రచయిత్రులు అందరూ ఆయన దగ్గరకు వెళ్ళి పలకరిస్తున్నారు. నేను కుర్చీకి అతుక్కు పోయినట్లు కదలలేదు. రచయిత్రులనూ పలకరించ లేదు. నాకున్న మొగమాటం, చొచ్చుకు పోయే స్వభావం లేకపోవటం ఒక కారణమైతే గత కొంత కాలంగా  నాలో నేను కృంగిపోతున్న మానసిక స్థితిలో ఉన్నానేమో ఒక్కదాన్నే అలా ముడుచుకు పోయి కూర్చున్నాను. రెండవ సమావేశంలో నేటికథ- తీరుతెన్నులు గురించి వసుంధరా దేవీ, ఆనందరామం మొదలైన రచయిత్రులు ప్రసంగాలు చేసారు.
 
          సాయంత్రం నాలుగింటికి నన్ను తిరిగి రూమ్ కు దిగబెట్టారు. సుబ్బారావు గారు వీర్రాజు గారితో సభల విశేషాలు చెప్పి మాకు భోజనం ఏర్పాటు చేసి వెళ్ళారు.
 
          భోజనం చేసాక పడుకుందామని పక్కమీద ఒరిగే సరికి బాబు కెవ్వున ఏడ్చి ఎప్పటిలాగే నీలమేఘ శ్యాముడు కావటమే కాకుండా ఒళ్ళంతా వేడిగా కాల్చినట్లుగా టెంపరేచర్ పెరిగి, వాంతులు చేసుకోసాగాడు. ఏం చేయటానికీ తోచక సుబ్బారావు గారికి కబురు పెట్టాము. రెండు రోజులుగా సభల నిర్వహణలో అలసిపోయి కూడా పరుగున వచ్చి ఆ అర్థరాత్రి డాక్టరు దగ్గరకు తీసుకు వెళ్ళటానికి సాయం చేసారు.
 
          ఎలా అయితేనేం డాక్టరు మందు పడ్డాక పిల్లాడు మర్నాడు ఉదయానికి తేరుకున్నా డు. మేము కూడా కుదుట పడ్డాము.
 
          మర్నాడు సభలకు నాకు వెళ్ళాలనిపించ లేదు. నేను వెళ్ళాక మళ్ళీ బాబు ఇబ్బంది పెడతాడేమోనని ఒక విధంగా నిర్వేదం ఆవరించి రూమ్ లోనే ఉండి పోయాను. వీర్రాజుగారు ఒకసారి వెళ్ళివస్తానని ఒక సదస్సుకు హాజరయ్యారు.
 
          మూడోరోజు ముగింపు సభలకు ముందు కవిసమ్మేళనం అన్నారు. మూడోరోజు వీర్రాజు గారు తాను బాబును చూసుకుంటానని నన్ను పంపించారు.
 
          కవిసమ్మేళనం ప్రారంభించారు. వేదిక మీద ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, నాయని కృష్ణకుమారి, యశోదా రెడ్డి, లక్ష్మీరమణ, సి.వేదవతి, శారదా అశోక వర్ధన్, కుసుమా రామారావు, చిరంజీవినీకుమారితో బాటు నేను ఆసీనురాలినై ” పల్లకీ దిగిరా” అనే కవిత చదివాను. అప్పటికే లబ్దప్రతిష్టులైన వారితో కలిసి వేదిక పంచుకోవడం కవిత్వం చదవటం నాకు గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చింది.
 
          అప్పటికి కవయిత్రుల కవితలలో ఇంకా అభ్యుదయ భావాలు అంతగా చోటు చేసుకో లేదు. అందుచేత నా కవిత ఆ వేదిక పై కొత్తదనాన్ని ఇచ్చిందని అధ్యక్షురాలు ప్రశంసించారు.
 
          మనసంతా హర్షాతిరేకాలుతో నిండి ఉప్పొంగిపోతున్న నన్ను గుత్తికొండసుబ్బారావు గారు తిరిగి హోటలు రూముకి దింపారు. అప్పటికే వీర్రాజుగారు బాబుకి పాలు పట్టి నిద్ర పుచ్చారు. ఏడేళ్ళ పల్లవి బాబు తాలూకు సామానులు సర్ది తాను కూడా మరోవైపు బాబు పక్కనే పడుకొని జోకొడుతోంది.      
 
          రచయిత్రుల మహాసభలకు వెళ్ళి వచ్చాక ఒకింత ఉత్సాహం కలిగింది. అప్పటికే నా కథల్ని రంగు వెలిసిన బొమ్మ పేరుతో సంపుటిగా వేద్దామని సమకూర్చు కున్నాము.
 
          కాని కవిత్వ సమ్మేళనంకి వెళ్ళి తిరిగి వచ్చాక వీర్రాజు గారు” కథలు తర్వాత వేద్దాము. ముందు కవితా సంపుటిని వేద్దాము. కథలు కన్నా కవిత్వంకే తొందరగా గుర్తింపు వస్తుంది. నీకు వీలున్నప్పుడల్లా నీ కవితల్ని ఫేయిర్ చెయ్యి.” అన్నారు.
 
          బాబు పడుకున్నప్పుడు కవితల్ని ఫెయిర్ చేసేదాన్ని. మొదటి పుస్తకం కనుక ముందుమాట ఎవరిచేతనైనా రాయించుకుంటే బాగుంటుంది అని అనుకున్నాము. కుందుర్తిచేత రాయించాలా, శివారెడ్డి చేత రాయిస్తే బాగుంటుందా అని ఆలోచించి అప్పటికే నాలుగు కవితా సంపుటాలు వచ్చి, కుందుర్తి స్థాపించిన ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు అందుకొని ప్రజాస్వామ్య కవిగా కవితారంగంలో ఒక స్వంత ముద్రతో దూసుకుపోతున్న కవి ఆయన. అందుకని శివారెడ్డి గారిచేతే ముందుమాట రాయిస్తే బాగుంటుందను కున్నాము.
        
          ఎట్టకేలకు కె.శివారెడ్డిగారి ముందుమాటతో నా మొదటి కవితా సంపుటి ” ఆకలినృత్యం ” వెలువడింది. రెండు రకాల ముఖచిత్రాలతో పుస్తకం వచ్చింది. ఒకటి ఎర్రని హేండ్ మేడ్ పేపరు మీద పసుపు రంగులో పుస్తకానికి క్రాస్ గా అందమైన వీర్రాజు గారి ముద్రతో ఉన్న అక్షరాలు, మరొకటి కింద నుండి పైకి ఇంద్రధనుస్సులా రంగుల హేలతో ఉన్న అట్టమీద శీర్షికతో ముద్దొచ్చేలా ఉన్న నా తొలి సంపుటిని ప్రేమతో వీర్రాజు గారికే అంకితం చేసాను.
 
          యువకవులను ప్రోత్సహించేందుకు కుందుర్తి ఆంజనేయులు గారు ఒక ఉద్యమం లా పనిచేసారు. 1967 నుండి ఫ్రీవర్స్ ఫ్రంట్ పేరిట తొలిరోజుల్లో 116 రూపాయల చొప్పున ఆ ఏడాది వచ్చిన కవితాసంపుటిని ఎంపికచేసి ఆ కవికి మనియార్డరు చేసేవారు కుందుర్తి గారు. మొదటి పురస్కారం వీర్రాజు గారి కొడిగట్టిన సూర్యుడుకి తీసుకున్నారు. 1980 సంవత్సరానికి దేవీప్రియ రాసిన ” అమ్మ చెట్టు” కు ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు ఇస్తున్నట్లు ప్రకటించటమే కాకుండా ద్వితీయ స్థానంలో అమ్మంగి వేణుగోపాల్ – మిణుగురుని పేర్కొన్నారు. ఆ ఏడాది వచ్చిన కవితాసంపుటాలలో ఉత్తమమైనవిగా శీలా సుభద్రాదేవి -” ఆకలి నృత్యం”; గుంటూరు శేషేంద్ర శర్మ -సముద్రం నా పేరు; విహారి-చలనం; శశికాంత్ శాతకర్ణి-చంద్రజ్యోతి. అని పేర్కొంటూ పేపర్లలో ప్రకటన ఇవ్వటమే కాకుండా నాకు కుందుర్తి సంతకంతో లేఖ రావటం అపరిమితమైన ఆనందం కలిగించింది.
 
          1983 కుందుర్తి గారి మరణానంతరం వారి కుమారుడు సత్యమూర్తి తండ్రి ప్రారంభించిన ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డులు కొనసాగించాలని సంకల్పించుకుని వీర్రాజు గారిని సంప్రదించి తనకు చేదోడువాదోడుగా ఉండమని కోరారు.
 
          వీర్రాజు గారు ఫ్రీవర్స్ ఫ్రంట్ పగ్గాలు చేతిలోకి తీసుకోక ముందే కుందుర్తి గారు అందించిన ఈ గుర్తింపు నాకు మరువలేని అపురూప జ్ణాపకం.
 
          బాబు తరుచూ అనారోగ్యానికి గురౌతున్నాడు. ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియని పరిస్థితి. హాస్పిటల్స్ కి , డాక్టర్లు దగ్గరకు తిరగటం, ఒకవైపు వీర్రాజు గారి ఆఫీసు వాళ్ళు ఇస్తున్న మెమోలు, ఎంతో ముచ్చటపడి స్వంతంగా పెట్టిన వికాస్ వలన తలెత్తుతున్న సమస్యలు, అంతకంతకు దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులూ మా ఇద్దరినీ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇక చివరికి పెట్టిన అయిదేళ్ళ సెలవు పూర్తికాగానే తిరిగి యథావిధిగా సమాచారశాఖలో చేరటానికి నిర్ణయించుకున్నారు.
 
          రాంకోఠీలో మేమున్న ఇంటి యజమాని  ఇల్లు ఖాళీ చేయమని ఒత్తిడి  చేస్తుండటం తో తెలిసిన వారందరికీ ఇల్లు చూడమని వీర్రాజు గారు చెప్పారు. ఈలోగా పెద్దమరిది సీతాఫలమండీలో ఇల్లు చూసుకొని వెళ్ళిపోయాడు. అతను మూడోసారి మరో అమ్మాయికీ తండ్రి కూడా అయ్యాడు   
 
          వీర్రాజు గారికి మా కుటుంబానికీ ఆత్మీయ మిత్రులైన రామడుగు రాధాకృష్ణ మూర్తి గారు కొత్త నల్లకుంటలో. ఫీవర్ హాస్పిటల్ పక్కగల్లీలో ఇల్లు చూసారు.పెద్ద కాంపౌండులో RCC రూఫ్ తో అద్దెల కోసం రెండుమూడు పోర్షన్ లు ఉన్నాయి. ఇంటివాళ్ళు అక్కడే ఒక పెద్దింటిలో ఉంటారు.
 
          సరే ఇంక సామానులు పేక్ చేయటం మొదలెట్టాము. మా పెద్దమరిది రామకృష్ణా, కుటుంబమిత్రుడు వీర్రాజు గారికి సోదర సమానుడైన మల్లేషు కాక యువ కవులు కూడా ఒకరిద్దరు సహకరించారు.
 
          సామాన్లు లారీకి వేస్తున్నసమయంలో వీధి గుమ్మంలో అలికిడికి బయటకు వచ్చాను. ఇద్దరు కోయదొరలు భిక్షం కోసం అడుగుతున్నారు. నన్ను చూడగానే ” అమ్మ మాయమ్మ అంటూ ఒకసారి పొగడటమే కాకుండా “అమ్మా మాయమ్మ లచ్చిమి తల్లె ఏడేళ్ళుగా పీడిస్తున్న ఏలిన్నాటి శని ఇక నుంచి నిన్ను వదలిపోతుందమ్మ “అని నన్ను పట్టుకున్నారు. ఈ లోగా వీర్రాజు గారు ఇద్దరికీ చెరో అర్థరూపాయి చేతిలో పెట్టి పంపిం చేసారు.
 
          కోటికలల్ని మూటకట్టుకుని ఇష్టంగా ఈ ఇంట్లో అడుగు పెట్టాను. నలుగురిలో ఉన్నా కూడా తనకి తాను కల్పించుకున్న ఏకాంతంలో కుంచె, కలంపట్టి తపోదీక్షలో ఉండే ఆయనలో చలనం కలిగించిన దాన్నే అయినా కానీ దేహసంతృప్తి మాత్రమే జీవితం కాదు గదా. ఆనందకర అనుభూతులకన్నా, క్షణక్షణం అంతకంతకూ కుంగదీసి నన్ను నాలోకి ముడుచుకు పోయేలా చేసిన అనుభవాలనే చవిచూపించిందీ ఇల్లు. కలమో, కుంచెనో పట్టుకొని ఇహపరాలను మర్చిపోయి తపోదీక్షలో మునిగిపోయే ఆ తపస్వే కాదు, నా వైపే చూస్తున్న పసిపిల్లలు కూడా నన్ను అల్లుకొని ఉన్నారు.
 
          ఒక్కొక్కప్పుడు జీవితం పట్ల విరక్తి కలిగిన పరిస్థితుల్లో నన్నూ, చిన్నక్కనూ తన రెక్కల కింద పొదువుకొని కాపాడిన అమ్మ గుర్తుకు వచ్చేది.
 
          లోపలికి వచ్చి పల్లవిని, బాబుని ఒళ్ళోకి తీసుకుని కోయదొరల మాటలు తలచుకొని పేలవంగా నవ్వుకున్నాను.
 
*****
Please follow and like us:

6 thoughts on “నడక దారిలో(భాగం-31)”

  1. ఎంతటి బాధలోనూ కవిత్వం/సాహిత్యం గొడుగు నీడలో సేదదీరుతూ నిలబడి జీవితమనే యుద్ధం చేయడం గొప్ప విషయం అమ్మా🙏🏻

    1. మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు పద్మావతీ

  2. మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు సుశీలగారూ

  3. మీ ఆత్మీయ స్పందనకు అనేకానేక ధన్యవాదాలు సుశీలగారూ

  4. ఏడేళ్ళ పాప తో, అనారోగ్యం పాలైన బాబుతో, కుంచెనో కలాన్నో చేతిలో ఉంచుకొని సుదీర్ఘాలోచన్లో మునిగిపోయిన తపస్వి లాంటి భర్త తో జీవితానికీ కాలానికీ ఎదురొడ్డి నిలిచిన ఒక స్త్రీ జీవితం కల్పన కాదు – నిజం అని శీలా సుభద్రాదేవి గారి జీవిత చరిత్ర చెప్తోంది. ఈ దుఃఖానికి మరో వైపు ఆ వయసు లోనే పెద్ద పెద్ద రచయిత్రులు కవయిత్రులు పక్కన వేదికను పంచుకోవడం ఒక అద్భుతాలు కాశం. ఆనందక్షణాలు. ఇదే కదా జీవితం!

    1. మీ ఆత్మీయ స్పందనకు అనేకానేక ధన్యవాదాలు సుశీలగారూ

Leave a Reply

Your email address will not be published.